తన అక్షరాలు

తన అక్షరాలు
అవటానికి
అవీ ఆ మురికి నిఘంటువులోవే గానీ
అదేమిటో వాటి రూపే మారిపోతుంది
తన పెదాల మీంచీ చేతుల్లోంచీ జారే సరికి

ఒక్కోసారి మరీ ముద్దొచ్చి
కాసిన్ని అక్షరాల గుత్తుల్ని
గుప్పెట నిండా పట్టుకుంటానా
చేతి నిండా తేనె చిప్పిలుతుంది
అప్పుడు నాకు తెలీకుండానే వేళ్ళు నోట్లో పెట్టుకుంటాను

తెల్లగా ముస్తాబై లేతచీకటి నీలంలో కూచుంటానా
గుప్పెడు యిసక తీసి నా మీదకి కచ్చగా విసిరినట్లు
కాసిన్ని పదాలు తన పెదాల మీంచి కసికసిగా జారి
నామీద అక్షరాల వెన్నెలతలంబ్రాలు రాలినట్లవుతుంది
ఆ వెన్నెట్లో తడవగానే మనసుకి జలుబుచేస్తుంది

ఎప్పుడన్నా అకారణంగా అడ్డం తిరుగుతానా
అమానుష అన్యాయం మితిమీరి
ప్రాణాలకి తెగించి తిరగబడిన
దగాపడిన ప్రజల కనుగుడ్డుల్లా
ఎర్రగా కరిగిన ఇనుం బొట్లలా
తన అక్షరాలు నిప్పురవ్వల్లా
నా మొహానొచ్చి కొట్టుకుంటాయి
అప్పుడు హృదయం కనలి ఏడుపొస్తుంది

తన అక్షరాలు పదబంధాలు
తేనెలా మంచులా వెన్నెలలా
అవసరమైతే అగ్నిశూలాల్లా
తన అక్షరాల పదబంధాలు
తనలాగానే