ఈ నాలుగు నల్లని మరకలు
దోసిట్లో ఇమిడిపోయే ఈ కాసిని ఇంకు చారికలు
ఎప్పుడు ఏ లోకాల్లో ఏ అమృతాలు త్రాగేయో
ఆలోచనలకి అస్తిత్వం ఇస్తూ
చిరునవ్వుల్లో మునిగిపోయి
కన్నీళ్ళని సెలయేరులు చేస్తూ
ఆవేశాల్లో ఆవేశాలై, గుండెల్నిండా, మనసునిండా
పరుచుకుపోయి, నరనరం లోకి ప్రాకిపోయి
మన బ్రతుకుల్ని ప్రతిబింబిస్తూ
ఈ తెల్లని కాగితాల పైన తాండవం చేసే ఈ అక్షరాలు
ఆది అంతం లేని అనంతం లోకి నిత్యం ప్రవహించే ఈ అక్షరాలు
చావుల్ని, బ్రతుకుల్ని, యుద్ధాల్ని, అబద్ధాల్ని,
వేల వేల సంవత్సరాల అనుభవాల్ని
గుండెల్లో నింపుకున్న ఈ అక్షరాలు
అమ్మ గుండెల్లో మమతను సముద్రాలపై ఎగిరి తెచ్చే ఈ అక్షరాలు
మహాకవి కలం లో హోరెత్తే ఈ అక్షరాలు
పసి పాప చేతి బలపం లో వొదిగిపోయే ఈ అక్షరాలు
ఏ తల్లి భావనలో ఉద్భవించాయో, ఏ నదీ తీరాలలో పరిణతించాయో !
మనల్ని నవ్వించి, ఏడిపించి, మనలో వొకటై, మననుంచి వేరై
మనలో, మనతో నిత్యం ప్రయాణించే ఈ అక్షరాలు