ఇంటర్నెట్ లో సమాచార విప్లవం మొదలై దాదాపు దశాబ్దం కావస్తోంది. ఈ పదేళ్ళలో, తెలుగు వెబ్సైట్ల రాశి పెరిగినా వాటి వాసి ఏ మాత్రం పెరగలేదు. కొన్ని వ్యక్తిగతమైన బ్లాగులు, వికీపీడియా మినహాయిస్తే, మిగిలిన దిన, వార, మాస పత్రికల వెబ్సైట్లు అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క ఫాంట్ ని వాడుతూ, ఒకదానికి మరొకదానికి సంబంధం లేకుండా, చిన్న చిన్న సమాచార ద్వీపాల్లా ఉన్నాయి. పది పేజీలకన్నా ఎక్కువ పేజీలు ఉన్న ఏ వెబ్సైట్ కైనా ముఖ్యంగా కావలసిన రెండు సౌకర్యాలు:
- వెబ్సైట్ లో వెతకగలిగే సౌకర్యం (ఇది అన్ని రకాల వెబ్సైట్లకి ప్రాణం లాంటిది.)
- పాత సంచికలు చదవగలిగే అవకాశం. ఇది పత్రికల (periodicals) లాంటి తరచుగా మారే సమాచారం ఉన్న వెబ్సైట్లకి అత్యంత అవసరం.
ఈ ఎలక్ట్రానిక్ యుగంలో ద్విభాషా వెబ్సైట్లు అనే బండి గతికి యూనికోడూ, ప్రామాణికమైన పద్ధతుల ఉపయోగం రెండూ రెండు చక్రాల్లాంటివని మా ప్రగాఢ విశ్వాసం. ఈ రెండిటిలో ఏది ఉపయోగించకపోయినా బండి నడక కుంటుబడుతుంది.
ఇప్పుడు బహుళ ప్రాచుర్యంలో ఉన్న ఏ తెలుగు వెబ్సైట్కీ పూర్తిస్థాయి search సౌకర్యం లేదు. రక రకాల ఫాంట్లు వాడడం వల్ల గూగుల్ ద్వారా కూడా search చేసే అవకాశం లేదు. ఫాంట్ల సమస్యని పరిష్కరించడానికే యూనికోడ్ ఏర్పడింది.
ప్రామాణికమైన పద్ధతులని (standards based web design) ఉపయోగించి వెబ్సైట్ని రూపొందించక పోవడం వల్ల file size విపరీతంగా పెరిగిపోయి చాలా వెబ్సైట్లు పాతసంచికలని అందించలేకపోతున్నాయి. ప్రామాణికమైన పద్ధతులు అంటే W3C నిర్దేశించినట్లు XHTML ని వాడి, వెబ్సైట్లో సమాచారాన్నీ (content), అలంకరణ పద్ధతులని(presentation– ఫాంట్లు, రంగులు వగైరా)ని విడి విడిగా వేర్వేరు files లో ఉంచడం. వెబ్సైట్ అలంకరణ పద్ధతులని సూచించే files నే stylesheets అంటారు. stylesheets ఉపయోగించడం వల్ల వెబ్సైట్ లోని అన్ని పేజీలని ఒకే విధంగా తయారు చేయచ్చు. stylesheets ని ఉపయోగించకపోతే, వెబ్సైట్లో అన్ని పేజీలు ఒకే విధంగా ఉండడానికి ప్రతి పేజీలోనూ అలంకరణ పద్ధతులని మళ్ళీ మళ్ళీ సూచించవలసి వస్తుంది, తద్వారా file size పెరిగిపోతుంది. XHTML + stylesheets ని వాడి వెబ్సైట్ రూపొందించడం గత 5-6 ఏళ్ళుగా అన్ని ముఖ్యమైన ఇంగ్లీషు వెబ్సైట్లలో జరుగుతున్నదే.
ఈ ఎలక్ట్రానిక్ యుగంలో ద్విభాషా వెబ్సైట్లు అనే బండి గతికి యూనికోడూ, ప్రామాణికమైన పద్ధతుల ఉపయోగం రెండూ రెండు చక్రాల్లాంటివని మా ప్రగాఢ విశ్వాసం. ఈ రెండిటిలో ఏది ఉపయోగించకపోయినా బండి నడక కుంటుబడుతుంది. ఈమాట లాంటి విలక్షణమైన పత్రికని సులభంగా నడిపించడానికి, పాఠకులకి మరిన్ని సదుపాయాలు కల్పించడానికీ ఇవి రెండు మరింత అవసరం. అదీకాక, అధునాతన సాంకేతిక వనరుల్నితెలుగు భాషకు ఉపయోగించడంలో మార్గదర్శకంగా ఉండాలన్నది ఈమాట లక్ష్యాలలో ఒకటి కాబట్టి 2005 నుండి ఈమాటని యూనికోడ్, stylesheets వాడుతూ ప్రచురించడం మొదలుపెట్టాము.
ఏ వెబ్సైట్ లో నైనా పేజీల సంఖ్య పెరిగిన కొద్దీ, డేటాబేస్ ద్వారా పని చేసే వెబ్ ప్రచురణా వ్యవస్థ (database backed web publishing platform) అవసరం పెరుగుతుంది. ఈ సంచిక నించీ ఈమాట సమాచారం నిర్వహించడానికి వర్డ్ప్రెస్ ని ఉపయోగించడం మొదలు పెట్టాము. వర్డ్ప్రెస్ వెబ్సైట్ లో సమాచారాన్ని అంతటిని వేర్వేరు ఫైల్స్ లో కాకుండా డేటాబేస్ లో నిక్షిప్తం చేస్తుంది. వెబ్సైట్ అలంకరణ పద్ధతులన్నీ విడిగా మరొక ఫైల్ లో ఉంచుతుంది. ఇందువల్ల సమాచారాన్ని (content), అలంకరణ పద్ధతులని (presentation) విడి విడిగా ఉంచడం సాధ్యమవుతుంది. (Strict separation of content and presentation). అందువల్ల వెబ్సైట్ లో సమాచారాన్ని ఏ విధంగా కావాలంటే ఆవిధంగా చూపించవచ్చు. ఉదాహరణకి అన్ని వ్యాసాల సూచిక, అన్ని కథల సూచిక, ఒక్కొక్క రచయిత రచనల సూచిక— ఇటువంటి పేజీలని సులభంగా తయారు చేయచ్చు. అందుకే ఇకనుంచి ఈమాట వినూత్నమైన సౌకర్యాలతో మీ ముందుకి వస్తోంది. అందులో కొన్ని:
- ప్రతి పేజీ నుంచీ ఈమాటలో రచనలని ని పూర్తిగా తెలుగులో కూడా వెతకగలిగే సౌకర్యం.
- ప్రతి రచన గురించీ మీ అభిప్రాయం అదే పేజీలో తెలుగులో కూడా తెలియచేయగలిగే సౌకర్యం.
- ఏ రచయిత రచనల నైనా ఒకే పేజీలో చదవగలిగే సౌకర్యం.
- మరికొన్ని ఉపయోగ్యతా పెంపుదలలు (usability enhancements)
- కంటికింపైన రంగులు, పాత సంచికల సూచిక, శీర్షికల సూచిక వగైరా, వగైరా..
యూనికోడ్ , XHTML+CSS ఉపయోగించే వెబ్సైట్లు కొత్త బ్రౌజర్లు, విండోస్ ఆపరేటింగ్ సిస్టం ఉన్నవాళ్ళకి మాత్రమే అందుబాటులో ఉంటాయన్న అపవాదు ఒకటి ప్రచారంలో ఉంది. (యూనికోడ్ , XHTML+CSS తెలుగు వెబ్సైట్ల నిరాదరణకి నోచుకోవడానికి కూడా ఈ అపవాదే కారణమై ఉంటుంది.) ఈ అపవాదులో నిజం లేదు. Macintosh ఉపయోగించే పాఠకులకి యూనికోడ్ తెలుగు కనిపించకపోవడం ఈ అపవాదుకి బలం చేకూర్చింది. త్వరలో, నాగార్జున వెన్న రూపొందించిన “పద్మ” లాంటి client side పరికరాలు ఈమాటని Macintosh పాఠకుల ముందుకి తెస్తాయి. (అంతవరకూ ఈమాట మే 2006 సంచిక PDF లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు). ఏ బ్రౌజర్ లోనైనా (గ్రాఫిక్స్ సౌకర్యం లేని బ్రౌజర్లో కూడా)ఈమాట చదవగలిగేలా చేయలన్నది మా ఆశయం. ఈ ఆశయ సాధనలో భాగంగా కొన్ని server side పనిముట్లను కూడా పరిశీలిస్తున్నాము.
ఇంకా 1998 నుండీ ప్రచురించిన పాత సంచికలన్నింటినీ యూనికోడ్ లోకి మార్చి ఆ సంచికల్లోని రచనలని కూడా వెతకగలిగే సౌకర్యం కల్పించడానికి ముమ్మరంగా కృషిచేస్తున్నాము. మా ప్రయత్నాలని సహృదయతతో అర్థం చేసుకొని ప్రోత్సహిస్తున్న పాఠకులకు , రచయితలకు మా కృతజ్ఞతలు. ఈమాటకు మేము చేస్తున్న మార్పులపై మీ అభిప్రాయాలను, సూచనలని సాదరంగా అహ్వానిస్తున్నాం. మీకెదురయ్యే సాంకేతిక పరమైన ఇబ్బందుల గురించి కూడా మాకు రాస్తే మీ సమస్యలను పరిష్కరించడానికి మా చేతనైన సహాయం చెయ్యడానికి ప్రయత్నించగలం.