తిక్కన సోమయాజి భారత యుద్ధ కథ – ఐదవ భాగం

అతని దెబ్బకి వాళ్ళిద్దరూ బిత్తరపోయారు. కాళ్ళూ చేతులూ ఆడకుండా అతనలా బాణాలు కురుస్తుంటే అర్జునుడు నిశ్చేష్టుడై నిలబడిపోయాడు. కృష్ణుడు తేరుకుని “నీ చేతుల్లో చేవ చచ్చిందా, గురువు కొడుకని వీడి మీద కోపం తెచ్చుకోవటం లేదా? వాడి చేతిలో నువ్వోడావంటే ఎంత అవమానమో ఆలోచించు” అంటే కోపం తెచ్చుకుని అర్జునుడు “ఏదో కొన్ని బాణాలు చకచకా వేస్తే వాడు గెలిచినట్టేనా? ఇప్పుడు చూడు” అని భల్లాల్తో అశ్వత్థామ బాణాల్ని తుంచి ఒకే దెబ్బలో అతని విల్లు, ఛత్రం, కేతనం విరిచాడు. అతను శక్తి తీస్తే దాన్ని, గద వెయ్యబోతే దాన్నీ కూడ ముక్కలు చేశాడు. ఇంతలో అంగ, వంగ, నిషాద, కళింగ బలాలు అర్జునుడి మీదికి దూకినయ్. అశ్వత్థామ తెప్పరిల్లి మరోవిల్లు తీసుకుని బాణవర్షం సాగించాడు. “తెగులు కనపట్టం తోటే నాశనం చెయ్యాలి, ఊరుకుంటే తరవాత ముప్పు; వీడి సంగతి ఇప్పుడే చూడు” అని కృష్ణుడు బోధిస్తే అర్జునుడు విజృంభించి అశ్వత్థామ తల, కంఠం, చేతులు, రొమ్ము, కాళ్ళు అన్నింటా బాణాల్తో కప్పి, గుర్రాల పగ్గాలు తెంచితే అవి రథాన్ని లాక్కుని దూరంగా పరిగెత్తినయ్. ఉసూరుమంటూ అశ్వత్థామ తిరిగొచ్చి కర్ణుడి దగ్గరికి వెళ్ళాడు.

ఇంతలో దండధారుడనే మగధరాజు మదపుటేనుగునెక్కి పాండవబలమ్మీదికి వెళ్తుంటే కృష్ణుడు చూసి “ఈ దండధారుడు కూడ భగదత్తుడి లాటి వాడు,ముందు వాణ్ణి చంపి మిగిలిన పన్లు చూసుకుందాం” అంటే అలాగే నని అటువైపుకి కదిలాడు అర్జునుడు. దిగ్గజంలా మాగధుడి ఏనుగు పాండవసైన్యాన్ని నుగ్గుచేస్తుంటే అర్జునుడు రథాన్ని ఇంకా వేగంగా పోనివ్వమని కృష్ణుణ్ణి తొందరపెట్టాడు. అలా వెళ్ళి అర్జునుడు దండధారుడితో తలపడితే వాడు తన ఏనుగు మీది నుంచి అర్జున రథాన్ని, సారథిని, రథిని అమ్ములతో కప్పేశాడు. మహాక్రోధుడై కిరీటి వాడి బాహువుల్ని నరికి తలని కూడ తుంచి కింద పడేశాడు. అదిచూసి వాడి తమ్ముడు దండుడు అతని మీద తోమరాలు విసురుతుంటే అర్జునుడు వాడి తలనీ నరికాడు. అలాగే మాగధ సైన్యం మీదికి దూకి వాళ్ళ ఏనుగుల్ని చెండాడుతుంటే ఆ సైన్యాలు చెల్లాచెదురైనై.

అంతకుముందు కర్ణుడు పుళింద, బాహ్లిక, టేంకణ, ఆంధ్ర, భోజ సైన్యాల సాయంతో పాండవబలాల్ని మోదుతుంటే మలయధ్వజుడనే పాండ్యరాజు ఆ సేనల్ని అడ్డుకున్నాడు. అతను తననెవరన్నా భీష్మ ద్రోణుల్తో సమానుడంటే ఒప్పుకోడు, కృష్ణార్జునులు తనకు ఎక్కువని నమ్మడు. మహా భుజశాలి. అతను మన సేనల్ని చీకాకు పెడుతుంటే అశ్వత్థామ “సామాన్య సైన్యాన్ని బాగానే చంపుతున్నావ్ గాని నాతో తలపడి చూడు” అని పిలిస్తే అంతకన్నానా అని ఆనందంగా మలయధ్వజుడతనితో యుద్ధానికి పూనుకున్నాడు. ఇద్దరూ భీకరంగా యుద్ధం చేశారు. అశ్వత్థామ అతని మీద తొమ్మిది బాణాలేస్తే మలయధ్వజుడు వాటికి ప్రతిశరాలు వేశాడు. ఐదు విరిగినయ్ కాని మిగతా నాలుగూ అతని గుర్రాల్ని చంపినయ్. అతని పరివారం ఇంతలో అతనికి మరో రథం తెస్తే అది ఎక్కి వాయవ్యాస్త్రంతో అశ్వత్థామ చక్రరక్షకుల్ని చంపాడు. అశ్వత్థామ కూడ అతని సహచరుల్ని, గుర్రాల్ని, సారథిని చంపి రథాన్ని నుగ్గుచేశాడు. ఐనా వెనక్కి తగ్గకుండా మలయధ్వజుడు శస్త్రాస్త్రాలు ప్రయోగిస్తూ యుద్ధం చేశాడు. అశ్వత్థామ సరదాగా అతనితో ఇంకొంచెం సేపు యుద్ధం సాగించాడు. ఇంతలో మలయధ్వజుడొక ఏనుగునెక్కి దాన్ని అశ్వత్థామ మీదికి తోలి ఒక తోమరాన్ని విసిరాడు. దాని దెబ్బకి అతని శిరోభూషణం రాలి కింద పడింది. తోక తొక్కిన తాచులా అశ్వత్థామ వాడి పక్కనున్న ఆరుగుర్ని చంపి ఏనుగు తుండం నరికి పాండ్యుడి పాదాలు, చేతులు, తల తీవ్రభల్లాల్తో కోశాడు. వాడి సైన్యాలు పరిగెత్తినయ్. దుర్యోధనుడు వచ్చి అశ్వత్థామని మెచ్చుకుని పొగిడాడు.

భీముడు పరుగున వచ్చి ఆ బలాల్ని నిలిపి మన సైన్యం మీద దూకాడు. మన సైన్యం చెల్లాచెదురౌతుంటే కర్ణుడొచ్చాడు. అశ్వత్థామ అతనికి సాయంగా నిలిచి చాలామంది పాంచాలదొరల్ని చంపాడు. దూరాన్నుంచి మలయధ్వజుడి చావు చూసిన కృష్ణుడు అక్కడ భీమాదులు కర్ణుడితో తలపడటం చూసి మనం కూడ వెళ్ళటం మంచిదంటే అర్జునుడు సరే నన్నాడు. వాళ్ళలా వెళ్తుండగా అశ్వత్థామ ధృష్టద్యుమ్నుణ్ణి కేకేసి పిలిచి “నికృష్టుడా, అర్జునుడిక్కడికి రాకముందే నీ అంతు చూస్తా, పారిపోకుండా నిలబడు” అంటే “నీ తండ్రి తల కోసిన కత్తి నీకోసం సిద్ధంగా వుంది, నీకూ అదే గతి పట్టిస్తా రా” అని అతనూ బదులిచ్చాడు. ఇద్దరూ ఘోరంగా పోరాడారు. ధృష్టద్యుమ్నుడు అశ్వత్థామ విల్లు విరిస్తే అతను వెంటనే మరోటి తీసుకుని అతని సూతుడు, గుర్రాల్ని చంపి కేతనాన్ని గొడుగుని విరిచాడు. అతను శక్తినెత్తితే దాన్ని, గద వెయ్యబోతే దాన్నీ నుగ్గుచేశాడు. వాలూ పలకా తీసుకుంటే వాటినీ తుంచి అతనికి శరీరాన బాణాలు నాటాడు. ఐనా అతను నిబ్బరంగా వుంటే ఆశ్చర్యపడి అశ్వత్థామ వింటిని విసిరేసి తళతళలాడే కత్తితో కాలినడకన అతని మీదికి బయల్దేరాడు.

కృష్ణుడు అర్జునుడితో “ధృష్టద్యుమ్నుడు అశ్వత్థామకి చిక్కాడు. అతన్ని కాపాడాలి” అని తొందరచేస్తే అర్జునుడక్కడినుంచే అశ్వత్థామ మీద బాణాలు కురిపిస్తూ అక్కడికి బయల్దేరాడు. అశ్వత్థామ ఆ ధాటికి తట్టుకోలేక వెనక్కి తిరిగి తన రథం ఎక్కి అర్జునుడితో తలపడ్డాడు. ఈలోగా సహదేవుడు ధృష్టద్యుమ్నుణ్ణి తన రథం ఎక్కించుకుని తీసుకెళ్ళాడు. అర్జునుడి నిశితబాణానికి అశ్వత్థామ తూలితే అతని సారథి రథాన్ని దూరంగా తోలుకుపోయాడు. పాండవబలాలు కేరింతలు కొట్టినయ్.

ఒక పక్క కర్ణుడు, మరో పక్క సంశప్తకులు తనతో పోరాడాలని సిద్ధమౌతుంటే ముందు సంశప్తకుల పని చూద్దామన్నాడు అర్జునుడు. కర్ణుడు పాంచాలసేనల మీదికి పోయాడు. అతనా సేనలో గగ్గోలు పుట్టిస్తుంటే ధర్మరాజు, భీముడు, ధృష్టద్యుమ్నుడు అడ్డుపడ్డారు. అతను విజృంభించి వాళ్ళందర్నీ ముప్పుతిప్పలు పెట్టాడు. నీ కొడుకులు ధర్మరాజుని పట్టుకుందామని ప్రయత్నించారు గాని భీముడు, సాత్యకి అది సాధ్యం కానివ్వలేదు. అప్పుడు భీముడు ఉగ్రరూపంతో మన సైన్యం మీద పడి చెండాడాడు. అతని దెబ్బకి మన చతురంగబలాలు తలో దిక్కు పారిపోయినయ్. ఇదంతా చూసి కృష్ణుడు అర్జునుడికి చెప్తే అతను మనమూ అక్కడికి వెళ్దాం అన్నాడు.

దుర్యోధనుడు భీముణ్ణి నిలవరించి అతనితో తలపడ్డాడు. కర్ణుడతనికి సాయంగా వచ్చాడు. పాంచాల దొరలు భీముడికి తోడుగా వచ్చారు. ఇరుపక్షాలు ఉత్సాహంగా సమరం చేసినయ్. భీముడు దుర్యోధనుడి సారథిని చంపి గుర్రాలని మోదితే అతను రథాన్ని తోలుకుంటూ యుద్ధభూమికి దూరంగా వెళ్ళాడు. అశ్వత్థామ పెద్ద సైన్యసహాయంతో అర్జునుణ్ణి ఢీకొన్నాడు. అర్జునుడతని మీద దివ్యాస్త్రాలు వేస్తే అతనూ వాటిని ప్రయోగించి ఉపసంహరించాడు. అశ్వత్థామ వేసిన మూడు ఉగ్రబాణాలు అర్జునుడి కుడి భుజాన దూరినయ్. ఐనా అతను లెక్కచెయ్యకుండా యుద్ధం చేశాడు.

దుర్యోధనుణ్ణి కవలలు ఢీకొన్నారు. అతనికి సాయంగా వచ్చి కర్ణుడు దివ్యబాణాల్తో పాండవసైన్యాన్ని మట్టుబెడుతున్నాడు. ధర్మరాజు వాళ్ళని కూడగట్టి కర్ణుడితో తలపడ్డాడు. కర్ణుడతని మీద అనేక బాణాలేసి ఒక నారసాన్ని అతని రొమ్ముకి నాటాడు. ఆ దెబ్బకి ధర్మరాజు చతికిలపడి రథాన్ని దూరంగా తీసుకుపొమ్మని సారథికి చెప్పాడు. వాడలాగే చేశాడు. ఐతే అతను వెళ్ళకుండా కౌరవబలాలు అడ్డుపడితే కేకయపాంచాల బలగాలు వాటిని తాకినయ్. కర్ణుడు మాత్రం వదలకుండా ధర్మరాజు వెంటపడ్డాడు. భీముడు దుర్యోధనుణ్ణి ఆపి అతనితో తలపడ్డాడు. ధర్మరాజు శిబిరానికి పోతుంటే వెనకనుంచి కర్ణుడతని మీద బాణాలు కురిపించాడు. దగ్గర్లో ఉన్న నకులసహదేవులది చూసి కర్ణుడికి అడ్డు తగిలారు. అతను నకులుడి విల్లు విరిచి గుర్రాల్ని చంపితే అతను సహదేవుడి రథం ఎక్కాడు.

కర్ణుడు ఆ ముగ్గురితోనూ పోరుతూ అందరికీ గాయాలు చేస్తుంటే శల్యుడతన్ని వారించి “ఎందుకు నీకు ధర్మరాజు మీద అంత కోపం? ఇప్పుడు నువ్వతన్ని చంపితే అర్జునుడొచ్చి నిన్నూ కౌరవుల్నీ అందర్నీ నాశనం చేస్తాడు. అర్జునుణ్ణి చంపితేనే దుర్యోధనుడికి రాజ్యం దక్కేది. అటుచూడు, అక్కడ భీముడి చేతిలో దుర్యోధనుడు ఇప్పుడే చచ్చేట్టున్నాడు. అతన్ని కాపాడుకోలేకపోతే ఇక్కడ నువ్వు ఎవర్ని చంపీ ఉపయోగం లేదు, ఆలోచించుకో” అన్నాడు. కర్ణుడు కూడ అటు చూసి దుర్యోధనుడు చిక్కుల్లో ఉన్నట్టు గమనించి అతన్ని రక్షించటానికి బయల్దేరాడు. నకుల సహదేవుల్తో కలిసి తన శిబిరానికి వెళ్ళాడు ధర్మరాజు.

అది విన్న ధృతరాష్ట్రుడు కుమిలిపోయాడు. “నా కొడుకు భీముడికి చాలకపోవటం ఏమిటి, కర్ణుడలా చేతికి చిక్కిన ధర్మరాజుని ప్రాణాల్తో వదిలెయ్యటం ఏమిటి? ఎంత బుద్ధితక్కువ పని చేశాడా కర్ణుడు?” అని వాపోయాడు. సంజయుడు తన కథనాన్ని కొనసాగించాడు.

అలా ధర్మరాజు యుద్ధభూమి నుంచి తిరిగెళ్ళి మంచం మీద మేనువాల్చాడు. ఒంటికి గుచ్చుకున్న బాణాల్ని లాగించాడు. ఐతే అతని హృదయవేదన మాత్రం క్షణక్షణం పెరిగిందే తప్ప తగ్గలేదు. విషణ్ణవదనుడై నకులసహదేవుల్ని భీముడి దగ్గరకి వెళ్ళమని పంపేశాడు.

అక్కడ అశ్వత్థామ అర్జునుణ్ణి ముప్పుతిప్పలు పెడుతూ యుద్ధం చేస్తున్నాడు. చివరికి అర్జునుడు విసుగుతో కూడిన కోపంతో అతని గుర్రాల్ని బాణాల్తో కొట్టి వాటి పగ్గాలు తెంపితే అవి రథాన్ని యుద్ధభూమి నుంచి దూరంగా లాక్కెళ్ళినయ్. మనబలాలు చెల్లాచెదురైనై, వాళ్ళ బలాలు ఉప్పొంగినయ్. నీ కొడుకు కర్ణుడి దగ్గరికెళ్ళి “నీ భుజసంపద చూపించటానికి ఇదే సమయం. ఎన్నో దివ్యాస్త్రాలున్న నీలాటి వాడి రక్షణలో కూడ మన సైన్యం ఇలా బెంబేలెత్తటం సమంజసం కాదు” అంటే రాధేయుడు వీరోద్రేకంతో శల్యుడితో “ఇప్పుడు నేను కృష్ణార్జునుల్ని, భీముణ్ణి మట్టుబెట్టబోతున్నా, సారథ్యంలో నీ ప్రతిభ చూపించు” అని తన ధనుస్సు “విజయా”న్ని చూసి “నీ ముందు గాండీవం ఓ లెక్కలోదా?” అని మన సైన్యాన్ని ఆపి నిలిపి శత్రుసైన్యం మీద భార్గవాస్త్రాన్ని ప్రయోగించాడు.

ఆ భార్గవాస్త్రం అనేక శరాల రూపంలో వెళ్ళి పాండవసైన్యాన్ని నాశనం చేసింది. గుర్రాల నెత్తురు, భటుల శరీరావయవాలు, రథాల ముక్కచెక్కలు అన్నీ కలిసి భీభత్సాన్ని సృష్టించినయ్. శత్రుసైన్యాలు చెల్లాచెదురై వెనక్కి తిరిగి పరిగెత్తినయ్. మనవాళ్ళు వాళ్ళ వెంటబడి దొరికిన వాళ్ళని దొరికినట్టు నరుకుతుంటే కర్ణుడు మహోత్సాహంతో బాణవృష్టి కురిపిస్తూ తరిమాడు. పాండవ సైన్యం కృష్ణార్జునుల దగ్గరికి పరిగెత్తింది.

అశ్వత్థామతో ఘోరరణంలో అలిసిపోయిన అర్జునుడు నీరుగారి పోయాడు. కృష్ణుడితో అన్నాడూ “కర్ణుడు వీరవిక్రముడై విజృంభించి యుద్ధం చేస్తున్నాడు, చూస్తున్నావా! అతన్ని తేరి చూడాలంటేనే భయం వేస్తుంది. తొందరపడి అతనితో పోరాడి ఓడిపోవటం కంటె నేర్పుగా పక్కదారి చూసుకుని ప్రాణాలు నిలుపుకోవటం మేలు. బతికుంటే ముందు ముందైనా గెలిచే అవకాశం వుంది” అని. కృష్ణుడు భీముడి వైపు చూశాడు. ధృష్టద్యుమ్నుడు, శిఖండి, సాత్యకి, ద్రౌపదేయులు కలిసి కర్ణుడితో తలపడితే భీముడు తమ సైన్యాన్ని నిలవరించి తను కౌరవ సైన్యాన్ని నుగ్గుచెయ్యటం మొదలెట్టాడు. “ఇప్పటికి కర్ణుణ్ణి వీళ్ళు ఆపుతారు, అలిసిపోయిన అర్జునుడు కొంచెం విశ్రాంతి తీసుకోవచ్చు” అనుకుని రథాన్ని భీముడి వైపుకి నడుపుతూ కృష్ణుడు “ఇందాక నువ్వు అశ్వత్థామతో పోరేప్పుడు ధర్మరాజు కర్ణుడితో యుద్ధంలో కష్టపడుతున్నట్టు కనిపించాడు. అతనికేవన్నా గాయాలయాయేమో చూసి ఆ తర్వాత మనం వచ్చి కర్ణుడి సంగతి చూద్దాం” అన్నాడు. అన్న కర్ణుడి చేతికి చిక్కాడన్న మాట వినగానే అర్జునుడికి గుండె కలుక్కుమంది. చుట్టూ చూస్తే ధర్మరాజు కనిపించలేదు. ఆదుర్దాగా భీముడి దగ్గరికి వెళ్ళి అతన్నడిగితే జరిగింది చెప్పాడు. “అయ్యయ్యో, భీష్మ ద్రోణుల్తో మడమ తిప్పకుండా నిలబడి పోరినవాడు ఇప్పుడిలా కర్ణుడి చేతిలో భంగపడాల్సొచ్చిందా” అని బాధపడి భీముడితో “నువ్వెళ్ళి ఆయన ఎలా వున్నాడో చూసి రా, అందాకా వీళ్ళ సంగతి నేను చూస్తా” అంటే భీముడు “అలాటి పని నీకు సరిపోతుంది గాని నేనిప్పుడు రణరంగం విడిచివెళ్తే ఓడిపోయి పారిపోయా ననుకుంటారందరూ. నువ్వే వెళ్ళు” అన్నాడు.