తిక్కన సోమయాజి భారత యుద్ధ కథ – నాలుగవ భాగం

అలా నాలుగు రోజుల ఒక రాత్రి, ఐదవరోజు ఇరవై గడియల పాటు సర్వసేనాధిపతిగా మన సైన్యాన్ని రక్షిస్తూ దేవతలక్కూడా ఆశ్చర్యం కలిగించేలా యుద్ధం చేసి తృప్తుడై మన సేన వైపుకి తిరిగి “కర్ణా, కృపా, దుర్యోధనా, నా శక్తి కొద్ది ఇన్నాళ్ళు యుద్ధం చేసి ఇక నిశ్చింతగా సుగతికి వెళ్తున్నా. ఆయుధాల్ని విడుస్తున్నా. మీరు తెలివిగా జీవించండి” అని అరిచి చెప్పి ఆయుధాలు విసిరేసి రథం మీద యోగనిష్టలో కూర్చున్నాడు ద్రోణుడు.

అంతలో ఒక నిశితఖడ్గాన్ని చేతపట్టి వేగంగా పాదచారిగా ద్రోణుడి వైపుకి ధృష్టద్యుమ్నుడు వెళ్తుంటే రెండుసైన్యాలు హాహాకారాలు చేసినయ్. ద్రోణుడు తేజోరూపంలో తన శరీరాన్ని విడిచి పైకి వెళ్ళాడు. ఆ దృశ్యం నాకు కళ్ళార కనిపించింది. కృష్ణార్జునులు, ధర్మరాజు, కృపాచార్యుడు కూడ అది చూశారు. ఇంకెవరికీ ఆ జ్యోతి కనిపించలేదు. ధృష్టద్యుమ్నుడు ద్రోణుడి రథం మీదికి ఎగిరాడు. ద్రోణుడి శవం జుట్టు గట్టిగా పట్టుకుని వద్దు వద్దు అని అర్జునుడు అరుస్తున్నా, తప్పు రా అని ధర్మరాజు బోధిస్తున్నా వినకుండా అతని తల నరికి దాన్నీ, మొండాన్నీ కిందికి తోశాడు. శతవృద్ధుడు అస్త్రాచార్యుడలా పాండవపక్షం అధర్మవర్తనతో అస్తమించాడు.

ఆచార్యుడి చావుతో మన సేనలు అలమటించినయ్. పెద్ద పెద్ద దొరలంతా ఇంక మనకి దారేదీ అని వాపోయారు. సామాన్యసైనికులు దిక్కు తెలియకుండా పరిగెత్తారు. మరోవంక యుద్ధం చేస్తున్న అశ్వత్థామ ఈ కలకలం ఏమిటా అని దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళాడు. ఏం జరిగిందని అతన్నడిగితే నోట మాటరాక పాలిపోయిన మొహంతో నిలబడ్డాడు దుర్యోధనుడు. చివరికి కృపాచార్యుడు ఏడుపు గొంతుతో జరిగిందంతా టూకీగా వివరించాడతనికి.

అశ్వత్థామ కళ్ళు క్రోధంతో, దుఃఖంతో ఎర్రబడినయ్. కన్నీళ్ళు జలజల కారినయ్. చేత్తో తుడుచుకుంటూ దుర్యోధనుడితో అన్నాడూ – “చావులు లేవా, యుద్ధాల్లో చావరా, మహానుభావుడు అస్త్రగురువుని ఒక హీనుడు ఇలా జుట్టు పట్టుకుని తలగొట్టటం ఎక్కడన్నా ఉందా? నాకీ విషయం తెలీకుండా ఉంటుందనుకున్నాడా వాడు? నన్నింతగా అవమానిస్తాడా? తండ్రిని ఇలాటి అవమానకరమైన మరణాన్నుంచి రక్షించలేని నా దివ్యాస్త్రాలెందుకు, తగలెయ్యనా? దీనికి మూల కారణం ధర్మరాజు. అతని మీద నేనెలా పగ తీర్చుకుంటానో కదా ! ఐనా నా ప్రతిజ్ఞ విను. కృష్ణుణ్ణి, పాండవుల్ని నా భుజబలంతో, దివ్యాస్త్రాల్తో ముప్పుతిప్పలు పెడతా. దేవతలొచ్చినా సరే, వాళ్ళ సేనానీకాన్ని అల్లకల్లోలం చేసేస్తా. నా గురించి నేను చెప్పుకోకూడదు, ఎలా చేస్తానో నువ్వే చూద్దువు. నా తండ్రి నారాయణుణ్ణి ఆరాధించి ఒక మహిమాన్వితాస్త్రాన్ని పొందాడు, అది నాకిచ్చాడు. దాన్ని ప్రయోగిస్తా. అది విరోధులందర్నీ మట్టుపెడుతుంది.” ఆ మాటల్తో పొంగి మన యోధులు శంఖాలు పూరించారు. భేరీమృదంగ నాదాలు మిన్ను ముట్టినయ్. మన సైన్యాలు ఉత్సాహంగా శత్రువుల మీదికి బయల్దేరినయ్.

ఆ మహారవం విని ధర్మరాజు ఆశ్చర్యపడ్డాడు. ద్రోణుడు పడిన వార్త విని కూడ కౌరవసైన్యం ఎందుకంత ఉత్సాహంగా ఉరకలేస్తుందని అర్జునుణ్ణడిగితే దానికతను “తన తండ్రిని శత్రువులు అధర్మంగా చంపారని విని అశ్వత్థామ ఊరుకుంటాడనుకున్నావా? అతను మహిమాన్విత అస్త్రాలున్నవాడు. అమానుష విక్రముడు. అతని మూలానే కౌరవసైన్యాలలా ఉత్సాహంగా వున్నయ్. ఐనా నిన్ను శిష్యుడని, ధార్మికుడని, సత్యవ్రతుడని ఎంతో ఆదరంగా అడిగిన గురువుకా నువ్విలా అబద్ధం చెప్పేది? నీ మాట వినే ఆయన కొడుకు నిజంగా చనిపోయాడనుకున్నాడు. ఇంత హీనంగా ప్రవర్తించి తెచ్చుకున్న రాజ్యం వల్ల పేరొస్తుందా, వృద్ధి కలుగుతుందా? మనం లోకానికి వెలి కాలేదా? పైగా అలా అస్త్రసన్యాసం చేసిన వాణ్ణి, వద్దు వద్దని నేను గొంతు పగిలేట్టు అరుస్తూ వారిస్తున్నా వినకుండా జుట్టు పట్టి తలని నరికాడు కదా ఇతను! ఈ ధృష్టద్యుమ్నుడి అంతు చూడకుండా ఆ అశ్వత్థామ వదుల్తాడా? ఇప్పుడు మనసైన్యాన్ని నాశనం చెయ్యటానికి, ఈ ధృష్టద్యుమ్నుడి తల కొయ్యటానికి ప్రళయరుద్రుడిలా వస్తున్న అతన్ని ఎదుర్కోవటం నీకూ, వీళ్ళకీ సాధ్యమైన పనా?” అని దెప్పిపొడుస్తుంటే భీముడతని మీద మండిపడ్డాడు.

“యుద్ధం చెయ్యటానికి వచ్చి ఇలా ధర్మపన్నాలు పలుకుతావేం? నిండుసభలో పాంచాలికి వాళ్ళు చేసిన అన్యాయం ముందు మనం వాళ్ళకి ఎన్ని చేసినా దిగదుడుపే. ఒక పక్క మన మీదికి దూకుతున్న శత్రువుల్ని ఎలా ఎదుర్కోవాలా అని మేం తలలు పట్టుకుంటుంటే పుండు మీద కారం చల్లే ఈ మాటలేమిటి?” అన్నాడతనితో.

ధృష్టద్యుమ్నుడు కూడ “మన సామాన్య సైనికుల మీద దివ్యబాణాలేసి వాళ్ళని ఊచకోత కోస్తున్నాడే, ఈ ద్రోణుడు ధార్మికుడా? ఐనా అతన్ని చంపటానికే పుట్టాను నేను, మరి చంపితే దాన్లో అధర్మమేమిటి? ధర్మరాజు ఎప్పుడూ అసత్యం ఆడడు, నేను ధర్మం తప్పను. నువ్వు మాత్రం కురుపితామహుడు భీష్ముణ్ణి, నీ తండ్రికి ఆప్తమిత్రుడైన భగదత్తుణ్ణి చంపలేదా? శిష్యవంచకుడు గనక గురుడు చచ్చాడు. ఇంక చాలు, శత్రుసైన్యాన్ని గెలుద్దాం పద” అని సంభాషణని దారి మళ్ళించటానికి ప్రయత్నించాడు.

అలా మాట్టాడుతున్న ధృష్టద్యుమ్నుణ్ణి ఏమీ చెయ్యలేక ఈసడించుకున్నాడు అర్జునుడు. కన్నీళ్ళు కారుస్తూ, నిట్టూర్చి “ఇంకా ఎందుకీ రోత మాటలు?” అని మాత్రం అనగలిగాడు. కృష్ణుడు, ధర్మరాజు సిగ్గుతో తలలు వంచుకున్నారు.

ఒక్క సాత్యకి మాత్రం పట్టరాని కోపంతో “గురువుకి అంత పరాభవం చేసినా నీ నాలిక రాలదు, నీ తల పగలదు. ధర్మరాజు ఎదుట కాబట్టి బతికిపోయావ్, లేకపోతే నీ అంతు చూసేవాణ్ణి. ఆ శిఖండి మూలాన భీష్ముడు పడ్డాడు. దానికి అర్జునుణ్ణి నిందిస్తావా? భీష్ముడి కోరిక మీరక ఆయన మీద అర్జునుడు బాణాలేశాడు, అతనికీ నీకూ పోలికా? అసలు నువ్వూ శిఖండీ పుట్టి పాంచాలకులానికే కళంకం తెచ్చిపెట్టారు” అని ధృష్టద్యుమ్నుణ్ణి తిట్టిపోశాడు.

దానికతను పగలబడి నవ్వాడు. “మరొకరు కొడితే చెయ్యి తెగి నిష్టూరపడుతున్న భూరిశ్రవుణ్ణి బుద్దిలేకుండా చంపావే, అది వీరుడు చేసే పనేనా? అతను నిన్ను కింద పడేసి గుండెల మీద ఎక్కితే ఏమన్నా చెయ్యగలిగావా? అంత పోటుగాడివే, ద్రోణుడు మన సైన్యాల్ని చిందరవందర చేస్తుంటే అతనికి అడ్డం పడ్డావా? ఇంకా మాట్టాడావంటే నీ తల నరుకుతా. .. ఐనా ఇప్పుడిదంతా ఎందుకు, అదుగో శత్రుసైన్యం వస్తున్నది, దాని సంగతి చూద్దాం పద” అన్నాడతనితో.

ఆ మాటలు సాత్యకిని శాంతింపజెయ్యకపోగా అతని కోపాన్ని పెంచినయ్. వింటిని రథం మీద విసిరేసి గద తీసుకుని “ఒక్క వేటుతో నీ అంతు చూస్తా రా” అని ధృష్టద్యుమ్నుడి మీదికి వెళ్తుంటే కృష్ణుడు భీముణ్ణి అతన్ని పట్టుకోమని పంపితే భీముడు వెనకనుంచి అతని రెండు చేతులూ పట్టుకుని ఆపాడు. భీముడి చేతుల్లోంచి తప్పించుకోవటానికి సాత్యకి పెనుగులాడుతుంటే “వదులు వాణ్ణి, వాడి సంగతి నేను చూస్తాగా. నేనేం ఒంటిచేతి భూరిశ్రవుణ్ణి కాను” అన్నాడు ధృష్టద్యుమ్నుడు తన్నులాటకి తనూ కాలుదువ్వుతూ. చివరికి ధర్మరాజు, కృష్ణుడు అతికష్టం మీద వాళ్ళని శాంతపరిచారు.

పాండవసైన్యం దాపులకి వచ్చాక అశ్వత్థామ నారాయణాస్త్రం ప్రయోగించాడు. ఆ మహాస్త్రం భీకరాకారంతో బయల్దేరింది. దాన్నుంచి అనేక రకాల ఆయుధాలు మంటలు విరజిమ్ముతూ బయటికొచ్చి పాండవసైన్యం మీదికి అన్ని వైపుల నుంచి ఒక్కసారిగా కమ్ముకున్నయ్. సైన్యాన్ని నాశనం చెయ్యసాగినయ్.

అర్జునుడు అదంతా చూస్తూ తనకేమీ పట్టనట్టు కదలకుండా ఊరుకున్నాడు.

ధర్మరాజు అతనికి వినపడేలా సాత్యకి, ధృష్టద్యుమ్నుల్తో “నిండు సభలో పాంచాలికి పరాభవం జరుగుతుంటే మౌనంగా చూస్తూ కూర్చున్నాడు, బాలుడైన అభిమన్యుణ్ణి పదిమందితో కలిసి చంపాడు, సైంధవుణ్ణి చంపటానికి పోయిన అర్జునుడికి సాయంగా వెళ్తున్న నిన్ను పోనీకుండా అడ్డు పడ్డాడు. అలాటి ధర్మపరుడైన ద్రోణుడికి నేనెక్కడ సమానం ఔతాను? నేనిప్పుడే నాలుకలు చాచుకుంటూ వస్తున్న ఆ అగ్నిలోకి పోతా, మీరు మీ మీ బలాల్తో ఎటన్నా పారిపోండి. అప్పుడు గాని అర్జునుడి మనసు చల్లబడదు” అని పరోక్షంగా అర్జునుణ్ణి దెప్పిపొడిచాడు.

అప్పుడు కృష్ణుడు పెద్దగా అందరికీ వినపడేట్టు “సైనికులారా, వెంటనే అందరూ గుర్రాలు, ఏనుగులు దిగి ఆయుధాల్ని కింద పెట్టి భూమ్మీద నిలబడండి. అప్పుడు ఈ అస్త్రం మిమ్మల్నేమీ చెయ్యదు. ఈ మహాస్త్రానికి ఇదే మందు” అని చెప్తే అందరూ అలాగే చేశారు. ఒక్క భీముడు మాత్రం “వీరులారా, ఒక అస్త్రానికి భయపడి ఆయుధాలు వదిలేస్తారా? నేనుండగా మీకేం భయం వద్దు. నేనీ అస్త్రం అంతం చూస్తాగా” అంటూ అశ్వత్థామతో తలపడితే కోపగించుకుని అశ్వత్థామ ఆ అస్త్రాన్ని ఇంకా ప్రజ్వలింప చేశాడు.

మిగిలిన వాళ్ళంతా ఆయుధాలు వదిలెయ్యటంతో అది నేరుగా భీముడి మీదికి బయల్దేరింది. అర్జునుడు హడావుడిగా వరుణాస్త్రం వేశాడు. దాంతో నారాయణాస్త్ర ప్రభావం కొంత తగ్గింది. వెనక్కి తగ్గకుండా అశ్వత్థామ దాన్నింకా పెంచాడు. భీముడి రథాన్ని కార్చిచ్చులా కమ్ముకుందది. కృష్ణార్జునులు పాదచారులై పరిగెత్తుకెళ్ళి భీముణ్ణి కిందికి దిగమన్నారు. భీముడు కదలనని భీష్మించుక్కూచున్నాడు. ఇంకిలా కాదని వాళ్ళిద్దరూ భీముడి ఆయుధాల్ని లాగిపారేసి అతన్ని రథం మీంచి కిందికి తోశారు.

అలా అంతా కిందకి దిగి నిలబడటంతో నారాయణాస్త్రం శాంతించింది.

“ఆ అస్త్రాన్ని మళ్ళీ వెయ్” అని అశ్వత్థామని ప్రోత్సహించాడు దుర్యోధనుడు. “అది ఒక్కసారే ప్రయోగించాలి, మళ్ళీ ప్రయోగిస్తే మననే కాలుస్తుంది. కృష్ణుడు మోసంతో దాన్ని నిర్వీర్యం చేశాడు. ఓడిన వాళ్ళు చచ్చిన వాళ్ళతో సమానం గనక వాళ్ళంతా ఆయుధాలు పారేస్తే ఆ అస్త్రం పనైపోయింది” అని నిట్టూర్చాడు అశ్వత్థామ. ఐనా నిరుత్సాహపడకుండా ధృష్టద్యుమ్నుణ్ణి తాకి వాడి సారథిని, గుర్రాల్ని, కేతువుని నేలకూల్చాడు. సాత్యకి అడ్డొస్తే ఒక్క బాణంతో అతన్ని మూర్ఛితుణ్ణి చేశాడు. అదిచూసి భీమార్జునులు అతని మీద దూకారు.

అశ్వత్థామ అమితక్రోధంతో ఆగ్నేయాస్త్రం వేశాడు. దాన్నుంచి భీకరాగ్ని జ్వాలలు వచ్చి ఒక అక్షౌహిణి పాండవసైన్యాన్ని అప్పటికప్పుడే మట్టుపెట్టినయ్. దాని దెబ్బకి భీమార్జునులు చచ్చారని మనవాళ్ళు ఆనందంతో అరిచారు. వేరే దారిలేక అర్జునుడు అన్ని అస్త్రాల్ని ఉపసంహరించగలిగే బ్రహ్మాస్త్రాన్ని సమంత్రకంగా ప్రయోగిస్తే అది అశ్వత్థామ ఆగ్నేయాస్త్రాన్ని హరించింది. కృష్ణార్జునులు శంఖాలు పూరించి పాండవసైన్యానికి ఊరట కలిగించారు.

ఆగ్నేయాస్త్రం విఫలం కావటంతో అశ్వత్థామ వికలుడయ్యాడు. “పనిచెయ్యని దివ్యాస్త్రాల్తో నేను చేసే యుద్ధం ఏమిట”ని రోషంగా వింటిని విసిరి పారేసి ఒక్కడే కాలినడకన కదిలిపోయాడు.

ఐతే దార్లో అతనికి వేదవ్యాసుడు ప్రత్యక్షమయాడు. దేవతలకైనా ఆప శక్యంకాని తన ఆగ్నేయాస్త్రాన్ని నరుడెలా ఆపగలిగాడని అతన్ని అడిగాడు అశ్వత్థామ. వ్యాసుడు దయతో అతనికి నరనారాయణుల వృత్తాంతం చెప్పి వాళ్ళు అవసరమైనప్పుడు అవతరించి దుష్టసంహారం చేస్తుంటారని, ఇప్పుడు కృష్ణార్జునులుగా వున్నది వాళ్ళేనని విశదీకరించాడు. పైగా పూర్వజన్మలో అశ్వత్థామ మట్టితో శివుడి ప్రతిమని చేసి దాన్ని నిష్టతో పూజించాడని, వాళ్ళు శివుణ్ణి లింగాకృతిగా ఆరాధించారని, అర్చలో ఆరాధించటం కంటె లింగాన్ని పూజించటం ఎన్నో రెట్లు ఉత్తమం కనక వాళ్ళని తను జయించలేకపోయాడని వ్యాసుడతనికి వివరించాడు. అశ్వత్థామ శాంతించి యుద్ధభూమికి తిరిగి వచ్చి సూర్యాస్తమయం కావటంతో సేనల్ని శిబిరాలకి మళ్ళించాడు.

ఇలా ద్రోణరక్షణలో కౌరవసేనల యుద్ధక్రమాన్ని ధృతరాష్ట్రుడికి వివరించి చెప్పి తిరిగి యుద్ధభూమికి వెళ్ళాడు సంజయుడు.