తిక్కన సోమయాజి భారత యుద్ధకథ

వింటే భారతం వినాలి. ఈ మాట భారత ‘యుద్ధకథ’ గురించి అన్నారో లేదో గాని నేను చూసినంతలో ఇంత విపులంగా ఉత్కంఠభరితంగా కళ్ళకి కట్టినట్టుగా యుద్ధక్రమాన్ని వర్ణించిన ఇతిహాసం మరొకటి, మరెక్కడా లేదు. నిజానికి భారత కథలోని ముఖ్య పాత్రల నిజమైన రూపాలు, స్వభావాలు మనకి యుద్ధభాగం లోనే కనిపిస్తాయని నా అభిప్రాయం. సామాన్యంగా భారతం చదివేవాళ్ళు దాన్ని మొదట్నుంచి చివరిదాకా చదవరు. ఏ విరాట పర్వంతోనో మొదలెట్టి వాళ్ళకి ఇష్టమైన రెండు మూడు ఇతర పర్వాలు చదివి ఊరుకుంటారు. అందునా యుద్ధపర్వాలు చదవటం చాలా అరుదు. దీనికి కారణాలు అనేకం.

చాలా మందికి భారతయుద్ధం అంటే మహాభారత్ టీవీ సీరియల్లోనో లేక అనేక సినిమాల్లోనో చూసిందే. కాకుంటే ‘కాళిదాసు కవిత్వం కొంతైతే నా పైత్యం కొంత’ అన్నట్టుంటాయవి.

ఇది తిక్కన తెలుగు భారతం లోని యుద్ధభాగాలకి తేలిక వచనంలో అనువాదం. వీలైనంత దగ్గరగా మూలాన్ని అనుసరిస్తూ, కథాగమనానికి అడ్డొచ్చే పునరుక్తుల్ని, యుద్ధకథకి నేరుగా సంబంధం లేని పిట్టకథల్ని మాత్రం వదిలేస్తూ సాగుతుంది. ఎన్నో ఆసక్తికరాలు, ఆశ్చర్యజనకాలైన సంఘటనల్తో నిండి అడుగడుగునా అబ్బురపరిచే ఈ యుద్ధకథనం అవశ్యపఠనీయం. మూలం చదవటానికి ఓపిక, తీరిక లేని వాళ్ళ కోసం ఈ ప్రయత్నం. ఇక చదవండి.