ఆధునిక యుగంలో హాస్యం

కాంతం లాగానే తెలుగునాట నిలిచిపోయిన మరోపాత్ర ‘బారిస్టర్‌ పార్వతీశం’. లండన్‌ వెళ్ళి బారిస్టర్‌ చదువుదామని వుబ లాటపడిన ఓ పల్లెటూరి యువకుడి గాథ. సున్నితమైన హాస్యం అంటే ఏమిటో దీని ద్వారా రుచి చూపించిన మొక్కపాటి వారు యిది కాక యింకా కొన్ని హాస్యరచనలు కూడా చేశారు.

ఇంతమంది వున్నా ‘హాస్యబ్రహ్మ’ బిరుదు పొందినవారు భమిడిపాటివారు. ఆయన గురించి ముళ్ళపూడివారు అంటారు- ‘‘కామేశ్వరరావుగారు ఆంధ్రుడి విశ్వరూపాన్ని దర్శించగలిగారు. జాతి వికాసానికి కూడని లక్షణాలను గర్హించారు. అవి ఉన్నం దుకు ‘అన్నన్నా’ అని బాధపడి, లేచి, ‘హన్నా’ అని కోప్పడి, ‘నాన్నా’ అని లాలించారు. ఎబ్బెబ్బే అని హేళన చేశారు. తన జాతిపట్ల తనకు గల ఆపేక్షకీ, ప్రేమకీ, గౌరవానికీ, గర్వానికీ, లజ్జకీ, దాని కోసం ఆయన పడ్డ బాధకీ ఆయన రచనలన్నీ అక్షరానువాదులు. మాట విలువ తెలుసుకుని దానిమీద అధికారం కోసం నిత్యం తపస్సు చేసిన వ్యక్తి ఆయన.’’

మన తెలుగువాళ్ళ గురించి భమిడిపాటి అంటారు- ‘‘మన లిపిలోనే మన అనైక్యత తెలుస్తుంది. క-చ-ట-త-ప ఈ అక్షరాలు చూడండి. విడివిడిగా దేని తలకట్టు దానిదే. హిందీలో అయితే ఈ అక్షరాలకు పైన ఓ గీత పెట్టి కలుపుతారు. మనం? అబ్బే! కచట తపల గాళ్ళం. మన అక్షరాల్లాగా ఎవడి పిలక వాడిదే. ఇంకోడితో కలిసే ప్రసక్తే లేదు.’’

భానుమతిగారి అత్తగారు కూడా తెలుగు సాహిత్యంలో నిలిచిపోయిన హాస్యపాత్ర. ఆ అత్తగారి చాదస్తం మనను నవ్విస్తుంది. సుతారమైన హాస్యం గిలిగింతలు పెడుతుంది.

అత్తగారిలాగే నిలిచిపోయిన పాత్రలు కొన్ని వున్నాయి- ‘బుడుగు’, ’రాధాగోపాలం’ ‘అప్పారావు.’ వీటిని సృష్టించిన వారు ముళ్ళపూడి వెంకటరమణ. ఆధునిక యుగంలో హాస్యరచయిత గా ముళ్ళపూడికి వున్న స్థానం వేరెవరికీ లేదనడంలో అతిశయోక్తి లేదు. ఆయన కథారచనా వ్యాసంగం పట్టుమని పదేళ్ళు కూడా సాగక పోయినా, హాస్యంలోని అన్ని ప్రయోగాలనీ చేసేసి ఓ రెండు తరాల రచయితలకు ‘ఐకాన్‌’ అయిపోయారు. తెలుగు పలుకుబడికి, ఆహ్లాదకరమైన హాస్యానికి చిరునామా అయిపో యారు. ఋణానంద లహరి, రాజకీయ బేతాళ పంచవింశతిక, విక్రమార్కుడి మార్కు సింహాసనం కథలు- యిలా రకరకాల రంగాలపై రాయడంతో బాటు గురజాడవారి ‘గిరీశం’కు పునః ప్రాణప్రతిష్ట చేసి అతని చేత సినిమారంగంపై ‘లెక్చర్లు’ యిప్పిం చారు. తెలుగుబాలుడు వున్నంత కాలం ‘బుడుగు’ వుంటాడు.

ముళ్ళపూడి సమకాలికులైన రావి కొండలరావుగారు అనేక హాస్యవ్యాసాలు, హాస్యనాటికలు రాయడంతో బాటు ‘(సి)నీతి చంద్రిక’ అనే హాస్యనవల కూడా రాశారు. అది యీరోజు ఆవిష్క రించబడబోతోంది. వీళ్ళకు సీనియర్‌ అయిన పాలగుమ్మి పద్మ రాజుగారు సీరియస్‌ రైటర్‌గా సుప్రసిద్ధులైనా ఉడ్‌హౌస్‌ తరహా నవల ‘బ్రతికిన కాలేజీ’, పొలిటికల్‌ సెటైర్‌ ‘రెండవ అశోకుడి మూణ్నాళ్ళ పాలన’ రాశారు. పురాణం సుబ్రహ్మణ్యశర్మగారు తన ‘ఇల్లాలి ముచ్చట్ల’ ద్వారా హాస్యరచనలో తన స్థానం సుస్థిరం చేసుకున్నారు. అలాగే ‘తంబింప్రెషన్‌’ రాసిన డాక్టర్‌ ‘తంబు’ కూడా..

కథను అవలీలగా, అలవోకగా చెప్పడంలో సిద్ధహస్తులైన భరాగో, అవసరాల రామకృష్ణారావుగార్లు రాసిన అనేక కథల్లో హాస్య కథలు కూడా వున్నాయి. ‘పన్‌’ చేయడంలో వారికి వారే సాటి. జర్న లిస్టుగా పేరుపొందిన నండూరి పార్థసారథిగారు ‘రాంబాబు డైరీ’ ద్వారా రాంబాబు అనే పాత్రను తెలుగు సాహిత్యానికి అందించారు. బళ్ళకొద్దీ సాహిత్యాన్ని తయారుచేసే వారిపై సెటైర్‌గా ‘సాహిత్య హింసావలోకనం’ రాశారు. రావిశాస్త్రి, బీనాదేవి సాంఘిక ప్రయోజనం కోసం కలం పట్టినా వారి రచనల్లో ఆసాంతం హాస్యం చిప్పిల్లు తూంటుంది. వివిధరకాల రచనల ద్వారా మంచి కమ్మర్షియల్‌ రైటర్‌గా పేరు తెచ్చుకున్న మల్లాది వెంకటకృష్ణమూర్తి హాస్య రచయితగా కూడా సుప్రసిద్ధులు.

దాసు వామనరావు, పుచ్చా పూర్ణానందం, గో(పా)ల చక్రవర్తి, పన్నాల సుబ్రహ్మణ్య భట్టు- యిలా ఎందరో హాస్య రచయితలు రేడియో ద్వారా, పత్రికలలో కాలమ్స్‌ ద్వారా హాస్యాన్ని పంచారు.

తెలుగులో యింటిలిజెంట్‌ హ్యూమర్‌ రాసిన వారిలో ప్రముఖంగా చెప్పుకోవలసినది కవనశర్మగారిని. సైంటిస్టుల గురించి, వాళ్ళ థీసిస్‌ల గురించి, గైడ్‌లతో వాళ్ళు పడే కష్టాల గురించి ఆయన కాశీమజిలీ కథల మోడల్లో అమెరికా మజిలీ కథలు, కాన్ఫరెన్సులను వెక్కిరిస్తూ ‘కాన్ఫరెన్సు తిరునాళ్ళ కథలు’ రాశారు. ఎక్స్‌పర్ట్‌స్‌ పేరుతో జరిగే మోసాలను బయటపెడుతూ ‘నిపుణుల కథలు’ రాశారు. ఈ కథల్లో వాటికి తగిన భాష కూడా వుపయోగించారు.

‘ఆమె తలకి రాసుకున్న మందారతైలం సర్ఫేస్‌ టెన్షన్‌కి లొంగక ఒకటో రెండో పలితకేశాలు తమ వ్యక్తిత్వం నిలబెట్టుకుంటూ నిలబడి వున్నాయి.’

‘నాకు పెళ్ళి చేసుకోవాలసిన అగత్యం లేదు. ఫ్రీ మాలిక్యూల్‌ని.’

‘అర్ధాంగుల ఆర్థికసూత్రాలు’ అంటూ రాసినప్పుడు కూడా యిలాటి ఉపమానాలు యిచ్చారు.

‘ఆడవాళ్ళకు పుట్టింటి వారిచ్చిన సొమ్ము తరగదు. అది రసాయనిక చర్యలో కెటలిస్టు లాటిది. క్రయం వలన ఖర్చు కాదు.’

‘ముందుగా ఆలోచించి పెట్టుకున్న నిర్ణయాన్ని అమలు చేసేవాడు ‘రేషనలిస్టు’, ముందస్తుగా పని చేసేసి తరువాత అది ఎంత సబబో ఆలోచించి చెప్పేవాడు ‘రేషనలైజేషనిస్టు’. మా ఆవిడ రెండోరకం మనిషి.’

కవనశర్మలాగే యింటెలిజెంట్‌గా రాసే మరో హాస్య రచయిత లేళ్ళపల్లి. ఈయన రాసిన ‘ఉద్యోగపర్వాలు’ నిరు ద్యోగుల, చిరుద్యోగుల బాధలను సరదాగా చూపుతుంది. యర్రంశెట్టి శాయిగారిది మరో రకం హ్యూమర్‌. అందరికీ అందే శాయిగారు విస్తారంగా రాశారు. నవ్వులు పంచారు.

‘మిట్టూరోడి కథలు’, ‘సినబ్బ కథలు’ రాసిన నామిని సుబ్రహ్మణ్యం నాయుడు హాస్యరచయితనని చెప్పుకోకపోయినా ఆయన రచనల్లో ఆసాంతం హాస్యం చిప్పిల్లుతూంటుంది. ఎంతటి బాధాకరమైన విషయాన్నయినా ఆయన సరదాగా చెప్పగలడు.

ఆయన బాటలో ‘దర్గామిట్ట కథలు’ రాసిన ఖదీర్‌బాబు కూడా కష్టాలకు హాస్యపుపూత అందించిన సమర్థుడైన రచయిత. మామూలు పరిస్థితుల్లోంచే హాస్యాన్ని పుట్టించగలిగిన దిట్ట పొత్తూరి విజయలక్ష్మి. ఈవిడ రాసిన నవలనే ‘శ్రీవారికి ప్రేమలేఖ’ గా తీశారు జంధ్యాల.

ప్యారడీ ఒక ప్రత్యేకమైన, క్లిష్టమైన కళ. ఒరిజినల్‌ను గుర్తుకు తెస్తూ, దానిలోని అవలక్షణాన్ని లేదా పునరుక్తి దోషాన్ని హైలైట్‌ చేసి వెక్కిరించడం. దానికి పాండిత్యం వుండాలి, ప్రత్యేకమైన దృష్టి వుండాలి.

తెలుగులో ప్యారడీ అనగానే జరుక్‌శాస్త్రి గుర్తుకు వస్తారు. శ్రీశ్రీ, ‘నేను సైతం ప్రపంచాగ్నికి సమిధ నొక్కటి ధారపోశాను,’ అంటే యీయన, ‘నేను సైతం కిళ్ళీ కొట్లో పాతబాకీ లెగర గొట్టాను,’ అని ప్యారడీ చేశాడు. కృష్ణశాస్త్రి, ‘కన్నీటి కెరటాల వెన్నెలేలా?’ అని రాస్తే యీయన, ‘వంకాయ తొడిమలో వంక రేలా…?’ అని వెక్కిరించాడు.

తర్వాతి కాలంలో ప్యారడీకి అంత ప్రాచుర్యాన్ని తెచ్చింది శ్రీరమణ. ఆయన రాసిన ఓ కథలో రైల్లో రచయితలు అందరూ వెళుతున్నారట. టిక్కెట్‌ కలక్టర్‌ వచ్చి విశ్వనాథవారిని టిక్కెట్టు అడిగాడట. దానికి యీయన, ‘అల నన్నయకులేదు, తిక్కనలకు లేదు,’ అనే పద్యం ఎత్తుకున్నాడట. ఒరిజినల్‌ పద్యం తెలుసుగా? నా వంటి శిష్యుడు వుండే భాగ్యం చెళ్ళపిళ్ళవారికి తప్ప నన్నయకు లేదు, తిక్కనకు లేదు అంటూ విశ్వనాథ చెప్పిన పద్యం అది. శ్రీరమణ ప్యారడీలే కాదు, హాస్యజ్యోతి పేర ఎన్నో జోక్స్‌ సంకలనం చేశారు, రంగులరాట్నం, శ్రీ ఛానెల్‌ పేర కాలమ్స్‌ రాశారు. హాస్య కథలు రాశారు.

ఆలోచనలు రేకెత్తించేలా రాయగల హాస్యరచయితల్లో సర్రాజు ప్రసన్నకుమార్‌, సోమరాజు సుశీల, తోలేటి జగన్మోహన రావులను చెప్పుకోవాలి. ఇంకా అనేకమంది హాస్యరచయితలు సమయానికి గుర్తుకు రాకపోతే యీ రచయిత క్షంతవ్యుడు.

ఇలా చూస్తే మామూలు రచయితల్లో హాస్యరచయితలు ఎంత ఫ్రాక్షనో అనిపిస్తోంది కదా! ఇక్కడ ఒక చిన్న ఉదంతం చెప్తాను. విన్నారు కదా, మామూలు రచయితల్లో వీళ్ళెంత శాతమో అర్థమైంది కదా! అల్లు అరవింద్‌ మా మిత్రుడు శాంతా బయోటెక్నిక్స్‌ వరప్రసాద్‌కి క్లాస్‌మేట్‌. ఓ పార్టీలో నన్ను పరిచయం చేస్తూ, ‘మా ఫ్రెండు’ అన్నాడు, కాస్త ఆగి కళ్ళెగరేస్తూ ‘రాజమండ్రి…’ అన్నాడు, ఎఫెక్ట్‌కోసం ఇంకాస్త గ్యాప్‌ యిచ్చి ‘మొక్కపాటివారు తెలుసా?’ అన్నాడు. అరవింద్‌ ఓహో, ఓహో అంటున్నారు. ఇన్ని చెప్పాడు కానీ నా హోదా చెప్పడేమిట్రా అని నా బాధ. ‘స్టేటు బ్యాంక్‌ గ్రూప్‌లో ఆఫీసరని చెప్పు స్వామీ,’ అన్నాను. ఈయన ధోరణిలో యీయన, ‘నాకు వద్దయ్యా ఎక్కవుంట్లు అవీ… బోరు, హాస్యం అంటే హాయిగా వుంటుంది,’ అన్నాడు. అరవింద్‌, ‘ప్రసాద్‌గారూ, ఓ మాట చెప్తాను. బ్యాంకు ఆఫీసరు అనిపించు కోవడం కంటె హాస్య రచయిత అనిపించుకోవడం గర్వకారణం. మనకు బ్యాంకు ఆఫీసర్లకు కొదవలేదు. 7 కోట్ల జనాభా వున్న మన రాష్ట్రం మొత్తంమీద పట్టుమని పదిమంది హాస్య రచయితలు లేరు,’ అన్నాడు.

నిజమేస్మీ అనిపించింది. ఆ తర్వాత వరప్రసాద్‌ పబ్లిషర్‌గా నేను మేనేజింగ్‌ ఎడిటర్‌గా ‘హాసం’ ప్రారంభించినపుడు అసలు కష్టం తెలిసింది. హాస్యరచయితలకు ఎంత కరువుందో! ఒకాయన రాసిన పద్యం గుర్తుకు వచ్చింది.

కరుణరసం కావాలా? గ్లాసులతో పోసుకో
బీభత్సం కావాలా? బిందెలతో పోసుకో
భయానకం కొరత లేదు- బ్రతుకంతా అదేగా
హాస్యరసం కావాలా? చెంచాతో వేసుకో!

ఎందుకంటే హాస్యరసానికి కరువుంది, హాస్యరచయిత లకు కరువుంది. భారత జనాభాలో ప్రతి 1600 మందికి ఒక్కరే డాక్టర్‌ ఉన్నారు, కానీ యింకా బోల్డుమంది వుండాలి, జాగ్రత్త అని ప్రపంచ ఆరోగ్యసంస్థ హెచ్చరిస్తూ వుంటుంది. హాస్య రచయితలకు కూడా కరువు మరీ తీవ్రంగా వుంది జాగ్రత్త అని మనకు మనం హెచ్చరించుకోవాలి. ఎందుకంటే మనకు చాలి నంతమంది హాస్య రచయితలుంటే డాక్టర్ల అనావృష్టిని సులభం గా ఎదుర్కోగలం. సంతోషం సగం బలం అన్నారు పెద్దలు. హాస్యం మనకు రోగ నిరోధక శక్తి నిస్తుంది. డాక్టర్ల వద్దకు వెళ్ళే అవసరమే పడదు.

చాలినంతమంది హాస్యరచయితలు పుట్టుకు రావాలంటే మనం వాళ్ళను గౌరవించాలి. హాస్యం రాయడానికి కూడా మేధస్సు కావాలని ఒప్పుకుని వాళ్ళను మన్నించాలి, అవార్డులు, రివార్డులు యివ్వాలి. అప్పుడే మేధావులు యిటు మళ్ళుతారు. లేకపోతే యిదిగో యిప్పుడున్న పరిస్థితిలోనే టెన్షన్లతో, డిప్రెషన్లతో మనం నిత్యం సమరం చేస్తూ బతుకు యీడ్చవలసినదే!