ఆధునికయుగంలో హాస్యం ఆవశ్యకత మరింత పెరిగింది. ఆశలు పెరిగాయి, ఆందోళనలు పెరిగాయి. టెన్షన్లు పెరిగాయి, డిప్రెషన్లు పెరిగాయి, సమస్యలు పెరిగాయి, ఆత్మహత్యలు పెరిగాయి. వీటిని సమర్థవంతంగా ఎదుర్కో గలిగినది హాస్యం ఒక్కటేనన్న సంగతి అందరికీ తెలుసు. అందుకనే హాస్యం కోసం ఆరాటం పెరిగింది.
తెల్లవారి లేవగానే భక్తి కార్యక్రమాల తర్వాత, వార్తల తర్వాత మనకు టీవీలో కనిపించేవి హాస్య కార్యక్రమాలే! అప్పుడే కాదు, మధ్యాహ్నం, సాయంత్రం ఎప్పుడైనా సరే కామెడీ సీన్సు ఏదో ఒక ఛానెల్‌లో చూపిస్తూ వుంటారు. టీవీ చూడనివారి సంగతి చూడబోయినా, దినపత్రికలో మొట్టమొదట చూసేది కార్టూన్నే!
‘నీకు ఎలాటి భర్త కావాలి?’ అని ఎవరైనా అమ్మాయిని అడగండి. సెలబ్రిటీ కావచ్చు, సామాన్యురాలు కావచ్చు. ‘సెన్సాఫ్ హ్యూమర్ వున్నవాడు కావాలి.’ అంటోంది. గతంలో అయితే, ‘నన్ను పువ్వుల్లో పెట్టుకోవాలి, కళ్ళల్లో పెట్టుకోవాలి,’ వంటి భావుకత చూపించేవారు కూడా, ‘ఐ వాంట్ ఏ పర్సన్ హూ మేక్ మీ లాఫ్,’ అంటున్నారు.
కానీ యీమెను నవ్వించాలంటే ముందుగా అతను నవ్వాలి. అతను నవ్వే పరిస్థితి వుందా? అతను నవ్వాలంటే అతన్ని నవ్వించే హాస్యరచయితో, హాస్యకళాకారుడో వుండాలి. ఉండడం అంటే యీసురోమని వుండడం కాదు, పచ్చగా, ఫెళఫెళలాడుతూ వుండాలి. అప్పుడే అతనిలో హాస్యరసం వూరుతుంది.
హాస్యకళాకారుల స్థితి ఎలా వుంది? హీరోగారు ఫైట్స్, డాన్సులతో బాటు కామెడీ చేసినా చెల్లిపోతుంది. ఎంత మాచో యిమేజి వున్నా కామెడీ చేయకపోతే పరిపూర్ణ మానవుడు కాదన్న లెవెల్లో హీరోలందరూ కామెడీ చేస్తున్నారు. అదే హాస్యనటుడు ఓ కామెడీ సినిమాలో హీరోగా వేద్దామని ముచ్చటపడితే ఎన్ని సంజాయిషీలు చెప్పుకోవలసి వస్తోందో చూస్తున్నాం కదా! ‘ఇదే జీవితంలో మొదటిసారి, చివరిసారి. ఇకపై హీరో వేషం వేస్తే ఒట్టు,’ అని చెప్పుకుంటే తప్ప సహించలేని పరిస్థితి వుంది. హాస్యగాడికి పాట పాడే సింగరే తనకూ పాడుతానంటే హీరోగారు వూరుకోరు! హాస్య గాడు అంటే సెకండ్ గ్రేడ్ సిటిజన్, దట్సాల్!
సినిమా నటుల విషయాలంటే అందరికీ తెలుస్తాయి కదాని ఆ వుదాహరణ చెప్పాను. రచయితల విషయంలో కూడా దీనికి మినహాయింపు లేదు. ఒకసారి హాస్యరచయితగా ముద్రపడిందంటే అంతే! ‘ప్రత్యేక సంచిక వేస్తున్నాం, ఏదైనా కామెడీ కథ రాసి పంపండి సార్,’ అంటారు ఎడిటర్లు. ‘మంచి విప్లవ కవిత్వం రాశాను, పంపమంటారా?’ అంటే ఫకాలున నవ్వి, ‘మాకు యిలాటి జోకులే కావాలి,’ అంటారు. మనం తెల్లబోయి, ‘సీరియస్సుగానే చెపుతున్నానండీ, నేను కవిత్వం కూడా రాస్తాను,’ అంటే, ‘భలేవారే,’ అంటారు. శ్రీశ్రీ తనను తాను సగం విదూషకుడిగా కూడా వర్ణించుకున్నా మనం ఒప్పుకోం. మహాకవి అంతే. అంటే రక్తం, ఎరుపు అన్నమాట. విదూషకుడు అంటే రక్తం డైల్యూట్ అయిపోతుంది.
ఈ విషయం తెలిసినవారు కాబట్టే ఆత్రేయ తను రాసిన సినిమాల్లో కామెడీ రాసేవారు కారు. నిజజీవితంలో ఎంత చమత్కారంగా మాట్లాడినా, సినిమాలో హాస్యం దగ్గరకు వచ్చే సరికి, ‘కామెడీ ట్రాక్ కావాలంటే ఏ అప్పలాచార్యచేతనో రాయించుకోండి,’ అనే వారుట. ఆ అప్పలాచార్యగారు ఎంత పండితుడైనా, పద్యాలు గట్రా రాయగలిగినా కామెడీ ట్రాక్ రచయితగానే మిగిలిపోయారు. స్టార్ రైటర్ కాలేకపోయారు.
కె. బాలచందర్‌క్కూడా యీ సంగతి బాగా తెలుసు అందుకనే ‘భలే కోడళ్ళు’, ‘అనుబవి రాజా అనుబవి’ వంటి హాస్య చిత్రాలు మొదట్లో తీసినా తర్వాతి కాలంలో తీసినవి చూడండి- ‘అంతులేని కథ’, ‘అపూర్వరాగంగళ్’, ‘తప్పు తాళంగళ్’ ‘ఆకలి రాజ్యం’, ‘గుప్పెడు మనసు’, ‘సిందుభైరవి’.. యిలా మనసును హింసపెట్టేవి. ఇవి తీశాడు కాబట్టే అవార్డులు తెచ్చుకున్నాడు.
ఈరోజుల్లో అంతేనండీ అంటారా? ప్రాచీనకాలం నుండి యింతేనండీ బాబూ. తెలుగులో గొప్ప కవుల పేర్లు చెప్పండి అంటే మీరు ‘అల్లసాని పెద్దన, ముక్కు తిమ్మన…’ అంటూ మొదలెడతారు తప్ప తెనాలి రామకృష్ణుడు అనరు. అల్లసాని పెద్దనగారు కవిత్వం చెప్పాలంటే యాంబియన్సు కోసం లక్షా తొంభై కండిషన్లు పెట్టారు. నిరుపహతి స్థలము, మరోటి అంటూ. మరి రామకృష్ణుడో.. అప్పటి కప్పుడు సమయస్ఫూర్తితో ‘తృవ్వట బాబా..’ అంటూ పాడి ఎదుటి వాడి నోరు మూయించగలడు. కానీ పెద్దన అంటే చేతులెత్తి నమస్కరిస్తాం. రామకృష్ణుడంటే నవ్వి వూరుకుంటాం.
మీకు తెలుసా? సర్కస్‌లో అన్నిరకాల ఫీట్లు చేయగలిగేది జోకర్ మాత్రమే! అదీ సునాయాసంగా చేస్తున్నట్లు కనబడుతూ..! కానీ మనం ఆరాధించేది ఎవర్ని? రింగ్‌మాస్టర్ని! జోకర్‌ను కాదు. రాజాస్థానంలో విదూషకుడి గతీ అంతే…
అప్పటి సంగతే కాదు, ఆధునికయుగంలో తెలుగులో గొప్ప కథారచయితలు ఎవరు అని అడిగితే మీరు మాత్రం ఎవరి పేరు చెప్తారు? – శ్రీపాద, మల్లాది, చలం… యిలా. ఒక్క హాస్య రచయిత పేరు చెప్తారా? అబ్బే! గతంలో విదూషకులకు రాజుగారు మంచి మూడ్‌లో వుంటే ఓ అగ్రహారమైనా యిచ్చే వాడేమో కానీ యిప్పుడు హాస్యరచయితకు ఒక్క అవార్డు కూడా దక్కదు. సాహిత్య అకాడమీ అవార్డులు గానీయండి, యితర భాషల్లో అనువాదాలు కానీయండి, ఆఖరికి పత్రికలు నిర్వహించే కథాపోటీలు కానీయండి… అన్నిటా సీరియస్ రచయితలకే పెద్దపీట.
పెద్దపీట యేమిటి నా మొహం! అన్ని పీటలూ వాళ్ళకే. స్త్రీ వాదం, దళితవాదం, అనావృష్టి వలన రాయలసీమ రైతు ఆత్మ హత్య, కూలిగిట్టక పాలమూరు కూలీల వలస, ఉత్తరాంధ్ర లో నిర్వాసితుడైన గిరిజనుడి గోడు- వీటి మీద కథ రాయండి. కనీసం కన్సోలేషన్ బహుమతి ఖాయం. హాస్యకథ పంపారో, సాధారణ ప్రచురణకు కూడా తీసుకోరు. ‘హాస్యకథల పోటీ’ అని వేరే పెడతాం, అప్పుడు పంపండి, అంటారు. అంటే హాస్యం జీవితంలో భాగం కాదా? అక్కరలేదా?
ఆధునికయుగంలో హాస్యానికి ఓ అదనపు భారం వచ్చి చేరింది. దాని పేరు సామాజిక ప్రయోజనం! గతంలోలా ‘హ్యూమర్ ఫర్ హ్యూమర్ సేక్’లా రాయడానికి వీలులేదు యీ రోజుల్లో. వ్యంగ్యం ద్వారా సమాజాన్ని ఉద్ధరించాలని కంకణం కట్టుకున్నారు పత్రికాధిపతులు, రచయితలు. నాబోటి వాడు ఉబుసుపోకకు ఏదైనా రాస్తే సాహితీ పీఠాధిపతుల నుండి చివాట్లు పడతాయి- ‘దీనికి ప్రయోజనం ఏముంది? దీనిలో మీరు ప్రజలకు యిచ్చే మెసేజ్ ఏమిటి?’ అని.
మెసేజ్ ఏమిట్రా అంటే పట్టుకు తిట్టడం. గతంలో ‘సాక్షి’ వ్యాసాల్లో పానుగంటివారు జనాల్ని తిడితే, గత 40, 50 ఏళ్ళుగా పత్రికల్లో వారం వారం వచ్చే సెటైర్ కాలమ్‌లో ప్రభుత్వాన్ని తిట్టడం ఆనవాయితీగా మారింది. పత్రిక యాజమాన్యం ఎవరో తెలిస్తే చాలు ఆ సెటైర్‌లో ఎవర్ని తిట్టబోతున్నారో తెలిసిపోతుంది. ఇదే మనకు అలవాటయింది.
‘రక్తకన్నీరు’ నాటకం ఎందుకు హిట్ అయిందో చెప్పండి. వేశ్యాసాంగత్యం ఎంత చెడ్డదో చెప్పినందుకా? అబ్బే, హీరో కుష్టు వాడై సమాజాన్ని, రాజకీయాల్ని, ప్రభుత్వాన్ని వెక్కిరించినందుకు జనాలు వచ్చి చూశారు. తెలుగునాట హిట్ అయిన ఏకైక కమ్మ ర్షియల్ డ్రామా అదేననుకుంటా.
ప్యూర్ హ్యూమర్‌తో రాసిన నాటకాలు కూడా అలా హిట్ కాలేదు. తమిళంలో అలాటి నాటకాలు హిట్ అవుతాయి. మన దగ్గర ఆడవు. మనకు దెప్పిపొడుచుకోవడం కావాలి. వెక్కిరిం చడం కావాలి. కృష్ణుడూ-అర్జునుడూ కానీయండి, రాముడూ-ఆంజనేయుడూ కానీయండి, మొదట్లో ఎంత సఖ్యంగానైనా వుండనీ యండి, చివరకి వచ్చేసరికి కాట్లాడుకుని ‘తొల్లి…’ అని పాత పురాణాలన్నీ తవ్వితీసి ఎకసెక్కాలాడుకోవాలి. అప్పుడే మనకు రంజుగా వుంటుంది.
మన నాడి పట్టేసిన పత్రికా సంపాదకులు, ఎవరో ఒకర్ని పట్టుకుని ప్రతివారం అందర్నీ తిట్టిస్తూంటారు.
ఇటువంటి వాతావరణంలో కేవలం హాస్యరచయితగా వుండడానికి ఆధునికయుగంలో ఎవరు ముందుకు వస్తారు చెప్పండి. అందుకని ఇతరత్రా మహారచయితలైనవారు తాము చేపట్టిన అనేక ప్రక్రియల్లో ఒక ప్రక్రియగా హాస్యాన్ని కూడా పరా మర్శించి చూశారు.
ఇప్పుడు కందుకూరి వీరేశలింగంగారున్నారు. ఆయనో వ్యవస్థ. సాహిత్యం వరకే చూసినా ఆయన చేపట్టిన ప్రక్రియలు బోల్డు. ఎన్ని చేసినా సంస్కరణే ఆయన లక్ష్యం. అందుకని ఆయన హాస్యరచనలన్నీ సమాజపు పోకడలను దుయ్యబట్ట డానికే ఉద్దేశించినవి. ప్రహసనాలు కానీయండి, ‘సత్యరాజా పూర్వదేశ యాత్రలు’ ‘అభాగ్యోపాఖ్యానం’ కానీయండి- పురుషా ధిక్య సమాజాన్ని, కుహనా పండితులను, విరహబాధలు తెగ వర్ణించే ప్రబంధాలను ప్యారడీ చేసి వదిలిపెట్టారు.
ఈ మార్గం పట్టడానికి యీయన్ను ప్రేరేపించినది కొక్కొండ వెంకటరత్నంగారు. వీరేశలింగంగారి ‘వివేకవర్ధని’ని వెటకారం చేయడానికి ఆయన తన ‘ఆంధ్ర భాషావర్ధని’ పత్రికకు ‘హాస్యవర్ధని’ అనే అనుబంధం వేశాడు. హాస్యాన్ని హాస్యంతోనే ఎదుర్కోవాలని యీయన ప్రహసనాలు అవీ రాశారు.
ఇక్కడే యింకో మాట కూడా చెప్పుకోవాలి. ఆధునిక యుగంలో ఆంగ్లభాషా పరిచయం వలన మన హాస్యం పరిపుష్టి అయింది. ‘సత్యరాజా పూర్వదేశయాత్రలు’కు మూలం జోనాథన్ స్విఫ్ట్ రాసిన ‘గలివర్ ట్రావెల్స్’. తర్వాతికాలంలో అనేకమంది రచయితలు విదేశీ రచయితలచేత ప్రభావితులయ్యారు. ఎడిసన్ రాసిన ‘స్పెక్టేటర్’ చదివి పానుగంటివారు ‘సాక్షి’ రాశారు. మోలియర్ నాటకాలు చదివి భమిడిపాటి, మొక్కపాటి నాటకాలు రాశారు. పిజి ఉడ్‌హౌస్ రచనలచే ప్రభావితులైన తెలుగు రచయితలలో పాలగుమ్మి పద్మరాజు గారి వద్దనుండి ఎందరో మహానుభావులు వున్నారు. జెరోమ్ కె జెరోమ్ రాసిన ‘త్రీ మెన్ యిన్ ఎ బోట్’ అనువాదం కూడా తెలుగులోకి వచ్చింది. ఆగ్డెన్ నాష్ రాసిన లిమరిక్స్ ప్రభావంతో శ్రీశ్రీ, ఆరుద్ర హాస్యపద్యాలు రాశారు. పంచ్ ప్రభావంతో కార్టూన్ కళ రూపు దిద్దుకుంది.
కందుకూరి తర్వాత చెప్పుకోవలసినది చిలకమర్తివారిని. ‘గయోపాఖ్యానము’ వంటి పద్యనాటకాలు, ‘రామచంద్ర విజయము’ వంటి నవలలు రాసిన యీ కవీశ్వరుడు ప్రహ సనాలు కూడా రాశారు. సంఘసంస్కరణ అనలేం కానీ, సమాజం లో వున్న అవకతవకలను ఎత్తి చూపడానికి వీటిని బాగా వాడు కున్నారు. అంతేకాదు, ప్రత్యేకంగా జోక్స్‌బుక్స్ రాశారు. అవి వినోదములు, నవ్వులగని. ప్యారడీలో ఆయన సిద్ధహస్తుడు. భగవద్గీతకు ప్యారడీ గా కలిగీత అని రాశారు. అయితే చిలకమర్తి పేరు చెప్పగానే గుర్తుకు వచ్చేది ‘గణపతి’. రేడియో నాటికగా బాగా ప్రచారం పొందిన గణపతి నవలగా అక్కడక్కడ శ్రుతి మించినా, మొత్తం మీద నవ్వు తెప్పించే రచన.
ఇక పానుగంటి వారి వద్దకు వస్తే ఆయన ‘సాక్షి’ వ్యాసాల ద్వారా సుప్రసిద్ధులు. ఆయన వచనంలో మంచి అందం వుంది. జంఘాలశాస్త్రి పాత్ర ద్వారా ఆయన సంఘంలోని అనేక అవ లక్షణాలను తూర్పారబట్టారు. ఆయన ‘కంఠాభరణం’ పూర్తి హాస్యనాటకం కాగా, ‘విప్రనారాయణ’లో శ్రీనివాసుడు, దేవదేవి మధ్య సంభాషణ అతి చమత్కారంగా వుంటుంది. దాన్నే ‘విప్ర నారాయణ’ సినిమాలో రేలంగి, భానుమతి మధ్య వుపయోగించుకున్నారు.
జంఘాలశాస్త్రిలాగానే తెలుగులో నిల్చిపోయిన హాస్య పాత్రలు కొన్ని వున్నాయి. వాటిలో మిసెస్ వటీరావు ఒకటి. ఆ పాత్ర సృష్టికర్త బాలవాజ్ఞ్మయబ్రహ్మ చింతా దీక్షితులు. అప్పట్లో ఆధునిక పోకడలు పోతున్న స్త్రీలకు ప్రతినిథిగా తయారైన పాత్ర. ఆవిడకు విరుద్ధంగా సంసార స్త్రీగా వుంటూ మొగుడికి వాతలు పెట్టగల దిట్ట- కాంతం! ‘కాంతం కథలు’ రాసిన మునిమాణిక్యం వారు అప్పులు చేయడం గురించి, హాస్యం యొక్క లక్షణాల గురించి అనేక వ్యాసాలు రాశారు. ఆయన యిచ్చిన నిర్వచనాలు మచ్చుకు రెండు, మూడు-
అప్పు పుచ్చుకునేవాడు- ఏదో నీకొచ్చే దాంతోనే తన సంసారం కూడా గడవాలని చూసేవాడు,
విసుగుపుట్టించే సంభాషణ- నీవు నిన్ను గురించి మాట్లా డాలని అనుకుంటూ వుంటే అవతలివాడు తన గురించి మాట్లాడడం,
గ్రంథకర్త- సమకాలికులను, స్నేహితులను విసిగించ డంతో తృప్తిపడక ముందుతరాలవారిని కూడా ఏడ్పించడానికి ప్రయత్నించేవాడు.
కాంతం లాగానే తెలుగునాట నిలిచిపోయిన మరోపాత్ర ‘బారిస్టర్ పార్వతీశం’. లండన్ వెళ్ళి బారిస్టర్ చదువుదామని వుబ లాటపడిన ఓ పల్లెటూరి యువకుడి గాథ. సున్నితమైన హాస్యం అంటే ఏమిటో దీని ద్వారా రుచి చూపించిన మొక్కపాటి వారు యిది కాక యింకా కొన్ని హాస్యరచనలు కూడా చేశారు.
ఇంతమంది వున్నా ‘హాస్యబ్రహ్మ’ బిరుదు పొందినవారు భమిడిపాటివారు. ఆయన గురించి ముళ్ళపూడివారు అంటారు- ‘‘కామేశ్వరరావుగారు ఆంధ్రుడి విశ్వరూపాన్ని దర్శించగలిగారు. జాతి వికాసానికి కూడని లక్షణాలను గర్హించారు. అవి ఉన్నం దుకు ‘అన్నన్నా’ అని బాధపడి, లేచి, ‘హన్నా’ అని కోప్పడి, ‘నాన్నా’ అని లాలించారు. ఎబ్బెబ్బే అని హేళన చేశారు. తన జాతిపట్ల తనకు గల ఆపేక్షకీ, ప్రేమకీ, గౌరవానికీ, గర్వానికీ, లజ్జకీ, దాని కోసం ఆయన పడ్డ బాధకీ ఆయన రచనలన్నీ అక్షరానువాదులు. మాట విలువ తెలుసుకుని దానిమీద అధికారం కోసం నిత్యం తపస్సు చేసిన వ్యక్తి ఆయన.’’
మన తెలుగువాళ్ళ గురించి భమిడిపాటి అంటారు- ‘‘మన లిపిలోనే మన అనైక్యత తెలుస్తుంది. క-చ-ట-త-ప ఈ అక్షరాలు చూడండి. విడివిడిగా దేని తలకట్టు దానిదే. హిందీలో అయితే ఈ అక్షరాలకు పైన ఓ గీత పెట్టి కలుపుతారు. మనం? అబ్బే! కచట తపల గాళ్ళం. మన అక్షరాల్లాగా ఎవడి పిలక వాడిదే. ఇంకోడితో కలిసే ప్రసక్తే లేదు.’’
భానుమతిగారి అత్తగారు కూడా తెలుగు సాహిత్యంలో నిలిచిపోయిన హాస్యపాత్ర. ఆ అత్తగారి చాదస్తం మనను నవ్విస్తుంది. సుతారమైన హాస్యం గిలిగింతలు పెడుతుంది.
అత్తగారిలాగే నిలిచిపోయిన పాత్రలు కొన్ని వున్నాయి- ‘బుడుగు’, ’రాధాగోపాలం’ ‘అప్పారావు.’ వీటిని సృష్టించిన వారు ముళ్ళపూడి వెంకటరమణ. ఆధునిక యుగంలో హాస్యరచయిత గా ముళ్ళపూడికి వున్న స్థానం వేరెవరికీ లేదనడంలో అతిశయోక్తి లేదు. ఆయన కథారచనా వ్యాసంగం పట్టుమని పదేళ్ళు కూడా సాగక పోయినా, హాస్యంలోని అన్ని ప్రయోగాలనీ చేసేసి ఓ రెండు తరాల రచయితలకు ‘ఐకాన్’ అయిపోయారు. తెలుగు పలుకుబడికి, ఆహ్లాదకరమైన హాస్యానికి చిరునామా అయిపో యారు. ఋణానంద లహరి, రాజకీయ బేతాళ పంచవింశతిక, విక్రమార్కుడి మార్కు సింహాసనం కథలు- యిలా రకరకాల రంగాలపై రాయడంతో బాటు గురజాడవారి ‘గిరీశం’కు పునః ప్రాణప్రతిష్ట చేసి అతని చేత సినిమారంగంపై ‘లెక్చర్లు’ యిప్పిం చారు. తెలుగుబాలుడు వున్నంత కాలం ‘బుడుగు’ వుంటాడు.
ముళ్ళపూడి సమకాలికులైన రావి కొండలరావుగారు అనేక హాస్యవ్యాసాలు, హాస్యనాటికలు రాయడంతో బాటు ‘(సి)నీతి చంద్రిక’ అనే హాస్యనవల కూడా రాశారు. అది యీరోజు ఆవిష్క రించబడబోతోంది. వీళ్ళకు సీనియర్ అయిన పాలగుమ్మి పద్మ రాజుగారు సీరియస్ రైటర్‌గా సుప్రసిద్ధులైనా ఉడ్‌హౌస్ తరహా నవల ‘బ్రతికిన కాలేజీ’, పొలిటికల్ సెటైర్ ‘రెండవ అశోకుడి మూణ్నాళ్ళ పాలన’ రాశారు. పురాణం సుబ్రహ్మణ్యశర్మగారు తన ‘ఇల్లాలి ముచ్చట్ల’ ద్వారా హాస్యరచనలో తన స్థానం సుస్థిరం చేసుకున్నారు. అలాగే ‘తంబింప్రెషన్’ రాసిన డాక్టర్ ‘తంబు’ కూడా..
కథను అవలీలగా, అలవోకగా చెప్పడంలో సిద్ధహస్తులైన భరాగో, అవసరాల రామకృష్ణారావుగార్లు రాసిన అనేక కథల్లో హాస్య కథలు కూడా వున్నాయి. ‘పన్’ చేయడంలో వారికి వారే సాటి. జర్న లిస్టుగా పేరుపొందిన నండూరి పార్థసారథిగారు ‘రాంబాబు డైరీ’ ద్వారా రాంబాబు అనే పాత్రను తెలుగు సాహిత్యానికి అందించారు. బళ్ళకొద్దీ సాహిత్యాన్ని తయారుచేసే వారిపై సెటైర్‌గా ‘సాహిత్య హింసావలోకనం’ రాశారు. రావిశాస్త్రి, బీనాదేవి సాంఘిక ప్రయోజనం కోసం కలం పట్టినా వారి రచనల్లో ఆసాంతం హాస్యం చిప్పిల్లు తూంటుంది. వివిధరకాల రచనల ద్వారా మంచి కమ్మర్షియల్ రైటర్‌గా పేరు తెచ్చుకున్న మల్లాది వెంకటకృష్ణమూర్తి హాస్య రచయితగా కూడా సుప్రసిద్ధులు.
దాసు వామనరావు, పుచ్చా పూర్ణానందం, గో(పా)ల చక్రవర్తి, పన్నాల సుబ్రహ్మణ్య భట్టు- యిలా ఎందరో హాస్య రచయితలు రేడియో ద్వారా, పత్రికలలో కాలమ్స్ ద్వారా హాస్యాన్ని పంచారు.
తెలుగులో యింటిలిజెంట్ హ్యూమర్ రాసిన వారిలో ప్రముఖంగా చెప్పుకోవలసినది కవనశర్మగారిని. సైంటిస్టుల గురించి, వాళ్ళ థీసిస్‌ల గురించి, గైడ్‌లతో వాళ్ళు పడే కష్టాల గురించి ఆయన కాశీమజిలీ కథల మోడల్లో అమెరికా మజిలీ కథలు, కాన్ఫరెన్సులను వెక్కిరిస్తూ ‘కాన్ఫరెన్సు తిరునాళ్ళ కథలు’ రాశారు. ఎక్స్‌పర్ట్‌స్ పేరుతో జరిగే మోసాలను బయటపెడుతూ ‘నిపుణుల కథలు’ రాశారు. ఈ కథల్లో వాటికి తగిన భాష కూడా వుపయోగించారు.
‘ఆమె తలకి రాసుకున్న మందారతైలం సర్ఫేస్ టెన్షన్‌కి లొంగక ఒకటో రెండో పలితకేశాలు తమ వ్యక్తిత్వం నిలబెట్టుకుంటూ నిలబడి వున్నాయి.’
‘నాకు పెళ్ళి చేసుకోవాలసిన అగత్యం లేదు. ఫ్రీ మాలిక్యూల్‌ని.’
‘అర్ధాంగుల ఆర్థికసూత్రాలు’ అంటూ రాసినప్పుడు కూడా యిలాటి ఉపమానాలు యిచ్చారు.
‘ఆడవాళ్ళకు పుట్టింటి వారిచ్చిన సొమ్ము తరగదు. అది రసాయనిక చర్యలో కెటలిస్టు లాటిది. క్రయం వలన ఖర్చు కాదు.’
‘ముందుగా ఆలోచించి పెట్టుకున్న నిర్ణయాన్ని అమలు చేసేవాడు ‘రేషనలిస్టు’, ముందస్తుగా పని చేసేసి తరువాత అది ఎంత సబబో ఆలోచించి చెప్పేవాడు ‘రేషనలైజేషనిస్టు’. మా ఆవిడ రెండోరకం మనిషి.’
కవనశర్మలాగే యింటెలిజెంట్‌గా రాసే మరో హాస్య రచయిత లేళ్ళపల్లి. ఈయన రాసిన ‘ఉద్యోగపర్వాలు’ నిరు ద్యోగుల, చిరుద్యోగుల బాధలను సరదాగా చూపుతుంది. యర్రంశెట్టి శాయిగారిది మరో రకం హ్యూమర్. అందరికీ అందే శాయిగారు విస్తారంగా రాశారు. నవ్వులు పంచారు.
‘మిట్టూరోడి కథలు’, ‘సినబ్బ కథలు’ రాసిన నామిని సుబ్రహ్మణ్యం నాయుడు హాస్యరచయితనని చెప్పుకోకపోయినా ఆయన రచనల్లో ఆసాంతం హాస్యం చిప్పిల్లుతూంటుంది. ఎంతటి బాధాకరమైన విషయాన్నయినా ఆయన సరదాగా చెప్పగలడు.
ఆయన బాటలో ‘దర్గామిట్ట కథలు’ రాసిన ఖదీర్‌బాబు కూడా కష్టాలకు హాస్యపుపూత అందించిన సమర్థుడైన రచయిత. మామూలు పరిస్థితుల్లోంచే హాస్యాన్ని పుట్టించగలిగిన దిట్ట పొత్తూరి విజయలక్ష్మి. ఈవిడ రాసిన నవలనే ‘శ్రీవారికి ప్రేమలేఖ’ గా తీశారు జంధ్యాల.
ప్యారడీ ఒక ప్రత్యేకమైన, క్లిష్టమైన కళ. ఒరిజినల్‌ను గుర్తుకు తెస్తూ, దానిలోని అవలక్షణాన్ని లేదా పునరుక్తి దోషాన్ని హైలైట్ చేసి వెక్కిరించడం. దానికి పాండిత్యం వుండాలి, ప్రత్యేకమైన దృష్టి వుండాలి.
తెలుగులో ప్యారడీ అనగానే జరుక్‌శాస్త్రి గుర్తుకు వస్తారు. శ్రీశ్రీ, ‘నేను సైతం ప్రపంచాగ్నికి సమిధ నొక్కటి ధారపోశాను,’ అంటే యీయన, ‘నేను సైతం కిళ్ళీ కొట్లో పాతబాకీ లెగర గొట్టాను,’ అని ప్యారడీ చేశాడు. కృష్ణశాస్త్రి, ‘కన్నీటి కెరటాల వెన్నెలేలా?’ అని రాస్తే యీయన, ‘వంకాయ తొడిమలో వంక రేలా…?’ అని వెక్కిరించాడు.
తర్వాతి కాలంలో ప్యారడీకి అంత ప్రాచుర్యాన్ని తెచ్చింది శ్రీరమణ. ఆయన రాసిన ఓ కథలో రైల్లో రచయితలు అందరూ వెళుతున్నారట. టిక్కెట్ కలక్టర్ వచ్చి విశ్వనాథవారిని టిక్కెట్టు అడిగాడట. దానికి యీయన, ‘అల నన్నయకులేదు, తిక్కనలకు లేదు,’ అనే పద్యం ఎత్తుకున్నాడట. ఒరిజినల్ పద్యం తెలుసుగా? నా వంటి శిష్యుడు వుండే భాగ్యం చెళ్ళపిళ్ళవారికి తప్ప నన్నయకు లేదు, తిక్కనకు లేదు అంటూ విశ్వనాథ చెప్పిన పద్యం అది. శ్రీరమణ ప్యారడీలే కాదు, హాస్యజ్యోతి పేర ఎన్నో జోక్స్ సంకలనం చేశారు, రంగులరాట్నం, శ్రీ ఛానెల్ పేర కాలమ్స్ రాశారు. హాస్య కథలు రాశారు.
ఆలోచనలు రేకెత్తించేలా రాయగల హాస్యరచయితల్లో సర్రాజు ప్రసన్నకుమార్, సోమరాజు సుశీల, తోలేటి జగన్మోహన రావులను చెప్పుకోవాలి. ఇంకా అనేకమంది హాస్యరచయితలు సమయానికి గుర్తుకు రాకపోతే యీ రచయిత క్షంతవ్యుడు.
ఇలా చూస్తే మామూలు రచయితల్లో హాస్యరచయితలు ఎంత ఫ్రాక్షనో అనిపిస్తోంది కదా! ఇక్కడ ఒక చిన్న ఉదంతం చెప్తాను. విన్నారు కదా, మామూలు రచయితల్లో వీళ్ళెంత శాతమో అర్థమైంది కదా! అల్లు అరవింద్ మా మిత్రుడు శాంతా బయోటెక్నిక్స్ వరప్రసాద్‌కి క్లాస్‌మేట్. ఓ పార్టీలో నన్ను పరిచయం చేస్తూ, ‘మా ఫ్రెండు’ అన్నాడు, కాస్త ఆగి కళ్ళెగరేస్తూ ‘రాజమండ్రి…’ అన్నాడు, ఎఫెక్ట్‌కోసం ఇంకాస్త గ్యాప్ యిచ్చి ‘మొక్కపాటివారు తెలుసా?’ అన్నాడు. అరవింద్ ఓహో, ఓహో అంటున్నారు. ఇన్ని చెప్పాడు కానీ నా హోదా చెప్పడేమిట్రా అని నా బాధ. ‘స్టేటు బ్యాంక్ గ్రూప్‌లో ఆఫీసరని చెప్పు స్వామీ,’ అన్నాను. ఈయన ధోరణిలో యీయన, ‘నాకు వద్దయ్యా ఎక్కవుంట్లు అవీ… బోరు, హాస్యం అంటే హాయిగా వుంటుంది,’ అన్నాడు. అరవింద్, ‘ప్రసాద్‌గారూ, ఓ మాట చెప్తాను. బ్యాంకు ఆఫీసరు అనిపించు కోవడం కంటె హాస్య రచయిత అనిపించుకోవడం గర్వకారణం. మనకు బ్యాంకు ఆఫీసర్లకు కొదవలేదు. 7 కోట్ల జనాభా వున్న మన రాష్ట్రం మొత్తంమీద పట్టుమని పదిమంది హాస్య రచయితలు లేరు,’ అన్నాడు.
నిజమేస్మీ అనిపించింది. ఆ తర్వాత వరప్రసాద్ పబ్లిషర్‌గా నేను మేనేజింగ్ ఎడిటర్‌గా ‘హాసం’ ప్రారంభించినపుడు అసలు కష్టం తెలిసింది. హాస్యరచయితలకు ఎంత కరువుందో! ఒకాయన రాసిన పద్యం గుర్తుకు వచ్చింది.
కరుణరసం కావాలా? గ్లాసులతో పోసుకో
బీభత్సం కావాలా? బిందెలతో పోసుకో
భయానకం కొరత లేదు- బ్రతుకంతా అదేగా
హాస్యరసం కావాలా? చెంచాతో వేసుకో!
ఎందుకంటే హాస్యరసానికి కరువుంది, హాస్యరచయిత లకు కరువుంది. భారత జనాభాలో ప్రతి 1600 మందికి ఒక్కరే డాక్టర్ ఉన్నారు, కానీ యింకా బోల్డుమంది వుండాలి, జాగ్రత్త అని ప్రపంచ ఆరోగ్యసంస్థ హెచ్చరిస్తూ వుంటుంది. హాస్య రచయితలకు కూడా కరువు మరీ తీవ్రంగా వుంది జాగ్రత్త అని మనకు మనం హెచ్చరించుకోవాలి. ఎందుకంటే మనకు చాలి నంతమంది హాస్య రచయితలుంటే డాక్టర్ల అనావృష్టిని సులభం గా ఎదుర్కోగలం. సంతోషం సగం బలం అన్నారు పెద్దలు. హాస్యం మనకు రోగ నిరోధక శక్తి నిస్తుంది. డాక్టర్ల వద్దకు వెళ్ళే అవసరమే పడదు.
చాలినంతమంది హాస్యరచయితలు పుట్టుకు రావాలంటే మనం వాళ్ళను గౌరవించాలి. హాస్యం రాయడానికి కూడా మేధస్సు కావాలని ఒప్పుకుని వాళ్ళను మన్నించాలి, అవార్డులు, రివార్డులు యివ్వాలి. అప్పుడే మేధావులు యిటు మళ్ళుతారు. లేకపోతే యిదిగో యిప్పుడున్న పరిస్థితిలోనే టెన్షన్లతో, డిప్రెషన్లతో మనం నిత్యం సమరం చేస్తూ బతుకు యీడ్చవలసినదే!