[ఈ వ్యాసంలో వేరువేరు చిత్రకారులు స్త్రీని వెలయాలిగా, ప్రేయసిగా, భార్యగా, పనికత్తెగా, స్వత్రంత్రవ్యక్తిగా, భయగ్రస్తగా, రోగిగా, మనసు క్రుంగిన వ్యక్తిగా, భ్రష్టురాలిగా, పరిశుద్ధగా, అసాంప్రదాయక బొహీమియన్‌గా — ఇంకా రకరకాలుగా, చిత్రించిన చిత్రాలని గురించి ముచ్చటించాను. ఈ ముచ్చట పైన చెప్పిన వరుస క్రమంలో చెయ్యలేదు సరిగదా కాలక్రమానుసారంగా కూడా చెయ్యలేదు. కొన్ని దిగంబర స్త్రీ చిత్రాలు విధిగా పరిశీలించడం అవసరమయ్యింది. అలాగే కొన్ని ప్రసిద్ధ చిత్రాలలో స్త్రీ ని హింసాత్మకంగా చిత్రించడం అవసరమా? అనే వాదన కూడా చేశాను.
మరొక్క విషయం. ఇందులో నా అభిప్రాయాలకి ఆధారం: చిత్రకళపై గత పాతిక సంవత్సరాలలో నేను చదివిన విమర్శ వ్యాసాలు, పుస్తకాలలో విషయాలు, నా మనసులో జ్ఞాపకాలుగా మిగిలినవి. మరి కొన్ని అభిప్రాయాలు, విమర్శలు చదివిన తరువాత, పేరు మోసిన చిత్రాలని మ్యూజియములలో స్వయంగా చూసిన తరువాత, కొద్దిమంది చిత్రకళాధ్యాపకుల, విమర్శకుల ఉపన్యాసాలు విన్న తరువాత ఏర్పడినవి. ఆఖరిగా ఈ బొమ్మ నచ్చింది, ఆ బొమ్మ నచ్చలేదు అని చెప్పడం ఎవరికైనా తేలికే. ఎందుకు నచ్చింది, ఎందుకు నచ్చలేదు అని ఎవరైనా నిలదీస్తే వచ్చే సమాధానం నిష్పాక్షికంగా ఉండదు. నా విషయంలోనూ అంతే. నా వ్యాఖ్యానాల విషయంలోనూ అంతే. ముఖ్యంగా కొన్ని చిత్రాలు — యూరోపియన్ పద్ధతిలో స్త్రీరూప ఆకృతికి నైరూప్యతని మిళితం చేసి గీసిన చిత్రాలు — వీటిపై నా అభిప్రాయాలు కొన్ని ఇప్పుడు వివాదగ్రస్తంగా కనిపించవచ్చు. వివాదగ్రస్తమైన పాక్షికాభిప్రాయాలకి పూర్తి బాధ్యత నాదే. – వేవేరా.]
అన్‌టైటిల్డ్ – ఎస్.వి.రామారావు (2012)
చిత్రకళ చరిత్రలో వేర్వేరు చిత్రకారులు వేసిన స్త్రీ చిత్రాల గురించి, తోడుగా సాంఘికంగా స్త్రీకిచ్చిన స్థానం గురించి చర్చించడం ఏ కాలంలో నైనా ఆకర్షణీయమయిన విషయం. ప్రస్తుతం కాలంలో ఈ చర్చ సందర్భోచితం, ముఖ్యం కూడాను. కారణం: ప్రపంచ వ్యాప్తంగా, ముఖ్యంగా పాశ్చాత్య దేశాలలో సామాజిక సమానతపై, హక్కులపై, లైంగిక స్వాతంత్ర్యంపై, స్త్రీవాద సాహిత్యం ముమ్మరంగా వచ్చింది. ఇంకా వస్తూనే వున్నది. అయితే, దృశ్యపరంగా స్తీలపై సమాజానికున్న అవగాహన, సాహిత్యం ద్వారా గ్రహించలేం. ఎంత జాగ్రత్తగా పరిశోధించి రాసినా, ఒక వ్యక్తిగా, లేదా సాధారణ సామూహిక చిహ్నంగా, స్త్రీ పై సమాజానికున్న ధోరణి అసంపూర్తిగానే బోధపడుతుంది. వరుసగా స్త్రీరూప చిత్రాలు పరిశీలిస్తే వివిధ దృష్టికోణాలు, వైఖరులను చిత్రకళ ప్రదర్శించినట్టుగా సాహిత్యం ప్రదర్శించలేదు. అందుచేత, ఆధునిక చిత్రకళలో స్త్రీ మూర్తిని విశదీకరించిన విధానం విచారించడం వలన మన దృక్పథంలో మార్పు రావచ్చు. మాటవరసకి మార్పు రాదనుకుందాం; కనీస పక్షంగా, ఇంతకు ముందు మనకు స్థిరపడ్డ అభిప్రాయలతో పోల్చి చూడటానికి కావలసిన ‘కొత్త’ విషయాలు తెలుస్తాయి.
ఈ సందర్భంలో విచారించవలసిన మరొక విషయం: పరిశీలించవలసిన చిత్రాలు, ప్రతిమలూ కోకొల్లలు. అందుకని, ఆధునిక చిత్రకళలో బొమ్మలనే ప్రస్తావించు దామనుకుంటున్నాను. ఆధునిక అనగానే, సాధారణంగా కొత్తదనం, వైరుధ్యం, ప్రదర్శించిన చిత్రకళే అన్న అభిప్రాయం విమర్శకులలో పాతుకొని పోయి ఉన్నది. ఈ వైఖరి అవ్యక్తమైనదని నిరాఘాటంగా చెప్పవచ్చు. ఎందుకంటే, ఏ కాలంలో వచ్చిన కొత్త బొమ్మలు ఆ కాలానికి ‘ఆధునిక’ చిత్రాలే! అంతే కాదు. ఒక ప్రత్యేక చిత్రకళా పద్ధతి అప్పటి సమాజానికి నూతన విషయాలు చూపగలిగితే, అప్పటి సమాజం ఆ కొత్తదనాన్ని ఆస్వాదించి ఆమోదించ గలిగితే, ఆ చిత్రకళ ఆధునికమని ఒప్పుకోవచ్చు.
మడొనా అండ్ ఛైల్డ్ – ఎప్‌స్టీన్(1950-52)
ఏది ఏమయినా, వివాదాలలోకి పోకుండా, గత రెండు శతాబ్దాలలో ప్రసిద్ధ చిత్రకారులు వేసిన స్త్రీ చిత్రాలని ఎంచుకొని, వాటిని గురించి చర్చిస్తాను. ఇక్కడ ప్రసిద్ధ చిత్రకారులు అని ఎందుకన్నానంటే, 1. వీళ్ళు వేసిన చిత్రాలు చూడటానికి తేలికగా లభిస్తాయి, 2. ఈ చిత్రాల చిత్రణ వెనుక ఉన్న కథ, వాటికి అనువైన మద్దతు, మ్యూజియములు, చిత్రకళా విమర్శకులు, చిత్రకళా పోషకులు మనకు తెలియపరచబట్టి. అందుచేత, ఆ చిత్రాలు మాత్రమే గొప్పవీ, విశ్లేషించదగినవీ అన్న అభిప్రాయాన్ని నేను సమర్థించటం లేదు. చిత్రకారులు మగవారు కావచ్చు; ఆడవారు కావచ్చు. ఈ లింగభేదం అప్రస్తుతం కాదు కాని, ప్రధానం కూడా కాదు. ముఖ్యంగా చూడవలసిన విషయం: ఫలానా చిత్రం స్త్రీ పరంగా ఏ విధమైన ప్రతిపాదన(లు) చేసింది? స్త్రీ పరంగా ఏ విధమైన వివరణ(లు) చేసింది? ఈ రెండూ ఈ వ్యాసానికి ముఖ్య అంశాలు.
లింగభేద సమస్య, సమస్య కాదనడానికి ఉదాహరణగా పికాసో (Pablo Picasso, 1881-1973) గీసిన Girl Before A Mirror (1932) చిత్రం చూద్దాం. ఈ చిత్రం పురుషులే చూడదగిన చిత్రం కాదు. గొప్ప చిత్రకారులు స్త్రీ అంతర్గత వ్యక్తిత్వాన్ని చిత్రంలో చిక్కబట్టి చూపగలరు. ఈ చిత్రాన్ని గురించి మరొకచోట చర్చించుతాను. ఇందుకు ప్రతిగా కొందరు పురుష చిత్రకారులు ఎంత ప్రయత్నించినా స్త్రీ అంతర్గత వ్యక్తిత్వాన్ని బొమ్మలో చూపలేరు. అల్లాగే, మరికొందరు స్త్రీ చిత్రకారులు పురుషుని అంతర్గత వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకొని బొమ్మలో ఇమడ్చలేరు. ఇటువంటి చిత్రాలు ఉన్నాయి; అవి చిత్రాలుగా గమనించదగ్గవి కావు, అని నా అభిప్రాయం.
ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఆధునిక చిత్రాలు చారిత్రిక ప్రతీకల నుండి వేరుచేసి బోధ పరచుకొనేవి కావు. మానవుని ఊహ, భావన, కల్పన, ఎన్నో కల్పాల గుర్తులని, జ్ఞాపకాలనీ ప్రతిబింబించుతుంది. అందుకనే కాబోలు, ఇప్పటికీ వీనస్ (Venus of Willendorf c. 15,000-10,000 B.C) శిల్పంలో స్త్రీ మూర్తిత్వాన్ని, కాదు! స్త్రీత్వాన్ని మనిషి చూడగలుగుతున్నాడు.
భౌతిక మానవవిజ్ఞాన శాస్త్రం (physical anthropology) లైంగిక పరంగా సృష్టిలో స్త్రీ పురుషుల రెండు ఆకారాల (dimorphism) మధ్య విభేదాలను స్పష్టపరుస్తుంది. అందుకనే కాబోలు, ఏ మ్యూజియంలోనైనా చూడండి: ముఖ్యంగా పాలరాతి శిలాప్రతిమలు చూడండి. పురుషులు దృఢంగా బలిసిన కండరాలతోను, కొట్టవచ్చే గడ్డం తోను (ఒక్కొక్క సారి వెండ్రుకల్తో నిండిన గడ్డం), స్త్రీ ప్రతిమలు — ముఖ్యంగా వారి ముఖకవళికలలో — ఎంతో సౌమ్యత, మెత్తదనం, చక్కని పొడుగాటి ముక్కు, వగైరాతో ఒకే రకంగా కనిపిస్తారు. అన్ని స్త్రీ ప్రతిమల్లోనూ ముఖాకారం కోడిగుడ్డులా ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే, ఏ విధమయిన భేదమూ, ఏ శిలా ప్రతిమ లోనైనా సరే, ఎంత వెతికినా కూడా కనిపించదు. ఇంకా విపులంగా చెప్పాలంటే, ప్రతి కోడిపెట్టకీ అన్ని కోడిగుడ్లూ ఒకేలా కనపడినట్లు! మనిషిని చూసి అదేరకంగా చిత్రాలు గీసేవారి (portrait painters) చిత్రాలలో, శిలాప్రతిమలు తయారు చేసేవారి ప్రతిమలలో కూడా, స్త్రీ మూర్తిమత్వ విశిష్టత పూర్తిగా లోపిస్తుంది. అందరినీ ఒకే రకంగా చిత్రించడం చేత, వ్యక్తిత్వం మరుగున పడిపోతుందని చెప్పడం ఆశ్చర్యకరమైన విషయం కాదు. చూడండి: మోనా లీసా చిత్రంలో, ఆ పెదాలపై చిరునవ్వు మీద వందలకొద్దీ పేజీల విమర్శనా సాహిత్యం దొరుకుతుంది. అంటే అసలు అర్థం: బొమ్మలో స్త్రీమూర్తిమత్వ విశిష్టత లోపించబట్టే విమర్శకులు పురాణాలు రాశారని అనవచ్చు.
ఇది పూర్వకథ.
పంతొమ్మిదవ శతాబ్దం, ఇరవయ్యవ శతాబ్దాల చిత్రకళ చరిత్రలో మార్పులు చోటు చేసుకున్నాయి. స్త్రీ మూర్తి చిత్రవర్ణన పరిధి పెరిగింది. స్త్రీ కున్న ప్రత్యేక లక్షణాలని నిరూపణ చెయ్యటానికి ఆస్కారం లభించింది. కేవలం భౌతిక లక్షణాలే కాకుండా ఇతర వ్యక్తిగత లక్షణాలని చిత్రించే సభ్యత, స్వాతంత్ర్యం చిత్రకారులకి కలిగింది. ఇందుకు కారణం చిత్రకారుడు భౌతిక మానవవిజ్ఞాన శాస్త్రం సృష్టించిన లైంగికభేదాలకి కట్టుబడి ఉండనవసరం లేకపోవడం. అంతే కాకుండా, సాహిత్యంలో పంతొమ్మిదవ శతాబ్దంలో వచ్చిన రొమాంటిసిజమ్, సింబాలిజమ్ వంటి విప్లవాలు వ్యక్తి అంతర్గత జీవితాన్ని మరింత శ్రద్ధగా పరిశీలించటానికి వెసులుబాటు కల్పించాయి.
ఇరవయ్యో శతాబ్దంలో చిత్రకారుడు స్త్రీ భౌతిక లక్షణాలని అణగదొక్కటం (suppression), ఒక్కొక్కసారి విస్తరించి చిత్రించటం (exaggeration), వక్రీకరించి, కొన్నిచోట్ల వికృతీకరించి (distortion) చిత్రించే ‘అధికారం’ చేజిక్కించుకొన్నాడు. స్త్రీ మానసిక తత్వాన్ని, మానసిక నైజాన్ని వివరించే చిత్రణ మొదలయ్యింది. అంతే కాదు. 1839లో ఫొటొగ్రఫీ బాగా పుంజుకున్నది. ఈ ప్రక్రియ, చిత్రకళకి అవసానదశ వచ్చిందనే భయాన్ని కలిగించింది. ఈ ఫొటోగ్రఫీ తెచ్చిపెట్టిన భయంతో, పాతకాలపు దృశ్యమాన స్వరూప చిత్రణ నుంచి విడిపడి చిత్రకళ ఒక విపరీత స్వేచ్చని కౌగలించుకుంది. చిత్రకారుడు, కంటికీ కేమెరా భూతద్దానికీ చిక్కని మానసిక నైజాలని కుంచె ద్వారా వివరించటానికి ఉద్యుక్తుడయ్యాడు. ఈ సందర్భంలో చిత్రకారుడు స్త్రీ ముఖచిత్రణలో వైపరీత్య పూరణకి పూనుకున్నాడు. అంతర్గత జీవన చిత్రణలో వికృతీకరణావశ్యకత అనివార్యమయ్యింది.
చిత్రకళలో ఆధునికత మిణుకు మిణుకుగా పదిహేడవ శతాబ్దంలోనే పొడచూపింది. రెంబ్రాంట్ (Rembrandt Van Rijn, 1606-69) నిజంగా ఆధునికుడు కాదు. అయినా, అతను వేసిన స్త్రీ చిత్రాలలో ఆధునికత చూచాయగా కనిపిస్తుంది. ఉదాహరణకి అతను చిత్రించిన Bathsheba (1654) చిత్రం చూడండి. సాధారణ స్త్రీ రూపం పైకి కనిపిస్తుంది. వైవాహిక పరంగా తప్పని పాతివ్రత్యం, అందుకు ప్రత్యామ్నాయంగా ఒక శక్తివంతమైన పరపురుషుని ఆకర్షణల మధ్య తీవ్రంగా ఆలోచన చేసే అసాధారణ వ్యక్తిత్వం ఈ చిత్రంలో సూచనగా కనిపిస్తుంది. బాత్‌షెబా ముఖంలో ముందేమి జరగబోతున్నదో తెలిసిన ఆందోళన కనిపిస్తున్నది. స్త్రీ మానసిక స్థితి, బైబిల్ కథనం వాక్యాల మధ్యలో ఇమిడి వున్న భావన,రెండూ చదివిన చిత్రకారుడు రెంబ్రాంట్ అన్న విషయం స్ఫురణకి రాక మానదు.
కాథే కోల్‌విట్జ్ (Kathe Kollwitz, 1865-1945) 1905లో చేసిన Nude లితోగ్రాఫ్ చూడండి. ఈమె, రెంబ్రాంట్ సంప్రదాయంలో చిత్రకళోపాసన చేసిన చిత్రకారిణి. ఈమె సామ్యవాది. ఈ చిత్రంలో స్త్రీ వివస్త్ర. ఈ చిత్రం, ఆర్థిక రిక్తత, సాంఘిక అన్యాయం, వ్యక్తపరిచే చిత్రం. వయసొచ్చిన స్త్రీ భౌతిక దేహాన్ని ధైర్యంగా చిత్రించింది. కాథే కోల్‌విట్జ్ అప్పటి కాలానికి విప్లవాత్మక చిత్రకారిణే అని ఒప్పుకోక తప్పదు. ఈమె చిత్రాలలో స్త్రీలు దయనీయమైన స్థితిలో వుంటారు. మొదటి ప్రపంచ యుద్ధం ఈమె మీద చూపిన ప్రభావం ఈ చిత్రాలలో స్పష్టంగా కనిపిస్తుంది. ఉమన్ విత్ డెడ్ ఛైల్డ్ (Woman with dead child, 1903) ఇందుకు ఒక మంచి ఉదాహరణ. కాథేకి పూర్తిగా విరుద్ధంగా విల్లెమ్ డె కూనింగ్ (Willem de Kooning), గత శతాబ్ద మధ్య భాగంలో తను వరుసగా చిత్రించిన స్త్రీ చిత్రాలలో స్త్రీ వ్యధ పూర్తిగా మరిచిపోయి, స్త్రీ పైన ద్వేషం, కోపం, చిత్రించాడు. కూనింగ్ గురించి, అతని చిత్రాల గురించి తరువాత పరిశీలిస్తాను.