హైవే 101 మీద బి.ఎం.డబ్ల్యూ కారు స్పీడ్ లిమిట్ దాటి వేగంగా డ్రైవ్ చేస్తున్నాడు ‘నెట్‌గురు’ కంపెనీ అధినేత జే.పీ. అసలు పేరు జయప్రకాశ్ అయినా జేపీ అనే అందరికీ చెబుతాడు. ఇంజనీరింగ్ చేసి అమెరికా వచ్చిన జేపీ, సాఫ్ట్‌వేర్ వ్యాపారవేత్త అవతారం దాల్చిన ఎంతోమంది భారతీయుల్లో తనూ ఒకడు. సిలికాన్ వేలీ ఫార్ట్యూన్ 500 కంపెనీల్లో అతనిదీ ఒకటి. ఇల్లు సమీపిస్తూండగా జేపీ ఫోన్ మ్రోగింది. ఒకచేత్తో స్టీరింగ్ మీద చేయ్యేసి మరో చేత్తో ఫోన్ తీసి, ‘‘హలో,’’ అన్నాడు.
‘‘హాయ్! స్టీవ్! హౌ డిడ్ ఇట్ గో?’’ అంటూ పలకరించాడు.
‘‘జేపీ! ఇప్పుడే గూగుల్‌కి వెళ్ళి మన కోట్ ఇచ్చి వచ్చాను. చాలామందే ఈ ప్రోజెక్ట్ కోసం ఎగబడుతున్నారు. సిస్కో, జునిపర్ వంటి పెద్ద కంపెనీలు కూడా ఉన్నాయి. అయినా మన ప్రోడక్ట్ క్వాలిటీ బావుందనీ వాళ్ళన్నారు. చూద్దాం మన లక్!…’’ ఆవలి నుంచి స్టీవ్ అంతా పూసగుచ్చినట్లు చెబుతున్నాడు.
అంతా శ్రద్ధగా విన్నాక కోపం చిర్రెత్తుకొచ్చింది జేపీకి. స్టీవ్, జే.పీ నెట్‌గురు కంపెనీ భాగస్వాములు.
‘‘ఈ పెద్ద కంపెనీలు ఏ ఒక్క ప్రోజెక్టూ వదిలిపెట్టవు. మొన్ననే సిస్కోకి 100 మిలియన్ టెండరు వచ్చిందికదా? ఈ ఎనిమిది మిలియన్ల చిన్న ప్రోజెక్ట్లు కూడా వదిలిపెట్టరా? ఛీ…!’’ అంటూ చికాగ్గా అన్నాడు.
మాటల్లో జేపీని అర్జంటుగా రమ్మనమని స్టీవ్ చెప్పాడు.
‘‘నో! నేను రాలేను. ఇంటికి ఫ్లోరింగ్ పనివాళ్ళు వస్తున్నారు. వెళ్ళి తీరాలి. రేపు మాట్లాడుకుందాం!’’
‘‘ఏంటి రెండు మిలియన్ల పెట్టి కొన్న కొత్త ఇంటికి ఏడాది తిరక్కుండా అప్పుడే రిపేర్లా?’’ స్టీవ్ నవ్వుతూ అడిగాడు.
‘‘మొన్న యూరోప్ టూర్‌కి వెళ్ళినప్పుడు, ఒక వాటర్ పైపు లీకయ్యింది. దాంతో ఇల్లంతా ఫ్లడింగ్ అయ్యి నీరొచ్చేసి వుడెన్ ఫ్లోరంతా పాడయ్యింది. ప్రస్తుతం టైల్స్ వేయిద్దామనుకుంటున్నాను. ఈ కాంట్రాక్టర్లతో సరిగ్గా మాట్లాడుకోకపోతే కష్టం. వెళ్ళి తీరాలి. వెళ్ళకపోతే మా ఆవిడ చంపేస్తుంది,’’ అంటూ చూసుకుందామని చెప్పి ఫోన్ పెట్టేసాడు.
ఇంటికొచ్చేసరికి నలుగురైదుగురు లాటినో పనివాళ్ళు కనిపించారు. వాళ్ళల్లో పొట్టిగా ఉన్న ఒకతను జేపీకి పరిచయం చేసుకున్నాడు.
కాస్త గోధుమరంగులో నల్లటిజుట్టుతో ఉన్నతను చూడగానే లాటినో అన్నట్లే ఉన్నాడు. అతని పేరు హోసే అని చెప్పి, పని మొదలు పెడతామనీ, హాల్లో ఉన్న మెట్లని కొట్టి మరలా కొత్తవి వెయ్యాలని చెప్పాడు. సరేనన్నాడు జేపీ.
‘‘పిల్లలిద్దరూ చంపుకు తినేస్తున్నారు. మీరు ఎలాగయినా ఆ ఐపాడ్ మినీ కొనండి. స్కూల్లో అందరికీ ఉందనీ పెద్దాడు ఒకటే గోల. వాణ్ణి చూసి మీ ముద్దుల కూతురూ మొదలు పెట్టింది. వీళ్ళ గోల భరించలేకుండా ఉన్నాను,’’ మేడ మీదకి రాగానే భార్య సుమ తన గోడు వెళ్ళబుచ్చుకుంది.
‘‘అయినా వేలెడు లేరు, వీళ్ళకి ఐపాడ్ ఎందుకట? ఒక్కొక్కటీ రెండొందల డాలర్లు? ఇవాళ మార్కెట్లోకి ఒకటి వస్తే, రేపు మరొకటొస్తుంది. మొన్ననే గేంబోయ్ కొన్నాను కదా?’’ చికాగ్గా అన్నాడు జేపీ.
స్కూల్లో తోటి పిల్లల వత్తిడి వల్ల వీళ్ళూ తన బుర్ర తింటున్నారని సుమ చెప్పింది.
‘‘రేపు థాంక్స్ గివింగ్‌కి వాల్మార్ట్ 140 డాలర్లకి సేల్ పెట్టాడని బాబీ చెప్పాడు. వంద డాలర్లు తగ్గినా తగ్గినట్లే!…’’ అంటూ ఏకబిగిన చెప్పుకుపోతోంది సుమ. థాంక్స్ గివింగ్ సేల్లో కొంటానని పిల్లల్ని సముదాయించమని చెప్పాడు. పిల్లల మాట దేవుడెరుగు సుమ మాత్రం హమ్మయ్య అనుకుంటూ ఊపిరి పీల్చుకుంది.
మొహం కడుక్కొచ్చి ఆఫీసు పని చేసుకుందామని లాప్ టాప్ తీశాడు జేపీ. క్రింద రేడియోలో పెద్దగా లాటినో పాటలు వినిపించడంతో చిర్రెత్తుకొచ్చింది జేపీకి. కాస్త వాల్యూం తగ్గించమని అడుగుదామని క్రిందకి వచ్చాడు. ఆ స్పానిష్ సంగీతం కట్టేయమని హోసేపై కోప్పడ్డాడు. అది చూసి హోసే చిన్నబుచ్చుకున్నాడు. వెళ్ళి రేడియో కట్టేశాడు. కొంతసేపటికి అక్కడ మెషీన్ హోరూ, పనిముట్ల చప్పుళ్ళూ ఎక్కువయ్యేసరికి ఆ స్పానిష్ పాటలే మెరుగనిపించింది జేపీకి. క్రిందకొచ్చి హోసేకి పాటలు పెట్టుకోమని చెప్పాడు. హోసే మొహంలో చిరునవ్వు తాండవించింది.
పిల్లలు స్కూల్ నుండి రాగానే థాంక్స్ గివింగ్ సేలుకి ఐపాడ్ మినీ కొంటానని చెప్పడంతో ఎగిరి గంతేశారు. వాల్‌మార్ట్ ఉదయం నాలిగింటికి తెరుస్తాడనీ, రాత్రి పదింటికల్లా వెళ్ళి క్యూలో నిలబడితేగానీ దొరకదనీ బాబీ తండ్రికి ముందుగానే చెప్పాడు. అమెరికాలో థాంక్స్ గివింగ్, క్రిస్‌మస్ పెద్ద పండగలు. వీటికి ప్రతీ కంపెనీ వస్తువులన్నీ చాలా తగ్గింపు ధరలో అమ్ముతాయి. జనాలు ఈ సేల్ కోసం బాగానే ఎగబడతారు. నెల్లాళ్ళ ముందుగానే కంపెనీలు వస్తువుల ప్రచారం మొదలుపెడతాయి. జేపీకి వీటి గురించి తెలుసు. గతంలో ఈ సేల్లో రాత్రి నిలబడి చాలానే ఎలక్ట్రానిక్ వస్తువులు కొన్నాడు.
వారం రోజులుగా ఇంట్లో పని జరుగుతోంది. పెద్ద డబ్బా లాంటి టూ-ఇన్-వన్తో ఉదయం ఎనిమిదికల్లా ప్రత్యక్షమవు తాడు హోసే.
వాళ్ళు పాటలు వింటూ పని చేసుకుంటారు. జేపీక్కూడా స్పానిష్ సంగీతం నచ్చుతోంది. వచ్చీ రానీ ఇంగ్లీషులో హోసే జేపీతో సంభాషిస్తాడు. అతనికి వాళ్ళ స్పానిష్ యాస ఒక్కోసారి అర్థంకాదు. మెల్లగా హోసేతో బాగానే పరిచయం అయ్యింది. హోసే మెక్సికో నుండి వచ్చాననీ, ఇక్కడ ఇలాంటి కాంట్రాక్ట్ వర్కు చేసుకు బ్రతుకుతున్నాననీ, తను స్పానిష్ పాటలంటే చెవి కోసు కుంటాననీ చెప్పాడు.
‘‘హోసే! ఇంత పెద్ద టేపు రికార్డర్ మోసుకోవడం ఎందుకు? సుబ్బరంగా ఐపాడ్ కొనుక్కోరాదూ?’’ అంటూ హోసేకి ఉచిత సలహా పారేసాడు జేపీ. హోసే కొడుకూ అది కొనమని గొడవ చేస్తున్నాడనీ, అది చాలా ఖరీదవడం వల్ల కొనలేనన్న తన అశక్తతని వెలిబుచ్చాడు. జేపీ వాల్‌మార్ట్ సేల్ గురించి చెప్పాడు. తనూ వెళ్ళి కొంటానని అన్నాడు హోసే!
చూస్తుండగా థాంక్స్ గివింగ్ వచ్చేసింది. నవంబరుకే చలి చంపేస్తోంది. జేపీ, సుమా పిల్లలతో కలిసి రాత్రి పదింటికల్లా వెళ్ళి వాల్ మార్ట్ క్యూలో నిలబడ్డారు. బాబీకయితే అదొక థ్రిల్. ఆకలేస్తే తినడానికి సుమ స్నాక్స్ పట్టుకొచ్చింది. జేపీ తన లాప్ టాప్‌తో పాటు చిన్న చెయిర్ కూడా తెచ్చుకున్నాడు. నవంబరు చలిలో ఆ క్యూలో నిలబడ్డారు. అక్కడ చాలామంది చైనీసు వాళ్ళూ, లాటినోలూ, ఇండియన్సూ కనిపించారు. అక్కడక్కడ నల్ల జాతీయులు కూడా కనిపించారు. క్యూ పెద్దదిగానే ఉంది. బాబీకి మాత్రం చాలా టెన్షన్‌గా ఉంది. తనకి ఐపాడ్ మిని దొరుకుతుందో లేదోనని. వీళ్ళ వెనక్కాలే ఒక లాటినో స్త్రీ వుంది. ఆమెతో పాటే ఇద్దరు పిల్లలూ ఉన్నారు. క్యూలో సుమా పిల్లలూ ఉన్నారు. జేపీ మాత్రం దూరంగా చెయిర్లో కూర్చుని ఆఫీసు పని చేసుకుంటున్నాడు. ఇహ పావుగంటలో వాల్‌మార్ట్ తలుపులు తెరుస్తారనగా జేపీ వచ్చి లైనులో నిల బడ్డాడు. అంతే ఆ స్పానిష్ స్త్రీ లైను మధ్యలో దూరుతున్నాడని జేపీతో గొడవ పెట్టుకుంది. మొత్తానికి జేపీ సర్ది చెప్పాడు. కానీ ఆ స్పానిష్ స్త్రీ మాత్రం గుర్రుగానే చూస్తోంది జేపీని.
వాల్‌మార్ట్ తలుపులు తెరవగానే బిలబిలమంటూ అందరూ పరిగెత్తారు. సుమా, జేపీ, పిల్లలూ ఎలక్ట్రానిక్స్ విభాగం వైపు పరిగెత్తారు. అక్కడ ఐపాడ్ మినీ కోసం జనం ఎగబడుతున్నారు. అక్కడున్న పెద్ద పెట్టెలో అందరూ తలొకటీ తీసుకుంటున్నారు. ఇహ మూడే మిగిలాయి. జేపీ, సుమా చెరొకటీ తీసు కున్నారు. ఇహ మిగిలిందాన్ని బాబీ, ఇంతకుముందు లైన్లో ఉన్న లాటినో పిల్లాడూ లాక్కోబోయారు. జేపీ ఆ పిల్లాణ్ణి పక్కకు తోసి ఆ ఐపాడ్ లాక్కొన్నాడు. ఆ పిల్లాడు క్రింద పడిపోయాడు. ఇంతలో తల్లి వచ్చి కోపంగా చూసి స్పానిష్‌లో గట్టిగా తిట్టింది జేపీని. ఆమె మాటలేం పట్టించేకోకుండా కౌంటరు వైపు నడిచాడు జేపీ.
మొత్తానికి విజయవంతంగా మూడు ఐపాడ్లు కొన్నాడు జేపీ — పిల్లలిద్దరికీ చెరొకటీ, ఇండియాలో ఉన్న బావమరిదికొకటీ.
ఆ మర్నాడు హోసే వచ్చినప్పుడు ఐపాడ్ చూపించాడు జేపీ. స్పీకర్ పెట్టి పాటలు వినిపించాడు. హోసే ఎంతో ఆశ్చర్యంగా చూశాడు.
తను కొనుక్కుందామనుకున్నాడు కానీ తనకి అంత స్థోమత లేదనీ చెప్పాడు. తను రోజుకి అయిదు డాలర్లు సేవ్ చేసి తన కొడుక్కి పుట్టిన రోజు కానుకగా కొనిస్తానని చెప్పాడు. ఓ నాలుగు రోజుల తరువాత హోసే ఫ్లోరింగ్ పని ముంగించేశాడు. తను స్పానిష్ పాటలు మిస్సవుతున్నానని వెళ్ళే ముందు జేపీ అంటే, తన వద్దున్న సంచీలోంచి ఒక స్పానిష్ పాటల సీడీ బయటకు తీశాడు హోసే.
‘‘తీసుకోండి. దిసీజ్ గిఫ్ట్!’’ స్పానిష్ యాసలో అంటూ జేపీ చేతిలో సీడీ పెట్టాడు.
గత మూడు వారాలుగా స్పానిష్ పాటలు చెవులకి పట్టే శాయి జేపీకి. కాదనకుండా తీసుకున్నాడు.
ఓ నాలుగు వారాల తరువాత ఇంట్లో మేడ మీద బాత్రూం పైపింగ్ పోయింది. సుమ ముందుగానే హెచ్చరించినా జేపీ అంతగా పట్టించుకోలేదు. ఓ రోజు ఆ పైపు కాస్తా లీకయ్యి, గదంతా నీరొచ్చేసింది. ఆఫీసు నుండి పరిగెత్తుకొచ్చాడు జేపీ. హోసేకి కాల్ చేశాడు, వెంటనే రమ్మనమని. ఆ సాయంత్రం హోసే వచ్చాడు. ఆ మర్నాడే వచ్చి రిపేరు చేస్తానని చెప్పి వెళ్ళిపోయాడు.
ఆ మర్నాడు ఉదయం హోసే వచ్చే వరకూ వర్కుకి వెళ్ళలేదు జేపీ. ఎనిమిదింటికల్లా వచ్చే హోసే తొమ్మిదయినా రాలేదు. జేపీకి పదింటికి మీటింగ్ ఉంది. సాధారణంగా టైముకి వచ్చే హోసే అరగంట ఆలస్యంగా వచ్చాడు. వస్తూనే సారీ చెబుతూ తన పనిముట్లని వ్యానులోంచి ఒక్కొక్కటే లోపల పెడుతున్నాడు. అతనితో మాట్లాడుదామనుకూంటూండగా స్టీవ్ నుండి జేపీకి ఫోనొచ్చింది.
‘‘జేపీ! బాడ్ న్యూస్! మనకి గూగుల్ ప్రోజెక్ట్ రాలేదు!’’
‘‘షిట్! గూగుల్ వాళ్ళు మనకే ఇస్తామని, కాంట్రాక్టు మనకేనని చెప్పారు! బెంచ్ మార్క్స్ అన్నీ మనకే అనుకూలంగా ఉన్నాయన్నారు కదా?’’ గట్టిగా కోపంతో అన్నాడు.
‘‘అవుననుకో! కానీ సిస్కో వాళ్ళు ఏం చెప్పారో తెలీదు. ఆ కాంట్రాక్ట్ సిస్కోకే వెళ్ళింది,’’ స్టీవ్ గొంతులో నిరాశ ధ్వనిం చింది.
‘‘ఛీ! ఈ పెద్ద కంపెనీలు చిన్న కంపెనీలని బ్రతనివ్వవు. మరీ చిన్న ప్రోజక్ట్స్‌కి కూడా కక్కూర్తి పడాలా?’’ అంటూ విసురుగా కారు వద్దకు పరిగెత్తాడు.
హోసే తన పనిముట్లని ఒక్కక్కటే లోపలికి తెస్తున్నాడు. అతని వెనుకే చేతిలో పనిముట్లతో ఒక స్పానిష్ స్త్రీ, ఒక చిన్న పిల్లాడు లోపలకి వస్తూ కనిపించారు. వాళ్ళని చూసేసరికి పరాగ్గా ఫోను మాట్లాడుతున్న జేపీ దృష్టి వాళ్ళ వైపు మళ్ళింది. ఎక్కడో చూసినట్లు గుర్తొచ్చింది, ముఖ్యంగా ఆ చిన్నపిల్లాణ్ణి.
చేతిలో టేపురికార్డరుతో ఆ పిల్లాడు లోపలికొచ్చాడు.
(శ్రీ గొర్తి సాయిబ్రహ్మానందం పుట్టింది, పెరిగింది కోనసీమ, అమలాపురంలో. చదువు ఆంధ్ర విశ్వవిద్యాలయం. భార్య లలిత, బిడ్డలు హర్ష, సుజయ్‌లతో కుపర్టినో, కాలిఫోర్నియాలో నివాసం. ఆటలు, సినిమాలు, వార్తాపత్రికలు వీరి ఇష్టమైన వ్యాపకాలు. సాహిత్యం, నృత్యం, సంగీతం అంటే ప్రేమ. పాతికకు పైగా కథలు, నాటకాలు రాశారు. సరిహద్దు కథల పుస్తకం ప్రచురించారు. త్యాగరాజు జీవితచరిత్ర గ్రంథస్థం చేశారు.)