అప్పా

హాలెండ్ చేపలా సన్నగా రివటలా ఉండే అమ్మి, బొద్దుగా బొద్దింకలా వున్న అప్పా ఆఫీసు గదిలోకి అడుగు పెడుతూనే చిన్నగా దగ్గింది. అమ్మి అలికిడికి అప్పా ఒళ్ళోంచి ఉలిక్కిపడి గెంతింది పనమ్మాయి. చటుక్కున కర్టెను వెనుక దూరింది.

అమ్మి చూసీ చూడనట్లే వచ్చింది. అప్పా బలహీనతలు అమ్మికి బాగా తెలుసు. నాగరికత కల భర్తకి లౌక్యం తెలిసిన ఇల్లాలు ఆమె. అర్థం చేసుకోగలదు.

“నా బుజ్జి గుమ్మడి పండూ,” వయ్యారంగా అప్పా ఒడిలో వాలుతూ – “చిన్న సలహా కావాలి మీది. ముందు పెదాలు తుడుచుకోండి. తడారిన పెదాలే ముద్దుకి ఇష్టం,” అంది.

చేతి చొక్కాతో మూతి తుడుచుకుంటూ కళ్ళు మిటకరించాడు అప్పా.

“ఏంటి? విషయం?”

“చెప్తాను అప్పా! …మన బుల్లోడి సంగతి ఏం చేద్దాం?”

“ఏమయ్యింది?”

“ఇంకా గ్రహించలేదా? దేవుడా! ఈ నాన్నలు ఎప్పుడూ ఇంతే! ఘోరాతి ఘోరం బుజ్జీ! చేతనయిన మొగుడుగా కాకపోయినా కనీసం బాధ్యతగల తండ్రిలా అయినా ప్రవర్తించలేరా?”

“మొదలెట్టావూ! విని విని విసుగొస్తోంది ఈ గోల!” చికాగ్గా విదిలించుకుంటూ క్రింద పడబోయాడు అప్పా.

“మీ మొగాళ్ళెప్పుడూ ఇంతే! మీరు నిజాలు భరించలేరు.”

“సూక్తి ముక్తావళి చెప్పడానికొచ్చావా? లేక బుల్లోడి గురించా?”

“అలాగే! ఆపేస్తా బుజ్జీ… మళ్ళా మన బుల్లోడు ఆ చెత్త ప్రోగ్రస్ రిపోర్టు మోసుకొచ్చాడు.”

“అయితే ఏంటట?”

“ఏంటా అంటూ అలా తీసి పారేస్తారా? ఇలా అయితే వాడు ఎంట్రన్స్ పరీక్షకి కూర్చోలేడు. వాణ్ణి నాలుగో తరగతి లోకి తీసుకోరు!”

“తీసుకోపోతే పోయారు! భూకంపాలు ఏం రావు. బుద్దిగా స్కూలు కెళ్ళి అక్కడ గొడవలు పెట్టుకోకుండా ఉంటే చాలు.”

“అలాక్కాదు బుజ్జీ! పదిహేనో పుట్టినరోజు మొన్ననే చేసుకున్నాడా, మనోడు? ఇన్నేళ్ళొచ్చినా ఇంకా మూడో క్లాసేనా? నమ్మగలరా మీరు? ఆ చెత్త లెక్కల మేస్టారు మళ్ళా ఫెయిల్ చేశాడు. వాడి దౌర్జన్యం కూలా?”

“వాడి తిక్క కుదర్చాలి. అంతేనా?”

గోముగా మొహం చిట్లిస్తూ తన బుగ్గల్ని అప్పా పెదాల మీద ఆనించింది అమ్మి.

“అదికాదు బుజ్జీ! తిక్క కుదర్చడం సంగతి కాదు. అసలిది… మన బుల్లోడి తప్పు కాదు. మనోణ్ణి చూస్తే వాళ్ళకి కన్నెర్ర! మన అబ్బాయని కాదు గానీ, ఎన్ని తెలివితేటలో కదా? అలాంటివాడికి ఈ పిచ్చి లెక్కలా? బల్ల గుద్ది మరీ చెప్పగలను, వాడికివన్నీ తెలుసు.”

“వాడు బడుద్ధాయి… ఇలా తలనెప్పులు తెచ్చే కంటే బుద్ధిగా చదువుకోవచ్చు కదా? ఇలా నా వళ్ళో వాలే బదులు, వాడితో నువ్వు కూర్చోవచ్చు కదా?”

ఒక్క ఉదుటన అప్పా ఒళ్ళోంచి లేచి, పక్కనే ఉన్న కుర్చీలో వాలింది అమ్మి.

“మీరింత మొండి వారని అనుకోలేదు…?” విసుగ్గా అంటూ ఒక్కసారి కళ్ళు మూసుకుంది.

“కొడుకంటే మీకు ప్రేమా వల్లకాడూ ఏదీ లేదు. మనోడు ఎంతో తెలివిగలవాడు. చురుగ్గా ఉంటాడు. గిట్టనివాళ్ళు వాడి మీద కత్తిగట్టారు. కచ్చితంగా చెప్పగలను! వాడు మళ్ళా మూడో క్లాసులో ఉండడానికి వీల్లేదు. ఇది చూస్తూ ఊరుకోను!”

“మన బడుద్ధాయి చదవకపోతే, చూస్తూ ఊరుకోక ఏం చేస్తావుట? అమ్మలంతా ఇంతే! ఇహ చాలు వెళ్ళి వేరే ఏదైనా చేయి. నాకు వేరే పన్లున్నాయి…” అంటూ బల్లమీద పేపర్లు సవరించాడు అప్పా. మాంసం వాసన పసిగట్టిన కుక్కలా కర్టెను వైపు చూపులు విసిరాడు.

“మీరెన్నయినా చెప్పండి. నేను వెళ్ళను గాక వెళ్ళను. మీకు తలనొప్పి అయితే అవనివ్వండి. భరించండి. అప్పా! ముందు మీరెళ్ళి ఆ లెక్కల మాస్టారి సంగతి చూడండి. మనోడిని పాస్ చెయ్యించండి. వాడికి లెక్కలు బాగా వచ్చు కానీ, కాస్త సుస్తీ చేసి సరిగ్గా చేయలేకపోయాడని చెప్పండి. వాళ్ళ వెర్రితనానికి మనోణ్ణి బలి చేయద్దని గట్టిగా చెప్పండి. మనోడి వయసు ఎంతో తెలుసా వాళ్ళకి? పదిహేనుదాటి పదహారు రాబోతోంది. అంటే ప్రపంచజ్ఞానం వచ్చినట్లే లెక్క! మీరు ఏదో ఒకటి చెయ్యాలి? మనోడు అలెగ్జాండర్ అంత అందంగా ఉంటాడంటుంది పక్కింటి సోఫియా, మీకు తెలుసా?”

“మనోడు మచ్చుతునక అని తెలుసు. అయినా నేను వెళ్ళను. వాళ్ళ చుట్టూ తిరగడానికి నాకు తీరిక లేదు.”

“లేదు. మీరు వెళుతున్నారు!”

“వెళ్ళను!”

“వెళ్తారు!” గట్టిగా అరిచింది అమ్మి. “మీరు వెళ్ళకపోతే… మీకు బుల్లోడిమీద ప్రేమా, జాలీ లేవు!” ఇంకాస్త గట్టిగా ఊగిపోతూ, అరుస్తూ కర్టెను వైపు కెళ్ళెర్ర జేస్తూ చూసింది.

అప్పాకి చికాకు కలిగింది. చిర్రెత్తుకొచ్చింది. పైకి కనిపించకుండా చిన్నగా కూనిరాగం తీస్తూ జాకెట్ తీశాడు. అమ్మి కర్టెను వైపు చూపులు కలవర పెట్టాయి. లొంగిపోయాడు. బుళ్ళోణ్ణి పిలిచాడు. సమాధానం చెప్పమని నిలదీశాడు. బుల్లోడికి అరికాలి మంట నెత్తికెక్కింది. లెక్కల మాస్టారి కంటే తనకే లెక్కలు బాగా వచ్చన్నాడు. అందమయిన అమ్మాయిలకి, డబ్బున్నోళ్ళ పిల్లలకి, దద్దమ్మలకి మంచి మార్కులొచ్చాయన్నాడు. తన తప్పేవీలేదంటూ భోరుమని ఏడ్చాడు. ఏడుస్తూనే మాస్టారి చిరునామా అందిచ్చాడు.

అప్పా గడ్డం గీసుకొని, బట్టతల కనిపించకుండా ఒకటికి రెండుసార్లు దువ్వుకొని, టిప్‌టాప్‌గా తయారయ్యి బయల్దేరాడు; బుల్లోడి మీద ప్రేమ నిరూపించుకోడానికి. అందరి తండ్రుల్లాగానే చెప్పా పెట్టకుండా సరాసరి లెక్కల మేస్టారి గదిలోకి చొరబడ్డాడు. తెలియకుండా చొరబడితే వినిపించే మాటలు అప్పాని వెనక్కి నెట్టాయి. లెక్కలు మాస్టారు పెళ్ళాంతో అంటున్నాడు –

“నీతోనే నా అదృష్టం ఇలా తగలబడింది అరియానా! ఈ వెర్రికి అంతులేదు!”

“అలా అనకండి. నాకు తెలుసు, మీకోసం నేనేమీ చెయ్యలేకపోయాను. మీరే నాకు సర్వసం!” మాస్టారి భార్య అతని భుజమ్మీద వాలుతూ అంది.

మాస్టారి భార్య అందంగా ఆకర్షణీయంగా ఉంది. పక్కమీద ఆమెను ఊహించుకున్నాడు అప్పా! బూట్లు చప్పుడు చేస్తూ, హల్లో అంటూ లోపలకి వెళ్ళాడు అప్పా. ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు మాస్టారు. మెరుపువేగంతో పక్కగది లోకి దూరింది పండు లాంటి మేస్టారి పెళ్ళాం.

“క్షమించండి! ఇలా వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టానేమో! ఎలా వున్నారు? ముందు నా పరిచయ భాగ్యం చేసుకుంటాను. ఇదిగో నా విజిటింగ్ కార్డ్! హహహ. ఇది చూస్తే తెలుస్తుంది నేను మామూలు వాణ్ణి కాదని. నేనూ కష్టపడి పనిచేస్తాను, మీలాగే! హహహ.”

“మీరేం కంగారు పడనవసరం లేదు,” అప్పా మళ్ళీ తనే అన్నాడు.

మేస్టారు నవ్వుతూ గౌరవంగా అక్కడున్న కుర్చీ చూపించాడు. అప్పా కుర్చీ లాక్కొని కూర్చున్నాడు.

చేతినున్న బంగారు వాచీని తడుముకుంటూ, “మీతో కాస్త మాట్లాడదామని వచ్చాను సార్! నేను అంత మాటకారిని కాను. క్షమించాలి. హహహ. ఏదో ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్లు అనేస్తాను, హహహహ.”

“మీకు యూనివర్శిటీ డిగ్రీ ఉందా?” ప్రశ్న వేశాడు అప్పా.

“అవును.”

“బావుంది. బయట చాలా వేడిగా ఉంది కదూ? చూడండి ఇవాన్ ఫెడోరవిచ్! మీరు మా అబ్బాయికి లెక్కలేనన్ని F-లు ఇచ్చారు. అదేమీ తప్పు కాదు. ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ఇస్తారు. ప్రశంసలు దక్కాల్సిన వాళ్ళకి ప్రశంసలూ, మొట్టికాయలు పడాల్సిన వాళ్ళకి మొట్టికాయలూ! హెహ్హెహ్హెహ్హె… ఇలాంటివి కాస్త ఇబ్బందే! మా అబ్బాయికి నిజంగా లెక్కలు రావని మీరు అనుకుంటున్నారా?”

“ఎలా చెప్పమంటారు? మీ వాడికి లెక్కలు అర్థమవ్వలేదని నేను అనలేను. కానీ చదవాలి కదా? చదివితేనే అర్థమవుతాయి, ఏమంటారు?”

“ఎందుకని?”

మాస్టారు కళ్ళు పెద్దవి చేశాడు. “ఎందుకంటారేవిటి? అతనికి అర్థం కావు. ఎందుకంటే అతను చదవలేదు.”

“క్షమించండి! ఇవాన్ ఫెడోరవిచ్! మా అబ్బాయి రాత్రింబవళ్ళు చదువుతాడు. నేనే కూడా ఉండి చదివిస్తాను. అన్నీ కూలంకషంగా వచ్చు వాడికి. వయసులో ఉండే చపలత్వం వల్ల అయ్యుండచ్చు. మీకు వయసు గురించి తెలియంది కాదు. మనందరం ఆ వయసు దాటిన వాళ్ళమే! మీకు ఇబ్బంది కలిగిస్తున్నానా?”

“అలాని ఎందుకు అనుకుంటున్నారు? అలాంటిదేమీ లేదు. మీరు ఇలా వచ్చినందుకు కృతజ్ఞుణ్ణి. మాలాంటి టీచర్లని తండ్రులు అరుదుగా కలుస్తారు. మామీద మీకు అపారమైన నమ్మకం ఉందని మీ రాకే చెబుతుంది. నమ్మకం చాలా కీలకమైన విషయం!”

“సహజం అది. అన్నింటికన్నా ముఖ్యం కలగజేసుకోక పోవడం! ఇంతకీ మా అబ్బాయి నాలుగో తరగతికి వెళ్ళలేడంటారు?”

“బాగానే గ్రహించారు. ఒక్క లెక్కలే కాదు, మిగతా వాటిలో కూడా అతనికి F వచ్చింది.”

“మిగతా వాళ్ళనీ కలుస్తాలెండి. ముందు ఈ లెక్కల తేల్చండి. దీని సంగతి మీరు చూడగలరా?”