నా సాహితీ విశ్లేషణని అన్నమయ్య సంకీర్తనల వైపు మళ్ళించి దాదాపు దశాబ్దం కావొస్తోంది. ఈ క్రమంలోనే నేను 2006వ సంవ త్సరంలో, ‘‘వలపారగించవమ్మ వనిత నీ – యలుక చిత్తమున కాఁకలి వేసినది,’’ అని ఒక సాహిత్య విమర్శనా పుస్తకాన్ని, మళ్ళీ 2009లో, ‘‘కాంతల మనసులోని కఱవు వాసె – అంతటా జవ్వన మనే ఆమని కాలమున,’’ అని మరొక విమర్శనా పుస్తకాన్నీ అన్నమయ్య సంకీర్తనల మీద ప్రచురిం చాను. ఈ సుదీర్ఘమైన అన్నమయ్య పద కవితా సాహచర్యంతో నాకు అర్థమైన అనేక విషయాలని ఈ రెండు పుస్తకాలలోనూ చర్చించాను. మిత్రుల ప్రోద్బలం మీద అన్నమయ్యని గురించి పరిచయ వ్యాసం ఇప్పుడు రాస్తున్నప్పుడు, ప్రధానంగా ఈ పుస్తకాల నించే కొన్ని అంశాలని అమెరికాలోని తెనుగువారి కోసం ఎంపిక చేసి అందిస్తున్నాను. నా పుస్తకాలలో అన్నమాచార్యులవారి కవితా రహస్యాల మీద విపులమైన చర్చ లున్నాయి. అందులోంచి క్లుప్తంగా ఎంచి చెప్పడం కొంచెం కష్టమైన పనే అయినా ప్రయత్నిస్తాను.
బాహ్యంగా మనిషి ముందున్న సమకాలానికీ, మనిషి తాత్త్విక చింతనని ప్రేరేపించే అంతర్లోకాల సమకాలానికీ చాలా తేడా ఉంటుంది. ఒకటి బయటికి కన్పిస్తుంది. దాని బాహ్యరూపాలనే, ఆ కాలాన్నే మనుషులు వాస్తవమని భ్రాంతి పడతారు. రెండోది మనిషి అంతర్లోకాల వైపు అనేకానేక దృక్కోణాల నించి దృష్టి పెడుతుంది. బాహ్యంగా కన్పించే కాలాన్ని దాటి, పాఠకుల జీవితానుభవంతో కలిసిపోయి వారి మనసులలోకి తన కవితా రీతులతో ప్రవేశించగల్గిన కవి అన్ని కాలాలలోనూ సమకాలికుడే అవుతాడు. అన్నమయ్య ఆ రకంగా సమకాలికం కాగల్గిన కవి. అందుకనే ఇప్పటికీ ఆయన స్పందనలు మన మనసుల్ని తాక గలిగేవిగా ఉన్నాయి. ఆయన కవితా విశిష్టతలో ఉన్న వైవిధ్యం వల్లనే అవి పాతబడలేదు. అందుకనే అవి ఇప్పటికీ గాఢమైన ఇష్టాన్ని మనలో కల్గించగలుగుతున్నాయి.
ఇవాళ్టిదాకా అన్నమయ్యగారి పదాలని భక్తితో గాయకులు పాడితే విని సంతోషించేవారే ఎక్కువ. పైగా ఆసరికే వారి హృదయాలలో వేంకటేశ్వరుని మీద సిద్ధంగా వున్న భక్తి ప్రపత్తులు ఒక ముఖ్యమైన కారణం, వారంతా ఈ కీర్తనలని ఆత్మీయంగా ఆనందించడానికీ ఆదరించడానికీ! కానీ సాహిత్యం విషయం వచ్చేసరికి అలా కాదు. సాహితీ దృక్పథం అన్నది పూర్తిగా భిన్నమైన విషయం. కవి చేసిన ఊహని అంతే సమానస్థాయిలో ఊహించి అనుభవించగల చతురత కావాలి దీనికి. అందుకు సావకాశం కూడా కావాలి. ఏకాంతంలో పుస్తకాన్ని నింపాదిగా చదువుకుంటున్నప్పుడు మాత్రమే విషయాన్ని మరీమరీ ఆకళించుకోవడానికి ఎక్కువ వెసులుబాటు ఉంటుంది. ఇలా పాఠకుల ముందు ఉన్న సౌకర్యం, పాటని వినే శ్రోతలకి ఎంతవరకు ఉంటుందో నేను ఖచ్చితంగా చెప్పలేను. పదాలని రాగం ద్వారా అందుకోవడానికీ — పదాలని సాహిత్యంగా చదివి, దానిలోని రామణీయకతని తమ ఊహల ద్వారా అందుకోవడానికీ మధ్య చాలా అంతరం ఉంటుందని మాత్రం చెప్పగలను, మరీ ముఖ్యంగా ఆ పదకర్త గాఢమైన ఊహల ఐంద్ర జాలికుడు అయినప్పుడు.
అన్నమయ్యగారి సాహిత్యం ప్రక్రియాపరంగా మిగతా తెనుగు సాహిత్యం కన్నా భిన్నమైనది. దీనిని పాడాల్సి రావటం అన్నది తప్పనిసరి. పదాన్ని పాటగా వినడానికి మాత్రమే అలవాటు పడిన వారికి కవిత్వంగా దీనిని తిరిగి పరిచయం చేయడం కూడా నాకు కొంచెం కష్టమైన పనే! పాడటం గాయకుల పని. సాహితీ విశ్లేషకుల పని కాదు. ఇప్పుడు నా ఇబ్బంది ఏమంటే పదాన్ని వినడానికే అలవాటుపడిన — అంటే, సంగీత స్వరాలలో కలిసి పోయిన అన్నమయ్య ఊహలని మీ మనసుల నించి విడిపించి, వాటిని మళ్ళీ సాహిత్య ప్రధానమైన అంశంగా — అవి ఎంత ఉదాత్తమైనవో, ఎంత వైవిధ్యమైనవో — మీకు పరిచయం చేయడం అన్నమాట. నా రెండు పుస్తకాలలోనూ నేను చేసిన పని ఇటు వంటిది. నేను అన్నమయ్యగారి పదాలని సాహిత్యంగా పరిశీలించాను. నేను ఆయన సాహిత్యాన్ని రాగబలంతో కాక అక్షర బలం తో తూచి పరవశించినదాన్ని! త్యాగరాజ కీర్తనల వ్యాఖ్యానానికి నేను పూనుకోకపోవడానికీ, అన్నమయ్య పదాల వ్యాఖ్యానానికి నేను ఉపక్రమించడానికీ గల కారణం అంతా అన్నమయ్య గారి కవితా చతురతే!
అన్నమయ్యగారి దేవుడు పురుషుడే! ఈ విషయాన్ని అన్నమయ్య ఇలా చెబుతాడు. ‘‘పొగరు మగతనానఁ బురుషోత్తముఁడితడు’’ అని (సంపుటము 3, సంకీర్తన 102, పేజీ 69). మరోచోట, ‘‘మగవాడు మెత్తనైతే మరి యపకీర్తిగాదా — తగవు నెరప కుంటే తరుణులు మెత్తురా!’’ (సంపుటము 18, సంకీర్తన 502, పేజీ 336) అని కూడా అంటాడు. అలాగే వేంకటేశ్వరుడిని అన్నమయ్య తన ఒక పదంలో, ‘మీసాల తిరువేంగళేశుడు’ అని కూడా సంబోధిస్తాడు (సంపుటము 18, సంకీర్తన 229, పేజీ 153). మొత్తంగా చూస్తే, స్త్రీల రతికాంక్షలని అనేకం వ్యక్తం చేస్తూ, మగవాడైన దేముడిని చేరుకోవాలని ఆశించిన శృంగార సంకీర్తనా సాహిత్యం ఇది. అందుకనే పురుషోత్తముని ‘మగతనాన్ని’ రూఢపరిచే వర్ణనలే ఈ సంకీర్తనలలో అంతటా స్థాపించబడ్డాయి.
అయితే నిరాకారుడైన దేముడు, పురుషుడే ఎందుకు కావాలన్న ప్రశ్న తప్పదు. అప్పుడు అన్నమయ్యగారి సాహిత్యపు నమూనా కూడా, అదివరకటి ఎందరో కవులలాగే పురుషుని నాయకునిగా చేసి, ఆ అఖిలాండ భర్తకి అనువైన ఊహలతో సాగినదే అవుతోంది మరి. భాష చేసే చమత్కారం వల్ల, పురుషా ధిక్యతా దృక్పథం వల్ల, పురుషుడే దేవుడైన చట్రంలోంచే ఆయన కవితారచన చేసినా, అన్నమయ్యగారి ఊహలు నాకు ఎంతో బాగున్నాయి. దేవుడు ఉన్నాడా లేడా అన్నదానితో గాని, దేవుడు పురుషుడే అవాలా అన్న ఆలోచనతోగాని నేను ఆగిపోకుండా, కుతూహలంతో — నాయికా పక్షపాతిగా అన్నమయ్యగారు ఎన్ని వేల కల్పనలని చేశారో? అలా ఎలా చేయగలిగారో? అన్నది ఆశ్చర్యంగా గమనించాను. అదే ఈ సంకీర్తనా సాహిత్య విశ్లేషణలో నాకు ఇష్టం కలిగించే విషయం అయ్యింది. అన్నమయ్యగారు సైతం ఆయన కాలానికి అతీతులేమీ కాలేరు. అందువల్ల ఆయన ఊహలో భగవంతుడు పురుషుడే కావడం సహజం! మనం మనకి తెలిసిన ఊహలలోంచే ఆలోచనలు చేయడానికి ఎక్కువగా అల వాటు పడిన మనుష్యులం. అయినా అన్నమయ్యగారి సంకీర్తనా సాహిత్యంలోని స్త్రీలు, తమ మనోభావాలని వ్యక్తపరిచిన తీరు మాత్రం చాలా ప్రత్యేకమై భాసించింది. అందువల్లనే అనివార్యంగా ఆయన రచన పట్ల కుతూహలం, ఇష్టం, ప్రేమ నాకు కలిగాయి. ఆయన రచనా వైవిధ్యం సైతం అనితరసాధ్యమై నదిగా నాకు కన్పించడం వలన కూడా ఇది నలుగురితోనూ తప్పక పంచుకో వలసిన ప్రత్యేకత కల్గిన సాహిత్యంగా నేను భావించాను. దేవదేవునికి భార్యలు కావాలనీ, ప్రియురాళ్ళు కావాలనీ తపన పడిన ఎందరో నాయికలు తమకు కల్గిన భావనలన్నింటినీ, ఆ వేడుకల నన్నింటినీ, ఆ వియోగ దుఃఖాలనీ, ఆ సంయోగపు తృప్తినీ వివిధ రకాలైన వ్యక్తీకరణలుగా పోటీపడి ప్రకటించారు. స్త్రీల మనః స్పందనలూ, శరీర స్పందనలూ మరి ఏ కవికీ వశం కానంత విశిష్టంగా అన్నమయ్యగారి ద్వారా వ్యక్తీకరించబడినాయి. స్త్రీల హృదయస్పందనలు అన్నమయ్యగారి ముందటి తెనుగు సాహిత్యంలో ఎక్కడా ఇంత గాఢంగా ఆవిష్కృతం కాలేదు.
స్త్రీల చన్నులని ఎన్ని తరహాలలో పదాలలో పేర్కొని వర్ణించవచ్చునో అన్నమయ్య అన్ని వైవిధ్యమైన ఉపమానాలని వాడి వర్ణించాడు తన పదాలలో! ‘మొలక చన్నులు’, ‘నిమ్మ కాయల వంటి చిన్న చన్నులు’తో మొదలుకొని ‘భారపు గుబ్బల’ దాకా అన్నమయ్య వర్ణించాడు. ‘చన్నులు పిసుకు’ లాంటి తెలుగు మాటలని ఆయన నిస్సంకోచంగా తన పదాలలో వాడారు. ‘‘గోపీ పీన పయోధర మర్దన … చంచల కరయుగశాలీ’’ అని గీత గోవిందంలో జయదేవుడు కృష్ణుణ్ణి వర్ణించిన వైనాన్ని ఈ తరహా మాటలలోంచి అన్నమయ్య ప్రేరణగా స్వీకరించి ఉంటారని ఇవాళ మనం స్పష్టంగానే అర్థం చేసుకోవచ్చు.
అయితే అన్నమయ్య పదాలలోంచి గాయకులు ఎంచు కుని పాడే వాటిల్లో భక్తి వైరాగ్య పదాలే ఎక్కువ. శృంగార పదాలు చాలా సొగసైనవి అనేకం ఇంకా ఇప్పటికీ ఆయన సంకీర్తనలలో వేనవేలు అలా స్వరరహితమై మిగిలే ఉన్నాయి. గాయకుల చూపు వాటిపై ఏనాటికి పడుతుందో మనకి తెలీదు. గాయకులు ఎలా పాడటం లేదో, అలాగే ఈ తరహా పదాలకి వ్యాఖ్యానాలు కూడా బహుశా వెలువడకపోవచ్చు. ఎవరికి వారే విధించుకున్న ఒక అప్రకటిత నిషేధంలోంచి లేదా సమకాలీన సామాజిక మర్యాదల లోంచి చివరికి ఆయన చేసిన భాషా ప్రయోగాల విషయంలోనూ సాహిత్యరంగంలోని వారు సైతం ద్వంద్వ ప్రమాణాలు పాటిం చటమో లేదా ఇటువంటి తరహా పదాల పట్ల వాళ్ళు తమ మౌనాన్ని కొనసాగించటమో చేయవచ్చు. వీటి వలన కొన్నాళ్ళకి అన్నమా చార్యులవారు కేవలం భక్తిపదాలో వైరాగపదాలో మాత్రమే రాసేరు కాబోలనుకునే అవకాశమూ ఉంది. అదీ అసలు ప్రమాదం. ఇవాళ్టికి మనకి దొరికిన అన్నమయ్య సంకీర్తనలలో మూడొంతులు శృంగార సంకీర్తనలే కాగా కేవలం ఒక పావు భాగం మాత్రమే భక్తి వైరాగ్య సంకీర్తనలు ఉన్నాయి. ఇంత ఎక్కువగా అన్నమయ్య శృంగార సంకీర్తనలని రాయడానికి కారణం ఆయన తన భక్తిని శృంగారపద సంచయంగా ప్రకటించా లని నిర్ణయిం చడమే! ఆయన ఇలా అంటాడు,
‘‘చేరి నా కన్ను లెదుట శృంగార రసమవై
ఆరసి రక్షించఁ బితురార్జితమవై
సారపు టిహపరాల సంసార సుఖమవై
యీ రీతిఁ బెంచితిగా నాకిందిరారమణా!’’
అని (సంపుటము 3, సంకీర్తన 381, పేజీ 257), ‘‘నేనేమి బాతి నీకు’’ అన్న పదములో! అన్నమయ్యకి ఆ శ్రీ వేంకటేశ్వరుడు పిత్రార్జితం లాంటివాడట! కన్నులెదుట శృంగార రసముగానూ, ఇహములోని సంసార సుఖముగానూ కూడా తానే దర్శనమిచ్చిన వాడూను, తాను దర్శించిన దేవుని శృంగారాన్నే తన వేల సంకీర్తనలలోంచి అన్నమయ్య కీర్తించాడు. ఆ కీర్తించడం అనేక విధాలుగా చేశాడు. అలుపెరుగని రీతిలో చేశాడు. ఆ క్రమంలో ఆయన తెనుగుభాషని కదం తొక్కించాడు. ఎన్నో రకాల కొత్తకొత్త ఊహలు చేశాడు. ఎన్నో కొత్త తరహా ఉపమానాలు వాడాడు. సామెతలని గుప్పించాడు. ఎన్నో నూత్న పదబంధాలని ప్రయోగిం చాడు. అవి ఏయే రీతులలో సాగేయో నాకిచ్చిన కొద్దిపాటి ఈ స్థలంలోంచి క్లుప్తంగా మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఉదాహరణకి ఈ పదాన్ని చూడండి –
‘‘ఈతగాదు మోఁతగాదు ఇంతే లోతు మోహము
చేఁతసేసి యిఁకనైనా చెక్కు నొక్కవే’’
(సంపుటం 26, సంకీర్తన 66, పేజీ 48)
ఈ పదంలో నాయిక మోహానికి చెలికత్తెలు చెప్పిన కొల మానాలు ఈ తరహాలోనివి. నువ్వంతగా బిగుసుకుపోనక్కరలేదు ఈ ‘వలపు’ అన్నది ‘పుక్కిటిబంటి.’ కాస్త సరసమాడి చూడు. నీ అసూయ కాస్తా కరిగిపోతుంది. దానికి పెద్ద లోతేమీ లేదులే. అతడిలోని ఆ చలము వట్టి ‘చంకల బంటి’ అంతే! కలిసిమెలిసి అతగాడిని కౌఁగిలించావో అది ఇట్టే మాయమైపోతుంది సుమా అంటూ వారంతా నాయికతో పరాచికాలు మొదలెట్టారు. వాళ్ళంటున్నారింకా ఇలా, సంకోచించకు. ఈ కోరిక వుంది చూడూ ఇది వట్టి ‘పిక్కలబంటి’ అంతే! ఎలాగైనా ఆయనతో కలువు. దాని లోతే మాత్రమో తెలిసిపోతుంది నీకు! మదన మంత్రాలు మరి వినిపించు అని. ఈ పదం ఎత్తుగడే భిన్నమైనది. అచ్చ తెనుగు పదాలతో… వలపుని దాని అనేక ఛాయలతో వ్యక్తం చేయడం ఏ రచనలోనైనా అంత తేలిక కాదు. చాలా నైపుణ్యం ఉండాలి దానికి. ఆ నైపుణ్యం ఉన్నప్పుడే అది గుర్తుంచుకోగల రచనగా మిగులు తుంది. అందునా శృంగార వర్ణనలో నైపుణ్యం కొరవడినా భావం నీరసమైనా, భంగపాటు తప్పదు. వలపుని నువ్వు పొందలేవేమో నని భయపడకు, ప్రయత్నించి చూడు నీకే తెలుస్తుంది అంటూ, ‘పుక్కిటిబంటి’, ‘చంకల బంటి’, ‘పిక్కల బంటి’ అన్న వినూత్న కొలమానాలతో వలపుని గురించి చెప్పటమే ఈ పదాన్ని ప్రత్యేకం గా గుర్తు పెట్టుకొనేటట్టు చేసింది.
అయితే ఇదే వలపుని గురించి అన్నమయ్య అంతే సున్నితంగానూ చెప్తాడు సుమా ఇలా ఈ పదంలో!
‘‘ఎరఁగవా వోయి నీవు యేల నన్ను నడిగేవు
తరి తరుకాణై వుండు తరితీపు వలపు’’
(సంపుటం 7, సంకీర్తన 212, పేజీ 129)
ఈ పదంలో ఆయన వలపుని వర్ణించిన తీరే మనం ఊహించ వీలులేనిదిగా వుంటుంది. ఆయన అంటున్నాడు ఇలా – వలపు తరితీపు! వచ్చీరాని పదం వంటిదట వలపు! అంటే ఇంకా రూపు దిద్దుకోని కవితా కల్పన వలపంటే అనటం ఎంత బాగుందీ!! ఇది నీకు తెలీదా? అని అంటోంది నాయిక తన ప్రియునితో. వలపు కలిగిన సమయంలో ఎంత గర్వం కలుగుతుందోనట! పరి హాసంతో కూడిన మాటల వల్లనే మోహం కలుగుతుంది. పచ్చని తీగలాగా వ్యాపిస్తుంది ప్రేమ. ప్రియమైన చల్లగాలితో సరిసమాన మైనది ప్రేమ! మన్మధుని చోటు వలపు అన్నది. ముంజేతి చిలకలాంటిది వలపు! వలపు అంటే పిలిచి మరీ బిడ్డనిచ్చినంత ప్రియమైనదని అంటున్నాడు అన్నమయ్య ఈ పదంలో వలపుని వ్యాఖ్యానిస్తూ!! అంతేనా ఆయన ఇంకా ఇలా అంటున్నాడు. వందింతలు పండేటి మొలక పైరు లాంటిదట వలపు! వలపంటే వసంతమాసమట! మనసు మారుమూలల్లో పదిలంగా దాచుకునే రహస్యమేనట ప్రేమ! నన్ను పొందిన శ్రీ వేంకటేశా! మన ఇద్దరికీ ఈ వలపు శాశ్వతము! అంటూ ఈ పదాన్ని ముగించింది నాయిక, ఈ పదంలో ఆయన ప్రేమని వాతావరణంతోనూ, రుతువుల తోనూ, పెంపుడు చిలుకతోనూ, విరగపండిన వరిపైరుతోనూ మదిలో దాచుకున్న పదిలమైన రహస్యంతోనూ పోల్చటం మరి విశేషం కాదా? ఆయన వాడిన ఉప మానాల గాఢతని బట్టి, ‘వలపు’ మీద అన్న మయ్యకున్న గురి ఎంతటిదో మనకి అర్థ మవుతుంది. విఫలమయినా, విరహ మయినా ‘వలపు’ అనే మానసిక స్థితినీ — దానికి తగిన శారీరక ప్రతిస్పందనలనీ మనుష్యులు తప్పకుండా పొందాలన్నదే — కవిగా అన్నమయ్య ఆశయం.
అన్నమయ్యగారి నాయికలలోని చొరవ, చనువు, తిక్క, అలక కూడా చాలా ఘాటైనవి! ఒక్కోసారి వారు నాయకుడిని ‘లంజకాడ!’ అంటూ కూడా సంబోధించగలరు. ‘లంజ’ అన్న తిట్టు లోని తీవ్రత ఇవాళ ఉన్నట్టుగా మరి ఆనాటి సమాజంలోనూ భాషలోనూ లేదేమో?! ‘లంజ’ అన్న పదం ఆడవాళ్ళని మాత్రమే ఉద్దేశించి తిట్టుగా చెలామణీలో ఉన్న ఇవాళ్టి కాలంలో అన్నమయ్య తన నాయికల నోట వాళ్ళకి కోపం వచ్చిన సందర్భంలో అక్కసుతో నాయకుని ‘లంజకాడ’ అంటూ సంబోధింప జేయటాన్ని గమనించాకా — నిజం చెప్పొద్దూ… కాస్త మనసు శాంతించినట్లయ్యింది సుమా నాకు! ఆడవాళ్ళు కూడా తిట్టడానికి వీలున్న ఒక పదాన్ని అన్నమయ్యగారు మనకి అందిం చారులే అని!
‘‘లంపు గుబ్బ గొల్లెతల లంజకాఁడ నీ
యింపులే వెదకంబట్టీ నెట్లరా వోరి’’
(సంపుటం 6, సంకీర్తన 127, పేజీ 92)
అలాగే ఇంకో పదంలో కూడా అన్నమయ్య ఇలాగే రాస్తారు.
‘‘లంజకాడ వౌదువురా
లంజకాఁడ వౌదువు – నీ లాగులెల్లఁ గానవచ్చె
ముంజేతఁ బెట్టిన సొమ్ముల కద్దమేలరా’’
(సంపుటము 5, సంకీర్తన 84, పేజీ 58)
ఈ పదంలో నాయిక ఇంకొక స్త్రీ ఆయనని కలిసిన గుర్తులన్నీ ఆయన వంటి మీద స్పష్టంగా కొట్టొచ్చినట్టుగా కన్పిస్తున్న వాటిని గుర్తించి — వాటిని ప్రస్తావిస్తూ అసూయాగ్రస్తయై కోపంతో ఉడికిపోతూ వుంది. తనకి తెలుస్తుందేమోనని అవతలి స్త్రీ కాస్తైనా భయపడినట్టు లేదే అన్నదే ఈ నాయికకి ఇంకా కష్టం కల్గించేదిగా వుంది. అదే ఈ పదంలోని విషయం. ఆ మరో నాయిక ఎక్కడా ‘కొంకక’ కోరి తన నాయకుని భుజం మీద కంకణాల చేయి వేసి మరీ కౌగిలించుకోబోయింది. ఆమె కంకణాల ముద్రలు ఆ వొంకులతో సహా ఆయనగారి భుజాల మీద అచ్చులుగా వత్తుపడి ఉన్నాయట! ఇంకా నీ బొంకులెందుకూ? నీ మారువేషాలన్నీ నీ మోసాలన్నీ నీ మాయలన్నీ చూశాంలే అంటోంది కోపంతో! ఈ నాయిక తన నాయకుని వక్షం మీద ఎవరో స్త్రీ ధరించిన కంఠమాల తాలూకు గుర్తులని కూడా గమనించింది. ఆమె అంటోందిలా నాయకునితో ‘‘నువ్వు జాగ్రత్తపడగల నేర్పరివైతే కావొచ్చు. కానీ నాతో అబద్ధాలాడకు. నేను భరించలేను,’’ అని. ఆయన శరీర సుగంధాన్ని కూడా ఆ మరో స్త్రీ కొల్లగొట్టుకుపోయింది కదా అన్న పెనుబాధ ఈ నాయికది. అయితే ఇలాంటి విషయం మీద తీర్పులు ఎవరు మాత్రం చెప్పగలరు, ఏ కాలంలోగానీ!!
అన్నమయ్య తాను వర్ణించదలుచుకున్న దేవుని పేరు కూడా పైకి చెప్పకుండా, పరోక్షంగా అతనికి సంబంధించిన కథా ఘట్టాలతో మొత్తం పద రచన చేసిన సందర్భాలు ఆయన సంకీర్తనా సాహిత్యంలో కోకొల్లలు! అందులోనూ భాషాపరంగా చూసినా, ఆయన తన ఉపమానాలని వాడిన తీరుని గ్రహించినా కూడా ప్రత్యేకంగా ఎంచి మరీ ప్రస్తావన చేయవలసిన పదాలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు నేను వివరించబోయే ఈ పదాన్ని శ్రీమాన్ రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ స్వరపరిచారు. ఈ పదం అనేక కారణాలకిగానూ నాకెంతో ఇష్టమైనది. ఈ పదంలో ‘నీ బంటు’ అన్న దొక్కటే సంబోధన! పదం మొత్తం మీద ఎక్కడా రాముడి పేరూ రాదు, హనుమంతుడి పేరూ రాదు. ఆంజనేయుడి భుజశక్తినీ, ధీశక్తినీ చతురతగా ప్రదర్శించిన ఈ పదంలో అన్నమయ్య గారి భాషా చమత్కారం ఎన్నదగినది. ఒక పదాన్ని ఇలాగ కూడా చెప్ప వచ్చునా? అచ్చ తెనుగుని ఇంత బాగా ఉపయోగించ వచ్చునా? దేశిభాషలో ఇంతటి అందముందా? అని తెనుగువారు విస్తుపోతూ గమనించవలసిన పదం ఇది. అన్నమయ్య ఊహ లోనికి గనక మనం ప్రయాణం చేయగల్గితే, మనసుకి చాలా సంతోషం కల్గించగల అన్నమయ్య పదాలలో ఇది కూడా ముఖ్య మైన ఒక పదంగా చెప్పవలసినది!
‘‘నేల మిన్ను నొక్కటైన నీ బంటు వొక్క –
వేలనే యక్షుని దెగవేసెఁగా నీ బంటు’’
(సంపుటం 1, సంకీర్తన 69, పేజీ 47)
ఈ పదం నిండా అచ్చ తెనుగు పదాలు ఎంతో అందంగా అమిరాయి. హనుమంతులవారి ప్రజ్ఞకి పట్టం కట్టిన ఈ పదం — రామాయణంలో అంజనీపుత్రుడు చేసిన సాహసాల విన్యాసాల కథాక్రమాన్ని పరోక్షంగా చెబుతుంది. రామాయణం కథని బాగా తెలిసిన వారికి ఈ పదంలో కవి ఉద్దేశించిన ఘట్టాలన్నీ సుపరి చితాలే! అయితే అంత బాగా ఇతిహాస పరిజ్ఞానం లేని తరాలు అప్పుడే వృద్ధి పొందుతున్న ఇవాళ్టి కాలంలో, అన్నమయ్య పదాలకి వివరణాత్మక వ్యాఖ్యానంతో మరొక పునర్ముద్రణ అవసరం ఎంతో ఉంది. ఆ అవసరాన్ని తెనుగు సాహితీ జిజ్ఞా సువులు ఎంత త్వరగా గ్రహిస్తే అంత మేలు పొందిన వారవుతారు అన్నమయ్య సంకీర్తనల విషయంలో!
ఇంతకీ కథలు కావు ఈ పదాన్ని ప్రత్యేకం చేసినవి. ఆ కథల ప్రస్తావన దేనినీ సూటిగా తీసుకొని రాకుండా — వాటిని ఊరికే సూచన చేసి వదిలివేస్తాడు అన్నమయ్య. ఈ పదంలో ఆంజనేయస్వామి పరాక్రమ ఘట్టాలని అన్నమయ్య వర్ణించిన తీరు ఎలా ఉంటుందంటే` ఇవాళ్టి చలనచిత్రంలో చూసిన మాదిరి దృగ్గోచరం చేయగల్గిన శక్తి కల్గిన పదబంధాల కూర్పుతో — పదం అంతా కదం తొక్కు తున్నట్టు నడుస్తుంది.
‘‘ఉంగరమెగరవేసి యుదధిలోఁబడకుండ
నింగికిఁ జెయిచాఁచె నీ బంటు
చంగున జలధి దాటి జంబుమాలి నిలమీద
కుంగఁదొక్కి పదములఁ గుమ్మెఁగా నీ బంటు’’
అన్నమయ్య వాక్యాలని గమనించండి. ఉంగరాన్ని ఎగుర వేయటం; అది సముద్రంలో పడిపోకుండా ఆకాశంలోకి హను మంతుడు తన చేతిని చాచటం; చంగున సముద్రాన్ని దాటటం; జంబుమాలిని సంహరించటం — వీటిని ఆయన దృశ్య మానం చేసిన పద్ధతి ప్రత్యేకమైనది. అలాగే ఈ పదంలో సంజీవనీ పర్వతాన్ని అచ్చ తెనుగులో అన్నమయ్యగారు చక్కగా ‘మందుల కొండ’ అని అంటారు. ఇంత చక్కగా తెలుగులోంచి మనం పదాల వాడకం చేయొచ్చని మనకి తట్టదే!? బహుశా తెనుగు సాహిత్యం లో సంజీవనీ పర్వతాన్ని ‘మందుల కొండ’గా పిలవగలిగినదీ, పిలిచినదీ అన్నమాచార్యుల వారొక్కరే కాబోలు!
‘‘దిట్టయై మందులకొండ తేజమున నడురేయి
పట్టపగలుగఁ దెచ్చె బాపురే నీ బంటు’’
పట్టపగలైనట్టుగా ఉన్న తేజముతో కన్పించే ఆ మందుల కొండని తన దిట్టతనంతో తెచ్చాడయ్యా నీ బంటు – బాపురే! అంటూ పదం రాయడంలోని ఆయన రచనా విన్యాసాన్ని గమనించండి. మరి ఇన్నోటి పనులని చేసే పావని మామూలువాడా? కాడు గద. అతడు ఏకంగా బ్రహ్మపదవికే పోటీపడినవాడాయె. అందుకనే, ‘అజుని పట్టానకు’ అని అంటాడు అన్నమయ్య. అటువంటి ఆంజనేయుడిని తన విశేషమైన కల్పన ద్వారా అచ్చ తెనుగు పదాల మధ్య బంధించి దృశ్యమానం చేసిన అన్నమయ్య మాత్రం సామాన్యుడా? ఉత్త మోత్తమ భాషా పాటవం చింది పడిన అన్నమయ్యగారి ఇలాంటి పదాలు అనేకం ఉన్నాయి. వాటిలోంచి ఇదిగో ఇది చాలా బాగుంది సుమా అని ఎంచబోతే అంతకన్నా బాగున్నది మరొకటి ఎదురుపడుతుంది. దేనికి ప్రాముఖ్యతనిచ్చి ముందుగా ఉదహరిం చాలో తెలియక – బుద్ధి తెగ తికమక పడుతుంది. రసజ్ఞులైన పాఠకుల అభిరుచికి వాటిని వదిలిపెట్టి ముందుకు సాగవలసినదే!
దేవుని మీద తన అనంత కల్పనా స్రవంతిని ప్రవహింప జేసిన అన్నమయ్య లోకేశ్వరుడినే కాదు లోకులని కూడా ఎంత గానో సమాదరించటం గమనార్హం! ‘‘అన్నిటాఁదాము నతిశయులే/ యెన్నఁగ నధికులె యెసఁగఁగను’’ (సంపుటము 4, సంకీర్తన 75, పేజీ 411) అన్న పదంలో. అన్నమాచార్యులు ఈ పదంలో మను ష్యులని గురించి,
‘‘పరంపరలగు భవములఁ బొడమియు
చిరంతనులే జీవులిదే
దురంధరులే దురిత సుకృతముల
జరామరణ విశారదులే!’’
అని అంటారు. మనుష్యులలో ఎన్ని రకాల వారున్నారో వారందరినీ పేర్కొని కీర్తించా డిరదులో అన్నమయ్య. ఈ లోకంలో పరంపరగా తరాలు దాటి పుడుతూనే ఉన్న ఈ మనుష్యులు ఎంత ప్రాచీనులూ అని అంటున్నాడు అన్నమయ్య, జీవులు చిరం తనులే నంటూ!
అన్నమయ్యగారి ఈ పదం చదవగానే నాకు శ్రీశ్రీ మహా ప్రస్థానంలోని ‘మానవుడా!’ అన్న గేయం చప్పున గుర్తొచ్చింది. ఈ రెండూ భిన్న కాలాలలోని భిన్న దృక్పథాలకు చెందిన కవులు రాసినవే అయినా బింబ ప్రతిబింబాలుగా కన్పించడం చాలా ఆశ్చర్యాన్ని కల్గించే సంగతి. కల్పాంతాలకు పూర్వం కదలిక పొందిన పరమాణు సంకల్పంలో ప్రభవం పొందినవాడా! మానవుడా! అని అంటాడు శ్రీశ్రీ. మనిషి చిరంతనాన్నే — ‘‘కల్పాంతాలకు పూర్వం’’ అంటూ చెప్తాడు శ్రీశ్రీ. సౌందర్యాన్ని ఆరాధించే వానిగా; జీవించేవానిగా; దుఃఖించేవానిగా; ప్రేమించే వానిగా; వియోగీ, యోగీ, భోగీ, త్యాగీ మానవుడా! అని శ్రీశ్రీ మనిషిని సంభావిస్తే, విషయమత్తులు; మదాతురులూ; ముదాసక్తులు; మోహవిదూరులూ; చిదానందులూ; చిరయశులూ అంటూ అన్నమయ్య పేర్కొంటాడు. మనిషిలోని ఘర్షణని ఈ కవులు చూసిన కాలాలు వేరే అయినా ఆ మనిషిని గుర్తించడంలో వీరిద్దరి గొంతులూ కలవడం చాలా ఆశ్చర్యం!
చివరిగా తెనుగు సాహిత్య పాఠకవర్గానికి నాదొక విన్నపం. అన్నమయ్య సాహిత్యానికి మేలైన ముద్రణని సాధించుకోవలసి ఉన్నది. అలాగే ఆ సంకీర్తనలని అర్థతాత్పర్యాలతో, విశేషాలతో తరవాతి తరాలకి తెలిసే వీలుగా ఆ ముద్రణని తీసుకుని రావలసీ ఉన్నది. ఇది ఎంత తొందరగా సాధించగలిగితే అంత సత్ఫలితం ఉంటుంది. ప్రపంచ సాహిత్యంలోనే ప్రత్యేకంగా ఎన్నదగిన మహా కవి శ్రీమాన్ తాళ్ళపాక అన్నమాచార్యులు. తెలుగువారి అదృష్ట వశాననో, పుణ్యఫలాననో ఆయన సంకీర్తనలు తెనుగు భాషలో వ్యక్తం అయినాయి. ఆ వారసత్వానికీ, ఆ ఘనతకీ తెలుగు వాళ్ళంతా కూడా హక్కుదారులే గనక ఈ బాధ్యత కూడా ప్రతి తెలుగు వ్యక్తి మీదా ఉంది. అన్నమయ్య సాహిత్యాన్ని ఏయే రీతులలో భద్రంగా పదిలపరచుకోవలసి ఉన్నదో, భక్తులూ, సాహితీ బంధువులూ అందరూ సమాలోచనలు చేయవలసి వున్నది. ఆ సత్కార్యానికి వీరంతా అన్ని రకాలుగానూ తమ మద్దతుని తెలుపవలసి ఉన్నది.