అక్షరం పరమం పదం

అక్షరం అంటే క్షరము కానిది అని అర్థంట. అంటే శాశ్వతంగా వుండిపోయేదని, దానికి ఏనాటికీ చెరుపూ, మరుపూ వుండవనీనుట. యస్సెల్సీ డింకీ కొట్టింతరవాత, సెప్టెంబరులో అయిందనిపించుకుని మరుసటేడు కాలేజీలో చేరేవరకూ మాఅమ్మ వెనక తచ్చాడుతూ నేను నేర్చుకున్న పాఠాలు చాలా వున్నాయి.

వాటిల్లోముఖ్యంగా చెప్పుకోదగ్గది కూరగాయలమ్మి సంద్రాలుదగ్గర నేర్చుకున్నవి. ప్రతిరోజూ తెల్లార్తూనే నవనవలాడే వంకాయలూ, నూగు నూగు నేత బెండకాయలూ, గోరాన్తే కమిలిపోతాయమ్మాలాటి హెచ్చరికలతో ఆనపకాయలూ నిండినతట్టతో ముంగిట్లోకొచ్చి, హావభావాల్తో రసవత్తరంగా, సంద్రాలు వినిపించిన కథలు. నేను స్కూల్లో నేర్చుకున్న నీతులకన్నా స్థిరస్థాయిగా నా ఎదలో పాదుకుపోయినవి ఆ సంద్రాలు సుభాషితాలే.

“ఏటుండిపోతాత్తల్లీ” అంటూ మొదలెట్టి, తాను కిరస్తానీ పాదరీ మాటల్నమ్మి ఆళ్ళలో కలిసిపోయి, అక్కడ వాళ్ళు ఒరగబెట్టిందేం లేదని తెలుసుకుని, తిరిగొచ్చి, అత్తమ్మచేత మొహంవాచేలా చీవాట్లు తిని, పోస్పొమ్మనుకుని, అందిన బస్సెక్కేసి, సింవాచెలంసివార్ల టీకొట్టు జీరుసాయిబుపంచన చేరి పొద్దు పుచ్చుకుంటున్న వైనం నాకు ఏరోజుకారోజు కొత్తే.

సంద్రాలు జాలారాళ్ళింట పుట్టింది. “చేపలమ్ముకోకుండా, కూరలమ్ముకుంటున్నావేమిటి” అనడిగానోరోజు. దానికంత పనస చదివింది ఈదురుగాలిలో పూలతీవెలా వూగిపోతూ.

“అదేనమ్మగారూ, పిదపకాలం పిదపబుద్ధులు. మావోడొట్టుకొచ్చిన సేపలమ్ముకొని, కమ్మంగ వొండి ఆడికింతెట్టి నానింత కతికి మారాజుల్లా బతికినోల్లం. నలుగురు బిఢ్డల్ని కంటి. ఆ దొరబాబొచ్చి వూదరెట్టేసినాడూ, ″మిమ్ముల్ని ఈపెద్దిల్లోల్లు సరింగ సూసుకోట్నేదూ, మీరూ మడుసులే గంద, మీకైన ఆరికైన గిల్లితే రగతంవే గంద కారత్తది, ఆల్లకేం పాలు గారవు గంద, మీరూ ఆల్లూ అందురూ సమానంవే గంద, మిమ్ముల్నేల ముంగిట్లోకి రానీరూ” అంటా. ఆమీన ″కిరస్తవంవుచ్చీసుకో, మేం వణ్ణంఎడతం, గుడ్డలెడతం, మాఇల్ల మాసరిసమంగ కూసోనెట్టుకుంటం,″ అంట వూఁ ఊదరెట్టీసినాడు. మాం గుబగుబలాడిపోయ్నం. నామగోడు నేన్రాను పొమ్మన్నడు. మాఅత్తమ్మ ను పోతే పో, పోరగాల్లని తీసికెల్తానికీల్లేదంది. ఆడివాక్కుల్నమ్మి నాను పోతిని. తీరా సేస్తే ఏటుందక్కట మాత్తరం. మీఇల్ల మీ ఇల్ల సేసుకునే దాసీకంవే ఆడికీ సెయ్యనంవయిందంతే. ఏరాయయైతేనేం పల్లూడకుంతానికని…”

నాకు సంద్రాలు మాటలు సగం అర్థం అయేయి, సగం కాలేదు. ఆ వాగ్ధార చూస్తే మటుకు, “ఏబళ్ళో చదువుకున్నావు, చెప్పు, నేనూ అక్కడే చదూకుంటాన”న బుద్ధేసేది నాకు.

“నాన్సెపతన్న యినుకో. నివ్వు సాచ్చాత్తు మాలచ్చి అస్మంటి ఆతల్లికి బుట్టేవు నివ్వు. ఆయమ్మని మార్సేస్కోగలవా. నేవు. మీయమ్మే మీయమ్మ. మరేయమ్మా మీయమ్మ గానేదు. అసుమంటిదే మతఁవూని. ఎక్కన్నో ఏదో వున్నాదని పరువులెత్తితే ఏటున్నది, ఏంనేదు, దిబ్బ. ఉన్నదాన్లనే సుకం సేసుకోవాల. అద్గదీ నిజింవైన తెలివి. నివు గొప్ప సదూలు సదూకుంతన్నవు. ఇమానంలో ఏలండనో వమిరికవో ఎల్పోతవు కడుపు సేతట్టుకుని. .” నాకు నవ్వొచ్చింది కాని కడుపు సేతట్టుకుని అన్నమాటతో కాస్త ప్రాణం చివుక్కుమంది.

“ఎలా తెలుసు?” అన్నాను.
“అదంతా నాకెరికే. నాకన్నీ తెలస్తయ్ బుల్లెమ్మా. ఈతట్ట సెల్లిపోనంక, అప్పల్సాంవి కొట్టుకాడ కూసుంట బస్సుకోసం. ఆడ జనాలు వూసులాడుకుంతరు, వాలిండియరేడియనాగే,” అంది కొంటెగా నవ్వుతూ.

సంద్రాలుకి నలుగురు పిల్లలు. వాళ్ళని బళ్ళో వెయ్యలేదేం అన్నాను మరోరోజు. “మాకేల సదుగుల్తల్లీ. ఆబోగాలన్నీ తమనాటోరికి తగుతవి. రెక్కాడితే గాని డొక్కాడని బతుగులు మాంవి. డొక్కలోకి సంగటెల్తేనే రెక్కలాడే పేనాలు. ఆల్లు నలువురూ నాల్రూకల్తెస్తే, నానో నాలుగట్టుకొస్తె తలో ముద్దా మింగుడడతది. నేకుంటే అందురం పస్తులే. మాబిడ్డలే మాకు ఆస్తి బుల్లెమ్మా,” అంది. విద్యలేనివాడు వింతపశువు, విద్యవలన కలుగు వినయంబు అంటూ చదవడానికి నాకు నోరు రాలేదు.

తాను మతం వుచ్చుకున్నంతమాత్రాన తనబతుకేం రంగేళీ బతుకయిపోలేదనీ, మరింత ఒరిగిందేం లేదనీ, జ్ఞానోదయం అయి ఇంటికి తిరిగొచ్చేసింది సంద్రాలు. కాని అప్పటికే దానిమొగడు మరో జూనియర్ సంద్రాలుని తెచ్చీసుకుని సెటిలయిపోయేడు. దాంతో కనిపించిన బస్సెక్కేసి, సింహాచలం సివార్ల దిగిన సంద్రాలుకి జిగినీసాయిబు తగిలేడు. “నాకింత గంజి కాసొయ్యి, నీకింత సోటిస్తాను” అన్నాడు వాడు. తలూపింది సంద్రాలు. అయితే సంద్రాలుకి ఆ టీకొట్టు వెనక కమ్మలగుడిసెలో కూచుని జిగినీసాయిబు తెచ్చిన డబ్బుల్తో కాలచ్చేపం సేసుకుంటా కూకోడం నచ్చలేదు. అంచేత, దొఢ్లో నాలుగు పాదులు పెట్టి, ఆకూరలు నాలుగు వీధులంట తిరిగి అమ్ముకు, వచ్చిన డబ్బుల్తో “నానూ ఓమడిసినేని” గర్వంగా తలెత్తుకు తిరుగుతున్నాది.

“ఏటుండిపోతాదంటూనే మల్లీ ఈతాపత్రయం అంతా ఏమిటి?” అన్నాను మరోరోజు నవ్వుతూ. కూరలవ్యాపారం ఎందుకూ, టీకొట్టుమీద వచ్చిన ఆదాయం ఇద్దరికీ సుష్టుగా సరిపోతుంది గదా అన్నాట్ట జిగినీసాయిబు. అందుకని అడిగానామాట.

“మడుసులం గంద. ఆపరమాతుముడేటి సెప్పినాడూ నీడూటీ నువ్ సేసుకుంట పో. ఆపైయవ్వారంవంత నాన్ సూసుకుంతనన్నడు గంద. అంటే ఏటీ. నువ్వు మడిసి జలమెత్తనందుకు నీకో దరమం వున్నాది. అది నువ్ సేసుకోవాల. అంతే గానీ అదేటీ, ఇదేటీ అంట లాపాయంటులు నాగరాదు,” అంటూ లాపాయింట్ పాఠాలు చెప్పేసింది నాకు ఏకటాకీని.


అర్థశతాబ్దం దాటినా సంద్రాలు భాషణలు నామనసులో చెక్కు చెదరకుండా అలానే వున్నా.యి ఈనాటికీనూ నిన్నో మొన్నో విన్నట్టు..

నీర్కావిపంచెలా వెలవెలబోతున్న నింగీ, ఆ నింగిలోకి తొంగి చూస్తూ, బోడికొమ్మల్తో అస్థిపంజరాల్లా వాకిట్లో నిలబడ్డ మేపుల్ చెట్లు మీద పడుతున్న మంచుతో బూడిద పూసుకుని తపోనిష్ఠలో వున్న పరమయోగుల్లా నిలబడి కాలగతికి అద్దం పడుతున్నాయి. చెప్పుకోదగ్గ కారణం లేకుండానే నామనసు మొద్దు బారిపోయింది. వేడి వేడి పకోడీలు సేవిస్తూనో, వెచ్చగా ముసుగుదన్ని ఏ లోకాల్లోకో తేలిపోతూనో పొద్దుపుచ్చుకోవలసిన సుందర సమయం. సంద్రాలు గుర్తొచ్చింది ఏటుండిపోత్తల్లీ అంటూ, అసందర్భంగానే.

అమెరికాలో దిగడి ముప్పై ఏళ్ళు దాటుతోంది.. గత ఇరవై యేళ్ళలోనూ ఏడు కంప్యూటర్లు మారేయి. అయిదున్నర ఇంచీల ఫ్లాపీలనుంచి అరచేతిలో ఉసిరిక్కాయల్లా ఇమిడిపోయే సీడీలదాకా సాంకేతిక ఇంద్రజాలంలో పడి కొట్టుకుపోతున్నాను ఏటివాలులో ఓటుపడవలా… ఏటా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న“న్యూ అండ్ ఇంప్రూవుడు” గాడ్జెట్టుల అడుగులకి మడుగులొత్తుతూ, నాతిచరామి అనుకుంటూ నడవకపోతే నా రాతలు కాలదోషం పట్టిపోతాయేదేమోనని భయం. అయిదురకాల తెలుగుఫాంటులు మార్చాను నిత్యనూతనంగా వచ్చిపడుతున్న సిస్టముల వత్తిడికి గిలగిల్లాడుతూనే.

ఈ వైరాగ్యానికి అసలు కారణం నిన్న నా బాసురుడి సతాయింపు. అ-నుంచి క్షవరకూ తెలుగు నేర్చిన ఓఅమెరికను ఓచిన్న కంపెనీ మొదలుపెట్టాడు భారతీయభాషలలో వున్న సాహిత్యాన్ని డిజిటైజు చేసి, సర్వాంగసుందరంగా ఫార్మాటింగు చేసి, చక్కని ముఖపత్రంతో శాశ్వతంగా పదిలపరుస్తాం అంటూ. ఆయన మార్కెటింగ్ చూసుకుంటానన్నాడు. నాకు బిజినెస్ బుర్ర లేనందున నేను అతని దగ్గర చేరేను. నాపని పైన చెప్పిందంతా చెయ్యడం. తెలుగువాళ్ళు బోలెడు డాలర్లు గుమ్మరించి మాచేత ఈపని చేయించుకోడం ఎంచేతో నాకు అర్థంకాదు. దేశంలోనే తెలుగువారిచేతే చేయించుకోవచ్చు కదా. అవుట్సోర్సింగులో ముచ్చట్లు అనుభవించడానికా? అలాచేస్తే కానీ ప్రపంచీకరణ అనిపిపించుకోదనా? తెల్లవారిచేతిలో తెలుగు మరింత తెల్లమవుతుందనా?

ఏమో మరి.

ఇంతకీ నాకు వచ్చిన తెలుగుపుస్తకంలో భాష పరమఘోరంగా వుంది. ’’ఆయన పచ్చి శాకాహరము తినిపించబడవలసిన అవుసరము కలిగెను. స్నీనము చేపించుటకు ఇతరులు లేక పరివేషకులు పస్తువులు తెచ్చి ఇచ్చుడకు కవలసిన వస్తు సందాయంనకు వారు దుకానములో తీసుకొనిరాకుండుటకు…” ఇలా తలా తోకా లేని వాక్యాలూ, ముద్రారాక్షసాలూ పుష్కలంగా వున్నాయి. నేను బాసుబాబుకి ఆమాట చెప్పి, ″తప్పులు దిద్ది పంపమని అడగండి″ అన్నాను.

దానికి ఆయన కోపం తెచ్చుకోకుండా, స్వరం బాగా తగ్గించి, కాస్త ముందుకి వంగి, ″నీకు ఇచ్చినపని చెయ్యడమే నీవంతు. మనం వారిని తప్పులు పట్టరాదు″ అన్నాడు, మళ్ళీ ఏం అనుకున్నాడో, ″నేను వాళ్ళని అడుగుతాను, ఈలోపల నీపని మొదలుపెట్టు″ అన్నాడు. మంచి కాపీ వచ్చింతరవాత ఒకేసారి చెయ్యొచ్చు కదా అంటే అతనికి నచ్చలేదు. ఆయనగారి నిజబాధ ఆతప్పులు నేను పట్టేననేమో. నేనేదో నాపాండిత్యం ప్రదర్శించేస్తున్నాననకుంటున్నాడేమో…. మిడిమిడి భాషాపరిజ్ఞానంగలవారితో మామూలుగా వచ్చే చిక్కే ఇది.

అంతర్జాలంలో తెలుగు ముంగిళ్ళు చూస్తూ కూచున్నాను. తెలుగుపుస్తకాలన్నీ డిజిటైజు చేస్తున్నారుట, వాటిని శాశ్వతం చేసి కాపాడుకోడానికి. నాకు నవ్వొచ్చింది. నేను కూడా ఆ దోవలోనే నడుస్తున్నాను మరి. అసలు మనదేశంలో 19వ శతాబ్దంలో ముద్రణ మొదలు పెట్టినప్పుడు వాళ్ళ వుద్దేశ్యం మన జ్ఞానసంపద ఎక్కువమందికి అందుబాటులోకి తీసుకురావాలని. శాశ్వతంగా వుంటుందన్నది రెండో కారణం. ఇప్పుడు ఆ అభిప్రాయానికి తకరారొచ్చింది. – కాయితాలు చెదలుతినేస్తాయనీ, వానల్లో వరదల్లో ఆనవాలు లేకుండా కొట్టుకుపోతాయనీ డిజిటైజు చేస్తున్నారు. అలా చేస్తే దేశంలోనే కాక ఖండఖండాంతరాలకి విస్తరిల్లుతాయనీ, అవి పరమ శాశ్వతం అయిపోడానికి మరి ఇహ ఢోకా లేదనీ అభిజ్ఞుల అబిప్రాయం. నిజంగా??

నాకు దిగులు ముంచుకువస్తోంది. …నేను కూడా కంప్యూటరు యుగం వచ్చేసింది కదాని నాకథలు శాశ్వతం చేయడంకోసం నీలితెర కెక్కించడం మొదలుపెట్టేను. ఇరవై ఏళ్ళ కిందట, ఓ సంస్కృతం నేర్చిన అమెరికను ప్రొఫెసరుగారు తయారుచేసిన తెలుగు ఫాంట్స్తో టైపు చేసి, ఐదుంబావు అంగుళాల ఫ్లాపీల మీద పదిలపర్చుకుంటూ వచ్చేను. ఆ ఫాంట్స్ వాడకం అట్టే కాలం నిలవలేదు. కంప్యూటరు అప్గ్రేడు చేసుకున్నప్పుడే పోతన ఫాంటులు వాడడం మొదలుపెట్టేను. ఆతరవాత శ్రీఫాంట్స్ బావున్నాయని ఓ సుమిత్రుడు ఇండియా వెళ్ళినప్పుడు కొనుక్కొచ్చి ఇస్తే, అవి వాడేను. మధ్యలో ఇంకేవో వాడేను. ఐందుబావు ఫ్లాఫీలు పోయి మూడున్నర అంగుళాల ఫ్లాపీలొచ్చేయి. ఇప్పుడు నాకంప్యూటరులో అసలు ఫ్లాపీడ్రైవే లేదు. దానికోసం వేరే ఫ్లాఫీ డొక్కు కొనుక్కోమన్నారు. నేను కొన్న శ్రీఫాంటులతో పీడీయఫ్ చేసిన కథలు ఈనాడు కొన్ని సరికొత్త కంప్యూటరులు అపార్థం చేసుకుని అక్షరాల్ని గజిబిజిగా ఆలికేస్తున్నాయి, బాబిగాడు వేసే ముగ్గుల్లా. ప్రోగ్రామరులు వున్న ఫాంటులని శాశ్వతంగా వాడే ప్రయత్నం చెయ్యడానకి బదులు కొత్త కొత్త ఫాంటులు రాసిపారేస్తున్నారు. ఇప్పటికి అయిదు రకాలు వాడిన నన్ను ఈ సాంకేతికులు మరో ఫాంటు రాసేం –దీనికి తిరుగులేదు, దీనికిదే సాటి, వాడి చూడండంటున్నారు.

నాబాధ – నాపాత కథలు ఎంతకని మళ్ళీ మళ్ళీ టైపు చేసుకుంటూ కూర్చోనూ? నావల్ల కాదు.

చిన్నప్పుడు ఎంతో ఆసక్తిగా బట్టీపట్టిన గీతం పాడుకోవాలనిపిస్తోంది. “ఏవి తల్లీ నిరుడు కురిసిన హిమసమూహములు, … చక్రవర్తి అశోకుడేడీ, … జగద్గురు శంకరుండేడీ”. నిరుడుకురిసిన హిమ సమూహములని వదిలిపెట్టి, పద పదమంటూ ముందుకు తోసుకుపోయాడు శ్రీశ్రీ మరోప్రపంచానికి ….పదికాలాల పాటు నిలబెట్టుకుని తరతరాలా వారసత్వపు హక్కుగా అనుభవించవలసిన మిద్దెకి ఉద్వాసన చెప్పి, నేను ఎడతగని న్యూ … ఇంప్రువ్డ్ … ఎండ్ అల్టిమేట్ … అనుక్షణం మారిపోతున్న సంస్కృతికి దాసోహం అనుకుంటూ, నిత్యనూతనమైన వింతలకోసం, నాలుగు క్షణాల మెరుపులకోసం ఆత్రపడిపోతూ దినములు గడుపుతున్నాను.

ఏది శాశ్వతం అనుకుంటూనే ఏదో ఒకటి చెయ్యకపోతే పొద్దు పోదు. ప్రతివాణ్ణీ జీవితంలో పదిహేను నిముషాలపాటు కీర్తికాంత వరించి తీరుతుందంటారు అమెరికనులు. అందులో శాశ్వతం ప్రస్తావన లేదు. నిరుడు కురిసిన హిమసమూహములూ, నిన్నటి వార్తలూ పట్టించుకునే ఓపికలేదు. .. మన బతుకులు ఇవాళా, రేపటితో ముడిపడి వున్నాయి. నాడూటీ నేను చేసుకుంటూ పోవాలి. అంతే.

సంద్రాలు ఎదురుగా నిలబడి ఏటుండిపోత్తల్లీ అంటూ ఎత్తిపొడిచినట్టయింది. సంద్రాలు నోట వెలువడిన మాటే “అక్షరం” అనిపిస్తోంది ఈనాటి వెబ్జాలంలో చిక్కుకుపోయిన నాకు. నా డూటీ నేను సేస్కంటా పోవాల. అంతే.

తెలివొచ్చింది. ఆచెత్తపుస్తకం తీసుకుని వున్నదున్నట్టు టైపు చెయ్యడం మొదలెట్టాను. మా బాసుకి కావలసింది నా వేళ్ళు కీబోర్డుమీద తకతకలాడుతున్నాయా లేదా అన్నదే కదా. *

[నామాట- ఇది ఎందుకు రాసిందన్న సందేహం కొందరికైనా రాకమానదు. ఆ సందేహనివృత్తి కోసం: మన సంస్కృతిలో వున్నచోట వుండడం, వస్తువు పదికాలాలపాటు మనడం కోరుకుంటారు. ఆధునికయుగంలో కదలిక పురోగమనానికి సంకేతం. కదుల్తూంటే పైకి పోతున్నట్టే లెక్క [moving is moving up]. పురోగమనంపేరుతో ఒకొక్కప్పుడు మనం పనికిమాలిన పనులు కూడా చేస్తున్నామేమో, చేయాల్సొస్తుందేమో అనిపిస్తుంది నాకు. – రచయిత్రి.]