ఉగాదికి ప్రోగ్రాం పెట్టాలన్నారు తెలుగు ఎసోసియేషన్ వాళ్ళు. ప్రతి శనివారం మీటింగు. మెంబర్లు రావడం, మాట్లాడ్డం, వెళ్ళడం, ఎంతకీ విషయం తేలకపోవడం.. కొంతమంది ఆఫీసులో వెలగబెట్టలేకపోయిన మేనేజీరియల్ ట్రిక్కులన్నీ మెంబర్లమీద ప్రయోగించి గంటలు తినెయ్యడం.. అన్నీ అయ్యాక, అన్నీ బలవంతపు నిర్ణయాలే.
కొత్త స్ఫూర్తితో ఒక ప్రోగ్రాం ఉండాలనుకున్నాడు లాం. తన మనసుని తొలిచేస్తున్న ఈ “ఇండియన్ కల్చర్” మీద గ్రూప్ డిస్కషన్ పెడితే బాగుంటుందనిపించింది. ఊళ్ళో దిగ్గజాల్ని పిలవాలి. లేకపోతే రాంబందుల్లా పీక్కుతినేస్తారు. కాని ఫోరమ్ నడిపించేందుకు ఒక మోడరేటర్ కావాలి. “నందు అయితే బెస్ట్” అనుకుంటూ ఫోన్ చేసాడు.
నందు పెళ్ళాం విశాల ఫోన్ ఎత్తింది. “హల్లో! అన్నయ్య గారూ! బాగున్నారా? చాల్రోజులైంది మీతో మాట్టాడి”
“అదేనండీ! మన తెలుగు ఎసోసియేషన్..”
“కుదర్దండీ. నాకేమీ ఐటమ్స్ ఇవ్వద్దు. క్రితం దసరా ఫంక్షన్‌కి పూరీలన్నారు. వందమందికి పూరీలు చేసేటప్పటికి నాచేతులు పూరీలైపోయాయి. ఆ నొప్పులింకా తగ్గలేదంటే నమ్మండి..” ఆవిడధోరణిలో చెప్పుకుపోతోంది.
ఫోన్ పెట్టడానికి లేదు. వినే ఓపిక లేదు.
గాలివాన వెలిశాక నీరసంగా అడిగాడు “నందూ ఉన్నాడా” అని.
వాడు ఫోన్లోకి వచ్చాక విషయం చెప్పాడు.
“ఇది చాలా controversial topic . ఎవడి భావాలు వాడివి. కాదంటే కోపం. ఔననడానికి మనసొప్పదు. ఎందుకొచ్చిన తంటా? నెత్తికెత్తుకోవద్దులే” అనేసాడు నందు.
“ఎవరెలా అర్ధం చేసుకున్నా, కల్చర్ అనేది ఒకటుందిగా. దాని స్వరూపమేమిటో తెలియాలిగా?” లాం, ది విక్రమ్.
“అలాగే కానియ్. ఉంటానూ..” వాళ్ళ టీనేజ్ అమ్మాయి ఇప్పటికి ఒక వందసార్లు “డాడీ” మంత్రం (అరిచి) పఠించి ఉంటుంది బాక్‌గ్రౌండ్‌లో.
ప్రకటన వినగానే “గ్రేట్ టాపిక్” అన్నారంతా. పిల్లల్ని తేవాలా? బేబీసిట్టర్స్ ఉంటారా? లాంటి ప్రశ్నల్తో వేధించారు.
అన్ని పురిటినొప్పులూ పడి, ఫోరమ్ మొదలయింది. మొదటి సమావేశం.
పుంఖానుపుంఖాలుగా రచనలుచేసి, నోరే తప్ప కాలుగాని, చెయ్యిగాని జారని రచయిత ధర్మారావ్ మొదలెట్టాడు. “కల్చర్ మీద నేను చాలా ఖధలు రాసా. ఎస్పెషల్లీ, ఇక్కడి పిల్లలకి ఉపయోగపడేలా” నాలుగు పుస్తకాలు తీసి టేబుల్‌మిద పెట్టాడు “కల్చర్ ఫర్ సేల్” అన్నట్టుగా.
“తెలుగులో రాస్తే ఇక్కడి పిల్లలేం చదువుతారు?” అమాయకంగా ప్రశ్నవేసి ఆశ్చర్యపోయాడు రాఘవ. అదృష్టం కొద్దీ వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్. ధర్మారావ్ నవ్వేసాడు.
” let us not deviate from the topic ” ఎప్పుడూ ఆఫీస్‌లో వాదనల్లో ఓడిపోయే ఆనందరావ్ గదిమాడు. కల్చర్ అంటే ఏమిటో ఈరోజే తేలిపోవాలన్నట్టుంది అతని ముఖం.
ఏమిటో ఇదంతా అన్నట్టు కూర్చున్న విశ్వనాధం ఎక్కసంగా “అన్నిటికీ తొందరపడ్డం మన కల్చర్” అని అటు తిరిగాడు ఎందుకొచ్చాడో తనకే తెలియనట్టు.
అందరికీ ఏదో చెప్పాలని ఉంది. ఎక్కడ మొదలెట్టాలా అని ఆలోచిస్తున్నారు. ధర్మారావెక్కడ కధ చదవడం మొదలుపెడతాడోనని అందరికీ భయంగా ఉంది. ఆ ఛాన్సిచ్చి జెల్ల తినడం ఎందుకని నందు మొదలు పెట్టాడు. “మనం దేన్ని కల్చర్ అనుకుని ఆరాధిస్తున్నామో అది నిజంగా కల్చరా కాదా అని నా సందేహం. మనం ఇండియాలో 10, 20 ఏళ్ళక్రితం ఉన్నవాళ్ళం. మనకి తెలిసిన దేశం అప్పటిదే. ఆ కాలపరిమితి లోనే మన మెమొరీస్ ఫ్రీజ్ అయిపోయాయి. ఇంకా అక్కడి కల్చర్ అలానే ఉందనుకుని దాన్నే ఆరాధిస్తూ, దాన్నే నిలబెట్టాలని ప్రయత్నిస్తున్నాం.” వెర్రివాడిలా తనే వాగుతున్నాడా అని అనుమానం వచ్చింది నందుకి.
నందు ఆగ్గానే ధర్మారావ్ అందుకున్నాడు. “మనుషులు, కాలాలు, భావాలు, సమాజాలు మారుతూనే ఉంటాయి. వీటన్నిటికీ వారధి కట్టి ఒక్కతాటిపైన నడిపేవే లలిత కళలు. అందుకే అవి representatives of culture “.
లాం ముఖం వెలిగింది. “ఎక్సాక్ట్‌లీ, ధర్మారావ్‌గారు చెప్పిందాంట్లో గొప్ప పాయింట్ ఉంది. ..” అందుకోబోయాడు. అంతలోనే ఛాన్స్ కోల్పోయాడు.
“అయితే లలిత కళలు నేర్చుకోకపోతే కల్చర్ లేనట్టేనా?” రాఘవ అమాయక ప్రశ్న.
“అని ఆయన అన్లేదే..” మళ్ళీ అందుకోబోయాడు లాం. ధర్మారావ్ అడ్డుపడ్డాడు.
“ఉండండి నే చేబుతా దానికి సమాధానం. లలిత కళలు నేర్చుకోక్కర్లేదు గాని,ఆనందిస్తే చాలు. ఏదో ఒక కళను ఆనందించని వాడుండడు ఈలోకంలో”.
“అంత గ్యారంటీ ఏమిటో” చెక్కముఖంతో విసిరాడు విశ్వనాధం.
“ఆనందించకపోతే, ఆనందింపజేస్తారేమో!” కన్నుగీటుతూ అన్నాడు వసంతలక్ష్మి మొగుడు అలియస్ వాలమ్మో.
“విద్యలేనివాడు వింత పశువు.” ఒక అసందర్భపు సామెత నుడివాడు ధర్మారావ్ ఉడుకుమోత్తనంతో.
” Let us not deviate from the topic ” మళ్ళీ ఆనందరావ్ అరిచాడు.
“ఇక్కడెవరూ డీవియేట్ కాలేదు” ధర్మారావ్ సహనం కోల్పోతున్నాడు.
“అయారు. కల్చర్ గురించి మానీసి అవీ ఇవీ మాట్టాడుతున్నారు”. ఎటెన్‌షన్ కోసం వలపలాడిపోతున్న వసంతలక్ష్మి సన్నాయి నొక్కులు నొక్కింది.
“అవతలివాడి ప్రశ్న అర్ధం చేసుకోకుండా ఆవేశపడ్డం మన కల్చర్” నసిగాడు విశ్వనాధం.
“అయ్యా! కల్చరంటే ఏమిటో నిర్వచిద్దామని మేమొస్తే, మీరు ఊరికిముందర ఉదాహరణలు దంచేస్తున్నారు” వ్యంగ్యంగా ధర్మారావ్ పెద్ద చురక వేసాననుకున్నాడు.
లాంకి మతిపోతోంది. అంతా దెబ్బలాటల్లోకి దిగేలా ఉన్నారు. ఏదో ఒక పక్షం అవాలి. యుద్ధం ఆపాలి. “ఓకే! ఓకే! మిగిలిన రిప్రజెంటేటివ్స్ సంగతి ఏమిటి?” రెండు చేతుల్తో టీ (టైమ్ అవుట్) చేస్తూ అన్నాడు.
” Representatives అంటారేమిటీ? అసలు Definition ఏమిటో తేలకుండా. అసలు మీరూ deviate అవుతున్నది” తలూపుతూ సన్నాయి నొక్కులు.
“ఇలాంటి సమయంలో వేడిగా మాంఛి టీ, పకోడీ ఉంటే ఎలా ఉంటుందంటావ్” ఒకాయనకి అందరినోళ్ళూ ఊరించాలని ప్రయత్నం.
“అచ్చీ, చంపేశారు. పకోడీ కాదు మాష్టారూ. వేడిగా కందట్టు గాని, చేమగారి గాని..” ఇక మాట్లాడలేక వంకర్లు తిరిగిపోతున్నాడో గోదావరి జిల్లేయుడు.
“ష్!” వారించారు కొందరు.
” Definition కేముందమ్మా. ఏ సోషియాలజీ బుక్‌లో చూసినా దొరుకుతుంది. మన సమాజంలో అది ఎలా ఉంది, దాన్ని ఎలా కాపాడుకోవాలి అన్నది ముఖ్యం” అనుభవాన్ని రంగరిద్దామని ధర్మారావ్ తాపత్రయం.
లాం ముఖం వెలిగింది మళ్ళీ. “ఇప్పటికి పాయింట్‌కి వచ్చారు. ఆ సోషియాలజీ డెఫినిషన్ ఏమిటో చూద్దాం. అక్కడినుంచి ప్రొసీడ్ అవుదాం.” ఏదో పెన్నిధి దొరికినవాడిలా సంబరపడిపోతున్నాడు. నది పాయలు కట్టకుండానే డామ్ కట్టడానికి చోటు దొరికినంత సంతోషంగా ఉంది అతనికి.
“మన భాష, హావభావాలు, నమ్మకాలు, విలువలు, ప్రమాణాలు అంటే స్టాండర్స్డ్, ప్రవర్తన .. ఇవేమన కల్చర్‌ని డిఫైన్ చేస్తాయి. ఇవిగాక, కట్టు, బొట్టు, కట్టడాలు, కళలు, పనిముట్లు, మతం ఉండనే ఉన్నాయి.” నందు అప్పజెప్పాడు. ముందు రోజు గుడ్‌విల్‌లో ఒక డాలర్‌కి కొన్న సోషియాలజీ పుస్తకం అక్కరకి వచ్చింది.
“మనం చేసేది ప్రతీదీ కల్చరే అందూ.. సింపుల్ అండ్ ఈజీగా ఉంటుంది” రాఘవ ఉక్కిరిబిక్కిరైనట్టున్నాడు ఈ డెఫినిషన్‌తో.
“కాదే! నువ్వు నేర్చుకున్న ఫిజిక్స్, మాథ్‌లాంటివి ఏ ఒక్క కల్చర్‌వో కావు. మొదట్లో కొన్ని చదువులు ఒక కల్చర్‌లో భాగాలే అయినా, రాను రాను ప్రపంచమంతా వాటిని చదవడంతో అందరి కల్చర్‌లోనూ భాగాలయ్యాయి.” నందూ తనెప్పుడూ ఊహించని పాయింట్ తనే అనర్గళంగా చెప్పేస్తూంటే తనే ఆశ్చర్యపోయాడు.
“ఈ గ్లోబలైజేషన్, ఇంటర్‌నెట్ లాంటివాట్లతో, కొన్నేళ్ళల్లో అందరూ ఒకే జీవన విధానం పాటించే అవకాశముంది. అపుడు ఈ కల్చర్స్ అన్నీ కలిసిపోతాయేమో మన చదువుల్లాగే.” లాం వక్తలా నుడివి, వేదాంతిలా ప్రశ్నించి, ఙ్ఞానిలా నవ్వి ఆగాడు.
“అయితే ఈ డిస్కషన్ వేస్ట్. ఆ రోజొచ్చేవరకూ ఆగుదాం” అరిచారెవరో. అరిచిన శాల్తీ స్టాక్ మార్కెట్ బాధితుల గుంపులో వాడు. వాళ్ళంతా parallel session నడిపిస్తున్నారు. ఈ కల్చర్ పిచ్చాళ్ళని చూస్తే వాళ్ళకి వేళాకోళం.
కల్చర్‌గుంపు వాళ్ళెవళ్ళకీ ఆ శాల్తీకి సమాధానం చెప్పే మూడ్ లేదు. అందరూ నందూ చెప్పినదాన్ని నెమరువేసుకుంటున్నారు. అతను చెప్పినదంతా నిజమేనని పిస్తోంది. అది ఒప్పుకోవడం ఇష్టంగా లేదు. ఎందుకంటే, ఒకటి, తమకి అర్ధం కానివి అంత సింపుల్‌గా ఉండడానికి వీల్లేదనే భ్రాంతి; రెండు, ఒకళ్ళని మించి మరొకళ్ళు, అమెరికనైజ్ అయిపోయామని గర్వపడిపోతూంటారు మనస్సులో. తనకింకా అలాంటి కల్చరల్ టచ్ ఉందని ఒప్పుకున్నవాడు దేశవాళీ శాల్తీగా డిక్లేర్ అయిపోతాడు తక్షణం. అందరూ మౌనంగా కూర్చున్నారు కొద్దిసేపు.
విషయాన్ని ధర్మారావ్ వేరేవిధంగా నరుక్కొచ్చాడు. ” It is trivial. No need to look into a Sociology book for the definition. It is just commonsense ” తన ఆధిక్యత పోతోందనే బాధ కూడా కనిపిస్తోంది అతని కంఠంలో. ఏమీ చదవకుండా రాస్తూండడం ఆయన ప్రత్యేకత. చదివినకొద్దీ రాయాలనే తపన తగ్గిపోతుందని తీవ్రంగా నమ్ముతాడు. ఎక్కువ చదివితే, మనం చెబుదామనుకున్నది అప్పటికే ఎవరో చెప్పేసినట్టనిపించి చెప్పడం మానేస్తామన్నది అతని థియరీ.
“ఏం చదవకుండా ఉపన్యాసాలు దంచడం మన కల్చర్” విశ్వనాధం ఉవాచ.
“నన్నెవరూ ఎత్తిపొడవక్కర్లేదు. I have my own philosophy . ప్రతీదానికీ ఎడ్డెం అంటే తెడ్డెం అనడం మీ కల్చర్” విరుచుకు పడ్డాడు ధర్మారావ్.
“కల్చరో అని మేమొస్తే ఈ యుద్ధాలేమిటీ? ఓకే! భాష ముఖ్యం అన్నారు గాబట్టి మనవాళ్ళకి కల్చర్ అబ్బాలంటే తెలుగు నేర్పించాలి” తీర్మానించింది సునీత పెళ్ళిలో మగపెళ్ళివారు ‘ఇది మా ఆనవాయితీ,తప్పడానికి వీల్లేదు ‘ అన్నట్టు.
” Definition తెలియగానే తీర్మానాలేనా డైరెక్టుగా?” విసుగ్గా అన్నాడు విశ్వనాధం.
“హావభావాలు, నమ్మకాలు, ప్రమాణాలు, ప్రవర్తనా లాంటివి నేర్పడం impossible in this society . ఇక మిగిలిందేమిటి?” సునీత అరిచినంతపని చేసింది. పిల్లల్తో వాదించి వాదించి విసిగిపోయిన అలుపు, చిరాకు, అనుభవం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది ఆమెలో.
“భాష, విలువలు నేర్పడం ముఖ్యం .. అది సాహిత్యం ద్వారానే సాధ్యం” ధర్మారావ్ ఉవాచ.
“ప్రాస బాగానే ఉంది కాని, పని చేసేసరికి తాతలు దిగొస్తారు” మరో సన్నాయి నొక్కు.
“అవి మనకెంత ఉన్నాయని, వాళ్ళకి చెప్పబోవడానికి?” విశ్వనాధం విసురు సన్నాయి నొక్కులో నలిగిపోయింది.
“ఆలోచిస్తోంటే భాషా, విలువలూ, కళలు .. ఇంతకుమించి ఏమీనేర్పించలేం. That is not even one fourth of our culture. దాంట్లో కూడా, మనం మాట్టాడే తెలుగంతా contaminated. మనం కనీసం ఇంగువకి కట్టిన గుడ్డల్లానైనా బతకాలంటే కళలే శరణ్యంలా ఉంది” నిట్టూరుస్తూ అన్నాడు ఆనందరావ్. అంతవరకూ చూపించిన మేమేజీరియల్ దర్పం కొడిగట్టిపోతోంది అతనిలో. .
(సశేషం)