తెలుగు జీవిత చరిత్రలు:ఆచంట జానకిరామ్”సాగుతున్న యాత్ర”

తెలుగులో స్వీయ జీవిత చరిత్రల్ని గ్రంధస్థం చేయటం కందుకూరి వీరేశలింగంతో ప్రారంభమైంది. “తెలుగు భాషలో స్వీయచరిత్ర వ్రాయబూనుట కిదియే ప్రథమ ప్రయత్నం,” అని వారే రాసేరు. ఇందులో ఆయన మొదటి వాడైనా, రెండో వాడైనా వారి జీవిత చరిత్ర ఒక విధంగా ఆంధ్రదేశపు సాంఘిక చరిత్ర అనటం మాత్రం నిర్వివాదాంశం. వీరేశలింగం గారి శిష్యుడు రాయసం వెంకటశివుడు తన ఆత్మకథ 1933 లో ప్రచురించేరు. అలాగే చిలకమర్తి వారు. ప్రస్తుతం లభ్యం కాని వల్లూరి సూర్యనారాయణ (18661933) గారి స్వీయచరిత్ర సూర్యనారాయణీయం. వీరు హేతువాది అని, అదే దృక్పథంతో మన పురాణగాథలని విమర్శించేరని తెలుస్తోంది. ఇంకొక విలక్షణ స్వీయకథనం “నా ఎఱుక”, “హరికథా పితామహుడగు ఆదిభట్ల దాసు సాహిత్యం,సంగీతం సరితూచిన త్రాసు,” అని శ్రీశ్రీ కీర్తించిన ఆదిభట్ల నారాయణదాసు గారిది.

ఎంత సామాజిక స్పృహ లేని రచయితైనా ఎంతో కొంత తన సమకాలిక జీవితం చిత్రించకుండా ఉండలేడు. అయితే జీవిత చరిత్ర ఒక్కొక్కరూ ఒక్కోలా రాస్తారు. ఉయ్యాల రోజుల్నుంచీ ముసలితనం వరకూ కొందరు సృజిస్తే, తమ కాలం నాటి సామాజిక నేపధ్యం, జీవితంలోని మధురక్షణాలు ఎంపిక చేసి జ్ఞాపకాల రూపంలో అందించటం మరో పద్ధతి.

వీరేశలింగం లాంటి సాంఘిక విప్లవకారుల, టంగుటూరి ప్రకాశం లాంటి రాజకీయ నాయకుల రచనలకు భిన్నంగా వారి వారి అనుభవాల్ని పంచుకున్నవి బుచ్చిబాబు “అంతరంగ కథనం”, ఆచంట జానకిరామ్‌ “సాగుతున్న యాత్ర”, సంజీవ దేవ్‌ స్వీయ కథనత్రయం “తెగిన జ్ఞాపకాలు”. శ్రీశ్రీ కూడా తన జ్ఞాపకాలు “అనంతం” లో గ్రంధస్థం చేసినా, అవి వేర్వేరు సమయాల్లో రాయటం వల్ల దాంట్లో పొందిక ( coherence) లేదు.

* * *
జీవిత కథా సాహిత్యంలో ఆనాటి నుండీ ఈనాటి వరకూ మేము ఎన్నిక చేసేది ఆచంట జానకిరామ్‌ జ్ఞాపకాలు. తన మొదటి జ్ఞాపకం అతని మాతృమూర్తి మరణం గురించి “నాకు నాలుగేళ్ళప్పుడు మా అమ్మను గోదావరి తల్లికి వప్పచెప్పి ఆ రాత్రి రాత్రే నదిని దాటి విజ్ఞేశ్వరం వస్తున్నాము రహదారి పడవలో. మాఘమాసం పౌర్ణమి వెన్నెలైనా, ఆకాశమంతా ఎందుచేతనో ఒక వింత వూదా రంగుతో నిండి ఉంది. నక్షత్రాలు మెరిసిపోతున్నయి. గాలి లేదు. సర్వమూ నిశ్శబ్దము. అప్పుడు లక్ష కెరటాల మీద తేలిపోతున్న చంద్రబింబంకేసి చూస్తూ వున్న నా కళ్ళ ఎదుట ఆ కెరటాల మీద మా అమ్మ కనిపించింది. తెల్లని జరీచీరె, బంగారపు వడ్డాణ్ణము, చేతులకి వంకీలు, మెళ్ళో కంటె, కాసుల పేరు, చెవులకు బావిలీలు, ముక్కున అడ్డబాస, చెంపలకు చేర్చిదువ్విన నల్లని తలకట్టు, పెద్ద అరకాసంత కుంకుమ బొట్టు.”

1957 లో కాబోలు వీరి జ్ఞాపకాలు ధారావాహికగా ఆంధ్రప్రభ దినపత్రికలో వచ్చాయి. అవన్నీ సంగ్రహపరచి “నా స్మృతి పథంలో”(1957), “సాగుతున్న యాత్ర” (1963) ప్రచురితం అయ్యాయి. ఆ జ్ఞాపకాలు ఆంధ్రప్రభలో ధారావాహికగా వస్తున్న రోజుల్లోనే అవి పాఠకులను విపరీతంగా ఆకర్షించాయి. “స్మృతి పథాల జానకిరామ్‌” గా తన్ని అందరూ గుర్తిస్తున్నారని వారే తెలియజేశారు.

జానకిరామ్‌ తన రచనల కన్నా ప్రసిద్ధుడు. గొప్ప సౌజన్యమూర్తి, స్నేహశీలి, సౌమ్యుడు, భావుకుడు. తెలుగు, ఇంగ్లీషు, సంస్కృత భాషల్లో పండితుడు. ఈ భాషల్లోనే మంచి కవిత్వాన్ని చదివి ఆస్వాదించిన రసికుడు. తను ఆస్వాదించిన దాన్ని పది మందికి పంచి ఇవ్వగల్గిన ప్రతిభావంతుడు. అందుకే వారి రచన సాహిత్య ప్రియులందరినీ బాగా ఆకట్టుకుంది.

జానకిరామ్‌ గత శతాబ్దం మొదట్లో జన్మించారు. తండ్రి ఆచంట లక్ష్మీపతి ప్రముఖ ఆయుర్వేద వైద్యులు, సంఘ సంస్కర్త. వారి పెంపకంలో జానకిరామ్‌కి ఉత్తమ సంస్కారం అబ్బటంలో ఆశ్చర్యం లేదు. రాజకీయ, సాంఘిక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న కుటుంబం అవటం వల్ల ఆ ప్రభావాలన్నీ ఇతని మీద ఉన్నాయి. చిన్నప్పట్నించీ సమకాలిక మహావ్యక్తుల పరిచయ భాగ్యం లభించింది. వీరేశలింగం, గురజాడ, ఉన్నవ లాంటి సంస్కర్తలు, రచయితలు తన తండ్రితో ఇష్టాగోష్టి జరుపుతున్నప్పుడు వినే అదృష్టం కలిగింది.

ఆయన బాల్యం అంతా మద్రాసులో గడిచింది, అడయార్‌ లో. మొదటి యుద్ధం రోజుల్లో కొంత కాలం మదనపల్లిలో విద్యాభ్యాసం. ఆ రోజుల్లోనే అక్కడ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ గా ఉన్న జేంసు కజిన్సు శిష్యరికం. కజిన్సు జానకిరామ్‌కి చిత్ర కళలో అభిరుచి కల్పించారు. వారి సాంగత్యంలో తనెన్నో విషయాలు నేర్చుకున్నానని జానకిరామ్‌ తెలియజేశారు. తనకి దువ్వూరి రామిరెడ్డి, అడవి బాపిరాజు గార్లను పరిచయం చేసింది కూడా కజిన్సే. ఆ రోజుల్లోనే హోమ్‌ రూల్‌ నాయకులు అనీ బిసెంట్‌ అరండేల్‌ ల ప్రభావం పడింది. మదనపల్లి లో ఉండగానే అక్కడికి వచ్చిన రవీంద్రుడ్ని దగ్గరగా చూసే భాగ్యం కలిగింది. అడయార్‌ లో బి. ఎస్సీ. అయ్యాక వారు కొంత కాలం విజయనగరంలోనూ, బెంగుళూరు ఇండియన్‌ ఇంస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ లో రసాయన శాస్త్ర పరిశోధనలు చేశారు. బెంగుళూరు లో ఉన్న రోజుల్లో హరిన్‌ చట్టోపాధ్యాయ, ఆయన భార్య కమలాదేవి దంపతులతో స్నేహం కలిసింది. హరిన్‌ తో స్నేహం జీవితాంతం కొనసాగింది. ఇద్దరూ కలిసి కృష్ణశాస్త్రి పద్యాలు ఇంగ్లీషులోకి అనువదించేవారట.

ఆ రోజుల్లో కృష్ణశాస్త్రి “కృష్ణపక్షం” పద్యాలు, నండూరి వారి ఎంకిపాటల తో తెలుగు సాహితీ ప్రపంచం మారు మ్రోగి పోతోంది. అదే సమయంలో వెంకట పార్వతీశ్వర కవుల “ఏకాంత సేవ” వెలువడింది. “ఏకాంతసేవ” కావ్యం జానకిరామ్‌ని ఎక్కువగా ప్రభావితం చేసింది. “ఎన్నోవేల పుస్తకాలు చదివాను ఇంగ్లీషు తెలుగు భాషల్లో. అవన్నీ ఒకెత్తూ, ఏకాంతసేవ కావ్యం ఒక ఎత్తు,” అని వారు తెలియచేశారు.

బెంగుళూరు రిసర్చి జీవితం తర్వాత ఇన్స్యూరెన్సు కంపెనీ కార్యదర్శిగా బెజవాడ కేంద్రంగా పెట్టుకుని తిరిగారు. ఆ రోజుల్లోనే ఆయనకి ఆంధ్రప్రదేశ్‌ లోని కవి పండితులందరితో పరిచయం, స్నేహం పెరిగాయి.ఉద్దండులైన కవులు, గాయకులు, తత్వవేత్తలు, శాస్త్రజ్ఞులు, అన్నిరంగాల్లోని నిష్ణాతులతో మైత్రి ఏర్పడ్డమే కాక వారి ప్రేమానురాగాలు పొందారు. ఆ రోజుల్లోనే బసవరాజు అప్పారావు తో పరిచయం. కవి స్వంత గొంతుకలో “వంటిగా ఉయ్యాలలూగితివా నా ముద్దు కృష్ణా” అనే పాట “లేపనైనా లేపలేదే” అనే గీతాలు విన్నారు. ఆ తర్వాత ఈ పాటలు టంగుటూరి సూర్యకుమారి ఆలాపించారు. అలాగే కృష్ణశాస్త్రి, వేదుల, అబ్బూరి, చలం ల తో ప్రగాఢ మైత్రి ఏర్పడింది. విశ్వనాథం, దుర్గాబాయి, కమలా దేవి లాంటి మిత్రులే కాకుండా, తన కుటుంబంలో పిన్ని రుక్మిణమ్మ, మేనబావలు రాజకీయాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నా జానకిరాం మాత్రం ఉద్యమానికి ప్రేక్షకుడిగా, మిత్రుడిగా ఉండిపోయారు. 1935 భారతదేశం లో రేడియో ప్రసారాలు ప్రారంభమైన కొత్తలోనే వీరు రేడియో సంస్థలో ఉద్యోగంలో చేరారు. రేడియోలో పని చేసే రోజుల్లో వీరికి బుచ్చిబాబుతో పరిచయం, స్నేహం పెరిగాయి. బుచ్చిబాబు తన నవలకు మొదట పెట్టిన పేరు “ఏకాంతం”. దానికి “చివరకు మిగిలేది” అనే భావయుక్తమైన పేరు పెట్టటమే కాకుండా మంచి ముఖచిత్రం కూడా సూచించారు. ఆ ముఖచిత్రమే “పల్లవి” వాళ్ళు వేసిన బుచ్చిబాబు కథల సంపుటాలకు ముఖచిత్రంగా ఉంది.

జీవితంలో అర శతాబ్దం గడిచేక వారు ఈ జ్ఞాపకాల పరంపరను నెమరువేసుకున్నారు. దానికి ముఖ్య ప్రేరణ నార్ల వారు. నేపధ్యంలో మల్లంపల్లి సోమశేఖర శర్మ గారు. తన అనుభవాల పరంపర కొంపెల్ల జనార్దన రావుకు అంకితం చేశారు. ఆచంట జానకిరామ్‌ జ్ఞాపకాలు మూడు దశాబ్దాల సాంస్కృతిక చరిత్ర. ఈ విలక్షణమైన రచనల ప్రత్యేకత ఏమిటంటే తను నేపధ్యంలో ఉండి, తను పరిచయం చేస్తున్న మిత్రులను, ఘటనలను, highlight చెయ్యడం. చలం గారి మాటల్లో చెప్పాలంటే “దాంట్లో charm ఏమిటంటే అతని అనుభవాన్ని ఎంతో భద్రంగా ఇన్నేళ్ళు, after events కి influence కాకుండా, isolate చేసి, sterilize చేసి produce చెయ్యటం.” ఒక్క మాటలో చెప్పాలంటే, పాత జ్ఞాపకాలన్నింటినీ deep freeze లో భద్రం చేసి, ఒక్క సారి defrost చేసి తాజాగా మనకందించడం. ఒక వ్యక్తి తన జీవితకాలంలో అంత మంది సమకాలికులైన ప్రతిభామూర్తులను కలుసుకోగల్గడం, వారి ప్రేమానురాగాలను పొందగల్గడం గొప్ప విషయం.

తన అరవై ఏళ్ళ జీవితానుభవాన్ని మనతో పంచుకుంటూ జానకిరాం అంటారు కదా, “జీవితం ఒక రన్నింగ్‌ రేస్‌. అందరికీ మొదటి, రెండు, స్థానాలు రావు కదా. అందుచేత ఫలమెలా పరిణమించినా మనం పట్టించుకోకూడదు. ఏది చేసినా బాగా మనస్సు పెట్టి చెయ్యాలి. మనిషికీ మనిషికీ మరి కాస్త అన్యోన్యత ఉండాలి…’దొంగలున్నారు జాగ్రత్త ‘ అని హెచ్చరిక వినగానే మనం జేబులు గట్టిగా పట్టుకుని ఈ పక్క, ఆ పక్క ఉన్న ప్రయాణీకుల వైపు సందేహిస్తూ చూడడం మానుకోవాలి.”

అతని అలవాట్లు చాలా మట్టుకు పాశ్చాత్య పద్ధతి లోనివే. తనే చెప్పుకున్నట్లు అతని ధ్యేయం తన చుట్టూ ఉన్న వారిని సంతోష పెట్ట్టటం. ఒక సారి బొంబాయి లో అతనికి ఆపరేషను జరిగింది ఆపరేషనైన నాల్గవ రోజు తనకి ‘మెట్రో’ సినిమాలో “Tarzan of the Apes” సినిమాకి నాలుగు టిక్కట్లు కావాలని వాళ్ళక్కగారికి పురమాయించారు. నాలుగు టిక్కట్లెందుకంటే తనకు సేవ చేసిన నర్సులకివ్వటానికి. వాళ్ళు ఆ సినిమా చూసి వచ్చి చూపించిన సంతోషం చూసి, “మనుషుల్ని సంతోషపెట్టటం ఎంత సులువో” అనుకున్నారట.

జానకిరామ్‌ది ప్రధానంగా సౌందర్య దృష్టి. గాంధీ గారు రవీంద్రనాథ్‌ టాగూరును కల్సుకున్నప్పుడు ఆ సమావేశాన్ని సత్యం సౌందర్యం కలుసుకోవడం అన్నారు. బహుశా టాగూరు సౌందర్య దృష్టే వారి అభిమాని జానకిరామ్‌ది కూడా. బుచ్చిబాబేమో వీర్ని, “సౌందర్యం కోసం సౌకర్యం త్యాగం చెయ్యగల సాధకుల ఆప్తుడు, కళాజీవి”, అని అభివర్ణించారు. తన ఇంటికి తిరిగి వచ్చి దోసెడు పారిజాతాలు గుమ్మం దగ్గర ఉండటం చూసి,జానకిరామ్‌ వచ్చి వెళ్ళారని తెలిసింది అన్నారో మహిళా జర్నలిస్టు. అంటే ఆయన వ్యక్తిత్వమే పారిజాత పరిమళం అయ్యిందనేగా?

జానకిరామ్‌ రచించిన గొప్ప పుస్తకాలు ఈ తరం పాఠకులకు అందుబాటులో లేవు. సాహితీప్రియులెవరైనా జానకిరామ్‌ రచనలు అందంగా ముద్రించి ఈ తరం వారికి అందేట్లు చూడాలి. ఎందుకంటే ఈ రచనలు చదవటం ఒక మధురానుభవం. పరిపూర్ణ జీవితం గడిపి జానకిరామ్‌ తొంభై పైబడిన తర్వాత కీర్తిశేషులయ్యారు. ఆయనే రాసినట్లు “అపరిమితానందానుభూతి ఎంత ఉత్కృష్టమైనదైనా అది అనిత్యమేగా!”