సాహిత్యం మనం సృష్టించుకున్న రెండో లోకం.
ఈలోకంలో కొంత నిజం, కొంత అనిజం- కొంత జీవితం, కొంత కలా కలగలిసి వుంటాయి. ఈ లోకానికి పాఠకుడు ఒక వైపూ, రచయిత ఇంకో వైపూ. వీళ్ళిద్దరూ కలిసే చోటు పుస్తకం. పుస్తకాలు చదివే అలవాటు, పుస్తకాలు రాసే అలవాటు నిజానికి ఒకే ఆలోచనాత్మక ప్రక్రియకి రెండు కోణాలు. పుస్తకం చదువుతున్నప్పుడు పాఠకుడూ, పుస్తకం రాస్తున్నప్పుడు రచయితా ఒకే విధమైన ప్రక్రియలో భాగస్వాములవుతారు. ఇద్దరూ ఆలోచనలోకి ప్రవేశిస్తారు. ఆ ఆలోచనే రెండో లోకం.
కాని, ఈ రెండో లోకం చుట్టూ వున్న వాస్తవిక లోకంతో సంబంధం లేని లోకం కాదు. చుట్టూ వుండే పరిస్థితులూ, సంస్కృతి, ముఖ్యంగా భాష ఈ రెండో లోకానికి చాలా ముఖ్యం. మన పరిస్థితులూ, మన సంస్కృతి, మన భాష, పూర్తిగా మనకు తెలిసిన వాస్తవిక లోకంలో తిరగడం చాలా సౌకర్యంగా వుంటుంది. వాటి నుంచి వచ్చిన పుస్తకాల్ని చదవడంలోనూ చాలా సౌకర్యం వుంటుంది. కాని – మనకు పరాయీ అనిపించే పరిస్థితులూ, మనది కాని సంస్కృతి, మనవి కాని భాషల మధ్య – మనకెంత మాత్రమూ తెలియని లోకంలో మన వునికి ఏమిటి? దాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి?
-ఇవి ఇప్పుడు ప్రవాసాంధ్రసాహిత్యం ముందు వున్న ప్రశ్నలు. అసలు ప్రవాసాంధ్ర సాహిత్యం అంటూ వుందా? వుంటే, దానికి కొన్ని సాంస్కృతిక లక్షణాలు వున్నాయా అన్న మౌలికమైన ప్రశ్న నుంచి ఈ అన్వేషణ మొదలు కావాలి.
1
ఇవాళ ప్రపంచం నలుమూలలా తెలుగువాళ్ళు వున్నారు. దేశదేశాల్లో తెలుగు మాట వినిపిస్తోంది. అనేక దేశాల్లో తెలుగు సమాజాలు గట్టిగా పనిచేస్తున్నాయి. ఇంటర్నెట్ ఆ సమాజాలన్నిటినీ కలిపికుట్టే దారంగా పనిచేస్తోంది. అమెరికా నుంచి దుబాయి దాకా అనేక తెలుగు ఇంటర్నెట్ చర్చాబృందాలు చాలా చురుకుగా పనిచేస్తున్నాయి. అయిదేళ్ళ క్రితం నలుమూలలా చెల్లాచెదురుగా పడి వుండి, ఎవరి దేశంలో వాళ్ళు అపరిచితంగా మాత్రమే మిగిలిపోయినట్టున్న తెలుగు వాళ్ళు ఇప్పుడు దూరాల్ని జయించి దగ్గిరవుతున్నారు. ఒకప్పుడు మహా అయితే ఒక వూళ్ళో ఏ పండగ సందర్భంలో అయితేనే కలిసేవాళ్ళు. ఇప్పుడు కలుసుకోడానికీ,మాట్లాడుకోడానికి అవకాశాలు పెరిగాయి. రకరకాల ఇంటర్నెట్ తెలుగు గ్రూపులు ఇప్పుడు వున్నాయి. అనేక విషయాల మీద చర్చలు జరుగుతున్నాయి. భావాలు వేగంగా బట్వాడా అవుతున్నాయి. వాటికి దేశాల సరిహద్దులు లేవు. కాల వ్యత్యాసాలు లేవు. మనోవేగానికి ఇప్పుడు ఎలాంటి అడ్డంకులూ లేవు. దీనికి తోడు, పత్రికావ్యవస్థ మరింత చేరువయింది. తెలుగు పత్రిక చదవడానికి ఇప్పుడు పెద్ద కష్టపడక్కర్లేదు. అలాగే, తెలుగునాట ఎక్కడేం జరుగుతుందో తెలుసుకోడానికి సౌకర్యాలు పెరిగాయి. ఆ మాటకొస్తే, అక్కడి వాళ్ళ కంటే దూరంగా ఏ అమెరికాలోనో వున్నవాళ్ళకే తెలుగుపత్రికలు కొన్ని గంటలు ముందుగా చేరుతున్నాయి. ఈ పరిస్థితి అక్కడి – ఇక్కడి తెలుగువాళ్ళ సాంస్కృతిక జీవనాన్ని ఎట్లా ప్రభావితం చేయబోతుందో ఇప్పుడే చెప్పలేం. కాని, దూరం తరిగిపోతుందని మాత్రం ఇప్పటికి చెప్పుకోవచ్చు.
ఇప్పుడు ఏర్పడిన ఈ కొత్త పరిస్థితుల్ని 1960 లలో కొత్తగా అమెరికా చేరిన తెలుగువాళ్ళ పరిస్థితులతో పోల్చితే ఏమనిపిస్తుంది? 60లకీ, 90లకీ మధ్య దూరాన్ని ఇప్పుడు చూడడం ఎలా? తెలుగు మాట వినిపించడమే బంగారమైన 60లు, ఎటు విన్నా తెలుగు సమూహాలు సందడి చేస్తున్న 90ల తరవాతి పరిస్థితులకి ఎంత తేడా? ఈ పరస్పర భిన్నకాలాల మధ్య తెలుగు వాడి భాష, సాహిత్యం, సంస్కృతి పరసీమలలో ఎంత పెనుగులాడింది? ఈ నాలుగైదు దశాబ్దాలలో తెలుగువాళ్ళు తమవి కాని దేశాల్లో తమ సాహిత్యాన్ని, భాషనీ కాపాడుకోడానికి ఎన్ని బాధలు పడ్డారు? ఏ ఏ సాధనాలు సమకూర్చుకుని, వాటిని కాపాడుకున్నారు? ఈ సంఘర్షణ అంతా ఇప్పుడు వొక చరిత్ర. మరచిపోలేని తీయని గతం. గర్వంగా చెప్పుకునే వొక అందమైన జ్ఞాపకం. చిన్నప్పుడు తెలుగువాచకంలో దాచుకున్న నెమలికన్ను. ఆ కన్ను తెరిచి గతంలోంచి వర్తమానంలోకి వచ్చే ప్రయత్నం ఈ వ్యాసం. అయితే, మిగిలిన దేశాల్లో తెలుగు వాళ్ళ సాహిత్య సంగతులు చాలా ముఖ్యమే అయినప్పటికీ – ప్రస్తుతం అమెరికాలోని తెలుగువాళ్ళ సాహిత్య సంస్కృతిని పరిచయం చేయడమే ఈ వ్యాసం పరిమితి.
2
‘డయాస్పొరా ’ సాహిత్యసంస్కృతిగా మనవాళ్ళ కృషిని చెప్పుకోవచ్చా లేదా అన్న చర్చకి ముందు – సంక్షిప్తంగా – అమెరికా తెలుగు సాహిత్యసంస్కృతి ఎట్లా ఏర్పడిందో చూడడం అవసరం. నిజానికి 1960లలో వచ్చిన తెలుగు సాహిత్యాభిమానులు ఏం చదివేవాళ్ళో, ఏం రాసేవాళ్ళో ఇప్పుడు మనకి గుర్తులేదు. అలాగే, అప్పటి తెలుగు సమూహాలు ఎలా వుండేవో, వాటి స్వభావం ఏమిటో మనకి తెలియదు. అయితే, పూర్తిగా కొత్త లోకంలోకి, కొత్త వ్యవస్థలోకి వచ్చిన పరిస్థితుల్లో విపరీతమైన మానసిక, శారీరక వొత్తిళ్ళస్త్ర సాహిత్యం జోలికి రానివ్వవు. చదవాలన్న ఆసక్తి వున్నా దానికి కావలసిన తీరుబాటు దొరకదు. రాయాలన్న ఉత్సాహం ఏ మూలనో వున్నా, రాయడానికి కావలసిన తక్షణ ప్రేరణనిచ్చే వాతావరణం వుండదు.
ఇలాంటి వాతావరణం అమెరికన్ తెలుగు సమూహాల్లో 1970లలో కాస్త ఏర్పడడం మొదలైంది. దీనికి కారణం – 60లలో కంటే 1970లలో తెలుగువాళ్ళకి అమెరికాకి రాకపోకలు పెరిగాయి. మెడికల్, సైన్సు రంగాల వాళ్ళు అమెరికా వచ్చి, కాలు నిలదొక్కుకోవడం మొదలైంది. ముఖ్యంగా- వైద్యరంగంలో వున్నవాళ్ళు. ఈ రంగంలో వున్నవాళ్ళకి బయటి సమాజంతో సంబంధాలు తప్పనిసరి. ఆ సంబంధాల సంఘర్షణ చెప్పాలన్న తపన కొంతమందిని రచనలవైపు మళ్ళించింది.
‘ప్రతిక్షణం డాక్టరుగా పనిచేస్తున్నప్పటికీ చాలా సంగతులు చూసినప్పుడు మనస్సు కలవరపడేది. మా ఇండియాలో అయితే ఇలా జరగదు అనిపించేది. ముఖ్యంగా డివోర్స్‌డ్ కపుల్స్ మానసిక సమస్యలతో వచ్చినప్పుడు ఎదుగుతున్నన యువతీయువకులు డ్రగ్ సమస్యలతో వచ్చినప్పుడు ‘ఛ’ అనిపించేది. వీళ్ళ అలవాట్లపై చిన్న చూపు. మెల్లగా దాని వెంటనే అసహ్యం పేరుకుంటూ వచ్చాయి. అందుకనే అందరికీ ‘హాయ్’ చెప్పి ఆమడదూరంలో వుంటూవచ్చాను..’ (రాణీ సంయుక్త కథ ‘వంచన’)
‘ప్రస్తుతం ఇంట్లో ఒంటరిగా వున్నాను. ఇక్కడ పనివారెవరూ వుండరు. మావారు మా అమ్మాయిని తీసుకుని ఏదో పార్టీకని వెళ్ళారు. నాకు ఇష్టం లేక వెళ్ళలేదు. వెళ్ళే ముందు దానికో పెద్ద గొడవ. నన్నూ రమ్మంటారు. ఆ పార్టీలు ఎంత రొటీనుగా, ఎంత కృత్రిమంగా వుంటాయో…సీతాపురంలో పేరంటాళ్ళు, పట్టుచీరల గరగరలు, కమ్మని పలకరింపులు, తియ్యని ఆప్యాయతలు రుచిచూసిన నాకు ఇక్కడి వాతావరణంలోని చేదు నచ్చడం లేదు..’(నోరి రాధిక కథ ‘పొరుగింటి పుల్లకూర’)
బయటి జీవితం కేవలం బయటి విషయాలకే పరిమితం కాదు. అది వ్యక్తి మానసిక జీవితాన్నికూడా ప్రభావితం చేస్తుంది. దీనికి సంబంధించిన సంఘర్షణ ఈ దశలో ఎక్కువగా కనిపిస్తుంది. రచయితకి ఇది చాలా ముఖ్యమైన సన్నివేశం. ఈ సన్నివేశమే మన భాషనీ, మన సంస్కృతినీ బలంగా గుర్తు చేస్తుంది. 1970లలో వచ్చిన సాహిత్యానికి ఈ తలపోత ప్రధానమైన ముడిసరుకు. గతాన్ని తలచుకునే ప్రయత్నంలో భాగంగా రాయడం. వాటిని రాత పత్రికల్లో తామే ప్రచురించుకోవడం ఈ దశలో కనిపిస్తుంది. ఆలా మొదలైంది ‘తెలుగు భాషా పత్రిక’. మొదట అది రాతపత్రిక. ఆ తరవాతే అచ్చుపత్రిక. ఈ సాహిత్యసంస్కృతికి ‘నాస్టాల్జియా’ ముఖ్యనేపధ్యం. అది తెలుగునాట తమ గతజీవితాన్ని గుర్తుచేసుకోవడంతోనే పరిమితం కాలేదు. తమ భాషనీ, సంస్కృతినీ తలుచుకోవడం అందులో ముఖ్యమైన అంశం.
పండగ లేదు పబ్బం లేదు
తినాలంటే కొబ్బరి కజ్జం లేదు
సుప్పులు లేవే, సెగోడీలు లేవు
జనపనార లేదు, జున్నుపాలు లేవు
జముకులోల్లు లేర
జోగి దండడాలు లేవ
జీవుడు! నా జీవుడు గిలగిలా గింజుకుంటున్నాడ
(పాలన కవిత ‘సికాకెత్తిపోయినాదే ఈ సికాగో బతుకు’)
మొదటి తరాల అమెరికన్ తెలుగువాళ్ళ మీద సామాజికంగా, సాంస్కృతికంగా అనేక వొత్తిళ్ళున్నాయి. మొదటిది: సంఖ్యాపరంగా
వాళ్ళు చాలా తక్కువమంది. ఇలాంటి సందర్భాల్లో ‘నాస్టాల్జియా’ బలంగా పనిచేయడంలో ఆశ్చర్యమేం లేదు. ఇప్పటికీ ఆ తరంవాళ్ళ మాటలకీ, ఆలోచనలకీ ఆ నా,స్టాల్జియానే పునాదిగా కనిపిస్తుంది. వాళ్ళ భాష నుంచి అలవాట్ల వరకూ వొక గిరి గీసుకుని వుంటాయి, అంటే ‘గడ్డ కట’ి్ట వుంటాయి. ఆ తరం వాళ్ళ కథలూ ఇతర రచనల్లో తెలుగు చూస్తే మనకీ విషయం అర్ధమవుతుంది. అలాగే, వాళ్ళు తీసుకునే ఇతివృత్తాల్లో తెలుగు సంస్కృతికి వొక పరిధి గీయాలన్న తాపత్రయం కనిపిస్తుంది. కొత్త దేశంలో తాము ఎదుర్కొంటున్న ప్రతి స్థితినీ స్వదేశంలో పరిస్థితితో బేరీజు వేసుకోవడం మాత్రమే కాకుండా, ఆ పరిస్థితికి వొకే సాంస్కృతిక విలువ వున్నట్టు భావించుకునే వాళ్ళు. కొన్ని కథల్లో పాత్రలు ఇక్కడి ప్రతి సన్నివేశాన్నీ అర్ధం చేసుకోడానికి దాన్ని ‘సనాతన హిందూ’ ధర్మంతో పోల్చుకోవడం కనిపిస్తుంది. ఈ ధోరణి భాషలోకి వెళ్తే, ఏ ఇంగ్లీషు/ఉర్దూ ప్రభావమూ కనిపించని అచ్చతెనుగు వాడకంలోకి వెళ్తుంది. ఆ విధంగా నిజంగా స్వదేశంలో వాడే తెలుగుకీ, ఇక్కడి తెలుగుకీ వొక తేడా ఈ తరం రచయితల్లో కనిపిస్తుంది. వేలూరి వేంకటేశ్వరరావు ‘నా భావనలో తెలుగు డయాస్పోరా’ అనే వ్యాసంలో ఈ పరిస్థితిని ఇట్లా చెబుతారు:
‘దేశం విడిచిపెట్టాకనే దేశం బాగా అర్ధమవుతుంది. దీపం కింద ఉన్నంత కాలం నీడలో తెలియదు…దీపానికి కాస్త దూరంగా వుంటేనే దీపకాంతి మన మీద బాగా ప్రసరిస్తుంది. ఇక్కడికి రాకముందు మనలో చాలా మందిమి తెలుగు మీద, తెలుగు సాహిత్యం మీద ఏమంత శ్రద్ధ చూపించిన వాళ్ళం కాదని మళ్ళీ మళ్ళీ చెప్పక్కరలేదు. దానికి తోడు, మొదటి తరం వాళ్ళం చాలా మందిమి, భౌతిక రసాయన శాస్త్రాల్లోను, ఇంజనీరింగు, మెడిసిన్‌లలోనూ పట్టభద్రులమై వచ్చినవాళ్ళం. ఇక్కడికి వచ్చాక, మన చుట్టూ వున్న ఇంగ్లీషు వాతావరణం, తెలుగు పాఠం ఎప్పుడూ శ్రద్ధగా వినని మనని మరింత తెలుగువాళ్ళని చేసింది. మనని, మరింత భారతీయులుగా చేసి దగ్గిరకు రప్పించింది. తెలుగుదేశంలో ఉండగా ఎప్పుడూ తెలుగు రాయనివాళ్ళం, గట్టిగా తెలుగు చదవనివాళ్ళం, గట్టిగా తెలుగు పత్రికలు కూడా చూడని, చదవని వాళ్ళం – ఇక్కడికొచ్చాక మనకి ఇంగ్లీషు కన్నా తెలుగే బాగా వచ్చునని గుర్తించాం. మనం తెలుగులో రచయితలం, కవులం అయ్యాం’.
ఈ మాటల్లో రెండు ముఖ్యమైన విషయాలు తెలుస్తాయి. ఒకటి: ఉనికికి సంబంధించిన స్పృహ. రెండు: ఆ ఉనికికి ఒక భౌతిక రూపం స్థిరపరచాలన్న తపన. ఆ తపనకి వొక రూపం – భాష. కొత్త దేశంలో కొత్త సంస్కృతీ, భాషా కలిగించే వొత్తిడిలో వాటి ప్రభావానికి దూరంగా మనదే అయిన సంస్కృతినీ, భాషనీ ఏర్పర్చుకోవాలన్న ప్రయత్నం. ఏదో వొక రూపంలో ఆ తేడాని నిలబెట్టుకోవాలన్న పట్టుదల. ఈ ప్రయత్నానికీ, పట్టుదలకీ స్వదేశంలో వస్తున్న మార్పులతో సంబంధం లేదు. ముఖ్యంగా – స్వదేశంలో మనవాళ్ళు మాట్లాడే తెలుగులో ఇంగ్లీషు/ఉర్దూ పదాలు తగినన్ని వుంటాయి. అచ్చతెలుగు అనేది అక్కడ లేదు. కాని మొదటి తరం రచయితలు వాడిన తెలుగు 1960లకి ముందు తెలుగు. పరభాషల్లో, పరసంస్కృతుల్లో మెలుగుతున్నప్పుడు ఏర్పడే కాస్మోపాలిటన్ మిశ్రమ సంస్కృతికి ఇంకా అమెరికన్ తెలుగువాళ్ళు అలవాటు కాని స్థితి. ఇటీవల అంటే – 1990ల నుంచి కొంతా, 2000ల తరవాత ఎక్కువగా వస్తున్న రచనల్లో ఈ కాస్మొపాలిటన్ మిశ్రమ భాషా, సంస్కృతీ కనిపిస్తాయి (దీన్ని నేను డయాస్పొరా లక్షణం అనుకుంటున్నాను, దీన్ని తరవాత వివరిస్తాను).
మొదటి రెండు తరాల తెలుగు సాహిత్య సంస్కృతికి ఇంకా ‘అమెరికన్ తెలుగు’దనం అబ్బలేదని మనకి అర్ధమవుతుంది. ఆ సంస్కృతికి గతజీవితం తలపోతలు, వర్తమాన జీవితంతో సమన్వయించుకోలేని సంఘర్షణా, మన సంస్కృతి విలువైందన్న స్థిరాభిప్రాయం – అప్పటి రచనల్లో కనిపిస్తాయి. ఈ కారణాల వల్ల అమెరికన్ సంస్కృతి మీద ఫిర్యాదులు ఎక్కువగా వినిపిస్తాయి. రెండో బలమైన కారణం – అమెరికాలో స్థిరపడాలన్న కాంక్ష బలంగా లేకపోవడం. రెండో తరవంవాళ్ళ వొత్తిడి వల్ల తరవాత తరవాత ఈ కాంక్ష బలపడింది తప్ప, మొదటి తరంలో ఎక్కువ మంది తెలుగువాళ్ళకి ఇంకా అమెరికాతో కేవలం ‘వృత్తి’గతమైన అనుబంధం మాత్రమే వుండేది. ఆ ప్రతిఫలాలే వాళ్ళ రచనల్లో, సాంస్కృతిక చరిత్రలో కనిపిస్తాయి.
1970ల రెండో దశలో అమెరికన్ తెలుగువాళ్ళు అచ్చుపత్రికలు తీసుకురావడానికి అమెరికన్ సమాజంలో వాళ్ళు లీనమయ్యే ప్రక్రియ బలపడడానికీ దగ్గిర సంబంధం వుంది. రాతపత్రికలు సాధించిన ప్రధానమైన విజయం: అమెరికాలో తెలుగు రచనల పఠనాభిరుచిని పెంచడం. ముఖ్యంగా స్త్రీలకి ఇవి చాలా ప్రధానమైన పఠనసాధనమయ్యాయి. షికాగోలో ఒక సాహిత్యసమావేశం తరవాత మాటల సందర్భంలో ఈ లిఖిత పత్రికల ప్రస్తావన వచ్చినప్పుడు నిజంగా వీటి ప్రభావం ఆ రోజుల్లో వుండేదా అని ఒక పాఠకురాల్ని నేనడిగాను. ‘వ్యక్తిగతంగా నామీద ‘తెలుగు వెలుగు’ ప్రభావం చాలా వుంది. ఇప్పుడు నాకు రీడింగ్ ఒక అలవాటుగా మారిందంటే దానికి కారణం ఆ రాతపత్రికే. ఆ పత్రిక ఎప్పుడొస్తుందా అని ఎదురుచూసేదాన్ని. రావలసిన రోజు రాకపోతే వెంటనే పత్రికవాళ్ళని ఫోన్ చేసి అడిగేదాన్ని. మరీ ఆలస్యమయితే – చెడామడా తిట్టిపోసిన సందర్భాలు కూడా లేకపోలేదు.’ అన్నారామె. ఇప్పటిలా అప్పుడు తెలుగుపుస్తకాలు, తెలుగు ఛానళ్ళు, ఇంటర్నెట్ పత్రికలు వగైరా అందుబాటులో లేకపోవడం దీనికి ప్రత్యక్షంగా కనిపించే కారణం. ఇక పరోక్షంగా – తక్కువ సంచికలే వేసినా, తక్కువ పేజీలే వున్నా, ఈ రాతపత్రికలు మంచి సాహిత్యాభిరుచి వున్నవాళ్ళు నిర్వహించడం నిర్వహించడం వల్ల దాని ప్రభావం తగినంత పడింది. ఆ విధంగా అచ్చుపత్రికలు తీసుకురావడానికి కావలసిన సాంస్కృతిక వాతావరణాన్ని ఇవి సమకూర్చిపెట్టాయి.
రాతపత్రికల నిర్వహణలో పెమ్మరాజు వేణుగోపాలరావు పాత్రని ప్రముఖంగా చెప్పుకోవాలి. 1971లో ఆయన ‘తెలుగు భాషాపత్రిక’ని ప్రారంభించారు. అయిదేళ్ళపాటు నడిచిన ఈ పత్రికలో మొదట సైన్సుకి సంబంధించిన రచనలు ప్రధానంగా ప్రచురించేవారు. మొదటి తరం అమెరికన్ తెలుగువారిలో ఎక్కువమంది ఆ రంగానికి సంబంధించినవాళ్ళే కాబట్టి, ఆ విధంగా ఒక కొత్త పాఠకవర్గాన్ని తయారుచేయగలిగింది. ‘ఆ పత్రికలో ఏమున్నాయన్నది అంత ముఖ్యం కాదు. కాని, తెలుగులో చదవడం, తెలుగు పత్రికని చదివే అలవాటు చెయ్యడం ఆ పత్రికే నేర్పింది‘ అని ఆ పత్రికలో రాయడం ద్వారా రచయితగా మారిన ఓ ప్రముఖుడు అన్నారు.ఆ తరవాత 1977-82లో ‘తెలుగు అమెరికా’ షికాగో నుంచి వెలువడింది. ఈ పత్రిక ఇంకో అడుగు ముందుకు వేసి, ఆంధ్ర దేశం నుంచి కూడా రచనలు తెప్పించి వేయడం మెదలుపెట్టింది. అమెరికన్ తెలుగు పత్రికలు అచ్చు వేపు సాగించబోతున్న తరవాతి మజిలీకి ఈ పత్రిక దారి చూపించింది. తెలుగు కమ్యూనిటీ బలపడే కొద్దీ ప్రతి నగరం నుంచి ఒక తెలుగుపత్రిక రావడం ఈ దశలో పెద్ద మార్పు. అలాగే, రాతపత్రికల నుంచి అచ్చుపత్రికలకి సాగిన ప్రయాణం కేవలం భౌతిక సాధనాల్లో వచ్చిన మార్పు కాదు. తెలుగు సమాజాల విస్తరణ, సాంస్కృతిక ఉనికి కోసం అన్వేషణ… వీటితోపాటు డయాస్పొరాగా రూపుదిద్దుకోబోతున్న కమ్యూనిటీల సంఘర్షణ కనిపిస్తుంది. రాత పత్రికల రచనల్లో కనిపించే భావాల ‘వూగిసలాట’ అచ్చుపత్రికల్లో కనిపించదు. ఇక ఆలోచనల పరంగా – తాము కేవలం తెలుగు వాళ్ళం కాదనీ, అమెరికన్ తెలుగువాళ్ళమనీ అనుకోవడం అచ్చుపత్రికలు వచ్చాక వెలువడిన రచనల్లో ఎక్కువగా కనిపిస్తుంది. రాత పత్రికల నుంచి అచ్చుపత్రికల దాకా సాగిన ప్రయాణంలో ఇంకా చాలా ముఖ్యమైన అంశాల్ని కూడా గమనించవచ్చు. అందులో కొన్ని అమెరికన్ తెలుగుసాహిత్య వికాసాన్ని చెబుతాయి, మరికొన్ని అమెరికన్ తెలుగు సాహిత్య సాంస్కృతిక క్రమాన్ని వివరిస్తాయి.
అచ్చు పత్రికలు రావడం, అమెరికాలో తెలుగు సంఘాలు ఏర్పడడం దాదాపూ ఒకే దశలో జరిగాయి. అచ్చుపత్రికలు ఇక్కడి రచయితల సాహిత్యజీవితంలో వైవిధ్యాన్ని పెంచితే, తెలుగు సంఘాలు ఆ సాహిత్యక్రమానికి వొక సాంస్కృతిక వేగాన్నిచ్చాయి. సాహిత్యకృషిని ఏ వొక్క నగరంలోని పెద్ద తెలుగు సమూహాలకో పరిమితం చెయ్యకుండా, దానికి విశాలమైన వేదికనీ, భిన్న ప్రాంతాల్లో ప్రచారాన్నీ ఇచ్చాయి. చిన్నపట్టణాల్లో చిన్న చిన్న తెలుగుసమూహాల్లో కూడా సాహిత్య సాంస్కృతిక అభిలాషని పెంచాయి. అయితే, ఈ అభిలాష క్రమంగా సాహిత్యం కంటే ఇతర సాంస్కృతిక అంశాలు – నృత్యం, సంగీతం, కొంత చిత్రకళ – వైపు మళ్ళడం గమనించాల్సిన మార్పు. మనకి సంస్కృతి అంటే అవి మాత్రమే అనే భావన గూడుకట్టుకుంటున్న స్థితి కూడా వుంది. అవి- సాహిత్య సంస్కృతిని కొంత ప్రభావితం చేస్తున్నాయి.
3
అమెరికా తెలుగు డయాస్పొరా సంస్కృతి వున్నట్టుండి చుక్కలా రాలిపడలేదు. దీనికి ముందు సుదూర చరిత్రా, తక్షణ చరిత్రా రెండూ వున్నాయి. సుదూర చరిత్రలో మొదటితరం రచయితల ప్రయత్నాలు 1990ల తరవాత వొక స్థిరరూపం దాల్చడం మొదలెట్టాయి. సాహిత్యసంస్కృతి స్థిరత్వానికీ, అమెరికాలోని తెలుగు సమూహాలు స్థిరపడడానికీ దగ్గిర సంబంధం వుంది. వృత్తిగతమైన సంబంధాల నుంచి వ్యక్తిగతంగా అమెరికా నేలకి దగ్గిరవడం, రెండోతరం రావడం, వాళ్ళ ఎదుగుదలకి ఇక్కడి స్థానికతలో పునాదులుండడం, ఇల్లూవాకిలీ, ఇరుగూపొరుగూ, కుటుంబం, వృత్తి, వ్యక్తిత్వం, అభిరుచి లాంటి మౌలిక భావనల్లో పూర్తి మార్పు ఈ దశలో సాధ్యపడింది. సాహిత్యంలో ఈ మార్పు చాలా గట్టిగా కనిపిస్తుంది. ఈ మార్పు మాచిరాజు సావిత్రి మాటల్లో:
‘1970 లలో రాసిన కథలకీ ఇప్పుడు రాస్తున్న వాటికీ చాలా తేడా వున్నది. అప్పుడు చాలా మటుకు అప్పుడే ఇండియా వదిలి వచ్చినవాళ్ళు రాసిన కథలు. అప్పుడు ముఖ్యంగా చాలా నాస్టాల్జిక్‌గా వుండే కథలు వచ్చేవి. అంటే, ఇండియాలో వున్నప్పటి జీవితాలను తల్చుకుని మళ్ళీ ఆ వాతావరణం, ఆ అనుభూతీ సృష్టించాలనే ఉద్దేశంతో రాసిన కథలివి. కథలు చాలా మట్టుకు ఇండియాలోనే జరిగేవి. తరవాత క్రమక్రమంగా అమెరికాలో జీవితాలను గురించీ, ఇక్కడ వచ్చే సమస్యలను గురించీ రాస్తున్నారు’(సావిత్రి:2000)
సావిత్రి గమనించిన ఈ మార్పునే నేను తెలుగుదనానికీ, అమెరికా తెలుగుదనానికీ మధ్య గీసిన గీతగా భావిస్తున్నాను. అమెరికన్ తెలుగు రచయిత నాస్టాల్జియా నుంచి బయటపడడం అంత తేలికగా జరిగిన మార్పు కాదు. అది మొత్తంగా ఇక్కడి తెలుగు సమూహాల్లో వ్యక్తిత్వ స్థాయి నుంచి సంఘజీవితం వరకూ ఉమ్మడిగా వస్తున్న మార్పు. అలాగే, ఇది కేవలం కొద్ది మంది బుద్ధిజీవుల ఆలోచనల్లో వచ్చిన మార్పుకూడా కాదు, స్థలకాలాల దూరాలతో సంబంధం లేకుండా అందరిలో ప్రత్యక్షంగా వచ్చిన మార్పు. నిజానికి సామాజికంగా వచ్చిన మార్పుని చెప్పడానికి అమెరికా తెలుగు రచనలు డాక్యుమెంట్లలాంటివి. ‘డాక్యుమెంట్’ అన్నంతమాత్రాన్న వాటిల్లో వున్న కళాత్మకతని తక్కువ అంచనా వేయడం లేదు. డయాస్పొరా సాంస్కృతిక చరిత్రకి ప్రస్తుతానికి అంతకంటే మంచి ఆధారాలు లేవని చెప్పడం మాత్రమే.అమెరికా తెలుగు కథల్లో ఈ మార్పుని నిర్దిష్టంగా ఏ లక్షణాలతో చెప్పుకోవచ్చు? అవి ఆంధ్రా నుంచి వస్తున్న కథలకి, లేదా అమెరికాలోని తెలుగురచయితలు అంతకు ముందు నుంచి రాస్తూ వచ్చిన రచనలకి సాంస్కృతికంగా ఏ విధంగా భిన్నంగా వుంటున్నాయి? ఈ విషయం కాస్త ఆలోచిద్దాం.
ఇప్పటి కథల్లో నాస్టాల్జియా లేదని మాచిరాజు సావిత్రితో పాటు చాలా మంది విమర్శకులు చెబుతూనే వున్నారు. నాస్టాల్జియా చాలాకాలం పాటు ఇక్కడి తెలుగు రచనలకి చాలా బలమైన ప్రేరణగా నిలిచింది. అందులో సందేహమేమీ లేదు. కాని, ఆ బలమైన ప్రేరణ బలహీనపడడానికి మరో బలమైన కారణం ఏమిటి? ఆ కారణం – అసలు వ్యక్తిత్వం అనే భావనలో వచ్చిన మార్పు కావచ్చా? లేదా, సంస్కృతి గురించి అంతకు ముందు మనం ఇచ్చుకుంటూ వచ్చిన నిర్వచనాన్ని అమెరికన్‌తెలుగులు మార్చుకున్నారా? మార్చుకుంటే, అది ఆంధ్రాలోని తెలుగు సంస్కృతికి ఏ విధంగా భిన్నంగా వుంది? – వీటికి సమాధానాలు అమెరికాలోని వివిధ ప్రాంతాల నుంచి ఇటీవలి కాలంలో బాగా విస్తరించిన లిటరరీ క్లబ్బులు, పుస్తక ప్రచురణలు, ఇక్కడి పత్రికలు, ఇక్కడి పత్రికలతోపాటు అక్కడి పత్రికల్లో పెరిగిన అమెరికన్ తెలుగు రచయితల ప్రాముఖ్యం – ఇలాంటి భౌతికమైన కారణాలు చాలా వున్నాయి. 1998లో అట్లాంటా సాహితీ సమితి సదస్సు ఈ పరిణామంలో కీలకమైన మలుపు. ‘డయాస్పొరా’ అన్న మాట అక్కడే మొదటిసారిగా విన్నాను. నేను నా అనుభవాల్నించి రాస్తున్నానే తప్ప, ఆ రాతలకి వొక దారీదిక్కూ వున్నాయని మొదటిసారి అర్ధమైంది అట్లాంటా సదస్సు తరవాతే!’ అని వివిధ ప్రాంతాలలో సాహిత్య సమావేశాలకి వెళ్ళినప్పుడు చాలామంది రచయితలు అనడం విన్నాను. రచయితల్లో భావజాలానికి సంబంధించిన సాంద్రతని పెంచడంలో అట్లాంటా సదస్సు బాగా పనిచేసిందని తరవాత షికాగోలో జరిగిన సభల్లో వ్యక్తమైన అబిప్రాయాల్ని బట్టి మనకు అర్ధమవుతుంది. ఈ రెండు సభల మధ్య డయాస్పొరా రచనల కోసమే పోటీలు నిర్వహించడం, నిరంతరాయంగా ప్రచురణలు తీసుకురావడం ఈ ప్రక్రియని వేగవంతం చేసింది. ఈ క్రమం తరవాత రచ్చబండలాంటి వెబ్‌చర్చావేదికలతో పాటు, ‘ఈమాట’(eemaata.com) ‘సుజనరంజని’ వెబ్‌మాగజైన్లలాంటి భౌతికమైన వనరులు తెలుగు డయాస్పొరా సాంస్కృతికతని ఎట్లా నిర్వచిస్తున్నాయన్నది కూడా మనం సమీక్షించుకోవాలి. అలాగే – ఈ మార్పులకీ ఆంధ్రాలో జరుగుతున్న అస్తిత్వ ధోరణుల చర్చకి ఎట్లాంటి సంబంధం వుందన్నది కూడా పోలిక చూసుకోవాలి. 1990ల తరవాత ఆంధ్రాలో మొదలైన స్త్రీ, దళిత, మైనారిటీవాదాల చర్చ డయాస్పొరా చర్చని ఏమైనా ప్రభావితం చేసిందా అన్నది ఆలోచించాలి, ఆ ప్రభావం వున్న మాట వాస్తవమే అయితే – అక్కడికీ, ఇక్కడికీ ఆ నిర్దిష్ట వాదాల (డయాస్పొరా కూడా వొక నిర్దిష్టవాదమే అనుకుంటే) స్వభావంలో తేడా ఏమిటన్నది అన్నిటికీ మించి చాలా ముఖ్యమైన విషయం.
4
‘అదేలే.. ఈ మధ్య అమెరికాలో తెలుగువాళ్ళకి కొత్త కేకలొచ్చాయి. అందులో ఈ డయాస్పొరా అన్న మాట వొకటి..అంటే పవిత్ర తెలుగుదేశాన్ని వదిలేసి అమెరికాలోనూ, ఇతర దేశాల్లోనూ పూర్వం జ్యూయిష్ వాళ్ళలా పరాయిదేశాల్లో సెటిల్ అయిపోయిన తెలుగు వాళ్ళన్నమాట.’(వంగూరి చిట్టెన్ రాజు కథ ‘స్వామి డి. ఆనంద్ మహరాజ్ కథ’,2000)
గత జ్ఞాపకాల నుంచి బయటపడి, అమెరికన్ సమాజంతో కలుపుగోలుగా వుంటూ, వాటి ప్రభావంతో తెలుగువాళ్ళు తమ జీవనానుభవాల్ని కలగలిపి రాసే ధోరణి 1990ల నుంచి గట్టిగానే వున్నా, తమలోని సాహిత్య భిన్నత్వాన్ని తరచి చూసుకునే సందర్భం 2000దాకా రాలేదు. వాస్తవానికి 1998 అట్లాంటా సమావేశాల్లోనే తెలుగు డయాస్పొరా ప్రాధాన్యాన్ని ఇక్కడి రచయితలు గుర్తించారు. ఇంకో రెండేళ్ళ తరవాత షికాగోలో జరిగిన అమెరికా తెలుగుసాహితీ సదస్సులో ‘తెలుగు డయాస్పొరా గురించి ప్రత్యేకంగా చర్చాగోష్ఠులు జరిగాయి. .మనం ఇక ఇమిగ్రెంట్లం కాదు, డయాస్పొరా’ అంటూ గట్టి వాదనని ముందుకు తీసుకువచ్చారు. ( ఈ చర్చలికి సంబంధించిన వివరాలకు చూడండి: వంగూరి ఫౌండేషన్ ఆప్ అమెరికా ప్రచురించిన రెండవ అమెరికా తెలుగు సాహితీ సదస్సు సభావిశేష సంచిక: 2002)
‘ఎవరికి వాళ్ళం ఇంట్లో కూర్చుని రాసుకుంటున్నప్పుడు ఏదో వెలితి కనిపించేది. ఇవాళ మనం ఒక కొత్త ప్రపంచాన్న నిర్మించుకున్నాం. ఇదే నా దృష్టిలో తెలుగు డయాస్పొరా సాహిత్య ప్రపంచం.’(వేలూరి:2000). డయాస్పొరా వెనుక ఈ విధమైన సామూహిక భావనని కలిగించడం ద్వారా షికాగో సదస్సు మరో మూలమలుపయింది. దానికి అటూ ఇటూగా ‘eemaata.com’ వెబ్ మాగజైన్ రచనలు బలాన్నిచ్చాయి. ఈ రెండు సదస్సులూ, ‘ఈమాట’ తెలుగు డయాస్పొరాకి కావలసిన ఊపిరినందిస్తే, వంగూరి ఫౌండేషన్ పెమ్మరాజు సంపాదకత్వంలో వరసగా ప్రచురిస్తూ వస్తున్న అమెరికా తెలుగు కథానిక సంకలనాలు దాన్ని వొక కొత్త సంప్రదాయంగా నిలబెట్టాయి. ఈ సిరీస్‌లో మొదటి కథా సంకలనం 1995లో వెలువడింది. ఈ సంకలనానికి పెమ్మరాజు రాసిన ముందుమాటలు డయాస్పొరా ఏర్పడుతున్న క్రమాన్ని వివరిస్తాయి.
‘మన మాతృభాషలో మనకున్న పరిచయాన్ని పోగొట్టుకోకుండా, మన ఆలోచనలను, మన సమస్యలను, మన అనుభవాలని ఆ బాషలో పదిలపరచడానికి ప్రయత్నం..ఈ రచయితలలో అందరూ తెలుగు భాషా పండితులు కాదు. కాని వీరు తమ భావాలని తాము వాడుకునే, వాడగలిగే భాషలో రాయగలిగిన వారు. ఈ రచనల్లో గ్రాంధిక బాష వుంది. వ్యావహారిక భాష వుంది. తెలుగుతో పరిచయం సన్నగిల్లడం వల్ల అలవాటయిన పరభాషా సమన్వితమైన భాష వుంది…’
పెమ్మరాజు చెప్పిన ఈ లక్షణాలు ఇక్కడి రచయితలు రెండు సాహిత్య సంస్కృతుల మధ్య అనుభవిస్తున్న పెనుగులాటని చెప్పకచెబుతున్నాయి. అంటే అప్పటికింకా డయాస్పొరా సంస్కృతి నిర్దిష్టం కాని స్థితిని మనం ఈ మాటల్లోనూ, ఈ సంకలనంలోని కథల్లోనూ చూస్తాం. 1998లో ‘ఈమాట’ని ప్రారంభిస్తూ సంపాదకవర్గం చెప్పుకున్న ఆశయాలు మూడు: మెదటిది భారతదేశం బయట వుంటున్న తెలుగువారి జీవనవిధానాల్ని, అనుభవాల్ని ప్రతిబింబించే రచనలకి, వాటి రచయిత(త్రు)లకి ఒక వేదిక కల్పించడం. రెండోది:ఈ వేదిక రాజకీయ, కుల, మత, వర్గ ధోరణులకి, వ్యాపార కలాపాలకి దూరంగా వుండేట్టు చూడడం. మూడోది:ఇంటర్నెట్ టెక్నాలజీని వీలైనన్ని విధాల వుపయోగించుకుంటూ ఇది ప్రపంచవ్యాప్తంగా వున్న తెలుగువారందరికీ తేలిక మార్గంలో అందేట్టు చూడడం.
డయాస్పొరా అనే పదం వాడలేదు కానీ, పరోక్షంగా దానికి సంబంధించిన సారాంశాన్నే ఆశయంగా చెప్పుకున్నారు ‘ఈమాట’సంపాదకులు. ఇందులో చాలా ముఖ్యమైన విషయం: ప్రవాసాన్ని కేవలం అమెరికా భౌగోళిక పరిధుల్లో చూడకుండా, తెలుగు సంస్కృతిని ఆంధ్ర దేశపు సరిహద్దుల్లోకి మాత్రమే కుదించకుండా ఒక విశాలమైన తెలుగు సాంస్కృతికతని ఊహించడం. ఇది డయాస్పొరా భావనకి చాలా బలమైన పునాది.
వెబ్‌మాగజైన్ల ద్వారా జరిగిన మేలు: డయాస్పొరా సంప్రదాయం కొన్ని కొత్త సాంస్కృతిక లక్షణాల్ని తీర్చి దిద్దుకుంది. మొదటి తరం రచయితల్లో గతజ్ఞాపకాల బరువు కింద తెలుగుదనాన్నీ,తెలుగు సంస్కృతినీ ఏకపక్షంగా పరామర్శించడమే కనిపిస్తే, డయాస్పొరా రచయితలో ఇప్పుడు విమర్శనాత్మక ధోరణి కూడా కనిపిస్తుంది. ఇది చాలా పెద్ద మార్పు. వేలూరి మాటల్లో:
‘తెలుగు దేశంలో వున్న రచయితలకీ, కవులకీ, మనకీ రచనాశైలిలో, ఆలోచనాసరళిలో, వూహల ప్రపంచాల్లో చెప్పుకోదగిన తేడా కనిపిస్తుంది. దేశం వదిలి రావడం వల్ల మనకి కలిగిన ఎడబాటు, మనలో ఒక స్వతంత్రతకీ, ధైర్యానికీ, ఒక కొత్త అనుభవాన్ని చెప్పడానికి, కావలసిన మాటలు ఏరుకోడానికి అవకాశం ఇచ్చింది.’
డయాస్పొరా రచయిత సాంస్కృతికంగా చాలా స్వతంత్రమైన వ్యక్తి. అతనికి ఇదివరకటి మొహమాటాలు లేవు. ఆ మేరకి అతని రచనల మీద పడమటి ప్రభావం కనిపిస్తుంది. వేలూరి రచనల సంకలనం ‘మెటమార్ఫసిస్’(1998)కి రాసిన పరిచయంలో వెల్చేరు నారాయణరావు అంటారు ‘వెంకటేశ్వర్రావు అమెరికా వచ్చేక రాసిన వ్యాసాలలో, కథల్లో, కల్పికల్లో మీకు కొట్టొచ్చినట్టు కనిపించేది – స్వతంత్రం’ అని. తరవాతి కాలంలో డయాస్పొరా రచయితలకి ఇదే లక్షణంగా అమరింది. కుటుంబం, సంస్కృతి, అక్కడి పరిస్థితులు కలగలిసిన వ్యక్తిత్వంలో ఇప్పుడు ఇక్కడి జీవలక్షణమైన స్వతంత్రం తోడయింది. ఇది సృజనాత్మక రచనలతోపాటు ఇతర అంశాల్లో అభిప్రాయాల వ్యక్తీకరణలో చాలా పదునుగా కనిపిస్తుంది. ‘ఈమాట’లో ఇటీవలి కాలంలో వెలువడుతున్న వ్యాసాలు, గల్పికల్లో ఈ ధోరణి బాగా కనిపిస్తుంది.
తెలుగు డయాస్పొరాలోని రెండో లక్షణం: కాస్మాపాలిటనిజం. అంటే, జాతి/జాతీయ/భాషల అధికారిక సరిహద్దుల్ని చెరిపేయడం. ఒకే ఒక్క భారతీయత లేదనీ, అనేక రకాల భారతీయతలున్నాయన్న భావన ఈ మధ్య రచనల్లో వ్యకమవుతోంది. అలాగే, ఒకే విధమైన ప్రామాణికమైన భాష లేదన్న విషయం ఇప్పుడు రచయితలు వాడుతున్న శిల్పంలో కనిపిస్తుంది. చరిత్రని అధికారికమైన/స్థిరపడిన చట్రంలోంచి కాకుండా ప్రత్యామ్నాయ దృష్టితో చూడడం డయాస్పొరా సాంస్కృతికతలోని మరో ముఖ్యమైన లక్షణం.
మూడో లక్షణం: మిశ్రమ సాంస్కృతికతని చెప్పడం. అమెరికన్, తెలుగు సంస్కృతులు కలగలిపే సందర్భాలు రచనల్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇది కథాశిల్పంలో కూడా ఇప్పుడు భాగమవుతోంది. నాలుగో లక్షణం: సాహిత్య చర్చల్లో డయాస్పొరా స్వరం బలపడడం. వెబ్ చర్చావేదికలమీదనే కాకుండా స్వదేశం నుంచి వెలువడే పత్రికల్లోనూ డయాస్పొరా రచయితలు/విమర్శకులు గట్టిగా మాట్లాడడం ఈ మధ్యనే మొదలైంది. ఇందులో కొన్ని సందర్భాల్లో స్వదేశంలో స్థిరపడిన అభిప్రాయాల్ని/వాదనల్ని ప్రశ్నించే స్వభావం కనిపిస్తుంది.
5
అమెరికాలోనూ, ఇతర దేశాల్లోనూ ఇప్పుడు క్రమంగా తెలుగు సమూహాలు బలపడుతున్నాయి. ముఖ్యంగా స్థలకాలాల ప్రాముఖ్యం బాగా తగ్గిపోయిన ప్రస్తుత స్థితిలో భావప్రసారానికి వేగం పెరిగింది. సాంస్కృతికంగా ఇంతకుముందు వున్న కట్టుబాట్లు, వొత్తిళ్ళు ఇప్పుడు లేవు. స్వయం నిర్మిత చట్రాలు నెమ్మదిగా వదులవుతున్నాయి. మిగిలిన సంస్కృతుల్ని లీనం చేసుకుంటూ, వొక స్వతంత్ర భావన వైపు ఈ తెలుగు సమూహాలు ప్రయాణిస్తున్నాయి. సంప్రదాయాన్ని, సంస్కృతిని ఏకశిలగా మలిచే ప్రయత్నాలు జరుగుతున్నా, సాహిత్య సామాజికతని అవి పెద్దగా శాసించలేకపోతున్నాయి. అలాంటి కృత్రిమ ఏకత్వం కన్నా, భిన్నత్వం తెలుగు డయాస్పొరా జీవలక్షణంగా మారుతోంది. పెరుగుతున్న రచయితల సంఖ్య, ప్రచురణ సౌకర్యాలు, స్థానికంగా ఏర్పడుతున్న లిటరరీ క్లబ్బులు, టెక్నాలజీని ఇంకా సమర్ధంగా వుపయోగించుకోవాలన్న తపన తెలుగు డయాస్పొరాకి బలాన్నిస్తాయి. ఇవి క్రమంగా మిగిలిన దేశాలలో తెలుగువాళ్ళతో గట్టి అనుబంధాన్ని పెంచుతాయి. అలాంటి సంభాషణకి ఇది మొదలు. సాహిత్యం ఆ సంభాషణకి వొక ఆధారభూమిక.*