తెలుగు సాహిత్యం లో విమర్శ

[అక్టోబర్ 14, 2006 – ఐదవ తెలుగు సాహితీ సదస్సు, హ్యూస్టన్ లో చదివిన కీలకోపన్యాసం –నూరు సంవత్సరాల క్రితం ప్రబంధ సాహిత్యంపై వచ్చిన విమర్శని స్థూలంగా పరిశీలించడం; ప్రస్తుతం వస్తున్న సాహిత్య విమర్శనలగురించి ముచ్చటించడం; ఈ విమర్శనా ధోరణుల వలన సాహిత్యానికి, సాహిత్య విమర్శకీ వచ్చిన, వస్తూన్న నష్టాలని గుర్తించడం, నా ముఖ్యోద్దేశం. ఈ పరిస్థితిని మార్చడానికి కావలసిన ప్రేరణ, తగిన శిక్షణల గురించి సాహితీపరులందరూ, ముఖ్యంగా diaspora సాహితీపరులందరూ ఆలోచించడం ఆవశ్యకమని నా నమ్మిక. అది నా లక్ష్యం. – రచయిత].

ఒకరు చెప్పింది తప్పనో, రాసింది ఒప్పనో, అనంగానే, సాథారణంగా అటువంటి నిర్ణయానికి ప్రాతిపదిక ఏవిటి? ఆథారం ఏవిటి అనే ప్రశ్నలు వచ్చితీరుతాయి. గుడ్డిగా దేనినీ ఒప్పుకోవలసిన అవసరం లేదు. మామూలు రోజు వారీ విషయాలలోనే, ప్రాతిపదికా రహితంగా ఏ విషయం నిర్థారణగా చెప్పలేం. ఎవరు చేసిన ఏ నిర్ణయమైనా సరే — సాంఘిక, రాజకీయ, వ్యక్తిగత పరిస్థితుల ప్రేరణ లేకుండా ఉండదు. ఇక పోతే, సాహిత్యానికి సంబంధించిన విషయాలలో, ముఖ్యంగా సాహిత్యవిమర్శలో పైనచెప్పిన పరిస్థితుల ప్రభావం తప్పదు. పైకి కనుపించకపోయినా, పరిశీలనలో ఈ పరిస్థితుల ప్రభావం బయట పడుతుంది. ఈ పరిస్థితుల ప్రభావాన్ని ఉమ్మడిగా, bias, పక్షపాతం అని చెప్పవచ్చు. అందుచేత ఒక్క విషయం మాత్రం ఖాయం. పక్షపాతం లేని విమర్శ ఉండడం చాలా అరుదు అన్న విషయం!

సాహిత్య విమర్శలో ఈ పక్షపాతం అనావశ్యకమైన ఆవేశం గా మారితే, ఆ విమర్శ ల వల్ల సాహిత్యానికి, సాహిత్య విమర్శకీ వచ్చే నష్టాల వివరణ ఈ ఉపన్యాసం యొక్క ముఖ్య ఉద్దేశాలలో ఒకటి. ఆవేశమే ముఖ్య ప్రాతిపదికగా పెట్టుకొని విమర్శలు చేసిన విమర్శకులు ఆర్థికంగా రాజకీయంగా అధికారబలంగల వాళ్ళయితే సాహిత్యానికి, సంస్కృతికీ వచ్చే నష్టం అపారం. అటువంటి కొన్ని విమర్శలను గురించి ముచ్చటించి, ఈ స్థితినుంచి తేరుకోవడానికి (విముక్తికి) మార్గాలేమయినా ఉన్నాయా అని ప్రశ్నించి, ఆలోచనకి ప్రేరేపించడం నా రెండో ముఖ్యోద్దేశం.

కళాపూర్ణోదయం, తెలుగు సాహిత్యంలో మొదటి “నవల.” ఒక వినూత్న ప్రక్రియకి నాంది. కథ చెప్పించిన పద్ధతి, కథలోకథలోకథ అత్యద్భుతంగా కూర్చిన విధానం, వచనంలో మాట్లాడుకున్నట్టే ఉండే పద్యసంభాషణలు, కథలోపునశ్చరణ వంటి ఎన్నో విశేషాలు ఇందులో…

గొప్ప కవులెవరైనా సరే — సాహితీపరంగా — వారున్న కాలానికి దూరంగా ఉంటారు. అంటే, వారి కవిత్వం “సమకాలీన కవిత్వం,” అనే ముద్రకి లొంగదు. అటువంటి గొప్ప కవులు భూత కాలంలో కాస్త తారాడుతూ ఉండటమో, భావజనితమైన భవిష్యత్తులోకి చొరబడటమో, చేస్తారు. అంతే కాదు. ఆకవులు వారిది అని చెప్పుకోదగ్గ ఒక ప్రత్యేకమైన వర్తమానంలో ఉంటారు. పాఠకుడిని ఆ వర్తమానంలోకి తీసుకొపోవడానికి ప్రయత్నిస్తారు! అటువంటి కవుల సాహిత్యాన్ని విమర్శించేటప్పుడు, భూత, వర్తమాన కాలాలని మననం చేసుకొని, భవిష్యత్తు గురించి, ఆలోచించి మరీ విమర్శించాలి. ఇందుకు సహృదయత చాలా ముఖ్యం.

పదహారవ శతాబ్ది వాడైన పింగళి సూరన్న కళాపూర్ణోదయము, ప్రభావతీ ప్రద్యుమ్నము అనే రెండు కావ్యాలని రాశాడన్న విషయం మీ అందరికీ తెలిసినదే! కట్టమంచి రామలింగారెడ్డి గారు 1899 లో వ్యాస రూపముగా అనేక సాహితీసభలలో చదివి, తరువాత 1914 లో కళాపూర్ణోదయ ప్రభావతీప్రద్యుమ్న విమర్శగా “కవిత్వతత్త్వ విచారము” అనే పేరుతో రెండువందలపైచిలుకు పేజీలలో పుస్తకము ప్రచురించారు. 1932 లో ఈ పుస్తకాన్ని ఆంధ్ర విశ్వకళాపరిషత్తు వారు ప్రచురించారు.

ఇక్కడ గతశతాబ్ద చరిత్ర మననం చేసుకోవడం కొద్దిగా అవసరం. 1902 వ సంవత్సరములో రామలింగారెడ్డి గారు ఇంగ్లాండు లో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో పైచదువులకు పోయి 1907 లో ఆంధ్రదేశానికి తిరిగి వచ్చారు. అక్కడ ఆంగ్లసాహిత్యం, అక్కడి సాహితీవిమర్శల వలన బాగా ప్రభావితులైనారు. ఇంగ్లాండు లో ఆయన ఉన్న కాలం రాజకీయంగా, సాంఘికంగా, సాహిత్యపరంగా “విక్టోరియన్ యుగం”, లేదా “విక్టోరియన్ యుగాంతం” అని చెప్పవచ్చు. ఆ సమయంలో ఆంగ్ల సాహిత్యాన్ని పేరుపొందిన ఆంగ్ల విశ్వవిద్యాలయాల్లో పాఠ్య విభాగంగా పెట్టడానికి ఉన్న రాజకీయ, సాంఘిక కారణాలను కూలంకషంగా చర్చిస్తూ, Chris Baldick చక్కని పరిశోధనా వ్యాసం రాశాడు. తదుపరి The Social Mission of English Criticism [6] లో ఈ వివరణలు బాగా విశదీకరీంచబడ్డాయి.

ఆంగ్ల సాహిత్యాన్ని పాఠ్య భాగం చేయడానికి ఒక ముఖ్య కారణం, లేదా ప్రత్యేక కారణం అనండి, ఆంగ్లేయులు తమ సాహిత్యం సంస్కృతుల ఆధిక్యత, బానిస రాజ్యాల వారికి తెలియచెప్పడం! బానిస ప్రజల నెత్తిపై పులవడం అనవచ్చేమో! ఈ విషయం శ్రద్ధగా గమనించడం మనకి చాలా అవసరం. ఎందుకంటే, రెడ్డి గారిని ప్రభావితం చేసినది ఆనాటి సాహిత్య విలువలు, వాటికి తోడుగా ఆనాడు ప్రబలంగా ఉన్న “విక్టోరియన్” నైతిక విలువలు!

కళాపూర్ణోదయం గురించి, ప్రభావతీ ప్రద్యుమ్నం గురించీ, మొత్తం తెలుగు ప్రబంధ సాహిత్యం ( పదహారవ శతాబ్దం మొదలు పద్ధెనిమిదవ శతాబ్దం ఆఖరువరకు) పై రెడ్డి గారు చేసిన విమర్శలు, ఆయన విదేశీ విద్య నేపథ్యంలో చూడటం చాలా అవసరం అని నేను భావిస్తున్నాను కాబట్టి, ఈ గత చరిత్ర స్థూలంగా తెలియ పరిచాను.

ఇప్పుడు, ఆయన విమర్శనా గ్రంధం, కవిత్వతత్త్వ విచారము [1] నుండి కొన్ని వాక్యాలు:

“మహమ్మదీయులచే నోడింపబడి యుక్కు తక్కువయై కుక్షింభరులమైయున్న కాలంబులో బుట్టి పెరిగిన ప్రబంధకవులలో పాండిత్యబలము విశేషముగనున్నను పందతనమొక్కటి యెక్కువగనున్నదేకాని, …”

“బ్రిటిష్ గవర్నమెంటువారు మనకు మనసారనిచ్చిన విద్యా ప్రభావముచేత నిప్పుడు పరచింతనంతగా నుంచుకొనక యైహికముల సాధించు నుద్యోగములను పునరాచరణమునకు తెచ్చికొనుచున్నాము.”

వర్ణనలన్నా, అలంకారాలన్నా రెడ్డి గారికి పరమ అసహ్యం. మన ప్రబంధకవులు ఈ రెండూ ఎక్కువగా చేస్తారని ఆయనకు ఎనలేని కోపం. ఈ విషయం ఆయన పుస్తకంలో పదే పదే విసుగుపుట్టేట్టు చర్వితచర్వణంగా ఉదహరిస్తారు.

“కమలముతో బోల్పకున్న సీతాదేవి ముఖము చూచువారికి సుఖము నియ్యదా? చిన్నతనము బూనునా? …. ప్రతి పదార్థమునకు ఒక ఉపమానముండి తీరవలయునన్న కట్టకడపటి యుపమానమునకాధారమేమి?”

ఆయనకు ఎనలేని ఇంగ్లీషు సాహిత్యాభిమానం. ఆ అభిమానం ఆయన పుస్తకంలో కొట్టవచ్చినట్టు కనబడుతుంది.

కాస్తో కూస్తో ఇంగ్లీషు సాహిత్యం తో పరిచయం ఉన్న తెలుగు మేథావులందరికీ, ఈ ఆంగ్లాభిమానం, ఈ మక్కువా కావలసినదానికన్నా కాస్త ఎక్కువే! ఉదాహరణకి, “చూశారా! ఎలియట్ ఏమన్నాడో! Objective Correlative గురించి? అబ్బ! ఎంతబాగా చెప్పాడండీ,” అని గుడ్లు మిటకరించి సంభ్రమాశ్చర్యాలని ప్రకటించే నవీన పాఠకులని మీరు కలిసే ఉంటారు. నిజం చెప్పాలంటే, ప్రాచీన ఆలంకారికులు చెప్పిన విభావ, అనుభావ, సంచారీ భావాలను కాస్త జాగ్రత్తగా అర్థం చేసికొని ఉంటే, “సాధారణీకరణం” అంటే universalization అనే భావానికి , ఎలియట్ గారి Objective Correlative కి ఎంతదగ్గిర సంబంధం ఉన్నదో తెలుస్తుంది. ఆ విషయం ఎలియట్ గారు చెప్పేవరకూ మన నవీన పాఠకుల బుర్రలకెక్కలేదు!

రెడ్డిగారు రాస్తారు:

“ఇంగ్లీషు కవులకంటె నాంధ్రకవులలో నలంకారము లధికములు. అందును ప్రబంధకవులలో అత్యంత విపరీతములు. దీనికి కారణమేమన, అలంకార రచన ఆలోచనా శక్తికి చేరినంత భావనాశక్తికి చేరినది కాదు.”

“ప్రాచీనులు వ్రాసినట్లును అలంకారశాస్త్రములాదేశించినట్లును విరచింప ప్రయత్నించుట తెలివి తక్కువ పని.”

అలంకార శాస్త్రాలని సాహిత్య విమర్శనా గ్రంధాలుగా రెడ్డి గారు అర్థం చేసుకోవడానికి కనీస ప్రయత్నం చేసి వుంటే, ఈ విధంగా నిరసన భావంతో రాసే వారుకాదేమో! పోతే, అలంకారశాస్త్రం “ఇల్లాగే రాసితీరాలి” అని ఎక్కడా ఆదేశించి నిర్బంధించిన దాఖలాలు లేవు. కానీ, కొందరు కవులు విపరీతానికి పోవడం ఆ కవుల వెర్రితనం కాని, అలంకారశాస్త్రాల తప్పుకాదు! ఈ చిన్న విషయం ఆయనకు తెలియక పోవడం ఆశ్చర్యంగా వున్నది!

ప్రబంధాలలో సహజంగా చెప్పే కథ గురించి వ్యాఖ్యానిస్తూ రెడ్డిగారు ఇలా రాసారు:

“కన్యామణియొక్క కాకకు నుపశమనము చేయుటకై చెలులామె నుద్యానవనమునకు పిలిచికొని పోవుట. సరోవరసందర్శనము. ఆ ప్రొద్దుమాత్ర మందరును స్నానముచేయుట, చన్నీళ్ళువడువేళకు గగుర్పాటు వణకు మొదలైన శృంగారావస్థలు తిక్కెక్కినట్లు ప్రబలుటయు, యజమానురాలిని చివురుటాకుల శయ్యపై పరుండ జేసి వస్త్రములు సడల్చి శైత్యోపచారములు చేయుట…”

ప్రబంధములలో నాటక సరణి లేక, పాత్రోచితమైన భాష మందునకైననూ దొరకదని ఆరోపణ చేస్తూ, అంతా “శ్లేష” యేనని, అపహాస్యము, అవహేళన!

అసలు శ్లేష అంటే ఏమిటో జాగ్రత్తగా ఆలోచించి ఉంటే, ఈ అపహాస్యం వచ్చేది కాదేమో! (శ్లేష అంటే, “కలయిక,” “సంశ్లేషణ,” embrace, అని భావం. శ్లేషః సర్వాసు పుష్ణాతి ….. చూ: దండి రాసిన కావ్యాదర్శం : రెండవ పరిచ్ఛేదం, 363 వ శ్లోకం.[8]. Also for an explanation of Slesha, as it pertains to Kalapurnodayam, see The Sound of The Kiss, Velcheru Narayana Rao and David Shulman, page 173, [2])

కళాపూర్ణోదయ కావ్య రచనలో సూరన్న మూడు ప్రధాన లక్షణాలు సాధిస్తానని ముందుగా అన్నాడు. ఇవీ ఆ లక్షణాలు: “అపూర్వకథాసంవిధాన వైచిత్రి, శృంగార ప్రాయత, పుణ్యవస్తు వర్ణనాకర్ణనీయత. “ఇవి సాధించాడా లేదా అన్నది ప్రప్రధమంగా ఏ విమర్శకుడైనా చూడాలి. ఉదాహరణకి, “బుష్ గారు ఇరాక్ యుద్ధం గురించి ప్రపంచప్రజలకి అబద్ధాలు చెప్పుతున్నాడు, అని కథ రాస్తున్నాను,” అని ప్రారంభంలోనే చెప్పాననుకోండి. నా కథ చదివిన ఏ విమర్శకుడైనా, నేను ఇది సాధించానా లేదా అని ప్రశ్నించడం న్యాయం, ధర్మం. ఇక పోతే, రెడ్డి గారు రాస్తారు : “కవి తన అభిమతము నెరవేర్చుకొన్నాడు గాని, ఇట్లు పంతముపట్టి వ్రాసినందున నిష్కళంకమైన కృతి యేర్పడినదా లేదా అనుట సందేహము.” ఇటువంటి “పొగడ్త” ని left-handed compliment, “పుర్రచేతి ప్రియభాషణం,” అనచ్చు.

ప్రభావతీ ప్రద్యుమ్నము గురించి ప్రస్తావిస్తూ, “రచనా దోషములు లేకున్నను కళాపూర్ణోదయము కన్న నిది నికృష్ట మనుటకు భావ లోపములు కారణములు. …. ఇక ప్రభావతి యన్ననో, నాకుంజూడ నెంతయు నసహ్యురాలు! రూపమున్నది. నాథుడెప్పుడు వచ్చి పైబడునాయను తహతహ దట్టముగ నున్నది. ….. నిజము చూడబోయిన ప్రభావతీప్రద్యుమ్నము శైలినొక్కదానిందప్ప తక్కిన విషయములలో సామాన్య ప్రబంధముల మీరినది కాదు. కథ మిక్కిలి సన్నము. చిత్రరూపములు, దూతికలు మొదలగు మధ్యవర్తుల మాటలు, వీనిచే నాకాలము వారికి కామాగ్ని యున్నట్టుడి ప్రభవిల్లి మనసులను దేహములను దహింపజేయునంత తైక్ష్ణ్యమును బహుత్వరలో గాంచుట సర్వసాధారణమేమో!”

మళ్ళీ మరోసారి, ఆంగ్ల సాహిత్య వ్యామోహం! పాశ్చాత్యుల శృంగార వర్ణనము తో పోలుస్తూ, “వారి యొక్కయు మనయొక్కయు శృంగారమునకు ముఖ్య తారతమ్యములేవనగా: మనవలె వారంగవర్ణనమంతగా జేయరు. చేసినను మొగము కన్నులు మొదలగు బాహిరభాగముల మాత్రము ప్రశంసింతురు. మనలో నఖశిఖపర్యంతము విప్పివిప్పి చూపుట అందరు ఆశ్రయించిన కావ్య లక్షణము … అంగముల వర్ణించునపుడును, ఐరోపాలోని కవులు ఆ యంగము లేరీతి భావమును ప్రదర్శించుననుట జూపుదురేకాని, భావస్థ గీతంబులుగాని యవి అసంభావ్యములని వాని మాట తలపెట్టరు… స్త్రీల గుణగణములను శ్లాఘనతో వర్ణించుట పాశ్చాత్యులలోని సదాచార్యము… ప్రబంధములలోని నాయికలు నామీద వచ్చిపడు మనుట దప్ప ఇంకే యశస్కరములగు పాటులకైన పురికొల్పుట చూచినారా? ఇది శుద్ధ పశుప్రాయమైన కేళి…” ప్రభావతీదేవి వర్ణనము తుచ్చము అని చెప్పుతూ, “అంగముల గూర్చి పలవించుట గణికలకైన తగునా? మోహమనగా వీరికి దేహ క్రీడయేకదా! ఇదియా శృంగారము!” అని ఈసడింపుతో ఆ వర్ణనలు తిరిగి తిరిగి రాశారు, రెడ్డిగారు!

అయితే, ఏమాటకు ఆమాటే చెప్పుకోవాలి. రెడ్డిగారికి వర్ణనలన్నీ నిరర్థకములు కావు! ఆయనకి ప్రభావతీప్రద్యుమ్నములో ఒక వర్ణన బాగా నచ్చింది. “ప్రద్యుమ్నుడు “పోలో” యనబడు గుర్రపు సవారీ చెండాట నాడుచుండుట కవి యెంత రమ్యముగ వర్ణించియున్నాడో,” అని అంటూ ఆ సీస పద్యం ఉదహరిస్తారు. ఆయనకు ఇంగ్లీషు సాహిత్యమే కాకుండా, ఇంగ్లీషు వాళ్ళు పెర్షియనుల దగ్గిర నేర్చుకొని, దేశియుల నెత్తిన రుద్దిన ఆటలంటేకూడా ఎంత అభిమానమో, చూడండి! (కేంబ్రిడ్జ్ లో క్రికెట్ గురించి చెప్పి పొగడడానికి రెడ్డిగారికి ఇక్కడ అవకాశం దొరకలేదు కాబోలు!)

కళాపూర్ణోదయములో రంభానలకూబరద్వయవిలాసము, ఆయనకు కామెడీ ఆఫ్ యెర్రర్స్, అనే షేక్స్పియర్ నాటకము గుర్తుకుతెప్పించినది! (సూరన్న, షేక్స్పియర్ సమకాలీనులు! ఒకరికొకరు తెలియకపోయినా, ఒకేవిధమైన కథని చెప్పడం ఆశ్చర్యమే!) ఈ ఒక్క ఉపాఖ్యాన విశేషమూ తప్ప, ఈ రెండింటికీ ఇంకెక్కడా పోలిక లేదు! ఆ విషయం రెడ్డిగారు చెప్పరు!

ఆయన పరిభాషలో, “అసహ్య శృంగారము” ఉదహరిస్తూ, “వధూవరులేకాంతము కోరుచున్నారు. చెలికత్తెలు కొంచెమున వదలరు. కవియన్ననో ఈ సమయమున ప్రాణముపోయినను వారినివదలబోడు! …”

ఇంత వివరంగా నేను ఎందుకు చెప్పుతున్నాను అన్న ప్రశ్న మీకు రాక మానదు. రెడ్డిగారి రెండువందలపైచిలుకు పేజీల విమర్శనా గ్రంధంలో, ప్రతి రెండవ పేజీలో శృంగార వర్ణనల ఏవగింపు, అపహాస్యం, అవహేళన, కొట్టవచ్చినట్టు కనిపిస్తుందని చెప్పడానికి! ఆయనకు నచ్చిన భాగాలగురించి చేసిన ప్రశంసలు, ఈ అవహేళనా సముద్రంలో ముణిగి మరుగున పడిపోయాయి. ఆయన పుస్తకం ఎప్పుడు చదివినా, ఎన్నిసార్లు చదివినా (ఆయన భాష ఇప్పుడు మనకి కొంచెం కష్టంగా కనిపిస్తుందనుకోండి, అది వేరే విషయం!) , ఆయన అవహేళనలే గుర్తుంటాయి కానీ, ఆయన చేసిన “పుర్ర చేతి ప్రశంసలు” అసలు గుర్తుకు కూడా రావు! రెడ్డిగారు తన వ్యాసం సభల్లో చదివిన రోజుల్లో, వేదం వేంకటరాయ శాస్త్రిగారు నీ వ్యాసంలో “అత్యుక్తి” దోషాలున్నాయని ప్రేమతో మందలిస్తూ చెప్పారుట! ఈ వ్యాసం పెరిగి పెద్దదై, పుస్తక రూపంలోకి వచ్చేటప్పటికి ఈ దోషాలే ఎక్కువై, పుస్తకం నిండా కనిపించటం ఆశ్చర్యంగా ఉన్నది.

రెడ్డి గారి ఉద్దేశంలో కళాపూర్ణోదయము ఆరవ ఆశ్వాసంలోని 189 వ పద్యంతో ముగిసిందని! మిగిలిన భాగాలు, కేవలం అనవసరమైన వర్ణనల మూలంగా కథాగమనం మందగించిందని ఆయన వాదు. నిజానికి, ఎనిమిదవ ఆశ్వాసం చివర చెప్పిన సుగ్రుహుడి వృత్తాంతం లేకపోతే కథ ఎంతో అసమగ్రంగా మిగిలి పోతుంది!

కళాపూర్ణోదయం, తెలుగు సాహిత్యంలో మొదటి “నవల.” తెలుగు సాహిత్యంలో ఒక వినూత్న ప్రక్రియకి నాంది. కథ చెప్పించిన పద్ధతి, కథలోకథలోకథ అత్యద్భుతంగా కూర్చిన విధానం, ఐదవ ఆశ్వాసం వరకూ కథ ఎక్కడ ప్రారంభమయిందో పాఠకుడికి తెలియకుండా గుట్టుగా ఉంచి, కథని అత్యంత ఉత్సాహంతో చదవడానికి ప్రేరేపించడం (flash back technique) వచనంలో మాట్లాడుకున్నట్టే ఉండే పద్యసంభాషణలు, కథ కవిచెప్పకండా పాత్రలద్వారా కథను మలుపులుతిప్పడం, మణిత, మణిహారాల మాటల్లో ఇమిడి ఉన్న గూఢార్థాలు, కథలోపునశ్చరణ, కథాక్రమం, వీటిపై చక్కని వివరణకు The Sound of the Kiss[2], లో “Invitation to a Second Reading” కాస్త శ్రద్ధగా చదవండి. అందులో రెడ్డిగారి మేథకి అందని, చాలామంది ఆధునిక విమర్శకులకి అర్థంకాని విషయాలు, కూలంకషంగా చర్చించబడ్డాయి. వారి అనువాదానికి పెట్టిన పేరు, The Sound of The Kiss అన్నది ఎంత చక్కని పేరో, “మణిత” అన్న పదానికి ఎంత అనువుగా ఉన్నదో, బోధపడుతుంది.

ఇక పోతే, ప్రభావతీప్రద్యుమ్నం కావ్యంలో నాయకుడు, నాయిక ప్రబంధసాహిత్యంలో అప్పటివరకూ ఉన్న సాంఘిక కట్టుబాట్లని ఎల్లా ఉల్లంఘించారో, ఆ పుస్తకంలో కల్పనా పాటవం, వర్ణనా చాతుర్యం, ఇతర నవ్య విశ్లేషణలు The Demon’s Daughter, A Love Story from South India [3] లో విపులంగా విశదీకరించబడ్డాయి.

ప్రభావతీ ప్రద్యుమ్నము కేవలం చదువరులకోసం రాయబడింది. అంటే, మనలో మనం చదువుకొని, ఆ శైలిని, కథాకథనాన్నీ ఆనందించడం కోసమే అని అర్థం. ఇందులో, సూరన్న గారు, అంతకుముందు ప్రబంధకవులలా కాకుండా, వచనాన్ని పద్యంలో ఇమిడ్చిన పద్ధతి అద్వితీయం. ఆయన పద్యరచన పద్ధతి, ఆయన చూపించిన కొత్తప్రక్రియలు, తరువాతి కవులకు మార్గదర్శకమయినాయి అనడంలో అతిశయోక్తి లేదు.

నామటుకు నాకు, అనువాదంలోకొచ్చిన ఈ రెండు పుస్తకాలూ నేను చదివి ఉండకపోతే, మూలకావ్యాల [9,10] జోలికి పోయి ఉండే అవకాశమే లేదు. ఈ కాస్త వివరణా సాధ్యం అయ్యేది కాదని రూఢిగా తెలిసింది. ( సిగ్గు విడిచి చెప్పుకోవడం మంచిది. నాకుకూడా, మనలో చాలామందిలాగే, మొదటగా ఇంగ్లీషులో చదవందే, తెలుగు సాహిత్యం నాణ్యత గుర్తించలేక పోవడం! )

ఈ వ్యాసానికి ముఖ్యమైన కారణం: రెడ్డిగారి విమర్శ రెండువందల సంవత్సరాల తెలుగు సాహిత్యానికి చేసిన అపకారం ప్రస్తావించడమే! రెడ్డి గారు అప్పట్లో చాలా పలుకుబడి గలవారు; పైగా అధికారం ఉన్న వారు. ఆంధ్రవిశ్వకళా పరిషత్తుకి మొదటి ఉపాధ్యక్షులు, Vice Chancellor (V.C.) (అప్పటి వీ.సీ. లకి, ఇప్పటి వీ.సీ. లకీ అధికారంలో చాలా తేడాలున్నాయన్న విషయం మీకు తెలియనిది కాదు!) అంతే కాదు; ఆయన గ్రంథం అప్పుడూ, ఇప్పుడూ కూడా పాఠ్య పుస్తకం! ఇప్పటికీ, శృంగారం, వర్ణనలని దాటి ఆ కాలపు సాహిత్యాన్ని మరొక దృష్టితో చూడగలగడం తెలుగులో పట్టభద్రులకి ఇంకా సాధ్యం అవటల్లేదు. తెలుగు సాహిత్యంలో ఈ మధ్యకాలంలో వచ్చిన, ప్రస్తుత కాలంలో వస్తున్న పట్టభద్రులగురించి తరువాత చెప్పుకుందాం.

ఒక యుగాన్ని, ఒక కవి వ్రాసిన కావ్యాన్నీ అవహేళన చేస్తూ విమర్శలు రాలేదనటల్లేదు. మోతాదులో అవహేళణ మనకి చాలా ప్రాచీనమైనదే!

శృంగార నైషధ కర్త శ్రీహర్షుడు, మమ్మటుడనే ఆలంకారికునికి మేనల్లుడట[7]! శ్రీహర్షుడు తన నైషధకావ్యాన్ని మేనమామాకు చూపించాడట! అది చదివి మమ్మటుడు – “నువ్వు ఈ కావ్యం కొంచెంముందుగా నాకు చూపిస్తే బాగుండేది; నా కావ్య ప్రకాశలో దోషప్రకరణంలో వివిధ దోషాలకు ఉదాహరణలు చూపడానికి ఈ కావ్యంలోను, ఆకావ్యంలోను వెదికి చాలా శ్రమ పడ్డాను. నీ కావ్యం అప్పుడే లభించి ఉంటే అన్ని దోషాలకీ ఉదాహరణలు దీనిలోనే లభిస్తున్నాయి కాబట్టి నాకా శ్రమ అంతా తప్పి ఉండేది,” అని అన్నాడట! ఇది కట్టు కథ కావచ్చు. కాని, ఇది హేళనే! చాలా సున్నితమైన హేళన.

(ఇది విన్నతరువాత, శ్రీహర్షుడు తన దోషాలన్నీ సవరించుకున్నాడని కథ!)

అయితే, ఇటువంటి అవహేళనలు ఎప్పుడో మరుగునపడిపోయాయి. కారణం: కవుల ప్రతిభ ఒక్కటే కాదు; ఆ అవహేళన చేసిన విమర్శకులకి ఏ రకమయిన రాజకీయాధికారం లేకపోవడమే!

హద్దు దాటిన అవహేళనకు మరొక ఉదాహరణ అక్కిరాజు ఉమాకాంత పండితులు వ్రాసిన (1928) “నేటి కాలపు కవిత్వం”.[4] భావకవిత్వం పేరుతో అప్పట్లో ప్రసిద్ధమై, ప్రచారమైన కవిత్వాన్ని తీవ్ర పదజాలంతో ఆయన విమర్శించారు. చెప్పవలసిన దానికన్నా ఎక్కువగా చెప్పడం, “విస్తరణాధికరణ” దోషమని నిర్వచించి, ఒక్క యెంకి పాటలు మినహా మొత్తం భావకవిత్వాన్ని దుయ్యబట్టారు. “అయోమయత్వం, పులుముడు, నిదర్శన పరంపరలు, భాషా వ్యతిక్రమం” అనే పేర్లు పెట్టి నిరసనగా రాసారు. సాంఘికంగా మారుతున్న అభిరుచులకు అనుగుణంగా, భావకవిత్వం చరిత్రలో నిలిచింది. ఉమాకాంతంగారి విమర్శ మరుగున పడిపోయింది. అయితే, చెప్పే విషయాలలో సూటిదనం, నిర్భీకత, నిజాయితి, స్పష్టత, తర్క పటిమ ఉమాకాంతంగారి సద్గుణాలు. ఆయన పాండిత్యానికి భయపడి, ఆ రోజుల్లో ఎవ్వరూ ఆయనకు సమాధానం చెప్పలేకపోయారట (శ్రీశ్రీ, 1960, ఆంధ్రదర్శని – Preface to Ref.4). ఉమాకాంతం గారికి పాండిత్యానికి తోడు, రాజకీయ అధికారం కూడా ఉండి ఉంటే భావకవిత్వం ఏమయి ఉండేదో ఆలోచించండి!

ఇక పోతే ప్రస్తుతకాలంలో సాహిత్య విమర్శ కేవలం వ్యక్తి దూషణగానో, ఒక ప్రత్యేక వర్గ సంబంధిగానో తయారయ్యింది. మార్క్స్, ఎంజెల్స్, లెనిన్, మావో ల భౌతికవాద మార్క్సిజం [5] పై సందేహం పైకి చెప్పితే చాలు, ఆ రచయిత పని సున్నే! అలాకాకండా, మానవతావాద మార్క్సిజం బహుశా మంచి సాహిత్యానికి, సాహిత్య విమర్శకీ సరైన తోవ చూపించవచ్చునేమో అని ఎవరన్నా అంటే చాలు, వాళ్ళు రివిజనిస్టులు; వాళ్ళు ఎంత గొప్పకవిత్వం రాసినా సరే, అది బూర్జువా కవిత్వమే అవుతుంది; ఏ విమర్శ చేసినాసరే, అది బూర్జువా విమర్శే అవుతుంది. ఈ రెండు వాదాలూ కూడా సాహిత్యం మేరకు ఓ సంతృప్తికరమైన సమాధానాలు ఇవ్వలేవేమో అంటే వాళ్ళు రివిజనిస్ట్లులకన్నా హీనమైన జాతి వారు! వాళ్ళని పేరుపేరునా దుయ్యబట్టటం కొంతమంది నవవిమర్శకులకి పరమావధిగా తయారయ్యింది. ఇటువంటి వితండ వాదన చేసేవాళ్ళకీ, బుల్లి బుష్ గారికీ పెద్ద తేడా లేదనే చెప్పాలి! ఇక్కడ మళ్ళీ బుష్ గారి ప్రస్తావన తెస్తున్నందుకు క్షమించండి. ఇరాక్ యుద్ధం గురించి ఆయన రాజకీయాలని సమర్థించకపోతే, వాళ్ళ జత కచ్చి కచ్చి, కావ్ కావ్! If you are not with us, you aren’t a patriot! అన్నట్టు!

మనకి, అనావశ్యకమైన ఆవేశం, విపరీతమైన పక్షపాతం లేకుండా, ఎవ్వరికీ ఏ ఇజానికీ అడుగులకు మడుగులొత్తకుండా, నిష్కర్షగా చెప్పగల ధైర్యం ఉంది. అవకాశం ఉంది. అయితే ఆ ధైర్యం, అవకాశం మాత్రమే చాలవు. వాటికి తోడు తగిన ప్రేరణ, సరైన శిక్షణ ఉంటే, బహుశా, మనం తెలుగు సాహిత్య విమర్శలో కొత్త పుంతలు తొక్క గలమనే ఆశ.

ఇటువంటి సందర్భంలో, విమర్శ, కనీసం dialog అయినా అతిపాక్షికంకాకండా ఎలావుంటుంది? ఏ వాదాలను సమర్థించేవాళ్ళు, ఆ వాద ధోరణిలో వచ్చిన సాహిత్యాన్ని అందలానికెక్కించడం, విపరీతంగా పొగడటం (మళ్ళీ అత్యుక్తి దోషం కి మరో ఉదాహరణ!) మిగిలిన సాహిత్యాన్నంతనీ, ఆ రచయితలందరినీ దూషించి, దుయ్యబట్టడం జరుగుతూన్నది. ఇదీ ప్రస్తుత కాలంలో సాహితీ విమర్శ!!

ఈమాటసెప్టెంబర్ 2006 సంచికలో నేను రాసిన సంపాదకీయంనుంచి కొన్ని వాక్యాలు ఇక్కడ పునశ్చరణ చెయ్యటం అసంబద్ధంకాదనుకుంటాను. స్థూలంగా అక్కడ చెప్పిన భావాలు ఇవి: తెలుగు దేశంలో, ఇప్పుడు సాహితీ చర్చలు ఆలోచనాయుతంగా జరగటల్లేదు. ఆ చర్చలన్నీ వ్యక్తి నిందలతోటి, కొరగాని ఆవేశాలతోటీ, గజిబిజి వాక్యాలతోటీ, అంతం అవుతున్నాయి. తెలుగులో ఇప్పుడు వస్తున్న రకరకాల కవిత్వాలకి అన్నిటికీ ఒకే విమర్శ సిద్ధాంతం వర్తించవలసిన అవసరం లేదు. ఎవరికవిత్వపు మంచిచెడ్డలు వివరించడానికి, విశ్లేషించడానికి అవసరమైన విమర్శ భావాల్ని, పరిభాషనీ వాళ్ళు తయారు చేసుకోవచ్చు. అయితే, విమర్శలో ఏదిమంచిది, సమర్థమైనది, ఏది అనవసరపు ఆవేశాలతోనూ, ఊకదంపు గజిబిజి వాక్యాలతోనూ నిండిన అసమర్థ విమర్శ అన్న సంగతి ఆయా కవితారంగాల్లోఉన్న విమర్శకులే చెప్పాలి. తమ విమర్శకులకి కావల్సిన తరిఫీదు ఎలా ఉండాలో వాళ్ళే నిర్ణయించాలి. తెలుగు కవిత్వానికీ, విమర్శకీ ప్రమాణాలు కవిత్వం రాసే వాళ్ళు, విమర్శ రాసే వాళ్ళూ తమలోతాము చర్చల ద్వారా నిర్ణయించాలి. ఏ ప్రమాణాలూ లేకుండా ఏదిరాసినా కవిత్వమే, ఎవరు రాసినా విమర్శే అనే పరిస్థితి ఎవరికీ మంచిది కాదు.

పోతే, మన విశ్వవిద్యాలయాల్లో, తెలుగు సాహిత్య విమర్శ కొత్త పుంతలు తొక్కే అవకాశం శూన్యం. ముఖ్య కారణం: గత ఐదు దశాబ్దాలుగా, తెలుగు సాహిత్యంలో పట్టభద్రులవుదామనే కుతూహలం చూపించే వారెవరు? పైచదువులకి అంటే విశ్వవిద్యాలయాల్లోకి వెళ్ళే వారిలో ఎక్కువమంది (సుమారు 99.5 శాతం!), ఇంజనీరింగులోకి, వైద్యవిద్యలోకి, మిగిలిన శాస్త్ర విద్యలలోకి ప్రవేశిస్తారు! మరి కొద్దిమంది, వ్యాపార సంబంధమైన విద్యల్లోకి ప్రవేశిస్తున్నారు. ఇటువంటి విద్యల్లోకి ప్రవేశం దొరకని ( లేదా ప్రవేశ పరీక్షల్లో ఉత్తీర్ణులు కాలేని వారు) వాళ్ళే ఎక్కువ మంది తెలుగు సాహిత్య అధ్యయనం కి వస్తున్నారు! దానికి తోడు, తెలుగులో ఎం.ఎ. లో ప్రవేశించడానికి, ఏవిధమైన ప్రవేశ పరీక్షలోనూ ఉత్తీర్ణులు కానక్కరలేదని విన్నాను. ఈ పట్టభద్రులే, కళాశాలల్లో, విశ్వవిద్యాలయాల్లో తెలుగు ఉపన్యాసకులు, ఆచార్యులూ అవుతున్నారు. ఇటువంటి స్థితిలో, తెలుగు సాహిత్య పఠనం, తెలుగు సాహిత్య విమర్శ, పటిష్టం అవడానికి మార్గం కనిపించడం లేదు.

ఈ మధ్య ఎక్కడో చదివిన గుర్తు: Nathaniel Hentoff అనే ప్రఖ్యాత సంగీతవిమర్శకుడు అన్నాడట! Anybody can be a jazz critic. The Standards are very low, అని. తెలుగులో విమర్శ కూడా సరిగ్గా అదే స్థితిలోఉంది అని అనడానికి సందేహం లేదు.

diaspora సాహిత్యంతో సతమతమవుతున్న మనకి, అనావశ్యకమైన ఆవేశం, విపరీతమైన పక్షపాతంలేకుండా, ఎవ్వరికీ ఏ ఇజానికీ అడుగులకు మడుగులొత్తకుండా, నిష్కర్షగా చెప్పగల ధైర్యం ఉంది. అవకాశం ఉంది. అయితే ఆ ధైర్యం, అవకాశం మాత్రమే చాలవు. వాటికి తోడు, తగిన ప్రేరణ, సరైన శిక్షణ ఉంటే, బహుశా, మనం తెలుగు సాహిత్య విమర్శలో కొత్త పుంతలు తొక్క గలమనే ఆశ. దయచేసి ఆలోచించండి.

ఆఖరిగా, కొన్ని వందల సంవత్సరాలక్రితం కవిత్వం రాసిన కవి మనకి సమకాలీనుడే! వర్తమాన కాలానికి, భూతకాలానికీ, లంకె కవులే! కవులు మన సంప్రదాయాలకి సంరక్షకులు అని గుర్తు పెట్టుకోవడం ఎంతైనా అవసరం! అందుకే సాంస్కృతిక విలువలు సంప్రదాయాలూ సమసి పోవు; అవి సార్వజనీయాలు.

References:

  1. కవిత్వ తత్త్వ విచారము (6th Editoin) – కట్టమంచి రామలింగారెడ్డి, ఆంధ్ర యూనివెర్సిటీ, జనవరి 1981.
  2. The Sound of The Kiss or The Story That Must Never be Told, Pingali Suranna, Translated by Velcheru Narayana Rao and David Shulman, Columbia University Press, New York, 2002.
  3. The Demon’s Daughter, A Love Story from South India, Pingali Suranna, Translated by Velcheru Narayana Rao and David Shulman, State University of New York Press, Albany, 2006.
  4. నేటి కాలపు కవిత్వం – అక్కిరాజు ఉమాకాంత విద్యాశేఖరులు, తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్, 1994 (చేకూరి రామారావు గారి ముందుమాట నాకు ఉపయోగపడింది)
  5. Marxism and Literary Criticism – Terry Eagleton, University of California Press, Berkeley, 1976 (An excellent student introduction on the subject).
  6. Literary Theory, An Introduction – Terry Eagleton, The University of Minnesota Press, Second Edition, 1993 (I am benefited from the Chapter entitled ‘The Rise of English,’ which gave me the lead to Chris Baldick and his work).
  7. కావ్య ప్రకాశము – మమ్మటుడు (తెలుగు వ్యాఖ్య: పుల్లెల శ్రీరామచంద్రుడు), సంస్కృత భాషా ప్రచార సమితి, హైదరాబాద్, 1995 (ముఖ్యంగా ఉపోద్ఘాతం)
  8. కావ్యదర్శః – దండి (తెలుగు వ్యాఖ్య: పుల్లెల శ్రీరామచంద్రుడు), ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ, హైదరాబాద్, జనవరి 1981.
  9. కళాపూర్ణోదయము (2 సంపుటములు) – పింగళి సూరన, వ్యాఖ్య బొమ్మకంటి శ్రీనివాసాచార్యులు, Emesco Edition, 1997
  10. ప్రభావతీ ప్రద్యుమ్నము – పింగళి సూరన, Emesco Edition, 1990.