తెలుగువారి ఊళ్ళ పేర్లు – ఇంటి పేర్లు

ప్రతి జాతికీ ఉన్నట్టే తెలుగువారికీ ఊళ్ళ పేర్లూ, ఇంటి పేర్లూ ఉన్నాయి. ఇవి ఏర్పడ్డంలో తెలుగువారికో ప్రత్యేకత ఉంది. ప్రాంతాల స్వభావాలను బట్టి ఊళ్ళ పేర్లు, ఊళ్ళను బట్టి, వృత్తిని బట్టి ఇంటి పేర్లు ఏర్పడ్డాయి. అలా ఏర్పడిన పద్ధతికి ఒక పరిణామం ఉంది.

తెలుగువారి ఊళ్ళ పేర్లు

గ్రామనామాధ్యయనం నామవిజ్ఞానశాస్త్రంలో ఒక భాగం. గృహనామా ధ్యయనం, వ్యక్తి నామాధ్యయనం, పశుపక్ష్యాది ప్రాణి కోటికి సంబంధించిన నామాధ్యయనం, మానవకల్పిత వస్తుసముదాయానికి చెందిన నామశాస్త్రాధ్య యనం అనేవి నామ విజ్ఞానశాస్త్రం లోని ఇతర భాగాలు. ఇది భారతదేశంలో ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న విజ్ఞానశాస్త్రం. గ్రామనామాలను గూర్చి, తద్వారా గ్రామనామాధ్యయన ఆవశ్యకాన్ని తెలియజెప్పడం ఈ వ్యాస లక్ష్యం.

సాధారణంగా జనావాసాలను గ్రామాలని, ఊళ్ళనీ సంభావిస్తూ వుంటాము. కాని ఇది సరికాదు. సంస్కృత శబ్దమైన గ్రామానికి, ప్రాకృత శబ్దమైన ఊరికి కొన్ని ప్రత్యేక లక్షణాలున్నాయి. అవి కలిగిన జనావాసాలనే గ్రామాలుగా, ఊళ్ళుగా సంభావించాలి. కౌటిల్యుడు తన అర్థశాస్త్రంలో గ్రామాన్ని ఇలా నిర్వచించాడు. జనావాసంలో కనీసం 500ల కుటుంబాలుండాలని, అందులో ముఖ్యంగా వ్యవసాయ కుటుంబాలధికంగా వుండాలని, చేతివృత్తుల వారు వుండాలని, స్వయంపోషకంగా ఉంటూ, దగ్గరి నగరానికి వ్యవసాయోత్పత్తులను, పాడి ఉత్పత్తులను సరఫరా చేయగలిగిన స్థితిలో వుండాలని నిర్దేశించాడు. ప్రభువులు కొత్తగా గ్రామాలను నిర్మించేటప్పుడు పై లక్షణాలను దృష్టిలో పెట్టుకుని, అవసరమైతే కొన్ని కుటుంబాలను కొత్తగా నిర్మించిన గ్రామాలకు తరలించాలని సూచించాడు. సుమతీ శతకకారుడు కూడా అన్యాపదేశంగా దేనిని ఊరని సంభావించవచ్చునో నిర్దేశించాడు. ‘అప్పిచ్చువాడు, వైద్యుడు, ఎడ తెగక పాఱునేరును ద్విజుడును చొప్పడిన ఊరనుండుము, చొప్పడ కున్నట్టి ఊరు చొరకుము’ అని అంటాడు. ఇక్కడ ఆయన ఊరు అనేదాన్ని జనావాసం అనే సామాన్యార్థంలోనే ఉపయోగించాడు. అయితే ఆ లక్షణాలున్న దానినే ఊరు అనడం సమంజసం. కాని ‘ఊరు’ అర్థం వేరు. శివాలయం లేని జనావాసాన్ని ‘కొట్టిక’ అని అనాలని మన నిఘంటుకారులు నిర్దేశించారు. ఈ అవగాహనతో పరిశీలించినపుడు జనావాసాలన్నీ ఊళ్ళు కావని తేలుతుంది. కోడూరు, మేడూరు, తిరువూరు మొదలైనవి మాత్రమే ఊళ్ళు. పురాలు, నగరాలు, ఆబాద్‌లు (నరసాపురం, విజయనగరం, హైదరాబాదు) — ఈ పదాలకు నిఘంటువుల్లో అర్థాలు దొరుకుతాయి. పూడి (పారుపూడి), తుర్రు (మొగిలితుర్రు), కుర్రు (కేసనకుర్రు), పల్లె (చల్లపల్లె), పాడు (గూడపాడు), పెంట (పాచిపెంట) మొదలైన గ్రామనామాలలో కన్పించే పదాలకు గ్రామనామ సంబంధంగా నిఘంటువుల్లో అర్థాలు కన్పింపవు. వీటిని మరికొంత వివరంగా పరిశీలిద్దాం.

తెలుగునాట సుమారుగా 27 వేల రెవిన్యూ గ్రామాలున్నాయి. దాదాపుగా అంతే సంఖ్యలో వాటికి శివారు గ్రామాలున్నాయి. అన్నింటికి పేర్లున్నాయి. కొన్ని సందర్భాలలో ఒకే పేరు కలిగిన జనావాసాలు రెంటికి మించిన సంఖ్యలో కూడా లేకపోలేదు. ప్రతి మనిషికి పేరున్నట్లే ప్రతి జనావాసానికి పేరుంది. పేరనేది గుర్తింపు కోసం ఏర్పడింది. అయితే ఈ పేర్లు పెట్టడంలో కొన్ని అంతరువులున్నాయి. మనుషులందరికి పేర్లున్నాయి. మానవ జనావాసాలన్నింటికి పేర్లున్నాయి. కాని జంతుకోటికి, వృక్షకోటికి, అలా పేర్లులేవు. పులులు, పిల్లులు, చింతచెట్లు, మామిడిచెట్లు, కాకులు, నెమళ్ళు, కుర్చీలు, బల్లలు అని అంటున్నామే తప్ప ఆ తరగతిలోని ప్రతి జంతువుకు, ప్రతి చెట్టుకు, ప్రతి వస్తువుకు విడివిడిగా పేర్లు లేవు. దీనికి కారణం మనిషికి మనిషికి ఉండే సంక్లిష్టమైనవి సంబంధాలు. ఈ సంబంధాల నుండే ప్రతి వ్యక్తిని గుర్తింపవలసిన ఆవశ్యకమేర్పడింది. అందుండే పేరు ఏర్పడింది. మనుష్యులు ఏ ఇద్దరో, ముగ్గురో, నలుగురో వుండివుంటే పేరుతో పనిలేదు. అదే విధంగా జనావాసాలు కూడా నియమితంగా వుంటే పేర్లతో పనిలేదు. జనంతో పాటు జనావాసాలు అధికం కావడంతో ఒకదాని నుండి మరొకదానిని వివక్ష చేయవలసి రావడంతో ప్రతి దానికి పేరు ఏర్పడింది. అందువల్లనే ఒకటి చల్లపల్లె అయితే మరొకటి కళ్ళేపల్లి అయింది. ఇక్కడ రెండూ పల్లెలే. కాని ఒకటి చల్ల -పల్లె, రెండవది కళ్ళే-పల్లె, మరొకటి ముని-పల్లె, ఇక్కడ పల్లె, అనేది జనావాసాన్ని సూచించే పదం. చల్ల, కళ్ళే, ముని అనేవి, అనేకంగా వున్న పల్లె అనే జనావాసాలను వివక్ష చేస్తున్నాయి. అయితే అన్నీ పల్లెలు కావు. కొన్ని పట్టణాలు, కొన్ని తుర్రులు, మరికొన్ని కుర్రులు. ఈ విధంగా జనావాసాలను సూచించే పేర్లలో ఎంతో వైవిధ్యం కన్పిస్తుంది.

ప్రతి గ్రామనామంలోను సాధారణంగా రెండు పదాలుంటాయి. కొన్ని సందర్భాలలో మూడు నాలుగు పదాలున్నవి కూడ లేకపోలేదు. రెండుపదాల కలయిక: నీరు-కొండ, పారు-పూడి, మూడు పదాల కలయిక : తూర్పు-లంక-పల్లి, దొంగల-గన్న-వరం, చెరువు-మాధవ-వరం, నాలుగు పదాలు గలవి: నీళ్ళు-లేని-తిమ్మా-పురం, భుజ-భుజ-నెల్లూరు (నెల్లు-ఊరు.) ఒకేపదం గలవి: దర్శి, తడ, కంభం, నగరం, చీకటి మొదలైనవి. రెండు పదాలు కలిగిన గ్రామనామాలలో ఉత్తర పదాలకు (-పూడి, -పర్రు, -తుర్రు), పూర్వపదాలు విశేషాలుగా ఉపకరిస్తున్నాయి. ఉదా: పారుపూడి, జబర్లపూడి, కత్తిపూడి అనే గ్రామనామాల్లో -పూడి అనేది ఉత్తరపదం. కాగా పారు-, జబర్ల, -కత్తి, అనేవి దానిపై విశేషణాలుగా చేరి మూడు స్వతంత్ర గ్రామాలకు పేర్లుగా సిద్ధించాయి. ఈ నేపథ్యంలో ఈ క్రింది గ్రామనామాలను పరిశీలించండి.

కళింగపట్నం, విశాఖపట్నం, నిజాంపట్నం, మచిలీపట్నం
మేడూరు, కోడూరు, తుళ్ళూరు.
కప్తానుపాలెం, చోడిపాలెం.
పసుమర్రు, పామర్రు, యలమర్రు.
కోగల్లు, మాగల్లు, చాగల్లు, ఈడుపుగల్లు.
విజయవాడ, నందివాడ, మర్రివాడ.
నరసాపురం, కృష్ణాపురం, పండితాపురం.
కసుకుర్రు, ఇక్కుర్రు, పాలకుర్రు.
తుంగతుర్రు, మొగలితుర్రు.
ఈలప్రోలు, పెదప్రోలు.

ఇట్లా ఎన్నో చెప్పవచ్చు. కేవలం ఏదో ఒక పేరు పెట్టడమే లక్ష్యమైతే, ఉత్తరపదంగా కన్పిస్తున్న వాటిలో ఏదో ఒక పదంపై విశేషణాలు అనేకం చేర్చితే జనావాసాలకు పేర్లు ఏర్పడి ఉండేవి. అలా కాక, పూర్వపదంలో వైవిధ్యం పాటించడమే కాక ఉత్తర పదంలో కూడ వైవిధ్యాన్ని పాటించారంటే మన ప్రాచీనుల ఉద్దేశం కేవలం ఏదో ఒక పేరు పెట్టడం కాదని బోధపడుతుంది. అంటే అవి కేవలం జనావాసాలనే కాక ఆ జనావాసాల్లో వున్న వివిధ తరగతులను, వైరుధ్యాలను బోధిస్తున్నాయని అర్థం. ఆ పదాల అర్థం తెలిస్తే ఆ వైవిధ్యం బోధపడుతుంది. పేర్లు పెట్టడంలో మన ప్రాచీనుల భావాలు తెలియ వస్తాయి. తెలుగు గ్రామ నామాల్లో కన్పించే ఈ వైవిధ్యాన్ని పరిశీ లించండి.

కొండ (నీరుకొండ) – గుండం (మోక్షగుండం)
గుంట (త్రోవగుంట) – తోట (మల్లెతోట)
కాలువ (కాటిగాని కాలువ) – వనం (తులసివనం)
చెరువు (మేళ్ళచెరువు) – బయలు (గుర్రాలబయలు)
కట్టుబడి (అధ్వాన్నం నారాయణ కట్టుబడి) – మంద (ఆవులమంద)
కుంట (యాతాలకుంట) – పెంట (వనిపెంట)
కొండ్రలు(చేబ్రోలు వీరప్పకొండ్రలు) – వాకిలి (యాటవాకిలి)
కటకం (ధాన్యకటకం) – కడప (దేవునికడప)
వరం (గన్నవరం) – దరి (పెన్నదరి)
ఏరు (పాలేరు) – మామిడి (దొరమామిడి)
మడక (పూడిమడక) – మడుగు (గుండ్లమడుగు)
దొరువు (పూడిరాయని దొరువు) – సముద్రం (తిమ్మసముద్రం)
రేవు (వాడరేవు) – వాడ (విజయవాడ)
రాల (దుగ్గిరాల) – మెట్ట (దిగువమెట్ట)
బండ ( గాజులబండ) – వంపు (నదివంపు)
తిప్ప (నాగాయతిప్ప) – పాలెం (కృష్ణాయపాలెం)
లోవ (ముడసరలోవ) – అంకి (పోరంకి)
లంక (కృష్ణలంక) రాయి (విజయరాయి)
గడ్డ (పులిగడ్డ) – ముక్కల (నిడుముక్కల)
కోట (దేవరకోట) – పట్టు (పూతలపట్టు)
త్రోవ (తలుపులమ్మత్రోవ) – శాత్తు (పరమశాత్తు)
నరవ (బెడుదుల నరవ) – కాణి (వరగాణి)

ఇందులో ఏవో కొన్ని తప్ప మిగిలినవి సులభంగానే బోధపడుతున్నాయి. కటకం, అడవిలో వుండే పల్లెను సూచిస్తుంది. నరవ, కొండత్రోవలో వుండే జనపదాన్ని సూచిస్తుంది. పై పదాలకు ఉదాహరణంగా చూపిన గ్రామనామాలను ప్రత్యక్షంగా చూచిన వారికి, ఆయా గ్రామాలు, ఆయా పదాలు సూచిస్తున్న పరిసరాలలోనే ఉన్నాయనేది తెలుసు.

దీనిని బట్టి మన ప్రాచీనులు తమ జనావాసాలకు పేర్లు పెట్టడంలో స్థానిక నైసర్గిక స్థితిగతులకు ఎంతో ప్రాధాన్యమిచ్చినట్లు తెలుస్తుంది. -పూడి, -పర్రు, -తుర్రు, -కుర్రు మొదలైన పదాలకు నిఘంటువుల్లో అర్థాలు కన్పింపవు. పూడి అనేది వాగులు వంకలు మొదలైన ప్రవాహాల ప్రక్కన, ఆ ప్రవాహాలకు ఏ మాత్రం వరద వచ్చినా మునిగిపోయేచోట కన్పిస్తుంది. నేడు కాలబోధకంగా ఉపయోగిస్తున్న సామెత ‘ఏండ్లు పూండ్లు గడిచా’యనేది నిజానికి ఆ అర్థంలో వచ్చింది కాదు. ఏండ్లు, పూండ్లు గడవడం అంటే ఏరులు అంటే నదులు, పూండ్లు అంటే బురదనేలలు దాటి వచ్చాయనేది అసలైన అర్థం. కాని ఈ అర్థం పెద్దన నాటికే మాసిపోయింది. పర్రు, పై స్థితికంటే ఎత్తైన భూభాగానికి వర్తిస్తుంది. తుర్రు, కుర్రు అనేవి పర్రు కంటే ఎత్తైన భూభాగాలను, ఇసుక, నల్లరేగడి కలిసిన భూములను సూచిస్తాయి. ఈ అనుబంధాలతో కూడిన గ్రామాలన్నీ, పై వివరించిన పరిసరాల్లోనే నెలకొని వుండడం గమనార్హం.

రావికంపాడు, పోలకంపాడు మొదలైన గ్రామనామాల్లో కన్పిస్తున్న ‘కమ్మ’కు నది అని అర్థం. గుండ్లకమ్మ మనం ఎరిగినదే. కృష్ణానదికి ‘పేరకమ్మ’ అనేది అచ్చపు తెనుగు పేరు. ఈ రెండు కమ్మలకు మధ్య వున్న నాడు ‘కమ్మనాడు’. ‘కమ్మగుట్టు గడప దాటదు’ అనే సామెతను కమ్మవారి కుటుంబాలలోని గుట్టు గడప దాటి బయటకు రాదనే అర్థంలో వివరించడం పరిపాటి. నిజానికిది సరికాదు. కమ్మనాటి గుట్టు కడప దాటిపోదు అని అర్థం. అంటే పాకనాడు దాటినా, రేనాడు దాటిపోదని అర్థం. ‘పెంట’ అంటే పశువులను మంద వేసే స్థలం. ‘తడ’కు సరిహద్దు అని అర్థం. గుర్రాల బయలులోని ‘బయలు’ కర్థం మేతకు వదిలే చోటు అని. పాలెం మొదటి అర్థం, పాలెగాడు వుండే చోటు. అనంతరం కాలంలో శివారు అని అర్థంలో రూఢమైంది.

పల్లె మొదట బౌద్ధుల నివాసం. పాడు జైనులుండే చోటు. వాడ శాఖా నగరానికి పేరు. చెరువు, కుంట, గుంట, కొలను, కుళం, మడుగు, కంభం మొదలైనవి పరిమాణాన్నిబట్టి జలాశయాల్ని సూచించేవి. చీకటి అంధకారం అనే అర్థంలో కాక చెట్టును సూచిస్తుంది. నెమలి, కాకి కూడ పక్షుల పేర్లు కావు. చెట్ల పేర్లే. ప్రోలు, పురానికి వికృతిగా భావించడం కద్దు. కాని ప్రోలు దేశ్యపదం. ప్రభుత్వ ఖజానా వుండే చోటు. దానిమీద అధికారి ప్రోలయ. తరువాత వ్యక్తి నామంగా మారింది. చీరాల, పేరాల, గూటాల, కడియాల మొదలైన వానిలోని ‘ఆల’ గడ్డిజాతికి చెందిన మొక్క. ఆకూ అలము అనడం మన ఎరుకలోనిదే. ‘గడ్డ’ ఏటి ఒడ్డున వున్న ఎత్తైన భూభాగాన్ని సూచిస్తుంది. ‘లంక’ నదీ మధ్యంలోని విశాలమైన భూభాగాన్ని, ‘తిప్ప’ అంతకంటె తక్కువ పరిమాణం గల భూభాగాన్ని సూచిస్తాయి. పిన్నదరి, వైరదరి ఆయా నదుల తీరాల నెలకొని వున్న వైనాన్ని సూచిస్తాయి.

‘వరం’ అనేది ఒకరి అనుగ్రహం వల్ల పొందిన వరం లాంటిది కాదు. వరాని కర్థం ఒక పెద్ద గ్రామంలోని కొంత భూభాగాన్ని విడదీసి ఇచ్చినది. ఆ విడదీయబడిన భూభాగం ‘వరం’. అంతేకాని ఇవ్వడమనే క్రియకు సంబంధించినది కాదు. అయితే గన్నవరం, అడవివరం ఇలాంటివి కావు. నిజానికవి గనివారం, అడివారం. చెరువు క్రింది భూమి గనివారం. క్రిందనున్న (సింహాచలం దేవస్థానానికి) భూమి ఆడివారం. వైవాకలోని ‘వాక’, పాలువాయిలోని ‘వాయి’ చిన్న ప్రవాహాలను సూచిస్తాయి. వినుకొండ, బెల్లంకొండ, నీరుకొండల లోని ‘కొండ’ పర్వతసూచే. కాని మానికొండ, పోలు కొండ, కొండ పాటూరులలోని ‘కొండ’ శిలాసూచి కాదు. కొండంగి అనేది గడ్డి జాతి మొక్క. దీనిని బట్టి ఇచ్చట కొండ అనేది మొక్క అని బోధ పడుతుంది. ఈ ఉదాహరణల వలన, ముందు చెప్పినట్లుగా, మన ప్రాచీనులు పరిసరాలను దృష్టిలో వుంచుకొని తమ ఆవాసాలకు పేర్లు పెట్టారని అవగతమవుతుంది.

ఇక గ్రామనామాల్లోని ప్రథమ భాగాలను పరిశీలిద్దాం. వీటిలో కూడ చాల వైవిధ్యముంది. వ్యక్తినామాలు, కులనామాలు, వృత్తి నామాలు, నైసర్గిక స్థితికి సంబంధించినవి. వృక్షాల పేర్లు, పక్షుల పేర్లు, సంఘటనల పేర్లు — ఇలా మానవ నాగరికత, సంస్కృతి వికాసాలు ముడిపడి వున్న అన్ని అంశాలు ఇందులో చోటుచేసుకున్నాయి. గ్రామనామాల్లోని వ్యక్తినామాలు ఆ గ్రామాన్ని నిర్మించిన వారి పేర, గ్రామాన్ని దానంగా పుచ్చుకొన్నవారి పేర, ప్రముఖులైన వ్యక్తుల పేర వస్తుంటాయి. కులాలు, వృత్తుల పేర్లు, వారు ముందుగా ఆ చోట నివాసమేర్పరచుకోవడం వల్ల వస్తాయి (ఉదా. మేదర మెట్ల, బోయగూడెం, బ్రాహ్మణతర్ల, రెడ్డిపాలెం, నాయుడుపేట.)

జొన్నపాడు, వరికుంట, నేలమామిడి చెలక, తాడికొండ, నెమలికల్లు, తోటకూరపాడు, రావిరేల, మర్రిబంధం, వేములదిన్నె, తుమ్మల పెంట, మద్దిపట్ల, రేణి గుంట, జమ్ములమడక, అవురుపూడి, కొడవటికల్లు, కలిగిరి, కడవ కుదురు, చింతమోటు, వెదుళ్ళచెరువు, ఈతముక్కల, గొట్టిపాడు, మెంతిదిబ్బ, పెసర్లంక, చాగర్లమూడి, సామర్లకోట, కందిమళ్ళ, బెండపూడి, వెణుతురుమిల్లి మొదలైన గ్రామనామాలలోని పూర్వ పదాలన్నీ వృక్షజాతి సంబంధులు. ఆవులెన్న, గుఱ్ఱాలబయలు, ఎడ్లపాడు, తోడేళ్ళదిబ్బ, చీమలమర్రి, వింజమూరు మొదలైనవి జంతువుల పేర్లను, పక్షుల పేర్లను, గడ్డిపేర్లను సూచిస్తాయి. ‘వింజ’ అనేది ఒక నీటిపక్షి దాని ఈకలతో చేసినది వింజామర. పులిగడ్డ, పులివెందుల, పులిప్రొద్దుటూరులలోని ‘పులి’ జంతువు కాదు. పులి అంటే అనాది బంజరు. బోరుపాలెం, కొండపల్లి, బండమీదపల్లి, లోయ, లాము, నరవ, ఎదురుమొండి, నంగేగడ్డ మొదలైనవి, అవి నెలకొన్న ప్రాంతపు భూస్థితిని వ్యక్తపరుస్తాయి. ‘బోరు’ శబ్దానికర్థం మధ్యలో ఎత్తుగా వుండి, ఇరువైపులకు వాలి వున్న భూస్థితిని సూచిస్తుంది. ‘మొండి’ భూమి ఆగిపోయిన చోటును సూచిస్తుంది. లాము అంటే కొండ అంచునగల ఆవాసం. నంగే శబ్దానికర్థం రేవు. అయినవోలు, అయినంపూడి లలో గల ‘అయిన’ శబ్దానికర్థం నదివంపు తిరిగేచోట అభిముఖంగా వున్న భూభాగం అని అర్థం.

కొన్ని ఊళ్ళ పేర్లు, రెండు మూడు చోట్ల కూడ వుంటాయి. ఇలాంటి సన్నివేశంలో మరికొన్ని విశేషణాలు చేర్చి వాటిని వివక్ష చేసిన వైనం కన్పిస్తుంది. ఇక కొన్ని దిక్కులను సూచించేవి. కాగా మరికొన్ని పరిమాణ, పౌర్వాపర్య సూచకాలు. ఉదా: తూర్పు లంకపల్లి, పడమటి ఆలేరు, ఎగువతడకర, దిగువమిట్ట, సౌత్‌ వల్లూరు, నార్త్‌ వల్లూరు, పెదమద్దాలి, కురుమద్దాలి, పాతకురు మద్దాలి కొత్త పెదమద్దాలి మొదలైనవి. శేరీగొల్వేపల్లి, జమీ గొల్వేపల్లి, శేరికల్వ పూడి, జమీకల్వపూడి, మొఖాసా కల్వపూడి మొదలైనవి రెవిన్యూ పదాలతో చేసిన వివక్ష. పండిత విల్లూరు, దొంగ తిమ్మాపురం, నీళ్ళులేని తిమ్మాపురం మొదలైనవి వాటి వాటి ఆధిక్యాన్ని అభావాన్ని సూచించేవి.

సంఘటనలతో వచ్చిన పేర్లు

రణస్థలం – అక్కడ జరిగిన యుద్ధం కారణంగా వచ్చింది. సంక్రాంతిపాడు – ఆ గ్రామాన్ని కట్టించి సంక్రాంతినాడు దానమివ్వడం కారణంగా వచ్చింది. వసంతవాడ – మార్గమధ్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రం కారణంగా వచ్చింది. పాయకరావు పేట – ఒకానొక సర్దార్‌కు నైజాం నవాబు ఫాయక్‌రావు అనే బిరుదు ఇవ్వడం కారణంగా, అతడు నివాసమున్న చోటుకు ఆ పేరు స్థిరపడిరది. సర్వసిద్ధి – తెలుగు చాళుక్యులలోని ఒకరికి బిరుదు. అతడిమీద గౌరవంతో విశాఖజిల్లాలోని సర్వసిద్ధి గ్రామం ఏర్పడింది.

సోమవారపు పేట, బేస్తవారపు పేటలు ఆయా రోజుల్లో అక్కడ సంత జరగడం కారణంగా వచ్చాయి. బంటుమిల్లి, భట్టి ప్రోలులు సైనికుల పోషణకు గాను ఏర్పాటు చేయబడిన గ్రామాలు. జోడి ధర్మాపురం ఆ గ్రామంపై ‘జోడి’ అనే పన్నును విధించడం కారణంగా, మరొక ధర్మాపురం నుండి దీనిని వివక్ష చేయడానికి గాను స్థిరపడింది. కప్తానుపాలెం నిజానికి కేప్టెన్‌ పాలెం. పోర్చుగీసులు ధాన్యం కొనుగోలుకు ఏర్పాటు చేసికొన్న నెలవు. హంపి పంపానది కారణంగా వచ్చింది. విజయ నగరం చరిత్ర తెలిసిందే. వళందపాలెం డచ్చివారి రాజధాని హాలెండు శబ్దం నుంచి వారి మకాముకు పేరుగా నెలకొన్నది. ఫ్రెంచివారి నెలవు పరాసుపేట. ఫరంగుల (విదేశీయులు) ఆవాసం ఫిరంగి పురం. (Foreign అనే ఆంగ్లపదం తెలుగు లిప్యంతరీకరణంలో ఫరంగి అయి, వ్యవహారంలో ఫిరంగి అయింది.)

ఇలా ఊళ్ళ పేర్లలో అనేక విశేషాలు నిక్షిప్తమై ఉన్నాయి. వాటిని శాస్త్రీయపద్ధతిలో అధ్యయనం చేయడం వల్ల చరిత్ర, చారిత్రక భూగోళం, ఒకప్పటి నైసర్గికస్థితి, జనుల ఆచార వ్యవహారాలు, వారు పండించిన పంటలు, వారు సాకిన జంతుజాలం — ఈ విధంగా మానవేతిహాసానికి సంబంధించిన అన్ని అంశాలను సమంగా అర్థం చేసికోవడానికి ఉపకరిస్తుంది. గ్రామనామాలు భాషా సంకేతాల రూపంలో ఉన్న శిలాజాలు. అవి కదిలిపోయిన కాలపు గుర్తులు.

మన ఇంటి పేర్లు

ప్రతి వ్యక్తికీ పేరుంది. ఇంటి పేరూ వుంది. ఈ ఇంటిపేరు నిజానికి కుటుంబనామం. కొందరు తాము నిర్మించుకున్న నివాస భవనాలకు పేర్లు పెట్టుకుంటారు. నిజానికవే ఇంటిపేర్లు. అయితే ఈ భావన ఇటీవల ప్రాచుర్యంలోనికి వచ్చింది. వెనుకటి శతాబ్దాల్లో రాజభవనాలకు పేర్లున్నట్టు దాఖలా వుంది. సాధారణ భావనలో కుటుంబ నామమే ఇంటిపేరుగా వ్యవహరింప బడుతోంది. కారణం కుటుంబానికి ఆశ్రయమిచ్చేది ఇల్లు గనుక, కుటుంబ నామం ఇంటి పేరుగా చెలామణిలోనికి వచ్చింది. ఇలాంటి వ్యవహారం, దీని విషయంలోనే కాదు మరోచోట కూడ కన్పిస్తుంది. ఇలువరుస అనే వ్యవహారముంది. అక్కడ కూడ ఇండ్ల వరుస అని కాక కుటుంబ చరిత్ర అనే అర్థాన్నే ఇస్తోంది.

ఇక ఈ ఇంటిపేర్లు ఏదో ఒక పద్ధతిలో ప్రపంచమంతటా వున్నాయి. ఇలా చెప్పడానికి కారణం, మన ఇంటి పేర్లు, వ్యక్తి నామానికి ముందుండగా, ఇతర భాషా సమాజాల్లో వెనుక వున్నాయి. దేనినయినా సమంగా గుర్తించేటందుకు పేరు అవసరముంటుంది. అది మనిషైనా, జంతువైనా, వస్తువైనా, స్థలమైనా అంతే. అయితే సమాజం లోని వ్యక్తులకు, వారు నివసించే స్థలాలకు మాత్రమే అన్నింటికి పేర్లుంటాయి. మిగతా వాటికి జాతి గతమైన పేర్లు తప్ప, ప్రతి దానికి పేరుండదు. పిల్లులలో ప్రతి పిల్లికీ పేరుండదు. అలాగే ప్రతి వేపచెట్టుకు పేరుండదు. ఇక వ్యక్తులందరికీ పేర్లున్నా, ఒకే విధమైన పేర్లు చాలా మంది వ్యక్తులకుంటాయి. దీని వలన సమమైన గుర్తింపుకు విఘాత మేర్పడుతుంది. దానిని అధిగమించే ప్రయత్నంలో భాగంగా ఇంటి పేర్లు అవసరమైనాయి. అయితే కొన్ని సందర్భాలలో అప్పుడు కూడ ఇబ్బంది ఎదురవుతుంది. అప్పుడు తండ్రి పేరు లేదా వారు చేసే వృత్తి పేరు లేదా వారి శరీర వర్ణం. ఇలా ఆయా వ్యక్తులలోని ఏదో ఒక ప్రత్యేకతను బట్టి ఇచ్చే శబ్దంతో ఆ ఇబ్బందిని పరిహరిస్తాము.

ఇలా ఏర్పడ్డ ఇంటిపేర్లు, ఒక భాషా సమాజపు అంటే ఒక జాతి జీవనానికి ప్రతీకలుగా భాసిస్తాయి. అంటే సమాజపు అన్ని ముఖాలు అందులో దర్శనమిస్తాయి. కాలగతిలో జన జీవనంలో అనేక మార్పులు వస్తాయి. జీవవశైలి మారిపోతూ వుంటుంది. ఆ మార్పు కనుగుణంగా దానిని సూచించే వ్యవ హారం సంఘ జీవనంలో చోటు చేసుకొంటుంది. దాని కనుగుణ మైన భాషా వ్యవహారమేర్పడుతుంది. అంటే క్రొత్త భావనలు, దాని కనుగుణమైన పదజాలం వ్యాప్తిలోనికి వస్తూ వుంటుంది. కాని మారనివి పేర్లు. అందువలన అవి పురా సమాజపు జీవ నానికి దర్పణంగా భాసిస్తాయి. అందులోను, ఒకనాటి సమా జాన్ని అర్థం చేసుకోవడానికి బాగా ఉపయోగపడేవి ఇంటిపేర్లంటే అతిశయోక్తి లేదు. వాని అధ్యయనం వలన చరిత్ర, సంస్కృతు లకు నేపథ్యాన్ని సవదరించే సమస్త అంశాలు బోధపడతాయి. ఒక భాషా సమాజపు సాంస్కృతిక చరిత్రను అధ్యయనం చేయ డంలో విస్మరింపరానిది గృహనామాధ్యయనం. దీనిని కొంత వివరంగా చూద్దాము.

మన ఇంటిపేర్లలో నూటికి తొంబదికి మించి ఊళ్ళపేర్లే చోటు చేసుకున్నాయి. అంటే ఆయా పేర్లు గల ఇంటిపేరులున్న కుటుంబాలు ప్రాయికంగా మొదలు ఆ గ్రామానికి చెందిన వారన్నమాట. అంటే ఇప్పుడున్న గ్రామానికి వారు ఆ గ్రామం నుంచి తరలి వచ్చారని తెలుస్తుంది. మరి అలా తరలి రావడానికి కారణాలను తరచి చూస్తే ఆ కారణాల నేపథ్యం తెలుస్తుంది. అవి యుద్ధాలు కావచ్చు, వర్షాభావం కావచ్చు, రాజకీయ కారణాలు కావచ్చు, భయంకరమైన వ్యాధులు కావచ్చు. ఏ కారణం లేకుండా వున్న ఊరును విడిచి పోవడానికి ఎవరూ ఇష్టపడరు. ఆ కారణాలను అన్వేషించుట వలన, ఆ నాడు సమాజంలో నెలకొన్న పరిస్థితులపై అవగాహన కల్గుతుంది. ఇక, మరికొన్ని కుటుంబాల ఇంటి పేర్లు, ప్రస్తుతం వారు ఏ గ్రామంలో వున్నారో, ఆ గ్రామ నామాలే అయి వుంటాయి. అంత మాత్రంచేత, అనాది నుండి వారు ఆ గ్రామవాసులేనని, అంటే ఆ గ్రామానికి వారే గడ్డ ఎత్తారని చెప్పడం సాధ్యంకాదు. ఎందుకంటే జనం వచ్చాకే, ఆ జనావాసానికి పేరు ఏర్పడుతుందనేది సాధారణ సూత్రం. అయితే కొన్ని ఇంటిపేర్లతో ఏర్పడ్డ గ్రామాలు లేకపోలేదు. వలేటివారి పాలెం, యార్లగడ్డవారి లంక లాంటివి వాటికి ఉదాహరణలు. అయితే ఇలాంటి గ్రామ నామాలు ఇంటిపేర్లు గావడం చాలా అరుదు. అయితే పై సన్నివేశాలకి — అంటే, ఇప్పుడున్న ఊరి పేరే ఇంటిపేరు గావడానికి కొన్ని కారణాలున్నాయి. సాధారణంగా ఇలాంటి సన్నివేశం, గ్రామాధిపతుల, పంచాణం వారి విషయంలో వుంటుంది. అంటే కరణాలు, వెట్టి, తలారి, మున్సిఫ్‌, కమ్మరి, వడ్రంగం, కంసాలి, పురోహితుల కుటుంబాల విషయంలో మాత్రమే ఇది సాధారణంగా కన్పిస్తుంది. ఇది ఊళ్ళ పేర్లు ఇంటి పేర్లయిన వాని విషయం.

కొందరి ఇంటిపేర్లు వ్యక్తి నామాలుగా వుంటాయి. భైరవభట్ల, అప్పాజోస్యుల, వీరమాciనేని, తమ్మిశెట్టి, గుండుబోయిన, తిమ్మావఝల మొదలైనవి ఇలాంటివి. ఇందులో భైరవ, అప్ప, వీరమాచ, తమ్మి, గుండు, తిమ్మ అనేవి ఆయా వ్యక్తుల పేర్లు. భట్ల, జోస్యుల, నేని, శెట్టి, బోయిన, వఝల అనేవి ఆయా వ్యక్తులు అనుసరించిన వృత్తులు. భట్టు అనేది బ్రాహ్మణుల్లో ఒక స్థాయిని సూచిస్తుంది. జోస్యుల, వారి జ్యోతిష్య పరిజ్ఞానానికి సంకేతం. నేని నాయక శబ్దభవం. శెట్టి వాణిజ్యపరమైనది. బోయడు అనేది దేవాలయానికి చెందిన ఒక వృత్తి. భక్తులు ఇచ్చిన పశువులను సాకి, ఇచ్చిన వారి అభీష్టం మేరకు, దేవాలయానికి నేయి అందించే వృత్తి ఇది. వఝల ఉపాధ్యాయ శబ్దానికి మారు రూపం. ఆ పేర్లు గల వ్యక్తులు ప్రసిద్ధులు గావడం వలన తరువాతి కాలంలో, వారి వారి సంతతికి, వారి పేర్లు ఇంటి పేర్లు అయినాయి.

ఇవిగాక కొన్ని వృత్తులు, సాధారణ నామాలు కూడ ఇంటి పేర్లుగా కన్పిస్తాయి. అవసరాల, సమయమంతుల, గడియారం, అయాచితుల, సోమయాజుల, భారతుల, రామాయణం, పంతులు, వ్యాకరణం, దిట్టకవి, సంగీతం, కప్పగంతుల, గుడి సేవ, అర్చకం, భండారు, జన్యావుల, సుంకరి, కిలారి, ఉపద్రష్ట, వాజపేయాజుల, అవధానుల, పచ్చిపులుసు, వరికూటి, జొన్న కూటి, ఆరిగె కూటి, భాగవతుల, శరణు, అగ్నిహోత్రం, అశ్వ ధాటి, నీరుకట్టి, దశబంధాలు, ఆరాధ్యుల, సూరి, బందా, వేదాంతం, పడితరం — ఇలా అనేక విధాలైన పేర్లు కన్పిస్తాయి. ఇందులో కొన్ని తేలికగా బోధపడతాయి. మరికొన్నింటికి వివరణలు అవసరం. అవసరాల అనేది, ప్రభువు కాలోచితమైన వ్యవహారాలను గుర్తుచేసేవారు. సమయమంతుల అలాంటిదే. గడియారం కాలమానాన్ని పరిగణించేవారిది. అయాచితుల, యజ్ఞం నిర్వహించేటపుడు, ఆహ్వానం లేకుండానే, యధాలాపంగా హాజరయ్యేవారు. సోమయాజుల, యజ్ఞం చేసి సోమ యాజి ఐన వారికి వచ్చినది. భారతుల, ఒక ఆధ్యాత్మికవ్యవస్థకు సంబంధించినది.

కప్పగంతుల వేదం చదివే తీరులోని ఒక విశేషం. జన్యావుల, పునరుత్పత్తి కొరకు పశువులను సాకేవారిది. కిలారి, ప్రభువు ఆలమందలపై అధికారులకు సంబంధించినది. ఉపద్రష్ట యజ్ఞ నిర్వహణ పర్యవేక్షకుడు. వాజపేయాజుల, తత్సంబంధమైన యజ్ఞం చేయింప సామర్థ్యం గలవారు. శరణు, శైవ మతానుయాయులలో ఒక అంతరువు. అశ్వధాటి కవిత్వం చెప్పడంలోని విశేషాన్ని సూచిస్తుంది. నీరు కట్టి, గ్రామంలోని చెరువునీటిని వంతుల ప్రకారం సరఫరా చేసే ఉద్యోగం. దశబంధం చెరువులను నిర్మించడంలో, మరమ్మత్తులు చేయడం లోని నిర్వహణకు పరిహారంగా చెల్లించవలసిన శిస్తులో పొందిన రాయితీ. బందా దేవాలయ నిర్వహణలో ఒక ఉద్యోగం. పడితరం, ఆలయంలో ప్రసాదాలను వినియోగించే పదార్ధాల వంతు. పై వివరణలను బట్టి ఒకనాటి మన సమాజపు తీరు తెన్నులెలాంటివో అర్థమవుతున్నాయి గదా!

అయితే మరి కొన్ని ఇంటిపేర్లు కొంత తబ్బిబ్బుకులోను చేస్తాయి. గాలి, మల్లెమాల, ఇందుకు ఉదాహరణలు. ఇక్కడ గాలి అంటే వాయువు కాదు. అదొక ప్రాంతనామం. ఆ ప్రాంతానికి ఆ పేరు, గాలి అనే చెట్ల వలన వచ్చింది. మల్లెమాల అంటే మల్లెపూలదండ కాదు. అది ఒక ఊరిపేరు. కొండదాపున గల అడవిలో నున్న పల్లెను మాల అంటారు. అలాంటి చోట వచ్చిన గ్రామాలు అర్తమాల, వికృత మాల, మల్లెమాల మొదలైనవి. అలాగే తేళ్ళ. ఇది విష జంతువుకు సంకేతం కాదు. త్యాడ అనే ఊరి పేరుపై బహువచనం తేళ్ళ. ఇలా ఇంటిపేర్లలో చాల వైవిధ్యముంది. అన్నీ తెలుసుకోదగ్గవే.