ఇంటి మొగుడు

విజయవాడలో బంధువుల ఇంట్లో పెళ్ళికి వెళ్ళి, రాత్రి 10:27కి వధూవరుల నెత్తిమీద అక్షింతలు చల్లి, మా కుటుంబ ప్రతినిధిగా పెళ్ళి వీడియో లోనూ, ఫొటోల లోనూ సందు చూసుకొని పడి, పెళ్ళి వారితో కలిసి భోజనం చేసి, ఇంకో రెండు మూడు గంటలు అక్కడే గడిపి, తెల్లవారు జామున నాలుగు గంటలకి వాళ్ళు పెళ్ళి మండపం ఖాళీ చేస్తుంటే, ఇక అక్కడే ఉండలేక, ఇంక చేసేదేమీ లేక ఆరుగంటలకి హైదరాబాద్ బయల్దేరే శాతవాహన ఎక్స్‌ప్రెస్ ఎక్కడానికి నాలుగు గంటలకే స్టేషనుకి రావాల్సి వచ్చింది.

వెయిటింగ్ రూమ్‌లో నాలాంటి హోమ్‌లెస్ పీపుల్ చాలామందే ఉండడం వల్ల ఫ్యాన్ కింద చోటు దొరకలేదు. చోటు దొరికిన చోట గాలి తగలలేదు. వేసవి కాలం, విజయవాడ కావడం వల్ల ఓ పదిహేను నిముషాలలో బనియన్ తడిసింది. ఇంకో పదిహేను నిముషాలలో చొక్కా ప్యాంటు కూడా యధాశక్తి తడిసి బనియన్‌తో సంఘీభావం ప్రకటించాయి. దుస్తులతో కుమ్మక్కయి నా శరీరం చేసిన తిరుగుబాటుని సహించలేక ఆ తడిసిన దుస్తులు తీసి నేను బాగ్ లోంచి ఓ తెల్ల ఖద్దరు చొక్కా, గ్లాస్కో లుంగీ తీసి కట్టుకున్నాను. వీటిని కూడా తడపడం ఇష్టం లేక ప్లాట్ఫారం మీదకు వచ్చాను. వచ్చేముందు పర్స్ లోంచి సుమారుగా ఓ అరవై రూపాయలు, కొంత చిల్లర, టికెట్ తీసి జేబులో పెట్టుకున్నాను.

ప్లాట్ఫారం మీద ఓ చివర దాకా నడిచి అక్కడ ఓ కప్పు టీ తాగి ఈ చివర దాకా నడిచాను. అక్కడ తెల్లగా మెరిసిపోతున్న ఇడ్లీలను చూసి ఒక ప్లేటు మింగాను. పాపం రెండు ఇడ్లీలు కడుపులో ఒంటరిగా ఉంటాయని భావించి వాటికి తోడు కోసమని ఓ ప్లేటు వడ కూడా లోపలికి పంపించాను. కాఫీ వేడిగా ఉందండీ అని ఆ కొట్టువాడు సరదా పడితే వాడి ముచ్చట కూడా తీర్చాను. అప్పటికి ఈ చొక్కా కూడా సగం పైన తడిసింది. ఇంతట్లో, హైదరాబాద్ వెళ్ళు శాతవాహన ఇంకొద్ది నిముషాలలో బయల్దేరును అన్న ప్రకటన నా చెవిన బడి, నేను నా సీటు వెతికి అందులో కూలబడేటప్పటికి బయల్దేరుటకు సిద్ధముగా ఉంది అనే ప్రకటన వినిపించింది. నిజంగానే కొద్ది నిముషాలలో బండి బయల్దేరింది.

బండి వేగం అందుకొని కిటికీ లోంచి ధారాళంగా గాలి వీస్తోంటే, చెమటకు తడిసిన చొక్కా ఆరుతుంటే అలౌకికానందం అనుభవించాను. కాసేపటికి ఆ ఆనందం లోంచి బయటపడి చుట్టూ చూశాను. నా పక్కాయన చేతిలో పేపర్ పట్టుకొని ఎదురుగా కూర్చున్న భార్యతో మాట్లాడుతున్నాడు. నేను, “తెలుగు పేపరా మాష్టారూ?” అంటూ ఆయన చేతిలో పేపరు లాక్కొని బార్లా తెరిచాను. ఆయన నాకేసి గుర్రుగా చూశాడు. నేనేమి పట్టించుకోకుండా పేపర్ చదవడంలో పూర్తిగా నిమగ్నమయిపోయాను. పూర్తిగా చదవడానికి ఓ గంటన్నర పట్టింది. మధ్యలో పాపం టి.సి. వచ్చి నా టికెట్ మీద ఓ పిచ్చి గీత గీసి తనో వెఱ్ఱి నవ్వు నవ్వి వెళ్ళిపోయాడు. చదివిన పేపర్ తిరిగి పక్కాయన కిచ్చేశాను.

“ఇంగ్లీష్ పేపర్ కూడా ఉంది చదువుతారా?” అన్నాడు ఆయన వ్యంగ్యంగా.

“అబ్బే, నాకు ఇంగ్లీష్ రాదండి!”

“ఇంగ్లీష్ రాదా!!” ఆశ్చర్యపడ్డాడు ఈ పక్కాయన.

“అబ్బే, అసలు రాదండి.”

“తెలుగు మీడియమా?” సందేహం వెలిబుచ్చాడు.

“అబ్బే! మీడియాల దాకా రాకుండానే ఏడవ క్లాసులోనే చదువు ఆగిపోయిందండి.”

“అలా ఎల్లాగ జరిగిందీ!” ఆశ్చర్యపడింది ఎదురుగా కూర్చున్న పక్కాయన భార్య.

“చిన్నప్పటి నుంచి కూడా నాకు చదువు మీద అసలు శ్రద్ధ లేదండి. పధ్నాలుగో ఏట రెండవ మాటు ఏడవ తరగతిలో నాకు వచ్చిన మార్కులు చూసి మా నాన్న ఆశ్చర్యపడి పోయాడండి. నాకు చదువు అబ్బదని తెలుసుకున్నాడండి. నన్ను పోయి మా శేషుగాడి షాపులో పని నేర్చుకోమన్నాడండి. శేషుగాడంటే వరసకి మా పెదనాన్న గారబ్బాయండి. వాడికో బైక్ క్లినిక్ ఉందండి. అక్కడికి తీసుకెళ్ళి వాడికి నన్నప్పచెప్పేసేడండి. అక్కడ నాల్గైదు రోజులు వాళ్ళకి టీలు తెచ్చిపెట్టడం నేర్పేరండి. ఆ తరువాత ఆ పనితో బాటు నట్లు ఊడతీయడం, స్క్రూలు బిగించడం చేయించారండి. ఆర్నెల్లు గడిచినా క్లచ్చి, ఏక్సిలరేటర్ వైరులు మార్చడం తప్ప మరోటి నేర్పలేదండి. ఆర్నెల్లు అయినా రోజుకి రెండు టీలు అప్పుడప్పుడు ఓ సమోసా తప్ప మరేమి దొరకలేదండి. విసుగొచ్చి నేను వెళ్ళడం మానేసేనండి. రెండు రోజుల తరువాత మా నాన్నకి తెలిసిందండి. అప్పుడు నాకూ, మా నాన్నకి ఘోర యుద్ధం జరిగిందండి. నాలుగు వెదురు బద్దలు నా వీపు మీద విరిగినా, మా నాన్న రెండు సంస్కృత గ్రంధాలు ఆశువుగా చదివినా నేను ఓటమి ఒప్పుకోలేదండి. మా నాన్నకి విసుగొచ్చి, ఎక్కడో ఓ చోట నాకు నచ్చిన పని నేర్చుకోమన్నాడండి.”

“ఏం నేర్చుకున్నావేమిటి నువ్వు,” ఏకవచనం లోకి వచ్చేశాడు పక్కాయన.

“మా పక్క వీధిలో ఓ కేటరర్ ఉన్నాడండి. అక్కడ మా ఫ్రెండొకడు పని చేస్తున్నాడండి. వాడి దగ్గరకు వెళ్ళానండి. వాడు అక్కడ కూరగాయలు అవీ తరుగుతున్నాడండి. కూరగాయలు తరగడం ఒక కళ అని చెప్పేడండి. వంకాయను నిలువునా చీరేయాలి, బెండకాయను అడ్డంగా నరికేయాలి, కందని నిలువుగానూ అడ్డంగాను కూడా ఖండ ఖండాలుగా ఖండించాలి, బంగాళాదుంపల తోలు తీయాలి, పచ్చిమిరపకాయల పీకలు కోయాలి, ఉల్లిపాయల బట్టలు ఊడదీయాలి, అంటూ వాడు నేర్చుకున్న కళను గురించి ఉపన్యాసం ఇచ్చాడండి. నా సమస్య చెప్పేనండి. వాడు నన్నక్కడ చేరమన్నాడండి. మొదట గిన్నెలు అవీ కడగాలిటండి. ఆ తరువాత కూరగాయలు కోసే పని ఇస్తారుటండి. ఆ తరువాత వంట చెయ్యడం నేర్పుతారుటండి. భోజనం బాగా పెడతారుటండి. అప్పుడప్పుడు మిగిలి పోయిన పదార్ధాలు ఇంటికి కూడా తీసుకెళ్ళవచ్చునని కూడా చెప్పాడండి. ఎక్కడికైనా వంటలు సప్లై చేసినప్పుడు వడ్డన అది చేయాలిటండి. అందుకు రోజుకి ముప్ఫై రూపాయలు ఇస్తారుటండి. నేను అక్కడే చేరిపోయానండి. ఓ ఆరు నెలల తరువాత నెలకి ఐదారు వందలు సంపాదించే వాడినండి. అక్కడ ఓ ఆరు ఏళ్ళు పనిచేశానండి. తెలుగు వంటలు అన్ని రకాలు చేయడం నేర్చుకున్నానండి. అప్పటికి నాకు నెలకి మూడు నాలుగు వేల దాకా వచ్చేదండి.”

“ఇప్పుడు ఆ కేటరర్ దగ్గరే పనిచేస్తున్నావా,” మధ్యలో పక్కాయన భార్య ముందుకు వంగి అడిగింది.

“లేదండి. ఆరేళ్ళు అక్కడ పనిచేసిన తరువాత ఓ టిఫిన్ సెంటర్ ఆయన నెలకి ఆరు వేలిస్తాను తన దగ్గర పనిచెయ్యమన్నాడండి. ఆరు వేలకి ఆశపడి అక్కడ కెళ్ళిపోయానండి. అక్కడ అసలు తీరిక ఉండేది కాదండి. పొద్దున్న ఐదింటికి మొదలయిన పని రాత్రి పది గంటల దాకా ఉండేదండి. మూడేళ్ళయ్యేటప్పటికి ఆరోగ్యం దెబ్బ తిందండి. అక్కడ పని మానేశానండి. కొంతకాలం ఇడ్లీ బజ్జీ బండి పెట్టుకున్నానండి ఇంకో నేస్తంతో కలిసి. బాగానే వచ్చేదండి నెలకి ఐదారు వేలు. రెండేళ్ళయేటప్పటికి వాడితో తగాదాలు వచ్చి పదిహేను వేలు తీసుకొని అది వాడికి వదిలేయాల్సి వచ్చిందండి. ఆ తరువాత నాలుగేళ్ళు ఫ్రీలాన్స్ కుక్కవతారం ఎత్తేనండి.”

“ఫ్రీలాన్స్ కుక్కా!” ఆశ్చర్యపడ్డాడు పక్కాయన.

“కుక్కా కాదండి. కుక్! కుక్! అంటే వంటవాడని నా ఉద్దేశ్యం.”

“అదే ఫ్రీలాన్స్ కుక్ అంటే ఏమిటి అని?”

“పండగలకో, వ్రతాలకో, ఇంటికి పది మంది బంధువులు వస్తేనో, ఎవరింట్లోనైనా వంటవాడు అవసరమైతే వెళ్ళేవాడినండి. రోజుకి మూడు వందలు తీసుకునే వాడినండి. పదిమంది కన్నా ఎక్కువైతే ఐదారు వందలు తీసుకునే వాడినండి. ఇరవై మంది కన్నా ఎక్కువైతే వెయ్యి అడిగేవాడినండి. మామూలు రోజుల్లో నెలకి పదిహేను ఇరవై రోజులు పని ఉండేదండి. ఖాళీ రోజుల్లో ఓ స్వీట్ షాపులో పని చేసేవాడినండి. పెళ్ళిళ్ళ సీజన్ లోనూ, కార్తీక మాసం లోనూ నెలంతా పని ఉండేదండి. సంపాదన బాగానే ఉండేది కానీ గౌరవం లేదండి. కొంతమంది ఫరవాలేదు కానీ కొందరు మరీ తక్కువ చేసి మాట్లాడేవారండి. కొందరయితే గిన్నెలు అవీ నేనే కడగాలనే వారండి. విసుగొచ్చేదండి. కొన్ని మాట్లు అవమానం అనిపించేదండి. ఏది ఏమైనా యదేచ్ఛా వంటవాడిగా ఉన్నప్పుడు శాస్త్రీయంగా వంట చేయడం అలవాటు చేసుకున్నానండి.”

“మళ్ళీ ఇదేంటోయ్ కొత్తపదం, యదేచ్ఛా వంటవాడు!”

“మీరు కుక్కా అంటుంటే ఫ్రీలాన్స్ కుక్‌ని తెలుగులోకి నాకు వచ్చినట్టు తర్జుమా చేశానండి.”

“ఎట్లా! సరే, శాస్త్రీయ వంట అంటే ఏమిటో?

“ఇంటికో రుచి ఉంటుందండి. జిహ్వకో రుచి అంటారు కదండీ. సాధారణంగా తద్దినాలు, వ్రతాలు, పూజా పునస్కారాలకి ఎక్కువుగా నన్ను పిలిచేవారండి. వీటికి మడిగా చెయ్యాలండి. తద్దినాలకైతే నాలుగు కూరలు, నాలుగు పచ్చళ్ళు. మిగతా పదార్ధాలకి కూడా ఇంటికో పద్ధతి ఉంటుందండి. సాధారణంగా కేటరర్ ఎక్కడకి సప్లై చేసినా ఒకటే రుచి ఉంటుందండి. ఆ రుచి కూడా ఎక్కువుగా వాడే మసాలాల రుచే ఉంటుందండి. కొంతమంది చాదస్తుల ఇళ్ళలో తద్దినాలకి, వ్రతాలకి మసాలాలు ఉపయోగించ కూడదండి. తద్దినాలలో భోక్తలు తినేదాకా రుచి కూడా చూడకూడదండి. అలాగే వ్రతాలలో కూడా మహా నివేదన చేసేదాకా రుచి చూడకూడదండి. రుచి కూడా చూడకుండా వంట చేసి మెప్పించడం చాలా కష్టం కదండీ. ఉప్పు, కారం, చింతపండు రసం, కొన్నిటిలో అల్లం, ఇంగువ అవసరమైతే నిమ్మ రసం వీటికి తోడుగా పోపు సామాను మాత్రమే ఉపయోగించి రుచికరంగా చెయ్యాలండి. కంద ఎంత బచ్చలి ఎంత, ఎటువంటి కందకు ఏ బచ్చలి అన్నవి కూడా చాలా ముఖ్యం అండి. ఇవన్నీ నేను ఓ బామ్మగారి వద్ద నాలుగు నెలలు, మరో అమ్మమ్మ గారి వద్ద మరో రెండు నెలలు శిష్యరికం చేసి నేర్చుకున్నానండి.”

“అదేం, మీ అమ్మగారి వద్ద నేర్చుకోలేక పోయావా?”