మొద్దుబారిన బతుకు

మాట్లాడని మౌనమునుల్లా
రెండు మామిడిచెట్లు
ఇంకా మిగిలే ఉన్నయి

నగరం తరుముకొస్తన్నా
పారిపోలేని చెట్లు
ఒంటి కాలిమీద
దీనంగ నిలబడే ఉన్నయి

దర్వాజకు తోరణాలిచ్చి
జిహ్వకు జీవరుచులిచ్చి
ఇండ్లు నిలిపిన తోట
ఇపుడక్కర్లేదు

పారవశ్యం ప్లాట్లుగా ఉబుకుతున్నది
తెల్లటి పొడుగాటి తలపులు
తెల్లవారురఝామును ఊరిస్తున్నయి
నోట్ల రెపరెపల మధ్య
ఆకుల గలగలలు
ఎవరికి ముద్దు?

మనిషి ధర్మం మారినా
చెట్లు ధర్మం మారదు
మామిడిపూత బంగారమే కావొచ్చు
చేతివేళ్ళ బంగారి ఉంగరాల వలె మెరవగలదా?
చేను చెలకా నేలంతా
ఆకుపచ్చ పులకింత
ఇప్పుడు భూమి
అద్దిన రంగులుగా ధగధగమంటున్నది
కొత్త ఆహార్యంతో
ప్రకృతి ఉరుకులాడుతున్నది
పికమూ పైకమూ ఒకటి కాదు

పాతకాలం తోటమాలి జ్ఞాపకంలోంచి
ఒక ఎండుటాకు రాలిపడింది
ఊహలు తెంపిన గయికట్టె ఒకమూల
బరువులు నింపిన చిక్కం ఒకమూల
బావురుమనలేక
బతుకు మొద్దుబారుతది

మృగాలకు తావులేదు
మూగజీవాలకు తావులేదు
ఒక తోటంటే
ఎన్ని బతుకులు
తోటకు కాపలా ఉన్న
బతుక్కేది కాపలా
కోయిల కూడా పాడలేని పాట
తోటమాలిని తొలుస్తున్నది
ముసలితాత ఉత్త చేతులవలె
రెండు మామిడి చెట్లు
మిగిలే ఉన్నయి
కనుకొలకుల మీద జారి
ఆగిపోయిన కన్నీటి బొట్ల వలె
రెండు మామిడిచెట్లు
నిస్తేజంగా
నిలబడే ఉన్నయి