నాకు తోడు
ఊరినుంచి
గుప్పెడు మట్టి
దిగంత యానానికి
నేనే ఒక మొక్కనై
శాఖోపశాఖలై
విస్తరించి
ఛాయామృతమై
బిందు స్పర్శలో
సముద్రాల చప్పుడు
చరాచరాల సవ్వడి
గాలి వీస్తుంది
స్తంభిస్తుంది
కకావికలు చేస్తుంది
ప్రాణం తీస్తుంది, పోస్తుంది
విరహాలు పోతుంది
విహారాలు చేస్తుంది
వియత్తలం మీదకి
తీసుకెళ్తుంది
నభోమండలం మీద
సప్తర్షుల కాంతి చర్చలు
విమానం రెక్కలమీద
మబ్బుల తడి
మాట్లాడకు
ప్రపంచం యోగనిద్రలో
మలిగింది
ఉత్తరదిక్కున
అరోరా బొరియాలిస్
మేల్కొంటోంది.