ప్రేమే జిహాద్

యుద్ధం చేయడమే
ఇష్టమైతే
నేను రోజూ చేసేదే యుద్ధం
ఆలస్యం దేనికి,
నన్ను ప్రేమించు

కూరగాయల కొనుగోలులో
బట్టల దుకాణం దగ్గర
పూలమ్మే ఆమెతో
సోంపాపిడి మనిషితో
యుద్ధం

గీసి గీసి బేరం
అయినా
పాపం వాళ్ళు
నాతో ప్రేమగానే ఉంటారు

అనంతానంత
సమ్మీలనంలో
దైనందిన
జీవనాన్వేషణలో

ఎవరు ఏ దేవుడికి
ముడుపుకట్టి వస్తారో
ఎవరు ఏ గ్రామదేవతకి
కోడిపుంజు బాకీ ఉంటారో
విషచషకం ఎవరి చేతిలో ఉందో
ఎప్పుడూ అడగలేదు

యుద్ధం ఎప్పుడూ
నా లాభమే కాదు
ప్రేమపంపకమే.

కొందరుంటారు
సంచుల్లో
విషప్పురుగుల్ని
పట్టుకు తిరుగుతూ ఉంటారు
చిన్న గాజు కుప్పె
సిరంజి, సూది అదనం

విషప్రదానం నినాదం
అసమ సమాజమే లక్ష్యం
ఏథెన్స్ మన వీధుల్లోనే
సిద్ధం అంటారు

అయినా ఇస్మాయిల్ అన్నాడు కదా
“మోహానికీ
మోహరానికీ
రవంతే తేడా.
బుద్ధిగా ప్రేమించుకోక
యుద్ధాలెందుకు చేస్తారో.”

అందుకే అంటాను

“ప్రేమే జిహాద్.”


ఇంద్రప్రసాద్

రచయిత ఇంద్రప్రసాద్ గురించి:

ఆవంత్స సోమసుందర్ అంతేవాసిగా సాహిత్యంతో ప్రారంభమయిన ఇంద్రప్రసాద్ గారి సాహిత్య ప్రయాణం ఇంకా కొనసాగుతూనే ఉంది. నడిచి వచ్చిన దారి (కవిత్వం 1993), కాలం సైకత తీరం (కవిత్వం 2023), మూడు పడవలు (కవిత్వం 2024) అనే సంకలనాలను ప్రచురించారు.

 ...