కొన్ని వందల సంవత్సరాలుగా పరాయిపాలనలో బ్రతికి స్వరాజ్యం సంపాదించుకొన్న భారతదేశంలో స్వాతంత్ర్యానంతరం వచ్చిన సాహిత్య రచనలలో సామాజికాభ్యుదయం అనే సాహిత్యాశయం పలు భాషలలో ప్రబలంగా కనిపిస్తుంది. నిజానికి సాహిత్యం ద్వారా నీతిని, ధర్మాన్ని బోధించే ఘనమైన సంప్రదాయం భారతీయతలో భాగం. మన ప్రాచీన లాక్షణికులు కూడా రసానందంతో పాటు లోకహితం, సదాచారోపదేశం కూడా కావ్యప్రయోజనాలని ఉగ్గడించారు. విశ్వశ్రేయం కావ్యం అని ఒకరంటే, కావ్యం ఎంత రసవంతమైనా, అది నీతి ధర్మాలను బోధించకపోతే, ఆ కావ్యాన్ని తిరస్కరించాలని మరొకరు తీర్మానించారు. ఆదికవిగా పేరెన్నికగన్న వాల్మీకి కూడా తన అవతారికలో అందరికీ ఆదర్శప్రాయుడైన నాయకుని కథను సమస్త జనులకు ఉపదేశంగా రాయాలనుకుని అటువంటి నాయకుడున్నాడా అని సందేహ పడతాడు. నన్నయభట్టు తాను ‘మహాభారత సంహితా రచన బంధురుండయ్యె జగద్ధితంబుగన్’ అన్నా, బమ్మెర పోతన ‘భాగవతంబు జగద్ధితంబుగన్’ రాస్తానని చెప్పుకొన్నా వారంతా జగత్తుకు హితం కోరి రచనలను చేయడానికి పూనుకొన్నవారే. ఇక స్వాతంత్ర్య పోరాటం జరుగుతున్న రోజుల్లో కూడా సమాజాన్ని ప్రభావితం చేయడానికి సాహిత్యాన్ని ఆయుధంగా వాడుకుంటూ అన్ని భాషలలోనూ ప్రతిభావంతమైన కవులు, రచయితలు రచనలు చేశారు. బెంగాల్‌లో బంకించంద్ర చటోపాధ్యాయ, ద్విజేంద్రలాల్ రాయ్, ముకుందదాస్‌లే, బిద్రోహి కవిగా పేరు పొందిన కాజీ నజ్‌రుల్ ఇస్లాం, జాతీయగీతం అందజేసిన రవీంద్రనాథ్ ఠాగోర్; మరాఠీలో బాలగంగాధర్ తిలక్, కేశవ్‌సుత్, చిప్లుంకర్ తదితరులు కూడా ఇటువంటి ప్రబోధాత్మక రచనలే చేశారు. నిజానికి ఇతర భారతీయ భాషలతో పోలిస్తే తెలుగులోనే స్వాతంత్ర్యసమర స్ఫూర్తితో వచ్చిన రచనలు తక్కువేనని చెప్పుకోవాలి. భాషాపరంగా, సాంస్కృతికంగా తెలుగుకు దగ్గరి భాషలైన తమిళ, కన్నడ భాషలలో కూడా సుబ్రహ్మణ్య భారతి, కువెంపు, డి. ఆర్. బెంద్రె మొదలైన వారంతా సామాజికాభ్యుదయాన్ని కోరి సమాజాన్ని ప్రభావితం చేసే రచనలే చేసారు. అయితే, ఈ రచయితలందరూ గొప్ప రచయితలు కావడానికి కారణం వారు ఎన్నుకొన్న వస్తువు మాత్రమే కాదు. వారంతా సమాజాన్ని ఎంత లోతుగా తరచి అర్థం చేసుకొన్నారో, అంతే లోతుగా భాషను, సాహిత్యాన్ని, సాహిత్యలక్షణాలను, సాహిత్య సృష్టికి అవసరమైన సాధానాలను అర్థం చేసుకొని, తాము ఎన్నుకొన్న సాహిత్య ప్రక్రియలో నైపుణ్యాన్ని సాధించారు. అంటే, వస్తువు మాత్రమే సాహిత్యనాణ్యతను నిర్ణయించదని, ఇతర కళలలాగే సాహిత్యవ్యాసంగానికీ ఎంతో పరిశ్రమ అవసరమని వీరందరూ గుర్తెరిగిన వారే. వామపక్షభావాలు బలంగా కనిపించే మలయాళ సాహితీకారులలో కూడా వారి ప్రాచీన సాహిత్యంపై, భాషపై, సమాజంపై లోతైన అవగాహన ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఈ విషయంలో ఈ తరం తెలుగు సైద్ధాంతిక రచయితలు మాత్రం, కేవలం రాజకీయ నినాదాలు రాస్తే సాహిత్యం అయిపోతుందని, సాహిత్యలక్షణాలను, భాషను క్షుణ్ణంగా ఆకలింపు చేసుకోవడానికి గానీ, రచనా కౌశలాన్ని మెరుగు పరుచుకోవడానికి ఏ రకమైన పరిశ్రమ అవసరం లేదని భావిస్తున్నట్టుగా కనిపిస్తుంది. భారతదేశానికి ఆవల, కుటుంబం, కట్టుబాట్లు, సామాజిక స్థితిగతులు, మతసాంప్రదాయ ధోరణులు, నమ్మకాలలో భారతీయులతో ఎంతో సామీప్య స్వరూపస్వభావాలూ కనిపించే లాటిన్ అమెరికన్ దేశాల సంస్కృతుల సాహిత్యాన్ని పరిశీలిస్తే కూడా ఇదే రకమైన వ్యత్యాసం కళ్ళకు స్పష్టంగా కడుతుంది. వారు వారి ప్రాచీన సాహిత్యాన్ని, ఆచార వ్యవహారాలని, పూర్వ సంస్కృతిని ప్రాచీనమని తిరస్కరించలేదు, సంప్రదాయమని నిరసించలేదు. ఆ అభూతప్రపంచాన్ని మరొక విభిన్న దృక్పథంగా దాని అస్తిత్వాన్ని గౌరవించారు. దానిని ఆలంబనగా చేసుకొని అద్వితీయమైన సాహిత్యాన్ని సృష్టించారు. సామ్యవాదులు, అభ్యుదయవాదులే అయిన ఆ రచయితలు మరి వారి సమాజాన్ని ఎలా అర్థం చేసుకున్నారు, ఆ పరిశీలనలను ఎంత ప్రభావవంతంగా తమ సాహిత్యంలో ప్రతిఫలింపచేశారు అన్నది తెలుసుకొని, నేర్చుకోవడం తెలుగు రచయితలకు కనీస కర్తవ్యం.
ఈ రచయిత నుంచే...
ఇటువంటివే…
ఏప్రిల్ 2025 సంచికలో ...
- అక్కమహాదేవి వచనాలు – 4
- అభగ్న గర్గరిక
- అస్తిత్వవాద సాహిత్యం: 2ఇ. దొస్తోయెవ్స్కీ
- ఎవరెస్ట్ బేస్ కాంప్ – 6
- ఏప్రిల్ 2025
- ఒక మధ్యాహ్నం పూట ఊళ్ళో
- ఒక స్వప్నం
- కంప్యూటర్ చిప్ కథ – 1: మసకబారిన ఎడిసన్ విద్యుద్దీపం
- కాలగర్భ
- కొన్ని సమయాలలో కొందరు మనుషులు
- కోయిలబాస
- తొలి …
- దుఃఖపు కోట
- పరావర్తనం
- ఫోన్ తమాషా
- మానసా పబ్లికేషన్స్ వారి నవలల పోటీ
- మౌనంబంతట మాటలాడె…
- యుగాంతమెప్పుడు
- యూట్యూబ్లో ఈమాట: మార్చ్ 2025
- లంకమల దారుల్లో – వలపటెద్దు కథల్లో
- వేక్సీన్ రాజకీయాలు
- వేలూరిగారితో ఒక సంభాషణ
- సిద్ధార్థ ముక్కుపుల్లలు — స్థానీయ సాంస్కృతిక అధివాస్తవ ప్రతీకలు
- సెక్యులరిజం ముసుగులో కమ్యూనలిజం