ఏప్రిల్ 2021

ప్రతీభాషా తనదైన కొన్ని మహాకావ్యాలను తయారుచేసుకుంటుంది. తరాలు మారినా తరగని సజీవచైతన్యాన్ని తమలో నింపుకుని, చదివిన ప్రతిసారీ నూత్నమైన అనుభవాన్ని మిగులుస్తాయవి. నిత్యనూతనమైన ఆ కావ్యాలే కాలక్రమేణా క్లాసిక్స్ అని పిలవబడి ఆ భాషాసంస్కృతులలో, ఆ జాతి సంపదలో భాగమవుతాయి. ఆయా సమాజాలు ఈ సాహిత్యకావ్యసంపదను ఎలా కాపాడుకుంటున్నాయో ఎలా చదువుతున్నాయో వాటిని ఎలా తరువాతి తరాలకు అందిస్తున్నాయో గమనిస్తే, ఆ సమాజపు సాహిత్యసంస్కారం తేటతెల్లమవుతుంది. తమ తమ భాషలలోని ప్రాచీన మహాకావ్యాలను తాము నిరంతరంగా భిన్న దృక్కోణాల నుండి అధ్యయనం చేయడమే గాక ఇతరభాషలలోకి కూడా అనువదించి వాటిని విశ్వవ్యాప్తంగా సజీవంగా నిలుపుకుంటున్న సమాజాలతో పోలిస్తే, ప్రస్తుత తెలుగు సాహిత్య సమాజపు అచేతనాస్థితి అర్థమవుతుంది. ప్రాచీన తెలుగు సాహిత్యం అన్న పేరు వినపడగానే కాలం చెల్లిన సంగతులేవో చెవిన పడుతున్నట్టు చూసేవారే మన చుట్టూ ఉన్నారిప్పుడు. మూఢభక్తి లాంటి భాషాభిమానమే తప్ప ప్రాచీన సాహిత్యం చదివి సమకాలీనులు తెలుసుకోదగినదీ, నేర్చుకోదగినదీ ఏమీ ఉండదన్న నమ్మకమే చాలామందిలో స్థిరపడిపోయి ఉంది. ప్రాచీనసాహిత్యాన్ని చదవడం భాషాభిమానాన్ని నిరూపించుకోవడానికో సమకాలీన సమాజపు పోకడలకు ఆకాలం ఎంత ఎడంగా ఉందో నిరూపించడానికో అయితే అంతకన్నా మూర్ఖత్వం ఇంకోటి ఉండబోదు. ఆవేశపూరితంగా, తాత్కాలికోద్వేగాన్ని మాత్రమే కలిగిస్తూ, ఆలోచనారహితమైన అభిప్రాయప్రకటనగా మిగిలిపోతున్న సమకాలీన సాహిత్యాన్ని గమనించే కొద్దీ, స్పష్టమైన ప్రణాళికతో చిరస్థాయిగా నిలబడగల రసానుభూతితో కళాత్మకంగా సాగే మహాకావ్యాల ప్రాధాన్యం అవగతమవుతుంది. వాటి వైపు వేసే ఒక్కో అడుగూ, మన ఆలోచనలు స్పష్టమయ్యేందుకు తగిన వ్యవధినిచ్చేంత సహనపూరితమైన పఠనానుభవం దొరకనుందన్న హామీనిస్తుంది. ఒక్కో అధ్యాయాన్ని, ఒక్కో అంకాన్ని, ఒక్కో వాక్యాన్నీ శ్రద్ధగా గమనించే కొద్దీ, కథాకథనపద్ధతులు గుణదోషాలతో సహా అర్థమవుతూ ఒక కళగా సాహిత్యాన్ని ఆనందించడాన్ని, విశ్లేషించడాన్ని నేర్పిస్తాయి. విస్తారమైన, సంపూర్ణమైన పఠనానుభవం అందించే మానసికోల్లాసం ఎలాగూ దక్కుతుంది. ఒక వాక్యమో, సన్నివేశమో ఇలాగే ఎందుకు రాశారన్నది గమనించే కొద్దీ, రాతలో కొత్త మెళకువలు తెలుస్తాయి. క్లాసిక్స్‌ని చదవడం దానికదే ఒక అభ్యాసము, మన అభిరుచిని పెంపొందించుకునే మార్గమూ కనుక సాహిత్యంలో పొల్లునూ గింజనూ విడదీసి చూడటం అబ్బుతుంది. అంటే, పాఠకులుగా, రచయితలుగా మన స్థాయిని, మన భాషాసాహిత్య స్థాయినీ కూడా ఒక మెట్టు పైకెక్కించే అభ్యాసమిది. ఇట్లాంటి అవకాశం, అభ్యాసం, పరిశ్రమ పూర్తిగా మృగ్యమై సాహిత్యం పట్ల కనీస అవగాహన లేని సాహిత్యకారులు చుట్టూ మర్రిమానుల్లా పాతుకుపోతున్నారు. ఇప్పటికైనా మహాకావ్యాలు చదవడమెందుకో మనం గుర్తించలేకపోతే, సమకాలీన తెలుగుసాహిత్యం ముందుతరాలకు క్లాసిక్స్ ఏవీ సృష్టించలేదన్నది కళ్ళకు కడుతున్న నిజం.