ఫిబ్రవరి 2025

Issue Index Image

డిసెంబరు జనవరి నెలల్లో తెలుగు రాష్ట్రాల్లో జరిగే పుస్తక ప్రదర్శనలు తెలుగు సాహిత్యలోకానికి అతి ముఖ్యమైన సందర్భాలుగా పరిణమిస్తున్నాయి. ఈ ప్రదర్శనలే లక్ష్యంగా పుస్తకాల చుట్టూ చర్చలు, పోటీలు, ఆవిష్కరణలు, అమ్మకాలు అక్టోబరు నుండి ఊపందుకుంటున్నాయి. వీటి తీరు ఎలా ఉందో సోషల్ మీడియా చూపెడుతూనే ఉంది. ఈ ఏడు స్పష్టంగా కనపడ్డ ఒక పోకడ – సమీక్షలను, విమర్శలను వెనకకు తోసి ముందుమాటలు, బ్లర్బ్‌లు పుస్తక ప్రచారంలో ముందుకు రావడం. కథలు, కవిత్వాలు, వ్యాసాలు – సాహిత్య ప్రక్రియ ఏదైనా వాటి నిండా ప్రచారమే లక్ష్యంగా రాయించుకున్న వెగటొచ్చే పొగడ్తల గుమ్మరింపు. ఆ లక్ష్యమూ వికటించి ప్రమాదకరంగా మారిన సంఘటనలూ ఇటీవల కొన్ని చోటు చేసుకున్నాయి. దీనివల్ల ప్రధానంగా కొన్ని సమస్యలు కనపడుతున్నాయి. ఒకటి, విమర్శకులు ఈ అనవసర పొగడ్తలతో వాళ్ళ మీది నమ్మకాన్ని, గౌరవాన్నీ పోగొట్టుకోవడం. రెండు, రచనలు అర్హతతో నిమిత్తం లేకుండా పొగడబడి, రచయితలకు వాళ్ళ రచన స్థాయి అర్థం కాకుండా పోవడం. మూడవది, అతి ముఖ్యమైనది, వీటివల్ల పాఠకులు మోసపోవడం. సాహిత్యం ఈ చిన్న చిన్న విషయాలుగా కనపడే చర్యలతో ఎంత కలుషితం అవుతోందన్నది వీటన్నిటికంటే పెద్ద చర్చ. సాహిత్యం సృజన, కానీ పుస్తకం వస్తువు కాబట్టి అమ్ముడుపోయేందుకు కొంత ప్రచారం తప్పనిసరి. కాని, రచయితలు తమ సాహిత్య స్థాయి, లేమి తెలుసుకోకుండా, తమ వ్యాసంగాన్ని మెరుగుపరుచుకోవడం పట్ల కనీస దృష్టి లేకుండా – తమను ఆకాశానికెత్తి, పాఠకులను పెడదోవ పెట్టించే బ్లర్బ్‌లు, ముందుమాటల కోసమే తాపత్రయపడటం మంచి ధోరణి కాదు. చేతిలో కొన్ని డబ్బులు, ప్రచురణకు అవసరమైన వనరులు, స్నేహాలు, ఆవిష్కరణకు కావలసిన హంగులు – ఈ అర్హతలతో మాత్రమే పుస్తకాలు వస్తూండడం చాలా నిరాశాజనకమైన వాస్తవం. కాస్త డబ్బుంటే చాలు, ఒక పుస్తకం ఒకరి పేరు మీద అచ్చోసుకొని బయటకు వస్తుంది. దానికదే గర్వపడాల్సిన విషయం కాదు. ఏ ప్రత్యేకతా లేని ఏ రాతలనైనా సాహిత్యమనే పేరు పెట్టి పుస్తక ప్రదర్శనల్లోకి తెస్తే, కాదనేందుకూ ఏమీ లేదు. అవి ఎంత అసంబద్ధంగా ఉన్నా, జవాబుదారీతనం లేని మనుషుల మధ్యలో అవలా గిరికీలు కొడతాయే తప్ప ఆగిపోవు. వీటన్నిటికీ ‘గుర్తింపు’ అనే సామాజిక అవసరమే మూలకారణం. కవి, రచయితలుగా పేరు తెచ్చుకోవాలన్న కోరిక, ఆ రకంగా ఏదో ఒక బృందంలో చేరిక, పరస్పర పొగడ్తలు – కనీసార్హతను ఆశించే ఇతర కళలు ఇందుకు ఈ స్థాయిలో ఆస్కారం ఇవ్వవు కాబట్టి, సాహిత్యం. అక్షరాలకు నోరుండదు. మాకిలా ఉండటం ఇష్టం లేదని అవి చెప్పలేవు. రచయితకు పుస్తక ప్రచురణ అభిలాష మాత్రమే కాకూడదు, అదొక బాధ్యత. రచనను నిరాపేక్షగా బేరీజు వేసుకోవలసిన బాధ్యత. ‘నాదైన అనుభూతి నాదిగాన’ అనుకునే ముందు, ఆ అనుభూతిని తనదైన త్రాసులోనైనా ఒక్కసారైనా తరచి చూసుకోవలసిన బాధ్యత. తన పుస్తకం పట్ల నిజాయితీతో కూడిన నలుగురి అభిప్రాయాలను ఏ అడ్డూ చెప్పకుండా స్వీకరించి నేర్చుకోవలసిన బాధ్యత. సమాజంలో ఏదో ఒకరకంగా గుర్తింపు మాత్రమే ఆశించే రచయితలు స్తుతివాక్యాలు కాక విమర్శ ఎలా తీసుకోగలరు? సాహిత్య నాణ్యతతో మాత్రమే తమ పుస్తకాన్ని ఎలా అమ్ముకోగలరు? పాఠకులను మెప్పించగలరు? లేరు. ఈ సాహిత్యవంచనలో మోసపోకుండా ఉండాలంటే ఇప్పుడు పాఠకలోకానికి ఉన్నవి రెండే మార్గాలు: ఒకటి, కొత్త పుస్తకాలను కొనుక్కొనే ముందు, కవి రచయితలు కాని సాటి పాఠకుల నిజాయితీ సమీక్షలకోసం చూడటం. రెండు, ఒకవేళ కొంటే ఎవ్వరి అభిప్రాయాల మీదా ఆధారపడకుండా తమకు తామే పుస్తకం చదివేదాకా పుస్తకం పట్ల ఏ అంచనాలూ లేకుండా జాగ్రత్తపడటం.