కథ అంటే ఏమిటి? దాని లక్షణాలేమిటి? అన్న ప్రశ్నలకు ఇప్పటిదాకా ఏ సాహిత్య సమాజమూ స్పష్టమైన సమాధానమివ్వలేదు. రచయితలు, విమర్శకులు వారి భావాలు, వాదాలు, అభిప్రాయాలను బట్టి తమకు తోచినట్టుగా ఈ ప్రశ్నలకు స్థూలంగా, అస్పష్టంగా కవితాత్మకమైన వివరణలను ఇచ్చుకున్నారు తప్ప సరైన సమాధానాలను ఇవ్వలేకపోయారు. నిర్దిష్టత లేని వివరణలు కేవలం వర్ణనలే అవుతాయి తప్ప నిర్వచనాలు కాబోవు. వాటి ఆధారంగా సాహిత్యలక్షణ చర్చలు జరగలేవు, జరపకూడదు.
ఇది కథ ఎలా అయింది? అన్న ప్రశ్న లాగానే, ఇది కథ ఎందుకు కాదు? అన్న ప్రశ్న కూడా ఇప్పటిదాకా ఉన్న సాహిత్య వర్గీకరణలను, సంప్రదాయ ధోరణులను సవాలు చేస్తుంది. తమ మధ్య స్పష్టమైన విలక్షణతను చూపించగల కథ-కవిత-వ్యాసం వంటి ప్రక్రియలు కూడా కొన్నిసార్లు ఒకదానిలోకి ఒకటి కలిసిపోతుంటాయి. అందువల్ల సాహిత్యపు విశాలస్వభావాన్ని ఎవరూ పూర్తిగా అర్థం చేసుకొనడానికి ప్రయత్నిస్తున్నట్టు గాని, సాహిత్య ప్రక్రియలను కుంచించి వర్గీకరించే కొద్దీ వాటి మధ్య ఎల్లలు చెరిగిపోతుంటాయన్న స్పృహ రచయితలకు విమర్శకులకు కలుగుతున్నట్టు గాని, కనిపించడం లేదు. ఈ కారణానికే, ఒక రచనను ఏదో ఒక ప్రక్రియలోకి ఇమడ్చకుండా చూడలేని పరిమితి, తమకున్న నిర్వచనాల్లోకి ఒదగని రచనలను అస్పష్టమైన వివరణలతో కొత్త ప్రక్రియగా భావిస్తూ సాహిత్య లక్షణాలను పునర్నిర్వచిస్తున్నామన్న భ్రమ, తెలుగు సాహిత్య సమాజంలో ప్రస్ఫుటంగా కనపడుతున్నాయి. ఇతర భాషా సాహిత్యాలలో ఈ రకమైన సాహిత్య లక్షణాల గురించిన చర్చ, ఇటీవల దాదాపుగా కనుమరుగవుతోంది. ఆయా భాషల రచయితలు మునుపెన్నడూ లేని తీరున వాక్య, వస్తు పరమైనవే కాక సాంకేతికతనూ ప్రతిభావంతంగా వాడుకుంటూ సాహిత్య ప్రయోగాలు చేస్తున్నారు, కథాది సాహిత్య ప్రక్రియలకు ఉన్న సరిహద్దులు చెరిపివేస్తున్నారు. తమ రచనలను ప్రత్యేక ప్రక్రియలుగా కొందరు రచయితలు పేర్లు పెట్టుకుంటున్నా అవి కేవలం వారి- వాటి- గుర్తింపు కోసం చేస్తున్న ప్రయత్నాలుగానే మిగిలిపోతున్నాయి. అందువల్ల ఈ గురుతుచీటీలకు, పాఠకుడి పఠనానుభవాన్ని ప్రభావితం చెయ్యగల శక్తి ఉన్నదా, ఉంటే దాని పరిధి ఏమాత్రం అన్నవి, ఆలోచించవలసిన విషయాలు.
నిజానికి వర్గీకరణ అన్నది, రచన పట్ల ముందస్తు అంచనాలను, అభిప్రాయాలను ఏర్పరచుకోవడానికి, పాఠకుడి దృష్టిని రచనాంశానికి దూరంగా మళ్ళించడానికి మాత్రమే దోహదపడుతుంది తప్ప ఒక రచనను రచనగా స్వీకరించడానికి, ఆ రచనని లోతుగా ఆస్వాదించడానికి సాయపడదు. ఇలా ఉంటే కథ, ఇలా ఉంటే కాదు, ఇది ఇది, ఇది ఇంకొకటి అంటూ విభజనలు ఎక్కువయే కొద్దీ అవి ఒకటైపోతుంటాయి. అందువల్ల, నిర్వచించిన మరుక్షణం ఆ నిర్వచనానికి వెలుపలగా నిలబడే లక్షణం ఉన్న సాహిత్యానికి, ఈ రకమైన వర్గీకరణలు అవసరమా అన్నది ముఖ్యమైన ప్రశ్న. శోధనకు సంబంధించిన సౌలభ్యాన్ని పెంపొందించుకోవడానికి ఈ నామకరణాలు ఒక వెసులుబాటే తప్ప సాహిత్య అవసరం కాదన్నది, మా స్థిరమైన అభిప్రాయం. ఈ ఆలోచనలతో, ఈ సంచిక నుండి ఈమాటలో ఒక ప్రయోగం మొదలు పెడుతున్నాం. ముందు పేజీలోను, రచనల పేజీలోను, రచనల కేటగిరీల ప్రస్తావన తీసివేస్తున్నాం. తద్వారా పాఠకుల దృష్టి కేవలం రచన మీద మాత్రమే ఉంటుందని, రచన చెప్తున్నదేమిటో మాత్రమే చూడబోతారని, అలా సాహిత్యాన్ని ప్రక్రియల పావురాల గూళ్ళల్లో పెట్టే ధోరణి కొంతైనా పోతుందని మా నమ్మకం. ఈ ప్రయోగం ఎటువంటి ఫలితాలనివ్వబోతోందో, మనమంతా కలిసి గమనిద్దాం.