నాకు నచ్చిన పద్యం: ఒక కవి చూపించిన బ్రతుకు తెరువు

సీ.
ఒక కొన్ని జాజిపూవులకు కేలుసాచెడి వనము వోలినది జీవనము నాది
ఒక కొంత గానమ్మునకు వీను నిక్కించు నిసువు బోలినది మానసము నాది
ఒక చిన్ని వెల్గురేకకు నేత్రపుటినిచ్చు తమ్మివోలినది యంతరము నాది
ఒక కొద్ది తీపి మాటలకు ఉబ్బి తబ్బిబ్బులయిపోవు చిరుతప్రాయమ్ము నాది
తే.
నీవు నవ్విన నవ్వితి, నీవు కంట
నీరు వెట్టిన ఆ నీటి ధారలందు
కొట్టుకొనిపోతి లోకాల కొట్ట కొసకు
తిరిగి రానైతి దుఃఖసాగరము నుండి.

కవి బ్రతుకు ఒక సిద్ధదశ. శుద్ధమైన మనస్సుతో, రసానులీనతతో మాటలాడడమనే విద్య చేతికి చిక్కిన తరువాత కవ్యనుభూతి మునుపటిలా ఉండదు. ఆంతరకాంతి తెరలు తెరలుగా వెలికివస్తుండగా ఆ వెలుగులో ‘కాదేదీ కవితకనర్హ’మన్న చూపు సహజంగానే భావవిస్తృతిని ఆకళింపు చేసుకోగలుతుంది.

ఆ దృష్టితోనే కవి ప్రేమ గురించి మాట్లాడగలిగేది. ఆ దృష్టితోనే కవి దుఃఖపడేది. ఆ దృష్టితోనే కవి ఒక సమాజ సంస్కరణకోసం పరితపించేది. అటువంటి చూపు ఉన్న ఒక కవివతంసుడు ఒక విశ్వవ్యాప్తమైన స్త్రీమూర్తిని భావన చేసి, ఆమెతో తన మనస్సుకుమారతను చెబితే అది ప్రకృతంలో నేను మీకు పరిచయం చేద్దామనుకుంటున్న పద్యమంత సుందరంగా ఉంటుంది.

అజరామరమైన ఈ పద్యం సత్కవి దాశరథి కృష్ణమాచార్యులు వ్రాసిన అమృతాభిషేకము ఖండకావ్యంలో విస్మృతి పానపాత్ర అనే కవితలోది.

దాశరథి ఆధునిక కవితాయుగపు అవతీర్ణభారతి. నిజజీవితం కష్టాలకు పుట్టినిల్లై, జైలుగోడల మధ్య బిగించి పరీక్షపెడితే, అక్కడ మగ్గుతూ పళ్ళు తోముకోవడం కోసం ఇచ్చిన బొగ్గుతో జైలుగోడల మీద పద్యం వ్రాశారు. అంతే కాదు, అర్ధరాత్రి వేరే చోటుకు ఖైదీలని తీసుకుపోతున్నపుడు, మరుసటి రోజుని చూడకుండానే మరణించే అవకాశం ఉన్న ఆ సమయంలో భయపడకపోగా ఆ స్వేచ్ఛామారుతాన్ని చూసి ఆశువుగా పద్యాలు చెప్పారు. ఇటువంటి మనసున్న కవి ఆధునిక కవులలో వేరొకరు లేరు. ఎన్నో కష్టనష్టాలని మూటకట్టుకున్న జీవితం ఈయనది. కానీ జీవితంలో ఈ కవికి అనుభూతికి వచ్చిన ప్రతీ వస్తువూ ఈయనకు కవితని చెప్పటానికి ఒక ఉపకరణంగానే పరివర్తనం చెందింది. పేదల కష్టమో, నిజాం నిరంకుశత్వమో, జైలు శిక్షో, మరదలు చింతామణో, అర్ధరాత్రో, చల్లగాలో ఇంకోటో ఇంకోటో ఈయనకు జీవితంలో సంఘటనలుగా అయి, కవితలుగా రూపుకట్టాయి. ఈయన జీవితంలో జరిగిన కవితావతరణ ఆంధ్రభారతికి పట్టిన భాగధేయం.

ప్రభావవంతంగా కవిత్వం చెప్పిన ఈ కవి విప్లవకవి అన్న అత్యంత ప్రసిద్ధమైన ముద్ర వేయబుద్ధి కాదు నాకు. తెలంగాణా ప్రజల మనసులలో ఈయన పలుకులు యెంత బలంగా నాటుకున్నాయో నేను చెప్పవలసిన అవసరం లేదు కానీ, ఈయన కేవలం అటువంటి భావజాలానికి మాత్రమే వశుడైపోలేదు. అది ఈయనకి మాత్రమే సాధ్యపడిన ఒక అరుదైన అంశంగా నాకు తోస్తుంది. ‘నా గీతావళి ఎంత దూరము ప్రయాణంబౌనొ అందాక ఈ భూగోళంబునకగ్గి పెట్టెదను’ అని గర్జించిన ఈ కవి గొంతుకే ‘ప్రహాసమున సుమించె పొన్నలు పసందగు నందన దివ్యవాటిలో’ అంటూ తీపిని పంచిపెట్టింది. ‘ముసలి నక్కకు రాచరికంబు దక్కునే’ అని శాపనార్థాలు పెట్టిన ఈ కవిహృదయమే, ‘కులుకుం దామరకన్నె నెన్నొసటిపై గోరాడు గోరోచనాతిలకంబెంతటి కాంతి చిమ్మెడినొ’ అంటూ పులకింతలు పోయింది. రుద్రవీణను పలికించిన ఆయన కరాంగుళులే, గాలిబ్ గీతాలనూ వెదజల్లాయి.

దాశరథి కవితలలో నాకు నచ్చిన కవితను ఏరడం నాకు పెద్ద తలనొప్పి. కానీ పై పద్యం చదివిన నాటినుండీ నన్ను వెన్నాడుతూనే వస్తోంది. ముఖ్యంగా, మొదటి నాలుగు పాదాలు. విస్మృతపానపాత్ర ఖండికలో కవి ఒక మహాస్త్రీశక్తితో మాట్లాడుతాడు. ఆమె కవికి ఒక తల్లి, చెల్లి, వధువు, ఒక విశ్వమాత.

ఆమెతో తన మనసును వెల్లడి చేస్తూ ఇలా అంటున్నాడు. పద్యం సులభగ్రాహ్యమే. అయినా నిసర్గమధురం. ఈయన జీవితం ఒక కొన్ని జాజిపూవుల కోసం చేయి చాపేటువంటి వనం వంటిదట. కేలు అంటే చేయి. ఒక కొంత గానం కోసం చెవి నిక్కించేటువంటి పసిపాప మానసమట ఈయనది. ఇసువు అంటే పసిబిడ్డ.

ఒక చిన్ని వెలుగురేక కోసం కళ్ళనప్పగించే తామరపూవువంటిదట ఈయన అంతరంగం. తమ్మి అంటే పద్మం. కేవలం ఒక కాసిని తీపి మాటలకు ఉబ్బితబ్బిబ్బైపోయేటువంటి చిరుతప్రాయమట ఈయనది.

అటువంటి ప్రాకృతికమనస్కుడు విశ్వమాత దుఃఖపడుతోంటే తట్టుకోగలడా? అదే తేటగీతిలో అంటున్నాడు. ఆమె నవ్వితే ఈయనా నవ్వాడట. ఆమె కళ్ళనీళ్ళు పెట్టుకుని బాధపడితే ఆ నీళ్ళలో ఈయన కొట్టుకునిపోయాడట. ఆ దుఃఖసముద్రం నుండి తిరిగి రాలేకపోయాడట!

ఇది ప్రకృతి పట్లా, ఈ వసుంధర పట్లా ప్రతీమానవునికీ ఉండవలసిన ఆర్ద్రావలోకనం. ఒక మనిషి సాత్త్వికశక్తితో ఏ విధంగా మనస్సును తయారు చేసుకుంటే ఉన్నతుడౌతాడో ప్రతిపాదించిన ఈ పద్యం ప్రేమసాక్షాత్కారానికి బీజం. మానవాళి అవలంబించవలసిన బ్రతుకు తెరువు. ఒక కవి లిఖించిన ప్రాణశాసనం.