నాకు నచ్చిన పద్యం: మది కలతలు పోగొట్టే పుష్పాచయము

మర.
కొమ్మరొ తీగియకొననన గోయకు
మమ్మరొ తేనియలానుచు గ్రాయకు
మింతి చనుంగవ కెననన చెండులు
పంతంబునఁ దినవచ్చునె పండులు
పగఁగొనివా తెరపైఁ బడుఁగీరము
జిగి సాంకవరుచి చెక్కిట తోరము
దాడిమలతకుం దార్పుము ధూపము
బోడిమిఁ జిల్కకుఁ బోవును కోపము
మామిడిఁ గొట్టిన మఱినిడుఁ బువ్వులు
భామిని పొన్నకుఁ బథ్యము నవ్వులు
అడరెడుఁదుమ్మెదనని యిట భృంగము
పడునది నాసాప్రభగని భంగముఁ
గోయిలకంటం గొరలెడుఁ దొగరులు
మేయగఁజేయుము మిక్కిలి చిగురులు
మందానిలగతి మగువ వడంకెను
జందనగంధికిఁ జందనమింకెను
తిలకముఁజూడుము తెప్పున విరులిడు
వెలదికి మదనుఁడు వేవేమరులిడు
నంగన వెట్టిన యడుఁగులు ద్రొక్కకు
రంగగు తేనె యరంటులనెక్కకు
మకరందఝరిన్ మానిని దాఁటకు
ముకురానన విరిమొగ్గలు మాటకు
చేడియ మోదుగచెట్టెగఁ బ్రాకకు
జాడను జంకకు శారుల మూఁకకు
గోగును జూచితె కోరును ముచ్చట
దాగిలిమూఁతల దనరుదమిచ్చట
ననుచు వనంబున నలరులుఁ గోసిరి
ఘనవేణులు మదిఁ గలతలు వాసిరి.

కవితాసామ్రాజ్యంలో యథార్థమంటే కళ్ళకు కనిపించేది, కనిపించగలిగేదీ మాత్రమే కాదు. ఆహ్లాదభరితమైన రసానుభూతిని కలిగించగలిగే యోగ్యత ఉన్న ఊహ కూడా యథార్థమే. వాస్తవంపై ఆధారపడినదైనప్పటికీ కవిత్వానిది ఊహాప్రపంచమే. దీనిని అనుభూతిని కోరుకొనే హృదయధర్మంతో పరిశీలించాలి తప్ప, శాస్త్రీయభూమికలపై నిల్చుని కాదు. ఇటువంటి అశాస్త్రీయమైన ఉపమాది అలంకారాలను, కల్పనాసామగ్రిని పనిముట్లుగా పెట్టుకొని కవిత్వం సాధించేదేమిటి అని ఎవరైనా ప్రశ్న వేస్తే, ఒక వస్తువును వీటన్నింటినీ ఔచితీమంతంగా ఉపయోగించుకుంటూ వర్ణన చేయడం ద్వారా ఆవస్తువుపై గాఢతమంగా మనసును లగ్నం చేసే అవకాశాన్ని మనకు ఇవ్వడమే అని నాకు తోచే సమాధానం. ఆ వర్ణితవస్తువుతో మనం తన్మయత్వాన్ని పొందగలగాలి. ఈ ధ్యానం ద్వారా మన మనస్సుకు ఆ వస్తువుతో యోగసంబంధమైన ఒక సంయోగమేర్పడాలి. అపుడే అనుభూతి సిద్ధిస్తుంది.

అందుకే, కవితాభూమిక యోగభూమికకు క్రిందిసోపానమని, ఋషికాని వాడు కావ్యప్రపంచాన్ని సృజించలేడనీ ఇత్యాది మాటలు పుట్టుకొచ్చాయేమో అనిపిస్తుంది నాకు. ఈసారి నేను మీకు పరిచయం చేయాలనుకుంటున్న అనర్ఘమైన పద్యరత్నం ఈ విషయాన్నే రూఢిపరుస్తుంది. ఈ పద్యంలో వస్తువు పుష్పాచయము. ఆచయానికి ప్రోగుచేసుకోవడమని, కుప్పవేయడమనీ అర్థాలు. పుష్పాచయమంటే పూలు కోసి ప్రోగుచేసుకోవడమన్నమాట. పూలు కోయడం మనలో చాలామంది ప్రతిరోజూ చేస్తుంటారు. ఇటువంటి ఒక సామాన్యక్రియ కావ్యభూమికలోకి చేరితే ఎంత తీయని రసానుభూతినివ్వగలదో ఈ పద్యం చదివితే తెలుస్తుంది.

ఈ పద్యం శ్రీవైదర్భీపరిణయము అనే గొప్ప ప్రబంధంలోనిది. ఈ కావ్యకర్త పేరు మచ్చా వెంకటకవిరాయలు. 1856లో జన్మించి, పోలీసు శాఖలో పనిచేసిన ఈ కవివతంసుడు అనేకకావ్యనిర్మాత. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నివాసప్రాంతం. కుముద్వతీపరిణయము, శ్రీశుద్ధాంధ్రనిరోష్ఠ్యకుశచారిత్రము అనేవి ఈ కవి వ్రాసిన మరొక రెండు కృతులు. ఇవి కాక, వీరి ఇతరమైన రచనలేమైనా ఉన్నాయా అన్న వివరాలు తెలియలేదు. వీరి రచనలు, వ్యాసాలూ అముద్రితగ్రంథచింతామణి లోనూ, నెల్లూరు నుండి వెలువడిన ధీరంజని, బందరు నుండి వెలువడిన పురుషార్థప్రదాయిని, మద్రాసు నుండి వెలువడిన ఆంధ్రభాషాసంజీవని, రాజమండ్రి నుండి వెలువడిన వైజయంతి మొదలైన మాసపత్రికలలో ప్రచురింపబడ్డాయి. ఇవేవీ పుస్తకరూపంలోకి వచ్చినట్లు లేదు. ప్రస్తుతకావ్యమైన శ్రీవైదర్భీపరిణయము కూడా కవిగారి పుత్రులు, స్వయంగా కవి అయిన మచ్చా సూర్యారావుగారి చొరవతో పుస్తకరూపానికి నోచుకున్నది.

కవిగారి శైశవమంతా వారి తండ్రిగారి ఉద్యోగరీత్యా విదర్భప్రాంతంలో (మహారాష్ట్రలోని బీరార్) గడిచింది. అక్కడే రుక్మిణీదేవి కళ్యాణాన్ని కావ్యంగా వ్రాయాలన్న సంకల్పం వీరికి కలిగిందట.

ఈ కవి శైలి అతీవమధురము. కావ్యనిర్మాణచాతురిలో ఆరితేరినతనము ఈ కవి సొత్తు. పదాలను దుమికించడంలో బుద్ధికీ హృదయానికీ మైమరపు కలిగించే విధానం ఈయనకు అవగతరహస్యం. పై పద్యం ఈ కవి సంపాదించుకున్న కవితాసామాగ్రికి సాక్ష్యం.

శ్రీకృష్ణుని గుణగణాలను తెలుసుకొని, అర్పితహృదయయైన రుక్మిణి కృష్ణవిరహభాధలో మన్మథతప్తయై ఉన్నపుడు ఆమెను చెలికత్తెలు ఊరడించిన తరువాత, అందరూ వనానికి వెళ్ళి పూవులు కోసే సమయంలోనిదీ పద్యం. మధురాతిమధురమైన దేశిచ్ఛందస్సు మధురగతి రగడలో ఈ పద్యం అల్లబడ్డది. ఈ రగడ చతుర్మాత్రాబద్ధము. చతురస్రగతి. ఈ చతుర్మాత్రలు ప్రతీపాదానికీ నాలుగేసి. మొదటి గణం మొదటి అక్షరానికి, మూడవగణం మొదటి అక్షరానికీ యతినియమం.

అమ్మాయిలు ఉద్యానవనంలో పూలు కోస్తున్నారు. కోస్తూ అల్లరి చేస్తున్నారు. చేస్తూ సల్లాపాలాడుతున్నారు. ఒకామె వేరొకామెతో అంటున్నది కదా, తీగ చివరనున్న మొగ్గలు కోయవద్దే అని. కొన అంటే చివరిభాగం. నన అంటే మొగ్గ. పూతేనెలు ఆస్వాదించి పైకి ఉమియవద్దు అని. క్రాయడమంటే ఉమియమని ఒక అర్థం. లేదా, కంఠగతమైన వాటిని నోటిలోకి ధ్వనిపూర్వకంగా తెచ్చుకోవడమని ఇంకొక అర్థం. అదయినా ఇక్కడ సరిపోతుంది. ఇంకా వారిలా అనుకుంటున్నారు: చనుంగవకు పూచెండులతో పోలికట. ఎన అంటే పోలిక, సామాన్యమని అర్థము. ఒకరితో ఒకరు పోటీపడి, పళ్ళు తినవచ్చట.

పండిన పళ్ళని వీరు ఆరగిస్తే, పాపం అక్కడి చిలుకలకు ఏం మిగులుతుంది కనుక? అంచేత చిలుక వీరిపై పగబట్టి, వీరి అధరాలపై పడుతుందట, తిందామని. వాతెర అంటే అధరము. స్త్రీ క్రిందిపెదవిని దొండపండుతో పోల్చుతారు. వీరి పెదవులను దొండపళ్ళనుకొని, అవి మిగిలాయి కను వాటిని తినడానికి వస్తుందట చిలుక! వీరి చెక్కిళ్ళపై సాంకవరుచి అట. సాంకవమంటే జవ్వాది. చెక్కిలిపై జవ్వాదితైలాన్ని అలదుకొంటారు.

పద్యంలోని తరువాతి పాదం అర్థం కావడానికి కొంత ఉపోద్ఘాతం అవసరం.

కవిత్వంలో మాత్రమే ప్రామాణికతను పొందేటువంటి అశాస్త్రీయకల్పనలనేకం. ఉదాహరణకు కలువపూవుకు చంద్రుడు మిత్రుడని, సూర్యుడు శత్రువనీ అనడం దగ్గరినుండీ ఒక పర్వతానికి, ఒక నదికీ మధ్య ప్రణయాన్ని వర్ణించడం ఇత్యాదులు. కొన్ని కల్పనలు ప్రతీకాత్మకంగా కూడా వాడబడుతాయి. ఉదాహరణకు హంసకు పాలు నీళ్ళూ వేరుచేయగలిగే శక్తి ఉన్నదనడం; నెమలి అస్ఖలితసంసారి అనడం ఇత్యాదులు.

ఈ ఊహలకు కవిసమయాలు అని పేరు. వీటిని చక్కగా కావ్యమీమాంసాకారుడైన సంస్కృతమహాకవి రాజశేఖరుడు ఇలా నిర్వచించాడు: అశాస్త్రీయమలౌకికం చ పరంపరాయాతం యదర్థముపనిబధ్నన్తి కవయః సః కవిసమయః. అశాస్త్రీయము, అలౌకికమూ అయి ఉండి, సంప్రదాయబద్ధంగా కావ్యప్రపంచంలో ఒక పరంపరగా ఏ అర్థాన్నయితే కవులు వర్ణిస్తూ వస్తున్నారో, అవి కవిసమయాలు. ఇవి కావ్యమర్యాదలు. రాజశేఖరుని తరువాత అనేకులు – హేమచంద్రుడు కావ్యానుశాసనము లోను, అమరచంద్రుడు కావ్యకల్పలతావృత్తి లోను, కేశవమిశ్రుడు తన అలంకారశేఖరం లోనూ కవిసమయవివేచన చేశారు. వాటికి రాజశేఖరుడి నిర్వచనమే మూలంగా కనిపిస్తున్నది. సంగీతమీమాంసలో కవిసమయాల గురించిన చక్కని వర్ణన ఉన్నది.

దోహదక్రియలని కొన్ని ఉన్నవి. పుష్పోద్గమకౌషధం దోహదమ్ అని ఈ దోహదానికి ప్రామాణికనిఘంటు నిర్వచనం. కాలానుసారం చెట్లు పుష్పించడం తెలిసిన విషయమే. అట్లా కాక, కాలం కాని కాలంలోనూ లేదా వేరే ఏ కారణం చేతనైనా పుష్పించనటువంటి వృక్షాలను పుష్పించేట్లుగా చేసేటువంటి ద్రవ్యాలకు లేదా క్రియలకు దోహదక్రియలని నిర్వచనం. వీటికీ శాస్త్రీయత లేని కారణంగా వీటినీ కవిసమయాలుగానే పరిగణించడం ఉన్నది.

ఈ దోహదక్రియలతో అనేకాలైన మనోరంజకవర్ణనలను మన కవులు చేశారు. ఈ పద్యంలో దోహదక్రియలు వర్ణింపబడినాయి. ఒక జవరాలు వేరొకామెతో అంటున్నది, దాడిమ తీగకు ధూపం పెట్టమని. దాడిమకు ధూపము దోహదక్రియ. (వసుచరిత్రలో దాడిమకు చేసే ధూపదోహదాన్ని మహాకవి రామరాజభూషణుడు చలితలతాంతకాంతి… పద్యంలో కడురమ్యంగా వర్ణించాడు.) అలాచేస్తే, ఆ దానిమ్మ తీగ పుష్పిస్తుందట. అపుడు చిలుకకు వీరిపై వచ్చిన కోపం మటుమాయమవుతుందట! మామిడి వృక్షాన్ని కొడితే పూవులనిస్తుందట. స్త్రీకరస్పర్శ మామిడికి దోహదక్రియ (కరస్పర్శేన మాకందః అని). మరి పొన్నచెట్టో? అది నవ్వితే పుష్పిస్తుంది (నమేరుర్హసితేన చ అని). అందుకే పొన్నకు పథ్యం వారి నవ్వులేనట!

మదమెక్కి బాగా అతిశయించిన తుమ్మెద వీరి నాసాప్రభను చూసి భంగపడుతుందట! ముక్కును సంపెంగతో పోల్చుతూ, తుమ్మెద భంగపడిన విధానాన్ని చెబుతూ మహాకవి ముక్కుతిమ్మన అల్లిన నానాసూనవితానవాసనల అనే పద్యోహ ఇక్కడ అతీవమధురంగా స్ఫురిస్తుంది. వారింకా ఇలా అనుకుంటున్నారు: ‘కోయిలకంటుకుందామని ఈ తొగరులు ఎంత అభిలషిస్తున్నాయో చూడు! అది మేయడానికి చిగుళ్ళు అందించవే!’ కొరలడమంటే అభిలషించడమని అర్థం. తొగరుచెట్టు నుండి ఎరుపుచాయను తీస్తారు.

అక్కడి మందానిలగతికి ఒక మగువ కంపించిందట. స్త్రీలలోని సుకుమారతను చెప్పడమన్నమాట. మరొక చందనగంధి ఉన్నది. చందనపు పరిమళాలను వెదజల్లే స్త్రీ. ఆమెకు చందనం ఇంకిందట.

తిలకమంటే బొట్టుగుచెట్టు. ఆ తిలకవృక్షాన్ని చూడాలట. వెంటనే పూలనిస్తుందట. తిలక వృక్షానికి స్త్రీవీక్షణము దోహదక్రియ (తిలకో వీక్షణేన చ అని). తెప్పున అంటే శీఘ్రముగా అని అర్థం. స్త్రీకి మన్మథుడు వేవేల మోహాలను కలుగజేస్తాడట.

ఇక ఏయే పనులు చేయవద్దో ఒకరికొకరు చెప్పుకుంటున్నారు. వేరే స్త్రీ ఉంచిన అడుగులను త్రొక్కకూడదట. తేనె రంగులోని అరటి చెట్లనెక్కకూడదట. అక్కడి పూవులలోని మకరందము యేరులు కట్టి ప్రవహిస్తున్నది. ఒకామె వాటిని దాటుతున్నదట – అలా చేయవద్దని. మరొక ముకురానన ఎవరో పూమొగ్గలను దాచుకుంటున్నదట. అలా దాచవద్దని. మాటడమంటే మరుగు పరచడమని అర్థం. వేరొక చేడియ మోదుగచెట్టును ఎగబ్రాకుతున్నదట. అలా చేయవద్దని వారింపు. శారి అంటె గోరువంక. మధ్యలో గోరువంకల గుంపు హఠాత్తుగా కనపడితే జంకవద్దని ధైర్యం చెప్పడం.

ఇక గోగుచెట్టు ఉన్నది. అది ముచ్చట్లను కోరుకుంటుందట. గోగుకు సంస్కృతంలో కర్ణికారమని పేరు. దానికి దోహదక్రియ స్త్రీసల్లాపమని చెప్పబడ్డది (సల్లాపతః కర్ణికారః అని).

ఇక్కడ దాగుడుమూతలాడుకుందామే! అని అనుకుంటున్నారు వాళ్ళు. తనరడమంటే అతిశయించడమనీ, విజృంభించడమనీ అర్థాలు. ఇలా అనుకుంటూ దట్టపైన కేశపాశాలున్న ఆ కన్యలంతా అలరులను కోశారట. దానితో వారి ఎదలలో ఉన్న కలతలను పోగొట్టుకున్నారట.

ఈ పద్యశిల్పం ఒకసారి గమనించండి. పద్యం మొత్తాన్నీ పాదం పాదంగా చదువుకుని పూర్తి చేశాక, ఈ పద్యంలో భావపరమైన విభాగం ఏమీ చేయలేదని తోస్తుంది. కాసేపు ఇలా చేద్దామని కొన్ని మాటలు, కాసేపు దోహదక్రియలు. వెంటనే మళ్ళీ పక్షులు, కీటకాలవైపు దృష్టి. ఇంతో వారి మన్మథభావాలు, వారి వణుకు ఇత్యాదులు. తరువాత ఇలా చేయకు, అలా చేయి అంటూ చెప్పుకోవడాలు. మళ్ళీ దోహదక్రియలు – చంచలోల్లాసమనస్కులైన అందమైన అమ్మాయిలు గుంపుగా చేరి, ఒక పని చేస్తూ, సల్లాపాలాడుతూ ఉంటే, ఈ విధమైన గిజిబిజిగానే ఉండదూ!

ఈ కవిత వారి పుష్పాచయదృశ్యాన్ని మనముందు నిలుపుతోంది. ఇటువంటి ప్రజ్ఞ ఏ పుణ్యవంతుడైన కవికోగానీ చిక్కదు.