చం.
వలపది మొన్న నా యెడఁద వాకిట నెప్పుడు పాఱు నేఱు గా
మెలఁగెను; పాఱె నిక్కమిది మించిన వేడుక హద్దు లేకయే
వలనుగ నాదు కోరికకు వాసిగ; హా! అపుడెన్నిసారులో
చలమున సౌఖ్యలిప్తలను చాలఁగ నెంచితి; భోగవార్ధిలో
పలనె మునింగి తేలఁగను ప్రాణము, హాయిగనుంటి; ఇప్డు స
ల్లలితముగాఁగ ఒక్కయెడ లావుగఁజేరి, కరంబు శ్రావ్యమౌ
కలకలకంఠ కంఠమృదుకాకలి నాద సమానమాధురిన్
చెలఁగుచు ఎంతయున్ మనసు చెన్నలరారఁగ జేయుకాంతితో
తలకొను నట్టి పేశలనితాంత మనోహరసార ధారణో
చ్చలితవికాస భావయుతజంగమ రాగము మా, ఱదెద్ది తా
నిలిచెనొ! నేను చెప్పఁగలనే కలనే కలనేన్? అయో, విధీ!
సలలిత సౌఖ్యహీనపటుసాంద్ర తృణావృతకూప; మయ్యయో!
వలపుల బావి లోఁతగుచు వచ్చును మాటికి; ఇంకిపోదు పో
కలిగెడు లాభమెద్ది మదిఁ గాంచగ? చప్పుడు లేక యేరికిన్
తెలియని పాడు నూతఁబడి త్రెళ్ళెడు నీరది నాలుకెండఁగా,
బల మఱి ఎంతొ డస్సి దగఁ బాపుకొనం జను బాటసారికిన్
ఫలమొకయింత చేయునొకొ! బాపురె! ఇప్పుడు నట్టిభేదమే
బలితపు నాదు డెందపు కవాటము ముంగిటఁ జేరి, యక్కటా!
కలను తలంపనట్టి ఘనగర్భదరిద్రుని చేసెఁ ఈసునన్.
తెలుగు పద్యం అనే శరీరానికి ప్రాణాలు మూడు అని నా ఊహ. మొదటి ప్రాణం బిగి. దీనివల్లనే పద్యాన్ని చదువుతున్న బుద్ధి రెండు రుచులను సమాంతరంగా ఆస్వాదిస్తుంటుంది. ఒకటి, ఆ బిగువు తయారయిన విధానపు రుచి. రెండు, ఒక అర్థాన్ని సాధిస్తూ ఆ బిగువు తనంతతానుగా ఔచిత్యంగా వీగిపోతున్న విధానపు రుచి. రెండవ ప్రాణం ధార. ఇది పద్యంలోని ప్రతీ పదానికీ మధ్య ఉండే ఖాళీ పూడుకొనే అందం. ఛందస్సు నేర్చిన ప్రతీవారూ పద్యం వ్రాయగలరు. కాని, ధారను సాధించడానికి ఎంతో సాధన అవసరం. ఇక మూడవ ప్రాణం శిల్పం. ఇది ఒక తాత్పర్యం చుట్టూ ఆ పద్యంలోని పదాలు ఇమిడిన విధానం. ఎత్తుగడ నుండి, ఒక్కో పాదం పూర్తవుతున్న కొద్దీ భావం చదువరి మనసులో ఏవిధంగా పేరుకొంటున్నదీ ఆ పద్యం నడకను బట్టి ఆధారపడి ఉంటుంది.
ఛందస్సును పద్యానికి ప్రాణంగా చెప్పలేదేమిటని సందేహం కలుగవచ్చు. అక్షర/గణ సంఖ్యాతంగా గాని, మాత్రాసంఖ్యాతంగా గానీ ఛందస్సును పాటింపని కవిత పద్యం కాదని నిర్వచనం (ఛందోబద్ధపదం పద్యమ్ – సాహిత్యదర్పణం; పద్యం చతుష్పదీ తచ్చ వృత్తం జాతిరితి ద్విధా, వృత్తమక్షరసంఖ్యాతం జాతిర్మాత్రాకృతా భవేత్ – ఛన్దోమఞ్జరి).
పద్యానికి ఉండవలసిన ప్రాణత్రయాన్ని నిండుగా సమకూర్చుకొని తయారయిన చంపకమాలిక పై పద్యం. ఈ మాలికను రచించినది ‘కవి’ అని బిరుదును పొందిన మారేపల్లి రామచంద్రశాస్త్రిగారు. ఆధునికాంధ్రసాహిత్యంలో కవి అని బిరుదు పొందిన వ్యక్తులు ఇద్దరు. ఒకరు మానవల్లి రామకృష్ణకవిగారు, మరొకరు మారేపల్లివారు. 1893వ సంవత్సరంలో శాస్త్రిగారు ఉన్నత విద్యాభ్యాసం కోసం విశాఖపట్నం వచ్చినపుడు విక్రమదేవ వర్మగారింట ఏర్పడిన ఒక సమావేశం లోని సభ్యులు అక్కడే ఉన్న రవివర్మ గీసిన మేనకావిశ్వామిత్రుల చిత్రపటంపై పద్యం చెప్పమని ఈయన్ను కోరారట. వెంటనే ఆశువుగా శాస్త్రిగారొక మాలికను చెప్పారట. అది విని, ఆ సభలో ఉన్న పండితులైన పి. టి. శ్రీనివాసయ్యంగారు శాస్త్రిగారికి ‘కవిగారు’ అనే బిరుదునిచ్చారట. ఈ సంగతి ‘మారేపల్లి రామచంద్రశాస్త్రికవిగారు–నా పరిచయము’ అనే వ్యాసంలో నిడుదవోలు వేంకటరావుగారు వ్రాశారు. (వేంకటరావుగారు శాస్త్రిగారు ఆ సమయంలో పదహారు చరణాల ఉత్పలమాలికను చెప్పారని వ్రాశారు. కానీ మేనకావిశ్వామిత్రులపై నాకు లభించిన మాలిక–కాలవలాహకాంతర వికాసిత బాల శశాంకరేఖఁ…– పంతొమ్మిది చరణాలది.) అప్పటినుండీ అసలు పేరు ఎవరికీ తెలియనంతగా మారేపల్లివారికి ‘కవిగారు’ అన్న పేరే స్థిరపడిపోయింది.
కవిగారి శైలి లాలిత్యలాలితము. ముఖ్యంగా ఆయన చెప్పిన శృంగారకవిత్వం లోని సౌందర్యసుగంధాలు మనసును ముప్పిరిగొని, స్తంభింపచేస్తాయి. ఇరవై చరణాలున్న పై మాలికను మొదటిసారి నేను చదువుకున్నపుడు, అందులోని బిగువు, ధార, శిల్పము అనే గుణాలకు అబ్బురపడ్డాను. ముఖ్యంగా, ఈ మాలికలో సౌఖ్యలిప్తలు, భోగవార్ధి, జంగమరాగము, సలలిత సౌఖ్యహీన పటుసాంద్ర తృణావృతకూపము — వంటి ప్రయోగాలు కంపించిన గుండె స్పందిస్తే ఇలాగ ఉంటుంది కాబోలు అని అనుకునేలా చేస్తాయి.
కవితను మరొక్కసారి చదవండి. నింపాదిగా చదవండి. కవితలో వస్తువు కవి ఒక కామినితో అనురాగం వల్ల తనకు ఏర్పడిన అవస్థను చెప్పుకోవడం. లేదా ఒక ప్రియుడు తన ప్రేయసితో మాట్లాడుతున్నాడు అనుకోవచ్చు. ఆ వర్ణనలో ప్రియుడు తనకు తానుగా ఉన్నాడు, లేడు. గుండె మాత్రం నిర్వచింపలేని ఒక తీపిలో తలమునకలౌతూ, అదే సమయంలో మల్లగుల్లాలు పడుతూ ఉంది. అనురాగం కలిగిన కొత్తల్లో అతడికి వలపు తన ఎడదవాకిట పారే ఏరులా ఉండేదట, అతని కోరికకు వాసిగా. అప్పటి వేడుకలో అడ్డూ ఆపూ లేదట. ఆ ఏటికి హద్దూ పొద్దూ లేదట. అతగాడు ఎన్నిసార్లో కంపిస్తూ సౌఖ్యలిప్తలను లెక్కపెట్టుకుంటూ ఉన్నాడట. భోగవార్ధిలో తన ప్రాణం మునిగి తేలుతుండగా హాయిగా ఉన్నాడట.
మరి ఇప్పుడేమైంది? చెబుతున్నాడు. ఇక్కడ కవితలో ‘ఇప్డు’ అన్న పదం భావపరంగా పెనుమలుపు. ఎంతో శ్రావ్యంగా, అవ్యక్తమధురమైన కోకిలగానంతో, సూక్ష్మమైన మృదుమధురధ్వనితో సమానమైన మధురిమతో అతిశయిస్తూ, మనస్సౌందర్యాన్ని ప్రకాశింపజేసేటువంటి కాంతితో కలిగేటువంటి ఒక అద్వితీయమైన రాగం కలిగిందట అతనికి. ఆ రాగం ఎల్లపుడూ మారిపోయేటువంటి జంగమరాగమట. అంతేనా, ఆ రాగం భావాలతో కూడుకున్నదట. ఎటువంటి భావాలవి? చక్కని (పేశల), అధికమైన మనోహరత్వంతో కూడిన సారాన్ని ధరిస్తూ (నితాంత మనోహర సార ధారణ), పైకి ఎగసే (ఉచ్చలిత) భావాలవి.
ఇక్కడ చెప్పబడుతున్నది ఏ రాగం అన్న ప్రశ్న పుట్టే అవకాశం లేదు. అది ఏ రాగమూ కాని రాగం, అనురాగమని తెలుస్తూనే ఉంది. తెలుస్తూనే ఉన్నా, దాని విధివిధానాలు ఇదమిత్థంగా చెప్పలేక, అసహాయుడై, ‘నేను చెప్పగలనే కలనే కలనేన్?’ అంటున్నాడు. ఇది ప్రసిద్ధమైన అటజనికాంచె… పద్యంలోని ‘లుఠదభంగ తరంగ మృదంగ’ వంటి అందమైన నడక. రసజ్ఞులు ఏవిధంగా అయితే ఆ నడకలో జాలువారే నీటిప్రవాహాన్ని చూశారో, అనురాగ ప్రవాహం అంతే అందంగా ఇక్కడ ఉద్యోతింపబడడాన్ని గ్రహింపకపోరు.
ఈ స్థితి పాపమాప్రియుడికి తెలియని కష్టంగా ఉంది. అందుచేతనే సృష్టికర్తను పట్టుకొచ్చి, ‘అయో విధీ!’ అంటున్నాడు. అనురాగమెటువంటిదో ఇంత కష్టించి వర్ణించాడు గాని, తన కామినికి అర్థమయిందో లేదోనని ఒక పోలికను తీసుకువచ్చి, ఇట్లా సమర్థిస్తున్నాడు. ఆ అనురాగము ఒక బావి వంటిదట. సాధారణమైన కూపం కాదది. సలలితసౌఖ్యహీన పటుసాంద్ర తృణావృతకూపము. అది దట్టమైన పచ్చికతో ఆవృతమై, లలితమైన సుఖాన్ని ఎంతమాత్రమూ ఇవ్వని బావి. అయితే ఆ వలపుల బావి మటుకు మాటిమాటికీ లోతుగా అవుతూ వస్తున్నది. ఎప్పుడూ ఇంకిపోయేది కూడా కాదు అది.
తన హృదయంలో ఇంత లోతుగాను, భగభగల వేసవిలో సైతం ఇంకిపోనిది గానూ అయి ఉన్న ఈ వలపుల బావి వల్లన ఉపయోగమేమంటే, ఏమీ లేదట. చడీచప్పుడూ లేకుండా, ఎవ్వరికీ తెలియకుండా ఒక పాడునూతిలో త్రుళ్ళిపడే నీరు ఏవిధంగా అయితే సత్తువ కోల్పోయి, డస్సిపోయి, నాలుకెండిన బాటసారికి నిరుపయోగమో, అటువంటి నిరుపయోగమైన అనురాగకూపం ఎంతో బలమైన, యౌవనవంతమైన ఇతని గుండె కవాటానికి ఎదుటగా చేరి, ఇతడిని కనీసం కలలో కూడా ఊహింపనటువంటి గర్భదరిద్రుడిగా, నిరుపేదగా చేసిందట.
ప్రేయసి ఆపాదమస్తకం వర్ణించడం పరిపాటి అయిన ఈ కవిత్వపు కోవలో ఒక ప్రియుడు లోనికి తిరిగి, తన మనసు లోతులలోకి వెళ్ళి, అక్కడి ఉత్పతననిపతనాలను ఇంత మనోహరంగా వర్ణిస్తూ చెప్పిన హృదయంగమమైన మాలిక బహుశా తెలుగు సాహిత్యంలో ఇదేనేమో.
అంతేకాదు, ఈ కవితకు కవిగారుంచిన శీర్షిక అనురాగభేదము. ‘కలిగెను భేదమొక్కటిదె’ అన్న ఎత్తుగడ ఏతదనుగుణమైనదే. భేదమంటే ఒక విశేషము. అది ఈ కవితలోని నాయకుడికి కలిగినది. ఎంతో లోతైనదై, సారవంతమైన భావపరంపరతో, ఊటబావి వంటి అనురాగం ఇతడికి కలిగినా, అది ఇతడ్ని చివరకు నిరుపేదను చేసింది. అతని మనసు పూర్తిగా తన కామిని వశమైంది. ఇదే కదా యువకునిలో ప్రేమోత్పత్తి చక్రం. మొదట తన హృదయం పారే ఏరులా ద్రవించి, ఉప్పొంగుతుంది. ప్రేయసి ఎదవైపుగా ప్రవహించి, ప్రవహించి, అందులో కలిసిపోతుంది.
మొదటగా అనురాగానుభవంలో తనకు ఇష్టమైన స్థితే కలిగినా, తరువాత పరిస్థితి తల్లక్రిందులైనదని సూచిస్తూ, తాను చివరకు ఏవిధంగా మిగిలాడో చెబుతూ మొదటి పాదంలోనే నిరుపేదనైతి అని చెప్పడం ఈ పద్యనిర్మాణంలో నాకు కవి చూపిన గొప్ప శిల్పంగా తోచింది.
ఈ మాలికలో వర్ణింపబడిన అనురాగభేదమేదో చెప్పగలమా? మహాకవి, లాక్షణికుడూ అయిన భోజుడు అనురాగంలో 64 భేదాలను చెప్పాడు. అవి: అభిలాష, ఆకాంక్ష, అపేక్ష, ఉత్కంఠ, ఈప్స, లిప్స, ఇచ్ఛ, వాంఛ, తృష్ణ, అభిష్వంగము, సక్తి, మోహము, ఆకృతము, కుతూహలము, విస్మయము, రాగము, వేగము, అధ్యవసాయము, వ్యవసాయము, కామత, వాసన, స్మరణము, సంకల్పము, లాలన, స్పృహ, లౌల్యము, గంధము, శ్రద్ధ, రుచి, దోహదము, ఆశ, ఆశీస్సు, ఆశంస, మనోరథము, ఆస్థ, అభినివేశము, అనుబంధము, ఆగ్రహము, విమర్శ, మనీష, అభిప్రాయము, పక్షపాతము, లోభము, ఆసంగము, భావము, రాసము, రతి, ప్రీతి, దాక్షిణ్యము, అనుగ్రహము, వాత్సల్యము, అనుక్రోశము, విశ్వాసము, విస్రంభము, వశీకారము, ప్రణయము, ప్రాప్తి, పర్యాప్తి, అభిమానాప్తి, స్నేహము, ప్రేమ, ఆహ్లాదము, నిర్వృతి.
ఈ అరవై నాలుగూ ఒక్కోటి మరలా ఎనిమిది విధాలు – నిత్యానురాగము, నైమిత్తికానురాగము, సామాన్యానురాగము, విశేషానురాగము, ప్రకాశానురాగము, ప్రచ్ఛన్నానురాగము, కృత్రిమానురాగము, అకృత్రిమానురాగము అని చెప్పి.
పై 64×8 = 512 అనురాగభేదాలలోనూ మొదట నది వెల్లువలా మొదలై, తరువాత గర్భదరిద్రునిగా చేసే వలపుల బావిగా లోతుదీరి, విపరిణమించే అనురాగభేదం నాకు తెలిసి లేదు. అందుచేత కవిగారు మాలికగా వర్ణించిన ఈ అనురాగభేదము ఇప్పటివరకూ లాక్షణికులు గుర్తింపనిది.