(ఛందం : ముత్యాలసరాలు)
తలను వంచక చూడ కననౌ
గడ్ది పూవును నేను గావున
లోకమందున నాకు సుంతయు
ఘనత కానదుగా!
నేల బారున పూలు పూయుచు
కాలి తాపుల నెన్నొ కాయుచు
బ్రతుకు బరువును మోయుచుందును
కష్ట పడుతూనే.
చిన్న పూవుగ పూచినానని
విన్న బోకనె విచ్చుకొందును
కనుల కింపగు రూపసంపద
నేల తల్లికినై !
చిట్టి పాపలు చేరి భువిపై
చిందులేసే వేళ లందున
పసిడి మువ్వలు మ్రోగి సందడి
చేయు చోటులలో,
పట్టు పరుపుగ మారి మురియుచు
వారి పదముల క్రింద చేరుకు
జన్మ ధన్యత గాంచె నంటూ
పరవశించెదగా!