నిద్ర

చెదిరిన పుప్పొడి రేణువుల్లా
మెరిసే నక్షత్రాల మధ్యలోంచి
నల్ల కలువలా విరిసిన రాత్రి
కళ్ళముందు పారదర్శకమైన
పరదాల్ని దించేస్తుంది

రోజంతా అవిశ్రాంతంగా ఆలోచనల
జలతారు పోగుల్ని నేసి నేసి
అలసిన స్పృహ వెచ్చని చీకటి గుహలలో
ముడుచుకుని పడుకుంటుంది

నిద్ర కనురెప్పల గవాక్షాలను
తాకే ముందు ఏదో గమ్మత్తైన భావన
బరువైన తామర పూవుల స్పర్శ
ముంగురుల చివర్లను కదిలించినట్లు
నీలాంబరి ఆనంద మందారాలు పూయించినట్లు

సన్నగా పాడే సెలయేటి ప్రవాహంలో
జలకన్యలా నేను సుతారంగా జారిపోతాను
నా దారిలో ఎన్నో సౌగంధికా పుష్పాలు
అనుభవాల పరిమళాలు వీచే సన్నజాజి పూగుత్తులు
రంగు రంగుల స్వప్నాల రెక్కలను
విప్పుతూ ఎగిరే సీతాకోకచిలుకలు

అందమైన ఆలాపనలా సుళ్ళు తిరుగుతూ
కలల అలల మీద తేలే జ్ఞాపకాల ఆనవాళ్ళతో
జలపాతగీతమై సాగిపోయే నాకు
హఠాత్తుగా ఒక కొండ శిల అడ్డుగా నిలుస్తుంది
చటుక్కున కనులు విప్పేసరికి
ఉమ్మెత్త పువ్వులా ఉదయం తెల్లగా నవ్వుతుంది


రచయిత వైదేహి శశిధర్ గురించి: జన్మస్థలం గుంటూరు జిల్లా నరసరావుపేట. నివాసం న్యూ జెర్సీలో. వైద్యరంగంలో పనిచేస్తున్నారు. చాలా కవితలు ప్రచురించారు. ...