ఆధునిక కాలంలో వేమనకు గుర్తింపు రావడానికి కట్టమంచి రామలింగారెడ్డిగారు నిర్వహించిన పాత్ర చాలా పెద్దది. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మగారి చేత ‘వేమనోపన్యాసములు’ (1929) ఇప్పించడం వెనుక ఆయన పాత్ర తెలిసినదే. వేమనపై సి. ఆర్. రెడ్డికున్న ఆసక్తిని గురించి వేమన – సి. ఆర్. రెడ్డి (ఆంధ్ర విశ్వకళాపరిషత్తు, విశాఖపట్నం, 1981) అన్న పుస్తకంలో బంగోరె (బండి గోపాలరెడ్డి) తనదైన శైలిలో వివరంగా చూపెడతారు.
ఇక్కడ మీకు వినిపించుతున్న సి. ఆర్. రెడ్డిగారి రేడియో ప్రసంగం Caste-less society – Vemana అన్న శీర్షికతో అక్టోబర్, 1948లో ఆకాశవాణి మద్రాస్ కేంద్రం నుండి ప్రసారమయ్యింది. ఈ ప్రసంగం పూర్తి పాఠాన్ని (transcript) ఢిల్లీలోని నెహ్రూ మెమోరియల్ లైబ్రరీలో వున్నట్లు (C.R. Reddy Papers, File no. 118) గుర్తించి పైన పేర్కొన్న పుస్తకంలో బంగోరె పునర్ముద్రించడం జరిగింది.
ఇప్పటి వరకు నాకు లభ్యమయిన తెలుగు రేడియో ప్రసంగాలన్నింటిలోకి ఇదే ప్రాచీనమైనది.
సమర్పణ: పరుచూరి శ్రీనివాస్.
[30 నవంబర్ 2014: పాఠకుల కోరికపై శ్రీనివాస్ పంపిన ఈ ప్రసంగపాఠం పిడిఎఫ్‌గా జతచేశాము. – సం.]