సుగ్రీవ విజయము: రజని యక్షగానం

సుగ్రీవ విజయము అనే పేరుగొన్న ఈ యక్షగానం బాలాంత్రపు రజనీకాంతరావుగారి (రజని) శతజయంతి సందర్భంగా ఆయనతో నాకున్న మంచి పరిచయాన్ని గుర్తు చేసుకుంటూ వినిపిస్తున్నాను. ఈ యక్షగానానికి సంగీత నిర్వహణ చేసినది రజని, ఓలేటి వెంకటేశ్వర్లు గార్లు. ఇది నాకు తెలిసినంతలో 1973 వేసవిలో మొదటిసారిగా విజయవాడ కేంద్రం నుండి ప్రసారమయ్యింది. సుమారు 71 నిమిషాల పాటు సాగే ఈ యక్షగానంలో సూత్రధారుడిగా ఎన్. సి. వి. జగన్నాథాచార్యులు, సుగ్రీవునిగా ఎం. వి. రమణమూర్తి, హనుమంతునిగా బలిజేపల్లి రామకృష్ణశాస్త్రి, వాలిగా మల్లిక్, లక్ష్మణునిగా పెమ్మరాజు సూర్యారావు, తారగా వింజమూరి లక్ష్మి, చెంచితలుగా శ్రీరంగం గోపాలరత్నం, వి.బి. కనకదుర్గగారి వంటి ప్రముఖ కళాకారులు పాల్గొన్నారు.

సుగ్రీవ విజయము పదహారవ శతాబ్దపు నాటివాడైన కందుకూరి రుద్రకవి రచన. దీని పూర్తి పాఠం ఆంధ్రభారతి వెబ్‍సైటులో వేటూరి ప్రభాకరశాస్త్రిగారి పీఠికతో కూడ ఉంది. ఇది 20వ శతాబ్దంలో నాలుగుసార్లు–1930, 1939, 1973, 1981లలో–పుస్తక రూపంలో అచ్చయ్యింది. ఇదే తెలుగులో మొదటి యక్షగానమని, కాదు నాలుగవది అని (చూ: జి. వి. సుబ్రహ్మణ్యం పీఠిక, 1973) వాదనలున్నాయి. ఏమయినా రుద్రకవి గురించి, ఈ యక్షగానాన్ని గురించి మనకు వేటూరి (1939), జి.వి.సుబ్రహ్మణ్యం (1973), ఆర్. పద్మనాభరావుగార్ల (1981, 2017) వ్యాసాలలో చాలా వివరాలు దొరుకుతున్నాయి. రుద్రకవి ఇతర రచనలు: నిరంకుశోపాఖ్యానము, జనార్దనాష్టకము తెలుగు సాహిత్యంలో ఈ యక్షగానం కంటే ఇంకా ఎక్కువ పేరు గడించాయి.

రుద్రకవి, గోల్కొండ నవాబయిన ఇబ్రహీం కులీ కుతుబ్ షా సమకాలీకుడు. బహుశ అతని సంస్థానంలో కవిగా వున్నాడు. ఇబ్రహీం కులీ తన అన్న జంషీద్ కులీ వల్ల పారిపోయి విజయనగర రాజ్యంలో రామరాయల వద్ద తలదాచుకుని, ఆ తరవాత గోల్కొండపై దాడిచేసి రాజ్యాధికారం పొందాడన్న విషయంలో చరిత్రకారుల్లో ఏకీభావం వుంది. పైన పేర్కొన్న తెలుగు వికీపీడియా వ్యాసంలో ‘[ఇబ్రహీం కులీ కథ] సుగ్రీవుని కథతో పోలి ఉండటంతో తను కూర్చిన సుగ్రీవ విజయం యక్షగానాన్ని గోల్కొండలో ప్రదర్శించి ఉండవచ్చని ఒక ఊహాగానం’ అని ఉంది. ఈ ఆలోచనని ఊహాగానం అనకుండా మరింత జాగ్రత్తగా చూడాలని నా అభిప్రాయం.

రుద్రకవి చరిత్ర, సాహిత్యంపై జరిగిన, జరుగుతున్న చర్చలపై మీకు ఆసక్తి ఉన్నా, లేకపోయినా ఈ సంగీత కార్యక్రమం మాత్రం మీకందరికీ నచ్చుతుందనే ఆశిస్తాను.