ఈమాట సాహితీకుటుంబానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు!
కనీవినీ ఎరుగని రీతిలో కొరోనా వైరస్ గతసంవత్సరం ప్రపంచమంతటినీ కుదిపివేసింది. ఎన్నో వ్యాపారాలను, వృత్తులను అతలాకుతలం చేసింది. ఏ పూటకాపూట సంపాదించుకునే ఎన్నో జీవితాలను రాత్రికి రాత్రి అయోమయంలోకి నెట్టింది. ప్రపంచంలో ఏ దేశంలోనైనా ప్రభుత్వాలకు పేదప్రజలు ఆటబొమ్మలేనని పాశవికంగా స్పష్టం చేసింది. దేశాల మధ్య, మనుష్యుల మధ్య కొత్త దూరాలు ఏర్పరచింది, కొత్త భయాలు సృష్టించింది. వెలివేత లాంటి జీవితంలో అశాంతికి, వేదనకూ గురి చేసింది. నిజానికి ఇట్లాంటి క్షణాల్లోనే మనిషి తనకు తానొక ప్రశ్నార్థకమై జవాబులు వెదుక్కునే ప్రయత్నం చేస్తాడు. తనకు నిజంగా కావలసినవి, అక్కర్లేనివీ బేరీజు వేసుకుంటాడు. బహుశా అందుకే సమాజంలోనూ ఏకాంతంలోనూ తమతమ విలువలు, బాధ్యతలు స్పష్టం చేసుకొని కొందరు మరింత మంచితనంతో ముందుకుసాగారు; మరికొందరు ఇదే సందర్భాన్ని తమ స్వార్థాన్ని, ఇతరుల పట్ల ద్వేషాన్ని సమర్థించుకొనేందుకు అనువుగా వాడుకున్నారు. ఆదినుండీ ఏ పరిస్థితిలోనయినా ఈ రెండు దారులూ ఉంటూనే ఉన్నాయి, ఏది ఎంచుకుంటామనేది మన విజ్ఞతను బట్టి ఉంటుంది. కళాకారులూ దీనికి అతీతం కాదు. నిజమైన కళాకారుడు ప్రతిబంధకాలతో నిస్పృహ చెందడు. పరిమితులు పెరిగేకొద్దీ తన కళను అపరిమితంగా సృష్టించుకునే దారులను అన్వేషిస్తాడు. కళను సామాజిక, సామూహిక ప్రభావాలకు ఆవలగా చూస్తాడు. తనదైన ఏకాంతంలో నుండి, తనవే అయిన అనుభవాలలో నుండి ఓ కొత్త చూపుతో కళాసృజనకు ఉద్యమిస్తాడు, ఒక విశాల ప్రపంచాన్ని సృష్టించుకుంటాడు. దృశ్య సంగీత మాధ్యమాలలో ఎందరో కళాకారులు ఈ కోవిడ్ కట్టుబాట్లనే తమ సృజనకు వేదికగా మార్చుకొని ప్రతిభను నిరూపించుకోవడం దానికదే ఓ స్ఫూర్తిసందేశం. కళాకారుడైనా, సామాన్య మానవుడైనా దిక్కుతోచని స్థితిలో కొత్త దిక్కు వెతుక్కుంటాడనేది మరొక్కసారి నిరూపించబడిన తరుణమిది. తెలుగు సాహిత్యానికి కోవిడ్ వంటి దుర్దశ కొన్ని దశాబ్దాలుగా ఏర్పడి ఉన్నా, తెలుగు సాహిత్యకారులు ఎంచుకోవలసిన దారి ఎంచుకోకున్నా, ఇప్పుడు ఈ ఆశావహ దృక్పథమే మనకు మరింత అవసరం. ఈ కోవిడ్ ఏకాంతం తెలుగు కవిరచయితలలో ఏ కొత్త దారులు తెరిచిందో, తెలుగు సాహిత్యంలో ఏ ప్రభావం చూపిందో, అసలు చూపిందో లేదో కూడా మనకింకా తెలియదు. తెలుగునేలపై ప్రముఖులమనుకునే వారి ధోరణి షరా మామూలుగానే ఉన్నా, వాటికి భిన్నంగా కొందరు రచయితలు కొత్తదారి పడుతున్నారని, ఒంటరి దీపాలుగా ద్వీపాలుగా, వైవిధ్యమైన కథాకథనప్రయోగాలతో తెలుగు సాహిత్యాన్ని సజీవంగా ఉంచేందుకు తమదైన కృషి చేస్తున్నారని మా ఎరుక. కారుమొయిలులా కొత్త వెలుగులను కమ్మేస్తున్న పాత ధోరణులను పక్కకు నెట్టి, సాహిత్యచర్చలు ఈ కొత్త కలాల గురించి కొనసాగాలి. జీవితం కొత్త అనుభవాలతో ఎలా మనల్ని బలోపేతం చేస్తోందో, తెలుగు సాహిత్యాన్నీ అదే రీతిన పరిపుష్టం చేసుకోవాలి. అదే మనం ఎంచుకోవలసిన దారి.