డిసెంబరు, జనవరి నెలల్లో హైదరాబాదు, విజయవాడలలో జరిగే పుస్తక మహోత్సవాలు ఏటేటా మరింత బలపడి సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకోవడం ఆహ్వానించదగ్గ పరిణామం. వేల పుస్తకాలు ఒకేచోట అందుబాటులో ఉండే ఈ ప్రదర్శనలకు విచ్చేస్తున్న వారి సంఖ్యా అదే తీరున ఉంటోంది. సామాజిక మాధ్యమాలు, ప్రచురణ రంగంలో వచ్చిన మార్పుల పుణ్యమా అని రచయితల సంఖ్య పెరిగింది. రచయితలకూ పాఠకులకూ మధ్య దూరం తగ్గింది. ఈ స్నేహభావాలన్నీ పుస్తక ప్రదర్శనల్లో కనిపించడమే గాక, సాహితీప్రియులు పెద్ద సంఖ్యలో పుస్తకప్రదర్శనకు విచ్చేసేందుకు కూడా దోహదం చేస్తున్నాయి. తెలుగు సాహిత్యరంగం ఈ రెండు ప్రదర్శనలే లక్ష్యంగా పుస్తక ప్రచురణ చేపడుతోంది అనడం అతిశయోక్తి కాదు, ఎంతో మంది రచయితలు ఇక్కడి అమ్మకాలే కొలమానంగా పుస్తకాలను సిద్ధం చెయ్యడం అసమంజసమూ కాదు. కాని, పుస్తక ప్రచురణ, ప్రదర్శన, విక్రయం – ఇవన్నీ ఇలా ఈ రెండు ప్రాంతాలకు, కొన్ని రోజులకూ మాత్రమే పరిమితం కాకూడదు. తెలుగునాట సాహిత్యానికి ఆదరణ అంతగా లేదన్న అభియోగం నిజం కాకూడదంటే ఈ పుస్తకాలను, ఈ పుస్తకాల పండుగలను మిగతా ఊళ్ళకు, చిన్న చిన్న పట్టణాలకూ తీసుకురావాలి. సాహిత్యం ఒక సాంస్కృతిక సందర్భం కూడా కావాలి. చిన్నచిన్న ఊళ్ళల్లోనూ పుస్తకాల దుకాణాలుంటాయి. కాని, అవి ముఖ్యంగా నిత్యావసరాలకు ఉపయోగపడేవే కాని సాహిత్యాభిలాషను పెంపొందించే ఉద్దేశ్యంతో నడిచేవి కావు. ఆర్థిక కారణాలవల్ల సాహిత్య ప్రచురణకర్తలు, పంపిణీదారులు అలాంటి ఊళ్ళలో ఏడాది పొడుగునా దుకాణాలు తెరవలేరు. అయితే, అంత చిన్న ఊళ్ళల్లో కూడా పండగలకు జాతరలు, ప్రతి ఏటా తిరణాళ్ళ వంటివి జరుగుతాయి. ప్రతీ ఏడూ జరిగే ఆ పండుగలు వారి సామూహిక సామాజిక సాంస్కృతిక స్పృహలో భాగం కనుక జనం వాటిని గుర్తు పెట్టుకుంటారు. వాటికోసం ఎదురు చూస్తారు. వాటి గురించి మాట్లాడుకుంటారు. సంగీతం, సాహిత్యం – కళ ఏదైనా సమాజంలో ఆదరణ పొందాలి అంటే అది ఆ సమాజపు సాంస్కృతిక స్పృహలో, ఆ ఊరి ప్రజల సంభాషణలో భాగం కావాలి. పుస్తకాల పండగ కూడా అలాంటిదే, అదీ మనదే అన్న భావనను వారి స్పృహలో భాగం చెయ్యగలిగితే, ఆ సందర్భానికి కూడా క్రమేణా ఎదురు చూస్తారు. పుస్తకాలు కొంటారు, అంతకంటే ముఖ్యంగా చదువుతారు. సమకాలీన సాహిత్యంతో పరిచయం కలుగుతుంది. అవగాహన ఏర్పడుతుంది. మెల్లగా, మంచి సాహిత్యాన్ని గుర్తుపట్టడమూ ఆదరించటమూ అలవాటవుతుంది. నగరాలంత పెద్ద స్థాయిలో కాకున్నా ఊళ్ళల్లో పాఠశాలల ఆటమైదానాల వంటి చిన్న ప్రదేశాలలో, ఏదో ఒక స్థాయిలో గ్రంథాలయాల్లో, ఖాళీగా ఉన్న కళ్యాణమండపాల్లో పుస్తకోత్సవాలు ఏర్పాటు చేయవచ్చు. మొదట్లో ప్రచురణకర్తలకు, నిర్వాహకులకూ ఇవి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా లేకపోయినా, చిన్న చిన్న పట్టణాల్లో, ప్రతీ ఏడాదీ జరిగే జాతరలు, ఉత్సవాల లాగానే, పుస్తకాల పండుగ కూడా ఒకటి వాళ్ళకు గుర్తుండేట్టు చేయగలిగితే, పండుగలా జరపగలిగితే, సమకాలీన సాహిత్యాన్నీ ఆ చిన్న పట్టణాల సామూహిక స్పృహలో భాగం చెయ్యవచ్చు. తద్వారా సాహిత్యాభిరుచిని మరింతగా పెంపొందింపవచ్చు. అయితే, ఈ మార్పు ఏ ఒకటీ రెండేళ్ళలోనే వచ్చేది కాదు. కాని, గొప్ప సంకల్పాలు, గొప్ప ప్రణాళికలు ఎప్పుడూ ఎక్కువ సమయాన్నే కోరుకుంటాయి కదా.