మచ్చ

“ఏమిటి మా అమ్మాయి సమస్య?” తల్లి అడిగింది.

“సమస్య మీ అమ్మాయిది మాత్రమే కాదు, మీ అందరిదీ. తనక్కావలసిందల్లా తను ప్రత్యేకంగా ఉండటం. అలా ఎందుకు ఉండనివ్వరు? మీ సమస్య ఏమిటో తనకి అర్థం కాదు. ఇంతకు ముందు మొహాన పచ్చబొట్టు వేయించుకుందట గదా?”

“మొహాన ఏమిటి వికారంగా. కోప్పడి తీయించాము. అది తప్పా?” తండ్రి అడిగాడు.

“తనకు మొహాన ఒక మచ్చ కావాలనుకుంటే పెట్టుకోనివ్వచ్చు గదా? మీ మాటే నెగ్గాలనే పట్టుదల మీకెందుకు?”

“కానీ ఆ మొహం కోసం ఎంత డబ్బు పోశాం? తను అందరిలా అంత అందంగా లేదని బాధ పడుతుందనే కదా? పిల్లలకి ఏ లోటూ ఉండకూడదనే కదా ఏ తల్లిదండ్రులయినా కోరుకునేది? ఎందుకలా తనను తాను హింసించుకుని మమ్మల్ని వేధిస్తుంది?”

“మీ సంతోషమే మీ అమ్మాయికి సంతోషం కావాలంటే ఎలా? ఎక్కడో రాజీ పడాలి. మీ అమ్మాయిని అందంగా చూడాలనుకుంటున్నారా ఆనందంగానా? ఒక మచ్చను కనీసం కొంతకాలం ఉండనీయండి. తర్వాత మీరు చెప్పినట్టు విని మచ్చ తీయించుకోడానికి వొప్పుకోవచ్చు గదా?” ఇద్దరినీ మార్చి మార్చి చూస్తూ చెప్పాడు.

“పోనీ ఆ పని చేసి చూద్దాం! మాటి మాటికీ ఎమర్జెన్సీ వార్డుల చుట్టూ, డాక్టర్ల చుట్టూ తిరగడమయినా తప్పుతుంది.” భర్త వంక చూస్తూ చెప్పింది తల్లి.


ఆగినట్టున్న నెత్తురు అడ్డుగా పెట్టిన దూది తీయగానే కారడం మొదలెట్టింది. కంట తడి లేదు. గోడకున్న ఫొటోలో కదులుతున్న ఆకుల్ని చూస్తుంది.

“ఇంత లోతుగా ఎలా తెగింది?” డాక్టరు గాయాన్ని శుభ్రపరుస్తూ అడిగింది.

“పొరపాటున తెగింది” తల్లి చెప్పింది నెత్తుటి వంకే చూస్తూ.

“మచ్చ మాసిపోతుందా? పూర్తిగా మాసిపోవడానికి ఎన్నాళ్ళు పడుతుంది?” తండ్రి అడిగాడు గాయం వంకే చూస్తూ.

“గాయం మానడానికి ఎన్నాళ్ళు పడుతుంది అని అడుగుతారు మామూలుగా.” డాక్టర్ ఆయన వంక చూసి చెప్పి తల తిప్పి తన పని చేసుకుపోతూ అంది. “మరింత నెత్తురు కారకుండా చేయడమే ఇక్కడ ఎమర్జెన్సీలో మా పని. మచ్చ మాసిపోవడానికి మీ ఫామిలీ డాక్టర్‌తో ఫాలో అప్ కండి”


వెయిటింగ్ రూములో తన వంతు కోసం ఎదురుచూస్తూంది. పక్కనే తల్లి. ఇంకా చాలా మంది తల్లులూ, తండ్రులూ, పిల్లలూ.

“నువ్వు నాకు తెలుసు” పక్కనున్న అమ్మాయి అంది.

తల తిప్పి చూస్తే చెప్పింది.

“అశోక్‌నగర్లో మీరు మా పైనే ఉండేవాళ్ళు. అయిదేళ్ళవుతుంది. గుర్తున్నానా ఇద్దరం కలిసి ఆడుకునే వాళ్ళం?” అమ్మాయి నవ్వుతూ అడిగింది.

తల్లి తల తిప్పి చూసి తిరిగి టీవీ చూస్తూంది.

“అవును. కానీ… మరి… నువ్వు ఇలా అయిపోయావేమిటి?”

“గుర్తుందా నన్నెప్పుడూ ఎగతాళి చేసేదానివి? చప్పిడి ముక్కనీ, చిన్న కళ్ళనీ? నేనెప్పుడూ నీ అంత అందంగా కావాలనుకునేదాన్ని. అప్పట్నుంచీ గొడవ పెడితే ఈ మధ్యే వొప్పుకున్నారు డాడీ. ఇప్పుడు బాగా చవకా, తేలికా అయ్యింది కదా! ఒక్కోటీ మార్చుకుంటూ. ముందు ముక్కూ, తర్వాత వరసగా దవడలూ, నుదురూ, పెదాలూ, పళ్ళూ, కళ్ళూ, చెవులూ,వొంటి రంగూ… ఇప్పుడు అచ్చం నేను కూడా డీబీ లానే ఉన్నా కదూ!” ముఖాన్ని తడుముకుంటూ చెప్పింది ఆ అమ్మాయి.

కొద్దిసేపు తేరిపార చూసి చెప్పింది “అవును అందుకే గుర్తు పట్టలేదు. మరి ఇక్కడికెందుకు..”

“మొదట్లో బాగానే ఉండేది. నీలా ఏడిపించిన వాళ్ళకి చూపించుకుని వాళ్ళు లోలోపల కుళ్ళుకుంటుంటే నవ్వుకునేదాన్ని. తర్వాత నాది కాని ఎవరిదో మొహం తగిలించుకున్న భావన. ఏదో పరకాయ ప్రవేశం చేసినట్టు ఇప్పుడు ఎలాగోలా బయటపడాలనిపిస్తుంది. ఐ మిస్ మైసెల్ఫ్ సత్యా!”

ఏదో అనబోయి ఆ అమ్మాయి కళ్ళ నీళ్ళు తుడుచుకుంటుంటే ఆగింది.

“నన్ను ఎవరూ గుర్తు పట్టరు. ఇదుగో నా ఫొటో పర్స్‌లో పెట్టుకు తిరుగుతుంటాను.” తీసి చూపించింది.

చూసి ఆ అమ్మాయి వంకకేసి మార్చి చూసింది. “నువ్వు నాకు తెలియదు, నీనూ నీకు తెలియను. మేము అశోక్‌నగర్‌లో ఉన్న మాట నిజమే కానీ నా పేరు సత్య కాదు.”

వాళ్ళమ్మ సర్ది చెప్పింది “ఏ డీబీని చూసినా ఆ సత్యే అనుకుంటుంది.”

“కనీసం నీకు నీ ఫొటో అయినా ఉంది.” చెపుతూండగానే నర్స్ వచ్చి పిలిచింది.


తెర మీద దృశ్యాలు మారుతున్నాయి నెమ్మదిగా. ఒక పసిపాప యువతిగా, ఇంకో పసిబిడ్డ యువకుడిగా ఎదుగుతున్నారు.

“జాగ్రత్తగా గమనించండి. ఈ పిల్లల్ని మించి అందంగా ఉన్న ఎవరినైనా చూశారా ఎప్పుడైనా ఎక్కడైనా?”

జవాబు కూడా చెప్పకుండా కళ్ళప్పగించి చూస్తున్న వారిద్దరి వంకా చూస్తూ చెపుతూంది అలవాటయిన మాటల్ని. “ఎవరూ వంక పెట్టలేని, తల తిప్పుకోలేని పరమోత్తమ సౌందర్యం. పర్‌ఫెక్ట్ బ్యూటీ. ఇది మామూలు సౌందర్యం కాదు. ఎంతో మంది శాస్త్రవేత్తలు ఎన్నో రోజులు శ్రమించి, ఎంతో సమాచారం సేకరించి, పరిశీలించి, పరిశోధించి చివరికి తేల్చి చెప్పిన ముఖ కవళికలతో, కొలతలతో చేయబడిన మూస ఇది. ప్రపంచంలో ఏ జాతిలోనూ ఇంతకు మించిన సౌందర్యం లేదన్నది ఇప్పుడు అందరూ వొప్పుకుంటున్న నిజం. ఇది మేకప్ వేసిన మొహం కాదు. ఈ మొహానికి మేకప్ అవసరమే లేదు.”

వాళ్ళు తనవైపు చూసిందాకా ఆగి మళ్ళీ మొదలెట్టింది. “జీన్ మోడిఫికేషన్ అద్భుతాన్ని దీనికి జోడిస్తే మీ పాపా ఇంత అందంగా పుడుతుంది. ఎదిగేప్పుడు ప్రతి వయసులో ఖచ్చితంగా మీరు ఇంతకుముందు చూసినట్టే, అంత అందంగానే ఉంటుందని మా హామీ. రేపు మీ పాప తన చుట్టూ ఉన్న ఇంత అందమైన వాళ్ళని చూసి తనూ అలా లేనందుకు కుంగిపోకుండా ఇప్పుడే జాగ్రత్త పడండి.”

“కానీ మా పోలికలు లేకుండా పుడితే మా బిడ్డ అనిపించదు కదా?”

“మీ తెలివితేటలతో సంబంధం లేకుండా మీ కంటే మీ పిల్లలు తెలివిగా పుట్టాలనుకోవడం లేదా? ఇదీ అలాగే! అదీ కాక పిల్లల రూపాన్ని మాత్రమే మార్చడం మేము చేసే పని. చట్ట ప్రకారం వాళ్ళ బుద్ధికి చెందిన ఏ జీన్‌నూ ఏ మాత్రమూ మార్చకూడదు. వాళ్ళ స్వభావాలూ, మనస్తత్వాలూ, నడవడికా, తెలివి తేటలూ అన్నీ మీవే వస్తాయి. పైగా మీలాగా మెడ వోరగా పెట్టి కళ్ళు చికిలించడమో, లేక మీలా నుదురు ముడివేయడమో లాంటి అలవాట్లు ఎటూ వస్తాయి.”

ఆలోచనల నిశ్శబ్దం.

“బలవంతమేమీ లేదు. నిజమే, ఫీజ్ కొంచెం ఎక్కువే. కానీ ఇంత గొప్ప అవకాశం అందుబాటులో ఉన్నప్పుడు ఎవరు వదులుకుంటారు? తాహతు గల వాళ్ళు ఇప్పటికే ఇద్దరేసి పిల్లలకి ఆర్డర్స్ ఇచ్చారు.”

“ఆ ప్రొసీజర్ అదీ”

“మామూలే. మీ స్పెర్మ్, ఎగ్ తీసుకుంటాం. యిన్‌విట్రో ఫర్టిలైజషన్ కాగానే జీన్ మోడిఫికేషన్ జరుగుతుంది. మీరు కనాలనుకుంటే సరే, లేదా సరొగేట్ తల్లులయినా సిద్ధంగా ఉన్నారు. తేలిక వాయిదాల పద్ధతి మీద ఋణసాయం మేమే చేస్తాము. అప్పు ఇక్కడ తీసుకుంటే పిల్లలకి ఐడీ చిప్ ఉచితం కూడా.”

“డిస్కవుంటేమయినా ఇవ్వరా?”

నవ్వుతూ చెప్పిండి. “లేదు. మీ బిడ్డ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి.”


“మచ్చ వూరికే మాసిపోతుంది. బెంగ పడక్కర్లేదు. కానీ ఇది మూడో సారి కదా? రెండు సార్లు వాతలు, ఒకసారి చాకు. మీరేమీ చేయకపోతే ఎట్లా?” డాక్టర్ చెంప మీద మానుపడుతున్న గాయాన్ని దగ్గర నుంచి చూస్తూ అడిగాడు.

“నెత్తీ నోరూ బాదుకుని చెపుతూనే ఉన్నాం దానికి. ఇంకా ఏం చేయమంటారు? ఇక్కడికి రావడానికే ఎంత గొడవ చేసిందో ఈ రోజు! ఎందుకిలా చేస్తూంది? దీనిలా ఇందరున్నారు, అందరూ ఇలా చేస్తున్నారా?” జీరపోతున్న గొంతుతో తల్లి అడిగింది.

“టీనేజ్ ట్రబుల్స్.. ఇలాటి కేసులు చాలానే వస్తుంటాయి మాకు. ఇంతకు ముందు చెప్పా గదా ఒకసారి సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళమని. ఇంకా నిర్లక్ష్యం చేయొద్దు.”

“ఏమయినా ఉంటే ఇది మాకు చెప్పొచ్చు గదా? మేం శత్రువులమా?” తల్లి చెమర్చిన కళ్ళను పక్కకి తిప్పుకుంటే తండ్రి చెప్పాడు “ఈ సారి వెళతాం తప్పకుండా! ఆయన పేరు చెప్పండి మళ్ళీ..”

ఇదేమీ వినకుండా మచ్చను తడుముకుంటూ, కిటికీ అద్దంలో కనపడీ కనపడని తన ప్రతిబింబాన్ని కళ్ళప్పగించి చూసుకుంటూ ఉంది.


చెంప మీదుగా కట్టుతో కూచుని ఉంది.

“ఏమయింది మళ్ళీ?” సైకాలజిస్ట్ అడిగాడు.

“మీరు చెప్పినట్టే చేశాం. అప్పుడు పెట్టుకున్న చాకు గాటు అలాగే ఉండనిచ్చాం” తండ్రి చెప్పాడు.

“మంచి నిర్ణయమే అది. మరి ఇప్పుడేమయింది?”

“మొన్న మళ్ళీ కోసుకుంది.” తల్లి కళ్ళ నీళ్ళు నింపుకుంటూ చెప్పింది.

అతను తేరుకుని “మీరు కాస్త బయటకు వెళ్ళండి” అని చెప్తే వెళ్ళారు. దగ్గరగా వెళ్ళి అడిగాడు. “మనం దీని గురించి మాట్లాడుకున్నాము గదా? నీక్కావలసింది కేవలం ఒక్క మచ్చ అని చెప్పావు గుర్తుందా? మళ్ళీ ఇదంతా ఏమిటి?”

బదుల్లేదు.

అలాగే జవాబు కోసం నిలుచుని చూస్తుంటే పక్క చూపులు చూస్తూ చెప్పింది. ” ఇప్పుడు వాళ్ళంతా నాలాగా చాకుతో గాటు పెట్టుకుని మచ్చ చేసుకున్నారు. నాకు రెండు మచ్చలు కావాలి”


తెర మీద దృశ్యాలు మారుతున్నాయి నెమ్మదిగా. ఒక సగంలో బొమ్మ స్థిరంగా ఉండి, రెండో సగంలో అదే బొమ్మ కొద్ది తేడాలతో మారుతూ ఉంది.

“ఎడం వైపున్నది మా మొదటి వర్షన్ మూస. పర్‌ఫెక్ట్ బ్యూటీ. చాలా విజయవంతమయింది కానీ కొన్ని కాంప్లికేషన్స్ వచ్చిన మాట వాస్తవం. సెకండ్ వర్షన్ ఈజ్ బెటర్‌ దేన్ పర్‌ఫెక్ట్. ఈ వెర్షన్‌లోనూ అదే మూస వాడినప్పటికీ కొద్ది మార్పులూ చేర్పులూ ఉండేలా జాగ్రత్త తీసుకుంటాము. ఏ వొక్క బేబీ మరోలా ఉండదని మా హామీ. దేని ప్రత్యేకత దానిదే.”

“మార్పు అంటే?”

“చిన్న లోటు. ముక్కు కొద్దిగా పొట్టిగా, లేక పొడుగ్గా, పెదాలు కొద్దిగా సన్నగా, కళ్ళు కొంచెం చిన్నగా… ఆ ఛాయిస్ మీదే.”

“ఇంత డబ్బు పెడుతున్నప్పుడు మళ్ళీ ఆ కొద్ది లోటూ ఎందుకు? అందరికీ ఎటూ కొంచెం తేడాగా ఉన్న బేబీని డిజైన్ చేస్తున్నప్పుడు ఆ పర్‌ఫెక్ట్ బేబీని మాకోసం చేయొచ్చు గదా? ఎంత డబ్బయినా ఫర్వాలేదు.”



రచయిత చంద్ర కన్నెగంటి గురించి: జననం గుంటూరు జిల్లా సౌపాడులో. నివాసం గ్రేప్‌వైన్‌, టెక్సస్‌లో. సాఫ్ట్‌వేర్‌ రంగంలో పనిచేస్తున్నారు. కథలు, కవితలు వివిధ పత్రికల్లో అచ్చయ్యాయి. కథనంలో శిల్పంలో వీరు చూపించే విభిన్నత అపూర్వం.  ...