మాయం

చూడవలసిన పేషెంట్లంతా అయిపోయారు. ఇన్‌పేషెంట్లలో మళ్ళీ చూడవలసినవారెవరూ లేరు. తీసుకోవలసిన జాగ్రత్తలేవో తెలుసుకుని కాంపౌండరూ, నర్సూ గదులవైపు వెళ్ళిపోయారు. మరుసటిరోజు చేయవలసిన పనుల గురించి పేడ్‌ మీద నోట్‌ చేసుకుని క్లబ్బుకు బయలుదేరబోతుండగా వచ్చాడు శ్రీనివాసరావు “నమస్కారం సార్‌” అంటూ.

మనిషి కొంచెం ఆందోళనగా ఉన్నట్టు కనిపించాడు. అతడు పేషెంట్‌గా నాదగ్గరికెప్పుడూ రాలేదు. ఎక్కడన్నా కనపడితే అవసరం లేదనుకుంటే గుర్తు పట్టనట్టు మొహం పక్కకి తిప్పుకు వెళ్ళిపోదగిన పరిచయం. ఆ మధ్య నేను అడపాదడపా రాసిన కథలో డజను దాకా ఉంటే ఓ పుస్తకంగా అచ్చేశాను. దాన్నే నాలుగయిదు సార్లు ఊళ్ళో వాళ్ళూ వీళ్ళూ వచ్చినప్పుడు జరిగిన సభల్లో రిలీజ్‌ చేయించాను. ఆ సందర్భంలో ఒకసారి మా పనివాడు రావడం ఆలస్యమయినప్పుడు పుస్తకల డబ్బాలు అటూ ఇటూ మోశాడు. అతడేం చేస్తుంటాడో కూడా నాకు తెలియదు. ఏదో గవర్నమెంటాఫీసులో పని చేస్తున్నాడని తప్ప.  ఒక స్థాయి వాళ్ళం కాకపోవడం వల్ల ఎక్కువగా కలిసే అవకాశం లేదు. ఎక్కడన్నా సాహితీ సభల్లో కలిసినా సాహిత్యం గురించి తప్ప మాట్లాడే వాడు కాదు.

పలకరించి కూర్చోమని చెప్పాను.

“ఒక సమస్య వచ్చి పడింది సార్‌!”

గొంతులో దిగులూ, తటపటాయింపూ. అనుమానమేసింది. “ఏమిటీ ఏదన్నా సుఖవ్యాధికి సంబంధించిన సమస్యా?” అడిగాక అయ్యో అనిపించింది. అతడు అటువంటి వాటి జోలికెళ్ళే మనిషి కాదని తెలుస్తూనే ఉంది.

“ఛీ, కాదు సార్‌” అదైతే ఇంత బాధ ఉండకపోవునన్న ఫీలింగ్‌ మొహంలో. “నాకేదో అయినట్లుందండీ!”

“చెప్పండి! వ్యాధి లక్షణాలు తెలిస్తే గానీ వైద్యం చేయడం కుదరదు కద!”

“నా వొంట్లో నెత్తురు లేదు!” రహస్యం చెపుతున్నట్టు గుసగుసగా అన్నాడు. రక్తహీనత వల్ల వచ్చిన నీరసమేమో మరి. మనిషి బక్కగా ఉన్నప్పటికీ అంత ఎనీమిక్‌గా కనపడటం లేదు.

“ఆకు కూరలూ అవీ ఎక్కువ తినండి. అవసరమనుకుంటే విటమిన్స్‌ తీసుకోండి!” అప్పుడు తట్టింది అప్పు అడగడానికి వచ్చి మొహమాటపడుతున్నాడేమోనని.

“అది కాదు సార్‌! నా వొంట్లో అసలు నెత్తురు లేదు!”

నాక్కొంచెం చిరాకేసింది. రక్తం ఎక్కించమంటాడా ఏమిటి ఇప్పుడు? “మనిషి వొంట్లో అయిదు లీటర్ల దాకా రక్తం ఉంటుంది. ఎక్కడన్నా గాయమయ్యో లేక ఇతరత్రానో ఎక్కువ రక్తస్రావమయినప్పుడు అవసరమనిపిస్తే రక్తం ఎక్కిస్తాము. మీరు చూడబోతే ఆరోగ్యంగానే ఉన్నట్టున్నారు. రక్తం తక్కువయిందని ఎందుకనుకుంటున్నారు? ఊరికే ఎక్కువ రక్తం ఎక్కించడంవల్ల మీకు కలిగే ప్రయోజనమేమీ లేదు.” కొంచెం గట్టిగానే చెప్పాను. అవతల నాకోసం మా పేకాట బృందం ఎదురు చూస్తూంటుంది.

“ఒక గుండు సూది ఇవ్వండి!”

“ఎందుకు?” అంటూనే తీసి ఇచ్చాను. అక్కడ వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు గానీ ఆట మాత్రం మొదలు పెట్టకుండా ఉండరు.

తీసుకుని ఎడమ చూపుడువేలు నాముందుకు సాచి కసుక్కున గుచ్చుకున్నాడు. నెమ్మదిగా ఊరుతూ, బొట్టులా పైకి తేలుతూ రక్తం ….రాలేదు. ఒక క్షణం ఆశ్చర్యం. మరుక్షణం తేరుకుని “ఇటివ్వండి!” అని గుండు సూదిని అందుకుని ఉంగరం వేలిమీద పొడిచాను. చర్మాన్ని చీల్చుకుని దిగటం తెలుస్తూంది. రక్తం జాడలేదు. నా బొటనవేలూ చూపుడువేలూ మధ్య అతని వేలును గట్టిగా నొక్కినా ఎర్రగా ఆనవాలుకూడా కనపడలేదు. నా కళ్ళమీదే అపనమ్మకం. పెద్ద లైట్‌ వేసి ఫాన్‌ స్పీడు పెంచాను. ఆ వేళ్ళను ఎంత పిండినా ఏం రాలేదు. ఒక బ్లేడ్‌ తీసి “మీకేం అభ్యంతరం లేదు కదా?” అంటూనే ఒక చిన్న గాటు పెట్టాను వేలిమీద. లేదు. గాటు మాత్రం పింక్‌గా. ఏమయింది? వొంట్లో వొక్క చుక్క కూడా రక్తం లేకపోవడమేమిటి? అసలు రక్తం లేకుండా మనిషి బతికి ఉండటం ఎలా సాధ్యం? అందులోనూ మామూలుగా ఊపిరి పీలుస్తూ, మాట్లాడుతూ. ఎక్కడా దీన్ని గురించి చదివిన గుర్తు లేదు. ఎక్కడో ఏదో తిరకాసుంది.

కాలి మీదా, వీపు మీదా ఇంకో రెండు గాట్లు. పెద్ద పజిల్‌. రక్తమంతా ఎట్లా మాయమయింది? ఎవరికీ తెలియని కొత్త జబ్బా ఇది? సొరుగులోంచి నా పరికరాలన్నీ బయటికి తీశాను. బ్లడ్‌ ప్రెజర్‌. కదలిక లేదు. గుండె చప్పుడు. నార్మల్. రక్తాన్ని పంప్‌ చేసే గుండె ఖాళీగా కొట్టుకుంటూ ఏం పని చేస్తుంది? నాకు మతి పోతూంది.

ఇది కథ అయితే ఎవరి కథ? ఇది తిరిగే మహత్తరమైన మలుపులు ఏమిటి? నువు ఇంటికెళ్ళి అన్నం తిని పడుకుంటావు. నేను క్లబ్బుకెళ్ళి పేకాడుకుంటాను. అసలు ముగింపు ఏమిటి ఈకథకి? ఇంతకీ ఇందులో చెప్పుకోవలసిన నీతి ఏముంది? సామాజిక స్పృహా, మనస్తత్వ పరిశీలనా ఏమన్నా కనిపిస్తున్నాయా నీకు? ఎవరైనా ఇందులో నిరూపించదగిన రాజకీయ, సాంఘిక, ఆర్థిక సిద్ధాంతాలేమున్నాయి? నీకథలోంచి పిండుకోదగ్గ జీవిత సూత్రమేముంది?

“ఎప్పటినుంచీ ఇది? ఎప్పుడు గమనించారు?”

“రెండు వారాలయిందనుకుంటాను. పొద్దున్నే గడ్డం గీసుకుంటూంటే తెగింది. తోలు లేచినట్లు కనిపిస్తోంది కానీ నెత్తురు మాత్రం రాలేదు. అప్పట్నుంచీ అనుమానమేసింది కానీ పెద్ద పట్టించుకోలేదు. మొన్న కాల్లో గాజుపెంకు దిగింది. ఒక్క చుక్క నెత్తురు రాలేదు.” కాలు పైకెత్తి చూపించాడు. గాయం మానుపడుతోంది.

“నొప్పి? నొప్పేసిందా అది గుచ్చుకున్నప్పుడు? ఇందాక నేను గాటు పెట్టినప్పుడు?” ఆత్రంగా అడిగాను.

“వేసినట్లే ఉంది. లేక అలవాటు మూలాన వేసినట్లనిపించిందేమో!”

ఇది నిజం కాదు, కలేమో? ఎడమచేతి మీద గిల్లి చూసుకున్నాను. నొప్పి తెలుస్తూంది.

“ఇది కల కాదు సార్‌! నేను కూడా గిల్లి చూసుకున్నాను.” ఎర్రబడ్డ నా చేతివంక చూస్తూ చెప్పాడు.

“కల్లో మాత్రం గిల్లుకుంటే నొప్పి తెలియదని రూలేముంది? నువ్వెప్పుడన్నా కల్లో గిల్లి చూసుకున్నావా?” ఇది కల అని తేలిపోతే బావుండుననిపిస్తోంది. సమస్య సులభంగా తీరిపోతుంది.

“నొప్పి తెలిస్తే మేలుకుంటాము కద సార్‌?”

“నువ్వెప్పుడన్నా కల్లో ఇది కలేమో అనుకుని గిల్లి చూసుకుని లేచికూచున్నావా?”

“అసలు కల అయితే ఇది కల అని అనుమానమే రాదనుకుంటాను సార్‌!”

వొంట్లో ఒక్క చుక్క రక్తం లేకుండా ఇతడిట్లా మాట్లాడుతూ నా ఎదురుగా కూర్చోవడం ప్రకృతి ధర్మానికే విరుద్ధం. ఇది భరించలేకపోతున్నాను. ఇంతకంటే అసహజమూ, అసంబద్ధమూ ఉండబోదు. ఏం చేయాలో నాకు పాలుబోవడంలేదు.

అతడు ఆంధ్రదేశమయ్యుండొచ్చు. తాగడానికి చుక్క నీళ్ళు లేని కరువు. ఏదో పనిచేస్తున్నట్టు పోజు కొట్టే ప్రభుత్వం గుండెకాయ.

“నాక్కూడా ఇదంతా నిజం కాదనే అనిపిస్తుంది సార్‌! ఇది దేనికన్నా మెటఫర్‌ ఏమో? కాదూ సెటైర్‌ అయినా కావచ్చు!”

రక్తమే కాదు, ఇతని మతి కూడా పోతున్నదనిపిస్తూంది. “మీరేదో అలంకారోక్తుల్లోకి దిగినట్లున్నారు. అసలు ఈ రక్తం పోయిన పరిస్థితుల్లో మీరు ఇట్లాంటి అలోచనలన్నీ మానుకుని విశ్రాంతి తీసుకోవడం మంచిదని నా నమ్మకం!” ఇప్పుడంతకంటే చేయదగిందేమీ లేదు. మనిషి ప్రాణాపాయస్థితిలో మాత్రం లేడు. హాస్పిటల్లో అబ్జర్వేషన్‌ లో పెట్టొచ్చుకానీ ఇతడు డబ్బులు ఇచ్చే రకంగా లేడు. పైగా రక్తం పిండుకుని అమ్మేసుకున్నాడని నా మీద అపవాదు వచ్చినా రావచ్చు.

“అది కాదు సార్‌ ఇదంతా ఒక కథేమో, మనం అందులో కేవలం పాత్రలమేమో? నా వొంట్లో నెత్తురు మాయమవటం దేనికయినా సింబలయి ఉండొచ్చు!”

“పిల్లలెంతమంది నీకు?”

“ముగ్గురండి. ఒక అమ్మాయి, ఇద్దరబ్బాయిలు.”

మట్టి కూజాలోంచి గ్లాసులోకి నీళ్ళు వంచి ఇస్తూ “తాగు!” అన్నాను.

ఏం మాట్లాడకుండా తాగాడు. అనవసరంగా ఒక దగ్గు దగ్గి “బయట రోడ్డు మీద ట్రాఫిక్‌ శబ్దాలు వినిపిస్తున్నాయా?” అని అడిగాను. అవునంటూ తలూపాడు అర్థం కానట్టు పెట్టిన మొహంతోటే. “ఆ కుండీలో చేమంతి మొక్క ఉంది చూడు!” అటు తిరిగి చూశాడు.

అప్పుడు నవ్వి చెప్పాను “ఇది కథ అయ్యే అవకాశమే లేదు. ఇది కథ అయితే ఇప్పుడు జరిగిన ఈ అనవసరపు విషయాలన్నీ ఎట్లా చోటు చేసుకుంటాయి?” వైద్యుడిగా ఈ కొత్త రోగం  గురించి నాకేమీ తెలియదు కానీ రచయితగా నాకు కథల గురించి ప్రాథమిక సూత్రాలు తెలుసు. ఆ ఉత్సాహంతోటే చెప్పానింకా “ఇది కథ అయితే ఎవరి కథ? నీదా, నాదా? ఇది తిరిగే మహత్తరమైన మలుపులు ఏమిటి? నువు ఇంటికెళ్ళి అన్నం తిని పడుకుంటావు. నేను క్లబ్బుకెళ్ళి పేకాడుకుంటాను. కొసమెరుపు ముగింపు సంగతి వొదిలెయ్‌ అసలు ముగింపు ఏమిటి ఈకథకి? ఇంతకీ ఇందులో చెప్పుకోవలసిన నీతి ఏముంది? సామాజిక స్పృహా, మనస్తత్వ పరిశీలనా ఏమన్నా కనిపిస్తున్నాయా నీకు? ఎవరైనా ఇందులో నిరూపించదగిన రాజకీయ, సాంఘిక, ఆర్థిక సిద్ధాంతాలేమున్నాయి? నీకథలోంచి పిండుకోదగ్గ జీవిత సూత్రమేముంది? అసలు రక్తమే లేక ఏడుస్తుంటే..” నా జోక్‌కి నవ్వలేదతను. ఆశ్చర్యమేముంది రక్తం లేకపోవడంలో? పనిపడి వచ్చినప్పుడు అవతలివాళ్ళని పొగడకపోయినా కనీసం జోకులకి నవ్వాలని తెలీదా? నాకతని మీద ఆసక్తి కొంచెం తగ్గుతున్నట్లనిపిస్తూంది. కానీ ఇది కథ కాదు అని ఇంకా నాకే నచ్చచెప్పుకోవాలనిపిస్తూంది. “ఆకలీ, ఆలోచనా, జ్ఞాపకమూ, నీడా, తలా లేని మనుషుల గురించి కథలు చదివాను కానీ రక్తం లేని మనిషి ఏమిటి? దీనికి అర్థమూ పర్థమూ ఏమన్నా ఉన్నాయా?”

అతడు కన్విన్స్‌ అయినట్టే కనిపించాడు. “మీరు చెప్పేదంతా నిజమే! కనీసం కథ అయి ఉంటే ఇది ఎలాగోలా ముగుస్తుందనే ఆశా, నమ్మకమూ ఉండేవి.” దిగులుగా అన్నాడు.

“ఇప్పుడు మనం చేయదగిందేమీ లేదు. అసలు మీకు వేరే ఏ ఇబ్బందీ లేకపోతే కంగారు పడవలసిన పనికూడా లేదు. దీంట్లో ఉండే సౌకర్యం చూడండి. మీకిక బీపీ ఎప్పటికీ రాదు. బీపీ ఏమిటి హార్ట్‌ ఎటాక్‌.. అబ్బ తలుచుకుంటే ఇది ఇంకా ఇంటరెస్టింగ్‌ గా ఉండేట్లుంది.. ”

అతడీ పాజిటివ్‌ సైడ్‌ చూడటానికి ఇష్టపడుతున్నట్లు లేదు. “మీరేదయినా చెపుతారేమోనని వచ్చాను సార్‌!”

నాలో వైద్యుడి మీద ఆశపెట్టుకుని వచ్చాడో, కథకుడిగా అతడి కథను ఏ మలుపయినా తిప్పుతాననుకుని వచ్చాడో తెలియలేదు. ఏ మందూ ప్రిస్క్రైబ్‌ చేయలేను. ఎప్పుడయినా ఏదో కథలో ఇరికించవచ్చేమో!

“సరే వస్తాను సార్‌! థాంక్స్‌!” అంటూ లేచాడతడు నమస్కరిస్తూ.

గుమ్మం దాటబోతుంటే పిలిచాను. “అప్పుడప్పుడూ వచ్చి కలుస్తూండు. ఈలోగా నా ఫ్రండ్స్‌ తో కూడా మాట్లాడి చూస్తాను.”

“తప్పకుండా వస్తాను సార్‌” అంటూనే వెళ్ళిపోయాడు. నేను క్లబ్బుకి హడావుడిగా బయలుదేరాను. డ్రైవ్‌ చేస్తున్నానన్న మాటేగానీ మనసు మనసులో లేదు. నా వైద్యశాస్త్రానికి అతడు కంట్లో నలుసు, ఆ చట్రంలో ఒదగడు. పోనీ అతడన్నట్టు ఇదంతా కథ అనుకోవడానికీ వీలు లేదు. పొద్దున నేను చూసిన పేషెంట్లూ, ఇంటి దగ్గర నా భార్యా పిల్లలూ అంతా ఈ కథలోకి ఎందుకొస్తారు? లేక అదంతా కేవలం నా జ్ఞాపకాల్లో భాగమేనా?

క్లబ్బులో మా టేబుల్‌ దగ్గర మిత్రులు నలుగురూ ఆటలో మునిగి ఉన్నారు.

“ఏమిటి ఇంత ఆలస్యం? మొహమట్లా ఉందేం, ఏదయినా సీరియస్‌ కేసా?” గోపాలం అడిగాడు కార్డు పడేస్తూ. అతడూ డాక్టరే.

“వొట్టి సీరియస్సేమిటి, చెబితే నమ్మరు!”

“నమ్మకపోయినా చెప్పకుండా ఊరుకోవుగదా, చెప్పు!” ప్రసాద్‌ సిగరెట్‌ పొగ గుప్పుమని వదులుతూ అన్నాడు. రకరకాల బిజినెస్‌లు చేస్తుంటాడు అతడు.

“ఇవాళ ఒక పేషెంటొచ్చాడు. అతని వొంట్లో అసలు నెత్తురు లేదు.”

“దోమలు పీల్చేశాయేమో!” నవ్వుతూ అన్నాడు రవి. అతడూ డాక్టరే.

“జోక్కాదు. నిజంగానే అతని వొంటి మీద గాటు పెట్టినా ఒక్క చుక్క రక్తం రాలేదు.”

“ఇదేదో నువ్వు రాయబోయే దెయ్యం కథ లాగుంది. అతడు ఆల్రెడీ చచ్చిపోయుండాలి. అంతేనా?” విశ్వం ముక్క మూసి ఆట చూపిస్తూ అన్నాడు. అతడో లెక్చరర్‌.

“లేదు నేను సీరియస్‌గా చెపుతున్నాను. వొంట్లో ఒక్క చుక్క రక్తం లేకుండా అతనెట్లా ఊపిరి పీలుస్తూ బతికి ఉన్నాడో నా కర్థం కావడం లేదు.”

ప్రసాద్‌ పేక కలపటం ఆపి కింద పడేసి “ఎవరతను? ఎక్కడుంటాడు?” అనడిగాడు.

“శ్రీనివాసరావని అప్పుడప్పుడూ సాహితీసభల్లో కలుస్తూంటాడు చూశావో లేదో. రామా టాకీసు వెనక బజార్లో ఒకసారి డ్రాప్‌ చేసాను. అక్కడే ఉంటాడనుకుంటాను.”

కళ్ళు మూసుకుని “ఇది దేవుడి మహిమే, సందేహం లేదు. రాత్రే వెంకటేశ్వరస్వామి కల్లోకి కూడా వచ్చాడు.” అని లేచి “ఇప్పుడే వస్తాను.” అంటూ వెళ్ళిపోయాడు. ఎప్పుడూ ఏదో స్వామిని భుజాల మీద వేసుకుని తిరుగుతూ ఉంటాడు. ఒకళ్ళని వొదిలేసి ఇంకొకర్ని. మీటింగులూ, చందాలూ అందులో భక్తి ఎంతపాలో, వ్యాపారమెంత పాలో ఎవరికీ తెలియదు.

“మిరకిల్‌, ఒక మిరకిల్‌  కోసం చూస్తూంటాడెప్పుడూ మనవాడు!” విశ్వం నవ్వుతూ అన్నాడు.

“ఇంపాజిబుల్‌! ఏదో మేజిక్‌ ట్రిక్‌ చేసుంటాడు. నువు పడిపోయావు!” తేరుకుని అన్నాడు గోపాలం.

“నా చేతులతో నేనే గాట్లు పెట్టి చూశాను. బీపీ, హార్ట్‌ బీట్‌ చెక్‌ చేశాను. అతడు కూడా బాగానే వర్రీ అవుతున్నాడు”

“వైద్య శాస్త్రం వొప్పుకోదే?” రవి.

“వైద్యశాస్త్రమా, మీరా?” విశ్వం.

“వైద్యశాస్త్రం చదివిన మేమూ, మేం చదివిన వైద్యశాస్త్రమూ!” గోపాలం.

“మరి దీనికేం చెపుతారు?” విశ్వం.

“ఏం చెప్తాం? నాదగ్గరేం సమాధానం లేదు.” రవి.

“ఒక చట్రాన్ని ఏర్పర్చుకుని హాయిగా బతుకుతుంటాం. దాన్ని వదులు చేసుకుని అందులో అతడూ ఇమిడేటట్లన్నా చూసుకోవాలి. లేదా అతడి ఉనికినే వొప్పుకోకుండా ఉండాలి. ఏదో వొకటి జరిగిందాకా మనశ్శాంతి ఉండదు.” గోపాలం చెప్పాడు.

“నేనయితే ఇట్లాంటివి పెండింగ్‌లో పెట్టేస్తాను. రేపు మళ్ళీ మనవాడే వచ్చి నిన్న అందర్నీ భలే ఫూల్స్‌ చేశానుగదా అని వెక్కిరించొచ్చు కూడా కదా!”  విశ్వం అన్నాడు.

“నమ్మకపోతే నేను చేసేదేం లేదు. ఏదో ఒకటి తేలిందాకా నాకయితే నిదర పట్టదు.”

“దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలో తెలియటం లేదు. అయినా కళ్ళతో చూసిందాకా నేనూ నమ్మలేను” రవి.

“చూసినా నేనూ నమ్మలేకపోతున్నాను. అతననేదేమిటంటే ఇదంతా కథేమోనని. అతనో మెటఫర్‌ కావచ్చు లేదా ఇదంతా ఒక సెటైరో!”

“అది బాగుంది. అతడు ఆంధ్రదేశమయ్యుండొచ్చు. తాగడానికి చుక్క నీళ్ళు లేని కరువు. ఏదో పనిచేస్తున్నట్టు పోజు కొట్టే ప్రభుత్వం గుండెకాయ..” విశ్వం అన్నాడు.

“అతడికే తెలియకుండా అతని రక్తమంతా కాజేశారేమో! ప్రభుత్వమూ, అధికారులూ..” నవ్వుతూ గోపాలం అన్నాడు.

“ఉహుఁ  గ్లోబల్‌ కంపెనీలు వదిలేశావే? వొంట్లో చీమూ నెత్తురూ లేవా అని తిడుతూంటారు చూడూ, అట్లా సిగ్గు లేని మనిషేమో!” రవి కూడా నవ్వుతూ.

“మనుషుల్లో మాయమయిపోయిన మానవత్వం కూడా కావచ్చు. లైఫ్‌ ఈజ్‌ లూజింగ్‌ ఇట్స్‌ ఎసెన్స్‌” సీరియస్‌ గానే ఉన్నాడు విశ్వం ఇంకా.

“హాల్జ్‌మన్‌  ఇంక్‌బ్లాట్‌ గురించి తెలుసుగా! నువ్వేమిటో, నీక్కావల్సిందేమిటో నువ్వు చూస్తావు. నీ అర్థం నీది నా అర్థం నాది.” రవి అన్నాడు.

“ఇది సైన్స్‌ ఫిక్షన్‌ ఎందుకు కాకూడదు? ఎవల్యూషన్‌ లో ఇంకో మెట్టు కావచ్చుగా?” గోపాలం అన్నాడు.

వాళ్ళ మాటలు వింటూంటే భయం వేసింది. ఒక కథలో కూరుకుపోయి అక్కడే ఇరుక్కుపోయామా? కానీ కథ అయితే ముగుస్తుంది కదా?

“కథ అయితే దానికి ఇట్లా రకరకల అర్థాలు చెపుతూ ఎవరూ కూర్చోరు.” నేనన్నాను.

మాటల్లో ప్రసాద్‌ తిరిగి వచ్చాడు.

“ఏమిటి దొరికాడా?” రవి అడిగాడు.

నా వైపు తిరిగి చెప్పాడు ప్రసాద్‌ “నువు చెప్పింది నిజమే. కాకపోతే ఇప్పుడే ఏం చేయలేం. అతడు కాస్త గడ్డమూ మీసాలూ పెంచాలి. లేకపోతే లాభం లేదు.”

ఆ రాత్రి నాకు సరిగ్గా నిదర పట్టలేదు. మధ్య మధ్య ఉలిక్కి పడిలేవటం, ఇది కథ కాదని నిర్ధారించుకోవటంతో సరిపోయింది.

తర్వాత రెండు మూడు సార్లు హాస్పిటల్‌కి వచ్చి కనిపించాడు శ్రీనివాసరావు. గుండె కొట్టుకోవటం లేదని ఒకసారీ, ఆకలిదప్పులు లేవని ఒకసారీ. వొచ్చిన ప్రతిరాత్రీ నాకు నిదర పట్టేది కాదు. చివరిగా ఎప్పుడొచ్చాడో గుర్తు లేదు. అతడు హటాత్తుగా మాయమయిపోయాడనీ, అతడు చనిపోయాడని నిరూపించగలిగే ఆధారాలు లేక అతడి భార్య అతడి పెన్షన్‌ వచ్చే మార్గం గురించి నానా అగచాట్లూ పడుతుందనీ ప్రసాద్‌ ఒకసారి చెప్పాడు.  అంతా సక్రమంగా జరిగిపోతూంది. ఇది కథ అని అనుమానించదగిన కారణాలు కనబడలేదిక నాకు.


రచయిత చంద్ర కన్నెగంటి గురించి: జననం గుంటూరు జిల్లా సౌపాడులో. నివాసం గ్రేప్‌వైన్‌, టెక్సస్‌లో. సాఫ్ట్‌వేర్‌ రంగంలో పనిచేస్తున్నారు. కథలు, కవితలు వివిధ పత్రికల్లో అచ్చయ్యాయి. కథనంలో శిల్పంలో వీరు చూపించే విభిన్నత అపూర్వం.  ...