నో ఎగ్జిట్ .1

ఆమె తట్టీ, ఊపీ లేపుతుంటే కళ్ళు తెరిచాడతను.

“ఎవరు మీరు? నేనెక్కడున్నాను?” పక్కనే మోకాళ్ళపై కూచుని ఉన్న ఆమె వంక నుంచి తలతిప్పి చుట్టూ చూస్తూ, లేచి కూచుంటూ అడిగాడు. కింద మెత్తగా ఇసుక, ఒకవైపు నుంచి అలల చప్పుడు, సముద్రపు గాలీ, మబ్బుల వెనక సూర్యుడూ.

“ముందు మీరు చెప్పండి! ఇక్కడికి ఎట్లా వచ్చారు?”

“నాకేం తెలుసు? నా బెడ్ మీదే పడుకుని ఉన్నాను పుస్తకంలో ఏదో కథ చదువుతూ. ఏ వూరూ, ఏం బీచీ ఇది?” ఆమె తప్ప చుట్టుపక్కల ఇంకెవరూ కనపడడం లేదు. కొంచెం దూరంగా తలలూపుతూ కొబ్బరి చెట్లు.

“ఇంకెవరూ కనపడరేమిటి?”

“ఇంకెవరూ లేరు. నేనూ, మధూ. ఇది మా లోకం. ఇక్కడికి ఎట్లా వచ్చారో గుర్తు తెచ్చుకోండి ప్లీజ్!”

“మీ లోకమేమిటి పిచ్చిమాలోకంలా ఉన్నారు!” లేస్తూ అడిగాడు “దగ్గరలో బస్టాండ్ ఉందా ఏదయినా?”

“ఇక్కడ వెళ్ళడానికి ఏమీ లేదు. మేమిద్దరమూ ఇక్కడే ఇరుక్కుపోయాము. బయటపడే దారి లేదు.”

“ఏదో ప్రాంక్ చేస్తున్నట్టున్నారు. ఆ చెట్ల వెనక ఉన్నాడా కెమెరా వాడు?” అని నవ్వాడు.

“అర్థం కావడానికి టైం పడుతుందిలే! మొదట్లో మాకూ అంతే. పోయి చూసుకోండి, మీకే తెలుస్తుంది.”

ఆమె అక్కడే కూచుని ఉండిపోయింది. అతను బీచ్ దాటి ఆ చుట్టు పక్కల మనిషి జాడ లేని దారుల్లో తిరిగి తిరిగి వచ్చాడు.

ఆమె అక్కడే ఉంది.

“ఏమిటిదంతా? ఏమయ్యారంతా?” అడిగాడు.

“నాదే తప్పు. ఐ విష్‌డ్ ఫర్ ఇట్.” అని ఆగి అంది “నాదే తప్పు!”

“సరిగ్గా చెప్పండి!”

“చీకటి పడబోతూన్న ఆ సాయంత్రం గుర్తొస్తూనే ఉంటుంది. నేనూ మధూ కూచుని ఉన్నాం. గాలి హాయిగా చుట్టుకుంటూ ఉంది ఇష్టమైన పూల వాసనతో. ఏవో కబుర్లాడుకుంటూ ఉన్నాం. అలౌకిక స్థితి అంటారే అలా అనిపించింది. ఒకరికొకరం మేం ఉన్నాము, ఇంకెవరూ, ఇంకేమీ ఎప్పటికీ అక్కర్లేదనిపించే క్షణాలవి. మేమిద్దరం తప్ప వేరెవరూ లేని లోకం కావాలి అనుకున్నాను. అంత బలంగా కోరుకున్నానా, ఏమో తెలియదు. కళ్ళు తెరిచి చూస్తే ఇక్కడున్నాం. మేం తప్ప ఎవరూ లేరు.”

“నమ్మబుద్ధి కావడం లేదు. ఇది జరిగి ఎన్నాళ్ళయింది?”

“కొన్ని రోజులు లెక్కపెట్టాం. ఇప్పుడు తెలియదు. ఇప్పుడు మీరొచ్చారంటే బయటపడే దారీ ఉండాలి. అందుకే గుచ్చి గుచ్చి అడుగుతూంది మీరు ఎట్లా వచ్చారని.”

“ఇప్పుడు గుర్తు వస్తూంది. నేను చదువుతూన్న కథ మీదే అయి ఉండాలి. ఒక అందమైన సాయంత్రం ఆనందంలో మునిగి ఉన్న జంటలోని అమ్మాయి తామిద్దరూ తప్ప వేరెవేరూ లేని లోకం కావాలి అని కోరుకుంటుంది. మరుక్షణం వేరెవరూ లేని లోకంలో వాళ్ళు కళ్ళు తెరుస్తారు. అబ్సర్డ్, అట్లా ఎట్లా జరుగుతుంది, అసలు జరిగితే వాళ్ళిద్దరూ ఎట్లా బతుకుతూ ఉంటారు అని ఆలోచిస్తూ ఉన్నాను. తర్వాత ఇక్కడే కళ్ళు తెరవడం.”

“ఇక్కడికి రావడానికి అదే దారి అయితే ఈ పాటికి చాలామంది వచ్చి ఉండాలి ఈ పాటికి!”

“కథ ఇంకెవరూ చదివి ఉండరు. అయినా అదేం కోరిక?”

“ఆ క్షణానికి అలా అనుకుంటాం కానీ నిజంగా జరగాలని కోరుకుంటామా! ఇట్లా నిజమవుతుందని తెలిస్తే కోరుకోవడానికి ఎన్ని లేవు! మళ్ళీ మునుపటిలా కావాలని ఎన్నిసార్లో ఎంత బలంగానో అనుకున్నా. అయిందా? అయినా ఈ కోరికలో, వరాలో మూడు కదా తీరవలసింది?”

“మూడెందుకు? కోరిందల్లా తీరాలనే ఒక్క కోరిక చాలదా!” అని ఆగి అన్నాడు “మూడుసార్లు వరసగా అదే కోరితే మాత్రమే! పొరబాటున ఏదో కోరేసి ఇలా చిక్కుల్లో పడకుండా!”

“అయినా అనుకున్నట్టే అయిందిగా! సంతోషమేగదా?” ఆమె వంక చూస్తూ అడిగాడు కాసేపయ్యాక.

“మొదట్లో సరదాగా, హాయిగా ఉండేది. ఇన్నాళ్ళు ఇలా గడపవలసి వస్తుందనుకోలేదు. కొంత గాభరా పడినా ఎలాగో బయటపడే దారి ఉంటుందనే నమ్మకంతో ఉన్నాం. తర్వాత నా మూలానే ఇలా అయిందని తిట్లూ, నా ఏడుపులూ. నా గొడవ చెప్పుకోవడానికి మూడో మనిషి ఒక్కరన్నా ఉంటే బావుండుననుకునే… ఏమో అందుకే మీరు వచ్చారేమో!”

“మరి మూడో మనిషిని నేనొస్తే మీ మొదటి కోరిక తీరనట్టే కదా?”

“ఇదంతా ఎలా పని చేస్తుందో నాకేం తెలుసు? ఐ డోంట్ కేర్. మీరొచ్చారు. కనీసం ఇంకో తోడు. అందరూ గుర్తొస్తుంటారు. అమ్మా, నాన్నా, తమ్ముడూ. ఇంకెప్పటికీ వాళ్ళను చూడలేను. ఏడవడం తప్ప ఏం చేయలేను. ‘బయటపడు బయటపడు ‘ లోపలంతా ఒకటే రొదగా ఉంటుంది. మీకు తెలుసా ఎన్ని సార్లు చచ్చిపోదామనుకున్నానో! ఈ మధుగాడేమో నన్నొక్కదాన్నే వదిలేసి ఎటో తిరిగి తిరిగి ఎప్పటికో వస్తాడు. కొన్ని సార్లు కొన్ని రోజులపాటు మాట్లాడడు. ఒక్కోసారి వాడినీ చంపేయాలని అనిపించేది.”

“ఏమో, ఇప్పటికే చంపేశారేమో!”

“ఆఁ?”

“ఆ మధు ఎవరో అతన్ని ఇప్పటికే చంపేసి ఉంటారనుకుంటున్నా. లేకపోతే పొద్దుటినుంచీ కనపడకుండా ఎలా ఉంటాడు?”

“అడుగో, మాటల్లోనే వస్తున్నాడు.” దూరంగా చూస్తూ అంది. అతను ఆమె వైపే చూస్తూన్నాడు.

“ఏమిటి, అడుగో చూడు!”

“చూడను. నువ్వేం తిక్కలదానివో నాకేం తెలుసు! అటు చూడగానే నీ వెనక రాయి తీసుకుని నన్నూ కొట్టి చంపేస్తే?”

“ఇలా కూడా ఆలోచిస్తారా?” అతని వంక చూసి తల తిప్పుకుంది. అతనేం అనలేదు.

కొంత సమయం గడిచినా అక్కడికి ఎవరూ వస్తున్న అలికిడి వినపడలేదు.

ఉన్నట్టుండి ఆమె గుప్పిళ్ళ నిండా ఇసుక తీసుకుని అతని మీదికి విసురుతూ “ఐ డోంట్ వాంట్ టు ప్లే దిస్ గేమ్ ఎనీ మోర్. అయామ్ బోర్‌డ్ బోర్‌డ్ బోర్‌డ్. ఐ వాంట్ టు గెట్ అవుట్!” అంటూ అరుస్తూంది.

“సరే సరే, రేపు నువ్వే మూడో మనిషివి. ఊరుకో ఇక!” అతను ఆమె చేతులు పట్టుకుని ఆపుతూ ఊరుకోబెడుతూ.

రచయిత చంద్ర కన్నెగంటి గురించి: జననం గుంటూరు జిల్లా సౌపాడులో. నివాసం గ్రేప్‌వైన్‌, టెక్సస్‌లో. సాఫ్ట్‌వేర్‌ రంగంలో పనిచేస్తున్నారు. కథలు, కవితలు వివిధ పత్రికల్లో అచ్చయ్యాయి. కథనంలో శిల్పంలో వీరు చూపించే విభిన్నత అపూర్వం.  ...