అట్లా
ఆ నది ముందున్న చెట్టు మీద
వాన చినుకులా వాలిన పిట్ట
గాథాసప్తశతిలా ధ్వనిస్తోంది
కూత కూతకి గొంతు
సానబెట్టిన కత్తి అంచులా
మోగుతోంది
అరవగా అరవగా
పోగొట్టుకున్న జ్ఞాపకాల జాడలతో
ఆ స్వరంలో
దుఃఖపు జీర
ఏ పిట్టా
గొంతు కలపడం లేదు
పిట్ట వేదనకు
చెట్టు సాక్ష్యం
బాధితుడి భుజాన
ఏ మనిషీ చెయ్యి వేయనట్టు
పక్షి పాటకి
ఎవరూ శ్రుతి కలపరు.