ఫలితం

అప్పుడు
నువ్వూ నేను
చేలో చెట్టు కింద మాట్లాడుతూ ఉన్నప్పుడు
ఆశల్ని రాల్చిన చెట్టు

అటు వైపు తోట నుండి
పాట పాడుతూ వెళ్ళిన
సీతాకోకచిలుకల గుంపు
కూలికొచ్చిన పడుచు జంట
నవ్వులు నిమ్మ పూత మెరుపు

తడి తడిగా కబుర్లు చెప్పుకుంటూ
కదులుతున్న కాలువ నీళ్ళు
గెనం మీద పచ్చిక ఒడిలో
కునుకేసి కలలు కంటున్న మిడత
నా ఎత్తు ఎదిగిన చెరుకు తోటలో
ఎగిరి పోతున్న చిలకల జంట

ఆ చేలమీద నుండి
ఉదయాలు దాటిపోతాయి
సాయంత్రాలు ఎగిరిపోతాయి

పొద్దుపోయాకా
రాత్రుల్లోనూ
చీకటి వెలుగుల సంజెల్లోనూ
అక్కడ ఎవరి పంట వాళ్ళు పండించుకుంటూ
ఫలితం కోసం ఎదురుచూస్తుంటారు.