ఏరు

ఏరు మంచులో తడిసిపోయి ఉంది. నిమ్మళంగా వున్న నీటిని చూడగానే ఒళ్ళు జలదరించింది. చలి నా ఒంటిని గట్టిగా చుట్టేసుకుంది. చేతులను ఛాతీకి అడ్డంగా కట్టుకున్నాను.

“వేళ అవుతోంది” కాటి పూజారి, అన్నయ్యతో మెత్తని గొంతుతో చెప్పాడు.

అన్నయ్య పళ్ళు తోముకుని మిగిలిపోయిన మావిడి ఆకుల కొమ్మని అవతల పడేశాడు. వంగి నోరు పుక్కిలించి అదాటున నీటిలోకి దూకాడు. ఉన్నపళాన నిశ్శబ్దం చెదిరి, ఏరు అదిరిపడి నవ్వింది.

నేనూ నీటిలోకి దిగాను.

నీటి చల్లదనం నా కాళ్ళ నుంచి పైకి ఎగబాకింది.

ఒక్క క్షణం జంకాను. తర్వాత మెల్లగా తెగించి నీళ్ళల్లో కూర్చున్నాను. నడుము, ఛాతీ, ముఖమంతా మెల్లగా మెలిపెట్టి, పూర్తిగా పెనవేసి, ఊపిరాడకుండా చేస్తున్న చలి.

పైకొచ్చి తువ్వాలందుకుని తల తుడుచుకున్నాను. ఆ తువ్వాలును మళ్ళీ నీటిలో ముంచి పిండి నడుముకు కట్టుకున్నాను. తడి బట్టలు కట్టుకోవడం ఆచారం.

మనసు, ఒళ్ళు, బుద్ధీ చలికి గడ్డకట్టుకుపోయి నిశ్చేష్టమైనట్టు అనిపించింది. నీటి పైభాగంలో ఒక అరటి మట్ట తేలుతూ పోతోంది. కారణమేమీ లేకుండా దాన్ని వెంబడించాయి కళ్ళు. ఎందుకనో అది ఎర్ర అరటి (కెంకదలి) అని అనుకున్నాను.

పూజారి, సరంజామా ఉన్న పెట్టెను నెత్తిమీదకు ఎత్తుకున్నాడు. అన్నయ్య తడిబట్టల మీదే ఎర్ర తువ్వాలును కట్టుకున్నాడు. వాడి ముఖం చూసినప్పుడు నాకు లోలోపల చెప్పలేనంత భయం కలిగింది… బిగుసుకుపోయిన ముఖం, కళ్ళల్లో మెరుస్తోన్న చెమ్మ. పళ్ళు, పెదవులు కొరుక్కుంటున్నాడు.

మనసులో ఆవేదన పొంగుకొచ్చింది. వాడి దగ్గరకెళ్ళి భుజాన చేయి వేసి, ఓదార్పుగా ఏదైనా చెప్పాలి అనిపించింది.

“వెళ్దామా?”

పెదనాన్న, సోమన్ అన్నయ్య, ఊళ్ళోవాళ్ళు…

ఢమ ఢమ ఢమ ఢమ అంటూ గుండెలు అదిరేలా డప్పు మోత.

నడిచాం, నిశ్శబ్దాన్ని బరువుగా మోసుకుంటూ.

ఏటి ఒడ్డున పచ్చగా పరికి కంపచెట్ల కంచెను ఏర్పరచుకున్న శ్మశానం. తాతయ్య, పెద్ద పెదనాన్న, ఇంకా పేర్లు తెలియని మరెందరో బూడిదైన చోటు.

పెద్ద పెదనాన్నని చితిపై పెట్టిన చోట నాటిన ఆ మూరెడంత చిన్న కొబ్బరి మొక్క ఇప్పుడు చిన్న మానుగా ఎదిగి తన రెక్కలను గాల్లోకి పరచుకుని ఉంది. పెద్దగా ఎదిగిన మరెన్నో కొబ్బరి చెట్లు ఆకాశంలో గాలికి ఊగుతూ చప్పుడు చేస్తున్నాయి. కొత్త చెట్లకు చోటిచ్చి ఇక్కడ ఎన్నో చెట్లు మోడుబారిపోయాయి.

మద్ది చెట్టు కింద నిన్న రాత్రి కాలి బూడిదైన చితి. దీర్ఘచతురస్రాకారంలో ఉన్న గుంత. నల్లగా నోరు తెరుచుకుని ఉంది. నాలుగు వైపులా పచ్చని గడ్డి పరకలు, ఆకులూ చితి మంట వేడికి మాడిపోయున్నాయి.

ఆశ్చర్యకరంగా మనసు మామూలుగా – చాలా మామూలుగా – ఉంది. బాధా కాని, సంతోషమూ కాని ఒక శూన్యం.

ఎనిమిది నెలల క్రితం సెలవులు అయిపోయి తిరుగు ప్రయాణమవుతున్నప్పుడు అమ్మ వెనకే వచ్చింది. ముఖంలో నవ్వుంది కానీ ఇంకేదో దిగులు. నీళ్ళు తిరగడానికి సిద్ధంగా కళ్ళు. నా మనసు మొద్దుబారి అల్లాడిపోయింది.

నడిచి నాలుగడుగులు వేశాక వెనక్కి తిరిగి చూశాను. విరగ కాసిన కొబ్బరి చెట్టు కింద నిల్చుని ఉంది అమ్మ – గీసి వేలాడదీసిన చిత్రపటం లాగా. ఎర్రటి జాకెట్, తెల్లటి ముండు, విప్పారిన మెరిసే కళ్ళు…

పూజారి చెయ్యాల్సిన సంస్కారాలన్నిట్నీ తన ఇరవై ఏళ్ళ అనుభవంతో పద్ధతిగా చకచకా చేసుకుపోతున్నాడు.

వెలిసిపోయిన ఒక పాత బొమ్మపటంలా అక్కడి పరిసరాలు నా చుట్టూ విస్తరించాయి. డప్పు మోత ఎక్కడో మోగుతున్నట్టు వినిపించింది.

పూజారి ఒక పెంకు తీసుకుని గుంత లోపల నుండి కాలి బూడిదైపోయిన తెల్లటి ఎముకలను ఒక్కొక్కదాన్నీ లాఘవంగా ఒడిసిపట్టి తీసి కొత్తకుండ లోకి వేస్తున్నాడు.

నా కళ్ళ ముందు ఆ నల్లటి చితి గుంత, దానిలో నిండి ఉన్న బూడిద మాత్రమే ఉన్నాయి. నేపథ్యంలో డప్పు మోత భయంతో విలపిస్తున్నట్టు భోరుమంటోంది.

అమ్మ నుదుటి పైన జుట్టు ఇందిరాగాంధీకి లాగా నెరిసిపోయి ఉంటుంది. ఆమెకు యాభై ఐదు ఏళ్ళు అని చెప్పడానికి ఉన్న ఒకే ఆధారం అది. బక్కచిక్కినట్టు కనిపించినా గట్టి దేహం ఆమెది. ఏ పని చేయడానికీ జంకదు. వంట పనులన్నీ ముగించుకుని, రెండు ఆవులను చూసుకుంటూ, దొరికిన ఖాళీ సమయాల్లో సారా థామస్‌ను, తగళి శివశంకరన్ పిళ్ళైను చదివి, ఇరుగు పొరుగు అమ్మలక్కలకు ఆ కథలను ఆర్ధ్రతతో చెప్తుండేది.

అమ్మ చిన్నతనం నాటి ఫోటో లేదు. నాకు గుర్తున్న రోజు నుంచి ఆమె ఇలానే ఉంది అనిపిస్తుంది. అవే కళ్ళు. ఆమె మాట్లాడటం నవ్వడం అన్నీ వాటితోనే.

చిన్న పొమేరేనియన్‌లా వెంబడించిన ఆమె చూపే చివరి జ్ఞాపకం. టెలిగ్రామ్ వచ్చింది. రైలు అందుకుని వచ్చినప్పుడు నా ఇల్లు నాకు పరాయిదిగా అనిపించింది. అమ్మ ఒక పిడికెడు బూడిదగా మారిపోయింది. ఆమె నలుమూలలూ సందడిగా నడయాడుతూ ఎటు చూసినా తానే అయి కనిపించిన ఆ ఇల్లు ఇప్పుడు బంధువులతోను, నిశ్శబ్దంతోనూ మాత్రమే నిండివుంది.

ఎముకల్ని నింపి ఎర్రటి గుడ్డతో మూతి కట్టేసిన ఆ మట్టి కుండకు అరిటాకులో చుట్టి తెచ్చిన పూలమాలని వేస్తూ మిగిలిన సంస్కారాలను వేగంగా అలవోకగా చేసుకుపోతున్న పూజారి వేళ్ళకేసి చూస్తున్నాను.

పూజారి అన్నయ్యని కళ్ళతో పిలిచి పారను చేతికి ఇచ్చాడు. అది తీసుకుంటున్నప్పుడు అన్నయ్య చేతులు వణికాయి. ముఖాన్ని దుఃఖపు చాయలు కమ్మేసి ఉన్నాయి.

డప్పు మోత ఉన్నట్టుండి ఆకాశాన్ని అందుకుంది.

పారను ఎడం వైపు నుండి లాక్కుంటూ ప్రదక్షిణం చేసి వచ్చాడు. పొంగుకొస్తున్న దుఃఖాన్ని పెదవులను కొరికి దిగమింగుకుంటూ, మూడుసార్లు మట్టి తీసి గుంతలోకి వేశాడు.

పూజారి పార తీసుకొని గబగబా అటు ఇటు దోసేయడంతో క్షణాల్లో గుంత నిండిపోయింది. మరో రెండు క్షణాల్లో భూమినుండి పైకి ఉబికినట్టు పోసిన మట్టికుప్ప తయారయింది.

తనతో తెచ్చిన ఒక కొబ్బరి మొక్కను పూజారి అన్నయ్య చేతికి ఇచ్చాడు. డప్పు గొంతు మార్చి ‘ఢ్రుమ్ ఢ్రుమ్ ఢ్రుమ్ ఢ్రుమ్’ అని మోగింది. ఆ మట్టికుప్ప మీద అన్నయ్య కొబ్బరి మొక్కను నాటి, బిందెలోనుండి నీళ్ళు ముంచి పోసి, ఎడం వైపునుండి ప్రదక్షిణం చేసి వచ్చి దణ్ణం పెట్టుకున్నాడు. నేను, సోమన్ అన్నయ్య కూడా దణ్ణం పెట్టుకున్నాం.

సంప్రదాయ సంస్కారాలు కొనసాగుతూనే ఉన్నాయి. డప్పు శబ్దం ఆ ప్రాంతాన్నంతా అమంగళంగా మార్చేస్తూ ఉంది. చెట్ల కొమ్మల్లో పక్షులు భయపడుతూ రెక్కలల్లారుస్తున్నాయి.

అన్నయ్య బయటకు వినిపించేలా వెక్కి వెక్కి ఏడవసాగాడు. పూజారి కుండను అన్నయ్య నెత్తిమీద పెట్టుకోమని ఇచ్చాడు. మెల్లగా నడవసాగాము. డప్పు శబ్దం ఏడుపు శ్రుతిని అందుకుంది. మా ఊపిరిలో ఏడుపు కలిసిపోయింది. డప్పు శబ్దమే మా శ్వాసగా మారిపోయింది.

ఏటిగట్టు వెంటే ఇంటికి తిరిగి పోతూ ఉంటే పగలు మరింత వెలుతురును పులుముకోసాగింది మెల్లమెల్లగా.

ఇంటికి చేరేసరికి లోపల నుండి వేగంగా చిమ్ముకుంటూ వస్తున్నట్టు గుంపుగా శోకండాలు బయటకు వచ్చాయి. నా మనసు అదిరిపడుతోంది. ఆపుకోలేక నా చేతులు వణుకుతున్నాయి.

వాకిట్లో అలికి ముగ్గు పెట్టిన తెల్లటి వృత్తం మధ్యలో అన్నయ్య మట్టికుండను దించి పెట్టాడు. అరిటాకు, బుట్టలో వడ్లగింజలు, పళ్ళు, బెల్లం, పూలు, చెంబులో తులసి తీర్థం, దీపపు కుందు… ఆ దీపంలో ఏదో ఒక రకమైన అమంగళం చోటుచేసుకున్నట్టు ఉంది.

ఏడుపు ఒక తుఫానులా నన్ను చుట్టుముట్టేసింది. ఏం జరుగుతోందో తెలియక పిచ్చిపడుతున్నట్టు అనిపించే స్థితి…

ఆడవాళ్ళు ఒక్కొక్కరూ ప్రదక్షిణం చేసుకుంటూ వచ్చి, దక్షిణ, పూలు వేసి, పూజ చేసి, దణ్ణం పెట్టుకుని పక్కకు వెళ్తున్నారు.

అమ్మని తలచుకున్నప్పుడు మనసు ద్రవించింది… లోపల తుఫాను మెల్లగా సద్దుమణిగింది. అమ్మ ఉన్నప్పుడు ఆమెకు దూరంగా ఉన్నాను అన్న ఆలోచనే నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉండేది. అన్ని సంస్కారాలూ ముగించేసరికి సూరీడు నడిమింటికి చేరుకున్నాడు.

మళ్ళీ అన్నయ్య కుండను నెత్తిన పెట్టుకున్నాడు. భారమైన మనసుతో జరుగుతున్నదంతా నిజమేనా అని ఒక చిన్న ఆలోచన వచ్చింది.

ఎండలో ఏరు మెరుస్తూ ఉంది. చిన్న చిన్న అలలమీద పడిన ఎండ డాలు కళ్ళని తాకినప్పుడు కళ్ళు జిగేలుమన్నాయి.

నాకు చిన్నతనం నుండి పరిచయం, అలవాటు, చనువూ ఉన్న ఏరు ఇది. నా చిన్ననాటి స్నేహితురాలు. వర్షాకాలంలో ఆమె తెంపరితనం. రాత్రివేళల్లో ఆమె మౌనం. మంచుకాలపు వేకువ జాముల్లో ఆమె సిగ్గు. ఎంత దగ్గరది ఈ ఏరు నాకు!

నేడు ఈ ఏరు నాకు పరిచయమే లేని కొత్త చోటులా అనిపిస్తోంది.

వంపు తిరిగి రెండు అంచులూ కనుమరుగయ్యి, ఆదీ అంతమూ లేకుండా అనంతమైన ఒక డొంకదారిలా ప్రవహిస్తూ సాగే ఆమెలో నాకు తెలియని వేలాది రహస్యాలు ఉన్నట్టు అనిపిస్తోంది.

నడుమంత లోతుకూడా లేని ఏటికి పలువేల మైళ్ళ లోతు ఉన్నట్టు అనుకున్నాను. ఒక నిముషం ఒళ్ళు వణికి జలదరించింది.

అన్నయ్య ఏటిలో దిగి నడుము లోతు నీళ్ళలో నిల్చున్నాడు. అమ్మా అని పలవరిస్తున్నట్టు అనిపించింది.

“కుండను వెనక్కి విడిచిపెట్టి తిరిగి చూడకుండా మునక వెయ్యి…” పూజారి చెప్పాడు. అన్నయ్య కుండను వెనక్కి విడిచిపెట్టాడు. మునకవేశాడు. తిరిగి చూడలేదు.

“తిరిగి చూడకు, తిరిగి చూసినవాడు బతకలేదు!”

కుండ మనిగిపోయింది. పూలు – రక్తపు రంగున్న మందారం, గన్నేరు, నూరు వరహాలు, కావిరంగు చంపకాలు(సంపెంగలు) – మెల్లగా తేలి, సుడి తిరిగి నీటి ప్రవాహంలో కలిసిపోయి కనుమరుగయ్యాయి.

కాల్చని పచ్చి మట్టి కుండ. నీటిలో నీలి రంగు లోతులోనుండి బుడగలు పైకి వచ్చాయి. నీటి పైపొరమీద చిన్నదిగా ఒక సుడి. తర్వాత నీటి పైభాగాన్ని నిశ్శబ్దం ఆవరించింది.

“మునకేసి రా… వేళవుతుంది” పూజారి చెప్పాడు. నీటిలోకి దిగాను. మునకేశాను. పెదవులు ‌వణికాయి. మళ్ళీ తల తుడుచుకుంటూ గట్టెక్కాను. సోమన్ అన్నయ్య చేతిలో పెట్టుకున్న కొత్తపంచె తీసి కట్టుకున్నాను. ఆకలెయ్యడం మొదలైంది.

ఏమీ జరగనట్టు ఏరు పారుతూనే ఉంది, మౌనంగా.

(మూలం: నది. కణైయాళి పత్రిక 1987.)


జయమోహన్

రచయిత జయమోహన్ గురించి: జయమోహన్ 1962 ఏప్రిల్ 22న కేరళ-తమిళనాడు సరిహద్దు ప్రాంతంలో కన్యాకుమారి జిల్లాలో జన్మించారు. ఆయన తల్లితండ్రులు మలయాళీలు. ఇరవై రెండో ఏట వామపక్ష, సామ్యవాద సాహిత్యం మీద ఆసక్తి కలిగింది. ఆ రోజుల్లోనే రాసిన ఖైది అనే కవిత; నది‌, బోధి, పడుగై వంటి కథలు ఆయనకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. అప్పుడు రాసిన రబ్బర్‌ అనే నవల అకిలన్‌ స్మారక పురస్కారం అందుకుంది. ఈయన రచనలన్నీ మానసిక లోతులను వివిధ కోణాల్లో అద్దం పట్టేవిగా ఉంటాయి. 2015లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ పురస్కారాన్ని తన సిద్ధాంతానికి విరుద్ధమంటూ తిరస్కరించారు. ...