తమ్ముడు

పేరు ఎమ్. శరవణకుమార్, ఎమ్. ఎ. ఇంగ్లిష్ లిటరేచర్. ఒక ప్రైవేటు కాలేజీలో ఉద్యోగం. దృఢమైన నల్లటి శరీరం. ట్రిమ్ చేసి నిగనిగలాడుతున్న నల్లటి మీసం. నేను టేబుల్ మీద ముందుకు వంగి అతన్ని తదేకంగా చూశాను. అలా చూస్తున్నప్పుడు అది పరీక్షించేందుకు చూస్తున్న చూపు అని పేషెంట్‌కు అనుమానం రాకూడదు కాబట్టి ఏళ్ళతరబడి అభ్యసించి అలవరుచుకున్న ఆప్యాయత, ఆదరణ తొణికిసలాడే నవ్వును నా మొహంలోకి తెచ్చిపెట్టుకున్నాను. అతనివి బలమైన భుజాలు, తీక్షణమైన కళ్ళు. ఇలాంటి బలాఢ్యులకు మానసిక రుగ్మత రావడం చాలా అరుదు, వస్తే వాళ్ళకు చికిత్స చెయ్యడం అంత సులువు కాదు.

ఒక్కమాటలో చెప్పాలంటే అతనికి స్కిజోఫ్రీనియా – అంటే ఒక తీవ్రమైన మనోరుగ్మత. మామూలుగా డాక్టర్‌లు వెంటనే ఇలాంటివాళ్ళకు మెదడులో జరిగే రసాయన ప్రక్రియల చురుకుదనం మందబారి పోయేందుకు మందులు ఇస్తారు. ఆరు నెలలపాటో, ఓ సంవత్సరంపాటో ఇచ్చిన మందులు తీసుకుంటే రోగిలో ఆలోచనావేగం, వాడి పదోవంతుకు పడిపోయి, వాడిపోయిన కాయగూరలా మాడిపోతాడు. మామూలు ఆలోచనలు చేయడానికి కూడా మెదడుకి శక్తి నశిస్తుంది; ఇక స్కిజోఫ్రీనియా వల్ల వచ్చే తీవ్రమైన ఆలోచనలకు ఆస్కారమే ఉండదు. ముఖ్యంగా ఇంట్లోవాళ్ళకు ఎలాంటి ఇబ్బందీ ఉండదు. మన దేశంలో దయ్యం పట్టినా, మనసు చలించినా పూనకం వచ్చినట్టు ఊగిపోతారు. ఆ పూనకాన్ని ఆపగలిగేవాడు గొప్ప హస్తవాసి ఉన్న వైద్యుడిగా పరిగణింపబడతాడు. అయితే నేను మందులను మాత్రమే నమ్మేవాణ్ణి కాదు. నాకు మానసిక చికిత్సలో బాగా నమ్మకం ఉంది.

నేను ఇంగ్లీషులో ‘మీరు నాతో మీ సమస్యని వివరంగా చెప్పొచ్చు. నేను ఈ విషయానికి సంబంధించిన మెడికల్ సైన్సు క్షుణ్ణంగా చదువుకున్నాను. ఇరవై ఏళ్ళుగా నేను ఇదే వృత్తిలో ఉన్నాను. ఇప్పటివరకు వెయ్యిమందికైనా పూర్తిగా నయంచేసి ఉంటాను. కాబట్టి ఖచ్చితంగా నేను మీకు సహాయపడగలను. ప్రస్తుతానికి నేను మీ గార్డియన్‌ని. నేను తప్ప మీకు ఇంకెవ్వరు సాయం చెయ్యలేరు. పైగా మనిద్దరం చదువుకున్నవాళ్ళం…’ అన్నాను. ఇంగ్లీషులోనే మాట్లాడ్డానికి రెండు కారణాలు ఉన్నాయి. అతను నేను ఇంగ్లీషులో మాట్లాడితే ‘వాగడు’. ఆ భాష ఇంకా బాగా వంటపట్టినట్టు కనపడ్డంలేదు కాబట్టి ఆలోచించి నెమ్మదిగా మాట్లాడుతాడు. పైగా మనదేశంలో ఇంగ్లీషులో మాట్లాడడం అన్నది తెలివితేటలకు ఒక నిదర్శనం.

“అవును డాక్టర్. మిమ్మల్ని చూడగానే నాకు పూర్తి నమ్మకం కుదిరింది. నేను మీతో మనసు విప్పి మాట్లాడగలను” అన్నాడు శరవణకుమార్. పదేపదే తలను చేతులతో దువ్వుకుంటూ ఉన్నాడు. అది అతని అలవాటు కాబోలు. సహజంగానే చురుగ్గా కనపడుతున్నాడు.

“తప్పకుండా.”

“డాక్టర్, మీరు దయ్యాలున్నాయని నమ్ముతారా?”

“ఇప్పుడు నమ్మడమా, లేదా అన్నది మన సమస్య కాదు కదా?”

“అవును. సరిగ్గా చెప్పారు. మనం నమ్మడం అసలు సమస్య కాదు. ఇప్పుడు నూటికి తొంభైతొమ్మిది మంది దయ్యాలను నమ్మడంలేదు. అయితే దయ్యాలు వీళ్ళ నమ్మకాల గురించి పట్టించుకోవు. అసలు నేను దెయ్యాలను ఏమాత్రమూ నమ్మను. షేక్స్‌పియర్ నాటకాలలో దయ్యాలు వచ్చినప్పుడు నేను నవ్వుకుంటాను. మనిషికి దయ్యాలు అవసరం. లేదంటే కేవలం మానవ జీవితాల్లోనుండి రసవత్తరమైన కథలను సృష్టించడం అసాధ్యం అనుకుంటాను…”

నేను ‘షేక్స్‌పియర్’ అని నోటు పుస్తకంలో రాసుకున్నాను.

“అయితే నన్ను దయ్యం పట్టుకుంది. విశ్వాసమో, అవిశ్వాసమో, ఆత్మవిశ్వాసమో దానికి ఒక లెక్క కాదు…” మెల్లగా అతని ముఖకవళికలు మారాయి.

“మొట్టమొదట ఇదెప్పుడు జరిగింది?” అని అడిగాను.

“ఏడాదిన్నర క్రితం. క్రితం ఏడు డిసెంబర్ 22వ తారీకున. ఆ రోజు నేను సినిమాకు వెళ్ళాను…”

“ఏం సినిమా?”

అతను చిన్నగా నవ్వాడు “మీరనుకున్నట్టు అది దయ్యం సినిమా కాదు. మంచి సినిమా. ఎ బ్యూటిఫుల్ మైండ్.”

“అవును, గొప్ప సినిమా.”

“రాత్రిపూట ఆలస్యంగా ఇంటికి వచ్చి నేరుగా నా గదిలోకి వెళ్ళి పడుకోవడం నాకలవాటు. రోజూ స్నేహితులతో కలిసి బయట తినేవాణ్ణి.”

“మందు?”

“లేదు. నాకు అలాంటి అలవాట్లు ఏమీ లేవు.”

“వెరీ గుడ్.”

“నేను ఇల్లు చేరేటప్పటికి కాంపౌండ్ బయట ఎవరో ఒక మనిషి చీకట్లో నాకోసం వేచి చూస్తూ ఉన్నట్టు కనిపించింది. ఎవరయి ఉంటారా అనుకుంటూ దగ్గరకు వెళ్ళాను. గూనితో వంగిపోయి ఉన్నాడా మనిషి. దగ్గరకు వెళ్ళేంతవరకు మనిషే అనుకున్నాను. బాగా దగ్గరకొచ్చి చూసినప్పుడు అది నీడ అని అర్థమయింది. నా ఇంటి ముందు ఉన్న క్రోటన్స్ మొక్క నీడ గోడ మీద పడుతోంది. దాని నీడ అంత స్పష్టంగా మనిషి ఆకారంలో ఉండడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. గుండె దడ తగ్గడానికి చాలా సమయం పట్టేసింది. గది తలుపు తెరిచి లోపలికి వెళ్ళి లైట్ స్విచ్ నొక్కాను. అప్పుడు వాకిట్లో నీడలా ఏదో కదిలింది. అదే ఆకారం! మనసులో మళ్ళీ అలజడి. ఎవరూ! అంటూ కంగారుగా తొంగి చూశాను. అదీ నీడే. నా గదినించి వచ్చే వెలుతురువల్ల ఆ నీడ చోటు మార్చుకుంది, అంతే! కొంచం తేరుకున్నప్పటికీ గుండె దడ మాత్రం పూర్తిగా తగ్గలేదు. తలుపు వేశాను. తిరిగితే నా గదిమూల కూడా అదే ఆకారం… ‘హాఁ!’ అని గట్టిగా అరిచేశాను. లోపలనుండి నాన్న ‘ఏంటి కుమార్?’ అని అడిగాడు. ఏమీ లేదన్నాను. అది దండెం మీద వేసిన నా చొక్కా నీడ…”

“ఆ ఆకారాన్ని అంతకుముందు ఎప్పుడైనా చూశారా?”

“లేదు.”

“మరి ఆ మరసటి రోజు మీ స్నేహితులతో ఈ విషయం గురించి ఏమైనా చెప్పారా… లేకపోతే ఇలాంటి విషయాలు ఇంకేఁవైనా?”

“ఎవరికీ చెప్పలేదు అని కచ్చితంగా చెప్పగలను. కారణం ఎన్నోసార్లు ఈ విషయం గురించి నాలోపల నేనే చర్చించుకున్నానుగానీ ఎవరితోనూ ప్రస్తావించలేదు.”

“సరే, చెప్పండి.”

“నేను ఆరోజు నిద్రపోతున్నప్పుడు ఉన్నట్టుండి మెలకువ వచ్చింది. నడిజాము దాటి ఉండచ్చు. మామూలుగా రాత్రి వేళల్లో వినిపించే చీకటి శబ్దం, తిరుగుతున్న ఫేన్ శబ్దం – ఇవి మాత్రమే వినిపించాయి. కొంచం తెలివి వచ్చినప్పుడు నా పక్కన ఎవరో కూర్చున్నట్టు అనిపించింది. కంటికి ఎవరూ కనిపించడం లేదు. అయితే మనసుకు మాత్రం స్ఫష్టంగా ఎవరో ఉన్నట్టుగా భావన. ఇప్పుడు మీరు నా పక్కన కూర్చుని ఉండటం నాకెలాగైతే తెలుస్తూ ఉందో, అలా!”

“భయపడ్డారా?”

“చాలా సేపటివరకు అది ఒక కలలాగే అనిపించింది. తర్వాత ఒక్క ఉదుటన లేచి లైటు వేశాను. గదంతా ఖాళీగా ఉంది. లోపల గడియ పెట్టిన తలుపు. అయినప్పటికీ గదంతా ప్రతి మూలా పరీక్షగా చూశాను. ఎవరూ లేరు. ఆ భావనని పోగొట్టడానికి అన్ని ప్రయత్నాలూ చేశాను. అయితే నా మనసు అతను ఉన్నట్టు స్పష్టంగా చెప్తూ ఉంది. మనసంతా అల్లకల్లోలం అయిపోయింది. బయటికి వెళ్ళి వరండాలో పడుకున్నాను. అక్కడ అలాంటి భావన లేదు. ఒక అరగంట పాటు ఆ భావన ఏమిటని ఆలోచిస్తూ పడుకున్నాను. లేచి గదిలోపలికి వచ్చాను. లోపల అడుగుపెట్టగానే అర్థం అయింది అతను లోపలే ఉన్నాడు అని.”

“తర్వాత?”

“ఆరోజు రాత్రి వరండాలోనే పడుకున్నాను. తెల్లవారుజామున నిద్ర పట్టింది. పొద్దున లేచాక అంతా ఒక కలలా అనిపించింది. నవ్వు కూడా వచ్చింది. గది లోపలికి వెళ్ళాను. ఎలాంటి భావనా లేదు. మనసు చేసే ఈ మాయల ఆటలను తలచుకుని ఆశ్చర్యపోయాను. అయితే ఆ రోజు నేను భోజనం చేసి నా గదిలోపలికి వెళ్ళి కూర్చోగానే నా పక్కనే ఎవరో కూర్చుని ఉన్నారన్న భావన మళ్ళీ కలిగింది. నన్ను అతను పరీక్షగా చూస్తూ ఉన్నాడు. ముందు రోజు అతను గదిలో ఉన్న భావన మాత్రమే ఉండేది. ఇప్పుడు మరింత స్పష్టంగా అతను ఉన్న చోటు కూడా తెలుస్తోంది. అతనికి వీపు చూపిస్తూ కూర్చుంటే వీపు మీద అతని చూపు చురుగ్గా తగులుతున్నట్టుగా తెలుస్తోంది.

“ఇంక మొండి పట్టుదల కలిగింది. ఆ భావాన్ని స్పష్టంగా పరిశీలించి దాని అంతు తెలుసుకోవాలి అన్న ఆలోచనతో రకరకాలుగా పరిశీలించి చూశాను. స్థూలంగా చెప్పాలంటే అక్కడ ఒక మానవ శరీరం లేదంతే. అది తప్ప ఒక మనిషి ఉంటే వచ్చే అనుభవమే కలుగుతోంది. అతను ఉన్న చోటును దాటుకుని వెళ్ళాను. దాటేటప్పుడు అతను పక్కకు తప్పుకుని నాకు దారి ఇవ్వడాన్ని గ్రహించాను. అంతా భ్రమ, నా భ్రాంతి అని లోపలే… మంత్రంలా చెప్పుకోసాగాను. దానివల్ల కొంత ప్రయోజనం కలిగింది. దాన్ని మరింత తీవ్రస్థాయికి తీసుకువెళ్ళాను. కళ్ళు మూసుకుని ధ్యానం చేసినట్టు ఆ మాటను పదేపదే చెప్పుకున్నాను. ఆ రాత్రి ఆ గదిలోపల అతను లేడు అన్న భావన ఏర్పడింది. హమ్మయ్య! ఏదో ఒకలా బయటపడ్డాను అని నిట్టూరుస్తుండగానే ఇది ఎంత పెద్ద అర్థంలేని ఊహోనని నవ్వు వచ్చింది.

“రాత్రి ఏమీ లేదు. మరుసటి రోజు కూడా ఏమీ అనిపించలేదు. మూడో రోజు నేను ఆ గదిలోనే కూర్చుని చదువుతూ ఉన్నాను. అదే పనిగా ఆ గదిలోనే కూర్చుని చూశాను. అలా చేస్తే గాని ఆ అనవసరమైన భావనని రూపుమాపలేను. పుస్తకంలో ఒక వాక్యాన్ని అండర్‌లైన్ చెయ్యాలనిపించి పెన్ను కోసం చేయి చాచాను. పెన్ను దూరంగా ఉంది. వదిలేసి ఆ వాక్యాన్ని మళ్ళీ చదివాను. పెన్ను తీసుకుందామని పుస్తకాన్ని మూసేసి లేవబోతూ ఒళ్ళు ఒక్కసారిగా చల్లబడిపోయి అలానే కూర్చుండిపోయాను. పెన్ను నా చేతి దగ్గరే ఉంది… ఆగండాగండి! మీరు ఏం చెప్పబోతున్నారో నాకు తెలుసు. అది నా భ్రమకూడా అయుండచ్చు. నాకే తెలియకుండా నేను దాన్ని దగ్గరగా తీసి పెట్టి ఉండొచ్చు. అయితే అదే ఎక్స్‌పెరిమెంట్‌ను నేను మళ్ళీ చేశాను. ఒక రిఫరెన్స్ పుస్తకం అందుకోవడానికి చేయి చాచాను. తర్వాత కావాలనే తలను అవతల వైపుకు తిప్పుకున్నాను. మళ్ళీ తిరిగి చూసినప్పుడు ఆ పుస్తకం నా పక్కన ఉంది.

“చెమటలు కక్కుకుంటూ బయటకు పరిగెత్తాను. కాళ్ళు ఎటు నడిపిస్తే అటు వెళ్ళాను. నాకు ఏమీ అర్థం కాలేదు. మెలమెల్లగా నాలో తార్కిక చింతన తిరిగి మొదలై అంతా నా భ్రాంతేనని అనిపించింది. ఆ సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చాను. గది లోపలికి వెళ్ళడానికి భయమేసింది. వరండాలోనే పడుకున్నాను. మా వీధి చాలా వెడల్పుగా ఉంటుంది. చక్కగా గాలి వీస్తుంది. అలసిపోయి ఉండటంతో నిద్రపోయాను. ఎదురింటి కుక్క వరండా కింద పడుకుని ఉంది. చీకట్లో ఎవరో నా పక్కన నిలుచుని ఉండడం గ్రహించి కళ్ళు తెరిచాను. లేచి కూర్చున్నాను… అతనే! అతను నిలుచుని ఉన్నట్టు అనిపించింది. నా ఛాతీ మీద చాలా పెద్ద బరువు పెట్టినట్టనిపించి అలానే కదలకుండా పడుకున్నాను.

“అప్పుడు కింద పడుకుని ఉన్న కుక్క ఏదో భయంకరమైన కల వచ్చినట్టుగా, ఉన్నట్టుండి ఉలిక్కిపడి లేచి నిల్చుంది. దాని ఒళ్ళు వణికిపోతోంది. అది మెలికలు తిరిగిపోతోంది. తలనూ కళ్ళనూ వాల్చుకుని చెవులను ముడుచుకుంటూ, తోకను కాళ్ళకు మధ్యన ముడుచుకుని మూలిగింది. నా పక్కనున్న ఖాళీని చూసి మెల్లగా మొరిగింది. వెంటనే అక్కణ్ణించి ఏడుపులాంటి అరుపు అరుస్తూ పరుగుతీసింది. కాసేపట్లో వీధిలో ఉన్న కుక్కలన్నీ కుయ్యికుయ్యిమని మూల్గుతూ అరవసాగాయి. ఆ చప్పుడుకు నాన్నకూడా నిద్రలేచి వచ్చి ‘ఏమైంది రా?’ అని అడిగాడు. నేను కదలకుండా పడుకుని ఉన్నాను. ఎందుకో కన్నీళ్ళు మాత్రం ఆగకుండా కారుతూ ఉన్నాయి.

“మరుసటి రోజు నాన్నతో చెప్పి నా స్నేహితుడి ఇంటికి వెళ్ళాను. అతనితో ఈ విషయం ఏమీ చెప్పలేదు. నాన్నతో ఏదో గొడవ! అని అనుకుని ఉంటాడు. మూడు రోజులు అక్కడ హాయిగానే ఉన్నాను. సినిమాకు వెళ్ళాము. సినిమా గురించి కబుర్లు చెప్పుకున్నాము. నాలుగో రోజు పొద్దున నిద్రపోతూ ఉండగా నా పేరు ఎవరో పిలిచారు. అయితే గొంతును సరిగ్గా వినలేదు. తలుపు తెరవగానే నాకు ఊపిరాడలేదు. అతనే! ఆకారం లేనట్టు నిలుచుని ఉన్నాడు. నేను తలుపు వేయడానికి ప్రయత్నించాను. అయితే నా చేతులు కదలడం లేదు. శక్తి కూడబలుక్కుని తలుపు వేసేలోపు లోపలికి వచ్చేశాడు. యజమానికి దూరమయ్యి మళ్ళీ కలుసుకున్నప్పుడు కుక్కలు చేసే ముదిగారపు చేతల్లా వాడు నా చుట్టూ గెంతాడు. నేను వణుకుతున్న కాళ్ళతో కుర్చీలో కుర్చున్నాను. అప్పుడే తొలిసారి అతని వేళ్ళు నా చేతిని తాకడం తెలిసింది. చల్లటి వేళ్ళు. ఫ్రీజ్ చేసిన చేపల్లా నున్నగా ఉన్న చల్లటి వేళ్ళు. అవి నా కాళ్ళను చేతులను మార్చి మార్చి తాకాయి, పోమరేనియన్ కుక్క మోరతో తాకుతున్నట్టు. అతని ఊపిరి నాకు తగలడం స్పష్టంగా తెలుస్తోంది.

“స్నేహితుడు లేచి ఏమైంది అని అడిగాడు. ఏమీ సమాధానం ఇవ్వలేదు. అంతా భ్రాంతి, నా భ్రమ! నా మానసిక స్థితిలో ఏదో సమస్య ఉంది. ఇవాళే మానసికవైద్యున్ని చూడాలి అని నాకు నేనే చెప్పుకున్నాను. అప్పుడు స్నేహితుడు ఆవలిస్తూ మామూలుగా అడిగాడు ‘ఎవర్రా వచ్చింది?’ అని. ‘ఎవరూ లేరే… ఎందుకు అడుగుతున్నావు?’ అన్నాను కంగారుపడుతూ. వాడికి ఆశ్చర్యం. నేను ఏదో దాస్తున్నాను అని వాడికి సందేహం. ‘లేదు, నేను చూశానే!’ అన్నాడు. ‘ఏం చూశావు?’ అని అడిగాను. ‘నువ్వు తలుపు తియ్యడం, బయట ఎవరో నిల్చుని ఉండటమూ కనిపించింది. ఎవరని తెలియలేదు, ఒక కదలిక. నేను సరిగ్గా చూడలేదు. పడుకుండిపోయాను’ అని అన్నాడు. అంతకు మించి ఏమీ అడగలేదు.

“ఆ తర్వాత నన్ను అతను వదిలిపెట్టనేలేదు. నేను అతని దగ్గర నుంచి తప్పించుకోలేకపోయా. నాతో పాటే మౌనంగా వచ్చేవాడు. వేళ్ళతో నా జుట్టు దువ్వేవాడు. నా చేతులు తాకేవాడు. ఇలా ఎన్నో రకాల అనుభవాలు. ఒకసారి నేను పిచ్చిపట్టినవాడిలా రోడ్డు దాటుతూ ఒక లారీ కింద పడబోయాను. నా చేయి పట్టి లాగి రోడ్డు పక్కకు పడేశాడు. అప్పుడు చాలా భావావేశంతో నన్ను వాటేసుకుని ముద్దు పెట్టుకున్నాడు. ఏడుస్తున్నాడు అనిపించింది. అతన్ని అసలు తప్పించుకోలేకపోయాను. అతన్ని ద్వేషించాను, అసహ్యించుకున్నాను. అతన్ని తరిమేయడానికి నేను చచ్చిపోవడం ఒకటే మార్గం అని తలచి ఫ్లైఓవర్ అంచుల దాకా వెళ్ళాను. అతన్ని నేను భరించలేకపోయాను. ఎందరో డాక్టర్లను కలిశాను. వాళ్ళు నాకు స్కిజోఫ్రీనియా సమస్య ఉంది అని మందులు ఇచ్చారు. ఆ మందులు తీసుకుంటే నేను, అతనూ కదలకుండా రోజుల తరబడి పక్కపక్కనే అలా కూర్చుని ఉంటాం, అంతే.”

“శరవణకుమార్, రెండు ప్రశ్నలు. ఒకటి ఆ వ్యక్తిని ఎందుకు ‘అతను‘ అని అంటున్నారు?”

శరవణకుమార్ నెమ్మదిగా నిట్టూర్చాడు. “అతను నా దగ్గరికి వచ్చినప్పుడే అది తెలిసిపోయింది. నిజానికి కొన్ని రోజుల్లోనే ఆ విషయాన్ని స్పష్టంగా తెలుసుకున్నాను. అతను ఎవరో కాదు అది మా అన్నయ్యేనని…”

“చనిపోయాడా?”

“అవును. చిన్నతనంలోనే. నాకు అప్పుడు ఎనిమిదేళ్ళు. వాడికి పన్నెండేళ్ళు. అతనికి బుద్ధి ఎదుగుదల తక్కువ… మంగోలాయిడ్…”

“అతనంటే మీకు చాలా ఇష్టమా?”

అతని ముఖం క్షణాల్లో వికారంగా మారడం చూసి నేను షాక్ అయ్యాను.

“లేదు అతన్ని నేను ద్వేషించాను. ద్వేషం అంటే మామూలు ద్వేషం కాదు. రాత్రింబవళ్ళు అతనిమీద ద్వేషాన్ని కక్కుతూ ఉండేవాడిని. నా ఒళ్ళంతా ద్వేషంతో రగిలిపోయేది.”

“ఆరోగ్యంగా ఉండేవాడా?”

“అవును. చక్కగా నడిచేవాడు, పరిగెట్టేవాడు. మహా బలాఢ్యుడు. అతనికి పూనకం వస్తే ఇద్దరు పట్టుకుంటేగానీ ఆపలేము. చాలా వికారమైన రూపం! కురూపి! తల ఒక వైపుకు చీకేసినట్టు, కళ్ళు బయటకు ఊడి పడిపోతాయేమో అన్నట్టు ఉండేవాడు. ఉబ్బిపోయినట్టు ఉండే ఆ పెదవుల్లో ఎప్పుడూ చొంగ కారుతూ ఉండేది. కళ్ళల్లో పుసి. నోట్లో పసుపు పచ్చగా ఉండే పెద్ద పెద్ద దంతాలు. అంతకంటే భరించలేనిది అతని దగ్గర నుండి వచ్చే దుర్వాసన. ఘోరమైన కంపు. కుళ్ళిన పుండునుండి వచ్చే వాసనలాంటిది. చచ్చిన జంతువునుండి వచ్చే వాసనలాంటిది. పేగులు దేవేసే కంపు…”

“మాట్లాడేవాడా?”

“కొన్ని మాటలు. అమ్మ, నాన్న, చేప, అన్నం ఇలాంటివి. తర్వాత అప్పుడప్పుడూ ఒక విచిత్రమైన మూలుగు శబ్దం చేసేవాడు. అంతకంటే అసహ్యంగా ఒక నవ్వు. ఇప్పుడు కూడా ఆ నవ్వుని నేను వినగలుగుతున్నాను. ప్రపంచంలోనే అసహ్యమైన శబ్దం అదే.”

“శరవణకుమార్, మీరు అతన్ని ఎందుకు ద్వేషించారు?”

“తెలియదు. అతని మూలంగా మిగతా పిల్లలందరూ నన్ను గేలి చేసేవాళ్ళు. అది కారణమై ఉండొచ్చు. అమ్మకు వాడంటే ప్రాణం. వాడు చనిపోయిన మరుసటి నెల ఆమె కూడా చనిపోయింది. రాత్రింబవళ్ళు అమ్మ వాడి గురించే ఆలోచిస్తూ ఉండేది. అందువల్ల కూడా అయ్యుండొచ్చు. ఎంత ద్వేషించినా అతన్ని తప్పించుకోలేకపోయాను. నేను ఆడుకోవడానికి వెళ్ళేప్పుడు నాతోబాటు వాణ్ణి కూడా తీసుకువెళ్ళాలి అని అమ్మ బలవంతం చేసేది. వాడు కూడా నన్ను విడిచిపెట్టి వెళ్ళేవాడుకాదు. వాడి దగ్గర నుండి తప్పించుకోవడానికి నేను పరిగెత్తేవాడిని. చెట్లెక్కేవాణ్ణి. అయినా వదిలిపెట్టేవాడుకాదు.”

“అతనికి మీరంటే ఇష్టమా?”

తలవంచుకున్నాడు. నిట్టూర్పుతో “అవును. చాలా ఇష్టం అనుకుంటాను. అందుకే వాడు నన్ను వదిలిపెట్టకుండా నాతోనే ఉన్నాడు. నన్ను ‘త్తమ్ము…’ అని పిలిచేవాడు. అప్పుడు నాకు పట్టలేనంత నవ్వు వచ్చేది. వాడికి ఏది దొరికినా నాకే ఇచ్చేవాడు. వాడు తాకినదాన్ని నేను తినేవాడిని కాదు. అయినా వాడు నేరుగా తెచ్చి నాకే ఇచ్చేవాడు. వాణ్ణి కొట్టేవాడిని. మట్టి తీసి మీద పోసేవాడిని. తోసేసేవాడిని. ఏం చేసినా నవ్వుతూనే ఉండేవాడు. ‘త్తమ్ము’ అని చిన్న పిలుపు మాత్రమే.”

ఉన్నట్టుండి శరవణకుమార్ తలమీద బాదుకుంటూ “అదొక పెద్ద చిత్రహింస. పెద్ద నరకం. వాడికి అప్పుడప్పుడూ పూనకం వచ్చేసేది. గట్టిగా అదిమి పట్టుకుని ‘కుమార్ తొందరగా రా!’ అనేవాళ్ళు. నేను వెళ్ళేవాణ్ణి కాదు. లాక్కుని వెళ్ళేవారు. నేను వెళ్ళి ‘రేయ్ సెందిల్ ఆపరా’ అంటే వెంటనే మామూలుగా అయిపోయేవాడు. నవ్వుతూ ‘త్తమ్ము…’ అనేవాడు” అన్నాడు.

“అతన్ని అలా ద్వేషించడం గురించి మీకు పశ్చాత్తాపం ఏమైనా ఉందా?”

“మీరు ఏం చెప్పొస్తున్నారో అర్థం అవుతోంది. ఆ కారణంగా నాకు ఈ స్కిజోఫ్రీనియా వచ్చి ఉండొచ్చు అని. అలా కాదిది. నా ఫీలింగ్స్ నాకు స్పష్టంగా తెలుస్తున్నాయి.”

“శరవణకుమార్, ఇది స్కిజోఫ్రీనియా ఎందుకు కాకూడదు?”

“అలా అయుంటే అది నాకొక్కడికే కదా తెలియాలి? నా పక్కన ఉన్న మిగిలినవాళ్ళకు ఎలా తెలుస్తుంది? నేను ఒకరోజు రెస్టరెంట్‌కి వెళ్ళి ఫ్యామిలీ రూమ్‌లో కూర్చున్నాను. సర్వర్ రెండు ప్లేట్లు తీసుకొచ్చి పెట్టాడు. నాకు ఏమీ అర్థం కాలేదు. దోశ తెమ్మని చెప్పాను. ‘ఇద్దరికీ దోశెలేనా?’ అని అడిగాడు. ‘నేను ఒక్కణ్ణే కదా!’ అని అన్నాను. ‘మరి చేయి కడుక్కోవడానికి వెళ్ళినాయన?’ అని అడిగాడు. ‘ఎవరూ లేరే!’ అన్నాను. ‘మీరు ఇద్దరు వస్తున్నట్టు అనిపించిందే!’ అని అన్నాడు. అతను హేండ్‌వాష్ దగ్గరకు వెళ్ళి చూసి అయోమయంగా అటూ ఇటూ దిక్కులు చూసుకుంటూ తిరిగివెళ్ళాడు. అంతకంటే మించి ఇంకో విషయం ఏంటంటే…”

“అంతకంటే? ఏమిటో చెప్పండి!”

“…నా పక్కన అతని గొంతును వేరేవాళ్ళు విన్నారు కూడా. నేను అతని గొంతు వినడం మొదలయ్యి సంవత్సరం అవుతోంది. మానసికరుగ్మత ఉన్నవాళ్ళు ఇలా గొంతులు వినడం మామూలే. ‘త్తమ్ము..’ అని నిర్విరామంగా నన్ను పిలుస్తూ ఉంటాడు. నవ్వుతాడు. నిజానికి నా దగ్గర మా నాన్న, ఆయన స్నేహితులు కూడా ఆ గొంతుని విని భయపడ్డారు.”

“బహుశా, మీరే అలా మాట్లాడి ఉండొచ్చు కదా?”

“నా నోరు కదలనప్పుడు కూడానా? నేనుకూడా ఆ గొంతుని విని వణికిపోతూ ఉండేవాడిని అప్పుడు!”


“చాలా పెద్ద చిక్కే” అన్నాడు డాక్టర్ శివషణ్ముఖం టేపురికార్డర్‌ను ఆపుతూ. “కచ్చితంగా స్కిజోఫ్రీనియానే… అయితే పేషంట్ బాగా తెలివితేటలు కలిగినవాడు. అమోఘమైన ఊహాశక్తి కలవాడు. కాబట్టి సమస్య కూడా చిక్కుతో కూడినదే.”

“మీరు మీ డయగ్నోసిస్ చెపుతూ వెళ్ళండి డాక్టర్. నేను నా అప్రోచ్ సరైనదేనా అని చూస్తాను.”

“మంగోలాయిడ్ బిడ్డ! అలాంటి బిడ్డలు పుట్టిన కుటుంబాల్లో ఆ బిడ్డ చాలా రకాల మానసిక సమస్యలను సృష్టిస్తుంది!” అన్నాడు డాక్టర్ శివషణ్ముఖం. “ముఖ్యంగా మన దేశంలో కుటుంబాలన్నవి అతి తీవ్రమైన భావావేశాలతో కూడినవి. ఆ బిడ్డను తల్లి చాలా కాలంవరకు పసిబిడ్డలానే పోషిస్తుంది. కాబట్టి ఆమె తన మానసిక శక్తినంతా ఆ బిడ్డ పెంపకానికే ఖర్చు పెట్టేస్తుంది. క్రమంగా ఆమె వేరే విషయాలమీద ఎలాంటి అవగాహన, పట్టింపూ లేనిదానిగా మారిపోతుంది. కుటుంబమంతా ఆ బిడ్డ మీద ఇష్టము, అయిష్టమూ చూపుతూ ఉంటుంది. మంగోలాయిడ్ పిల్లల్లో హార్మోన్ మార్పులు జరిగేప్పుడు ఆ పిల్లలు నరాల షాక్‌కు గురవుతారు. కాబట్టి ఆ పిల్లలు చాలా అరుదుగా… ముప్పై ఏళ్ళను దాటి జీవిస్తారు. వాళ్ళ మరణం ఆ కుటుంబంలో అనేక రకాల ఉపద్రవాలను సృష్టిస్తుంది. ఆ మరణం వల్ల కలిగే శూన్యం పశ్చాత్తాపానికి గురిచేసి వాళ్ళందర్నీ పట్టి పీడించేస్తుంది.

“ఈ కేసులో సెందిల్ వాళ్ళ అమ్మ, సెందిల్ తప్ప మరో ప్రపంచమే లేదు అన్నట్టు బతికింది. కాబట్టి శరవణకుమార్ కోపం, ద్వేషం మాత్రమే పెంచుకున్నాడు. సెందిల్ చనిపోయిన వెంటనే వాళ్ళ అమ్మ కూడా చనిపోవడంతో శరవణకుమార్ షాక్‌కు లోనయ్యాడు. పశ్చాత్తాపం అతన్ని దహించివేస్తోంది. ఏ‌ళ్ళతరబడి లోలోపలే కూరుకుపోయిన ఆ భావావేశమంతా ఒక రోజు నీడను చూసి భయపడినప్పుడు ఒక్కసారిగా పైకి ఎగజిమ్మింది. శరవణకుమార్ మనసు రెండు ముక్కలుగా విడిపోయింది. ఒకటి శరవణకుమార్, మరోటి సెందిల్. సెందిల్ చేసే పనులన్నీ నిజంగా చేస్తున్నది శరవణకుమారే. అయితే శరవణకుమార్‌కి ఆ విషయం తెలియడంలేదు. జరుగుతున్నవి చూసి శరవణకుమార్ మనసు భయపడుతోంది.”

“సరే, మరి ఆ కుక్క సంగతి?”

“కుక్కలు మనుషులు కదలికల్ని చాలా క్షుణ్ణంగా గమనిస్తాయి. శరవణ తీరుని చూసి కుక్క తికమకపడింది. అతను ఇంకెవరో మనిషని అనుకుని ఉండొచ్చు. అతను చూస్తున్న చోట మనిషి ఎవరూ లేరన్నది గ్రహించి కుక్క భయపడి ఉండొచ్చు. అతని స్నేహితులు, హోటల్ సర్వర్ అందరూ ఇలా అతని పోకడ చూసి కంగారుపడ్డవాళ్ళే. ఆ సమయంలో అతని ప్రవర్తన చాలా సహజంగా ఉంటుంది. కారణం అందులో నటన ఉండదు. తన మనసులోనున్న భావాల నిజమైన వ్యక్తీకరణ మాత్రమే ఉంటుంది.”

“మరి ఆ గొంతు…”

“ఇక్కడే విషయం మరింత జటిలమౌతుంది. స్కిజోఫ్రీనియా పేషంట్ ఎప్పుడూ బాగా తెలివైనవాడిగానే ఉంటాడు. దానితోపాటు, అతను తాను ఆ మరో పర్సనాలిటీని నమ్మడానికి, ఇతరులను నమ్మించడానికీ తెలియకుండానే ఇష్టంగా తీవ్రంగా ప్రయత్నిస్తుంటాడు. ఆ సమయంలో అతని మనసు దానికి కావలసిన అన్ని మెళుకువలనూ ఎరిగి, సర్వశక్తులూ ఒడ్డి కావాల్సిందంతా సమకూరుస్తుంది. ఆ గొంతులు కచ్చితంగా శరవణకుమార్ కంఠం సృష్టించేవే! అయితే అతని పెదవులు కదలవు. పెదవులు కదపకుండా మాట్లాడే విద్య ‘వెంట్రిలాక్విజమ్’ గురించి మీరు వినే ఉంటారు. చిన్నతనంలో ఎప్పుడో అతను అలాంటి షో ఏదైనా చూసి ఉండొచ్చు. దాన్ని అతను అభ్యసించి నేర్చుకోకపోయినప్పటికీ, అతని సబ్‌కాన్షస్ మైండ్ గమనించడంవల్ల ఆ విద్య అతనికి పట్టుబడివుండొచ్చు. నా పేషంట్ ఒకాయన మామూలు కూలిపని చేసుకునేవాడు. అయితే స్కిజోఫ్రీనియా వచ్చినప్పుడు మరో వ్యక్తిలా అనర్గళంగా హై లెవెల్ ఇంగ్లీష్ మాట్లాడేవాడు. ఆ ఇంగ్లీషు చిన్నతనంలో ఎక్కడో ఒక అమెరికన్ ఫాదర్ మాట్లాడగా కొన్ని రోజులు విని ఉన్నాడు. మనసు యొక్క సాధ్యాసాధ్యాలు సముద్రాల్లాంటివి…”

నేను నిట్టూరుస్తూ “అవును” అన్నాను. “ఇంచుమించుగా నేనూ ఇలాంటి అంచనాలకే వచ్చాను.”

“అతనికి కొంతకాలం క్రమంతప్పకుండా స్పీచ్ థెరపీ ఇవ్వాలి…”

“లేదు. అది స్కిజోఫ్రీనియా అని అతన్ని నమ్మించలేము. కారణం దానికి విరుద్ధమైన అన్ని ఆర్గుమెంట్సూ అతని దగ్గర ఉన్నాయి. స్కిజోఫ్రీనియా గురించి కనీసం రెండు పుస్తకాలైనా అతను చదివి ఉండొచ్చు. దీన్ని దయ్యం అని చెబుతూనే చికిత్స ఇవ్వడం మంచిది…” అన్నాను.


నేను శరవణకుమార్ గదిని సమీపించినప్పుడు నర్సు భయపడిపోయి నిలువెల్లా వణికిపోతూ గది బయట నిలుచుని ఉంది.

“ఎందుకు ఇక్కడ నిల్చుని ఉన్నావు? పేషంట్‌తో పాటు లోపలే ఉండమని కదా చెప్పాను?” అని కోపంగా అడిగాను. శరవణకుమార్ పరిస్థితి కొంచెం తారుమారు అయి పొద్దునే అడ్మిట్ చేసుకోవాల్సి వచ్చింది.

“లేదు డాక్టర్… అది…” అన్నది భయపడుతూనే.

నేను అప్పుడు లోపల నుంచి లీలగా వినపడుతున్న మాటలను విన్నాను “తమ్మూ… తమ్మూ… దా… ఇటు దా…” ఒక క్షణం నా ఒళ్ళు జల్లుమంది. ఆ గొంతు అదివరకెప్పుడూ వినని కొత్త గొంతు. మొద్దుబారిన మెదడుతో పలుకుతున్న గొంతు. బతిమాలుతున్న గొంతు. మందబుద్ధిగల మనుషులు మాట్లాడే గొంతు.

“లోపల ఎవరూ లేరు డాక్టర్” అన్నది నర్సు వణికే కంఠస్వరంతో.

లోపలకి వెళ్ళాను. గొంతు ఆగిపోయింది. శరవణకుమార్ గాఢనిద్రలో ఉన్నాడు. దగ్గరకు వెళ్ళి చూశాను. నిట్టూరుస్తూ రిపోర్టులను తిరగేశాను.

వెనుతిరిగినప్పుడు ఆ నవ్వు శబ్దం వినబడింది. మందబుద్ధి గలవాళ్ళు మాత్రమే చేయగల శబ్దం. వెంటనే తిరిగి చూశాను. శరవణకుమార్ గాఢనిద్రలోనే ఉన్నాడు. అతన్ని పరీక్షగా చూశాను.

అప్పుడు “అమ్మా… న్నాన్నా… త్తమ్మూ … బ్బువ్వ కావాలి…” అంటూ పసిపిల్లాడి గొంతు వినిపించింది. శరవణకుమార్ నుండే. అతని నోరు మాత్రం కదల్లేదు. తడారిపోయి అంటుకుపోయిన పెదవులు వీడలేదు. నిద్రపోతున్న శ్వాస చప్పుడులోని లయ మారలేదు. అయితే కంఠం దగ్గర కదలికలు కనబడుతున్నాయి. వెంట్రిలాక్విస్టులు మాటల విన్యాసాలను ప్రదర్శించేప్పుడు వాళ్ళ కంఠభాగంలో అలాంటి కదలికలను చూశాను.

నర్సుతో “నువ్వు ఇక్కడే ఉండు…” అని అన్నాను. ఆమె భోరున ఏడ్చేసేలా ఉంది. “తోడుకు రాజును రమ్మంటాను” అని అన్నాను.


శరవణకుమార్ నా చేతులను పట్టుకున్నాడు. “డాక్టర్, నావల్ల కావడం లేదు… భరించలేకపోతున్నాను ప్లీజ్… నన్ను దీన్నుండి ఎలాగైనా బయటకు లాగేయండి… పొద్దస్తమానం వాడు నాతోనే ఉంటున్నాడు. నన్ను తడుముతున్నాడు, ముద్దు పెడుతున్నాడు, ఊపిరి నా మీదకు విడుస్తున్నాడు. ప్లీజ్ డాక్టర్ నేను వాడిని భరించలేకపోతున్నాను… నాకు దీని నుండి విముక్తి కలిగించండి” అని పూడుకుపోతున్న గొంతుతో ఏడవడం మొదలు పెట్టాడు.

నేను అతను ఏడుపు ఆపేదాకా చూస్తూ ఉన్నాను. తర్వాత “శరవణకుమార్! నేను చెప్పేది మీరు శ్రద్ధగా వినాలి. సెందిల్ సమస్య ఏంటన్నది…”

“అయితే ఇది స్కిజోఫ్రీనియా కాదా?”

“లేదు. సెందిలే మీతో ఉంటున్నది. నేను డాక్టర్లతో మాట్లాడేశాను.”

శరవణకుమార్ నిట్టూర్చాడు.

నేను ఇంగ్లీషులో కొనసాగించాను. “అతని సమస్య ఏంటి అన్నది మీరు అర్థం చేసుకోవాలి శరవణకుమార్. అతను మిమ్మల్ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించినవాడు. అతనిలాంటి మనుషులు చూపించే ప్రేమ చాలా స్వచ్ఛమైనది! ఆ ప్రేమలో అసలు స్వార్థమన్నదే ఉండదు. అతను మీతోనే ఉండేవాడు. మీరు అతని మీద ప్రేమ చూపించలేదు…”

“వాడిని నేను ద్వేషిస్తున్నాను. పూర్తిగా ద్వేషిస్తున్నాను. వాడిని తలచుకుంటేనే నాకు అసహ్యంతో ఒళ్ళు కుంచించుకుపోతుంది, జుగుప్స పుడుతుంది. వాడు నన్ను తాకడమన్నదాన్నే నేను అసలు భరించలేకపోతున్నాను.”

“చూశారా? తిరిగి పొందలేని ప్రేమే సెందిల్ సమస్య! అందుకే అతను మీతోనే ఉండేవాడు. దెబ్బలు తినేవాడు. అలా చేస్తే మీరు అతనితో ప్రేమగా ఉంటారు అనుకునేవాడు. ఇప్పుడూ అతను మీతోనే ఉంటున్నాడు. మీకు ఊడిగం చేస్తున్నాడు. అతని తపనను, ప్రేమను మీరు అర్థం చేసుకోవాలి.”

“నేనేం చెయ్యాలి?”

“మీరు అతన్ని ప్రేమించాలి.”

“వీలు కాదు డాక్టర్” అని శరవణకుమార్ గట్టిగా అరిచాడు. ఆవేశంగా ఒకసారి లేచి మళ్ళీ కూర్చున్నాడు. “లేదు అది మాత్రం కచ్చితంగా నావల్ల కాదు. నేను వాడిని ద్వేషిస్తున్నాను. ఆ అసహ్యపు పుట్టుకను… వాడి డోకుతెప్పించే వాసనను…” రెండుసార్లు వాంతి చేసుకున్నవాడిలా అతని ఒళ్ళు కదిలిపోయింది, కళ్ళల్లో నీళ్ళు తిరుగుతూంటే “లేదు… అది అసాధ్యం” అని అన్నాడు.

“మీరు జాగ్రత్తగా ఆలోచించండి శరవణ కుమార్. అతను చేసిన తప్పేంటి?”

“లేదు. వాడిని ప్రేమించలేను. నేను చచ్చిపోయినా సరే!”

“అయితే మీరు చచ్చిపోవాల్సి రావచ్చు…”

“డాక్టర్!”

“అవును, అదే నిజం! అతను సహనం కోల్పోయాడంటే మిమ్ముల్ని ఏమైనా చెయ్యగలడు. మీరు అతని చేతిలో ఉన్నారు. మీకు ఎలాంటి రక్షణా లేదు.”

శరవణకుమార్ భయపడ్డాడు. “నేనేం చెయ్యాలి?”

“అతన్ని ప్రేమించండి. అతనితో ప్రేమగా మాట్లాడండి. అతన్ని అన్నయ్యా అని పిలవండి. అతను మిమ్మల్ని తాకేటప్పుడు అసహ్యం కోపం చూపించకండి. వీలైతే తిరిగి అతన్ని తాకడానికి ప్రయత్నించండి. అతనితో మీరు ప్రేమగా ఉండటాన్ని అతను గ్రహించనివ్వండి…”

“అలా చేస్తే అతను తిరిగి వెళ్ళిపోతాడా?”

“అవును. అతని కోరికలు తీరగానే అతను తిరిగి వెళ్ళిపోక తప్పదు కదా? అదే కదా ప్రకృతి నియమం?”

“నావల్ల కాదు డాక్టర్. నేను వాడిని ఎంతగా ద్వేషిస్తున్నానో చెప్పలేను… ఒక క్షణం కూడా నేను వాడిని మనిషిగా భావించలేను!”

“ప్రయత్నించండి… మరో మార్గమే లేదు… పైగా ఇది ఒక ప్రాయశ్చిత్తం కూడా…”

అతను దిగ్భ్రాంతి చెంది లేచి, “ప్రాయశ్చిత్తమా? దేనికి?” అని అడిగాడు.

“మీరు అతన్ని బావిలో తోసేసినందుకు…”

మూర్ఛరోగం వచ్చినవాడిలా ఒళ్ళు ఈడ్చుకుంటూ ఈడ్చుకుంటూ శరవణకుమార్ కుర్చీలోనే ఒరిగిపోయాడు.

“నేను ఇవన్నీ గుచ్చి గుచ్చి అడిగి మరీ అతి కష్టంమీద తెలుసుకున్నాను. మీ అమ్మగారికి కూడా ఈ విషయం తెలుసు. ఆమెకు తెలుసు అన్న విషయం కూడా మీకు తెలుసు.”

శరవణకుమార్ ఉన్నపళంగా గట్టిగా కేకలు పెడుతూ ఏడవసాగాడు. చాలాసేపు ఏడ్చి మెల్లగా కుదుటపడ్డాడు.

“నేను ఎందుకు అలా చేశానో నాకే తెలీదు. వాడు బావిలోకి తొంగి చూశాడు. ఒక నిమిషం నేను నా విజ్ఞత కోల్పోయాను. వెనకనుండి కాళ్ళు పైకి ఎత్తి బావిలోకి తోసేసి పరిగెత్తుకుంటూ అక్కడ నుంచి వచ్చేశాను!” కాసేపు గాఢమైన నిశబ్దం. “వాడి శవం ఇంటికి వచ్చినప్పుడు నేను గోడకు ఆనుకుని వణుకుతూ నిల్చుని ఉండిపోయాను. నేను ఏడవలేకపోయాను. ఎందరో వచ్చి నన్ను ఓదార్చారు. మావయ్య ఒకాయన నాకు విస్కీ తాగించి నిద్రపుచ్చారు. ఆ తర్వాత మా అమ్మ మంచం పట్టింది. ఆమె లేవడమో, మాట్లాడటమో ఆ తర్వాత ఇంక జరగలేదు. చాలా రోజుల తర్వాత ఒక రోజు నేను ఆమె దగ్గరకు వెళ్ళాను. ఆమె నన్ను చూడగానే ఆమెకు అంతా తెలుసు అని నాకు అర్థం అయింది…”

“మీరు సెందిల్‌ను ప్రేమించండి. అది మీ అమ్మకూ నచ్చుతుంది.”

“అవును” అన్నాడు శరవణకుమార్ నిట్టూరుస్తూ.


ఆ తర్వాత ఒక వారం రోజులు శరవణకుమార్‌తోనే గడిపాను. అతను అనుభవిస్తున్న అతి తీవ్రమైన హింసను పక్కనే ఉండి చూశాను. సెందిల్‌ను ప్రేమించడం అతనివల్ల కావడంలేదు. ‘ద్వేషాన్ని తిని జీర్ణం చేసుకోవడం చాలా కష్టంగా ఉంది’ అని అతను అన్నప్పుడు నేనే పూర్తిగా నీరసపడిపోయాను. అయితే మనుషులు దేనికైనా అలవాటుపడతారు. మెల్లమెల్లగా శరవణకుమార్ సెందిల్‌కు దగ్గరకావడం మొదలుపెట్టాడు.

ఒంటరిగా ఉన్నప్పుడు ‘అన్నయ్యా నువ్వు నా బంగారు తండ్రివి, నువ్వు నా బుజ్జి అన్నయ్యవి’ ఇలాంటి మాటలతో ముద్దుచెయ్యమని చెప్పాను. కృత్రిమంగా ముద్దుచేసినా కూడా మెల్లమెల్లగా మనసు దాన్ని పట్టుకుని అటు వాలిపోగలదు. అయినప్పటికీ ముందుకు వెళ్ళడం అన్నది అంత సులభతరంగా లేదు. రెండు రోజులు అలా చేశాక మూడో రోజు నావల్ల కావడంలేదు అని గట్టిగా ఏడ్చేవాడు. మళ్ళీ అదే చెయ్యమని చెప్పేవాడిని.

శరవణకుమార్‌లో సెందిల్ కనిపించినప్పుడు నేను అతని పక్కన కూర్చుని మాట్లాడేవాడిని. ‘సెందిల్, నువ్వంటే శరవణకుమార్‌కు చాలా ఇష్టం. నిన్ను అతను బంగారు తండ్రీ అని ముద్దు చేస్తున్నాడు. నువ్వు చాలా మంచి పిల్లాడివి. నువ్వంటే శరవణకుమార్‌కు ఎంతో ఇది. శరవణకుమార్ నీకు ముద్దులు కూడా పెడతాడు’ అని చెప్పేవాడిని. అప్పుడు అతని పసిపిల్లాడి గొంతు, ఆ గారాల మాటలు, నవ్వులు వింటుంటే నేను కూడా సెందిల్‌తోనే మాట్లాడుతున్నాను అని అనిపించేది.

మెల్లమెల్లగా మార్పులు కనిపించాయి. శరవణకుమార్ ముఖంలో ఒక స్వచ్ఛత రావడం చూశాను. సెందిల్ ఎప్పుడూ వెంటే ఉంటున్నాడు. అయితే అదివరకులా ద్వేషభావం లేకపోవడంతో భరించలేని నరకంలా అనిపించడం లేదని శరవణకుమార్ అన్నాడు. అతని వాసన మాత్రమే చిన్న ఏవగింపు కలిగిస్తోంది. అయితే అదికూడా ముందున్నంత ఇబ్బందిగా ఏమీలేదు.

అలానే కొనసాగించండి. సెందిల్‌కు మెల్లగా మీరంటే విసుగు పుడుతుంది. మీ ప్రేమ, ఆదరణ నిర్ధారణ అయ్యాక అతనికి వేరే విషయాల మీద ఆసక్తి కలుగుతుంది అని అన్నాను. ‘అన్నయ్యా, అన్నయ్యా’ అని మళ్ళీ మళ్ళీ పలకరించేందుకు శిక్షణ ఇచ్చాను. రాత్రి సమయాల్లో ఒంటరిగా శరవణకుమార్ పదే పదే అలా పలకరిస్తూ మాట్లాడుతూ ఉండటాన్ని నేను చాటుగా నిల్చుని వినేవాడిని.


ఎనిమిది వారాల్లో వచ్చిన ఆ మార్పు నాకే ఆశ్చర్యాన్ని కలిగించింది. డాక్డర్ శివషణ్ముఖం ఇది ఒక గొప్ప అచీవ్‌మెంట్ అని అన్నారు. శరవణకుమార్ ముఖంలోను, ఒంటిలోను కొత్త నిగ్గు వచ్చింది. ఆ తీరని భయము, దు‌ఃఖమూ రెండూ పోయాయి. సెందిల్ తనతో లేడు అన్నది తనకు స్పష్టంగా తెలుస్తుంది అని అన్నాడు. అతను లేడన్నదాన్ని రుజువు చేసుకోడానికి చేసే ప్రయత్నంలో, అతని ఉనికిని ఏ మాత్రం కనుక్కోలేకపోయాను అని చెప్పాడు. ఒక రోజు రాత్రి ఒంటరిగానే బయటకు వెళ్ళి వచ్చాడు. చీకట్లోనూ, ఏకాంతంలోనూ సెందిల్ తనవెంటే ఉంటున్నాడు అన్న భావన కలుగుతుందా అని పరీక్షించి లేదని తెలుసుకున్నాడని చెప్పాడు.

అతని డిస్చార్జ్ గురించి ఆలోచించాను. ఆరు నెలలు అబ్జర్వేషన్‌లో ఉండాలి. మందులు తీసుకోవాలి. అతనితో దీని గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు సెందిల్‌ను ఇప్పుడు ప్రేమించగలుగుతున్నాడా అని అడిగాను.

కొన్ని క్షణాల మౌనం తర్వాత “చెప్పలేకపోతున్నాను డాక్టర్. నాకు ఇప్పుడు అతని మీద అసహ్యము, కోపము, బాధా ఏమీ లేవు. అతన్ని తలుచుకుంటే హమ్మయ్యా ఇకమీద ఏ ఇబ్బంది లేదు, అతను వెళ్ళిపోయాడు అని మాత్రమే అనిపిస్తుంది. అంతే! ప్రేమ… ప్రేమ లేదు అనే అనుకుంటున్నాను. ఇంతకంటే చెప్పడం నా వల్ల కావడంలేదు…” అన్నాడు. మళ్ళీ “ఒక మంగోలాయిడ్ మనకు కొడుకుగా పుట్టొచ్చు, మనం నాన్నగా ఉండొచ్చు. అయితే మనం ఒక మంగోలాయిడ్‌కి తోబుట్టువుగా మటుకు ఉండకూడదు” అన్నాడు.

“ఎందుకు?”

“ఎలా చెప్పాలో తెలీడంలేదు… అతను కురూపి. నన్నూ అతన్నీ అసలు పోల్చలేము. అయితే నాకు లోలోపల తెలుసు అతనూ నేనూ ఒకటేనని!”

“అర్థం కాలేదు.”

“నేనొక చిత్రం అనుకోండి. ఆ చిత్రాన్ని బాగ నలిపేసి ఉండచుట్టేసి మళ్ళీ విప్పి పరిచితే వచ్చే చిత్రమే అతను. అతని కురూపి ఆకారం లోపల నా ముఖము, నా శరీరమూ దాక్కుని ఉన్నాయి. అతను మాట్లాడేప్పుడు, నడిచేప్పుడు నన్ను వెక్కిరిస్తున్నట్టు ఉంటుంది. నన్ను అవమానిస్తున్నట్టు. కాదు, అవమానిస్తున్నది వాడు కాదు… ఇంకెవరో! లేదు ఇంకేదో. దేవుడు లేదా ప్రకృతి…’

నేను మెల్లగా “అవును. దానితోపాటుగా అతని కల్లాకపటంలేని ప్రేమ. అదీ మిమ్మల్ని అవమానిస్తున్నట్టే” అన్నాను.

అతను కొంచం అలసిపోయినట్టు తగ్గాడు. మెల్లగా పుంజుకుని “నిజమే. అతని సహజమైన లక్షణాలు నన్ను పచ్చి మోసగాడిలాను, క్రూరమైనవాడిగానూ చూపించేవి” అని అన్నాడు. నిట్టూరుస్తూ “నిన్నంతా ఇదే ఆలోచిస్తున్నాను డాక్టర్. ఎందుకు ఇలాంటి పిల్లలు పుట్టి మనల్ని ఇంతలా కష్టపెడతారు? వీటన్నిటికీ ఏంటి అర్థం?”

“అసలు మనషి జీవితానికి మాత్రం ఏం అర్థం ఉందంటారు?” అని అడిగాను.

సవ్వుతూ “ఇదీ అంతేనేమో!” అని అన్నాడు.


ఆ రోజు రాత్రి నర్స్ నాకు ఫోన్ చేసి అల్లకల్లోలం మధ్యలో ఉన్నదానిలా “డాక్టర్… శరవణకుమార్… తొందరగా రండి” అంది.

నేను శరవణకుమార్ గదికి చేరుకున్నప్పుడు లోపల గట్టిగా గద్దించుతూ సెందిల్ గొంతు వినబడింది. అంత కోపంగా ఆ గొంతును నేను ఎప్పుడూ వినలేదు. “నువ్వు చ్ఛెడ్డ త్తమ్మూ… నువు చ్ఛెడ్డ త్తమ్మూవి..” అని ఆ గొంతు తారాస్థాయిలో అరిచింది.

గదిలో శరవణుకుమార్ పళ్ళుబిగబట్టుకుని మెలికలు తిరుగుతూ ఉన్నాడు. చేతులు కాళ్ళు ఈడ్చుకుంటున్నట్టు కొంకర్లుపోతున్నాయి.

నేను అతన్ని తట్టి లేపాను. “శరవణకుమార్, శరవణకుమార్… ఇలా చూడండి!”

అతను ఏదో తెగిపడినవాడిలా నిద్రనుండి లేచాడు. ఎర్రబడ్డ కళ్ళతో నావైపుకు తీక్షణంగా చూశాడు. ఉన్నఫలాన నా చేతులను అందుకుని గట్టిగా పట్టుకుని “డాక్టర్… నన్ను కాపాడండి… సెందిల్…” అన్నాడు.

“ఏమైంది?”

“సెందిల్… సెందిల్ నన్నూ…”

“అన్నయ్యా అని పిలవండి… ప్రేమగా మాట్లాడండి…”

అప్పుడు ఆ క్షణంలో శరవణకుమార్ ముఖంలో కనిపించిన ఉగ్రమైన ద్వేషాన్ని నేను ఎప్పటికీ మరిచిపోలేను.

“ప్రేమగానా? వాడితోనా?” అంటూ ఆవేశంగా లేచాడు. “నేను వాడిని ద్వేషిస్తున్నాను. ఇక నటించడం నావల్ల కాదు. నేను వాడిని ద్వేషిస్తున్నాను. వాడిని తలుచుకుంటేనే అసహ్యంగా ఉంది… ద్వేషిస్తున్నాను… ద్వేషిస్తున్నాను…” ఒళ్ళంతా ఊగిపోతూ ఒక కుదుపు కుదిపేసుకుని సోలి పడిపోయాడు.

“సిస్టర్! ఆక్సిజన్! తొందరగా” అని పురమాయించాను.

శరవణకుమార్ నోటి చివర కొంచం రక్తం. అతని కళ్ళు ఎక్కడికో శూన్యంలోకి చూస్తున్నాయి. స్టెతస్కోప్ చాతీమీద పెట్టాను. చనిపోయాడు.

నాడి, గుండె పరీక్షించాను. సందేహం లేదు! గుండె కొట్టుకోవడం ఆగిపోయింది. చాలా అరుదుగా మానసిక రోగులు, తమ మనోవ్యాకులత తారాస్థాయికి చేరినప్పుడు గుండె ఆగిపోయి చనిపోతారు.

నిట్టూర్చి అతని కళ్ళు మూసేసి లేచాను. “సిస్టర్, వాళ్ళ నాన్నకు కబురుపెట్టు. ఆర్ముగాన్ని రమ్మన్నానని చెప్పు!” అని అన్నాను. ఆమె భయంభయంగా తలాడించి బయటకు వెళ్ళిపోయింది. నేను వాష్‌బేసిన్‌లో చేతులు కడుక్కుని ముఖం తుడుచుకుంటు ఉండగా, నా ఒళ్ళు జలదరింపచేసిన సెందిల్ నవ్వు, ఒక్క క్షణం మంద్రంగా వినిపించింది.

(మూలం: తంబి, 2005.)


జయమోహన్ 1962 ఏప్రిల్ 22న కేరళ-తమిళనాడు సరిహద్దు ప్రాంతంలో కన్యాకుమారి జిల్లాలో జన్మించారు. ఆయన తల్లితండ్రులు మలయాళీలు. ఇరవై రెండో ఏట వామపక్ష, సామ్యవాద సాహిత్యం మీద ఆసక్తి కలిగింది. ఆ రోజుల్లోనే రాసిన ఖైది అనే కవిత; నది‌, బోధి, పడుగై వంటి కథలు ఆయనకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. అప్పుడు రాసిన రబ్బర్‌ అనే నవల అకిలన్‌ స్మారక పురస్కారం అందుకుంది. ఈయన రచనలన్నీ మానసిక లోతులను వివిధ కోణాల్లో అద్దం పట్టేవిగా ఉంటాయి. 2015లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ పురస్కారాన్ని తన సిద్ధాంతానికి విరుద్ధమంటూ తిరస్కరించారు.