అశక్త

కాలమొక అశక్త.

ఇన్నేళ్ళయినా
గాయాన్ని మాన్పిందా?
లేదు!
జ్ఞాపకాన్నైనా చెరపిందా?
లేదు!
లేనిపోని శక్తి సామర్థ్యాలను
నెత్తిన రుద్దించుకుని
చిరునవ్వు మాయని
చేవలేని మనిషిలా
నిమిత్తమాత్రంగా
దొర్లుతుంటుంది.

నిర్వికారంగా
ఎరనుమింగే కొండచిలువై
క్షణాల్ని నిమిషాల్ని గంటల్ని
మింగేయడం మాత్రమే తెలుసు

కష్టానికి కన్నీరవడమో
ఆవేదనకు ఆలంబననివ్వడమో
దానికేం తెలుసు?

చీకటివెలుగుల చక్రభ్రమణాలకు
రాగద్వేషాల రంగులరాట్నాలకు
కళ్ళను మాత్రం అప్పగిస్తుంది కానీ
కనురెప్పపాటులో ఆవిరిైన ఆనందాన్ని
అందివ్వగలదా?
తృటిలో తెగిపడిన కలల ప్రపంచానికి
ప్రాణమివ్వగలదా?