విశ్వమహిళానవల 21: నెలీ బ్లై

అది 1889వ సంవత్సరం. ఒక మహిళాజర్నలిస్టు ‘పిచ్చిదానిలా’ నటించి పిచ్చాసుపత్రిలో చేరింది. కొంతకాలం అక్కడ గడిపి, బయటకు వచ్చి, మానసిక రోగులైన మహిళల జీవితాలు ఎంత దుస్థితిలో ఉన్నాయో, ఆ ఆస్పత్రిలో ఎలాంటి సంస్కరణలు అవసరమో వివరిస్తూ వార్తాకథనం రాసింది. అదే మహిళ, జూల్స్ వెర్న్ రాసిన అరౌండ్ ది వరల్డ్ ఇన్ ఎయిటీ డేస్ (1872) పుస్తకం చదివి ముచ్చటపడి తను కూడ ఒంటరిగా స్టీమర్‌పై ప్రపంచమంతా తిరిగివచ్చి మరో కథనం రాసింది. అవివాహిత అయిన అమ్మాయి అలా ప్రపంచమంతా తిరిగిరావడం చూసి, అమెరికన్లు ముక్కున వేలు వేసుకున్నారు. ఇన్విస్టిగేటివ్ జర్నలిజం ఇప్పుడు మామూలైపోయి వుండవచ్చు గాని, 19వ శతాబ్ది చివర్లో ఒక అమ్మాయి చేసిన సాహసాలకు లోకమే విస్తుపోయింది. ఆమె పేరు నెలీ బ్లై (Nellie Bly). జర్నలిజంలో ‘స్టంట్ జర్నలిస్టు’గా ప్రఖ్యాతి చెందిన ఈమె నవలల్లో ‘థ్రిల్లర్’లకు కూడ ఒక నమూనాను అందించింది. ఈ థ్రిల్లర్ లక్షణాలు మేరీ షెలీ, షార్లట్ బ్రాంటీ సృష్టించిన రకం కాదు. ఆ తర్వాత అగాథా క్రిస్టీ రాసినట్లాంటి పరిపూర్ణ అపరాధపరిశోధక నవలలూ కావు. ఇప్పుడు మనం వెబ్ సిరీస్‌లలో చూసే పక్కా కమర్షియల్, వరస హత్యాకాండల నవలలు. అందులోనూ స్త్రీలను ‘పగపట్టిన పడుచు’ల్లా చిత్రించడం ఆమె నవలలను ప్రత్యేకంగా నిలబెడతాయి.

జీవితం

నెలీ బ్లై అసలు పేరు ఎలిజబెత్ కాక్రన్ సీమన్ (Elizabeth Cochran Seaman). 1864లో పెన్సిల్వేనియాలో జన్మించింది. తండ్రి రెండు పెళ్ళిళ్ళు చేసుకోవడం, ఇద్దరు భార్యలకూ గంపెడు సంతానం ఉండటంతో ఎలిజబెత్‌కు చిన్నప్పుడే ఆర్థిక ఇబ్బందులు తెలుసు. తండ్రి కార్మికుడిగా జీవితం మొదలుపెట్టి, అంచెలంచెలుగా ఎదిగి, న్యాయాధికారి కూడ అయ్యాడు. కానీ ఎలిజబెత్ ఆరో యేటే అతను మరణించాడు. రెండో భార్య కూతురైన ఎలిజబెత్, తన తల్లితో మరో ఊరికి తరలివెళ్ళాల్సివచ్చింది. స్కూల్లో చేరింది కాని, ఆర్థిక వనరుల్లేక మధ్యలోనే చదువు ఆపేయాల్సివచ్చింది.

అలా ఇంట్లో ఉంటూ, భవిష్యత్తు గురించి బెంగపడుతున్న సమయంలో, పిట్స్‌బర్గ్ డిస్పాచ్ అనే పత్రికలో ఒక వ్యాసం (What girls are good for) కంటపడడం, ఎలిజబెత్ జీవితంలో పెద్ద మలుపు. ఆడపిల్లలు పెళ్ళి చేసుకుని పిల్లల్ని కనడానికే పుట్టారని చెప్పే ఆ వ్యాసం ఎలిజబెత్‌కు ఒళ్ళు మండించింది. వెంటనే దాన్ని ఖండిస్తూ ఆడపిల్లలకు పెళ్ళి కంటే, ఉద్యోగం, ఆర్థిక స్వాతంత్ర్యం ముఖ్యమని ఒక వ్యాసం రాసింది. ఆ పత్రిక సంపాదకుడికి అది నచ్చి ఆమెను పిలిపించి, మరో వ్యాసం రాయమన్నపుడు, విడాకుల చట్టాలు స్త్రీలకు వ్యతిరేకంగా ఉన్నాయని, వాటిని స్త్రీలకు మేలు చేసేలా సవరించాలనీ అంటూ మరో వ్యాసం రాసింది. అది కూడ నచ్చి సంపాదకుడు ఆమెకు తన పత్రికలో ఉద్యోగం ఇచ్చాడు. ఆ రోజుల్లో పాత్రికేయులుగా పనిచేసే స్త్రీలు, తమ పేర్లు బయట పెట్టకూడదని భావించేవారు కనక, ఎలిజబెత్ కాక్రన్‌ని సంపాదకుడు నెలీ బ్లైగా మార్చాడు. ఆ విధంగా ఆమెకు ఆ పేరే చిరస్థాయిగా నిలిచిపోయింది.

ఉద్యోగం వచ్చాక ఆమె స్త్రీల హక్కులపై రాతలను కొనసాగించడం చాలామందికి నచ్చలేదు. కర్మాగారాల్లో మహిళా కార్మికుల కష్టాలపై వ్యాసం రాసి, యజమానుల ఆగ్రహానికి గురైంది. ఇక ఈమె ఇలాంటి వ్యాసాలే రాస్తూ పోతే ప్రమాదకరమని, సంపాదకుడు ఫాషన్‌ పైన, తోటపని పైన, ఆడపిల్లలు సమాజంలో ఎలా మెలగాలనే విషయాల పైనా రాయమని పురమాయించాడు. ఆమెలోని తిరుగుబాటు తత్వానికి ఇది అసలు సరిపడక ఉద్యోగం వదిలేసి, మెక్సికోకు వెళ్ళింది. అక్కడ ప్రభుత్వపు లంచగొండితనం బైటపెట్టడంతో తరిమివేయబడి తిరిగి అమెరికాకు వచ్చేసింది. తిరిగి వచ్చిన తర్వాత జర్నలిజంలో తనదైన ముద్ర వెయ్యాలని అనిపించడంతో న్యూ యార్క్‌కి వెళ్ళి అక్కడి పత్రికాధిపతులకు తన కొత్త తరహా ఆలోచనలను చెప్పింది. అవి నచ్చిన ఒక సంపాదకుడు ఆమెకు స్వేచ్ఛగా వార్తాకథనాలు సేకరించే అవకాశం ఇచ్చాడు. అలాంటి ఎన్నో కథనాలు సేకరించే క్రమంలోనే ఇందాక చెప్పుకున్నట్టు, బ్లాక్‍వెల్ ఐలండ్ లోని మానసికరోగుల ఆస్పత్రిలో చేరింది. పదిరోజుల పాటు పిచ్చిదానిగా నటించింది. తర్వాత తిరిగి వచ్చి ఆస్పత్రిలో స్త్రీల పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో రాసి, సంచలనం సృష్టించింది. ఈ వార్తాకథనం వల్ల గ్రాండ్ జ్యూరీ ముందు హాజరై, సాక్ష్యం ఇవ్వాల్సివచ్చింది ఆమెకు. ఆమె రాసిందంతా నిజమని తేలగానే ఆస్పత్రి పరిస్థితులను మెరుగు పరచడానికి సిద్ధమయింది ప్రభుత్వం. ఈ అనుభవంతో ఆమె రాసిన టెన్ డేస్ ఇన్ ఎ మాడ్‍హౌస్ (Ten days in a Mad house) అన్న రచన సంచలనం సృష్టించి ఆమెకు కీర్తి ప్రఖ్యాతులు తెచ్చిపెట్టింది. తర్వాత డెబ్భైరెండు రోజుల్లో – ఫిలియాస్ ఫాగ్ కన్నా తక్కువ సమయంలో – స్టీమర్‌లో ప్రపంచాన్ని చుట్టివచ్చి దాన్ని కూడ ఒక పుస్తకంగా రాసింది. అలా పాత్రికేయరంగంలో ఆమెకు ‘స్టంట్’ జర్నలిజం ప్రారంభించిన తొలి మహిళగా పేరు వచ్చింది. తన ప్రపంచయాత్రలో ఆమె ఎక్కడ కనిపించినా వేలాదిమంది చుట్టుముట్టేవారు. బహుశా అప్పటి అమెరికా అధ్యక్షులకు కూడ ఇంత జనాకర్షణ ఉండేది కాదని విమర్శకులంటారు.

నవలారచన

ఇలా పాత్రికేయవృత్తిలో ఎంత పేరు వచ్చినా, నవలారచయిత్రిగా పేరు తెచ్చుకోవాలన్న తృష్ణ మాత్రం నెలీ బ్లైకి తీరలేదు. మొత్తం పదకొండు నవలలు రాసినా, నవలా రచయిత్రిగా పేరు రాలేదు. ఆ నవలలన్నీ ఆమె అనుభవంలో చూసిన సన్నివేశాలు, వ్యక్తుల కథనాలే. ఒకసారి తన వృత్తిలో భాగంగా ఈవా హామిల్టన్ (Eva Hamilton) అనే హంతకురాలిని ఇంటర్‍వ్యూ చేసింది. ఆ ఇంటర్‍వ్యూ ఫలితంగానే ఈవా ది అడ్వెంచరెస్ (Eva: The adventuress) అనే నవల రాసింది. స్త్రీలు నవలలు రాయడం అప్పటికి యూరప్ లోనూ అమెరికా లోనూ సాధారణమైన విషయమే. కానీ వారి వస్తువులు ఎక్కువగా స్త్రీపురుష సంబంధాలు, సామాజిక కట్టుబాట్ల వంటివే. తొలిసారి ఒక హంతకురాలైన స్త్రీని నాయికను చేసి థ్రిల్లర్ నవల రాసిన ఘనత నెలీ బ్లైకే దక్కుతుంది. ఆమె నవలలన్నీ క్రైమ్ థ్రిల్లర్లే. 1889-1895 లోపల అన్ని నవలలూ రాసేసింది. అన్నిటినీ నార్మన్ మన్రో అనే పత్రికా సంపాదకుడు తన పత్రికలో సీరియల్స్‌గా ప్రచురించాడు. కానీ ఆ ప్రతులు కూడ అలభ్యం కావడంతో చాలా యేళ్ళు నెలీ బ్లై నవలలు ఎవరికీ అందుబాటులోకి రాలేదు. చిట్టచివరికి అంటే ఇటీవల, 2021లో డేవిడ్ బ్లిక్స్‌ట్ (David Blixt) అనే రచయితకు ఈ నవలల ఆచూకీ అనుకోకుండా లభించి, అతను పరిశోధనకు పూనుకుని ఆ పదకొండు నవలలనూ వెలికితీశాడు. అలా నెలీ బ్లై నవలలు తిరిగి వెలుగు చూశాయి. అందుకే నవలాచరిత్రలో కూడ ఈమె పేరు పెద్దగా వినబడదు. ఆమె నవలలపై విమర్శా లేదు.

వ్యక్తిగత జీవితంలో తర్వాతి పరిణామాలు చూస్తే, ఆమె ఒక వ్యాపారవేత్తగా కూడ కనిపిస్తుంది. 1895లో అంటే తన 31వ యేట 73 ఏళ్ళ వ్యాపారవేత్త రాబర్ట్ సీమన్‌ను ఆమె వివాహం చేసుకుంది. 1904లో సీమన్ మరణించాక, అతని వ్యాపారాన్ని ఆమె సమర్థవంతంగానే కొనసాగించింది. తను ఏ ఆదర్శాలనైతే కార్మికుల (ముఖ్యంగా మహిళలు) పట్ల జర్నలిస్టుగా ప్రకటించిందో, అవన్నీ ఆచరణలో కూడ పెట్టింది. కానీ ఆమెకు ఆర్థిక విషయాల్లో అవగాహన లేకపోవడాన్ని అవకాశంగా తీసుకుని కింది ఉద్యోగులు మోసం చేయడంతో, దివాలా తీసింది. దీనితో తిరిగి జర్నలిజంకే వెళ్ళింది. మహిళల ఓటుహక్కు పోరాటంలో పాల్గొనడంతో పాటు, తొలి ప్రపంచ యుద్ధం జరుగుతూండగా, వార్ జోన్‌కు వెళ్ళిన తొలి మహిళా జర్నలిస్టుగా కూడ ఆమె పేరు నమోదయింది. ఇలా ఎంతో సాహసోపేతమైన జీవితం గడిపిన నెలీ బ్లై 1922లో న్యుమోనియాతో మరణించింది.

నెలీ బ్లైకి మరణానంతరం ఎన్నో గౌరవాలు దక్కాయి. ఆమె జీవితం ఆధారంగా మ్యూజికల్స్, టీవీ షోలు వచ్చాయి. ఇప్పటికీ అమెరికాలో ఆమె పేరిట ఉత్తమ మహిళా జర్నలిస్టులకు ఏటా పురస్కారాలు అందిస్తున్నారు. కానీ అమెరికన్ నవలాలోకంలో ఆమెకు అంత పేరు లేదు. అయితే, నిజజీవితానుభవాలను క్రైమ్ నవలగా తీర్చిదిద్దిన ఆమె, నవలారచనలో కొత్త ఒరవడిని ప్రారంభించిందని చెప్పుకోవచ్చు. బహుశా ఆమె నవలలు తొందరగానే లభించివుంటే, మరికొంత విమర్శ, పరిశోధన జరిగివుండేవేమో.

ఈవా ది అడ్వెంచరెస్

ఇది దాదాపు 300 పేజీలున్న నవల. ఇది ఆమె రెండో నవల. తొలి నవల కూడ థ్రిల్లరే. ది మిస్టరీ ఆఫ్ సెంట్రల్ పార్క్ అన్న ఆ నవలలో ఒక దుర్మార్గుడైన మగవాడు. స్త్రీలను వాడుకుని, చంపేయడం ఇతివృత్తం. సరిగ్గా అప్పుడే, అంటే 1888 ప్రాంతంలో జాక్ ది రిప్పర్ లండన్‌లో వరసగా హత్యలు చేసి, సంచలనం సృష్టిస్తున్నాడు. అంటే అప్పటికప్పుడు జరిగిన సంఘటనలనే నవలలుగా మలచడం ఆమె రచనావ్యూహం. ఇప్పుడు మనకు సీరియల్ కిల్లర్‍ల కథలు, వెబ్ సిరీస్ సర్వసామాన్యమైపోయాయి గానీ ఆ రోజుల్లో అది కొత్త వస్తువే కనక, దాని వెనక రచయిత్రి పరిశోధన స్పష్టం కనక (జర్నలిస్టుగా పరిశోధన, దర్యాప్తులు ఆమెకు అప్పటికే అలవాటు) కొద్దో గొప్పో పాఠకులకు, విమర్శకులకు నచ్చింది. ఇప్పుడు నవలాశిల్పం దృష్టితో, ఇతివృత్తం దృష్టితో చూస్తే, అవి సగం ఉడికిన రచనలలుగా అనిపించవచ్చు. అది వేరే సంగతి. కానీ ఆమె ఈవా నవల రాసినపుడు, సరిగ్గా ప్రపంచయాత్ర చెయ్యబోతున్న తరుణం. అంటే తన ప్రపంచయాత్ర ప్రకటన ద్వారా సంచలనం సృష్టిస్తున్న రచయిత్రి నవలని తన పత్రికలో వేసుకోవడం ద్వారా అమ్మకాలు బాగా పెరుగుతాయన్న దృష్టితో నార్మన్ ఆ నవలను వెంటనే సీరియల్‌గా ప్రచురించడం ఆరంభించాడు. ఈ నవలను కేవలం నెలరోజుల్లోపలే ఆమె పూర్తిచేసింది. తర్వాత యాత్రకు బయల్దేరింది. ఒక రకంగా చెప్పాలంటే ఈవా హామిల్టన్ అన్న ఆ ‘నేరస్థురాలు’, ఆమెను ఇంటర్‍వ్యూ చేసిన నెలీ, ఇద్దరూ అప్పుడు ‘వార్తల్లోని వ్యక్తులు’. వీళ్ళిద్దరి కలయికతో వచ్చిన ఈ నవల పాఠకుల్లో కుతూహలం రేకెత్తించడం సహజం. అలా ఈ నవల ప్రచురణకర్తకు బోలెడు లాభాలు తెచ్చిపెట్టింది.

నెలీ బ్లై నవలలన్నిటిలోనూ ఆమె పాత్రికేయ అనుభవాలు, ఆమె స్త్రీల హక్కుల కోసం చేస్తున్న పోరాటాల స్ఫూర్తి ఉంటాయి. స్త్రీ పాత్రల్లో చాలావరకు ఆమె వ్యక్తిత్వంలోని ఏదో ఒక పార్శ్వం ఉంటుంది. ఆమె పుస్తకాలను తవ్వితీసిన డేవిడ్ బ్లిక్సిట్, ‘ఆమె రాసిన కాల్పనికేతర రచనలు అధికాదరణ పొందినా, ఆమె పదకొండు నవలలు మాత్రం ఒక్కసారే తప్ప మళ్ళీ ముద్రింపబడలేదు. అందుకే 20వ శతాబ్దిలో ఎవరూ ఆమె గురించి ఒక నవలాకారిణిగా చెప్పలేదు’ అంటాడు. ఇలా అంటూ, ‘Nellie Bly is rightly remembered for her reporting work, her early feminism, and her part in the rise of ‘stunt’ journalism. She was also a canny industrialist, a generous employer, a devoted patron to many causes, a tireless fighter for the oppressed and dispossessed. She was also a novelist’ అని తేల్చాడు. అంటే నవలారచన ఆమె ప్రాథమిక వ్యాసంగం కాదు. ఆమె అస్తిత్వంలో అతి ముఖ్యమైనదీ కాదు. ‘ఆమె నవలలు కూడ రాసింది’ అనడంలోనే అది ఎంత అప్రధానమో చెప్పాడు. అలా అన్నప్పటికీ, తనే స్వయంగా ఆ నవలలన్నటినీ అవసరమైన చోట ఎడిట్ చేసి, శ్రద్ధగా సవరణలు చేసి, ఇప్పటి పాఠకులకు అందించాడు.

19వ శతాబ్ది స్త్రీల నవలల్లో పురుషుడు, ఆఢపిల్లలను ప్రేమపేరిట మోసం చెయ్యడం కొత్త వస్తువు కాదు. స్త్రీలు ఒకరికంటే ఎక్కువమంది పురుషలతో సంబంధం పెట్టుకోవడం కూడ కొత్త వస్తువు కాదు. అప్పటికే టోల్‍స్టోయ్ (అన్నా కెరెనినా) థామస్ హార్డీ (టెస్), నెథానియల్ హాథార్న్ (స్కార్లెట్ లెటర్) గుస్తావ్ ఫ్లాబె (మదామ్ బొవెరీ) వంటి వారు తమ అత్యుత్తమ నవలల్లో ఇలాంటి స్త్రీలనే నాయికల్ని (ఆ మాటకొస్తే ప్రొటాగనిస్టులను) చేశారు. కానీ ఈ నవల ప్రత్యేకత, కథానాయిక తన స్థితికి కుమిలిపోవడానికి బదులు లేదా కొందరి నవలల్లోలా తాత్వికంగా, శాంతంగా తన స్థితిని స్వీకరించడానికి బదులు; లేదా ఆత్మత్యాగం చేసుకునే బదులు; తనకు ద్రోహం చేసిన వారిపై పగబట్టడం, హింసకు పాల్పడడం. జర్నలిస్టుగా తన అనుభవంలో సాధ్వీలలామలను మాత్రమే చూడలేదు నెలీ. ఆగ్రహంతో రగిలిపోయిన స్త్రీలనూ చూసింది. అందుకే అలాంటి కథానాయికను ఎంచుకుంది.

కథానాయిక ఈవా పేదకుటుంబంలో పుడుతుంది. పాఠశాలలో ధనవంతురాలైన లిలీ అనే సంపన్న కుటుంబానికి చెందిన అమ్మాయితో ఎప్పుడూ గొడవపడుతూంటుంది. ఒకసారి లిలీ తనని అపహాస్యం చేసి అవమానిస్తే తిరగబడి ఆ అమ్మాయిని కొట్టినందుకు అందరూ ఈమెనే తిడతారు. డబ్బున్న అమ్మాయి కాబట్టి ఎవరూ ఆమెను ఏమీ అనరు. అప్పటినుంచి తనని అవమానించినవారిపై పగ పెంచుకుంటుంది. లిలీలా తను కూడ ధనవంతురాలై అందరినీ శాసించాలనుకుంటుంది. ఈ క్రమంలో బిలీ డాట్ అనే వ్యక్తి తనను వెంటాడగా, అతన్ని తప్పించుకోవడంలో గాయపడి, మారిస్ వాండర్‌ఫెల్ట్ అనే అందమైన యువకుడివల్ల తేరుకుంటుంది. అతనితో ‘ప్రేమలో’ (సిండరెల్లా వంటి తనకు అతను ప్రిన్స్ ఛార్మింగ్ అంటుంది) పడుతుంది. బిలీ వీళ్ళిద్దరికీ అడ్డురాగా, అతన్ని మారియస్ ప్రమాదవశాత్తు చంపేస్తాడు. ఇక అక్కడ వుంటే ప్రమాదమని ఇద్దరూ పారిపోతారు. న్యూ యార్క్‌లో ఒక ఫ్రెంచి పురోహితుడు వీళ్ళకు పెళ్ళి చేస్తాడు. జీవితమే సఫలమూ అని ఆమె పాడుకునే సమయంలో ఒకసారి చాటునుంచి, తన భర్త, ఒక ఆగంతుకుడితో మాట్లాడ్డం విని హతాశురాలవుతుంది. తామిద్దరి మధ్య జరిగింది పెళ్ళికాదని, ఇలా ఆడపిల్లల్ని తీసుకురావడం అతనికి అలవాటేననీ విని కోపంతో విరుచుకుపడుతుంది. అతని మిత్రుడు, ఇంత అందమైన ముఖం, అవయవసౌష్టవం ఉన్న అమ్మాయికి బతకడం కష్టమేమీ కాదు ప్రపంచంలో అన్నపుడు, తన ‘భర్త’ అతన్ని ఖండిస్తాడేమోనని చూస్తే, ఖండించడు. దానితో, అక్కడున్న గొడ్డలితో మిత్రుడి మీదకు లంఘించి, తీవ్రంగా గాయపరచి అక్కడినుంచి వెళ్ళిపోతుంది. తన సామానంతా తీసుకుని న్యూ యార్క్‌లో హోటల్‌లో బస చేద్దామనుకుంటే, ఒంటరి స్త్రీకి హోటల్ గదులు లభించవు. రాబర్ట్ లోరాన్ అనే వ్యక్తి ఆమెను కాపాడి, రూమ్ లభించేలా చేస్తాడు. అతను కూడ తర్వాత ఆమెను ఇంటికి తీసుకువెళ్తాడు. ఆమెను వాంఛిస్తాడు. కానీ లొంగదు. అతన్ని కూడ పొడిచి పారిపోతుంది. తర్వాత మార్షల్ రాండల్ ఆమెను తన ఇంటికి తీసుకువెళ్తాడు. అతని స్వభావం కూడ అందరు మగవాళ్ళలాంటిదే అని గ్రహించి, అతనితో ఓ ఆట ఆడుకుందామనుకుంటుంది. బ్యాంక్ కేషియర్ అయిన అతన్ని తన కోసం ఆఫీసు సొమ్ము దొంగలించి తెమ్మంటుంది. అతను ఆ పని చేయగానే, అతన్ని నేరస్థుడిగా ముద్రవేసి, ఇంటినుంచి పారిపోయే క్రమంలో రాడ్రిక్ హుండస్ అనే మరో సంపన్నుడి చేత రక్షింపబడుతుంది. ఎట్టకేలకు, అతని పట్ల తనకు ఏర్పడింది నిజమైన ప్రేమ అని నిర్ణయించుకుంటుంది.

తనకు మారిస్ చేసిన అన్యాయం వల్ల, యావత్తు పురుషజాతి పైనా ప్రతీకారం తీసుకోవాలనుకున్న ఈవాకి రాడ్రిక్ తనను పెళ్ళి చేసుకోమని కోరినపుడు, పశ్చాత్తాపం కలుగుతుంది. తను ఎలాంటి పనులు చేసిందో, తన గతంలో ఎన్ని నేరాలు, విషాదాలు ఉన్నాయో ఇతనికి తెలీదు కదా అని భయపడుతుంది. మొదటిసారి తన పగను మరిచిపోవాలని, రాడ్రిక్‌తో సంతోషంగా జీవించాలనీ అనుకుంటుంది. కానీ బ్యాంక్ కేషియర్ రాండల్ ఆమెపై పగబడ్తాడు. ఆమె వల్ల డబ్బు దొంగలించిన అతను, స్నేహితుల సాయంతో అరెస్టు తప్పించుకున్నా ఉద్యోగం కోల్పోతాడు. ఆమెను బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభిస్తాడు. ఆమె తరచు అతనికి డబ్బులివ్వడమే కాక, తన భర్తతో కాలిఫోర్నియాకు వెళ్ళినపుడు, అతను కూడ వస్తాడు. వాళ్ళ ఇంటికి వచ్చి ఆమెను వేధిస్తాడు. ఏ క్షణమైనా ఆమె గతాన్ని రాడ్‌కి చెప్తానని బెదిరించడంతో అతను పెట్టే మానసిక హింసను భరిస్తూంటుంది. అదే సమయంలో మొదట ఆమెను వంచించిన వాండర్‌ఫెల్ట్ కూడ వస్తాడు. ఇలా తన గతంలోని ఇద్దరూ ప్రత్యక్షమవడంతో ఆమె కలత చెందుతుంది. అయితే వాండర్‌ఫెల్ట్ మాత్రం ఆమెను మోసగించినందుకు పశ్చాత్తాపం వ్యక్తం చేస్తాడు.

ఇక అక్కడి నుంచీ రాండల్‌ని వదిలించుకోడానికి ఆమె చేసే ప్రయత్నాలన్నీ విఫలమౌతాయి. తన గతం తాలూకు రహస్యం దాచివుంచేందుకు, తనను ఎంతగానో ప్రేమించే భర్తను అనేక రకాలుగా వంచిస్తుంది. తను గర్భవతినని చెప్పి, యూరప్ చూడాలని వుందని, భర్తకు కుదరదు కనక తను వెళ్తాననీ చెప్తుంది. నిజానికి ఆమె గర్భవతి కాదు. రాండల్, తనని యూరప్‌కి తీసుకువెళ్ళకపోతే భర్తకు చెప్పేస్తానని అనడంతో వెళ్తుంది. ఈ ప్రయాణంలో రాండల్‌ని విషం పెట్టి చంపాలని చేసే ప్రయత్నం కూడా విఫలమవుతుంది. తన పరిచారిక సాయంతో, ఎవరో అనాథశిశువును తెచ్చి డెలివరీ అయిందని చెప్పి, తన భర్త చేతిలో ఆ శిశువును పెడుతుంది. తమ బిడ్డే అనుకుని ఎంతో ఆనందిస్తాడు రాడ్రిక్.

ఆ తర్వాత మరో ప్రమాదం వచ్చిపడుతుంది. మారిస్‌తో తన నకిలీ వివాహానికి సాక్షి అయిన మరియా అనే నర్సు వీళ్ళ ఇంటికి వచ్చి, రాండల్ తరహాలో తను కూడ బ్లాక్‌మెయిల్ మొదలుపెడుతుంది. ఈవా, తప్పనిసరై తన బిడ్డకు ఆమెను నర్సుగా పెట్టుకుంటుంది. ఒక రాత్రి మరియా, ఈవా లేని సమయంలో, రాడ్‌ని లొంగదీసుకుని, అప్పటినుంచీ తనే ఆ ఇంటి యజమానురాలిగా ప్రవర్తిస్తుంది. దీన్ని భరించలేక, ఈవా రోజూ గొడవ పెట్టుకుంటూ ఉంటుంది ఆమెతో. ఒకరోజు రాడ్రిక్ సమక్షంలోనే, నర్సుకూ ఈవాకూ జరిగిన మాటల యుద్ధంలో ఈవా గత చరిత్ర మొత్తాన్ని నర్సు అనుకోకుండా బయటపెట్టేస్తుంది. రాడ్ నిర్ఘాంతపోతాడు. తన జీవితాన్ని నాశనం చేసిన నర్సుపై ఈవా కత్తితో దాడి చేసి పొడుస్తుంది. పోలీసులు ఈవాను అరెస్టు చేస్తారు. జైల్లో తన యావజ్జీవితాన్ని పునశ్చరణ చేసుకుంటుంది.

తన ప్రతీకార గాథ లిలీ అనే అమ్మాయి తనను చిన్నప్పుడు బుల్లీయింగ్ చేసి, తన బాల్యాన్ని నాశనం చేయడంతో మొదలయింది: “And Lil Cartwright? After all, the entire failure of my life dates back to the cruelty of that girl when I was a helpless, innocent, ignorant child. It is to her that the curse belongs, not to me. But she will live her life out in ease and plenty, loved by those whom she has not the heart to love in return, while I—I shall be ‘hanged by the neck until I am dead.’ I wonder how I shall ever have the courage so bear it?”

లిలీ ఉదంతంలో ఆమెను తీవ్రంగా బాధించిన మరో అంశం – తను లిలీని తిరగబడి కొట్టినందుకు, ఆమె తండ్రి తన పెంపుడు కుక్కను కొట్టి చంపేయడం. ఈ సంఘటనను ఎప్పటికీ మరిచిపోలేకపోతుంది ఈవా. తన కళ్ళముందే పెంపుడు కుక్కను చంపేసిన క్షణమే ఆమెలో ప్రతీకారజ్వాలను రగలించిందని చెప్పవచ్చు: “I have dreamed of my revenge, mam,” she continued, in a low, deep voice; “I have lain awake nights and swore over and over to myself that I would be revenged. I have planned it all out, and it doesn’t mean that I should marry a penniless country clod-hopper, and spend the remainder of my days in this village. Oh, no—no!”

అయితే లిలీ మీద తన ప్రతీకారాన్ని అంతకు ముందే తీర్చుకుంది. రాడ్రిక్‌ని వివాహం చేసుకున్నాక, ఒకసారి తన పుట్టిన వూరికి వెళ్ళి, లిలీ కార్ట్‌రైట్ ముందు తన సంపదను, అందమైన భర్తను, సమాజంలో తనకు ఇప్పుడున్న హోదాను ప్రదర్శించి, ఆమెపై చిన్నప్పటినుంచి ఉన్న అక్కసునంతా తీర్చుకుంటుంది. అదొక అపురూపమైన అనుభూతిగా తలచుకుంటుంది.

కానీ ఇప్పుడు ఏమైంది? నేరం చేసింది. జైల్లో ఉంది. కడుపు నిండా తిండి లేని బాల్యమే పునరావృతమైంది. తన పట్ల సానుభూతి చూపే ఒక్క ప్రాణి కూడ, తన బాల్యంలోలాగే ఇప్పుడూ లేదు. అన్నిటికంటే ముఖ్యంగా, తనను జీవితంలో నిజాయితీగా ప్రేమించిన భర్త హృదయాన్ని భగ్నం చేసి, తను ప్రేమలోనూ విఫలమైంది.

“You have broken my heart, while I was showering you with every blessing that lay in my power. You have dragged my name through the gutter, while I was shielding you with its honor and its love. I do not mean to reproach you.” అన్న భర్త మాటలను స్మరించుకుంటూ ఉంటుంది.

తను నేరం చేసింది నిజమే. హత్యాయత్నం శిక్షార్హమే. కానీ తనను మానసికంగా ఏళ్ళ తరబడి వేధించిన వాళ్ళ నేరం మాటేమిటి? వారికెందుకు శిక్ష పడదు ఈ వ్యవస్థలో? “They all said at home that I would come to no good. Bill Scarlett’s daughter, who scorned her own father, finds herself in a position in which even he, bad as he is, has never had the misfortune to be. Perhaps it is justice, but I cannot see it! I am wrong to say that, but there are others who should suffer with me! I am not a martyr to wish to take all the wrong-doing upon my own shoulders, and there are others that have sinned even more than I have.”

అదృష్టవశాత్తు నర్సుకు తగిలిన కత్తిగాయం ప్రమాదకరంగా పరిణమించక, ఆమె కోలుకోవడంతో, ఈవాకు శిక్ష తగ్గుతుంది. రెండేళ్ళకు పైగా మాత్రమే శిక్ష పడుతుంది. ఆమె జైలుకి వెళ్ళిన తర్వాత, తనని చూడ్డానికి అపరిచితుడైన రాల్ఫ్ హాయ్‌ట్ అనే ఒక యువకుడు వస్తాడు. తన కథంతా పత్రికల ద్వారా తెలుసుకుని, తనకు సానుభూతి తెలిపిన ఒకే ఒక వ్యక్తి అతను. ఆమె శిక్ష అనంతరం బయటకు వచ్చాక, అతనే ఆమెను తీసుకువెళ్ళడానికి వస్తాడు. ఆమె జైల్లో ఉండగానే రాడ్ ఆమెకు విడాకులు ఇస్తాడు. అదే సమయంలో రాల్ఫ్ ఆమెకు పరిచయమై, జీవితంలో ఒక్కడైనా తనను అర్థం చేసుకుంటాడన్న ఆశ కలుగుతుంది.

జైలు జీవితంలో ఈవా ఆగ్రహం, పగ చల్లారతాయి. ఆమెలో తను చేసిన పనులకు పశ్చాత్తాపం పెద్దగా లేదు గానీ తన పరిస్థితులతో రాజీపడడం నేర్చుకుంటుంది. జైలు నుంచి రాల్ఫ్ ఆమెను తన ఇంటికి తీసుకువచ్చేసరికి ఎదురుగా, రాడ్ ఇంట్లో పనిచేసిన, తనకు ఆప్తురాలైన ఆలిస్, తన బిడ్డ (తనదని చెప్పి భర్తను మోసంచేసి, ప్రేమగా పెంచుకున్న ఆడపిల్ల) ఎదురొస్తారు. ఇక ఈవా ఆనందం పరిపూర్ణం. అంతకు పూర్వం, డబ్బున్న మగవాణ్ణి వల్లో వేసుకుని, విచ్చలవిడిగా ఖర్చుచేసి, సుఖాలు అనుభవించాలని ప్రయత్నించిన ఈవా, ఇప్పుడు సొంత కాళ్ళపై నిలబడి, పిల్లను పోషించుకోవాలని అనుకుంటుంది. ఆమెకు బాగా చేతనయింది ఎంబ్రాయిడరీ కనక దానితోనే సంపాదన మొదలుపెడుతుంది. క్రమంగా రాల్ఫ్‌తో స్నేహం బలపడుతుంది. అతనికి ఆమెపై ప్రేమకలిగినా, ఆమె జాలి అనుకుంటుందేమోనని వివాహం ప్రసక్తి తీసుకురాడు.

ఒకరోజు అకస్మాత్తుగా వీధిలో రాడ్ ఆమెకు కనిపిస్తాడు. ఈవాకు విడాకులు ఇచ్చినా, తనపై ప్రేమ ఏ మాత్రం తగ్గలేదని, మళ్ళీ కలిసి జీవిద్దామనీ అడుగుతాడు. ఈవా ఒప్పుకోదు. ఎప్పటికైనా నీకు నేను చేసిన వంచనలన్నీ గుర్తుకొచ్చి మళ్ళీ ద్వేషం పుట్టక మానదు; ఇక వద్దనేస్తుంది. ఇంతలో రాల్ఫ్ ఇంట్లోకి వస్తాడు. అతన్ని చూసి అనుమానించిన రాడ్, తమ ఇద్దరి మధ్యా తేల్చుకోమనగా, తన నేరాలన్నీ తెలిసి, తన పరిస్థితిని, చర్యలను అర్థం చేసుకున్న రాల్ఫ్‌నే ఎన్నుకుంటానని అంటుంది. అక్కడితో కథ సుఖాంతమవుతుంది. ఇంతకాలానికి ఏ ద్వేషమూ పగా లేకుండా ప్రశాంతంగా ఒక నిర్ణయం తీసుకుంటుంది ఈవా.

ఈవా కథకు స్ఫూర్తి

ఈవా పాత్రను అదే పేరు కలిగిన ఒక నేరస్థురాలి ఆధారంగా చిత్రించింది నెలీ. ఆమె పేరు ఈవా హామిల్టన్. ఒక పురుషుడి చేతిలో మోసపోయి, అతన్ని పొడవడం, మరో వ్యక్తిని వివాహం చేసుకుని ఎవరికో పుట్టిన బిడ్డను, తమ బిడ్డగా చూపించడం, తనను బ్లాక్‌మెయిల్ చేయబోయిన నర్సును కత్తితో పొడవడం – ఇవన్నీ ఈవా హామిల్టన్ జీవితంలో జరిగినవే. అయితే బాంక్ కేషియర్ బ్లాక్‌మెయిల్, తను ప్రేమించిన భర్తను వదులుకోలేక ఆ బ్లాక్‌మెయిల్‌కి లొంగడం వంటివి మాత్రం రచయిత్రి కల్పించినవి. ఈవా హామిల్టన్ జీవితంలో రాల్ఫ్ ఎదురు పడలేదు కనక ఆమె జీవితం సుఖాంతం కాలేదు. కాకపోతే ఆమెకు ఎన్నో నెలల విచారణ అనంతరం క్షమాభిక్ష లభించింది. నవలలో జైలు శిక్ష తగ్గడంతో పాటు, ఒక మంచి యువకుడి సహవాసం కూడ లభించింది ఈవాకు.

నెలీ బ్లై, నవలారచనలో ఆరితేరిన రచయిత్రి కాదు. పాత్రపరంగా ఈవా లోని మానసిక చాంచల్యాన్ని, ఆమె ఆలోచనల్లోని అస్థిరతనూ చక్కగా చూపగలిగింది. ఈవా ఒక హంతకురాలు కావడానికి (రెండు ప్రయత్నాల్లోనూ విఫలమైనా, ఉద్దేశం హత్య చేయడమే కనక) ఆమె జీవితంలోని ఆటుపోట్లను కారణంగా చూపడంలో కృతకృత్యురాలైంది. అయితే పురుష పాత్రల చిత్రణలో తడబడిందనిపిస్తుంది. నవలాంతానికి సుఖాంతం చెయ్యాలన్న తాపత్రయంలో, ఈవాను బ్లాక్‌మెయిల్ చేసిన రాండల్, అతని తల్లి, అతనికి సహకరించిన నర్సు – వీరందరూ డబ్బులు లేక, పరపతి పోయి, నికృష్టమైన జీవితాలు గడుపుతున్నారని ఒక్క మాటలో తేల్చేస్తుంది రచయిత్రి. భర్త రాడ్రిక్ నవలాంతంలో మళ్ళీ ఆమె వద్దకు రావడం, రాల్ఫ్‌పై ఆమె ప్రేమను ప్రకటించడానికి ఒక సన్నివేశం కల్పించడం కోసమే అనిపిస్తుంది. అతని వ్యక్తిత్వానికి తగ్గట్టుగా ఆ సన్నివేశం ఉండదు.

నెలీ పాత్రికేయవృత్తిలో ఉన్నందువల్లనేమో, శైలి చాలా పఠనీయంగా, సంభాషణలు పటిష్టంగా ఉంటాయి. సరళమైన, ఉద్వేగభరితమైన శైలి నవలకు అందాన్నిస్తుంది. కేవలం ఒక్క నెలలో రాసేసిన ఈ నవల బాలీవుడ్‌లో సంచలనం రేకెత్తించిన ‘ఖూన్ భరీ మాంగ్’ నుంచి ‘సాత్ ఖూన్ మాఫ్’ వరకు, ఎన్నో సినిమాలకు ప్రొటోటైపా అన్నట్టుంటుంది.

ఒక జర్నలిస్టుగా అమెరికా చరిత్రలో తన పేరును సుస్థిరం చేసుకున్న నెలీ బ్లై నవలారచనలో కూడ ఒక కొత్త ఒరవడిని నెలకొల్పిందని చెప్పవచ్చు. జర్నలిస్టుగా, మొదటి తరపు ఫెమినిస్టుగా గుర్తింపు పొందిన ఈమె నవలల్లో రాడికల్ ఫెమినిస్టుగా కూడ కనిపిస్తుంది.

సి. మృణాళిని

రచయిత సి. మృణాళిని గురించి: రచయితగా, విద్యావేత్తగా, వక్తగా, కాలమిస్ట్‌గా, పలు టీవీ రేడియో ఛానళ్లలో ప్రయోక్తగా, వివిధరూపాల్లో తెలుగు పాఠకులకు, ప్రేక్షకులకు పరిచితురాలయిన మృణాళిని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో తులనాత్మక అధ్యయన శాఖలో ప్రొఫెసర్‌గా పదవీ విరమణ చేశారు. ఇతిహాసాల్లోని స్త్రీ పాత్రలను విశ్లేషిస్తూ వీరు వ్రాసిన వ్యాసాలు, తాంబూలం శీర్షికలో వ్రాసిన వ్యాసాలు బహుళ ప్రజాదరణ పొందాయి. ప్రస్తుతం కాలిఫోర్నియాలోని సిలికానాంధ్ర విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖాధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ...