తాళంచెవి

హరికృష్ణ అది కోతి అనుకోలేదు. టివిఎస్ బైక్ చక్రం బాగు చేస్తూ, ఎదురుగా వచ్చి కూర్చున్నది మణికంఠ అనే అనుకున్నాడు. 

“ఏరా, వాడేమన్నాడు? పద్దులో రాసుకోను అంటే ఇంక వాడి కొట్టుకు పోవద్దు. సరేనా?” అడుగుతూ చక్రాన్ని కంటికి ముందు పట్టుకుని లెవల్ చూశాడు. 

కోతి జవాబేమీ ఇవ్వలేదు. హరికృష్ణ అది కూడా గమనించుకోకుండా దీక్షగా పని చేస్తున్నాడు. 

“కొనుక్కునే ప్రతి వస్తువుకూ ఎప్పటికప్పుడు పైసలు ఎంచివ్వాలంటే ఇక్కడ మనకు పైసలు అలా రావాలి కదా? మనమేమన్నా కిరాణా కొట్టు పెట్టుకున్నామా? ఒక రోజు ఆర్డర్ వస్తుంది, ఒక రోజు రాదు. వచ్చేరోజు జమ చేసేస్తాంగా? ఆటుపోట్లుండవా? ఆరు నెలలు, సంవత్సరం అని ఎప్పుడూ మనం సాగదియ్యలేదు కదా?”  

లేచి చక్రాన్ని తట్టి చూసి “వ్యాపారం అంటే అటూ ఇటూ అవుతుంటుంది. ఇలాంటివాటితో సర్దుకుపోలేదంటే కొట్టు కట్టేసుకుని ఇంటికిపోవాల్సిందే… ఆ టెన్ ఎమ్ఎమ్ అందుకో…” అంటూ తల పైకెత్తాక కాని ముందు కూర్చున్నది కోతి అని గ్రహించలేదు. ఖంగు తిని “ఏయ్ పో! పో!” అని చేత్తో తరిమాడు. కోతి కదలకుండా తన ఒంటిని మాత్రం ఒక అంగుళం అంత వెనక్కి లాక్కున్నట్టు చేసి మళ్ళీ మామూలుగా కూర్చుంది. 

‘వెధవచచ్చింది కొరికేలా ఉంది’ అని అనుకున్నాడు. చుట్టూ తేరిపార చూశాడు. పడున్న రాడు అందుకుని “ఏయ్ పో!” అని కొట్టబోయాడు. అది ‘గుర్ర్‌ర్ర్‌’మని పళ్ళికిలించింది. హరికృష్ణ లేచి నిల్చున్నాడు. కిందున్న ఒక రాయి తీసి విసిరాడు. విసరడానికి చేయి పైకెత్తినప్పుడే గురి తప్పుగా ఉందని కోతికి తెలిసిపోయింది. నడుము గోక్కుంటూ ఇంకా దగ్గరకొచ్చింది. హరికృష్ణ ఒక అడుగు వెనక్కు వేశాడు. 

కోతి ముందుకు వచ్చి ఆ బైక్ పక్కన చేరి అతను బిగిస్తున్న నట్టుని తడిమి చూసింది. వంగి ముక్కు దగ్గర పెట్టుకుని వాసన చూసి కొరికింది. అతను దాన్నే చూస్తున్నాడు. ఇందాక పైకి లేస్తూ చేతిలో ఉన్న స్పానర్ కింద పడేశాడు. ఆ కోతి వంగి స్పానర్ చేతికి తీసుకుని కళ్ళ దగ్గరకు తెచ్చుకొని చూసింది. ముక్కు దగ్గర పెట్టుకుని వాసన చూసింది, నోట్లో పెట్టుకుని తర్వాత దాన్ని బోల్ట్ మీద పెట్టి అతనిలాగే బిగిస్తున్నట్టు అభినయం చేసింది. ఆ స్పానర్ పట్టుకోవడం, స్పానర్‌ని నట్టుకు ఆనించడమూ చేతకాలేదు. అయితే అతను ఇందాక నట్టు బిగించుతూ నోరు ఎలా పెట్టాడో ఇదీ దాని నోరు అలాగే పెట్టింది. 

అతను నవ్వాడు. “అయితే నువ్వు అప్రెంటీసు పనికొచ్చావన్నమాట! పోన్లే” అన్నాడు. 

దగ్గరకెళ్ళి దానితో “కొత్తగా పనిలోకి వచ్చే అందరూ ఇంచుమించు నీలానే వస్తారు. నట్లు బిగించడం వస్తే చాలు ఎదురుగ్గా బోర్డు పెట్టి కొట్టు తెరిచేస్తారు. దాన్ని చూసి ఒవడో ఒకడు పిల్లనూ ఇచ్చేస్తాడు. తర్వాత బైకు, బంగారు గొలుసు, పంకీ కటింగు, కూలింగ్‌గ్లాసులు… మామూలుగా ఉండదులే వీళ్ళ కథ!” నిట్టూర్చాడు హరికృష్ణ. 

హరికృష్ణ దగ్గరకు వెళ్ళగానే కోతి స్పానర్ అతనికేసి చాచింది. అతను తీసుకుని కూర్చున్నాడు. వెనక చక్రాన్ని బిగించి “టెన్ ఎమ్ఎమ్ స్పానర్ అందుకో… అదిగో అక్కడుంది చూడు. అదే తీసివ్వు చూద్దాం” అన్నాడు. 

కోతి అతన్నే దీక్షగా చూస్తోంది. అతను ఒక చిన్న రాయి తీసి ఆ స్పానర్ మీదికి విసిరాడు. కోతి దాన్ని చూసింది. తర్వాత అతనే లేచి వెళ్ళి స్పానర్ తీసుకుని వచ్చి ముందర చక్రాన్ని విప్పాడు. కోతి దగ్గరకొచ్చి అతని భుజానికి తన భుజం ఆనించుకుని అతను చేస్తున్న పనినే చూస్తూ ఉంది. తర్వాత అతన్ని ఆశ్చర్యంగా చూసి కన్నుగీటింది. అతను అంత ఆశ్చర్యాన్నీ, భక్తినీ ఏ కంటిలోనూ చూడలేదు. 

“చాలా సింపుల్! శ్రద్ధగా గమనించావంటే అన్నీ నేర్చేసుకోవచ్చు. అయితే ఎవడు శ్రద్ధ పెడుతున్నాడని! ఒకటి చెప్తా గుర్తుంచుకో. ఎప్పుడైతే ఈ సెల్‌ఫోన్ వచ్చిందో అప్పుడే శ్రద్ధగా గమనించటం అన్న అలవాటు పోయింది. ఒక చేతిలో సెల్‌ఫోన్ పట్టుకునే పనులు చేస్తున్నారు. ఇంకేం బాగుపడతారు?” 

కోతి అతని చేతిలో ఉన్న స్పానర్ తీసుకోడానికి ప్రయత్నించింది. “ఆ… అదొద్దు. నువ్వింకా అప్రెంటీసువే! చెప్పింది మాత్రం చేస్తే చాలు. ఊరికే జోక్యం చేసుకోడం పనికిరాదు. అర్థవైందా?” 

అతను పని చేస్తూ ఉంటే అది కూడా అతని పక్కనే కూర్చుని, అటు ఇటుగా చోటు మార్చుకుని, శ్రద్ధగా చూసింది. 

అతను “ఆ ఎయిట్ ఎమ్ఎమ్ అందుకోరా” అని చెప్పి ఒ చిన్న రాయి తీసి విసిరాడు. కోతి పరుగున వెళ్ళి దాన్ని పట్టుకొచ్చి అతనికిచ్చింది. అతను మెల్లగా నవ్వి దాని తల నిమిరాడు. 

మణికంఠ వచ్చి “అన్నయ్యా, కోతి. కోతి మీ పక్కనే ఉంది!” అన్నాడు. 

హరికృష్ట “అవును, దానికి ఏమంటావు? పని నేర్చుకోడానికి కొత్తగా చేరింది” అన్నాడు. 

“అన్నయ్యా! అది కోతి!” అని అరిచాడు మణికంఠ. 

“అరే… తెలుసులేరా. కోతే. మనందరం ఒకటే జాతిరా. మర్కట జాతిలో మంచి గుణాలున్నది కోతికి మాత్రమే… ఇదిగో చూడు, చెప్పింది చక్కగా చేస్తోంది.” 

“అన్నయ్యా!” అన్నాడు మణికంఠ. 

“ఎమ్‌త్రీ అందుకోరా” అంటూ ఒక చిన్న రాయి తీసి విసిరాడు. కోతి వెళ్ళి దాన్ని పట్టుకొచ్చి అతని చేతికిచ్చింది.

“అన్నయ్యా!” అంటూ మణికంఠ మళ్ళీ కేకేశాడు. 

“పద్ధతిగా నడుచుకో. ఇలా చూడు. ఇకనుండి నాకు ఇది చాలు. మహా అంటే ఒక అరటి పండు అడుగుతుందేమో. నీకు ఇచ్చే మూడువేలతో దీనికి సంవత్సరం పొడవునా అరటి పళ్ళు కొనచ్చు.” 

“అన్నయ్యా, దానికి సంసారమా పాడా. నాకు ముసలి అమ్మ ఉంది కదా!”

“సరేలేరా…” అంటూ “ఇప్పుడే చెప్తున్నా. మీ ఇద్దరి మధ్యా ఎలాంటి గొడవలూ రాకూడదు. అన్నదమ్ముల్లా కలిసి మెలిసి ఉండాలి. సరేనా?” అన్నాడు హరికృష్ట. 

“ఇది నాకు అన్నా తమ్ముడా? అయితే చూసే చూపు మాత్రం కన్నతండ్రి చూసినట్టు చూస్తోంది!”

“అది మంచి కోతిరా…”

“కోతుల్లో మంచికోతి చెడ్డకోతి ఉంటుందా అన్నయ్యా?” అడిగాడు మణికంఠ. 

“వాలి, సుగ్రీవులు ఉండేవారు కదరా?”

“డీజిల్ తగిలితే కోతి పరుగు తీస్తుందేమో?”

“లేదురా. పరిగెట్టలేదు” అంటూ లేచి రెండు చక్రాలనూ అలైన్ చేశాడు. కోతి అతను చేస్తున్న ప్రతి పనినీ ఏకాగ్రతతో గమనించింది. 

“ఛాయ్ తాగండి అన్నయ్యా” అన్నాడు మణికంఠ. 

“దీనికేమైనా పెట్టాలి కదా? మనం మాత్రమే తాగితే బాగోదు కదా? నువ్వు వెళ్ళి ఒక పచ్చరటిపండు తీసుకుని రా” అన్నాడు హరికృష్ణ. “దీన్నీ తీసుకుని ‌వెళ్ళు. దీనికీ మన పద్దులోనే పళ్ళు ఇవ్వాలని చెప్పు.”

వాళ్ళిద్దరు వెళ్ళబోతుంటే “ఆగరా” అంటూ “అలా బాగోదు. దీనికి వాడు పళ్ళిస్తే ఊళ్ళో ఉన్న అన్ని కోతులూ వచ్చి వాడి దగ్గర పళ్ళు తీసుకుని తింటాయి. అన్నిట్నీ వాడు మన పద్దులో రాస్తాడు. దీనికి మాత్రం డబ్బులు ఇచ్చే కొనిద్దాం” అన్నాడు. 

అతను పదిరూపాయలు నోటు తీసి కోతి చేతికిచ్చాడు. అది తీసుకుని పరీక్షగా చూసి నోట్లో పెట్టుకోబోయింది. ‘వద్దు’ అన్నట్టు హరికృష్ణ సైగ చేశాక ఎత్తిన చేయి దించుకుంది. “వాడితో వెళ్ళు, పండు కొనిస్తాడు. వెళ్ళు.”

కోతి చేతి సైగలు అర్థం చేసుకుంది. మణికంఠ వెళ్ళగానే అది వాడిని అనుసరించింది. హరికృష్ణ చేతులు కడుక్కుని వచ్చేసరికి మణికంఠ, కోతి ఇద్దరూ వచ్చారు. కోతి అమృతపాణి పండును చేతిలో పట్టుకుని ఉంది. 

“చక్కగా డబ్బులిచ్చి పండు తీసుకుంది అన్నయ్యా! దానికి తెలిసిపోయినట్టుంది” అన్నాడు మణికంఠ. 

“కొట్టు దగ్గర కూర్చున్నప్పుడు చూసుంటుందిగా?”

“చూడండి, పండు ఒలవకుండా తెచ్చింది” అన్నాడు మణింఠ. “కొట్టు అతను ఇదెవరని అడిగాడు. మా ఓనర్ బావమరిది అన్నాను.”

“రేయ్ ఎధవా!” 

“బావమరిదంటే మీకేం రక్తసంబంధం కాదు కదా అన్నయ్యా, ఊరుకోండి.”

హరికృష్ణ మణికంఠ ఇద్దరూ కూర్చున్నారు. తెచ్చుకున్న టీ తాగుతూ గారెలు తిన్నారు. హరికృష్ణ ‘తిను’ అనగానే కోతి అరటిపండుని తిన్నది. 

హరికృష్ణ ఒక బీడీ ముట్టించుకున్నాడు. కోతి వెల్లకిలా పడుకుని కాలిమీద కాలు వేసుకుని ఆకాశానికేసి చూస్తూ ఉంది. 

“ఏదో ఆలోచిస్తోంది” అన్నాడు మణికంఠ. 

“అదేం ఆలోచిస్తుందిరా?”

“జగనన్న గురించి, పచ్చ, బులుగు రంగు గోడల గురించి… ఏం అడుగుతావు అన్నయ్యా? కోతి ఏం ఆలోచిస్తుందో మనకేం తెలుసూ?” వేళాకోళమాడాడు మణికంఠ.

హరికృష్ణ మళ్ళీ స్పానర్ చేతికందుకోగానే కోతి లేచి వచ్చి పని ఎలా చేస్తున్నాడో చూస్తూ కూర్చుంది. అతను వేలెత్తి దేన్నైనా చూపిస్తే అది తీసుకొచ్చి ఇచ్చింది. అయితే ప్రతి వస్తువునీ ఒకసారి వాసన చూశాకే తెచ్చి ఇచ్చింది. 

“నువ్వు ఆ నట్లను కడగరా!” అన్నాడు హరికృష్ణ. 

మణికంఠ కడగటానికి కూర్చుంటూ “మనోడు మెగాస్టార్ సినిమాలే వేస్తున్నాడు. చూశారా అన్నయ్యా?” అని పక్కనున్న థియేటర్‌ వైపు తల ఎగరేసి అడిగాడు. 

“చూడ్డానికి జనం ఉన్నారు కాబట్టి వేస్తున్నాడు.” 

“ఇప్పటికీ ఆయన పాత సినిమాలకు కూడా జనం వస్తూనే ఉన్నారు… స్టెప్పులు, ఫైట్లు అలా ఎవడు చేస్తారు?”

నారాయణరావు మాస్టారు బైకు ఆపి “ఏవిటోయ్ హరికృష్ణా, అది కోతేనా?” అన్నాడు. 

“పిల్లలు లేరని ఆంజనేయ స్వామికి మొక్కుకుంటే, ఉన్నట్టుండి ఇలా పుట్టాడు మాస్టారూ.”

“ఒరేయ్, గోదారోణ్ణొరేయ్, నాతోనే పరాచికాలా?” అంటూ బండి దిగాడు. “మీ గుంటూరోళ్ళ వెటకారాన్ని గ్రహించేంత తెలివితేట్లు మాకూ ఉన్నాయిలే!”

“నిజమే చెప్తున్నాడు మాస్టారూ. కావాలంటే పోలికలున్నాయి చూసుకోండి” అన్నాడు మణికంఠ. 

“వెధవా, నా మీదే జోకులా… స్పానర్ చూశావా… మాడు పగుల్తుంది!” అన్నాడు హరికృష్ణ. 

నారాయణరావు మాస్టారు కోతి పని చేస్తుండటాన్ని చూసి “ఎన్నాళ్ళుగా చేస్తుందర్రా?” అని అడిగాడు. 

“ఇవాళ పొద్దునే వచ్చింది సార్!”

“ఇది ఇంక వెళ్ళదురా” అంటూ దీక్షగా చూస్తూ “కోతుల్ని గమనిస్తే వాటి సమస్య ఏంటని తెలుసుకోవచ్చు. వాటికున్న పెద్ద సమస్య పొద్దు గడవడమే… కోతులకు తెగ బోర్ కొట్టేస్తూ ఉంటుంది. అవి చేసే అన్ని చేష్టలూ బోర్ కొట్టడం వల్లనే… ఒక్కచోట నిలకడగా కూర్చోలేవు. బోర్ కొట్టకుండా ఉండాలని అర్థంపర్థం లేని పనులే ఏవేవో చేస్తుంటాయి!” 

“అవును మాస్టారూ… ఎప్పుడూ ఆవలిస్తూ ఉంటాయి” అన్నాడు మణికంఠ.

“అవి ఒక విషయాన్ని నేర్చుకుంటే అంత సులువుగా మరిచిపోవు. వాటికి తెలివితేటలు ఎక్కువే. వేదాద్రి గుళ్ళో ఒక కోతుల గ్రూపు అక్కడున్న కొళాయిల్లో నీళ్ళు తిప్పడం, కట్టేయడమే ఆటగా పెట్టుకున్నాయి.”

“కొట్టునుండి నట్లు, బోల్టులు కొట్టుకుపోతే మాకు నష్టం మాస్టారూ” అన్నాడు మణికంఠ. 

“నువ్వు కొట్టుకెళ్ళిన వాచీ సంగతి చెప్పకపోయావా?” అన్నాడు హరికృష్ట. 

“అది పాతదిగా అన్నయ్యా?”

“పాతదా? కొని సంవత్సరం కూడా కాలేదురా!”

“లేదన్నయ్యా, అది పాత కథే అని అంటున్నాను.”

“హరికృష్ణా, వీడు జిత్తులమారిరోయ్!” అన్నాడు నారాయణరావు మాస్టారు. “చూడవోయ్ కోతి కూడా నవ్వుతోంది!”

వాళ్ళు నవ్వడం చూసి కోతి రెండు చేతులూ తల మీద పెట్టుకొని నేలమీద దొర్లుతూ నవ్వింది. 

“పడి పడీ నవ్వుతోందే!” ఆశ్చర్యంగా చూశాడు మణికంఠ. 

“దానికి నీ చేతివాటం నేర్పించకొరే. ఆంజనేయస్వామి అవతారం అది” అన్నాడు మాస్టారు. 

“కోతులు దొంగతనాలు చేస్తాయి. రాముడి ఉంగరం హనుమంతులవారు కొట్టేశాడుగా? దాన్నేగా సీతమ్మకు చూపిస్తాడు? అదేదో కథ ఉంది కదా మాస్టారూ?” అన్నాడు మణికంఠ. 

“అవున్రా. రాముడు ఆ ఉంగరాన్ని దశరథుడి దగ్గర కొట్టేశాడు…” అంటూ “మూసుకుని ఉండు. వీపు విమానం మోత మోగించేస్తాను” అన్నాడు హరికృష్ణ.

“సరిపోయాడు నీ శిష్యుడు! రామాయణాన్ని వల్లె వేసినట్టున్నాడుగా!” అని నారాయణరావు మాస్టారు నవ్వాడు. “మీ నాన్నగారు అనంతశయనంగారి బుర్రకథలు విన్నాను. మహాభారతం, రామాయణాలను గంటలకొద్ది చెప్పేవాడు. మీ అమ్మగారు కూడా చక్కగా శ్రుతి కలిపేవారు. ఏం కంఠం వాళ్ళిద్దరిదీ! పల్నాడు రాజలక్షమ్మగారి బుర్రకథంటే నాలుగు జిల్లాల గ్రామాల్లోనూ ప్రసిద్ధి!”

“ఇప్పుడు ఒక్కతేగా మాస్టారూ, కూర్చుని ఏదో పాడుకుంటూ ఉంటుంది.” 

“నువ్వేమో ఇలా స్పానర్ పట్టుకున్నావు.” 

“పొట్ట పోసుకోవాలి కదా మాస్టారూ?”

“చాలదన్నట్టు రామాయణాన్ని ఎంగిలిమంగలం చేసే అడ్డగోలు శుంఠని అసిస్టెంటుగా పెట్టుకున్నావు.”

“చేదోడు వాదోడుగా మనిషి కావాలి కదా!”

“ఇప్పుడు ఈ హనుమంతులవారొచ్చారుగా!” కోతిని చూపించాడు మాస్టారు. 

“వీడిని ఇక్కడనుండి పంపించేస్తే రేపే ఎదురుగ్గా ఒక కొట్టు పెట్టేస్తాడు. యాభై రూపాయలు తక్కువ తీసుకుంటే మీరు కూడా వాడి దగ్గరకే వెళ్తారుగా?”

“మళ్ళీ వెటకారం!”

హరికృష్ణ చేస్తున్న పని ముగించి లేచి వచ్చి నారాయణరావు మాస్టారి బైకుని చూసి “బండికేమైంది మాస్టారూ?” అని అడిగాడు. 

“ఇప్పుడు గుర్తొచ్చిందా నీకు! ఇక్కడేదో సౌండ్ వస్తోంది చూడు…” యాక్సిలరేటర్ రైజ్ చేసి చూపించాడు. 

“వయసయిపోయిందిగా, సౌండ్లొస్తుంటాయండీ. మా ముసలామె ఒకాఁవుంది. ఆవిడకీ అంతే. ఎప్పుడూ సౌండ్లు చేసుకుంటూ ఒక పక్కన లీకవుతూ ఉంటుంది. మనం అవేవీ పట్టించుకోకూడదండీ” అన్నాడు మణికంఠ. 

“వయసయిపోయిందా? ఎనిమిదేళ్ళయింది కొని. అంతే!”

“నేనూ అదేగా అంటున్నా?” అన్నాడు మణికంఠ. 

హరికృష్ణ బండిని పరీక్షించాడు. “చిన్న ప్రాబ్లమేనండీ. మడ్‌గార్డులో స్క్రూ లూజయింది. బాగు చేసేయొచ్చు… నాలుగైదు పార్టులు తుప్పుపట్టిపోయున్నాయి. విప్పదీసి క్లీన్ చేసి తగిలించేస్తే సమస్యేముండదు. దారి మధ్యన ఆగిపోతే కష్ఠం కదా మాస్టారూ?” అంటూ “ఇలా బండి దార్లో ఆగిపోవడం వల్లే రామాయణం మొదలైంది” అన్నాడు.

“బాగుపడ్డట్టే… నీ అసిస్టెంట్ ఎవరి దగ్గర రామాయణం నేర్చుకున్నాడో ఇప్పడు అర్థం అవుతోంది” అన్నాడు మాస్టారు.  

హరికృష్ణ ఒక చిన్న రాయి తీసి విసరగానే కోతి ఒక్క దూకు దూకి స్పానర్ పట్టుకొచ్చి ఇచ్చింది. 

“అరేయ్, ఇది లంకదాకా గెంతేలా ఉందే!” ఆశ్చర్యపోయాడు మాస్టారు. 

“తోక అంటించకూడదంతే” అన్నాడు మణికంఠ. 

“ఒక కోతి తోడు ఉండటం మంచిదేగా?” అని నవ్వుతూ “రాముడుకి మల్లే కృష్ణుడికీ ఒక కోతి తోడున్నట్టయితే బోయవాడు బాణం వేసేవాడా?” అన్నాడు హరికృష్ణ. 

మాట్లాడుతూ పని చేస్తున్న అతనితోపాటూ కోతి కూడా ముమ్మరంగా పనిలో నిమగ్నమయింది. 

“ఏం వింతరా నాయనా! చూస్తుంటే నమ్మలేకపోతున్నాను!” అన్నాడు నారాయణరావు మాస్టారు. 

“ఆ కాలంలో సముద్రంమీద సేతువు కట్టిందంటే నమ్ముతారు మరి.”

“అవి వేరే కోతులు కదా?”

“ఇంజినీరింగ్ చదివిన కోతులా?”

“ఆంజనేయస్వామితో పరాచికాలొద్దు. నేను అసలే వీరవైష్ణవుణ్ణి!” నొక్కి చెప్పాడు మాస్టారు. 

బైకు పని పూర్తవ్వగానే మాస్టారు మూడువందలు ఇచ్చి “వెళ్ళొస్తాన్రా… నిన్ను చూస్తుంటే రాముడిలా ఉన్నావు. ఒక పక్కన హనుమంతులవారు, మరో పక్కన రాక్షసుడు!” అన్నాడు.

డబ్బులు లెక్కపెట్టుకుంటూ “సాయంత్రానికి సరిపోతుంది…” అన్నాడు హరికృష్ణ. 

“అన్నయ్యా ఒక యాభై నాకు ఇవ్వవా. ముసలామెకు మందులు కొనాలి.”

“ఏం మందూ?”

“మందులు అన్నాగా?”

“వైన్ షాపులో అమ్మేదా?”

“అదీ మందేగా అన్నయ్యా.”

“నువ్వేం బాగుపడతావురా ఇక!”

“మాస్టారు ఇందాక రాక్షసుడు అన్నారుగా, ఎందుకలా?”

“ఒరేయ్, అది విభీషణుడురా. పరమ భక్తుడు.”

షాపు కట్టేసి కింద పడున్న స్పానర్లు, నట్లు, బోల్టులూ తీసి సర్దారు. కోతి కూడా వీళ్ళతోబాటు నట్లూ బోల్టులూ ఏరి పెట్టింది. వీళ్ళకంటే వేగంగానే ఏరి పెట్టింది. వేరు వేరు డబ్బాల్లో పోసింది. 

“అన్నయ్యా, మనం షాపు కట్టేస్తే ఇదెక్కడికి వెళ్తుంది?”

“అది చెట్టుపైకి వెళ్ళిపోతుంది” అన్నాడు హరికృష్ణ. 

హరికృష్ణ తన టివిఎస్ స్టార్ట్ చేయగానే కోతి రేకులకప్పు పైకెక్కి వెల్లకిలా పడుకుంది. 

“అలసిపోయినట్టుంది. బాగా కష్టపడింది!” మురిసిపోయాడు హరికృష్ణ. 

“చూస్తుండండి అన్నయ్యా! అది నాలుగైదు రోజుల్లో వైన్ షాపుకు వెళ్తుంది!”

“శుభం పలకరా మంకన్నా అంటే ఏదో అన్నాడట. నీ చెత్తవాగుడు నువ్వునూ!”

బండి రోడ్డెక్కింది. 


హరికృష్ణ భోజనం చేస్తూ మహలక్ష్మితో ఉదయం షాపులో జరిగినదంతా చెప్పి నవ్వుకుంటున్నాడు. అవతలనుండి అమ్మ వింటూ ఉంది. 

అతను భోంచేసి లేచినప్పుడు వీధి అరుగు మీద నిల్చుని “ఒరేయ్, దాన్నెందుకురా చేరనిచ్చావు?” అని అడిగింది అమ్మ. 

“నేనెక్కడ చేర్చుకున్నాను? అదే వచ్చింది, సరదాగా ఉంటుందని ఊరుకున్నాను.”

“అది ఇంక వెళ్ళదురా. ఇంక ఇక్కడే ఉండిపోతుంది.” 

“రేపటికి వెళ్ళిపోతుంది. ఇవాళేదో దానికి సరదాగా అనిపించి వచ్చుంటుంది” అంటూ అరుగు బండల మీద కూర్చుని ఆకూ వక్కా వేసుకున్నాడు. 

అమ్మ అరుగు అంచున కూర్చుంటూ “మనిషిని సంసారంలో బంధించేదేంటి? బుద్ధి. కొత్తగా ఏది చూసినా దాని కథా కమామిషేంటని తెలుసుకోవాలనే తపనతోనే మనిషి అన్ని గొడవల్లోకీ చొరబడతాడు” అన్నది.

“ఈయన కూడా అక్కడేం చేస్తారో చూద్దామనే మొదటిసారి సారాయి కొట్టుకు పోయాడు” అంది మహలక్ష్మి. 

“నువ్వు ఊరుకోవే. లేచానంటే వీపు విమానం మోత మోగిస్తాను!”  

“అబ్బో! ఇప్పుడు లేస్తే తూలిపడతారు. రోజూ తప్పతాగి రావడం…” అని సణుగుతూ లోపలికి వెళ్ళింది మహలక్ష్మి. 

“దేవుడు మనిషికి రెండు రకాల తెలివితేటలిచ్చాడు. లోపలికి వెళ్ళడానికి ఒకటి బయటకి రావడానికి ఒకటి. చాలామంది రెండోదాన్ని అసలు వాడరు. అది వాళ్ళ తప్పే. అయితే జంతువులకు అలా కాదు. వాటికి ఒకటే ఉంటుంది. లోపలికి వెళ్ళడానికి మాత్రమే. అలాంటివాటిని నువ్వు లోపలికి లాగావంటే వాటికి విముక్తే ఉండదు” అంది అమ్మ.

“తెలివితేటలున్న మనిషేదో పేద్ద బయటకు రావాలనుకుంటున్నట్టు! అందరూ లోపలికి వెళ్ళడమే. ఎవడూ బయటకు రాడు” అన్నాడు హరికృష్ణ. 

“యోగులు బయటపడట్లేదూ?”

“వాళ్ళు అందుకే యోగులు.”

“అందరికీ మార్గం అయితే ఉంది కదా?”

హరికృష్ణకి చిరాకేసింది. “ఏమంటావిప్పుడు? విముక్తీ విచారం అని సోది కాకుంటే. కోతికి స్పానర్ పట్టుకుని పని చెయ్యాలనిపించింది, వచ్చింది. కోతి మెకానిక్ అయితే ఇప్పుడేంటట?”

“అది హాయిగా ఆనందంగా చెట్లు కొమ్మలు పట్టుకు తిరుగుతూ ఆకాశమే కప్పుగా బతికే జీవి. వగచడానికంటూ వాటికి పాత జ్ఞాపకాలుండవు. భవిష్యత్తు గురించి భయపడటానికీ ఏముండవు వాటికి. నీకు అలా కాదుగా? నువ్వు ఈ ఇరుకు ఇంట్లో, మురికివాడలో సంతోషంగా ఉన్నావా? వాటికుండే అందమైన జీవితం నీకు లేదు. స్వేచ్ఛ లేదు, సంతోషం లేదు. అప్పు ఉంది, భయం ఉంది. చాలవా? మనిషి జన్మకు కోట్ల ఆస్తులున్నా ఇంతే. ఇలాంటి ముళ్ళ కంపల్లోకి వాటినెందుకు లాగడం? చాలా పాపంరా!” 

“మనుషులందరూ దుఃఖంలోనే ఉన్నారా?” 

“అవును. దాన్నే లౌకికం అంటారు. లేనివాటిని ఊహించుకోవడం. సాధ్యంకాని వాటికోసం ఆశపడటం, ఎప్పుడూ వెంపర్లాడటం, దొరికిన దానితో తృప్తి పడలేక ఇంకా ఇంకా లేనిదానికోసం పాకులాడటం… అంతకంటే పెద్దది ఒకటుంది, అన్నిట్నీ తెలుసుకోవాలి అనుకోవడం, తెలుసుకోగలం అని నమ్మడం. దానికి పేరు జ్ఞానదుఃఖం. ఆ మనోవ్యధకు జ్ఞానసన్యాసమే మందు. దాన్ని నువ్వు కోతికి ఇవ్వలేవు కదా? అలాంటప్పుడు దుఃఖాన్ని మాత్రం ఎందుకిస్తున్నావు?”

“ఈ పురాణ కథలన్నీ నాకు చెప్పకు. నాకు ఏం చెయ్యాలో తెలుసు.”

“పురాణకథలని తీసిపారేయకు. వాటిల్లోనే జ్ఞానమంతా ఇమిడి వుంది.”

“జ్ఞానాన్ని నువ్వే మూటగట్టుకుని ఆకలేసినప్పుడు కాల్చుకు తిను… మీ ఆయన అనంతశయనంగారు పద్దెనిమిది పురాణాలూ నేర్చిన పండితుడు. మరి చివరికి తిండిలేకేగా చచ్చాడు? నువ్వు చదివిన పురాణాలను పెట్టుకుని ఇప్పుడేం చేస్తున్నావు? డీజిలు, గ్రీజ్ వాసన కూడేగా నువ్వూ తింటున్నావు?”

అమ్మ ఏం మాట్లాడకుండా నిట్టూర్చింది. 

“పెద్ద మాటలు చెప్పొచ్చావు… ఇక చాల్లే ఫో!” అన్నాడు హరికృష్ణ. తేపుతూ లేచాడు, నిల్చుంటే తూలిపడిపోతూ. వక్కాకు ఉమ్మేసి గోడ పట్టుకుంటూ వెళ్ళి పడుకున్నాడు. 

చేయి తుడుచుకుంటూ లోపలికి వచ్చిన మహలక్ష్మి “ఇప్పుడెందుకు ఆవిడతో గొడవ?” అంది. 

“నేనేమన్నాను. ఒక కోతి వచ్చిందన్నాను అంతే. దానికే అమ్మ చదివిన పురాణ కథలన్నీ అందుకుంది. ప్రశాంతంగా ఉండనిస్తేగా!”

“ఆమె చెప్పేది వాస్తవమే కదా?”

“ఏం వాస్తవం?”

“మనుషల మధ్యలోకి వచ్చిన కుక్కలు వీధుల్లో ఎన్ని కష్టాలు పడుతున్నాయో కనబడట్లేదా? కోతులైనా వాటి ప్రపంచంలో అవి సంతోషంగా ఉండద్దా?”

“ఏం, నువ్వు సంతోషంగా లేవా?”

“లేనన్నానా?”

“మరి?”

“కాని, మనందరం చావిట్లో కట్టేసిన గొడ్లమే కదా? అడవుల్లో ఉండే జింకల్లా ఉన్నామా?”

అతనికి ఏం చెప్పాలో తోచలేదు. 

“ఆవులు చావిట్లోనే పడున్నాయి. ఎద్దులు మాత్రమే నాలుగూళ్ళు తిరిగొస్తున్నాయి. అయితే వాటిని కూడా కాడికి కట్టే తీసుకెళ్తారు.”

“నువ్వూ మొదలుపెట్టావా? అడ్డగాడిదా!”

“మంచి మాటలే రావు మీ నోట. పడుకోండి… నే వంటగది కడుక్కోవాలి. రేపు శుక్రవారం.”

హరికృష్ణ మనసులో అదే తిరుగుతోంది. కోతి ఇప్పుడు ఏం చేస్తూ ఉంటుంది? మెకానిక్ పని గురించి ఆలోచిస్తూ ఉంటుందా? లేదూ అక్కడినుండి వేరే ఎక్కడికైనా వెళ్ళిపోయుంటుందా? దానికి భార్యలుండచ్చు. పిల్లలుండచ్చు. నేరేడు చెట్లలో గుత్తులు గుత్తులుగా పండిన పళ్ళు. అది జీవించడానికి ఆకాశమే ఉంది. ఏదో బుద్ధిపుట్టి కిందకి దిగి వచ్చుంటుంది. ఈ మట్టిలో మనుషులేం చేస్తున్నారో తెలుసుకోవాలనిపించి ఉంటుంది. 

అతను నిద్రపోయాడు. లేచినప్పుడు గదినిండా మసక వెలుతురు. ఫేన్ తిరుగుతోంది. కిటికీనుండి గాలి. దూరంగా వెళ్ళే లారీ చప్పుడు. బయట పచ్చగా వీధి లైటు వెలుతురు. 

అతని మనసెందుకో వికలమయింది. గొంతు పూడుకుపోయినట్టు అనిపించింది. కళ్ళనుంచి నీళ్ళు కారుతున్నాయి. ఏడవడం మొదలయ్యాకే అతనికి దుఃఖం పొంగి పొర్లింది. అంతగా ఎందుకేడుపొస్తోందో అర్థం కాలేదు. ఏడుస్తూనే ఉన్నాడు. ఏడ్చి ఏడ్చి మనసు అలసిపోయింది. ఒళ్ళు కదిలించలేనట్టు అనిపించింది. మళ్ళీ మత్తుగా అనిపించింది. తెలివి వచ్చినప్పుడు బాగా దాహం వేసింది. ఒళ్ళంతా చెమటలు. నీళ్ళ సీసా తీసుకుని నీళ్ళు తాగాడు. లేచి వెనక వైపుకు వెళ్ళి లఘుశంక తీర్చుకుని వచ్చాడు. 

వచ్చి పడుకున్నాక కొంచం ఊరటగా అనిపించింది. తరవాత చెయ్యాల్సింది ఏంటో స్పష్టంగా తెలిసిపోయింది. రేపు వెళ్ళగానే దాన్ని తరిమేయాలి. దానికి తిండేమీ ఇవ్వకూడదు. తరుముతూనే ఉండాలి. ఇనుప డబ్బాతో డప్పులా కొడితే భయపడి వెళ్ళిపోతుంది. లేదంటే కొంచం డీజిల్ నేల పైన పోసి నిప్పంటిస్తే అగ్గిని చూసి ఇక దగ్గరకు రాదు. తరిమేయడం కష్టమే. మరో మార్గంలేదు. ఇలా వదిలేస్తే అది వచ్చి ఇందులో చిక్కుకుంటుంది. విముక్తుండదు. 


హరికృష్ణ రోజూలా పొద్దున్నే లేచి పళ్ళు తోముకుని పెరట్లో మహలక్ష్మి కాగబెట్టిన వేడినీళ్ళతో స్నానం చేసి బట్టలు తొడుక్కుని వినాయకుడి గుడికి వెళ్ళి దణ్ణం పెట్టుకుని నుదుట విభూతితో ఇంటికి వచ్చాడు. అమ్మ పేపర్ చదువుతోంది. అతను వచ్చి కూర్చోగానే పేపరు మడిచి చేతికిచ్చింది. హరికృష్ణ అమ్మకు నిన్న రాత్రి అన్న మాటలకు క్షమాపణ చెప్పాలనుకున్నాడు. నోరు రాలేదు. ఎప్పట్లాగే “వార్తల్లో విశేషాలేంటి?” అనే అడిగాడు ఏమీ జరగనట్టు. 

“ఏముంటుందీ? ఎప్పుడూ ఉండేదే. మూడు రాజధానిలు పెట్టే తీరుతానంటున్నాడు” అంది అమ్మ. 

“అనకేం చేస్తాడు? మరొకరి పథకాలు అమలు చేస్తే ఆయనకేంటి లాభం?” అంటూ పేపరందుకున్నాడు. “కొత్త రాజధాని కోసం పంటపొలాలిచ్చినవాళ్ళు ఊరుకుంటారా?”

“మరి హఠాత్తుగా ఉపాధులు కోల్పోయిన రైతులు. జగన్ తన పొలాలిచ్చి ఉంటే ఊరుకుని ఉండేవాడా? మొదలెట్టిన పనులు ఆపించేసి కొత్తగా మూడు రాజధానులంటూ మళ్ళీ మొదట్నుండి పనులు మొదలెట్టాలిగా!”

“మూడూళ్ళలో మళ్ళీ ఎన్ని వేల ఎకరాల సాగు భూములు, అడవులు నాశనం అవుతాయో!”

“అవును. అడవులు నాశనం చేస్తే దేశానికి మంచిది కాదని ఇప్పుడు సైంటిస్టులు అంటారు. పురాణాల్లో ఋషులందరూ తపస్సు చేసింది అడవుల్లోనే. ధర్మసంవాదం జరిగే స్థలాలు అడవులే. ధర్మాలు పుట్టడానికి సరైన అడవులు లేకుంటే ఊళ్ళో వర్షాలు పడవు అంటారు. ధర్మం ప్రజ్వరిల్లితే వర్షాలు పడుతాయి, వర్షాలు పడితే ధర్మం అభివృద్ధి చెందుతుంది. అందుకే వర్షాన్ని ధర్మవర్ధిని అంటారు” అంది అమ్మ. 

మహలక్ష్మి “ధర్మాధర్మాల చర్చ చాలు లేచి రండి” అని అంది. అతను లేచి లోపలికి వెళ్ళాడు. పెసరట్టుతో అల్లం పచ్చడి వేసి ఇచ్చింది. తినేసి సంచీ తీసుకుని టివిఎస్ ఎక్కి బయల్దేరాడు. 

షాపుకు వెళ్తుంటే మనసుని మళ్ళీ కోతి ఆక్రమించుకుంది. దగ్గర పడుతున్నకొద్దీ మనసులో అలజడి మొదలైంది. దాన్ని ఎలా తరమడం అని. ఒక వేళ తానుగా అదే వెళ్ళిపోయుంటే? ఆ ఊహే చాలా నిరాశను కలిగించింది. అలా వెళ్ళిపోయుంటే ఎందుకూ నిరాశ పడాలి? 

బైకు లోపలకి తిప్పగానే పైకప్పు వంక చూశాడు. కోతి లేదు. వాకిట్లో కూడా ఎక్కడా కనబడలేదు. డీజిలు, కందిరం కొట్టుకుపోయిన దుమ్మునేల బోసిగా ఉంది. చేతులు తుడుచుకునే గుడ్డ, గ్రీస్ మరకల రాళ్ళు. అవతల ఒరిగించి పెట్టిన టైర్‌లు, చక్రాలు. కోతి ఎక్కడా కనబడటం లేదు. 

వెళ్ళిపోయింది అన్న ఆలోచన రాగానే మనసు చాలా భారంగా అనిపించింది. ఒళ్ళు సడిలిపోయి కూర్చోవాలి అనిపించింది. అప్పుడు చిన్న చప్పుడు వినబడింది. ఒళ్ళు జలదరించింది. కోతే. మెల్లగా గీపెట్టింది. ఆ కూత అది తనకు తానే ఏదో చెప్పుకుంటున్నట్టుంది. 

అతను మెల్లగా నడిచి వెళ్ళి షాపు పక్క గోడవైపుకు నడిచాడు. పనికిరాని వస్తువులు పడేసిన చోట కోతి నేల మీద కూర్చుని ఉంది. దీక్షగా ఏదో చేస్తూ ఉంది. అతను చాటుగా నిల్చుని అది ఏం చేస్తూ ఉందో చూశాడు. 

ఒక స్క్రూని ఒక రంధ్రంలో దూర్చే ప్రయత్నంలో ఉంది. పెద్ద రంధ్రంలో పెట్టి కదిపి తీసింది. మరో రంధ్రంలో దోపింది. అది చిన్న రంధ్రం. అందులో స్క్రూ దూరలేదు. పలుసార్లు ప్రయత్నించింది. ఎక్కలేదు. తలమీద ఫట్ ఫట్‌మని కొట్టుకుంది. చిరాగ్గా తల చుట్టూ తిప్పింది. విసిరి పడేసింది. తోక నేల మీద కదులుతోంది. 

మళ్ళీ వెళ్ళి ఆ స్క్రూను తెచ్చింది. దానికేసి పరిశీలనగా చూసి రంధ్రంలో దోపింది. దూరలేదు. గుర్ర్ర్‌ర్‌మని గీపెట్టింది. విసిరి పడేసింది. పళ్ళికిలించుకుంటూ తలను గట్టిగా తిప్పింది. తల బాదుకుంటూ పైకీ కిందకీ గెంతింది. ఒంటిమీద ఉన్న జుట్టు పీక్కుంది. నేల మీద కాళ్ళతో రాస్తూ గుర్ర్‌మంది. 

విసిగిపోయి కాసేపు కూర్చుండిపోయింది. మళ్ళీ స్క్రూ తెచ్చుకుని పరీక్షించింది. పాత సామాన్లనుండి మరో ఇనప చట్రాన్ని లాక్కుంది. అందులోని రంధ్రం సరైనదని హరికృష్ణ కనుగొన్నాడు. 

కోతి జాగ్రత్తగా ఆ రంధ్రంలో స్క్రూ పెట్టింది. చేత్తో తిప్పింది. ఆ మర లోపలికి వెళ్తుండటం చూడగానే రొమ్ముమీదు ఫట్ ఫట్‌మని కొట్టుకుంది. ‘హెయ్క్! హెయ్క్! హెయ్క్!’ అని శబ్దం చేసి గంతులేసి కూర్చుంది. అప్పడు కోతి చేసిన పనిని చూసి హరికృష్ణకి ఆశ్చర్యం కలిగి మరింత ముందుకు వంగి చూశాడు. 

ఒక పలచటి ఇనప ముక్కని తీసి స్క్రూ మధ్యలోనున్న గీతలో అదిమి పెట్టి బిగించింది. స్క్రూ డ్రైవర్ ఉపయోగించడమే కాదు, అది ఎలా పని చేస్తుందో కూడా తెలుసుకున్నట్టుంది. హరికృష్ణ ఆశ్చర్యంతో వణుకుతూ చూస్తున్నాడు. 

స్క్రూ బాగా బిగించాక కోతి దాన్ని వేళ్ళతో తాకి చూసింది. నోటితో కొరికీ చూసింది. మళ్ళీ రొమ్ము మీద ఫట్ ఫట్‌మని కొట్టుకుంటూ ‘హెయ్క్! హెయ్క్! హెయ్క్!’ అని ఆనందతాండవం చేసింది. చేతులతో నేల మీద కొడుతూ గెంతింది. అప్పుడు అతన్ని చూసింది. 

ఒంటి చేతిన నేల మీద ఊనుకుంటూ పరుగుపరుగున దగ్గరకు వచ్చి దాన్ని అతనికేసి చాచి కళ్ళు గీటుతూ పెదవులు తిప్పింది. హరికృష్ణ ఇనప చట్రాన్ని తీసుకుని చూశాడు. స్క్రూ గట్టిగానే బిగించి ఉంది. 

హరికృష్ణ కోతి తలను నిమురుతూ “నువ్వు ఇక్కడే ఉండి పోరా…” అని ఆగి “నేలమీద అన్ని రకాల బాధలూ ఉంటాయని మాత్రం గుర్తుపెట్టుకో. నీకు అక్కడ ఆకాశంలో కొమ్మలమీద దుఃఖాలేమీ లేవు గాని, ఇక్కడ ఉండే సంతోషం కూడా అక్కడ లేదు.” 

కోతి చేయి చాచి ఇనప చట్రాన్ని తీసుకుంది. చేతికి ఇవ్వగానే దాన్ని పట్టుకుని గిరగిరమని వాకిట్లో నాలుగుసార్లు చక్కర్లు కొట్టింది. నేరేడు చెట్టెక్కి కిందకు దూకింది. ‘హెయ్క్! హెయ్క్! హెయ్క్!’ అని కేకలు పెడుతూ మట్టి నేలమీద గిరగిరా తిరిగింది, పరుగెట్టింది. దాని తోక విచ్చుకుంది. కుశాలగా గంతులేస్తున్న కోతి ఆటలను హరికృష్ణ చిరునవ్వుతో చూస్తూ ఉండిపోయాడు. 

(మూలం: సావి, 29 జూన్ 2020 )


జయమోహన్

రచయిత జయమోహన్ గురించి: జయమోహన్ 1962 ఏప్రిల్ 22న కేరళ-తమిళనాడు సరిహద్దు ప్రాంతంలో కన్యాకుమారి జిల్లాలో జన్మించారు. ఆయన తల్లితండ్రులు మలయాళీలు. ఇరవై రెండో ఏట వామపక్ష, సామ్యవాద సాహిత్యం మీద ఆసక్తి కలిగింది. ఆ రోజుల్లోనే రాసిన ఖైది అనే కవిత; నది‌, బోధి, పడుగై వంటి కథలు ఆయనకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. అప్పుడు రాసిన రబ్బర్‌ అనే నవల అకిలన్‌ స్మారక పురస్కారం అందుకుంది. ఈయన రచనలన్నీ మానసిక లోతులను వివిధ కోణాల్లో అద్దం పట్టేవిగా ఉంటాయి. 2015లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ పురస్కారాన్ని తన సిద్ధాంతానికి విరుద్ధమంటూ తిరస్కరించారు. ...