(భ)m + గ + (స)n = (భ)m+n + గ

పరిచయము

ఒకటి నుండి 26 అక్షరముల వఱకు 184217726 వృత్తములు సాధ్యము. అందులో కొన్ని వృత్తములకు ఒకే గణము పదేపదే వచ్చునట్లు అమరికలు ఉంటాయి. వాటిని తగిన తాళములలో చక్కగా పాడుకొనుటకు కూడ వీలగును. అన్ని మ-గణములతో విద్యున్మాల, య-గణములతో భుజంగప్రయాతము, ర-గణములతో స్రగ్విణి, స-గణములతో దుర్మిల, తగణములతో పద్మనాభ, జ-గణములతో మౌక్తికదామ, భ-గణములతో మానిని, నగణములతో చంద్రమాల వంటి వృత్తములు ఉన్నాయి. అట్టివే లగములతో పంచచామరము, గలములతో సుగంధి వృత్తములు కూడ. ఇవి గాక త-గణ దండకములు, ర-గణ దండకములు, లయ వృత్తములు కూడ ఉన్నాయి. వీటిని గుఱించి తెలిసికోవాలనే అభిలాష ఫలితమే ఈవ్యాసము.

ఒక ఉదాహరణము


చిత్రము 1.

ఈ అమరికను ఒక ఉదాహరణముగా తీసికొందాము: UIIUIIUIIU. దీనిని ఈ విధములుగా వ్రాయ వీలగును, అవి: U-IIU-IIU-IIU, UII-U-IIU-IIU, UII-UII-U-IIU, UII-UII-UII-U లేక గ-స-స-స, భ-గ-స-స, భ-భ-గ-స, భ-భ-భ-గ. ఇది (భ)m-గ-(స)n. అనగా m విధములుగా ఒక గణము, పిదప ఒక గురువు, దాని పిదప n విధములుగా ఇంకొక గణము. అప్పుడు మనకు (భ)m-గ-(స)n అమరిక లభిస్తుంది. ఒకటి నుండి నాలుగు అక్షరములవఱకు ఉండే గణములకు ఇట్టి అమరికలను మొదటి రెండు పట్టికలలో చూపబడినవి. మొదటి పట్టికలో ఒకటి, రెండు, మూడు అక్షరముల గణములు, రెండవ పట్టికలో నాలుగు అక్షరముల గణములు ఇవ్వబడినవి. మధ్యన ఉండే ఏకాక్షర గణము లఘువైనా కావచ్చును లేక గురువైనా కావచ్చును. అంతే కాక UIIUIIU వంటి అమరికకు గురులఘువులను తారుమారు చేయగా వచ్చిన IUUIUUI అమరిక కూడ ఉన్నది. నాలుగు అక్షరముల గణముల పట్టికలో IIII, IIIU, IIUI, IIUU వంటి దేశి ఛందస్సు గణములు కూడ ఉన్నాయి. m, n, (m+n) వీటి కనిష్ఠ సంఖ్య 0, గరిష్ఠ సంఖ్య 8. ఎందుకంటే ఒక సమవృత్తములో 26 కన్న ఎక్కువ అక్షరాలు ఉండవు. అప్రధానమైన ఏకాక్షర గురు లఘువులను తొలగించినప్పుడు మనకు 28 విధములైన అమరికలతో అన్ని విధములైన కూడికలను సాధించ వీలగును. వీటిని మూడవ పట్టికలో చూడవచ్చును. మూడవ పట్టికలోని వృత్తముల వివరములు నాలుగవ పట్టికలో ఇవ్వబడినవి. భగవంత వృత్తమును నేను కల్పించినాను. మిగిలినవి గ్రంథములలో నున్నవి. మొదటి చిత్రములో గురులఘువుల అమరికలు, m, n ల విలువలను గమనించవచ్చును. ఇందులో లేత ఊదారంగులో (భ)m + గ, పసుపుపచ్చ రంగులో (స)n ఉన్నవి.

కుట్టుడు గర్భకవిత్వము


పట్టిక-1.

మూడవ పట్టికలోని ఒక ఉదాహరణమును తీసికొందాము. అశ్వగతి వృత్తమునకు ప్రతి పాదములో 16 అక్షరములు. ఈవృత్తమును నాలుగు విధములుగా సాధించ వచ్చును. అవి: (1) లలిత + తోటకము [UIIU + IIU IIU IIU IIU, m=1, n=4], (2) భోగవతీ + సౌమ్యా [UII UIIU + IIU IIU IIU, m=2, n=3], (3) దోధక + నలినీ [UII UII UIIU + IIU IIU, m=3, n=2], (4) అంగరుచి + సరసీ [UII UII UII UIIU + IIU, m=4, n=1]. అశ్వగతి వృత్తమును ఈ నాలుగు విధములైన వృత్తముల చేర్పులతో సాధించ వీలగును. అనగా రెండు భిన్నమైన వృత్తములకు, వీటిని చేర్చగా జనించిన వృత్తములకు యతిప్రాసలు సరిపోవాలి, పద్యములు అర్థవంతముగానుండాలి. అట్టి 28 అమరికలను క్రింద ఇచ్చియున్నాను. సాంఆన్యముగా ఒక పద్యములో మఱియొక పద్యపు లక్షణములను ఉంచి గర్భకవిత్వమును సాధిస్తారు. ఇక్కడ రెండు వృత్తములను కుట్టి మూడవ వృత్తములో గర్భితము చేయబడినవి. ప్రతి అమరికలోని మొదటి పద్యము m విలువకు, రెండవ పద్యము n విలువకు, మూడవ పద్యము (m+n) విలువకు సరిపోతుంది. క్రింద ఈ 28 అమరికలకు సరిపోయిన పద్యములను చదవండి.

  1. లలిత + సరసీ = భోగవతీ

    లలిత.


    పట్టిక-2.

    పూవులతో
    భావితమై
    జీవములో
    దైవికమౌ… (1.1)

    సరసీ.
    నిను నేఁ
    గను నా
    దినమే
    దినమో… (1.2)

    లలిత + సరసీ = భోగవతీ.
    పూవులతో నిను నే
    భావితమై కను నా
    జీవములో దినమే
    దైవికమౌ దినమో… (1.3)

  2. లలిత + నలినీ = దోధక.

    లలిత.


    పట్టిక-3.

    ఆమనిలో
    నీమదిలో
    ప్రేమముతో
    కోమలి రా… (2.1)

    నలినీ.
    లలితాంగి చెలీ
    నళినీ వదనా
    లలి పెంచు సదా
    యళికుంతల రా… (2.2)

    లలిత + నళినీ = దోధక.
    ఆమనిలో లలి-తాంగి చెలీ
    నీమదిలో నళి-నీ వదనా
    ప్రేమముతో లలి – పెంచు సదా
    కోమలి రా యళి-కుంతల రా… (2.3)

  3. భోగవతీ +సరసీ = దోధక.

    భోగవతీ.


    పట్టిక-4.

    తామసమా వరదా
    కామనిభా యనఘా
    ప్రేమగ నీతలఁపే
    యీమది నీయదియే… (3.1)

    సరసీ.
    త్వరగా
    దరి రా
    సరసా
    చిరమై… (3.2)

    భోగవతీ +సరసీ = దోధక.
    తామసమా వర-దా త్వరగా
    కామనిభా యన-ఘా దరి రా
    ప్రేమగ నీతలఁ-పే సరసా
    యీమది నీయది-యే చిరమై…(3.3)

  4. లలిత + సౌమ్యా = అంగరుచి.

    లలిత.
    నాచెలియా
    ఏఁచితినే
    చూచెదవా
    మాచిరమై… (4.1)

    సౌమ్యా.
    నిను నమ్మితి – నేస్తముగా
    వినవేలకొ – ప్రేమముతో
    నను సుందరి – నవ్వులతో
    మనమారఁగ – మాధురితో… (4.2)

    లలిత + సౌమ్యా = అంగరుచి.
    నాచెలియా నిను – నమ్మితి నేస్తముగా
    నేఁచితినే విన-వేలకొ ప్రేమముతో
    చూచెదవా నను – సుందరి నవ్వులతో
    మాచిరమై మన-మారఁగ మాధురితో… (4.3)

  5. భోగవతీ + నలినీ = అంగరుచి.

    భోగవతీ.
    కానఁగనైతినిగా
    వానిని మేదినిపై
    తేనియ నీవలదే
    యీనగవెందులకే… (5.1)

    నలినీ.
    మదిలోఁ దలఁపే
    హృదిలో వెతలే
    యిదియే వలపో
    యిదియే విధియో… (5.2)

    భోగవతీ + నలినీ = అంగరుచి.
    కానఁగనైతిని-గా మదిలోఁ దలఁపే
    వానిని మేదిని-పై హృదిలో వెతలే
    తేనియ నీవల-దే యిదియే వలపో
    యీనగవెందుల-కే యిదియే విధియో… (5.3)

  6. దోధక + సరసీ = అంగరుచి.

    దోధక.
    జీవన గీతిక – చిత్రముగా
    భావన లన్నియు – భవ్యముగా
    రా వనసుందరి – రమ్యముగా
    పావనమౌనిది – బంధముగా… (6.1)

    సరసీ.
    పదమై
    ముదమై
    సుధగా
    మెదలున్… (6.2)

    దోధక + సరసీ = అంగరుచి.
    జీవన గీతిక – చిత్రముగా పదమై
    భావన లన్నియు – భవ్యముగా ముదమై
    రా వనసుందరి – రమ్యముగా సుధగా
    పావనమౌనిది – బంధముగా మెదలున్… (6.3)

  7. లలిత + తోటక = అశ్వగతి.

    లలిత.
    ఓసకియా
    రాసములో
    నీసమమా
    భాసిల రా… (7.1)

    తోటకము.
    పయనమ్మిఁక యూహల – పల్లకిలో
    నయనమ్ముల రాజిలు – నర్తనలో
    నియతమ్మగు నెమ్మిక – నీమములో
    భయమెందుకు భావుక – స్వస్తికమే… (7.2)

    లలిత + తోటక = అశ్వగతి.
    ఓసకియా పయనమ్మిఁక – యూహల పల్లకిలో
    రాసములో నయనమ్ముల – రాజిలు నర్తనలో
    నీసమమా నియతమ్మగు – నెమ్మిక నీమములో
    భాసిల రా భయమెందుకు – భావుక స్వస్తికమే… (7.3)

  8. భోగవతీ + సౌమ్యా = అశ్వగతి.

    భోగవతీ.
    భోగవతీ కనుమా
    రాగవతీ కనుమా
    యోగవతీ కనుమా
    వేగవతీ కనుమా… (8.1)

    సౌమ్యా.
    నిను బువ్వుల – నింపెదనే
    నిను రవ్వల – నింపెదనే
    నిను హొన్నున – నింపెదనే
    నిను వెన్నెల – నింపెదనే… (8.2)

    భోగవతీ + సౌమ్యా = అశ్వగతి.
    భోగవతీ కనుమా నిను – బువ్వుల నింపెదనే
    రాగవతీ కనుమా నిను – రవ్వల నింపెదనే
    యోగవతీ కనుమా నిను – హొన్నున నింపెదనే
    వేగవతీ కనుమా నిను – వెన్నెల నింపెదనే… (8.3)

  9. దోధక + నలినీ = అశ్వగతి.

    దోధక.
    కానని వీణకు – గానముగా
    మానసమందున – మాధవమా
    ప్రాణము నీవని – పాడెదరా
    మేనిది నీకగు – మేలనమే… (9.1)

    నలినీ.
    మధుసంద్రములో
    మధురోహలతో
    సుధ చిందునురా
    ముదమొందుమురా… (9.2)

    దోధక + నలినీ = అశ్వగతి.
    కానని వీణకు గానము-గా మధుసంద్రములో
    మానసమందున మాధవ-మా మధురోహలతోఁ
    బ్రాణము నీవని పాడెద-రా సుధ చిందునురా
    మేనిది నీకగు మేలన-మే ముదమొందుమురా… (9.3)

  10. అంగరుచి + సరసీ = అశ్వగతి.

    అంగరుచి.
    ఏమని పాడెద – నేమని యెవ్విధమై
    నామదిఁ జేతువు – నవ్వుచు నర్తనలన్
    ప్రేమకు నీవొక – పెన్నిధి పేదకుగా
    రామ రఘూత్తమ – రాజిత రాగసుధా… (10.1)

    సరసీ.
    భువిపై
    నవమై
    రవమై
    స్రవమై… (10.2)

    అంగరుచి + సరసీ = అశ్వగతి.
    ఏమని పాడెద నేమని – యెవ్విధమై భువిపై
    నామదిఁ జేతువు నవ్వుచు – నర్తనలన్ నవమై
    ప్రేమకు నీవొక పెన్నిధి – పేదకుగా రవమై
    రామ రఘూత్తమ రాజిత – రాగసుధా స్రవమై… (10.3)

  11. లలిత + శ్రీ = భగవంత.

    లలిత.
    నామదిలో
    నీమముగా
    ప్రేమగ నీ
    నామమెగా… (11.1)

    శ్రీ.
    నిరతమ్మగు నాట్యము – నీయదియే గదరా
    సరసమ్మగు నెయ్యము – సాధ్యముగా నగునా
    దరి నుండఁగ వేదన – తగ్గునుగా నిజమై
    విరబూయఁగ నామది – వెల్తురుతో నెపుడున్… (11.2)

    లలిత + శ్రీ = భగవంత.
    నామదిలో నిరతమ్మగు – నాట్యము నీయదియే గదరా
    నీమముగా సరసమ్మగు – నెయ్యము సాధ్యముగా నగునా
    ప్రేమగ నీ దరి నుండఁగ – వేదన తగ్గునుగా నిజమై
    నామమెగా విరబూయఁగ – నామది వెల్తురుతో నెపుడున్… (11.3)

  12. భోగవతీ + తోటకము = భగవంత.

    భోగవతీ.
    ఆకుల కంబళమే
    వ్యాకులమయ్యెనుగా
    చీఁకటి నిండెనుగా
    నాకిఁక జాగరమే… (12.1)

    తోటకము.
    ఇది యామని కాదు మ-హీస్థలిపై
    మది నంతయు శోకపు – మంటలెగా
    పది చింతలతోఁ బలు – వంతలుగా
    కదనమ్మగు నీహృది – కత్తులతో… (12.2)

    భోగవతీ + తోటకము = భగవంత.
    ఆకుల కంబళమే యిది – యామని కాదు మహీస్థలిపై
    వ్యాకులమయ్యెనుగా మది – నంతయు శోకపు మంటలెగా
    చీఁకటి నిండెనుగా పది – చింతలతోఁ బలు వంతలుగా
    నాకిఁక జాగరమే కద-నమ్మగు నీహృది కత్తులతో… (12.3)

  13. దోధక + సౌమ్యా = భగవంత.

    దోధక.
    మాననమందున – మాధవమా
    యాననమందున – నందమహా
    గానమునందున – గంగయెగా
    నీనగుమోమున – కింపదియే… (13.1)

    సౌమ్యా.
    మదిలోపలి – మాయ గదా
    పది పువ్వుల – వర్ణములై
    కదలించును – గమ్మనతో
    నెద నింపును – హృద్యముగా… (13.2)

    దోధక + సౌమ్యా = భగవంత.
    మాననమందున మాధవ-మా మదిలోపలి మాయ గదా
    యాననమందున నందమ-హా పది పువ్వుల వర్ణములై
    గానమునందున గంగయె-గా కదలించును గమ్మనతో
    నీనగుమోమున కింపది-యే యెద నింపును హృద్యముగా… (13.3)

  14. అంగరుచి + నలినీ = భగవంత.

    అంగరుచి.
    ఆమని వచ్చెనె – యందపు టాశలతో
    భూమికిఁ దెచ్చెను – బువ్వులఁ బుల్కలతో
    ప్రేమకు డెందపు – పెన్నిధి విశ్వములో
    కాముని పండుగ – కన్నెల కానుకయే… (14.1)

    నలినీ.
    తరులన్ సిరులే
    వరమై వనిలో
    చిరమై స్థిరమై
    మురియన్ ముదమే… (14.2)

    అంగరుచి + నలినీ = భగవంత.
    ఆమని వచ్చెనె యందపు – టాశలతో తరులన్ సిరులే
    భూమికిఁ దెచ్చెను బువ్వులఁ – బుల్కలతో వరమై వనిలో
    ప్రేమకు డెందపు పెన్నిధి – విశ్వములో చిరమై స్థిరమై
    కాముని పండుగ కన్నెల – కానుకయే మురియన్ ముదమే… (14.3)

  15. అశ్వగతి + సరసీ = భగవంత.

    అశ్వగతి.
    విశ్వము పుట్టును గిట్టును – వేయి విధమ్ములుగా
    నశ్వరమైనది కానదు – నాశము నిత్యముగా
    శాశ్వతమైనది దైవము – సర్వము స్వప్నములే
    నశ్వగతిన్ నవకల్కియు – నాఁగక వచ్చునొకో… (15.1)

    సరసీ.
    విధిగా
    నదియే
    మదిలో
    తుదిలో… (15.2)

    అశ్వగతి + సరసీ = భగవంత.
    విశ్వము పుట్టును గిట్టును – వేయి విధమ్ములుగా విధిగా
    నశ్వరమైనది కానదు – నాశము నిత్యముగా నదియే
    శాశ్వతమైనది దైవము – సర్వము స్వప్నములే మదిలో
    నశ్వగతిన్ నవకల్కియు – నాఁగక వచ్చునొకో తుదిలో… (15.3)

  16. లలిత + పరిపోశకము = మానిని.

    లలిత.
    కన్ననికై
    వెన్నెలలో
    కన్నులలో
    విన్నపమే… (16.1)

    పరిపోషక.
    మది కాఁచుచు నుండెను గా-మము నిండిన కన్నులతో
    హృది వేగుచునుండెను వే-యి నిరాశల వేదనలో
    వ్యధ కన్బడుచుండెను గా-యముగా వెత కావ్యముగా
    నది ప్రేమకుఁ జిహ్నము ప్రే-యసుఁడా కను వేగముగా … (16.2)

    లలిత + పరిపోశకము = మానిని.
    కన్ననికై మది – కాఁచుచు నుండెను – గామము నిండిన – కన్నులతో
    వెన్నెలలో హృది – వేగుచునుండెను – వేయి నిరాశల – వేదనలో
    కన్నులలో వ్యధ – కన్బడుచుండెను – గాయముగా వెత – కావ్యముగా
    విన్నపమే యది – ప్రేమకుఁ జిహ్నము – ప్రేయసుఁడా కను – వేగముగా… (16.3)

  17. భోగవతీ + శ్రీ = మానిని.

    భోగవతీ.
    తోయజనేత్రునితోఁ
    మాయని మాయ సుమా
    గాయము లారవుగా
    గేయము లాతనికే… (17.1)

    శ్రీ.
    చెలువమ్ముల తుంపర – చిందఁగఁ దోఁచునుగా
    పలు రీతుల మంత్రము – పల్కఁగ మారునొకో
    వలపన్నది కాలిన – వాంఛల కంబళమా
    మలుపెక్కడ క్రీడల – మధ్యను ఖేదములా… (17.2)

    భోగవతీ + శ్రీ = మానిని.
    తోయజనేత్రుని-తోఁ జెలువమ్ముల – తుంపర చిందఁగఁ – దోఁచునుగా
    మాయని మాయ సు-మా పలు రీతుల – మంత్రము పల్కఁగ – మారునొకో
    గాయము లారవు-గా వలపన్నది – కాలిన వాంఛల – కంబళమా
    గేయము లాతని-కే మలుపెక్కడ – క్రీడల మధ్యను – ఖేదములా… (17.3)

  18. దోధకము + తోటకము = మానిని.

    దోధక.
    నీవిట రావని – నేనననే
    భావన నుంతును – భవ్యముగా
    జీవన మాధురి – చిందఁగ రా
    నావధువై చిఱు-నవ్వులతో… (18.1)

    తోటకము.
    నెల నిగ్గులవోలె సు-నిశ్చితమై
    పలు భంగులఁ దల్తును – వైనముగా
    సెల జిల్గుల పారెడు – స్మేరముగా
    నలినాక్షి నవోదయ – నాదముగా… (18.2)

    దోధకము + తోటకము = మానిని.
    నీవిట రావని – నేనననే నెల – నిగ్గులవోలె సు-నిశ్చితమై
    భావన నుంతును – భవ్యముగా పలు – భంగులఁ దల్తును – వైనముగా
    జీవన మాధురి – చిందఁగ రా సెల – జిల్గుల పారెడు – స్మేరముగా
    నావధువై చిఱు-నవ్వులతో నలి-నాక్షి నవోదయ – నాదముగా… (18.3)

  19. అంగరుచి + సౌమ్యా = మానిని.

    అంగరుచి.
    నీవట నుండఁగ – నేనిట వేచితినే
    రావని యెంచితి – రమ్యము రాతిరిరా
    తీవలఁ బూవులు – తృప్తిడ రాగమతీ
    జీవము నీవని – చెప్పెద నిందు రుచిన్… (19.1)

    సౌమ్యా.
    నిను గానఁగ – నెమ్మికతోఁ
    బ్రణయమ్మది – ప్రాణమురా
    దినమయ్యెను – దృశ్యముగా
    చినదానిని – జేకొనరా… (19.2)

    అంగరుచి + సౌమ్యా = మానిని.
    నీవట నుండఁగ – నేనిట వేచితి-నే నిను గానఁగ – నెమ్మికతో
    రావని యెంచితి – రమ్యము రాతిరి-రా ప్రణయమ్మది – ప్రాణమురా
    తీవలఁ బూవులు – తృప్తిడ రాగమ-తీ దినమయ్యెను – దృశ్యముగా
    జీవము నీవని – చెప్పెద నిందు రు-చిన్ జినదానిని – జేకొనరా… (19.3)

  20. అశ్వగతి + నలినీ = మానిని.

    అశ్వగతి.
    నీనగు మోమది నిత్యము – నింపును స్నేహమునే
    గానము నాకొక గమ్యము – గంగగ గంతులతోఁ
    బ్రాణము నీవను భావము – రాజిలె భాసురమై
    త్రాణము నీవను ధైర్యము – తథ్యము దారి యిదే… (20.1)

    నలినీ.
    నవనీతముగా
    జవ కారణమై
    నవ వారిజమై
    భవ తారణమే… (20.2)

    అశ్వగతి + నలినీ = మానిని.
    నీనగు మోమది – నిత్యము నింపును – స్నేహమునే నవ-నీతముగా
    గానము నాకొక – గమ్యము గంగగ – గంతులతో జవ – కారణమై
    ప్రాణము నీవను – భావము రాజిలె – భాసురమై నవ – వారిజమై
    త్రాణము నీవను – ధైర్యము తథ్యము – దారి యిదే భవ – తారణమే… (20.3)

  21. భగవంత + సరసీ = మానిని.

    భగవంత.
    వాసము నీయది భవ్యము – వాంఛలు వంతలు లేవభవా
    వేసము వేయకు ప్రేమపు – వేదన పెంచకు శంసలివే
    రాసములాడఁగ రాతిరి రమ్యము – రంజిలఁగా నిట రా
    హాసము చిందఁగ నందము – లంబర మంటఁగ నద్భుతమై… (21.1)

    సరసీ.
    సిరులే
    విరులే
    దరిరా
    హరి రా… (21.2)

    భగవంత + సరసీ = మానిని.
    వాసము నీయది – భవ్యము వాంఛలు – వంతలు లేవభ-వా సిరులే
    వేసము వేయకు – ప్రేమపు వేదన – పెంచకు శంసలి-వే విరులే
    రాసములాడఁగ – రాతిరి రమ్యము – రంజిలఁగా నిట – రా దరిరా
    హాసము చిందఁగ – నందము లంబర – మంటఁగ నద్భుత-మై హరి రా… (21.3)

  22. లలిత + ప్రతిమా = శివికా.

    లలిత.
    శ్రీమతి రా
    ప్రేమముతో
    నామదిలో
    కామలతా… (22.1)

    ప్రతిమా.
    చెలియా సిరిగా – చిఱునవ్వులతో – చిఱు గాజుల సవ్వడితోఁ
    బిలువం బ్రియమై – విరిగంధముతో – వెలిఁగించఁగ రా లలితో
    నళినాననగా – నవరాగముతో – నటనమ్ములతో నయమై
    కలగాఁ గళతో – గడు మోదముతోఁ – గమనీయ సుధామయమై… (22.2)

    లలిత + ప్రతిమా = శివికా.
    శ్రీమతి రా చెలియా – సిరిగా చిఱునవ్వులతో – చిఱు గాజుల సవ్వడితో
    ప్రేమముతోఁ బిలువం – బ్రియమై విరిగంధముతో – వెలిఁగించఁగ రా లలితో
    నామదిలో నళినా-ననగా నవరాగముతో – నటనమ్ములతో నయమై
    కామలతా కలగాఁ – గళతో గడు మోదముతోఁ – గమనీయ సుధామయమై… (22.3)

  23. భోగవతీ + పరిపోషక = శివికా.

    భోగవతీ.
    రమ్మిట సత్వరమై
    వమ్ముగఁ జేయకుమా
    కమ్మని గీతములే
    సొమ్మది సోయగమే… (23.1)

    పరిపోషకము.
    రమణీమణి రంగులతో – రసమంజరి పూవులతోఁ
    బ్రమదావన మామనిలోఁ – బరిపోషకమై చెలఁగున్
    గమనీయపు లాస్యములే – కలకోకిల నాదములే
    సుమమాలల సౌరభమే – సుమనోహర మారుతమే… (23.2)

    భోగవతీ + పరిపోషక = శివికా.
    రమ్మిట సత్వరమై – రమణీమణి రంగులతో – రసమంజరి పూవులతో
    వమ్ముగఁ జేయకుమా – ప్రమదావన మామనిలోఁ – బరిపోషకమై చెలఁగున్
    గమ్మని గీతములే – కమనీయపు లాస్యములే – కలకోకిల నాదములే
    సొమ్మది సోయగమే – సుమమాలల సౌరభమే – సుమనోహర మారుతమే… (23.3)

  24. దోధకము + శ్రీ = శివికా.

    దోధకము.
    యౌవనమన్నది – హాయనమా
    భావనమందునఁ – బావనమై
    జీవన మెవ్వరొ – సేసిరిగా
    పూవులతో నగు-మోములతో… (24.1)

    శ్రీ.
    నవ బంధనమా హరి-ణమ్ముల లంఘనమా
    కవనమ్ములతోఁ బలు – కమ్మని గీతులతో
    నవమై సుగమై చిఱు – నాటక మాడఁగనో
    నవనీస్థలిపై భువ-నాద్భుతమై కృతమై… (24.2)

    దోధకము + శ్రీ = శివికా.
    యౌవనమన్నది హా-యనమా నవ బంధనమా – హరిణమ్ముల లంఘనమా
    భావనమందునఁ బా-వనమై కవనమ్ములతోఁ – బలు కమ్మని గీతులతో
    జీవన మెవ్వరొ సే-సిరిగా నవమై సుగమై – చిఱు నాటక మాడఁగనో
    పూవులతో నగుమో-ములతో నవనీస్థలిపై – భువనాద్భుతమై కృతమై… (24.3)

  25. అంగరుచి + తోటకము = శివికా.

    అంగరుచి.
    ఈవనమంతటి – నే హృది నింపినదో
    పూవుల చెల్వపు – ప్రోవులు నిండెనుగా
    శ్రీవరలక్ష్మియొ – చేరెను సొంపులతో
    నావనమోహిని – నానను నవ్వినదో… (25.1)

    తోటకము.
    కనఁగా నిది శోభల – కాకరమే
    మనమో ముదమందును – మౌనముగా
    ఘనమై దృశ కింపుగఁ – గన్బడునే
    వినఁగా నవరాగపు – వీణియగా… (25.2)

    అంగరుచి + తోటకము = శివికా.
    ఈవనమంతటి నే – హృది నింపినదో కనఁగా – నిది శోభల కాకరమే
    పూవుల చెల్వపు ప్రో-వులు నిండెనుగా మనమో – ముదమందును మౌనముగా
    శ్రీవరలక్ష్మియొ చే-రెను సొంపులతో ఘనమై – దృశ కింపుగఁ గన్బడునే
    నావనమోహిని నా-నను నవ్వినదో వినఁగా – నవరాగపు వీణియగా… (25.3)

  26. అశ్వగతి + సౌమ్యా = శివికా.

    అశ్వగతి.
    భారము తగ్గదుగా వల-పన్నది వంతలుగా
    దారియు కానదుగా దరి-దాపులు కానవుగా
    వారము వర్షము లీవన-వాసము లయ్యెనుగా
    చేరుట నిన్నెటులో చిఱు – చింతన తోఁచదుగా… (26.1)

    సౌమ్యా.
    బ్రతుకన్నది – వ్యర్థముగా
    దతియైనది – ధైర్యముగా
    వ్యతిరేకము – వాఁడె గదా
    చితి రేగెను – జీవములో… (26.2)

    అశ్వగతి + సౌమ్యా = శివికా.
    భారము తగ్గదుగా – వలపన్నది వంతలుగా – బ్రతుకన్నది వ్యర్థముగా
    దారియు కానదుగా – దరిదాపులు కానవుగా – దతియైనది ధైర్యముగా
    వారము వర్షము లీ-వనవాసము లయ్యెనుగా – వ్యతిరేకము వాఁడె గదా
    చేరుట నిన్నెటులో – చిఱు చింతన తోఁచదుగా – చితి రేగెను జీవములో… (26.3)

  27. భగవంత + నలినీ = శివికా.

    భగవంత.
    తీయని యామినిలోఁ దెల-తెల్లని వెన్నెలలో దివియల్
    వ్రాయని కావ్యములో వర – వాక్ఝరి ధారల సుస్వరముల్
    మాయని మాయలలో మధు-మాసపు మాధురిలో మమతల్
    శ్రేయముఁ జేరఁగ నీ జిఱు – జీవితసంద్రములో సెలగా… (27.1)

    నలినీ.
    దివిలో సొగసే
    నవమై నయమై
    కవితాసుమమై
    నవనిన్ ధ్రువమై… (27.2)

    భగవంత + నలినీ = శివికా.
    తీయని యామినిలోఁ – దెలతెల్లని వెన్నెలలో – దివియల్ దివిలో సొగసే
    వ్రాయని కావ్యములో – వర వాక్ఝరి ధారల సు-స్వరముల్ నవమై నయమై
    మాయని మాయలలో – మధుమాసపు మాధురిలో – మమతల్ కవితాసుమమై
    శ్రేయముఁ జేరఁగ నీ – జిఱుజీవితసంద్రములో – సెలగా నవనిన్ ధ్రువమై… (27.3)

  28. మానిని + సరసీ = శివికా.

    మానిని.
    జీవితమన్నది – చేసిన కర్మపు – చేరికలా చిఱు – చీలికలా
    భావనయేగద – పాపము పుణ్యము – స్వర్గపు దేవత – శాపములున్
    పూవులతీవెలు – ప్రోవుల దండలు – పూజలకో ముద-మొందుటకో
    జీవితనౌకయు – చెచ్చెర సాఁగును – జెప్పక దాఁచిన – శ్రీలకునై… (28.1)

    సరసీ.
    తెరపై
    వెఱపా
    యెఱుఁగన్
    ధరపై… (28.2)

    మానిని + సరసీ = శివికా.
    జీవితమన్నది చే-సిన కర్మపు చేరికలా – చిఱు చీలికలా తెరపై
    భావనయేగద పా-పము పుణ్యము స్వర్గపు దే-వత శాపములున్ వెఱపా
    పూవులతీవెలు ప్రో-వుల దండలు పూజలకో – ముదమొందుటకో యెఱుఁగన్
    జీవితనౌకయు చె-చ్చెర సాఁగును జెప్పక దాఁ-చిన శ్రీలకునై ధరపై… (28.3)

యతి నిర్ణయము

రవీంద్రనాథ టాగూరు వేగుచుక్కను వర్ణిస్తూ ఇలాగంటాడు: దాని సౌందర్యము రాత్రికి చెందినది కాదు, ఉదయానికి అందినది కాదు. అదే విధముగా భ-గణ స-గణముల మధ్య ఉండే గురువు ముందున్న భ-గణమునకు చెందినదా లేక తఱువాత వచ్చే స-గణ మునకు చెందినదా? సమయానుసారము దేనితోనైనా ఆగురువును జతచేయ వీలగును. సామాన్యముగా మానినిలాటి పద్యములకు భ-గణముపైన యతి నుంచుతారు. అట్టి ప్రయోగమే నేను చేసినాను. కాని ఒక విషయమును గుర్తులో ఉంచుకొనవలెను. (భ)m + గ + (స)nలో మధ్య గణమైన గురువు భ-గణమునకు, స-గణమునకు రెండింటికి చెందినదే. కావున అక్షరసామ్య యతి ఆ గురువు దేనితో చేరుతుందో అనే విషయము పైన ఆధారపడి ఉంటుంది. క్రింద మూడు ఉదాహరణములు.

  1. అశ్వగతి వృత్తములో m = 3, n = 2 క్రమములో భ-గణ స్వరూపమును సూచించు విధముగా ఒక ఉదాహరణము:

    UII UII UII – UII UIIU అమరికతో:
    శాశ్వత మన్నది నేలను – స్వర్ణమొ వాహనమో
    శాశ్వత మన్నది నేలను – సౌధమొ సుందరులో
    శాశ్వత మన్నది నేలను – స్వామి కృపాకరమో
    అశ్వగతిన్ మహిషమ్మున – నంతకు నాగమమో

    m = 2, n = 3; మధ్య గురువును మొదటి భాగముతో చేర్చి భ-గణపు, స-గణపు స్వరూపములను రెండింటిని ప్రస్ఫుటము చేయునట్లు వ్రాసినది క్రింది పద్యము:

    UII UIIU – IIU II U IIU అమరికతో:
    మానస మెందులకో – మధురాధిపు నెంచెనుగా
    వేణువు సుస్వరమే – విరహానికి మందు గదా
    వానికి నిచ్చితి నా – ప్రణయమ్మును గానుకగా
    ప్రాణము వాఁడె గదా – పతిపూర్ణత వాఁడె గదా

  2. భగవంత వృత్తములో పూర్తిగా భ-గణ స్వరూపముతో నొకపద్యము, అర్ధ భాగము భ-గణములతో, మిగిలినది స-గణములతో నొకపద్యము క్రింద ఇవ్వబడినవి.

    m = 3, n = 3; UII UII UII – UII UII UIIU అమరికతో:
    నూతనమై యిట వచ్చెను – నూఁగులతో మృదు బైఖరిలో
    ప్రాతది యయ్యెఁ జరిత్రగఁ – బంచిన మోదము ఖేదములన్
    జేతనతో నవ వర్షము – చెచ్చెర తెచ్చునొ శాంతి ధరన్
    జూతము నమ్మికతో నిట – సుందరుఁ డాప్రభు వేమనునో

    m = 3, n = 3; UII UII UIIU- IIU IIU IIU అమరికతో:
    మానస మెప్పుడు నీయదియే – మఱువంగలనా సకియా
    నీనయనమ్ముల కాంతులతో – నినుపంగలవా చెలియా
    ప్రాణము నాయది నీదిగదా – ప్రణయాంబుధి నిర్జరమా
    నేనును నీవిఁక యొక్కటియే – నిర్ణయ మిది యాతనిదే

  3. మానినీ వృత్తములో m = 4, n = 3; మధ్య గురువును చివరి స-గణములతో చేర్చి భ-గణపు నడకను ఎత్తి చూపునట్లు వ్రాసినది. ఇందులో ఒక్క అక్షరసామ్య యతి మాత్రమే పాటించబడినది.

    మానిని మాధవయామిని యియ్యది – మత్తిడు మల్లెల వాసనతోఁ
    గానఁగ నభ్రమునందునఁ దారలు – కన్నుల కింపుగఁ గాంతులతోఁ
    దేనెలు సిందఁగ గానము సేయుము – తీయని సుందర కంఠముతో
    మౌనము వద్దిది యర్ధ నిశీథము – మంగళ గీతము పాడుదమా

    m = 3, n = 4; మధ్య గురువును మొదటి భాగపు భ-గణములతో చేర్చి వ్రాసినది. ఇప్పుడు మొదటి భాగములో భ-గణముల నడక, రెండవ భాగములో స-గణముల నడక ప్రస్ఫుటము.

    తేనెల సోనల నింపితివో – తెలి పల్కులతో దివిజాంగనగా
    మానిని నీవొక పెన్నిధియే – మధుమాసములో మధురోహలుగా
    నీనగుమోమొక దృశ్యముగా – నిశి కాంతుల యా నెల వెన్నెలగా
    రానను జూడఁగ వేగముగా – రమణీమణి నీనవరాగముతో

ముగింపు

మొదటి రెండు పట్టికలలో ఇవ్వబడిన అన్ని విధములైన చేర్పులకు కూడ పైవిధముగా వృత్తములను కల్పించి వ్రాయుటకు వీలగును. కొన్ని తాళవృత్తముల నిర్మాణమునకు గణితశాస్త్ర రీత్యా ఒక సిద్ధాంతమును ఇక్కడ తెలిపినాను. ఇది ఒక క్రొత్త దృక్కోణము. పొడవైన నూతన వృత్తములను రెండు చిన్న వృత్తములతో కుట్టుటకు కూడ ఇది ప్రయోజనకారి.


జెజ్జాల కృష్ణ మోహన రావు

రచయిత జెజ్జాల కృష్ణ మోహన రావు గురించి: జననం నెల్లూరు (1943).మదరాసులో SSLC వరకు.తిరుపతిలో ఉన్నత విద్యాభ్యాసం. IISc,బెంగుళూరులో Crystallography లో Ph.D పట్టా;1980 దాకా మదురై కామరాజ్ విశ్వవిద్యాలయంలో రీడర్‌గా విద్యాబోధన; తర్వాత అమెరికాలో శాస్త్రజ్ఞునిగా దీర్ఘకాలం ప్రవాస జీవితం. ఛందస్సు మీద విస్తారంగా వ్యాసాలు రచించారు.పాటలు పద్యాలు రాశారు. అనువాదాలు చేశారు.వీరి సుభాషితాల సంకలనం: Today’s Beautiful Gem. ఛందశ్శాస్త్రంలో కృషి,పరిశోధనకు గాను విరోధినామ (2009)సంవత్సరపు బ్రౌన్ పురస్కారాన్ని అందుకున్నారు. ...