ఐడియాలజీ

(శ్రీ సిద్ధార్ధ చేసిన ఇంటర్వ్యూ. 23-8-1993 “ఆంధ్ర ప్రభ” దినపత్రికలో ప్రచురితం)

ప్ర : మీ poetical ideology (ఆలోచనా వ్యవస్థ) ఏమిటి?

జ : అసలు ఐడియాలజీ అనేది ఉండకూడదనే నా ఐడియాలజీ. కవిత్వం హృదయ సంబంధి. ఆలోచనా వ్యవస్థ బుద్ధికి సంబంధించినది. కవిత్వాన్ని బుద్ధి (Reason) శాసించలేదు.దాని సామ్రాజ్యమే వేరు.

ప్ర : ఆధునిక కవిత్వాన్ని మీరెలా నిర్వచిస్తారు?

జ : కవికి ననవోన్మేషమైన చేతన(sensibility) అవసరం. అదే అతని కవిత్వానికి Freshness (తాజాదనం) ఇస్తుంది. ఆ కాలానికి fresh గా ఉన్న కవిత్వాన్ని ఆధునిక కవిత్వమనొచ్చు. నిర్వచనం సంగతంటారా? కవిత్వం విషయంలో నిర్వచనం లాంటి బౌద్ధిక ప్రత్యయాలు పనికిరావని చెప్పానుగా!

ప్ర : వచన కవిత్వం ప్రామాణికత మీద వివాదం గురించి ఏమి చెబుతారు? పద్య ప్రక్రియకు ఊపిరి ఉందని భావిస్తున్నారా?

జ : అసలు “వచన కవిత్వం” , “పద్య కవిత్వం” అని విడదియ్యడమే నాకు నచ్చదు. ఇన్ని రకాల కవిత్వాలు లేవు. కవిత్వం ఒక్కటే. ఛందస్సు పాటిస్తున్నారా లేదా అనేది చాలా గౌణ విషయం. క్రితం యాభయేళ్ళ కాలంలో మన తెలుగు కవులు చేసిన తెలివైన పనేమిటంటే ఛందస్సుని పెంటకుప్ప మీద పారెయ్యడం. అప్పటికిగాని తెలుగు కవిత్వం స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకోలేకపోయింది.

ఇంగ్లీషు ఛందస్సుకీ , మన ఛందస్సుకీ చాలా తేడా ఉంది. మన కావ్య ఛందస్సు చాలా ఇరుకు బరువు కఠినమూ. కవిత్వాన్ని తన దారిన స్వేచ్ఛగా నడవనివ్వదు.ఇంగ్లీషు ఛందస్సు అలా కాదు. అందుకే ఇంగ్లీషు కవులు ఇంకా పాత ఛందస్సును విడనాడలేదు.

ఛందశ్చందంగా పద్యాలు రాస్తామని ఎవరైనా సంబరపడుతుంటే వాళ్ళ ఖర్మ! రాయమనండి. వట్టి కాళ్ళతో నడవం, బండలూ బలపాలు కట్టుకుని కుంటు కుంటూ నడుస్తాం అని ఎవరైనా గొప్పగా చెబితే ఏంచేస్తాం?

ప్ర : వర్తమాన కవిత్వంలోని మూలాల గురించి ప్రస్తావించగలరా?

జ : కవిత్వం తల్లివేరు కవి అంతర్లోకమూ, బహిర్లోకమూ కలిసేచోట తన్ని ఉంటుంది. ఇంకా చిన్న చిన్న వేర్లు చాలా చోట్ల వ్యాపించి ఉండొచ్చు. జాతి చరిత్రలోకి అమ్మమ్మ చెప్పిన కథల్లోకీ పురాణ గాథల్లోకీ పూర్వ కావ్యాల్లోకీ, ఇతర భాషా గ్రంధాల్లోకీ ఇలా. భావ కవుల్లో పూర్వ కావ్యాల ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. అభ్యుదయ , విప్లవ కవుల వేర్లు రాజకీయ మరుభూముల్లో పాతుకున్నాయి పాపం. వర్తమాన యువకవుల కవిత్వం ఆరోగ్యవంతంగా నవ నవలాడుతుంది కనక తల్లివేరు గట్టిపడిందని భావించవచ్చు.

ప్ర : మీరు కవిత్వం గడియారపు లోలక ప్రస్తారం గురించి చేసిన వ్యాఖ్యల పట్ల అధిక్షేపణలున్నాయి. బైరాగి, ఆరుద్రనీ, అజంతా, మో, శివారెడ్డిలను ఒకే కొనకు తీసుకు రావడమే తప్పుడు అవగాహన. (“కుండీలో మర్రి చెట్టు” ముందుమాటలో ). దీనిగురించి మళ్ళీ పరిశీలన అవసరమేమో?

జ : తొందరపడకండి. విషయాలు వివరిస్తాను. శ్రీ శ్రీకి రెండు ముఖాలున్నాయి. ప్రపంచ కార్మికులు జరిపే వర్గ సంఘర్షణలో కవిత్వం శతఘ్నిగా ఉపయోగపడాలని ఒకటి. కవిత్వంలో టేక్నిక్ కి సంబంధించిన నూతన ప్రయోగాల యెడల మోజు రెండవది. మొదటిది కమ్యూనిస్టుల, అభ్యుదయ రచయితల ఉద్యమంలోకి అప్పుడప్పుడే ప్రవేశిస్తున్న గౌణ రచయితల్ని ఆకర్షించగా రెండోది ఆరుద్ర,బైరాగి,అజంతా వంటి మంచి కవుల్ని ఆకట్టుకొంది. శ్రీ శ్రీకి ఎంత శబ్ద లౌల్యమో అంత శబ్దాధికారం కూడా ఉంది. మాటలతో ఛందస్సులతో సర్కస్ ఫీట్లు చేయించగలడు. ఇతడు మన ప్రబంధ కవుల్లో ఆఖరి వాడని చెప్పవచ్చు.పదాలతో ఇంద్రజాలం పండించిన ఫ్రెంచు సింబలిస్టు సర్రియలిస్టు కవులు ఇతన్ని సహజంగా ఆకర్షించారు.

ఇక్కడ మరొకటి గమనించాల్సి ఉంది. ఈ శతాబ్దంలోనే ఇంగ్లాండు అమెరికాల్లో వికసించిన ఇమేజిస్టు కవిత్వం గానీ, తన సమకాలంలో ఇంగ్లాండులో ప్రాచుర్యం పొంది, తన రాజకీయ లక్ష్యాలతో ఏకీభవించిన ఆడెన్ (Auden) వంటి కవుల కవిత్వం గానీ ఇతన్ని ఆకర్షించలేదు.

మాటల గారడీలతో మభ్య పెట్టే 19వ శతాబ్దపు సింబలిస్టు పద్ధతి తర్వాతి సర్రియలిస్టు ధోరణి ఇతనికి ఎక్కువ ఆకర్షణీయంగా కనిపించాయి.దీని ఫలితమేమిటంటే తెలుగు కవిత్వం మొన్నటివరకు ఒక శతాబ్దం వెనక నడిచింది.

ఎంతసేపూ లోలోపలకి చూసుకునే భావ కవిత్వపు నిర్వేదాన్నుంచి “మహాప్రస్థాన”పు బహిర్లోకానికి తెలుగు కవిత్వపు లోలకాన్ని మళ్ళించిన శ్రీ శ్రీ ఫ్రెంచి కవుల మోజులో పడి దాన్ని ఆవలి కొనకు తోసాడు. ఇక్కడ పదాలూ ఆలోచనలూ, సిద్ధాంతాలూ తప్ప మరేవీ లేవు. ఆత్మాశ్రయమైన అనుభూతికీ, వస్త్వాశ్రయమైన యధార్థానికీ మధ్య సమతూకం సాధించవలసిన లోలకం, వాస్తవానికి కేవలం ఛాయా మాత్రలైన పదాలవైపు మొగ్గింది.

ఆరుద్ర, బైరాగి, అజంతా, మోహన ప్రసాద్ , శివారెడ్డి తమ తమ మార్గాల్లో ప్రతిభావంతులైన కవులే ఐతే శ్రీ శ్రీ నీడ నుంచి బయటకి రాలేకపోయారు. బైరాగి కవిత్వంలో తీక్ష్ణమైన అస్తిత్వ పరివేదన ఉంది. మోహన ప్రసాద్ “చితి-చింత”లో అనుభూతితో ఆర్ధ్రమైన గొప్ప కవిత్వం రాసాడు. అజంతా కవిత్వంలో ఉజ్వలమైన పదచిత్రాలు అచేతనలోంచి ఉదయిస్తాయి. ఐతే వీళ్ళు అంతర్ , బహిర్లోకాల సంయోజనాస్ఫోటకమైన కవిత్వానుభవం మీద కాక ఒట్టిమాటలతోనే కవిత్వం నిర్మాణం చెయ్యడానికి పూనుకున్నారు. అందుకని వీళ్ళందరినీ మీరన్నట్లు ఒక కొనకు తీసుకురావల్సిన అగత్యం కలిగింది.

ప్ర : ’93 లోని కవితా సంపుటాల గురించి ఏం చెబుతారు?

జ : ’93 లో వచ్చిన కవితా సంపుటాల పేర్లు నాకు జ్ఞాపకం లేవుగానీ ఇప్పుడు రాస్తున్న యువకవుల రాతలు చూస్తే మన అదృష్టంకొద్దీ మళ్ళీ కవితా లోలకం సమతౌల్యానికి తిరిగి వస్తున్నట్లుంది. శిఖామణి, అఫ్సర్ , పతంజలి శాస్త్రి రవూఫ్ , వసీరా, చినవీరభద్రుడు, యాకూబ్ , త్రిపురనేని, కొండేపూడి నిర్మల, రవి శంకర్ , సుధాకర్ , ఆశారాజు, నాసర రెడ్డి, ఖాదర్ , జయప్రభ ఇంకా ఎంతో మంది యువకవులు చక్కటి కవిత్వం రాస్తున్నారు. శ్రీ శ్రీ ప్రస్తరించిన రెండు రకాల నీడలు చెదిరిపోతున్నట్టున్నాయి.

ప్ర : వర్తమాన జీవితంలోని సంఘర్షణని ప్రతిబింబింప చేయని కవిత్వం యువకవుల్ని ఆకర్షించలేకపోతోందనిపిస్తోంది. సంక్షోభభూయిష్టమైన జీవితంలోని కవిత్వాన్ని మీరు నిరసిస్తున్నారా?

జ : రాజకీయవాదులు సంఘర్షణ అనేది తమ తాత సొమ్ము ఇంకెవరికీ అది లేనట్లు మాట్లాడతారు.మీరన్నట్టు జీవితమంతా సంక్షోభభూయిస్టం. ఇది జీవితం ప్రతి పొరలోనూ అడుగడుగునా ఎదురౌతుంది. నాగరికత పెరిగే కొద్దీ ఇది మరింత తీక్షణమౌతుంది.మనిషికి తనెవరనే ప్రశ్న తనను తాను తెలుసుకోవాలని ఆవేదనా తను ప్రతి నిత్యం తీసుకునే నిర్ణయాల గురించి క్షోభా తనతోటి వారితో , ప్రపంచంతో సమన్వయం కోసం పరితాపం. జీవితంలో శాంతి ఎక్కడిది? ఈ పరివ్యాప్తమైన ఘర్షణే, సంక్షోభమే , అశాంతే కవిత్వ గర్భం. దీనిలోంచే కవిత్వం పుడుతుంది. ఇక కవిత్వాన్ని నిరసించడానికి ఆస్కారం ఎక్కడ?

ప్ర : స్త్రీ వాద కవిత్వం మీద మీ అభిప్రాయం ఏమిటి?

జ : తమ ప్రత్యేకమైన స్త్రీ అస్తిత్వపు అనుభవాన్ని కొంతమంది స్త్రీ వాద కవులు బాగా వ్యక్తీకరించారు. ఐతే వీళ్ళూ మనలాగ మనుషులే కదా. వీళ్ళ స్త్రీ అస్తిత్వపు విస్తీర్ణమెంత? స్త్రీవాద దృష్టిని సంకోచపరిచి రాసే కొద్దీ రాసిందే రాస్తున్నారు. అదీ వీళ్ళతో తంటా. కవిత్వం ప్రతిబంధకాల్ని సహించదు. దృష్టి దెబ్బతింటుంది.

ప్ర : దళిత సాహిత్యం లోని కుల దృష్టిని మీరు సమర్ధిస్తారా? దళిత సాహిత్యం దాని అనివార్యతపై మీ అభుప్రాయం?

జ : కులం అనేది ఎయిడ్స్ కంటే భయంకరమైనది. మన అజాగ్రత్త వల్ల ఎయిడ్స్ అంటుకుంటుంది. కులం అలా కాదు. పుట్టుకతోనే సంక్రమించే భయంకర వ్యాధి. కులతత్వాన్ని అధిగమించని వాడు కవెలా అవుతాడో నాకర్ధం కాదు. కవిత్వమనేది కవి సంపూర్ణ అస్తిత్వంలోంచి ఉద్భవిస్తుంది. నేను బ్రాహమనుణ్ణి లేదా దళితుడిని అని జీవితాన్ని కుంచింపజేసుకున్నవాడు కవిత్వమేం రాయగలడు? విశ్వనాథవారి బ్రాహ్మణత్వం ఆయన కవిత్వాన్ని నాలుగు మెట్లు కిందకి దించింది. జాషువా గారి దళితత్వం ఆయన్ని వైతాళికుడు కాకుండా అడ్డుపడింది. వీటన్నిటికీ అతీతంగా ఎదిగి విశాల దృష్టి అలవరుచు కున్నప్పుడే బ్రాహ్మణత్వం గురించి కానీ, దళితత్వం గురించి కానీ మంచి కవిత్వం రాయగలడు.