జారధర్మాసనము
మును తనకూతు దీముగ జూపి రోపట్టు
పరదేశివిటునిచే బణము గినిసి
ననుపు పల్లవుని సన్నకుసన్న రప్పించి
యతని శయ్యకు దాని ననిపి పుచ్చి
కైసేసి తన యింటి దాసి నా విప్రున
కాతిథ్య మొనరింప ననుమతించె
దాని నా ద్విజుడు ప్రాతఃకాలమున జూచి
బెడదవెట్టిన యప్డు బెదరదయ్యె
పిళ్ళ కోపంబుతో నిల్లు వెళ్ళివచ్చి
తలవరుల కీ ప్రసంగ మంతయును జెప్ప
వారు రప్పింప వచ్చె నీ వదరుజరభి
లంజెతల్లియె యిదియు గుల్లాము గాక
అనిన నజ్జరభి భయంబునొంది సభాసదులకు దండప్రణామంబు సేసి యా ద్రవిళు నుద్దేశించి
నీకుం జేసిన బాస యెట్టిదియొ తుండీరద్విజశ్రేష్ట మా
రాకాచంద్రనిభాస్య కాకతి మహారాజేని బుత్తెంచినం
గైకో దెట్టులు నేమి సేయుదును శృంగారంపు లేదోటలో
పైకొంగెత్తి కుచంబులొత్తి పరిరంభంబీదు లే గ్రోవికిన్
మమ్ము నూరక రట్టుసేయుట ధర్మంబు గాదనుచున్న యా ధూర్తజరభిం జూచి యవ్విటలోకంబు ప్రోడనొక్కని నిమిత్తంబున భంగపెట్టు టయుక్తంబని నీవు విటధర్మం బెరిగిన వాడ వానతీయవలయు ననిన గోవిందుండు
కందర్ప శాస్త్రవేదులు
నిందుకు షాణ్మాసచింత యేలా నెరపన్
సందేహింపక గొరిగిం
పం దగు నీ జరభి జుట్టి వట్టి రయమునన్
ముక్కు సోణంబుదాకను చెక్కుటొకటి
బోసినోరుగ బండ్లూడ బొడుచుటొకటి
గూబలంటంగ చెవిదోయి గోయుటొకటి
లంజెతల్లి యొనర్చు కల్లలకు శిక్ష
మాకుం దోచిన ధర్మంబు జెప్పితిమి యథాపరాధంబుగా నీ యధమజాతిని దండింపుడు మరియు నొక్క విన్నపంబు
స్మరదివ్యాగమ కోవిదుల్ మదనశిక్షాతంత్ర విద్యావిదుల్
సురతారంభ మహాధ్వర ప్రవణు లిచ్చోనుండు వేశ్యావరుల్
తిరమై నాకు ననుజ్ఞ యిండిపుడు తార్తీయీకమై యొప్పు న
ప్పురుషార్థంబు నెరుంగబోయెద బునర్భూ భామినీవాటికిన్
అనంతరంబ భాస్వంతుండు వరుణరాజ శుద్ధాంత కాంతా నివాస మాణిక్యదర్పణంబై చరమగిరి కటక కాననంబు మాటునం జాటువడియె గాశ్మీరపరాగచ్ఛటా భాసురంబైన సంధ్యారాగంబు నింగి యింగిలీకంబునం బెట్టి క్రీడోద్ధూత ధూర్జటి జటాజూట వల్లీ మతల్లికా మల్లికా కోరకాకారంబులై తారకంబులు వియత్తలంబున దళతళ వెలింగె విభావరీపురంధ్రీ కర్ణపూర చాంపేయకుసుమ సాదృశ్య సౌభాగ్య సంపత్ససాదన లంపటంబులై భువనప్రదేశంబులు ప్రకాశించె నెరసంజయు మసమసకని చీకట్లునుం గలసి దిక్సౌధ కూట వాటీ నికురుంబంబుల వ్రేలవిడిచిన కురువిందపూసల పేరునుం బోలె పొలుపుమిగిలె నప్పుడు గోవిందశర్మ గోధూళిలగ్నంబున నార్యవాటిక బ్రవేశించి కామమంజరీ చౌర్యరతివిహార సంకేతస్థలంబులైన రథ్యాముఖ శివచత్వర ప్రపా మంటపంబులు విలోకించుచు గులటాఫాలతిలకుం గుంటెనకత్తియలగు కొత్తెమజంగమబోడితలకుం గ్రేగంటిచూపుసన్న దనరాక యెరింగింపుచు నవ్వేళకుం జూడ గూఢ వివిక్తంబునుం బూర్వపరిచితంబునుం బురుషశూన్యంబును వివాహ కాలోచిత వృత్త స్తనభార వివిధవిలాస విప్రవాసకన్యా సనాథంబును విశ్రామస్థలంబును నైన యొక్క తమ్మడిసాని మందిరంబున విడిసి తన రాక దేవయాత్రామిషంబున నప్పూజరివిధవ చేత నెరింగింపం బంచి వీరభద్రేశ్వరస్థానంబు వెనుక బొడ్డసబావియందు గృతసంధ్యావందనుండై నిజాంతర్గతంబున
కంగటికాలు పుచ్చుకొని ఖంగన గాలు కిరీటకూటమున్
లొంగ గొనంగ లేరు రవి నోరు దటాలున దన్నలేరు క
న్నింగల మూని దర్పకుని నేర్పగలేరు లలాటపట్టకో
త్సంగము చేరునే యహహ తక్కటి వేల్పులకై మదంజలుల్
అనుచు శివార్చనంబు దీర్చి సుఖాశీనుండై టిట్టిభునితో యిట్లనియె
వదనాంభోరుహ ఫూత్క్రియాపవన నిర్వాణప్రదీపంబు ….
పొదలిన చీకువాల నడుప్రొద్దున యౌవనగర్వవిక్రియా
మదమున వింజ మాకిడిన మాడ్కి బురంబు జనంబు నిద్దురం
గదిరిన వేళ నాయెడకు గామిని రా నలవాట సేతకై
…………. నిమీలితాక్షియై
దట్టపు నీలిచేల గడితంబుగ గచ్చ బిగించి ద్రిండుగా
గట్టి కటారికోల కరకంజమునం ధరియించి గుబ్బచ
న్కట్టున దోపుటంగి తొడి గ్రక్కున నన్నడురేయి వచ్చి నా
కట్టెదురం జొహారు లను గాంత భటుండయి నవ్వులాటకున్
అనుచుం బెక్కు ప్రకారంబుల నా కాముకుండు పూర్వవృత్తాంతంబు కట్టనుంగు జెలికాడైన కిరాట టిట్టిభసెట్టితో నుబ్బున నుగ్గడింపుచు గామమంజరీ సందర్శనోత్కంఠాతిసంకులంబైన చిత్తంబు మన్మథాయత్తంబై యుండ గొండంతయాశతో ధార్మికధర్మపతి యెప్పుడు వచ్చునోయని యువ్విళ్ళూరుచుం దృణంబు చలించినం జీమచిటుకన్ననుం జెవి వ్రాలంబెట్టి యాలించుచు భామినీ విలోకనోత్సవం బాసన్నంబగుటం జేసి ……….. దీపంబునుం బోలె బరితాపంబు వహించుచుండ నంత జంద్రుండు పురందర హరిద్దరీకుహర గర్భాంతరాళంబున నుండి కంఠీరవంబునుం బోలె మింటికి లంఘించి మయూఖ నఖరంబులం దిమిరకుంభి కుంభంబులు వ్రచ్చి వందరలాడి నభఃక్రోడంబున నుడుగణంబులను ముత్తియంబుల వెదజల్లె నావేళ నిండువెన్నెల గాయ బ్రాణనాయకుండు వచ్చుట గని విని పరమహర్షోత్కర్షంబున
కామమంజరి
కరపద్మంబున బైడిపళ్ళెరమునం గంథాక్షతల్ పచ్చక
ప్పురమున్ వీడెము గొంచు గ్రొత్తమడుగుం బొన్పట్టు నీరంగుతో
మురిపెంబొప్పగ వచ్చె జౌర్యరతసంభోగార్థమై కామమం
జరి గోవిందుని యొద్దకున్ శివనమస్కారచ్ఛలం బొప్పగన్
మోదంబున రాకాచం
ద్రోదయ దేవతయు బోలె నొయ్యన జన శా
తోదరి గోవిందుని శ్రీ
పాదంబుల కెరగె భక్తి భయ లజ్జలతోన్
మచ్చికయుం బ్రమోదమును మన్ననయున్ నయమున్ విలాసమున్
మెచ్చును నేర్పడం దనకు మే యిడి మ్రొక్కిన కామమంజరిన్
గ్రుచ్చియు గౌగిలించె సరిగుబ్బచనుంగవ రెండుక్రేవలన్
బచ్చనివింటిజోదు పయిపై బులకంబులు నారువోయగన్
అనంతరం బాసనాసీనులైన నగ్గోవిందుండు కామమంజరిం జూచి
అరవిందాస్య తలంచి చూడ నిది యత్యాశ్చర్యమో కాని నీ
సరసాలాపము లాదరించి వినగా సంభావనం జూడమిన్
ఖరపాకంబయి కర్ణరంధ్రముల కంగారంబుగా బిట్టు ని
ష్ఠురముల్ పల్కెడు రాజకీరములు గండుంగోయిల ల్వీణియల్
అని జారదంపతులు పూజరివారి యింటిముంగిట వెన్నెల బైటనుండి టిట్టుభునకుం గట్టాడిముత్తియంబునుం బోని తమ్మడిసానిం గూర్పు నేర్పు విచారించి సన్నపుటెలుంగునం బూజరిసానిం బిలిచి కనకనిష్కంబు తోడ గూడ గర్పూరంబు వీడియం బచ్చేడియ చేతిలోనం బెట్టి యాపాదమస్తకంబు వీక్షించి శిరఃకంపంబు సేసి
బంగారుతలుపులు పాయంగ ధట్టించి
లావణ్యవిత్త మేలా వ్రయించె
లావణ్యవిత్తమేలా వ్రయించున గాక
యతిమాత్రమేలా ప్రయాసపడియె
నతిమాత్ర మాయాస మనుభవించును గాక
విటజనంబుల నేల వెడ్డుకొలిపె
విటజనంబుల కారవేరంబు సేయగా
నేల నిర్మింపడో యెనయు మగని
సొమ్ముపోక మహాప్రయాసమ్ము రాక
ప్రజలబాధ నిరర్థకారంభణంబు
లెలమి సిద్ధింప నేమిగా దలచె నొక్కొ
సరసిజాసనుడీ తలోదరి సృజించి
దొరసెమునందు జుట్టుకొని తోరణకట్టె నురోవిభాగమున్
నిరుడు పయోజకోశ రమణీయత దాల్చెను వర్తమాన వ
త్సరమున నొప్పె హేమకలశంబుల బాగున ముందటేటికిం
గరినిభయాన చన్నుగవ కౌగిలిపట్టులు గాకయుండునే
సన్నచూపుల బూజరిసాని బిలిచి
పసిడిటంకంబు పరిరంభ పణము సేసి
టిట్టిభునితోడ నేడు కూడింపు కూతు
నేకశయ్య సహాయసుశ్రీకి మించ
కన్నెరికముడుప వేరే
సొన్నాటంకములు రెండు చుట్టంబులలో
గన్ను మొరంగెడు నేర్పును
విన్నాణము మాకు గలదు వెరపేమిటికిన్
అని నుతింపంజెప్పి బొమలమీద వెండ్రుకలు వ్రాల పూజరిసాని బిడ్డను వెడ్డువెట్టి టిట్టిభుని చేతికిచ్చి యచ్చవెన్నెలలం బొరపొచ్చెంబులేని మచ్చికల చంద్రమండలంబు మీద దృష్టి నిలిపి టిట్టిభుండు విన నిట్లనియె
కలశపాథోరాశి గారాపునందన
కల్యాణములు మాకు గలుగజేయు
కుసుమకోదండుని కూరిమిమామ సౌ
ఖ్యాభ్యుదయంబు మా కాచరింపు
రాకావిభావరీ రమణీమనోహర
సంతోషములు మాకు సవదరింపు
శౌరిపట్టపుదేవి కూరిమిసయిదోడ
యైశ్వర్యములు మాకు నాచరింపు
మనుచు గొజ్జంగినీరను నర్య్ఘమిచ్చి
పచ్చికప్పుర మందంద బడిసివైచి
మ్రొక్కి రనురాగసంపద మూరిబోవ
జారజాయాపతులు నిండుజందురునకు
నటులది దోరసముద్రము
విటులది యోర్గల్లు కవిది వినుకొండ మహా
పుటభేదన మీ త్రితయము
నిట గూర్చెను బ్రహ్మ రసికులెల్లను మెచ్చన్
ముదమున ముల్కినాటిపుర మోహనశైల సువర్ణకందరా
సదనుడు కాలభైరవుడు శంభునిపట్టి సమగ్రవైభవా
భ్యుదయ పరంపరా విభవముల్ గృపసేయు గవీంద్రకాంక్షిత
త్రిదశ మహీరుహంబునకు దిప్పయవల్లభరాయమంత్రికిన్
అని యందరును యథాసుఖంబుగ నిజస్థానంబుల కరిగి సుఖించుచుండిరి
గద్య
ఇది శ్రీమన్మహామంత్రిశేఖర వినుకొండ తిప్పయామాత్యనందన చందమాంబాగర్భ పుణ్యోదయ సుకవిజన విధేయ వల్లభరాయ ప్రణీతంబైన క్రీడాభిరామం బను వీథినాటకంబున సర్వంబు నేకాశ్వాసము
సంపూర్ణము