సన్మాన లాటరీ

పోయిన ఏడాది నాకు మూడు ఆఫర్లు వచ్చాయ్‌! ఎంతో కష్టం మీద గానీ ఒక్కొక్కళ్ళనీ వదిలించుకోలేక పోయాను. ఈ సంవత్సరంలో అప్పుడే అది రెండోది. ఎంత ప్రయత్నించినా వదిలాడు కాదాయన!

‘మీకు సన్మానం చెయ్యాలని మా కార్యవర్గం నిర్ణయించింది,’ అన్నాడు పోయినేడు ఫస్టు పిల్చినాయన. పేరు స్వామిదేవ సరస్వతిట.‘నాకా? సన్మానమా! చాల్లెండి, ఎవరన్నా వింటే నవ్విపోతారు. మా పక్కింటాయనకి తెల్సిందో చెవులకి తాటాకులొక్కటే తక్కువ..’

‘అబ్బే! మీకా బెంగేం అక్కర్లేదండి. ఆయనకి పోయిన వారవే సన్మానం చేయించేసాం…’

‘ఆయనకా? సన్మానమా! ఎందుకు చేయించారు?’

‘చేయించాలని మా కార్యవర్గం నిర్ణయించిందండి!’

‘అసలు మీరెవరు?’

‘నన్ను సరస్వతి స్వామిదేవ అంటారు. ఉభయ నగరాల రాజధానిలో నా పేరు తెలీని వాళ్ళుండరు. ఎటేటా జరిగే సారాయి పాటల్లాగే ప్రభుత్వం వారీమధ్య సన్మానవేలాలు కూడా నడిపిస్తున్నారు. ఆ వేలంలో మరో నలుగురితో పాటు నేనూ పాటపాడి కొన్ని సన్మానాలు చేసే హక్కు కొనుక్కుంటానండి. విదేశాల్లో ఉంటూ గొప్ప వ్యక్తిత్వమూ, మంచిపేరూ, స్థితిగతులూ, ఉదాత్తస్వభావమూ, సాంస్కృతిక స్పృహ, సాంప్రదాయాభిమానమూ, ఆవేదనా ` అలాంటి వాంఛనీయమైన లక్షణాలున్న వాళ్ళందరికీ మా సంస్థ ఘనంగా సన్మానాలు చేయిస్తుందండి. ఈ సారి లాటరీలో తమపేరు తగిలింది. మా బోర్డు మెంబర్లు మీకు సన్మానం చెయ్యాలని అందుకే ఆత్రపడుతున్నారండి..!’

‘సన్మానం చేయించుకునేందుకు నేనేవీ ఘనకార్యాలు చెయ్యలేదు, స్వామిదేవగారూ..! ఇంతకీ మీ సంస్థ పేరేవిటన్నారు?’

‘ఏ సంస్థండీ…’

‘అదే! మీరు సన్మానాలు చేయించే సంస్థ.’

‘నాకు నాలుగైదు సంస్థలున్నాయ్‌ లెండి, అందుకని కొంచెం కన్‌ఫ్యూజయ్యాను. సన్మానాల సంస్థా..? దాన్ని సరస్వతీశ్రీ ఎన్‌.ఆర్‌.ఐ.సన్మాన ఘాట్‌ అంటారండి’

‘మీ కార్యవర్గం గురించి చెప్పండి కాస్త..’

‘నేను సరే, ప్రెశిడెంటు నండి! సెక్రటరీ ఏమో…మరి.. సరస్వతీ స్వామిదేవ సెక్రట్రీ అండి. ఇక ట్రెజరర్‌గా స్వామిదేవ సరస్వతి, ది ట్రెజరర్‌ ఆఫ్‌ ఎస్‌.ఎస్‌.ఎన్‌.ఆర్‌.ఐ.ఎస్‌.జి. అండి. ఆ పైన…’

‘ఆగండాగండి! ప్రెసిడెంటు, సెక్రట్రీ, ట్రెజరరు.. అన్నీ మీరేనా? ఒకే పేరు తిరగేసి మరగేసి చెప్తున్నారు’

‘అబ్బే..అబ్బే..అంత సింపుల్‌గా తేల్చాల్సిన మాట కాదండి. నేనున్నానంటే, ఒక పని చేసేటప్పుడు ఇంకో పనిగురించి ఆలోచించనండి. ఒక్కో పనికి ఒక్కో వ్యక్తిత్వం, ఒక్కో పర్సనాలిటీ..కావాలండి. ఇప్పుడు మీతో ప్రెశిడెంటుగా మాట్లాడుతున్నానా.. ఈ విషయం సెక్రట్రీగ్గాని, ట్రెజరర్‌కి గాని తెలియవండి. మీరు సన్మానానికి అంగీకరించగానే సెక్రట్రీతోనూ, ఆ తర్వాత ట్రెజరర్‌తోనూ, ఇతర విషయాలన్నీ మాట్లాడిస్తానండి…క్లియర్‌ డివిజన్‌ ఆఫ్‌ లేబర్‌ లేకుండా పన్లు జరగవ్‌ కదండి.. కమింగ్‌ టూద పాయింట్‌, మీ అంగీకారం అయితే..ఇక..’

‘సన్మానానికి ఎలా ఒప్పుకోనండి…నేనేవీ సన్మానయోగ్యమైన పన్లు చెయ్యలేదన్నాను గదా..’

‘అబ్బే, ఎంత మాట, మా కంప్యూటర్‌ ఎప్పుడూ తప్పు చెయ్యదండి! అలా అనకండి మరోసారి! మీ పక్కింటాయన అలా అన్నారా? సన్మానం అనగానే టక్కున..ఎంత? అన్నారు. మా ట్రెజరరు ఏదో అంకె చెప్పాడు. ఆయనేవో..ఎక్కువయ్యా, ఫలానా సంస్థవాళ్ళు ఇంతకే చేయిస్తావన్నారు అని దానికంటే కొంచెం బుల్లితేడాతో మరో అంకె చెప్పారు. తవర్తో బేరాలాడేంత చవకమనిషిని కాదులెండి, మీ ఆనందం కొద్దీ ఇంతకి తక్కువకాకండా మీరెంతంటే అంతేనండి అన్నాడు మా ట్రెజరరు మరో అంకె విసిరి. బేరం కుదిరి పోయిందండి. పెద్దమనిషి వప్పందం అయిపోయింది. దాంతో మా సెక్రట్రీ రంగంలోకి దూకాడు. మీ కెలాంటి సన్మానం కావాలన్నాడండి.’

‘ఎలాంటి సన్మానాలుంటాయ్‌ అనడిగారండాయన.’

‘దాందేముందండి. బేసిక్‌ ప్యాకేజీతో మెదలు పెడతావండి. ఆ వెనక ప్లాటినం ప్లస్సు, అపోలో పాకేజీ, ఇండస్‌ పాకేజు అంటా యిలా పదారు పదేడు రకాలున్నాయండి. మీరు ఒప్పందం చేసుకున్న లెక్కని బట్టి, బేసిక్‌ ప్యాకేజీయో ఏదో తేల్చేస్తానండి. అది మీ హోదాకి తక్కువా అనిపిస్తే దానికేవుందండి మళ్ళా మా ట్రెజరర్‌తో మాట్లాడచ్చండి. ఆయన్తో బేరం ప్యూర్‌ బిజినెస్‌ ప్లెజరండి. మీరు చూశారుగా. మాటంటే మాటేనండి..యకాయకిని పాయింటుకొచ్చేస్తాడ్లెండి..’

‘ఆ పాయింట్లో మళ్ళీ మనం కలగజేసుకుని, పాకేజీల గురించి చెప్పావండి. ఒక దాంట్లో కవిత్వం, ఒకదాంట్లో నృత్యం, ఒకదాంట్లో నటన, ఒకదాంట్లో వైద్యం, ఒకదాంట్లో శాస్త్రవిజ్ఞానం, ఒకదాంటో ఇక సంఘసేవ, ఒకదాంటో సాంస్కృతికం, ఒక దాంటో వైణికం, ఇక సాంకేతిక మార్పిడి…ఇలా ఒక్కో అంశంలో ప్రావీణ్యత ఇమిడ్చావని చెప్పావండి…’

‘ఇందులో తమకేదంటే అదే ఏర్పాటు చేయించచ్చండి!! కాంబినేషన్‌ కావాలంటేకూడా మా ప్రెశిడెంటుగార్తో మాట్టాడి ఇబ్బంది లేకండా చెయ్యచ్చండి అన్నాడండి సెక్రట్రీ… వాటాలు పుచ్చుకుంటున్నప్పుడు మరి ఎవడిరోలు వాడు ప్లే చెయ్యాలికదండి.’

‘మరి వాటిల్లో మనకేది బాగుంటుందన్నారండాయన.’

‘దాందేవుందండి? ఏదయినా మనకి ఒకటేనండి. తమరికి దేనిమీద మనసుపోతే దాన్ని సూచించండి. అలాగ ఏర్పాటు చేయించేద్దాం. అన్నాడండి సెక్రట్రీ వినయంగా’.

‘లాటరీలో మన పేరు ఎందులో వచ్చిందనడి గారండాయన.’

‘క్‌,స్‌,గ్‌,ర్‌ అనే నాలుగక్షరాల కిందా మనపేరు తగిలిందండి’

‘అవేంటండన్నారండీ వారు’

‘క్‌ అంటే కవిత్వం, కనికట్టు అనీ, స్‌ అంటే సాహిత్యం, సాంస్కృతికం, సామాజికం, సాంప్రదాయం వగైరా అనీ, గ్‌ అంటే గారడీ, గానం, గీర్వాణం మొదలుగానూ, ర్‌ అనగనే రంగస్థలం, రాజకీయం అంటూనూ ఇలా ఉన్నాయండి. వీటన్నిట్లోనూ తమపేరు పలికిందండి. ఇక అవసరాన్ని బట్టి కొత్త కొత్త అంశాలు చేర్చడం మా ప్రశిడెంటుగారు చేస్తుంటారండి. తమరి లాటరీ బట్టి చూస్తే తమరు బహురంగాల్లో ఉన్నట్టు తోస్తూందండి..అన్నాడండి సెక్రెట్రీ…’

‘ఆయన చాలా సంబరపడి, బాగుంది, బాగుందంటూ వాటిల్లో మనకేది నప్పుతుందిస్మా..అంటుంటే..’

‘దాందేముందండి? ఏదైతేనేంటండి సన్మానం ముఖ్యంగానీ…? తమ మనసు ఎటు మొగ్గితే అదే కానిద్దావన్నాడండి సెక్రెట్రీ. గాలి కొట్టడంలో మా సెక్రెట్రీని చెప్పింతర్వాతనే మరొహళ్ళని చెప్పాలండి’

‘కవిత్వం ఎలా వుండునండి? నేను చిన్నప్పుడోమాటు కవిత్వం అల్లిన గుర్తేనండి, అన్నారాయన ఓ క్షణం ఆగి.’

‘ఇంకేవండి, తవరాస్రిన…’

‘అబ్బే, ఇప్పుడవన్నీ..రాసే టైం..’

‘అలాగంటే, మందగ్గర పెద్దపులుల్లాంటి కుర్రకవులు పదిహేనుమంది దాకా ఉన్నారండి. సంపాదన చాలక ఆకలితో ఉన్నారు. మనం సై అనాలే గాని రంకెలేస్తూ తీవ్రమైన కవిత్వం రాసిపారేస్తారండి. అలా వద్దంటే కడుపు నిండిన బాపతు వాళ్ళూ ఉన్నారండి. భావ కవిత్వం, బావ కవిత్వం, వదినా మరదళ్ళ సరదా కవిత్వం, భామ కవిత్వం, సర్రియలిస్టు కావ్యాలు, సూపర్‌ క్వాలిటీ ఫెర్టిలైజర్‌లాంటి ఆశ కవిత్వం..దళిత కవిత్వం, ముస్లిమ్‌ కవిత్వం..ఏం కావాలంటే అలా రాసిస్తారు. కొంచెం ఖర్చు ఎక్కువౌతుందండి. అలా కాదంటే నవలో, కథలసంపుటో రాసి పారేసే వాళ్ళూ ఉన్నారండి…కానీ నవల కంటే కవిత్వవే బరువుగా ఉంటుందని నా హంబుల్‌ ఒపినియనండి..’

‘కొంత పులికవిత్వమూ, కొంత మేక కవిత్వం, కొంత గోవు కవిత్వం, కొంత మేరువులాంటి గంభీరకవిత్వం మేళవించామంటే ఎలా వుంఛుందంటారన్నారాయన’

‘దాందేముందండి? మెటమార్ఫసిసు, గ్రోతు, ట్రాన్స్ఫార్మేషను, మెచ్చూరిటీ చూపిచ్చినట్టుంటుందండి. అలాంటి పుస్తకం ఒకటి తమరు వ్రాసినట్టు రాయించెద్దావండి. చక్కగా బొమ్మలు వేసేవాళ్ళు, తవరు తొమ్మిదోయేట చెప్పిన కవిత్వంలోని భయసంభ్రమాశ్చర్యాలు, విచ్చుకుంటున్న పరిశీలన, పసిమనసులోని అమాయకత్వంతో మొదలు పెట్టి, వయసులో చెప్పిన కవిత్వంలోని ఉద్రేకం, ఆశయం, ఆవేశం మధ్య వయసులో కొచ్చేసరికి ఎలా చల్లగా మెల్లగా సమతలాన పారే నదిలా ఉడుకు, ఉరుకు తగ్గి పరిపక్వస్థాయి కొచ్చిందీ అనే మెటమార్ఫసిసు చర్చిస్తూ గంభీరమైన వ్యాఖ్యానం ఒకరి చేతా, కొంచెం ఘాటైన విమర్శ మరొకరి చేతా రాయించి వేస్తామండి…’

‘విమర్శా? అదెందుకులెండి..?’

‘ఉండాలండి. తమరి ఔన్నత్యం, సమతుల్యం తెలియాలంటేనూ, క్రెడిబిలిటీ నిలబెట్టాలంటేనూ కొంత విమర్శ చిరునవ్వుతో, ఉదారంగా అంగీకరిస్తారన్నమాట నలుగురికీ తెలియాలండి, అన్నాడండి సెక్రెట్రీ.’

‘సరేలెండి…అనాయన అయిష్టంగానే ఒప్పుకున్నారండి.’

‘మరలాగ కవిత్వం పాకేజి గురించి ఒప్పందం అయ్‌పోయిందండి. బేసిక్‌ పాకేజీ తాలూకు ద్రవ్యం లక్ష పైచిలుకూ, పోనీ చెప్పుకోడానికీ బావుంటుంది మూడువేల డాలర్లనుకోండి, కవిత్వం తాలూకు మరో 1500 డాలర్లు, పైన ఖర్చులూ, మామూళ్ళూ అవీ 500 చిలుకూ, మొత్తం 5000డాలర్లకి ఒప్పందం చేసుకున్నాక సగం ధరావతు ముట్టడంతో ఏర్పాట్లు చెకచెకా మొదలయిపోయాయండి.’

‘ఆ చెక్కు మనకి సరస్వతీ వయోజనవిద్యా సహాయ సారణి పేర్న అందించారండి. దాంతో వారికి స్వచ్ఛందసేవా శిరోమణి, సహృదయదయనీయ స్వభావప్రవీణ అనే అదనపు బిరుదులు కూడా ఇవ్వాలని నిర్ణయించిందండి మా బోర్డు.’

‘పనిలో పని మా శ్రీమతికి కూడా..అన్నారండి.’

‘దాందేముందండి. వాటిముందు శ్రీమతి అని రాసి యిద్దామండి..అయితే మా ట్రెజరరు కొంచెం ఎక్స్ట్రా అంటాడేమోనండి..’

‘కానివ్వండి, అన్నారండి ఆయన మరో వెయ్యికి ఒప్పుకుంటూనూ.’

‘మనకి ఉభయనగరాల్లోనూ, సభాధ్యక్షత వహించేందుకు, ప్రధాన ఉపన్యాసకులుగా ఉండేందుకు, పంచరత్నాలు అల్లి చదివేందుకు, మాజీ ఆచార్య పదవులవారు, మాజీ మంత్రులు, సాంప్రదాయ కవులు, సభనలంకరించేందు ప్రేక్షక మహాజనులు ఇలా అందరూ ఏర్పాటులోనే ఉంటారండి. ఏ నెలకానెల ఎన్‌.ఆరై.సన్మానఘాట్‌ షెడ్యూలు వారికి వెళ్ళిపోతుందండి. వారు ఉపన్యాసాలూ, కరపత్రాలూ,పంచరత్నాలూ అన్నీ తయారుచేసుకుని ఉంఛుకుంటారండి..’

‘మాజీ మంత్రులేవిటయ్యా పదవిలో ఉన్నవాళ్ళెవరూ దొరకలేదా అంటుంటారండి కొందరు ఎన్‌.ఆరైలు. ఆ మధ్య కొన్నాళ్ళపాటు గవర్నమెంట్లకి ఆయుర్దాయం పడిపోయింది కదండి. దాంతో మాజీల నెంబర్లున్నంతగా, కరంట్లుండుండేవాళ్ళుకాదండి. అయినా సంపాదించే వాళ్ళవండి. అయితే ఎక్స్ట్రా ఖర్చులు పెట్టుకోవాల్సొస్తుందండి. ఈ మధ్య మళ్ళీ పరవాలేదండి. గవర్నమెంట్లు రెండేళ్ళునిలబడ్డం, పునరంకిత సమారాధనలు చేయించుకోడం జరుగుతోందండి. ఎప్పుడైనా కరంటు కరంటేనండి. ఖర్చు ఖర్చేనండి. హోమైతే ఓ రేటు, రెవెన్యూశాఖ ఓ రేటు. ..ఇలాగ రేట్లుంటాయండి. ఏ విద్యాశాఖవారో, దేవాదాయాల ధర్మాదాయల అమాత్యులో ఐతే కాస్త చవకండి..’

‘ఇక మన మాస్టారు ఇండియాకి ప్లేను టిక్కట్లు అవీ కొనుక్కొనే వీలుగా ఉంటుందని, పిల్లల శలవులూ అవీ కలిసొస్తాయని మొన్న వేసంగుల్లో సన్మానం ఏర్పాటు చెయ్యమన్నారండి. మన కవులూ, విమర్శకులూ అందర్నీ వెంటనే పనుల్లోకి రప్పించేశానండి. పాతిక కవితలు చకచకా రాయించి, రసధార అనే సంకలనం వేయించి, పుస్తకంతో బాటు రాసినవాళ్ళచేత చదివించిన టేపొకటి జతచేసి వారికి పంపి బాగా చదవడం అవీ ప్రాక్టీసు చేసుకు రమ్మన్నామండి. ఆయనకి వెతుక్కోవలసిన అవసరం లేకుండా ఉపన్యాసంకూడా ఒకటి రాయించి, కృతజ్ఞతలూ అవీ తెలియజేయడం అన్నీ రిహార్సలు చేసుకునే వీలు కల్పించాం.

‘సరస్వతీసాహితీ కేంద్రం తరఫున రసధార సంకలనానికి సమగ్రవాద సాహితీ పురస్కారం ప్రకటించారండి. న్యూస్‌పేపర్లన్నిట్లోనూ మనకి తెలిసినవాళ్ళ చేత వ్యాఖ్యలు రాయించామండి. సారు ఉభయనగరాలు చేరే సమయానికి రసధారని నవకవిత్వ నక్షత్రంగానూ, పురోగామి కవిత్వవిభావరిగానూ, సాంప్రదాయకవిత్వ ప్రయోగంగానూ, సర్వజన సంక్షేమవాద పాంచజన్యంగానూ ఉల్లేఖించబడ్డ రకరకాల రివ్యూలన్నీ కలిపి మళ్ళీ సన్మానగ్రంథంగా తీసుకొచ్చి ఆ రోజున సభలో అందరి చేతుల్లోనూ అలంకరింపజేసామండి.’

‘మాజీ ఆస్థానకవిగారు, బహుభాషా వ్యవస్థలకు సారధ్యం వహించి విరమించినవారూ అయిన విశ్వదాత భాస్కరపంతులుగారి అధ్యక్షతన సన్మాన సభ ఆరంభమైంది. పంతులుగారు స్వదేశంలో భాషాభిమానం కరువౌతున్న గడ్డుకాలంలో ప్రవాసతెలుగుల్లో ప్రజ్వరిల్లుతున్న భాషాభినివేశానికి, కవితాప్రకర్షకి హర్షం ప్రకటిస్తో, రసధారలోని కవితలని కొన్నింటిని పేర్కొంటూ వాటిలోని సాంప్రదాయకతకు ముచ్చటపడుతూ, ఆంధ్రసరస్వతికి వాటిని సరికొత్త కితకితలుగా అభివర్ణిస్తూ, కావ్యకర్తని ప్రశంసించి, మాలాలంకృతులను చేసి, దుశ్శాలువ కప్పి, కరతాళధ్వనులను ప్రేరేపించి, అమెరికా తెనుగు మెరిక అనీ, రసహృదయవీచిక అనీ కొనియాడి మురిశారండి.’

‘ఆ తర్వాత సన్మానితులు రసధారలోంచి కొన్ని కవితలు చదివి ఏఏ సందర్భాలలో ఏఏ స్పందనలవల్ల, ఏయే కైతలను అక్షరబంధం చేసిందీ వివరించారు. వారికై మేం తయారింపించిన ఉపన్యాసాన్ని ఇంచుమించు కరక్టుగానే చదువుతూ…’

‘ఆ పిదప మరో ఇద్దరు ముగ్గురు కవులు తమతమ అభినందనలు ప్రకటించి, మీ పరిచయస్థులు, పొరుగువారు, సాటి ప్రవాసులు అయిన వారికి వ్రవాస కవి దుర్లభ అనే బిరుదు ప్రదానం చేయించడంతో ఆనాటి సభ మంగళప్రదంగా ముగిసింది…ఆ తర్వాత పానీయాలు, ఆహార విందు జరిగిందండి..అందరూ నిద్రాదేవి మందిరానికి నిష్క్రమించారండి…’ అంటూ వివరించాడు సరస్వతీ స్వామిదేవ.

‘ఊపిరి తీస్కోడానికి ఓ క్షణం ఆగి, మరి ఇంతకీ తమరేవంటారు?’ అన్నాడు.

‘దేని మాటండి?’అన్నాను పరధ్యానంగా

‘అదే తవరికి ప్రవాస ‘చలనచిత్రనటశేఖర’ అనే బిరుదు ఇచ్చి సన్మానించే విషయం గురించండి.

‘అబ్బే నేనేవీ చలనచిత్రాలు తియ్యలేదు, వాటిలో వెయ్యలేదు. నో..నో..నోనోనో..,’అంటున్నా కాని నా గొంతు కొంచెం బలహీనమైందా అని నాకే అనిపించింది.

‘పోనీ మీ అబ్బాయికి గణితప్రకాండ అనో, మీ శ్రీమతికి సంగీత గంగ అనో, మీ అమ్మాయికి…..అనో’ ఏదో అంటూనే ఉన్నాడాయన.

‘అబ్బే వాళ్ళనెందుకులెండి ఇందులోకి లాగడం?’ అని బలవంతంగా ఫోను పెట్టేసాను.

ఆ తర్వాత మరో యిద్దరు ఫోన్లు చేసి మళ్ళీ మళ్ళీ మా పేర్లు సన్మాన లాటరీలో వచ్చాయని మరీ మరీ బలవంతం చేస్తే నేను చరిత్రదుందుభి అనీ మా ఆవిడ సంగీతకోకిల అనీ మా అమ్మాయి నాట్యతటిల్లత అనీ మా కుర్రాడు ఉత్తమ పుత్ర అనీ బిరుదులు తీసుకోక తప్పలేదు.

అయితే నాకు మొదట ఫోన్‌చేసి సన్మానం సంగతి నా బుర్రలో ప్రవేశపెట్టిన సరస్వతీ స్వామిదేవగారూ, చివరికి సన్మానానికి వప్పించిన వారూ ఒకరేనా కాదా అన్న సంగతి మాత్రం నేనిప్పటికీ తేల్చుకోలేకపోతున్నాను. చేసినాయన మాత్రం తాను ససేమిరా సరస్వతీ స్వామిదేవను కాదని వక్కాణిస్తున్నాడు.

***

ఆ విషయం ఎలా ఉన్నా, సన్మానం చేయించుకొచ్చాక రోజులు గడుస్తున్న కొద్దీ, మనంకూడా ఎవరికీ తక్కువకాదులే అని మాత్రం అనిపిస్తోంది. చెప్పద్దూ! ఆ సందర్భంలో తీసిన విడియోలూ, టి.వి.లో ఇంటర్వ్యూ తాలూకు విడియోలూ ఇంటికొచ్చిన వాళ్ళను కూర్చోబెట్టి చూపిస్తున్నప్పుడు మాత్రం ఇంతకాలానికి మనం ఇంత దారుణంగా కష్టపడి
ఈ విదేశాలమ్మట సంపాదించిన డబ్బుకు ఈ పాటి ప్రయోజనం ఉండద్దా అనిపిస్తోంది కూడాను.. *