ప్రయాణం

చీకటిని చీల్చుకుంటూ దూసుకుపోతోంది గరుడ బస్సు. చాలాకాలం తర్వాత ఒంటరి ప్రయాణం. ఆయనకి ఆఫీసులో ఆడిట్‌ జరుగుతోందని రానన్నారు. నిజంగా ఆడిట్‌ జరుగుతోందో లేకపోతే వంకో ఆయనకే తెలియాలి. ఒంటరిగా నువ్వు మాత్రం ఎందుకు? నువ్వు కూడా వెళ్ళొద్దు అన్నారు. ఎప్పుడూ వెళ్ళే హైదరాబాదేగా. సిద్దూ బస్సు దగ్గరకి వస్తానన్నాడు లెండి. వెళ్ళగలను అంటూ తనే బయలుదేరింది. ఏసీ బస్సు చలి అనిపించింది. బ్యాగ్‌లోంచి షాల్‌ తీసుకుని కప్పుకున్నాను.

అయినా ఈ కారణంతో ఇప్పటికి కనీసం పదిసార్లు వెళ్ళి ఉంటుంది హైదరాబాద్‌. సిద్ధు పెళ్ళయి ఇప్పటికి సరిగ్గా మూడేళ్ళు. మూడేళ్ళలో కనీసం పదిసార్లు డైవోర్స్‌ వరకూ వచ్చారు. ఎప్పటికప్పుడు సిద్ధూనో, శృతో ఫోన్‌ చేసి ఇంక నావల్ల కాదు. డైవోర్స్‌ తీసుకుందామనుకుంటున్నాం అనడం, అప్పటికప్పుడు చస్తూ బతుకుతూ పరిగెత్తుకు రావడం. ఎడమొగం పెడమొగంగా ఉన్న ఇద్దరినీ బుజ్జగించి లాలించి నచ్చచెప్పి సరిచేసి ఓదారిలో పెట్టి వెనక్కు రావడం. వచ్చినన్ని రోజులు పట్టదు మళ్ళీ ఫోన్‌.

అట్లా అని అవేమన్నా భయంకరమైన ఘర్షణలా అంటే కాదు. ఏదన్నా బలీయమైన కారణముందా అంటే లేదు. చిన్న చిన్న అడ్జెస్ట్‌మెంట్‌ ప్రాబ్లమ్స్‌.

వాళ్ళంతట వాళ్ళే కదా ఇష్టపడి చేసుకుంటామన్నారు. ఇద్దరికిద్దరూ చక్కటి పిల్లలు. మంచి పిల్లలు. విడిగా ఎవరికీ ఎవరి మీదా ఎలాంటి కంప్లయింట్సూ లేవు. కానీ కలిసి బతకడంలోనే ఏదో తెలీని ఫ్రిక్షన్‌. వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. తమనీ ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళు మొదటిసారి విడాకులన్నప్పుడు తను వణికిపోయింది. చిగురుటాకులా అల్లాడిపోయింది. అప్పటి కప్పుడు టాక్సీ చేయించుకుని ఉరుకులు పరుగుల మీద ఇంటికి వెళ్ళి కారు దిగేసరికి ఇద్దరూ నవ్వుతూ కబుర్లు చెప్పుకుంటూ కాఫీ తాగుతున్నారు. ప్రయాణపు అలసట అంతా ఎగిరి పోయినట్టు అనిపించింది. రెండు రోజులుండి ఇద్దరికీ జాగ్రత్తలు చెప్పి వెనక్కు వచ్చారు. రెండు నెలల కల్లా మళ్ళీ ఫోను.

ఉద్యోగం ఒకే కంపెనీలో. కలిసి వెళ్ళి కలిసి వస్తుంటారు. ఇద్దరికీ కలిపి జీతం లక్షల పైమాటే. ఇంక బాధ ఏంటి? హాయిగా ఆడుతూ పాడుతూ సరదాగా గడిపెయ్యక? తమకి సిద్దూ ఒక్కడే. శ్రుతి కూడా అంతే. వాళ్ళ అమ్మానాన్నలకి ఒక్కటే కూతురు. ఇద్దరూ ఇంట్లో తమ మాటే నెగ్గించుకుంటూ అపురూపంగా పెరిగి వచ్చినవాళ్ళు. బహుశా అదే ఇద్దరికీ సమస్య అవుతుందేమో.

అక్కాచెల్లెళ్ళు, అన్నాదమ్ముల మధ్య పెరిగితే సర్దుబాట్లు, ఇచ్చిపుచ్చుకోడాలు తెలుస్తుంది. తన మాటే వేదంగా పెరిగిన వాళ్ళు అంత త్వరగా ఇతరులతో ఎలా అడ్జెస్ట్‌ అవుతారు?

శ్రుతి మంచిపిల్ల. తనని అత్తయ్యగారూ అనకుండా ఆంటీ అన్నప్పుడే తనకు శ్రుతి దగ్గరైపోయింది. తన దగ్గర ఉన్న నాలుగు రోజులూ వెంట వెంటే తిరుగుతూ సిద్ధూకి ఇష్టమైన వేంటో అడిగి తెలుసుకుంది. కొన్ని వంటలు నేర్చుకుని తనే చేసింది. సిద్ధూ కూడా మాటిమాటికీ శృతీ, శృతీ అంటూ పిలిచిన వాడు పిలిచినట్టే ఉంటాడు. ఏదన్నా తేడా వచ్చిందంటే చాలు అంత ప్రేమా ఏమై పోతుందో ఇద్దరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు ఒకటే కంప్లయింట్లు. భయంకరమైన శత్రువుల్లా తెగబడి పోట్లాడుకుంటారు. ఇద్దరిలో ఎవరూ వెనక్కు తగ్గరు.

‘నువ్వన్నా ఊరుకోమ్మా శృతీ,’ అంటే, ‘ఎంతైనా మీ అబ్బాయి కదా. అందుకే వెనకేసుకుని వస్తున్నారు. నా తప్పు లేకుండా నన్నంటే ఎందుకు ఊరుకోవాలి? ఆడపిల్ల అయి నందుకా,’ అని శ్రుతి అలక.

అసలు ఈ గొడవలన్నీ ఎందుకు వస్తున్నాయ్‌రా అంటే, ‘‘ఏవో జాబ్‌ టెన్షన్స్‌ అమ్మా. ఆఫీసు నుంచీ రకరకాల చికాకులతో ఇంటికి వస్తాం. మధ్యలో ట్రాఫిక్‌ న్యూసెన్స్‌ ఒకటీ. పని వత్తిడి ఎక్కువైనపుడు విసుగనిపిస్తుంది. తను ఏదన్నా విసిగిస్తే అరుస్తాను. తను అర్థం చేసుకుని ఊరుకుంటే కాసేపటికి నేనే చల్లబడతాను. ఆఫీసులో అంటే ఎవర్నీ ఏమనలేం. శ్రుతికి ఏమయింది? ఏదో చికాకులో ఉన్నాడులే అని అర్థం చేసుకోవచ్చుగా. తనూ ఎదురుతిరిగి మాటకి మాట అంటుంది. అప్పటికీ తనకి మంచిగా ఉన్నప్పుడు చెబుతాను. చికాకులో ఉన్నప్పుడు ఏదన్నా అన్నా పట్టించుకోకుండా ఊరుకోమని. ఊహు! తనూ రెచ్చిపోతుంది. ఇదిగో ఇప్పుడు చూస్తున్నావుగా,’’ అంటాడు.

‘‘అదే ఉద్యోగం తనతో పాటు సమానంగా నేను కూడా చేస్తున్నా కదా ఆంటీ. తనకేనా చికాకులు? నాకుండవా? జాబ్‌ టెన్షన్‌ నాకు ఉండదా? నేనూ చికాకుగానే ఇంటికి వస్తాను. తను విసుక్కుంటే నాకూ కోపం వస్తుంది. నేనేమన్నా మల్లెపూవులాగా చెక్కుచెదరకుండా ఇంట్లో కూర్చుని కాలక్షేపం చేస్తున్నానా? పైగా ఎన్ని మాటలు ఎలాంటి మాటలు అంటాడని? సమాధానం చెప్పకపోతే వాటన్నింటినీ ఒప్పుకున్నట్లేగా. అందుకే చూసి చూసి చివరికి ఉండబట్టలేక నేనూ అరవడం మొదలెడతాను,’’ అంటుంది శ్రుతి.

ఇద్దరిదీ కరెక్ట్‌. తప్పు ఇద్దరిదీ కాదు. పరిస్థితులది. ప్రశాంతంగా వుండనివ్వని వత్తిడిది.

ఒకసారి అసలు గొడవ ఎందుకు మొదలయింది అని అడిగితే కాసేపు ఆలోచించి కానీ ఇద్దరూ చెప్పలేకపోయారు. సిద్ధూ తడి టవల్‌ సోఫా మీద వేస్తే శ్రుతి విసుక్కుందిట. దానితో గొడవ మొదలు. అలా మొదలైన గొడవ చివరకు డైవోర్స్‌ వరకూ వచ్చేసింది. వాళ్ళ జీవితాల్లో ఎంత వత్తిడి, ఎంత ఫ్రస్టేషన్‌ లేకపోతే అలా జరుగుతుంది?

ఇద్దరూ బి.టెక్‌. ఇద్దరూ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ చేశారు. మేనేజ్‌మెంట్‌ స్కిల్స్‌ గురించి అనర్గళంగా గంటల తరబడి చెబుతారు. బిజినెస్‌ ఎలా మేనేజ్‌ చేసుకోవాలో సలహాలిస్తారు. కానీ జీవితాన్ని ఎలా చక్కదిద్దుకోవాలో వాళ్ళకి తెలీదు. లైఫ్‌ మేనేజిమెంట్‌ స్కిల్స్‌ తెలీవు. పెద్దపెద్ద కంపెనీల సమస్యల్ని చిటికెలో పరిష్కరిస్తారు. తమ సమస్యల్ని పరిష్కరించుకోవడం ఎలాగో తెలీదు.

మొదట రెండు మూడుసార్లు వాళ్ళు విడాకులన్నప్పుడు ఆయన కూడా కంగారుపడ్డారు. బిక్కమొహం వేసుకుని తనతో పాటు హైదరాబాదు పరిగెత్తుకుని వచ్చారు. తర్వాత తర్వాత వాళ్ళ ఫోన్‌ వస్తే ఆయన విసుక్కోవడం మొదలుపెట్టారు. చిన్న చిన్న సమస్యలకి తల్లకిందులైపోతారు. అసలు వాళ్ళ పోట్లాటలకి ఒక అర్థం పర్థం ఏదన్నా ఉందా? పెళ్ళి అంటే చిన్నపిల్లల ఆట అనుకుంటున్నారా? అయినా సిఫార్సులతో కాపురాలు చక్కబడతాయా నీ పిచ్చి కాకపోతే? ఈసారి నువ్వు వెళితే వెళ్ళు. నేను మాత్రం రాను. నన్ను రమ్మనమని మాత్రం అడక్కు అని విసుక్కోవడం మొదలుపెట్టారు.

కానీ నిజానికి వాళ్ళు ఒకళ్ళదేనా తప్పు? పిల్లలకి చదవడం నేర్పుతున్నాం కానీ, బతకడం నేర్పలేకపోతున్నాం. వాళ్ళు పుస్తకాలతో, యంత్రాలతో బాగానే ఉంటున్నారు. మనుషులతోనే బాగా ఉండలేకపోతున్నారు. నైన్టీపర్సెంటా, నైన్టీఫైవ్‌ పర్సెంటా? ఎమ్‌సెట్టా, ఐఐటీనా? ఎలక్ట్రికలా? ఎలక్ట్రానిక్సా? విప్రోనా? టీసీఎస్సా? దేనికన్నా ఏది నయం అని ఆలోచిస్తున్నాం. పుస్తకాలు, చదువు, ఉద్యోగం తప్ప మనుషులు వాళ్ళ సిలబస్‌లో లేకుండా చేస్తున్నాం.

బ్రాయిలర్‌ కోళ్ళలాగా, చేపల చెరువుల్లో చేపల్లాగా వాళ్ళని ఒక ప్రత్యేక ప్రయోజనం కోసం పెంచుతున్నాం. ఆ ప్రయోజనం సాధించడమే సార్థకత అంటున్నాం. ఇన్నాళ్ళూ పుస్తకాలతో సహ జీవనం చేసిన వాడిని తీసుకువచ్చి మనుషుల వాసన అంటే తెలియని వాడిని తీసుకువచ్చి మనుషులతో బతకమంటే అది వాడికి ఏం తెలుసు?

ఏ చిన్న కష్టం వచ్చినా కదిలిపోయి అమ్మానాన్న మీద విసుక్కోవడమే తెలిసిన వాడికి ఇంకో అమ్మాయితో కలిసి బతకడం ఏం తెలుస్తుంది? ఏ కష్టం కూడా వాడు చదువుతున్న గది గోడల్ని తాకకుండా జాగ్రత్తపడ్డాం. గది నాలుగ్గోడల మధ్యా బతికిన వాడిని ఒక్కసారిగా మనుషుల మధ్యకు తీసుకువస్తే నీళ్ళలోంచి బైటపడిన చేపపిల్లలా గిలగిలలాడిపోడా? బాస్‌ విసుక్కున్నా, కొలీగ్‌తో ఘర్షణ పడినా ఎవరన్నా ఏదన్నా అన్నా దాన్ని ఎదుర్కోవడం ఎట్లా అనేది చదువూ నేర్పక ఇంట్లో తల్లి దండ్రులూ నేర్పకపోతే జీవితంలోని డిజప్పాయింట్‌మెంట్లకి, టెన్షన్‌లకి వాళ్ళకి ఔట్‌లెట్‌ ఏది?

జీవితాన్ని బ్యాలెన్స్‌ చేసుకోలేకపోవడం వాడి తప్పు అంటారాయన. ఎవరికి ఎవరూ అన్నీ నేర్పరు. కొన్ని ఎవళ్ళకి వాళ్ళే నేర్చు కోవాలి. ఇప్పటికి పదిసార్లు అయింది పంచాయితీ. ఇంకెప్పుడు తెలుసుకుంటారు వాళ్ళు అంటారు.

తనకి ఏంటో సిద్ధూ, శ్రుతి ఇద్దరూ ఎల్‌కేజీ, యూకేజీ పిల్లల్లా, ‘టీచర్‌, నా బలపం లాక్కున్నాడు. నన్ను గిచ్చు తున్నాడు,’ అంటూ కంప్లెయింట్‌ చేసే పిల్లల్లానే కనిపిస్తారు. ఏం చేసినా చిన్నతనం అనిపిస్తుంది తప్ప కోపం రాదు. జీవితమే సర్దుబాట్లమయం. భార్యాభర్తలు దేనికి ఎందుకు ఘర్షణ పడతారంటే ఏం చెప్పగలం? ఇదివరకు ఉమ్మడి కుటుంబాలుండేవి. ఇంట్లో పెద్దవాళ్ళుండేవారు. ఎవరన్నా దెబ్బలాడుకుంటే కూర్చో బెట్టి నచ్చచెప్పేవారు. అందుకే పోట్లాడుకున్నా దాని సాంద్రత మనసులోకి ఎక్కేది కాదేమో. ఇప్పుడలా కాదు. విపరీతమైన ఆత్మ విశ్వాసం. ఇగో ప్రాబ్లమ్స్‌, ఎవరిమీదా ఆధారపడిలేమన్న ధీమా. పిల్లల్ని వెనక్కు తగ్గనివ్వడంలేదు. అందుకే ఏ చిన్న ఘర్షణ వచ్చినా డైవోర్స్‌! డైవోర్స్‌! అంటున్నారు. డైవోర్స్‌ అంటే ఎంత ఘర్షణ? ఎంత నరకం? వెంటాడే జ్ఞాపకాలు ఎంత ఇబ్బంది పెడతాయో, ఎంత అశాంతిని తెచ్చిపెడతాయో. పిల్లలు వీళ్ళకేం తెలుసు? వీళ్ళకి అంత దూరం ఆలోచించే లోకజ్ఞానం కూడా ఏది? పిచ్చి పంతాలు, పట్టుదలలు తప్ప.

జీవితాన్ని బ్యాలెన్స్‌ చేసుకోలేకపోవడం సిద్ధూ తప్పట. ఎంత తేలిగ్గా అని చేతులు దులుపుకున్నారు ఆయన. నిజానికి ఆ తప్పు వాడి ఒక్కడిదేనా? సిద్ధూ లెక్కల్లో జీనియస్‌. ఎలాంటి ఈక్వేషన్స్‌ అయినా నిమిషాల్లో చేసేసేవాడు. ఇప్పుడు జీవితంలో చిన్న చిన్న ఈక్వేషన్స్‌ దగ్గర తడబడుతున్నాడు. జీవితం పూలబాట కాదని అపుడపుడూ ఎదురుదెబ్బలు తగులుతాయని వాడికి నేర్పకపోవడం తమ తప్పు కాదా?

ఇంటికి బంధువులు వచ్చినా, స్నేహితులు వచ్చినా ‘హాయ్‌’ అనేసి వెళ్ళిపోయి గదిలో కూర్చుని చదువుకునేవాడు. వాడి డ్యూటీ అదే అని అనుకున్నాం. ఆహా! ఎంత బాధ్యతగా చదువుకుంటున్నాడని మురిసిపోయాం. కానీ వాడు విశాలమైన డ్రాయింగ్‌ రూంలోంచి చిన్న ఇరుకుగదిలోకి వెళుతున్నాడని అర్థం చేసుకోలేకపోయాం, ఆ గదిలోంచి తిరిగి వాడు ఇంకా విశాలమైన ప్రపంచంలోకి అడుగుపెట్టాల్సి ఉందని గ్రహించలేక పోవడం తమ తప్పు. పిల్లలు గొప్పవాళ్ళయితే దానికి తల్లిదండ్రుల కృషి కారణమంటారు. మరి పిల్లల వైఫల్యానికి కూడా కారణం తల్లిదండ్రులే అవ్వాలి కదా. ఆ రకంగా సిద్ధూ వైఫల్యంలో తామి ద్దరికీ కూడా భాగం ఉంది.

ఈసారి ఆయన రారని నేను ముందుగా ఊహించిందే. అయితే ఎవరికి తప్పినా తప్పకపోయినా నాకు వాళ్ళ దగ్గరికి వెళ్ళక తప్పదు. తల్లిదండ్రులుగా మేం చేసిన తప్పుకి పరిహారమే ఈ నా ప్రయాణం. ఆ విషయం నేను తెలుసుకున్నాను. ఆయనకే ఇంకా తెలియాల్సి వుంది.

(జి. లక్ష్మి కథలు, కవితలు రాస్తారు. ఇటీవలే ఆల్బర్ట్‌ కామూ నవలకి తెలుగు అనువాదం ‘అపరిచితులు’ ప్రచురించారు. కొంతకాలం పత్రికా రంగంలో పనిచేసి, ప్రస్తుతం కో-ఆపరేటివ్‌ రిజిష్ట్రార్‌గా విజయవాడలో ఉంటున్నారు.)